
స్వర్ణపురి గ్రామస్థులు – 3
– మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’
– హృషికేష్ పాండా
అనువాదం – స్వాతి శ్రీపాద
ధనఫూల గ్రామానికి తిరిగి వచ్చి, రెండు వరి గింజలు ఒక మహువా పువ్వులో ఉంచి కేశవ్ పంపిన సందేశాన్ని చూసింది. అప్పుడు కేశవ్ ఇలా అంటున్నట్టు తను వింటున్నట్టు అనిపించింది.
‘ధనఫూలా! నా కోసం ఎదురు చూడు, నేను వస్తున్నాను! వచ్చే సంవత్సరం, నేను నాన్న, బాబాయిలు పురోహితుడితో కలిసి వస్తాను. నేను ఒక సంచి బియ్యం, రెండు పెద్ద మట్టి కుండల బియ్యపు బీరు తీసుకువస్తాను, నిన్ను వివాహం చేసుకుంటానని అడుగుతాను. నువ్వు బయటకు వెళ్ళినప్పుడల్లా, ఎక్కడికి వెళ్తున్నావు ఎప్పుడు తిరిగి వస్తావో తెలియజేస్తూ ఒక సందేశం వదిలి వెళ్ళు, ఎందుకంటే నీ గ్రామం నేను ఏ రోజైనా రావచ్చు. నేను నీ గ్రామానికి ఎప్పుడు వస్తానో నీకు ఎప్పుడూ తెలుస్తుంది, అయినా ఈసారి ఎందుకు తెలియలేదు? నీ మనసులో ఏమనుకుంటున్నా నేను వినగలను, కానీ నేను నీ వద్దకు ఎప్పుడు వచ్చానో నీకు తెలియదా ?”
కేశవ్ ఊరి పేరు స్వర్ణపురి ( సునాపుర్ ) అంటే బంగారు గ్రామం. 3,000 అడుగుల ఎత్తులో ఉన్న ఆ పీఠభూమి మొత్తంలో మరే గ్రామంలో చదును పొలాలుగాని, సారవంతమైన భూమిగాని లేదు. పంటలు విస్తారం. మండియా, సువాన్, వరి వంటి చిరుధాన్యాలు, ఆవాలు , నల్ల నువ్వులు వంటి నూనె దినుసులు, పనసకాయలు, టేకు పండ్లు, జామూన్ బెర్రీ పళ్ళు పండే గ్రామం మరొకటి లేదు. తేనెపట్టులలో పుష్కలంగా తేనె ఉండేది. మహువా చెట్ల మీద మహువా పువ్వులు, పండ్లు, విత్తనాలు ఉండేవి. ఈత చెట్ల నుండి తీసిన సారాయి తల్లి పాలలా ఉండేది. సెలయేళ్ళలో, వరి పొలాలలో చేపలు ఉండేవి. విందు కోసం అడవులలో వేటకు సమృద్ధిగా జంతువులు ఉండేవి. అందుకే ఆ గ్రామాన్ని స్వర్ణపురి, బంగారు గ్రామం, అని పిలిచేవారు.
ప్రతి గ్రామవాసికీ బ్రతకడానికి సరిపోయేంత ఉండేది. కొంచం ఆస్థిపరులైన రైతులు విశాలమైన భూములను సాగు చేసేవారు. వారు సంవత్సరానికి రెండు పంటలు పండించేవారు, అక్కడ వర్షాకాలంలో నదీ నదాలు ప్రవహించేవి. ఏడాదికి రెండు పంటలు పండించేవారు. శీతాకాలపు పంట మరీ బాగుండేది. కొండ చరియల్లో ప్రతివాళ్ళు అంతో ఇంతో భూమి సాగుచేసే వారు. పంట చేతికి వచ్చాక గ్రామస్థులు పంతలో కొంతభాగం గ్రామ పెద్దకు భూమి పన్నుగా చెల్లించి, బట్టలు మొదలైన ఖర్చుల కోసం వారపు సంతలో కొంత పంట నగదుకు అమ్మేవారు.ఒక్కోసారి శాసన్ పురి సన్యాసిరావు అనే ఒక వడ్డీ వ్యాపారి, వర్తకుడు ఒక కూలీతో (అతని ముఖం డేగలా, శరీరం ముళ్ళతో , ఆకులులేని ఎడారి పొదలా ఉండేది), ఉప్పు, సారాయి తయారీ పరికరాలు, పొగాకు వంటి సరుకులతో గ్రామానికి వచ్చేవాడు. ధాన్యాన్ని కొని, దానికి బదులుగా ఉప్పు, పొగాకు, కొంచం మద్యం, అప్పుడప్పుడు నగదుకి అమ్మేవాడు.
ఎక్కువ వడ్డీకి రుణం ఇచ్చేవాడు.
శిబా జానీ గ్రామ పెద్ద, అంటే నాయక్. అతను గ్రామంలో భూమి పన్ను వసూలు చేసేవాడు. ఈ సేవకు అతనికి ఎలాంటి జీతం ఇవ్వకపోయినా కానీ పన్ను లేని కొంత భూమికి యాజమాన్య హక్కును కల్పించారు. పన్ను మామూలుగా ఆహార ధాన్యంగా సేకరించబడేది, అందులో కొంత భాగాన్ని ఉమ్మడి ధాన్యాగారంలో నిల్వ ఉంచేవారు: తాత్కాలిక లేమిని ఎదుర్కొంటున్న వ్యక్తులకు రుణంగా ఇవ్వడానికి, బాల బాలికల వసతి గృహాల మతపరమైన ఖర్చులను చెల్లించడానికి, అధికారులు ఇతర రాజకీయ ప్రముఖుల పర్యటనల ఏర్పాట్లు చేయడానికి, ప్రతి గ్రామంలోని ‘అటవీ’ ప్రాంతాలలో భూమి సాగు కోసం అటవీ అధికారులు డిమాండ్ చేసిన అక్రమ పన్నును చెల్లించడానికి , అటువంటి ఇతర ఆకస్మిక అవసరాల కోసం దీనిని ఉపయోగించేవారు. ప్రమాదవశాత్తు , కొన్నిసార్లు తీవ్రమైన పరిస్థితుల కారణంగా నేరచర్యలో చిక్కుకున్న ఏ గ్రామస్థుడికైనా అయ్యే న్యాయపరమైన ఖర్చులను కూడా ఉమ్మడి ధాన్యాగారం భరించేది. భూమి పన్నును కూలీల ద్వారా ఆహార ధాన్యాల రూపంలో రాజుగారి రాజభవనానికి తీసుకువెళ్లేవారు లేదా రాజుగారి పోలీస్ స్టేషన్లో జమ చేసేవారు.
శిబా జానీ తండ్రి కూడా గ్రామ పెద్దగా ఉండేవాడు. అతను గ్రామ పెద్ద అయినప్పుడు, రాజు నుండి గ్రామ హక్కుల పత్రాన్ని పొంది, అతనితో ఒక ఒప్పందంపై సంతకం చేశాడు. తన తండ్రిలాగే, శిబా జానీ ప్రతి సంవత్సరం భూమి పన్ను చెల్లించేవాడు. అంతేకాకుండా, ప్రతి దసరాకు అతను గ్రామస్థులు తలలపై, భుజాలపై మోసుకు వెళ్ళే బుట్టలలో నూనె, నెయ్యి, తీపి దుంపలు, నల్ల తాండ్ర, కరక్కాయలు, కస్తూరి, పెంపుడు జంతువులు, మేకలు, కోళ్లు, తేనె, మహువా మొదలైన కానుకలను రాజుకు సమర్పించేవాడు. ప్రతి దసరాకు, తన పేరిట కొత్త హక్కుల పత్రాన్ని జారీ చేయమని అతను రాజు గుమస్తాలను అభ్యర్థించేవాడు. అయినప్పటికీ, ఆ హక్కుల పత్రం జారీ కాలేదు.
కాలక్రమేణా, శాసన్పురి సన్యాసిరావు ప్రతి సంవత్సరం పంటకాలంలో ఒక బండి నిండా ఉప్పు, పొగాకు, మెరిసే తెల్లని లోహంతో చేసిన చవకైన ఆభరణాలు, ముతక పత్తి వస్త్రాలతో స్వర్ణపురికి వచ్చేవాడు. ఆయన ఒక కిలో ఉప్పుకు బదులుగా మూడు కిలోల బియ్యం, ఒక ముతక తెల్లని వస్త్రానికి బదులుగా ఇరవై కిలోల ఆవాలు ఇచ్చిపుచ్చుకునేవారు. ఒక జత ఎద్దులు, ఒక నాగలితో చేసే సాగుకు చెల్లించాల్సిన భూమి పన్ను మూడు రూపాయలకు రెండు మేకలను కొనేవాడు.
ఆ గ్రామంలో సంబారు అనే పేరు గల యువకుడు అందరికన్నా పొడవుగా ఉండేవాడు, అతని కళ్ళు మాటిమాటికీ కొట్టుకునేవి, ఎప్పుడు చిరునవ్వుతో వెలిగే మొహం. కిందటేడు అతను గడబాకు చెందిన ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. అతను పరజా తెగకు చెందినవాడు వారు చేసుకున్నది లేచిపోయి చేసుకున్న పెళ్ళి. ఉడులియా, అయితే వరుడు అమ్మాయి తండ్రికి కన్యా శుల్కం చెల్లించి, పిల్ల గ్రామస్థులకు విందు చేస్తే అది అసలు పెళ్ళికింద లెక్కె.
ఆమె పేరు మినిత. మినిత అంటే చేప అని అర్ధం. ఇప్పటికీ ఆమె పరాజా భాష సరిగ్గా నేర్చుకోలేదు. ఆమె వారి భాషలో స్పష్టంగా మాట్లాడలేకపోయేది. ఆమె తడబడుతూ, ముక్కలు ముక్కలుగా మాట్లాడితే , పిల్లలు ఆమె చుట్టూ చేరి అల్లరిగా ఉత్సాహంగా కిసుక్కున నవ్వుకునే వారు. వారి వారి వరండాల్లో పొగాకు తాగుతున్న ముసలివాళ్ళు దగ్గుతూ విని ముసిముసిగా నవ్వుకునే వారు. సంబారు, మినితా మాత్రమే ఆ కుటుంబ సభ్యులు. గ్రామ పెద్ద వారికి ఒక ఇళ్లవరుసలో ఒక ఇంటిని ఇచ్చాడు.
ఆ సంవత్సరం కేవలం వేసవి కాలంలో మాత్రమే వాడుకో గలిగే, ఎడ్లబళ్ళు ప్రయాణించగల రహదారి , స్వర్ణపురి మీదుగా ఏర్పాటయింది. అదే సంవత్సరంలో, కేశవ్, రామహరిని ఖైదు చేసారు. జిల్లా ప్రధాన కార్యాలయం నుండి ప్రక్కనే ఉన్న రాష్ట్రంలోని ఒక రేవు పట్టణం వరకు రహదారి ఏర్పాటయింది. ఎద్దుల బండ్ల కోసం అనువైన, మంచి వాతావరణంలో మాత్రమే ప్రయాణించగల ఒక రహదారిని వాడుకలోకి వచ్చింది. మైదాన ప్రాంతాల నుండి వ్యాపారులు చౌకైన రంగురంగుల బట్టలు, సారాయి పీపాలు, చీరలు, ప్లాస్టిక్ దువ్వెనలు, చిన్న అద్దాలు, సువాసనగల తల నూనెలతో నిండిన ఎద్దుల బండ్ల కాన్వాయ్‌లతో వచ్చారు. మద్యం, చౌకైన నగలు, చిన్న చిన్న వస్తువులు, మెరిసే నాణేలు, ప్రింటెడ్ చొక్కాలు కూడా అమ్మేవారు.
స్వర్ణపురి పౌరులు బళ్ళ వరుసల వైపే నిశ్శబ్దంగా, విస్మయ పడుతూ తదేకంగా చూసేవారు. అప్పుడప్పుడు, కొన్ని బండ్లు గ్రామంలోకి చొరబడి వరి, జొన్నలు, మహువా , కొండ ప్రాంతపు పసుపు పచ్చని పప్పులు, నెయ్యి, తేనె, అరోరూట్, పవిత్రమైన ఎండు ద్రాక్ష , ఆవాలు,నూనె గింజలు, తోలును దాదాపు లాక్కొనిపోయేవి. బదులుగా, వారు ప్లాస్టిక్ పూసల హారాలు, జుట్టు కోసం నైలాన్ రిబ్బన్లు, ఎరుపు, నీలం రంగు చొక్కాలు, చీరలు, సుగంధ తైలం, హెయిర్పిన్లు, పాత ఆటోమొబైల్ టైర్లతో చేసిన బూట్లు, తెల్ల లోహపు గాజులు, పొగాకు, పొగాకు కోసం చర్మ వ్యాధులకు సున్నం, మద్యం అమ్మేవారు.
ఎద్దుల బళ్లపై వచ్చే ఈ వడ్డీ వ్యాపారులను చూసి ప్రజలు భయపడేవారు. కానీ వారి మృదువైన, సున్నితమైన మాటలు, అసాధారణమైన మర్యాద, అపరిచితుల తరచు పర్యటనలు, అధికారుల మాదిరి వారి హుందాతనం జాగ్రత్తపడే గ్రామస్తులను నెమ్మదిగా ఆకర్షించాయి.
రెప్పపాటు సమయంలోనే వారి ఖర్చులు పెరిగిపోయాయి. ఒక అమ్మాయి చీర కొనడానికి బండివాడి దగ్గరికి వెళ్లిందా , బండివాడు అనేవాడు,
” అమ్మా, చీర ఒక్కటేనా, ఒక జత గాజులు కూడా కొనాలి.’ ఆమె రెండూ కొనేది, ఆమె తండ్రి దానికి బదులుగా ఒక బుట్ట చిరు ధాన్యాలు చెల్లించే వాడు.అటువంటి అదనపు భోగాలు త్వరలోనే ప్రజల వద్ద ఉన్న ఆహార ధాన్యాలన్నింటినీ హరించివేశాయి. కానీ ఆ గ్రామంలో ఒక కొత్త రంగుల మిశమం కనిపించింది.
వేసవి కాలంలో, మామిడి ప్రజలకు ఒక ప్రధాన ఆహార పంటగా ఉండేది. మామిడి పండ్లు తిని వాటి టెంకలను ఎండలో ఆరబెట్టి, లోపలి జీడీ తీసి, ఒక రోజు పాటు వాగులో కడిగి, ఎండలో ఆరబెట్టి నిల్వ చేసుకునేవారు. వర్షాకాలంలో, ధాన్యం కొరత ఉన్నప్పుడు, వారు ఆ జీడి రుబ్బి, దానితో చిక్కటి సూప్ తయారు చేసుకునేవారు. ఒక వేసవికాలం చివర్లో, సన్యాసిరావు మహువా పువ్వులు, బియ్యంతో తయారు చేసిన మద్యం నిండిన ఒక పెద్ద డబ్బాతో గ్రామానికి వచ్చి, గ్రామస్తులకు విందు ఇచ్చి, దానికి బదులుగా మామిడి జీళ్ళను తీసుకువెళ్ళాడు. ఆ గ్రామంలో వేడుకలు రోజంతా కొనసాగాయి. రోజంతా సన్యాసిరావును ఆకాశమంత పొగిడారు. ఆ మద్యం అదే రోజు అయిపోయింది. కానీ, ఆ సంవత్సరం వర్షాకాలంలో, వారిలో చాలా మందికి బియ్యం గానీ, జొన్నలు గానీ లేవు; ఆ మామిడి జీడి ఉంటే వారికి సుమారు ఒక నెల పాటు సరిపోయేది, కానీ ఎవరి ఇంట్లోనూ ఒక్క మామిడి జీడి కూడా లేదు. ప్రజలు ఆకలిబాధను అనుభవించారు.
వర్షాకాలంలో, శాసన్పురి సన్యాసిరావు మళ్ళీ వచ్చి ప్రజల బాధ పోగొట్టాడు. అతను ప్రతి కుటుంబానికి కొన్ని బస్తాల జొన్నలను అప్పుగా ఇచ్చి, ప్రభుత్వ స్టాంపు కాగితంపై ప్రతి రుణగ్రహీత బొటనవేలి ముద్ర వేయించుకున్నాడు. రైతులు, మూడు జతల నాగలి ఎద్దులతో సాగు చేసే భూమికి ఒక బస్తా చిరుధాన్యాల చొప్పున వారి భవిష్యత్తులను ముందుగానే తాకట్టును పెట్టారు. ఈ ముందస్తు తాకట్టును ‘గూడం’ అని పిలిచేవారు.
వర్షాకాలంలో పంట కోత తర్వాత, శాసన్ పురి సన్యాసిరావ్ గ్రామానికి వచ్చాడు, గ్రామంలోని ముఖ్యమైన వీధిలో ’విరామన్’అనే గద్దె మీద కూచుని ప్రతి కుటుంబం నుండి రావలసిన ధాన్యాన్ని చెల్లించమని అడిగే వాడు.. ప్రతి రైతు ఇవ్వవలసిన ధాన్యం మొత్తాన్ని ప్రధాన వీధికి తెచ్చేవాడు. భుజం మీద వేలాడుతున్న కాడికి రెండు వైపులా రెండు బుట్టలలో ధాన్యాన్ని మోసుకు వచ్చేవారు. వాటిని సన్యాసి రావు వాటర్ హవుస్ లో చేర్చే వారు. వాటిని స్వీకరించిన సన్యాసిరావు సమీపంలోని వాగు లో నీళ్ళు తాగి వెల్లమని సలహా ఇచ్చి ఇంట్లోకి అదృశ్యమయ్యేవాడు.
ఆ సంవత్సరం వసంతోత్సవం చివరిలో, వేసవి ప్రారంభంలో, నాయక్ లేదా గ్రామ పెద్ద , పెద్ద నాయక్ (అత్యధిక భూమి ఉన్న రైతు) వద్ద తప్ప మరెవరి దగ్గరా ఆహార ధాన్యాలు లేవు. వారు భూమి పన్ను చెల్లించలేకపోయారు. శిబా జానీ, గ్రామ పెద్దగా తన స్థానాన్ని కోల్పోయాడు.
శిబా జానీ , పెద్ద నాయకుడు తమతమ ఇళ్ళలో మిగిలిన ధ్యాన్యం మూటగట్టుకుని , కొన్ని ఆవులు, ఎద్దులు, మేకలు, గ్రామం నుండి చాలా వరకు ధాన్యం, కోళ్లను సేకరించి, రాజును కలవడానికి గ్రామ దూతతో కలిసి రాజ్య రాజధానికి వెళ్లారు. వారు నోట్లో గడ్డి పోచలతో, కొద్దిపాటి ఆహారంతో చాలా కష్టపడి, ఏడు రోజుల పాటు గొప్ప పట్టుదల ఆయనను కలవడానికి ఎదురుచూశారు.
ఏడు రోజులయాక వారు రాజును కలుసుకోగలిగారు. మెరిసే పట్టు వస్త్రాలు, వెండి బంగారాలతో కుట్టుపని చేసిన తలపాగా ధరించి, ఆస్థాన కవులు, అభిమానులు, రాచ పరివారంతో, నమ్మకస్తులతోరాజ వీధిలో వెళుతూ తన ఆశీర్వాదాలను పంచిపెట్టాడు. అతను చాలా దూరంలో ఉన్నాడు, కాని శిబా కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఆ ముగ్గురు గ్రామస్థులు చాలా దూరం నుండి వినయంగా నమస్కరించారు. రాజు వారిని గమనించలేదు.
ఇది సిబా దగ్గర ఎలాంటి పత్రాలు లేవు. అంతే కద సరికి సరి. అతను రైతుల నుండి భూమి పన్ను వసూలు చేసినప్పుడు వారికి ఎలాంటి రసీదు ఇవ్వలేదు. అసలు రసీదు ఎందుకు ఇవ్వాలి? వసూలు చేసిన భూమి పన్ను అంతా వాస్తవానికి గ్రామస్తుల సమక్షంలో గ్రామ ఉమ్మడి ధాన్యాగారానికి ధాన్య రూపంలోనే వసూలు చేసాడు కదా.
అందరూ చూస్తుండగా లెక్కలు రాసుకున్నారు. ఐదుగురు పెద్దల సమక్షంలో పదిమంది కూలీలు భుజాలపై పన్నులను మోసుకుని గ్రామం నుండి పోలీస్ స్టేషన్‌కు లేదా రాజుగారి కార్యాలయానికి వెళ్లారు. పోలీస్ స్టేషన్లో రాజుగారి తెహసీల్దార్ లేదా రెవెన్యూ అధికారి ధాన్యాన్ని స్వీకరించి, గీతలు గీసిన ఒక కాగితాన్ని అందజేశాడు, ఆ కాగితంపై ఏమి రాసి ఉందో అతనికి ఒక్కడికే తెలుసు. నాకు రసీదుల గురించి గానీ, మరే ఇతర పత్రం గురించి గానీ ఏమీ తెలియదు, అని శిబా అనుకున్నాడు.
శిబా రాజధానిలో ఇతర గ్రామ పెద్దలను, తన సొంత తెగకు చెందిన కొందరిని కలిశాడు. వారు అతనికి అండగా నిలిచి సహాయం అందించారు. వారు రాజు నమ్మకస్తులకు, గుమాస్తాలకు, ఆస్థానీయులకు లంచాలు ఇవ్వడానికి సహాయపడ్డారు, కానీ దీనివల్ల అతనికి రాజు దర్శనం లభించలేదు.
లాభనష్టాలపై చాలా సేపు వాదోపవాదాలు జరిగాక, ఒక రాత్రి శిబా ఒక స్థానిక దళారితో కలిసి ఒక చిన్న లాయర్‌ను సంప్రదించడానికి వెళ్ళాడు. ఆ లాయర్ అతని వాదనలు విని, చట్ట ప్రకారం రాజు అతన్ని ఈ విధంగా తొలగించలేడని, శిబా తన పత్రాలన్నీ తీసుకుని రావాలని, ఇక్కడి సబ్-జడ్జి కోర్టులో ఒక సివిల్ దావా వేద్దామని సలహా ఇచ్చాడు.
అతనికి ఆ పత్రాలు ఎక్కడి నుండి వస్తాయి? శిబా జానీ తహసీల్దార్ గీసిన చిత్తు కాగితాలను చూపించాడు. ‘ఇవి సరిపోవు, రాజుతో సంతకం చేసిన ఒప్పందపు నకలును తీసుకురండి,’ అన్నాడు న్యాయవాది.
కానీ ఒప్పందం జరగలేదు.
శీబా మళ్ళీ తన తెగ ప్రజలను సంప్రదించాడు. చట్ట ప్రకారం అలాంటి నిబంధన ఉండి ఉండవచ్చు, కానీ అతని తెగ నాయకులలో ఎవరికీ దీని గురించి తెలియదు. అంతేకాక, పరజా తెగకు చెందిన వారెవరూ బ్రిటిష్ వారి ఆస్థానం నుండి ఎన్నడూ ప్రయోజనం పొందలేదు, మరి అలాంటప్పుడు అంతులేని ఆస్థాన ఖర్చులను ఎలా భరిస్తారు? పైగా, రాజుపై దావా వేయడం మొత్తం పరజా తెగకే అవమానం తెస్తుంది. రాజుపై సివిల్ దావా వేయాలనే ఆలోచనను విరమించుకున్నారు.
తిరిగి వెళ్ళే దారిలో శిబా జానీ మతిస్థిమితం కోల్పోయి దారితప్పాడు. అతని అత్యంత ఫలవంతమైన భూమి కొత్త అధిపతికి వెళ్ళింది. పెద్ద నాయక్, కేశవ్ తండ్రి, ఒంటరిగా స్వర్ణపురికి తిరిగి వచ్చాడు, గ్రామ దూత కొత్త గ్రామ పెద్ద జగన్నాథ్ పెద్ద నాయకుడీని కలవడానికి బయలుదేరాడు.
గ్రామ మాజీ అధిపతి, ఇప్పటికీ నాయక్ లేదా ముఖ్య అనిపిలుచే అతను , భుజం మీద గొడ్డలితో, చేతిలో తంబురాపట్టుకుని, తన తండ్రి ఏళ్ల క్రితం, ఒప్పందకూలీగా వెళ్ళిన అస్సాం నుండి తెచ్చిన గోచీ, చొక్కా వేసుకుని పులులు, ఎలుగుబంట్లు, తెలియని శత్రువులు ఉన్న అడవుల్లోకి అదృశ్యమయ్యాడు. అతను పిల్లల్లా తంబురా వాయిస్తూ , విషాదంగా వేటాడే వాడు.
మరుసటి సంవత్సరం, పంట కోత సమయంలో మాత్రమే, భూమి పన్ను రేటు పెరిగిందని రైతులు తెలుసుకున్నారు. పన్ను ఇప్పుడు నాగలికి మూడు రూపాయలకు బదులుగా ఆరు రూపాయలు, ఒక అణాకు (రూపాయిలో పదహారవ వంతు) బదులుగా పారకి ఎనిమిది అణాలయ్యింది. వారు వారపు సంతలో అమ్మి పన్నులు చెల్లించడానికి ధాన్యం బయటకు తెచ్చారు; కానీ వారి సొంత గ్రామ దూత వారిని ఆపి ఆజ్ఞాపించాడు: ‘మీరు ముందు పన్నులు చెల్లించాకే ధాన్యం అమ్మాలి.”
” ధాన్యం అమ్మకపోతే మనం పన్నులు ఎలా చెల్లించగలం?”
గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.
పరజా ప్రజలకు అంటరాని కులానికి చెందిన గ్రామ దూత, ప్రజలను వడ్డీ వ్యాపారి అయిన శాసన్పురి సన్యాసిరావు ఇంటికి తోలాడు. (శాసన్పురి గ్రామం మధ్యలో ఒక పెద్ద ఇంటిని ఆక్రమించుకుని, వేరే కులానికి చెందిన ఒక స్త్రీని ఉపపత్నిగా చేసుకున్నాడు.) అతను తాను అమ్మే కొలపాత్ర కంటే పెద్దదైన కొలపాత్రతో ధాన్యం కొని, పన్నుగా రావలసిన బకాయిలను తీసివేసి, కొంత పొగాకు, మద్యం, ఉప్పును (ఉప్పు అర కొలతకు పరిమితం) అమ్మాడు. పౌరులు తమ పంటలో దాదాపు పూర్తి మొత్తాన్ని సన్యాసిరావుకు అమ్మేశారు. వారి వద్ద కొన్ని అణాల విలువైన నాణేలు, కొంత ఉప్పు, జుట్టుకు రిబ్బన్లు, పొగాకు తప్ప మరేమీ మిగలలేదు. చైతీ లేదా వసంత ఋతువు చివరి పండుగ నాడు, పెద్దనాయక్ ఇంట్లో తప్ప మరెవరి ఇళ్లలో ఆహార గ్రాసం మిగలలేదు, కనీసం ఒక దుంప కూడా లేదు.
తరువాత శాసన్పురి సన్యాసిరావు గ్రామానికి వచ్చినప్పుడు, గ్రామ దూత అతనిని అనుసరించి, ‘దొరా’ అని సంబోధిస్తూ, రైతులను అవమానకరమైన ఆజ్ఞలతో గద్దించాడు. ఆ వడ్డీ వ్యాపారి పేరు, అతని కొత్త అడుగుల మధ్య దూరంలా పెరిగిపోయింది.
అతను శాసన్పురి సన్యాసిరావు దొరా అయ్యాడు; ఎందుకంటే అతను గ్రామ పెద్ద , గ్రామంలోని భూములన్నింటికీ యజమాని అయ్యాడు, దాని అర్థం ‘దొర.
అయినా ప్రజలు అతడిని చూసి అసూయపడలేదు. దోపిడీదారుల సంపదకు వారి పేదరికమే మూలం. వడ్డీ వ్యాపారి వరి ధాన్యం, బియ్యం పిసినారితనం అనే దుర్వాసనను, నిల్వ ఉంచిన ధాన్యం పాత వాసనను కొడతాయి.
స్థానిక అటవీ అధికారి సొమ్ము కోసం సేకరించే చిరుధాన్యాలలో రంపపు పొట్టు, ఇసుక పుష్కలంగా ఉంటాయి. భూమి పన్ను అధికారులు సేకరించిన కాగితపు కరెన్సీ నోట్లు ఎప్పుడూ నలిగిపోయి, మద్యం అమ్మేవారి ఖాతాల గీతలతో ఉంటాయి. దోపిడీదారుడి సంపద అతడిని కులీనుడిని చేయదు; అతని అంతరంగం దరిద్రం, భయంతో వణికిపోతూ ఉంటుంది. ఒక దోపిడీదారుడు ఎప్పుడూ ఒంటరిగా, అనిశ్చితమైన ఆందోళనలతో సతమతమవుతూ ఉంటాడు.
* * * * *
(మళ్ళీ కలుద్దాం )

స్వాతీ శ్రీపాద పుట్టి పెరిగినది నిజామాబాద్. కధ, కవిత, నవల ఒకఎత్తైతే , అనువాదం మరొక ఎత్తు. వెరసి మొత్తానికి అక్షరాలే ప్రపంచం. రాసినది చాలానే అయినా ప్రచురించినది 8 కవితా సంపుటాలు, 7 కధా సంపుటాలు, 4 నవలలు మరెన్నో డిజిటల్ పుస్తకాలు. అనువాదాలు 32 తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం , ప్రతిభా పురస్కారం, వంశీ -తెన్నెటి లత కధా పురస్కారం , వాసిరెడ్డి సీతాదేవి సాహితీ పురస్కారం , రచనకు అనువాదానికి మహాత్మా ఫూలే అవార్డ్ , మొదలైనవి ఎన్నో…
