మెరుపులు- కొరతలు

ఉమా నూతక్కి కథ “25వ గంట”

                                                                – డా.కే.వి.రమణరావు

          ఉద్యోగం చేస్తున్న ఒక గృహిణి మీద పడుతున్న అనేక బాధ్యతల వలన ఆమెకు తన స్వంత అభిరుచులకు అనుగుణమైన పనులు చేసుకోవడానికి సమయం దొరక్క పోవడం గురించి ఈ కథ ప్రస్తావిస్తుంది. అలాంటి స్త్రీకి రోజులో కనీసం తనకంటూ ఒక అదనపు గంట, 25వ గంట, ఉంటే బావుంటుందని ఈ కథ నిసృహగా సూచిస్తుంది.
ఈ కథ సంప్రదాయ శిల్పంలో కాకుండా ఈ మధ్యకాలంలో వస్తున్న కొన్ని కథల్లాగే రచయిత్రి తన ఆలోచనలను, అనుభూతులను ఒక క్రమంలో పాఠకులతో పంచుకునే పద్ధతిలో రాయబడింది.


          ఇందులో దాదాపు ఇరవైనాలుగ్గంటల కాలంలో జరిగింది చెప్పబడింది. కథనమే కథ. దాదాపు తొంభైశాతం స్వగతమే. ఇలాంటి సెట్టింగును ఎన్నుకుని పాఠకులు ఆసక్తితో చదివేలా రాయడం కత్తిమీద సామే. అందరూ రాయలేరు.


          ఇందులో ప్రధానపాత్ర ఒక మధ్య వయస్కురాలైన ఉద్యోగిని. రచయిత్రి ఆమె పేరు ఎక్కడా చెప్పలేదు, ‘ఆమె’ అనుకుందాం. తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకో గలిగిన సున్నిత మనస్కురాలు, వ్యక్తిగత సాహిత్య అభిరుచులు కలిగి, సృజనాత్మక రచనలు చేస్తున్న మనిషి. ఒకటో రెండో ఇతర ప్రత్యక్ష, పరోక్ష పాత్రలు. అంతే. రోజంతా ఆమె కలిసిన మనుషులు, చేసే పనులు, ఆలోచనలు – వీటిని క్రమంగా చెప్పేదే కథ.
స్థూలంగా కథ చెప్పాలంటే, ఆమె ఇన్ కంటాక్స్ ఆఫీసులో సీనియర్ టాక్స్ అసిస్టెంటు. ఆమె ఆఫీసులో లంచ్ కి ముందు గంట పర్మిషన్ పెట్టి బాధిస్తున్న మోకాలు నొప్పి గురించి డాక్టరును కలవడంతో కథ మొదలౌతుంది.
         

          సుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయని, ఆమె బరువు తగ్గాలని, రోజూ నలభైఐదు నిముషాలు నడవాలని డాక్టరు చెప్తాడు. ఆమె నిసృహగా ఆఫీసుకు వెళ్తూ అన్నం మానేయాలని, నీళ్లెక్కువ తాగాలని అనుకుంటుంది. కానీ అఫీసులో ఎక్కువసార్లు వాష్ రూముకు వెళ్తే ఆ విజిట్లు లెక్కేసే ప్రబుద్ధులతో ఇబ్బంది అనుకుంటుంది. రోజువారీ పనుల్లో కొత్తగా నడకకి నలభై ఐదు నిముషాలు ఎక్కడినుంచి తేవాలి అన్న ప్రశ్న ఎదురౌతుంది.
         

          భర్త అదే డిపార్ట్మెంటులో పనిచేస్తాడు గాని ఆ మధ్యే ప్రమోషన్ మీద వేరేవూరు వెళ్లాడు. ఆమె కుటుంబం కోసం ప్రమోషన్ వదులుకోవాల్సివస్తుంది. భర్తకు ప్రొమోషన్ వల్ల పెరిగే జీతంకన్నా వేరేవూర్లో ఉండడం వల్ల అయ్యే ఖర్చే ఎక్కువ. ఐనా అతను వదులుకోలేదు.

          అతను చెడ్డవాడేంకాదు ‘టేకిట్ ఫార్ గ్రాంటెడ్’ గా తీసుకునే భర్తల్లో ఒకడు. భర్త ఆ సాయంత్రం ఆమెని క్యాబ్ లో వెళ్లమని, నాలుగురోజులు సెలవు పెట్టమని చెప్పాడుగాని మామగారి, అత్తగారి అనారోగ్యం కోసం ఇదివరకే పెట్టిన సెలవుల కారణంగా ఆమె ఆపని చేయలేదు.

          లంచ్ అయ్యాక ఆమె ఫేస్ బుక్ తెరిచింది, రాత్రి ఆమె అనువదించి పెట్టిన అమృతాప్రీతం కవితకి చాలా లైకులొచ్చాయి. మంచి చర్చ జరుగుతోంది. పుస్తకాలు, అందునా కవిత్వం ఆమెకి ప్రాణం. ఏమాత్రం తీరిక దొరికినా చదవడం తన భావాల్ని పంచుకోవడం అస్సలు వదులుకోదు.

          సాయంకాలం ఆమె బస్సులోనే ఇంటికి వెళ్లింది. మంచి ఇల్లు, తన అభిరుచికి అనుగుణంగా కావాలి కాబట్టి సిటికీ 25 కిలోమీటర్ల దూరంలో తమకోసం, ఒక్కగానొక్క కూతురి కోసం, అత్త మామయ్యల కోసం అంటూ వైనాలు వైనాలుగా ఇల్లు కట్టుకునేసరికి కోటికి పైగా అయ్యింది. ఇంటికి కారుకి కలిపి ఈయెమ్మై నెలకి లక్షా ఇరవైవేలు. కూతురి చదువు, మిగతా ఖర్చులు మామూలే. కాబట్టి క్యాబ్లో వెళ్లలేదు. బస్సులో ఇంటికి గంటా గంటన్నర ప్రయాణం. బస్సులో వెళ్లేప్పుడు తనకిష్టమైన ఆడియో బుక్స్ వింటుంది. అరోజు వినాలనిపించక వినలేదు.

          ఇంటికెళ్లాక పక్షవాతంతో మంచంలోవున్న అత్తగారికి కాఫీ ఇచ్చి, తనూ తాగి రిలాక్స్ అయ్యాక అత్తగార్ని వీల్ చైర్లో వంటగదిలోకి తీసుకెళ్లి కబుర్లు చెప్పుకుంటూ వంటచేసింది.

          ఏడుగంటలకి మెట్లెక్కి టెర్రేస్ మీదున్న మొక్కలకి నీళ్లుపోసి స్నేహితురాలితో ఏదో పుస్తకం మీద మాట్లాడుతూ అటుయిటూ తిరిగింది. అప్పుడే ఇంటికొచ్చిన కూతురిఫోన్ చూసుకుని ‘పద్దెనిమిదేళ్లొచ్చినా పాలు కలుపుకోవడం, చిన్నచిన్న పనుల్లో తల్లికి సహాయం చేయడం తెలియని’ కూతురికోసం కుంటుకుంటూ కిందికి దిగింది.
వంట పూర్తై తాము భోజనాలు చేసే సరికి టైము రాత్రి తొమ్మిది. మరుసటిరోజు వంటకి ఏర్పాట్లు చూసుకుని, వంటిల్లు సర్దుకుని అత్తగారికి మందులిచ్చేసరికి పదిన్నర.
అది తన సమయం. అప్పుడు ఆమె లాప్ టాప్ తెరిచి తనకి నచ్చినవి చదువుకుని రాసుకుంటుంది. అవయ్యేసరికి పన్నెండున్నర. పొద్దున చేయాల్సిన పనులు సరిచూసుకోవడానికి మరికొంత సమయం. డాక్టర్ చెప్పినట్టు తను రోజూ పొద్దున్నే 45 నిముషాలు నడవాలంటే పొద్దున ఓ గంట ముందు లేవాలి. ఆమెకు ఏడుపొచ్చింది. తను రాసే పత్రికకి, ఆక్టివ్ గా ఉండే సోషల్ ప్లాట్ ఫామ్స్ లో తను కొన్నాళ్లు సెలవంటూ మెస్సేజి పెట్టింది.

          ఆమె పొద్దున్నే నాలుగ్గంటలకే లేవాలనుకుందిగాని లేచేసరికి ఐదయిపోయింది. ఫ్రెష్ అయి వాకింగ్ బయలుదేరింది. మోకాలినొప్పి కొంచెం ఫరవాలేదు. అమెజాన్ లో కొత్తగా కొనుక్కున్న ఆడియో బుక్ వింటూండగా పనమ్మాయి ఫోన్ వచ్చింది. ‘తన బంధువులు పోయారని రెండ్రోజులు పనిలోకి రా’నని చెప్పింది. ఆమెకు (తన పరిస్థితి?) ఒక్కక్షణం విషాదంగా అనిపించింది.
(వాకింగ్ మధ్యలో ఆపి ఇంటికొచ్చి) చివరి గిన్నె కడిగి షింక్ శుభ్రం చేస్తూండగా మొబైల్ లో ఫిక్స్ చేసుకున్న వాయిస్ చెప్పింది ‘ఫార్టి ఫైవ్ మినిట్స్ ఓవర్’ అని. ఆమె విరక్తిగా నవ్వుకుని ‘ఇప్పుడా నలభై అయిదు నిముషాలు కోసం నా రోజులో 25వ గంట రావాలి ‘ అనుకుంది. ఇదీ కథ.

          కథలో ఆసక్తికరమైన సంఘటనలేవీ లేకపోయినా కథనమంతా బిగువుతో నడుస్తుంది. అనవసరమైన వాక్యాలు ఎక్కడా కనపడవు. కథంతా దాదాపు ప్రధానపాత్ర స్వగతమే ఐనా సాఫీగా ముందుకు నడుస్తుంది. ప్రధానపాత్ర తన నేపధ్యానికి తగినట్టుగానే ఆలోచిస్తుంది, పాఠకులతో మాట్లాడుతుంది. ఆమె భాష కూడా ఒక ఉద్యోగం చేస్తున్న నగర గృహిణికి తగిన విధంగా తగిన మోతాదులో ఆంగ్లపదాలతో వాస్తవికతకు దగ్గరగా ఉంది.
         

          కాకపోతే ఆమె మనస్థితి పాఠకులకు బాగా అర్థమవడానికి, కొన్నిటిని జస్టిఫై చేసుకోవడానికి రచయిత్రి కావలసిన సమాచారమంతా పొందుపరిచారు. పాఠకుల దృష్టితో కూడా తమ కథల్ని చూసుకునే రచయితలు ఇలా రాస్తారు. ఈమధ్య వస్తున్న కొన్ని కథల్లో అవసరమైన సమాచారాన్ని పాఠకులే తమంతకు తామే గ్రహించుకోగలిగిన చోట్ల వివరాలు ఇవ్వడంలేదు. ఆవిధంగా పొదుపు చేసిన స్థలాన్ని మరోవిషయం చెప్పడానికి వినియోగిస్తున్నారు.

          పాఠకుల్లో వస్తు సంబంధమైన కొన్ని ప్రశ్నలు ఉదయించవచ్చు. ఉదాహరణకు, నగరం మధ్యలో ఉద్యోగం చేస్తున్న గృహిణి స్వంతయిల్లైనా సరే అంత దూరంలో ఉండి అవస్థలు పడడమెందుకు? తమ బడ్జెట్ కి మించి అంత ఖర్చుతో ఇల్లు కట్టుకోవాలా? ఇలాంటివి. కాని వీటికి సమాధానాలు సులభంగా చెప్పవచ్చు. ఇప్పుడు అనేక మధ్య తరగతి కుటుంబాలు స్వంతయింటి సెంటిమెంటుతో ఇలాగే చేస్తున్నాయి. కాబట్టి ఇది వాస్తవికతకు దూరం కాదు. పై విషయాన్ని ఆమే ఒకచోట ఇలా ఒప్పుకుంటుంది.
‘కానీ తనకీ భద్రజీవితమే కావాలి. తను చాలా సక్సెస్ ఫుల్ అనిపించుకోవాలి. తానుకూడా ఒక టిపికల్ స్త్రీ.’

          ఈ కథలో ప్రధానంగా ఉద్యోగం చేస్తున్న ఒక గృహిణి కొన్ని స్వంత అభిరుచులను కలిగివున్నప్పుడు వాటిని తీర్చుకోవడానికి తగిన సమయం పొందలేకపోవడాన్ని రచయిత్రి ఫోకస్ చేసారు. ఆ అభిరుచులు ఈ కథలోలా సాహిత్యానికి చెందినవే కానక్కరలేదు, సంగీతం, నాట్యం, గార్డెనింగ్, సామాజిక సేవ లాంటి వేరేవికూడా కావచ్చు. ఈ లక్షణంవల్ల ఈ కథకు కొంత సార్వజనీనతకూడా లభించింది.

          హైలైట్ చేయబడిన మరొక ముఖ్య విషయమేమిటంటే అలాంటి గృహిణికి తగిన సమయం దొరకనప్పుడు ఆమె తన వ్యక్తిగతమైన అభిరుచుల్నే వదులుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పురుషులకు కొంత వెసులుబాటు ఉంటుంది అనేది కూడా రచయిత్రి పోల్చి చూపారు.

          కొన్నిచోట్ల వాక్యాలు సున్నితంగా ఉన్నా ఆమె భావాల్ని పదునుగా తెలియజేస్తాయి. ఉదాహరణకు;
‘ఇఫ్ అని డాక్టరు ఒక ఆప్షన్ ఇచ్చాక ఏంచేయాలో ఆమెకు తెలుసు’
‘ఇరవైనాలుగ్గంటల్లో ముప్పావుగంట … ముప్పైరెండో వంతు ‘
‘అతను రాకరాక వచ్చిన ప్రమోషన్ ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అసలతను ఎప్పుడూ వదులుకోలేదు. అది వేరే విషయం’.
‘ఇవన్నీ అతనికి చెప్పుకోవాలనుకుంటుంది కాని చెప్పదు. చెప్పే పరిస్థితి రాదు. అతను కన్వీనియెంట్ గా అవాయిడ్ చేస్తాడో? ఆమె అవకాశం తీసుకోదో?’
‘తను రాయడం చదువుకోవడం అతనికి యిష్టం లేక పోవడం కాదు. వాటికోసం అతను ఏ మాత్రం స్ట్రెచ్ అవ్వడు.’
          రచయిత్రి కొన్నిచోట్ల ఆమె అసంతృప్తికి చెందిన అనుభూతులని ఇలా కవితాత్మకంగా తెలియజేస్తారు.

          ‘ఆమె సమయాలు ఎప్పుడూ శూన్యం కాదు ఏదో ఒక రకంగా అందులో తడి వంపు కుంటుంది. కాని ఆ వంపుకునే క్రమంకూడా ఆమెకి చాలా అలసట అనిపిస్తోంది.’
‘ఊహా ప్రపంచంలో ఉంటుంది. లోపల్లోపల ఎక్కడో ఉన్న అశాంతి, శూన్యత మొత్తం వచ్చేస్తుంది బయటికి. అక్షరాలతో దాన్ని కప్పుకుంటుంది. నవ్వులూ కన్నీళ్లూ పంచుకుంటుంది.’

          చివరిగా ఆమె తనకు ఇష్టమైన వాటిని వదులుకోవాల్సినప్పుడు విరక్తిగా ‘శరీరం, మనసు, కాలం ఒకే కక్ష్యలో తిరుగుతూ సముదాయిస్తే ఎంత బాగుంటుందో’ అనుకుంటుంది.

          ఒక స్త్రీయొక్క నిసృహకి చెందిన సున్నితమైన భావాల్ని అంతే సున్నితంగా ఈ కథలో చెప్పారు రచయిత్రి. మంచి కథ రాసిన రచయిత్రికి అబినందనలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.