శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం – సరోజా శ్రీ. శ్రీ.

                                                                – ప్రొ.కిన్నెర శ్రీదేవి

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం

“All biographies like all autobiographies like all narratives tell one story in place of another” – Helene Cixous.

తెలుగు సమాజంలో “జీవిత చరిత్ర”, ‘ఆత్మకథ’  ఒక సాహిత్య రూపంగా బలపడలేదు. ఆమాట కొస్తే, పాశ్చాత్య సమాజంలో ఆధునిక ఆత్మకథకు ప్రారంభవాచకంగా “Confessions” (Saint Augustine)  క్రీ.శ. నాలుగవ శతాబ్దంలోనే రాయబడినప్పటికీ 18వ శతాబ్దంవరకు కూడా జీవిత చరిత్రకు, ఆత్మకథకు సాహిత్య గౌరవం దక్కలేదు. తెలుగులో సాహిత్య గౌరవాన్ని పొందిన  తక్కువ రచనల్లో ఒకటిగా సరోజా శ్రీ.శ్రీ.  “శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం” గుర్తింపు పొందింది. నూటా నలభై రెండు అధ్యాయాలున్న ఈ ఆత్మకథలో పదహేడు అధ్యాయాలు ప్రత్యక్షంగా సాహిత్యానికి, సాహిత్య సంబంధిత అంశాలకు సంబంధించినవి.

తెలుగు సాహిత్యంలో శ్రీ. శ్రీ. చాలావరకు నూతన పోకడలకు అంకురార్పణ చేసినట్లుగానే సరోజా శ్రీ. శ్రీ. “శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానాన్ని” రాయటంలోనూ ఒక నూతన పోకడను ముందుకు తీసుకువచ్చింది.  చాలాకాలం కిందటే Amborce Bierce తన Devils Dictionary’లో ’Auto-biography is fiction’అని నవల, హాస్యస్పోరకం అని కూడా ప్రకటించారు. సరోజా శ్రీ. శ్రీ. ఈ అర్థంలో కాకపోయినా తన “శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానాన్ని” ఒక నవలగా పరిగణించారు.

ఆక్స్ ఫోర్డ్ నిఘంటువు నవలను ఈవిధంగా నిర్వచించింది.

  1. a fictitious prose narrative of book length, 2) Interestingly new or unusual. ఆవిధంగా చూసినప్పుడు “శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం” నవలలాగా సాగిన ఒక అసాధారణ ఆత్మకథ.

సాహిత్య ప్రక్రియలో జీవితచరిత్ర రచించడం చాలా సులభమైనది అనే అభిప్రాయం ఉంది. కానీ ఇందుకు ఉపక్రమించడమంటే కొంతవరకు సాహసించడమేననిపిస్తుంది. ప్రజానాయకులు. కీర్తిప్రతిష్టలు గలవారు, సాహిత్యకారులు లేదా ఆధ్యాత్మిక రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులు సామాన్యంగా జీవితచరిత్రలు రచిస్తూ వుంటారు. కానీ ఒక వ్యక్తి ప్రజా జీవితం గడించిన వాడయి నా, కాకపోయినా తన జీవితంలో జరిగిన సంఘటనలను సింహావలోకనం చేసుకొని క్రమరాహిత్యం లేకుండా అన్ని ప్రధాన సంఘటనలు, స్థలాలు, వ్యక్తులు కలగాపులగం అయిపోకుండా, చారిత్రక అంశాలు తారుమారవకుండా తేదీలు, సంవత్సరాలు మెలికలు పడకుండా వ్రాయడం ఒక పెద్ద సవాలే. చెప్పదలచుకున్న విషయాల్ని ఎలాంటి మెలికలు, మార్మికతకు అవకాశం ఇవ్వకుండా సూటిగా చెప్పడం, ఎత్తుగడకు సంబంధించిన విషయం.

స్వీయ చరిత్రలలో తన జీవితాన్ని తానే చెప్పుకునే సౌలభ్యం ఉందిగదాని, వాస్తవికతను మరుగు పరచకుండా ఉన్నది వున్నట్టు చెప్పడం ధర్మం. కానీ తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కొన్నింటిని వాస్తవికతకు భిన్నంగా వక్రీకరించే క్రమంలో అదే కాలంలో సంఘటనలతో ముడిపడిన అంశాలు, జరిగిన వ్యక్తుల ప్రస్తావనలలో చారిత్రాత్మికతను పరోక్షంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి జరిగింది జరిగినట్లుగా చెప్పడం వలన గొప్పవాళ్ళ స్వీయ/జీవితచరిత్రలను చదివిన సాధారణ/అసాధారణ పాఠకులు, వాళ్ళ జీవితంలో సైతం పొరపాట్లు జరగడం సహజం అని భావిస్తారు. అలా భావించడమే కాకుండా అలాంటి పొరపాట్లను అధిగమించడం వలన వాళ్ళు కూడా ప్రయత్నిస్తే ఉన్నత శిఖరాల్ని ఎలా అందుకోగలరో వారికి అవగాహనలోకి వస్తుంది. అలాగే పాఠకులు తమ జీవితంలో జరిగిన సంఘటనలతో గల సామ్యాన్ని తలచుకొని Convince అయ్యే అవకాశం ఉంది. జీవితమంటే తప్పులే వుండవనే భ్రమ సామాన్యం.

అన్ని జీవిత చరిత్రలు పుట్టుక దగ్గర ప్రారంభమై కాలక్రమ వరుసలో జీవిత ఘట్టాలను వివరించినవేకాక అప్పుడప్పుడు తమకుతోచిన, గుర్తొచ్చిన, చెప్పాలనిపించిన విషయాలను రాసుకుంటూ, కలుపుకుంటూ పోయే జీవిత చరిత్రలు కూడా తెలుగు సాహిత్యంలో మనకు కనబడతాయి.

సరోజాశ్రీ.శ్రీ ‘శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానా’న్ని సంప్రదాయ అర్ధంలో లేక నిఘంటువు నిర్వచనం ప్రకారం రచించిన ఆత్మకథ అనటానికి వీలులేదు. ఏకవాక్యంలో చెప్పాలంటే’, “An account of a person’s  life by him – or herself”. (Penguin Dictionary of Literary Terms Literary Theory)    సరోజాశ్రీ.శ్రీ. ఆత్మకథలో పదమూడు అధ్యాయాలలోనే సాహిత్యం, సాహిత్యంలోని వ్యక్తులు, సాహిత్య ఉద్యమాలు, సిద్ధాంతాల మీద ఆయన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు కన్పిస్తాయి. మిగతాదంతా సమకాలీన, తన వైయక్తిక జీవితం గురించిన కథనం ఉంది. తన ఆత్మకథకు ఉన్న ఈ రూప సంబంధిత పరిమితి గురించిన స్పృహ సరోజా శ్రీ.శ్రీలో చాలా స్పష్టంగా ఉంది. అందువల్లనే దీన్ని ’ఆత్మకథనాత్మక’ నవలగా పరిగణించవచ్చు. ఇలా ఆత్మకథను నవలగా ప్రకటించటం అరుదైనప్పటికీ కొన్ని ఆత్మకథలను పాఠకులే కాల్పనిక సాహిత్యంలో భాగంగా  పరిగణించటం అరుదేమీ కాదు.

ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా, J.A. Cuddon అభిప్రయం ప్రకారం “An auto- biography may be largely fictional’ అని చాలా స్పష్టంగానే ప్రకటించవచ్చు. అందుకు ఉదాహరణగా ఆయన రూసో ఆత్మకథ ‘Confessions’ చూపించి దానిని ఆత్మకథగా కంటే ఒక సాహిత్య వాచకంగా దానికి విభిన్నమైన విలువ వుందంటాడు. ఈ విషయంలో సరోజాశ్రీ.శ్రీ వాచకానికి మరొక కోణం కూడా ఉంది. ’శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం’ కేవలం ఒక సాహిత్యవాచకం మాత్రమేకాక ఏదో ఒకస్థాయిలో రచయిత జీవితాన్ని, అహాన్ని(self) ఆవిష్కరించిన రచన కూడా.

చాలా ఆత్మకథల్లో రచయితలు తమని తాము ఒక పాత్రగా మార్చుకుని ఆ పాత్రకు మానవాతీత సామర్థ్యాన్ని ఆపాదించటం జరుగుతుంది. సరోజా శ్రీ.శ్రీ. ఆపని చేయలేదు. పైగా తనను తాను మామూలు వ్యక్తిగా, శ్రీ.శ్రీ.పట్ల తనకున్న అన్ని బలహీనతల్ని ఒప్పుకుంటూ, ఎటువంటి నైతిక సమర్ధన లేకుండా బహిరంగ పర్చారు. (ఒక్క సెక్స్ విషయంలో తప్ప)

“How could I fail to be grateful to my whole life – and so I tell my life to myself” అని నీషే తన గురించి తాను తెలుసుకుంటూనే ప్రపంచానికి కూడా తన గురించి తెలియజేశాడు. ఆ తెలియజేసే క్రమంలో తనని తాను నిర్మించుకున్నాడు. సరోజాశ్రీశ్రీ కూడా సరిగ్గా నీషేలాగా “ఇది నా జీవిత కథనం. నా జీవితం కనీసం నాకు అమూల్యమైనది. కనుక ఈ రచనను కూడా అమూల్యంగా భావిస్తాను” అని అన్నారు. ఈనిర్మాణ క్రమంలో ఆమె ఆత్మకథ అమలులోవున్న నిర్వచనాలను అధిగమించింది. లేదా ధిక్కరించి, “శ్రీ.శ్రీ. సంసార ప్రస్థానం”  దానికదే ఒకరచనా విశేషంగా నిలిపింది. ఈమె ‘ఆత్మకథ’ రాయటంలో రచయిత అనివార్యంగా అనుసరించాల్సిన రూపసంబంధమయిన నియతిని, అలాగే  నిరాకరిస్తున్నదాన్ని ఆమోదించక, తప్పనిస్థితిని సంకేతిస్తూంది. ఈసంధర్భాన్ని పురస్కరించుకొని శ్రీ.శ్రీ. అభిప్రాయాన్నిఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

“ఈ నవలలో గర్భితమైన ఎన్నో నవలలున్నాయి… ప్రతిఘట్టం ఒక నవల. ప్రతి ప్రకరణం ఒక నవల. ప్రతి వాక్యం ఒక నవల. ప్రతి పదం ఒక నవల ప్రతి అక్షర క్షణ క్షణం ఒక నవల” అని (అనంతం, పే. 17)శ్రీ.శ్రీ. అన్నారు. ఈమె జీవిత చరిత్రను రాయటంలో అంతశ్రద్ధ కన్పించకపోయినప్పటికీ, సరోజాశ్రీ.శ్రీకి తన జీవిత చరిత్ర రాయటంలో అనిర్దిష్టంగానైనసరే ఒక ప్రణాళిక(Plan) వుంది.

1956లో శ్రీ.శ్రీ. పరిచయమైన దగ్గరనుంచి శ్రీ.శ్రీ. జీవించి ఉన్నంతవరకు  సరోజాశ్రీ.శ్రీకి తన అహాన్ని (self) కేంద్రం చేసుకొని తన వ్యక్తిగత చరిత్రను, సామాజిక చరిత్రను విశ్లేషించాలనుకున్నారు. ఈ విశ్లేషణ అనివార్యంగా తన చుట్టూవున్న వ్యక్తులకు ఎక్కుపెట్టబడుతూందని ఆమె ముందే గ్రహించారు. ఆ గ్రహింపు వల్లనే ఆమె చాలా ఎత్తుగడతో (strategic)రాశారు.  తన జీవితచరిత్రకు నవలా లక్షణం ఉన్నట్లు ప్రకటించక పోయినా చదువుతున్నంత సేపు నవలా పఠనాసక్తికి పాఠకులు లోనవుతారు. ఈ భావన కలగడానికి ఆమె ఎంచుకున్న చమత్కార శైలి కూడా ఒక కారణం కావచ్చు.

శ్రీ.శ్రీ. గారన్నట్లు జీవిత చరిత్రను నవలగా రాయటంవల్ల  ఒనగూడే సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా అన్నారు. “నవల అనగానే అందులో ఎన్నో అభూతకల్పనలూ, అతిశయోక్తులూ, ఆఖరికి పచ్చి అబద్దాలూ ఉండవచ్చు. ఎందుకున్నాయని అడిగే హక్కు ఎవరికీ లేదు…. తిట్టదలచుకున్న వాళ్ళనందరినీ ధారాళంగా తిడతాను. అయినా చట్టబద్దంగా నా మీద ఏ విధమయినా చర్య తీసుకోవటానికి వీల్లేని సదుపాయం నవలారచన కుంటుంది”. అని శ్రీ.శ్రీ. తన అత్మకథ “అనంతం”లో ప్రకటించారు. అంతేకాక సరోజా శ్రీ.శ్రీ.ని  జీవితచరిత్ర రచనకు పురికొల్పే సంధర్భంలో శ్రీ.శ్రీ. ఇలా అన్నారు.

“నీకు తోచినట్టు  యథార్థాన్ని మాత్రం  నీ ఇష్టం వచ్చినట్టు రాసేయి సరోజా! తెలుగయి వుంటే చాలు. భయపడతావెందుకు?” అని అన్నట్లు  “శ్రీ.శ్రీ. సంసార ప్రస్థానం” ముందుమాటలో ఆమె ఉటంకించారు. కాబట్టి ఆమెకు ఈ text  ఒక pretext. సాధారణంగా జీవిత చరిత్రని రచయితలు తమని తాము స్పష్టపరుచుకోవడానికి, సంజాయిషీ ఇచ్చుకోవటానికి వాడుకుంటారు. ‘నిజంగా నేను ఫలానా, నన్ను అపార్ధం చేసుకోవద్దు’ అనే ధోరణిలో సాగుతాయి. సరోజాశ్రీ.శ్రీ. జీవిత చరిత్ర ఇందుకు పూర్తిగా వ్యతిరేకం కాకపోయినా పాక్షికంగా గోచరిస్తూంది.

ఇది Self – presentation Hex, statement of identity కానీ కాదు, ఆమె స్వంత మానసిక విశ్లేషణ కూడా కాదు. ఒక రకంగా ఆమె తనను తాను నిర్మించుకునే ప్రయత్నం చేశారు. తనకు ప్రజలిచ్చిన అన్ని projectionsను ఆమె  dismantle   చేశారు. ఆమె తన real self కు projected self కు మధ్య real self వైపే మొగ్గు చూపారు. అందువల్ల  శ్రీ.శ్రీ. అభిమానుల్లో కొందరికి మింగుడుపడలేదు, కొందరికి అభ్యంతరంగా కూడా అన్పించింది. అయితే ఆమె వీటి నేటినీ ఖాతరు చేయలేదు. కానీ ఈ అభ్యంతరాలు, మింగుడు పడకపోవటాలు ఆమె రచనను ప్రభావితం చేశాయి. అందుకు ఆధారం ఆమె అక్కడక్కడ “శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం”లో సంజాయిషీలు ఇచ్చుకునే తరహాలో కొన్ని వాక్యాలు కన్పిస్తాయి.

ఉదాహరణకు ఒక చోట ఆమె ఇలా అంటారు. శ్రీ.శ్రీ. సంసార ప్రస్థానాన్ని నేను అషామాషీగా కానీ, ఉబుసుపోకకుగానీ రాయలేదు. స్వతహాగా “రచయిత్రిని కాకపోయినా, ఎక్కువ భాషాజ్ఞానం లేకున్నా, మా జీవిత విశేషాలను మీ ఎదుట పెట్టాలన్న కోరిక మాత్రం శ్రీ.శ్రీ అంత ఎత్తున పెరిగిపోయింది” ఒక భార్యగానే కాకుండా ఒక వ్యక్తిగా తమ జీవితాన్ని వాస్తవికంగా సందర్శించే ఉద్దేశంతోనే రాస్తున్నానన్నారు. అందువల్ల శ్రీ.శ్రీ. అభిమానులు తమ మనస్సులలో కల్పించుకున్న ఇమేజ్ బద్ధలయ్యే ప్రమాదం వుంది. కాని నాది సత్యాన్ని పరిశీలించే ప్రయత్నం. నిజం ఎల్లప్పుడూ తియ్యగానే ఉండదు. చేదు నిజాలను దాచడమూ, మధురమైన అబద్ధాలను సరఫరా చెయ్యటమూ లాభసాటి వ్యాపారం కావచ్చు. “కాని నాకా లాభమూ వద్దు, ఆ వ్యాపారమూ వద్దు”. (అనంతం పే.16) అని శ్రీ.శ్రీ అన్నట్లుగానే ఆ దంపతులు అనుభవించిన దారిద్ర్యాన్ని , వైభవాన్ని, చివరకు శ్రీ.శ్రీ.గారు తిట్టిన సంధర్భాలతో సహా ఆమె ఇక్కడ పంచుకున్నారు.

ప్రముఖ జర్మన్ తాత్త్వికుడు నీషే కూడా తన ఆత్మకథ “Ecce Homo”లో ఇలా అన్నాడు.

(“I am, for instance, definitely no bogeyman, no moral monster – I am admired as virtuous till now…. I am disciple of the philosopher Dionysus, I would prefer to be a saryr than saint. I do not set up any new idols, let the old new learn what it means to have legs of clay. “toppling idols (may word for ideals) that is more my kind of handiwork” (P.1)

“ఉదాహరణకు, నేను ఖచ్చితంగా మోసగాడిని కాదు, నైతిక రాక్షసుడిని కాదు – నన్ను ఇప్పటివరకు సద్గుణవంతుడిగా ఆరాధిస్తున్నారు… నేను తత్వవేత్త డయోనిసస్ శిష్యుడిని, నేను సాధువుగా ఉండటం కంటే సారీర్‌గా ఉండటానికి ఇష్టపడతాను. నేను కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయను, పాత, కొత్తవారు మట్టి కాళ్ళు కలిగి ఉండటం అంటే ఏమిటో నేర్చుకోనివ్వండి. “విగ్రహాలను పడగొట్టడం (ఆదర్శాలను సూచించవచ్చు) అది నాచేతిపని” (పేజీ 1).

సరోజాశ్రీ.శ్రీ ఒక రకంగా ఎటువంటి జంకులేకుండా మధ్యతరగతి నైతిక చట్రాలకు అతీతంగా తన అంతరంగిక మూర్తిమత్వాన్ని లేక తన private selfని బాహ్య ప్రపంచానికి expose చేయదల్చుకున్నారు. అందుకే, “నా జీవితంలోని చీకటి కోణాలను వెలిగించబోయే ప్రయత్నమే ఈ రచన” అని ప్రకటించారు. “చీకటికి వెలుతురూ చావుకి బ్రతుకూ కేవలం వ్యతిరేకార్థాలు కావు. ఈ ద్వందాలకి మధ్య అనేకమైన అర్థభేదాలతో అనేక భావాలుంటాయి”.

సరిగ్గా అటువంటి వాటిని అన్వేషించి పట్టుకుని విశ్లేషించే ప్రయత్నం సరోజా శ్రీ.శ్రీ. చేశారు. ఆమె లక్ష్యం తాను జీవిస్తూన్న సమాజాన్ని గురించి రాస్తూనే, తన గురించి, శ్రీ.శ్రీ. గురించి రాశారు. ఇలా రాయటంవల్ల  సమకాలీన సమాజంలో కొనసాగుతున్న అసంబద్ధతను చెప్పారు.  అందువల్ల సమాజం  పరువుతోపాటు తమ పరువుకూడా పోవటం అనివార్యమనే స్పృహలోంచి రాశారు. ఆ భావన వల్లనే ఆమె తన వైయక్తిక విషయాలు కూడా  ఎటువంటి జంకులేకుండా రాసుకున్నారు. ఇందుకు చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే, ఆయనను ఒక మహాకవిగా గుర్తించిన సమాజం ఆయన్నుఒక మహామనిషిగా కూడా చూడాలనుకుంటుంది. అందుకే ఆమె ఆయనను ఒక చట్రంలోకి ఒదిగించటానికి ప్రయత్నించింది. సాహిత్యంలోనే కాదు, జీవితంలోనూ కూడా ఆయన ఎటువంటి చట్రాలను ఆమోదించలేదు.

సరోజా శ్రీశ్రీ అంతే ధైర్యంగా “శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం” ఇది తన జీవితం అన్నారు. ఆ విషయాన్ని గ్రహించటానికి, తన జీవితాన్ని అవిష్కరిస్తూంటే, చదవటానికే కాదు కనీసం వినటానికి పాఠకుల్లో ఒకవర్గం ఇబ్బందిపడింది. అభ్యంతరం చెప్పింది. ఆమె  తన ప్రవర్తనను నైతికంగా సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా  వివాహానికి పూర్వం శ్రీ. శ్రీ. గారితో తనకు శారీరక సంబంధం లేనట్లుగా రాశారు.

కానీ శ్రీ.శ్రీ. తన ఆత్మకథ “అనంతం” నాలుగో అధ్యాయంలో “1958 సంవత్సరం ఆఖరినెలల్లోనో, 1959 మొదటి నెలలోనో నేనూ కుమారి ఉపద్రష్ట సరోజా కలిసి విమానంలో బెంగుళూరు వెళ్లాము. ఉడ్లాండ్స్ హోటల్లో బసచేశాము. నాలుగే నాలుగు రోజులున్నాము. మొదటిరోజు ఒకసారి, రెండోరోజు రెండుసార్లు, మూడవ రోజు మూడుసార్లు, నాలుగవరోజు నాల్గుసార్లు కలుసుకొన్నాము” అని రాశారు.  శ్రీ.శ్రీ. తన ఆత్మకథలో  “సెక్స్ సరదాలు” అని శీర్షిక పెట్టి మరీ ఒక అధ్యాయంగా రాసుకున్నారు. కానీ సరోజగారు వైవాహిక బంధానికి ముందే తనకు (జీవిత భాగస్వామిగా కాబోయే వ్యక్తితో అయినాసరే) శారీరక సంబంధం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. పితృస్వామిక సమాజంలో స్త్రీల లైంగకతను నిర్ణయిస్తున్న నియంత్రణకు లోబడి ఆమె అలా రాసి వుండవచ్చనుకుంటున్నాను. లైంగిక విషయాలలో  స్త్రీలు సామాజిక అనుమతి పొందలేకపోతున్న నేపధ్యంలో అలా రాశారనిపిస్తుంది. ఏదేమైనా పురుషులు చెప్పినంత నిర్భీతితో స్త్రీలు తమ లైంగిక సంబంధాలను చెప్పలేకపోవటం ఆనాటి సమాజంలో అసహజమేమి కాదు. కానీ, తల్లితండ్రులు కుదిర్చిన ఇంజనీరు సంబంధానికి ఆమె తన అంగీకారాన్ని తెలిపానని చెప్పటం వల్ల, అలాగే ఆమె శ్రీ.శ్రీని ప్రేమిస్తున్న విషయం నిశ్చయపరిచారనడం కూడా ఈమె రచనలోని వాస్తవాల అభివ్యక్తీకరణను ఈ విషయంలో సందేహించాల్సి వస్తుంది. ఎందుకంటే, సరోజా శ్రీ.శ్రీ. తన “శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం”లోని నలభై ఆరో అధ్యాయంలో శ్రీ.శ్రీ.  ”ఐ లవ్యూ సరోజా!” అని అనటమే కాక వారిద్దరి మధ్య ప్రేమ ప్రకటన జరిగిన సంధర్భంలో జరిగిన సంభాషణను ఆమె ఇలా రాశారు.

“నీకోసం ఏమైనా చేస్తాను. ఐ లవ్ యూ సరోజా! నాకు నువ్వు కావాలి. నువ్వు నాకే స్వంతం అవ్వాలి. ఇంకెవ్వరికీ కాకూడదు. నువ్వు లేకుండా నేను వుండలేను. మరి నీకెలాగుందో నాకు తెలియాలి” అన్నారు.

“ప్రేమంటే ఏమిటో నాకు తెలియదుకానీ, మిమ్మల్ని చూడకుండా మీరు లేకుండా నేనూ వుండలేనని తెలుసుకున్నాను” అని ఆమె అన్నపుడు…

పిచ్చి సరోజా! దానికి అర్ధం ఏమిటి? నీకు తెలీకుండానే నన్ను ప్రేమిస్తున్నావన్నమాట. ప్రేమంటే అదే. ఒకరినొకరు మనస్ఫూర్తిగా కోరుకోవడమే ప్రేమ….” అని శ్రీ.శ్రీ.గారు ప్రేమ పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించినట్లుగా సరోజా శ్రీ.శ్రీ సృజించారు. కానీ శ్రీ.శ్రీ. తన స్వీయచరిత్ర “అనంతం”లో మాత్రం ఇలా వుంది.

“నాకు అటు అక్కలూ, అన్నలూ లేరు, ఇటు తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేరు. ఒక విధమయిన  ఒంటరితనంలో నా బాల్యమంతా గడిచింది. నేను మాతృప్రేమకీ, సోదరప్రేమకీ దూరంగా బతికేను. అందువల్లనే ప్రేమంటే ఒక అపనమ్మకం నాలో చిన్నప్పటినుంచి వర్థిల్లుతూ వచ్చింది.” (“అనంతం” పే. 13) అని శ్రీ.శ్రీ.  రాశారు.  అలాగే మరొక చోట “పెళ్ళి, ప్రేమ, సెంటిమెంట్లూ ఇట్లాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు”(పే.70) అని ప్రకటించాడు. ఈ అపనమ్మకం ఎంత బలంగా ఉందంటే తనకు పుస్తక నిషేధం ఇష్టంలేక పోయినప్పటికీ “నిషేధం అవసరమైతే కాళిదాసునీ, షేక్స్పీయర్ని నిషేధిస్తే బాగుండేది” అని అనేంతదాకా ప్రేమ పట్ల తనకు గల దృక్పధాన్ని నిర్మొహమాటంగా వెలిబుచ్చడానికి సాహసించారు. ఎందుకంటే, ప్రపంచ ప్రసిద్ధంగా ఈ ఇద్దరు రచయితలు ప్రేమగురించి అత్యంత ఉన్నత స్థాయిలో చిత్రిం చారు. ప్రేమచుట్టూ అల్లబడిన మార్మికతను ఆయన చాలా literal గానే ద్వేషించాడు. అలాగే సెక్స్ కూడా ఒకానొక శారీరక వ్యాసంగంగా మాత్రమే గుర్తించాడు.

మానవ సంబంధాలలోనూ, అధికార ప్రయోగంలోనూ ఒక సాధనంగా భాష ఉపయోగపడే తీరును Foucault లాంటి వాళ్ళను విశ్లేషించారు. Foucault అయితే చాలా లోతుగా తన ‘Discourse of Language’ లో ఈ విషయాల గురించి చాలా చర్చించారు. సామాజిక సంబంధాలలో భాషకున్న ప్రాధాన్యత గురించి, విప్లవోధ్యమాలు భాషను గురించి పట్టించుకోవాల్సిన అవసరాన్ని గురించి శ్రీ.శ్రీకి సామాజిక లేక మార్స్కిస్టు సిద్ధాంత కర్తలకంటే లోతైన అవగాహన వుంది. ఆ విషయం ఈ వాక్యంలో స్పష్టమవుతుంది. 1945లో ‘ఆనంద మందిరం’లో శ్రీ.శ్రీ. ఇలా రాశారు.

“ఏ చండశాసనుడికి లేని శక్తి భాషకు వుంది…. విప్లవం ముందుగా భాషలో రావాలి. భాషను మార్చటానికి భావాలు మార్చాలి”. (పే. 17-18)అన్నారు. ఉదాహరణకి తమిళవాళ్ళని చూడండి. వాళ్ళు భారతీయార్ని ఆకాశంలోకి ఎత్తేశారు. అతనందుకు అర్హుడు కూడా”. అక్కడితోనే వాళ్ళ భాషాభిమానం  అగిపోలేదు. విదేశాల్లో సైతం వాళ్ళ భాషనీ, సంఘాల్నీ విస్తరింపజేసిన విధానాన్నీ, ప్రచారాన్నీ చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్లలో ఆ కలుపుగోలుతనం, పొత్తు అంత గట్టిగా వున్నాయి కాబట్టే వాళ్ళు అనుకున్నది సాధించేంతవరకూ నిద్రపోరని శ్రీ.శ్రీ.గారన్న మాటల్నిఆమె“శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం”లో  నివేదించారు.

తెలుగు భాషా సమాజాలు తెలుగు సాహిత్యాన్ని మరింతగా ఆదరించాల్సిన ఆవశ్యకతను చాలా బలంగా కోరుకున్నారు. అప్పటికప్పుడు ఆసువుగా చెప్పే కవిత్వంలో కూడా తెలుగు వాళ్ళపట్ల, తెలుగు భాషపట్ల తన అభిమానాన్ని కనబరిచిన విషయాన్ని ఎప్పటికప్పుడు ఆమె నమోదు చేసుకోవటం వల్ల కూడా మహాకవిని గురించి అతనితో సన్నిహితంగా మెలగలేనివారికి, సమకాలికులైనప్పటికి తెలియని చాలా విలువైన విషయాలు ఈరచన ద్వారా తెలుస్తాయి. అలాగే శ్రీ.శ్రీ.గారు చేసిన విదేశీ పర్యటనలు, ఆయనకు దక్కిన గౌరవాలు, ఆయనకు గల తెలుగు భాషాభిమానం ఈమె ఆత్మకథ ద్వారానే భోదపడతాయి. ఉదాహరణకు లండన్ పర్యటనలో చెప్పిన ’స్వజాతీయ గీతం’ కవిత అందులో ఒకటి.

“తెలుగువాడి తెలివితేటలకి – జై జై

తెలుగువాడు దేనికైనా – సై సై

తెలుగువారి నెదురువాడు – నై నై

తెలుగునాట కవుల పాట – హై హై

ప్రస్తుతానికి వస్తామరి నేస్తం –బై బై”

శ్రీ.శ్రీ అమెరికా వెళ్ళినపుడు అనేక ప్రాంతాలలో, సంస్థలలో, విశ్వవిద్యాలయాలలో ఎన్నో సభలు సమావేశాలు నిర్వహించినట్లుగా ఆమె తెలిపారు. ఆయనకు తెలుగు భాషపట్ల గల అభిమానాన్ని అనేక సంధర్భాలలో అమెరికాలోని తెలుగు ప్రజలకు గుర్తుచేశారు. “మనం తెలుగువాళ్ళం. తెలుగును యావద్భారత జాతీయ భాషగా చేసుకోవడం అన్ని విధాలా నమంజసమైనదని” ప్రస్తావించారు. శ్రీ.శ్రీ. లాగే జె.బి.యస్. హాల్డే వంటి వైజ్ఞానిక ప్రముఖుడు కూడా ఇదే విషయాన్ని సూచించాడు.

పిల్లలు తెలుగు మాట్లాడ్డం తల్లిదండ్రుల చేతుల్లోనే వుందనీ ఇంట్లోనే  తెలుగు నేర్పించవచ్చు అన్నారు.  ఇంట్లో తెలుగు మాట్లాడితే వాళ్ళకి అదే అలవాటవుతుందనీ,  పిల్లలందరూ తెలుగు మాట్లా డేలా నేర్పండనీ పిలుపునిచ్చారు. తెలుగు వాళ్ళు విదేశాలకు వచ్చినా, తెలుగు ప్రజల ఐకమత్యాన్ని, జాతి అభిమానాన్ని, స్వదేశీయ ప్రేమనీ అర్ధం చేసుకున్నానని తనను ఎంతో ఆదరంతో ఆహ్వానించిన వారికి ఆత్మీయతను పంచాడు. అందుకే తెలుగు కవిగా, తెలుగువాడిగా తన సందేశాన్ని  అందించారు. ఈసంధర్భంలో  శ్రీ.శ్రీ. పడిన తపనను సరోజ’శ్రీ.శ్రీ.  వివరంగా తెలిపారు.

ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ‘శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానాన్ని ‘ రాయటంలో సరోజా శ్రీ.శ్రీ.కి ఒక grand plan ఉంది. అయితే ఆమెలో ఉన్న సంప్రదాయ ఆలోచనలవల్ల అది సాధ్యపడలేదు. ఈ grand planని ఆమె నెరవేర్చలేకపోవటానికి కారణం కేవలం ఆమె మాత్రమేకాదు, మొత్తం మన సామాజిక వ్యవస్థ కారణం. వ్యక్తి అచేతనం మీద కొనసాగిస్తున్న అప్రకటిత నియంత్రణ. ఆ నియంత్రణ గురించిన స్పృహ సరోజాశ్రీ.శ్రీ.లో బలంగావుంది. దాన్ని ధిక్కరించే ప్రయత్నం సరోజా శ్రీ.శ్రీ. కొన్నిసార్లు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో చేయలేకపోయారు.

ఎందుకంటే, ఆమెలో ఈసంశయం చాలా స్పష్టంగా ఆమె మాటల్లోనే వ్యక్తమైంది. “ఉన్నది ఉన్నట్లు చెప్పాలని, జరిగింది జరిగినట్లు రాయాలని నా తపన. అలా చెబితే, అలా రాస్తే సాహిత్యమవుతుందా?” అనే ప్రశ్నలు ఆమెకు ఉన్నాయి. వాటిని అలా ఉంచితే, ప్రస్తుతం మన సమాజం, మన జీవితాలు, మన మర్యాదలు, నీతి నియమాలు ఎంత మాత్రమూ దీన్ని సహించవు సరికదా, ఒక పెద్దగాలి దుమారాల్ని లేవదీస్తాయి. ఈ భయం లేదా సంశయంలోంచి ఆమె తన జీవితాన్ని లేదా తన భావనల్ని, అభిప్రాయాల్ని వ్వక్తీకరించటానికి ఎక్కువ సమయం కేటాయించారనిపిస్తుంది.

“Auto-biographical self or subject is always engaged in going beyond itself into other discourses” ఈ విషయంలో సరోజాశ్రీ.శ్రీ. వెలిబుచ్చిన సందేహాలు అక్షరాల నిజం. ఆత్మకథ అనే వ్యక్తీ కరణ రూపాన్ని ఆమె నిరంతరం నిరాకరిస్తూనే రాశారనిపిస్తుంది.

ఒక రకంగా ఆత్మకథ అనేది ఒక వ్యక్తి జీవితాన్ని చారిత్రక నేపథ్యంలో పునః వ్యాఖ్యానించే ప్రయత్నం చేస్తుంది. ఈ వ్యాఖ్యానంలో సాధారణంగా ఒక క్రమత్వం ఉంది. రచన ఒక narrative గా వెలువడుతూ ఉండడంవల్ల అందులో ఒకానొక క్రమంకూడా అనివార్యంగా ఉంటుంది. ఈ సందర్భంలో Roy Pascal అనే ఆయన అన్న మాటల్ని ఉదాహరించటం అవసరం. ఆయన దృష్టిలో

“ఆత్మకథ జీవితంపై ఒక నమూనాను విధిస్తుంది, దాని నుండి ఒక స్థిరమైన కథను నిర్మిస్తుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలో కొన్ని స్థితులను ఏర్పరుస్తుంది, వాటి మధ్య సంబంధాలను ఏర్పరుస్తుంది. మరియు స్వీయ మరియు బాహ్య ప్రపంచం మధ్య సంబంధం యొక్క నిర్దిష్ట స్థిరత్వాన్ని, అవ్యక్తంగా లేదా స్పష్టంగా నిర్వచిస్తుంది”. (డి-సైన్ & ట్రూత్ ఇన్ ఆటో-బయోగ్రఫీ, రూట్లెడ్జ్ & కెగన్ పాల్, లండన్, 1960, పేజీ.9). “It (autobiography) imposes a pattern on life, constructs out of It a coherent story. it establishes certain states in an individual life, makes links between them, and defines, implicitly or explicitly, a certain consistency of relationship between the self and the outside world”. (De- sign & Truth in Auto-biography, Rutledge & Keg an Paul, London, 1960, p.9).

అయితే సరోజాశ్రీ.శ్రీ. ఈ క్రమాన్ని గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. అందువల్ల  “శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం”లో మనకు లభించే విషయాలన్నీ కేవలం శకలాలుగా మాత్రమే ఉంటాయి. ఆమె జీవితం అనంతకాలంలో జరిగిన ఒక నొక ఘట్టం. దాన్ని విస్తరించి “శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం”గా అనంతం చేశారు. సాధారణంగా గతాన్ని వ్యాఖ్యానించే వ్యక్తి వర్తమానంలోగానీ తన గతంలోగానీ తన జ్ఞానానికన్నా ఎక్కువ జ్ఞానాన్ని కలిగివుంటాడు. కాబట్టి ఆ అధిక జ్ఞానం (superior knowledge) లోంచి గతాన్ని విశ్లేషిస్తాడు. ఆ విశ్లేషణలో అనివార్యంగా లేక సాధారణంగా value judgements ఉంటాయి. సరోజాశ్రీ.శ్రీ ఇందుకు అతీతంగా తన ఆత్మకథను రాయగలిగారు.

ఆత్మకథకు సంబంధించిన ‘living narrative’ writing narrative’గా ఉన్నాయి. సరోజాశ్రీశ్రీ “శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం ”writing narrative ను living narrative’ లాగా రాశారు. అందువల్లనే ఆమె value judgementsకి పాల్పడలేదు. సరోజాశ్రీశ్రీ తన ఆత్మకథను కేవలం గతకాలానికి చెందిన విషయాలమీద రిపోర్టులాగా చూడలేదు. అది వర్తమానంలో రాయబడుతుందన్న స్పృహాలోంచి రాశారు. అందుకే ప్రతి అధ్యయనంలోనూ వర్తమాన సంఘటనలమీద వ్యాఖ్యలు కన్పిస్తాయి.

మన అహం  (self) నుంచి మనం బయట ఉండలేనట్లే కాలం వెలుపలకూడా ఉండలేం. గతానికి మన ప్రయాణంలో వాహిక జ్ఞాపకమే. ఈ జ్ఞాపకం (memory)  అనివార్యంగా వర్తమానాన్ని సూచిస్తుంది. అందువల్ల మనం గుర్తు చేసుకుని చెప్పేగతం ఇప్పటి తమ అనుభవంలోంచి చూసి చెప్పేది తప్ప అప్పటి యదార్థం. ఈ పునర్నిర్మాణం మన వర్తమాన చైతన్యంలోంచి జరుగుతుందనే స్పృహ గతం కాదు. అంటే సారాంశంలో మనం గతాన్ని పునర్నిర్మిస్తున్నామని అర్థం. ఈ స్పృహ రచయితలకు ఉన్నప్పుడు వాళ్ళు పునర్నిర్మిస్తున్న గతంపట్ల రచయితల contempt ఉండదు. సరిగ్గా గతంపట్ల contempt లేనితనమే మనకు సరోజాశ్రీశ్రీ ఆత్మకథలో కన్పిస్తుంది.

సరోజా శ్రీ.శ్రీ. రూసోలాగా “I must leave nothing unsaid” అనుకుని తన ఆత్మకథను ప్రారంభించారు. తన ఆలోచనలను, పనులను confessచేసే ప్రయత్నం చేశారు. వీలున్నంత పార దర్శకంగా తన భావాల్ని, అభిప్రాయాలను వెలిబుచ్చే ప్రయత్నం చేశారు. రూసో తన ఆత్మకథ confession లో ఇలా చెప్పుకున్నాడు.

“Throughout the course of my life, as has been seen, my heart has been transparent as crystal” (Confessions. Harmonds worth, Penguin, 1953, p.415) సరోజా శ్రీ.శ్రీ. కూడా రూసో లాగా ఇంతే స్పష్టంగా ఉండేందుకు ప్రయత్నించారు.

శ్రీ.శ్రీ. మూర్తిమత్వాన్ని (Personality) ఆయన రచనల్లోంచి చూస్తే అది నిరంతరం కొత్తని, ప్రయోగత్వాన్ని కోరుకుంటూ రావటం కన్పిస్తుంది. ఒక సాహిత్యానికి మాత్రమే పరిమితమై చూస్తే అభ్యుదయ రచనాకాలం నుంచి వచ్చిన ప్రతి సినిమా అవకాశాన్ని ఆమె సమర్థించుకుంటూ రావటమేకాక, కొత్తగా ముందుకు వచ్చే ప్రతిసన్నివేశాన్ని, సాహిత్య ప్రయోగాల్ని ఆమె తెరవెనుక వుండి సమర్థించటమేకాక, అంతకు ముందువాటి మీద విమర్శ పెట్టటానికి కూడా జంకలేదు.

అన్నింటిలో మారుతూ వచ్చిన శ్రీ.శ్రీ. మార్కిృజం విషయంలో, నాస్తికత్వం విషయంలో ఆమె ప్రభావంలో ఎటువంటి మార్పుకు గురికాలేదు. “ఒక్క ‘మార్క్సిజం’ మాత్రమే మనిషిని మనిషిగా గుర్తిస్తుంది. మనిషిగా బ్రతకటం ఎలాగో చూపుతుంది” (పే.80) అని నిర్దిష్టంగా ఆయన తన ఆత్మకథలో ప్రకటించిన విషయాన్ని “శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం”  రుజువు చేస్తుంది.

“మీరెన్నైనా చెప్పండి. శ్రీశ్రీ కవిత్వాన్ని కూడా అమ్ముకునే దౌర్భాగ్య స్థితి ఇంకా పోలేదు. దానిమీద ఎంత చులకన చూపో. ఇంకా చెప్పాలంటే…” అని పురిపండావారంటుంటే, శ్రీ.శ్రీ. ప్రతిస్పందించిన తీరును సరోజాశ్రీశ్రీ ఇలా “శ్రీ.శ్రీ. సంసార ప్రస్థానం” లో రికార్డ్ చేశారు.

“అలా అనకండి అప్పలస్వామిగారు. అది కేవలం వాళ్ళ వాళ్ళ మనస్తత్నాల మీద ఆధారపడి వుంటుంది”. కవిత్వం అన్నది ఏదో ఆ రాత్రికి తెచ్చుకున్న స్త్రీగానీ, ఉంచుకున్న వాడి ఊర్వశి గానీ కాదు’ నేను మాత్రం నా కవిత్వాన్ని చేసుకున్న భార్యగాగానీ, ఉంచుకున్న స్త్రీగాగానీ కాకుండా నన్ను కన్నతల్లిగానే ఎప్పుడూ భావించానని శ్రీ.శ్రీ. కవిత్వం పట్ల వ్యక్తం చేసిన  అభిప్రాయాలను, శ్రీ,శ్రీ. పట్ల కొంతమంది కవులకు, సాహిత్యకారులకు వున్న దురభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేశారు.

“ఆత్మకథలో ప్రధానంగా వైయక్తిక రచనలు (Subjective writing) ఇవి రచయితకు సామర్థ్యం కొరవడినప్పుడు, లేక వాస్తవాలు చెప్పటం ఇష్టంలేనప్పుడు ఆ రచయిత ఇచ్చే సమాచారం తప్పుదారి పట్టించేటట్లుగా ఉంటుంది. సరోజాశ్రీ.శ్రీ. చెప్పిన విషయాలను లేక వాస్తవాలను ఎటువంటి సంక్షోభాలు లేకుండా చెప్పగలిగే ధైర్యముంది. ఫలితంగా ఈలక్షణం ఆమె ఆత్మకథకు ఆధికారికత(authenticity)ను తెచ్చిపెట్టినాయి.

సాధారణంగా గతానికి సంబంధించిన ఒక వాస్తవిక సంఘటనను మనం వర్తమానానికి నివేదించేటప్పుడు, రచయిత  దృష్టంతా విషయాలన్నింటిని అనివార్యంగా ఎలా చెప్పటం, ఏ శైలిలో చెప్పటం అనే అంశాల మీదకు మరలుతుంది. ఫలితంగా రచయిత దృష్టి శైలిమీద ఎక్కువగా కేంద్రీకృతం అవుతుంది. అప్పుడు మనం చెప్పబోతున్న అంశంలో ఉండే సత్యం కొంతవరకు బలహీనపడుతుంది. ఈ విషయంలో సరోజా శ్రీ.శ్రీ. నివేదన (report) చాలావరకు అతీతం. ఎందుకంటే ఆమె చెప్పదల్చుకున్న విషయాలను చాలా అలవోకగా చెప్పారు తప్ప, చెక్కిన శైలిలో చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. ఆ విషయం అర్థంకావటానికి మనమేమి లోతుల్లోకి వెళ్ళి ఆమె ఆత్మకథను పరిశీలించనక్కరలేదు. కేవలం ఈ వాచకంలో పునరుక్తి అయిన విషయాలు చూస్తే తెలుస్తుంది. ఆమె ఎంత casual గా తన జీవిత చరిత్ర రాశారో, అంతగా(456 పుటలు)రాసిన ఆమె రచనలో కూడా మనకు ఎక్కడా ‘అసంపూర్ణత(factual imperfection) ఉన్నట్లు అన్పించదు.

సరోజా శ్రీ.శ్రీ.లో మనకు కనిపించే లేక మనకు నచ్చే అంశాలలో ఒకటి, ఆమె ధిక్కారగుణం. ఈ గుణమే ఆమెను సొంత వ్యక్తిత్వంతో తెలుగు సమాజానికి పరిచయం చేసేటట్లు చేసింది. అలాగే ఆమె ప్రయోగ’పరత్వం కూడా.

స్త్రీలలోని వేగాన్నీ(దూకుడుతత్వాన్ని), చొరవను సహించలేనితనం ఎంత గొప్ప రచయితలలో అయినా ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఇలాంటి  సంఘటనే సరోజా శ్రీ.శ్రీ. జీవితంలో కూడా తారాసపడటం యాధృచ్ఛికం కాదు. శ్రీ.శ్రీ., సరోజా శ్రీ.శ్రీ., పురిపండా అప్పలస్వామి ముగ్గురు అమెరికా వెళుతున్న సంధర్భంలో నెలకొన్న అనిశ్చిత స్థితినుండి తప్పించే క్రమంలో, ఆమె నుద్దేశించి “నువ్వెందుకమ్మాయి మధ్యలో వచ్చి మాట్లాడుతావు. శ్రీశ్రీ మాట్లాడుతున్నాడుగా. అతనికన్నా నీకెక్కువ తెలుసా ఏం? అయినా ఆడవాళ్ళకి అన్ని చోట్లా అధిక ప్రసంగం పనికిరాదేమో”(పే.310) అని పురిపండా అప్పలస్వామి గారన్నారు. వెంటనే ఆమె ఇలా సమాధానమిచ్చారు.

“అన్నిచోట్లా పనికిరాదు కానీ, కొన్ని కొన్ని చోట్ల వాళ్ల ఇంటర్ ఫియరెన్స్ మేలు చేస్తుంది. కానీ కీడు చెయ్యదు”. (పే.310 ). మూడు గంటల క్రితం అమెరికా విమానాశ్రయంలో అడుగుపెట్టినా,  లోపలున్న వాళ్ళని బైటకి వెళ్ళనివ్వరు. బైటవాళ్ళని లోనికి రానివ్వరు. ఇలా మనం వాళ్ళతో అర్థం లేకుండా వాదిస్తూ కూర్చుంటే నిజంగానే రాత్రికి తిరుగుప్రయాణం తప్పదని వాదిస్తుంది.

చివరి ప్రయత్నంగా, జి.కృష్ణమూర్తి విమానాశ్రయం బయట వీళ్ళకోసం వెయిట్ చేస్తుంటారనీ, కౌంటర్ దగ్గరకెళ్ళి, కృష్ణమూర్తిగారి కోసం ఎదురుచూస్తున్నామని అనౌన్స్ చెయ్యమని ఆమె  శ్రీ.శ్రీ.గారితో చెబుతుంది.

శ్రీ.శ్రీ. ఆమె చెప్పినట్లుగా చెప్పినా విమానాశ్రయ సిబ్బంది అంగీకరించరు. కానీ వెంటనే ఆమె రంగంలోకి దిగుతుంది. మిత్రులు బయట వెయిట్చేస్తుంటారనీ, వారిని పిలిపిస్తే, మీ సందేహాలన్నీ వారు తీరుస్తారనీ, వారి ఆహ్వానంతోనే ఇక్కడికి రావడం జరిగిందనీ, అప్పటికీ  సంతృప్తి చెందని పక్షంలో వెనక్కి వెళ్ళిపోతామని విమానాశ్రయ అధికారులను అభ్యర్తిస్తుంది.

ఆమెవివరణ, అభ్యర్థనలను వాళ్ళు అంగీకరించారు. జి.కృష్ణమూర్తి కూడా చాలా మంచిపని చేశారని ఆమెను అభినందిస్తారు. ఆమె చొరవకు, చురుకుదనానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆమె చొరవతో శ్రీ.శ్రీ.గారు అమెరికా వెళ్ళాలన్న కోరిక తీరడమే కాకుండా, ఆరునెలలపాటు అమెరికాలో వుండగలిగారు. అంతే కాకుండా ”మహాప్రస్థానం’ వ్రాతపతిని, ’సిప్రాలి” కావ్యాలను రాశారు. శ్రీ.శ్రీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా పెద్దమొత్తంలో సంభాషణలు, పాటలు రాయగలిగారనటంలోగానీ, ప్రొడ్యూసర్స్ దగ్గరనుండి డబ్బు వసూలు చేయడంలోగానీ సరోజా శ్రీ.శ్రీ. పాత్ర వుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

సమాజంలో స్త్రీల నైపుణ్యాల పట్ల, చొరవపట్ల విప్లవ భావాలు గల రచయితల పరిగ్నానం, అవగాహనా మామూలు వ్యక్తుల కంటే భిన్నమైంది కాదని అర్థమవుతుంది. అదలా వుంచితే, స్త్రీల చొరవ అన్నిచోట్లా పనికిరాదని ఆమె అంగీకరించడంలో స్త్రీల చొరవ, సామర్థ్యాలను సమర్థించడంలో ఈమె కూడా పురుషస్వామ్య తత్వం నుండి బయటపడలేదేమోననిపిస్తుంది.

వ్యక్తుల్లో స్వభావాల వైరుధ్యాలు ఉండటం అసాధారణమేమీ కాదు. అయితే తెలుగు సమాజం శ్రీ.శ్రీ. కవిత్వాన్ని ప్రేమించినంతగా ఆయన్ను కూడా ప్రేమించాలనుకుంది. అయితే వైరుధ్యపూరితమయిన ఆయన జీవితం వాళ్ళను అనుమతించలేదు. అందుకని ఆయనను కొంతమంది నిందించారు. ఆ నిందలను తట్టుకుని నిలబడగలిగే తాత్వికబలం భార్యగా ఆమెకుగానీ శ్రీ.శ్రీగారికిగానీ లేదు. ఆమె జీవితంలో ఉద్వేగం పాళ్ళు ఎక్కువ. ఆ ఉద్వేగంలోంచి కొంతమంది  విమర్శకుల మీద ‘అడ్డగోలుగా’ కామెంట్స్ చేశారు.

ఈ విషయంలో గొప్ప ఆర్టిస్టు బ్రాక్ (Braque), అంతకన్నా గొప్ప ఆర్టిస్టు పికాసో (Picasso) ఇద్దరిమాటా కాదనలేం. అయినా నియమోల్లంఘనం అంటే ఏమిటో కొద్దోగొప్పో తెలిసిన వాళ్ళకే మనిపిస్తుందంటే, నిజమైన కళాకారుని నియమ ధిక్కారంలోనే ఒకానొక ‘సవరించే నియమానికి’ కట్టుబడి ఉండటమనిపిస్తుంది.

తన ఆత్మకథ రాస్తున్న తీరుపై ఆమె ఇచ్చుకున్న సమర్ధనలు, ఉదాహరణకు “ఈ స్వీయ చరిత్ర నా సొంత సంతోషంకోసం రాయలేదు. ఎలా రాయాలనుకున్నానో అలా రాస్తున్నందుకు ఒక సంతృప్తి పొందుతున్నాను” అన్న మాటలు కూడా కన్విన్సింగ్(convincing) గా ఉండవు. అలాగే ఆత్మకథలో ఒక సరళరేఖగా కాలక్రమాన్ని పాటించక పోవటమన్నది బుద్ధిపూర్వకంగా చేస్తున్నానని, అదొక కొత్త ప్రయోగమని, అది ‘మాంటేజస్’ ఫ్లాష్ బ్యాక్ లకు అలవాటుపడ్డ వాళ్ళకు ఇబ్బందిగా ఉండదని చెప్పటం కూడా సమంజసం కాదు. కానీ నిజానికి తన ఆత్మకథ రాయటం ప్రారంభించినప్పుడుగానీ, కొనసాగి స్తున్నప్పుడుగానీ అమె తనకు వచ్చిన ఆలోచనల్ని అలా అలవోకగా రాసుకుంటూపోయారు.

ఆమె వ్యక్తిగత జీవితంలోగానీ, సినీరంగంలోగానీ  ఎదురుదెబ్బలు తగిలినప్పుడు అడ్డం తిరిగి మాట్లాడారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేయటం అనేది శ్రీ.శ్రీ.గారి మూర్తిమత్వం(Personality)లో లేదని ఆమె ఆత్మకథలోని ప్రతి పుట చెపుతుంది. అలాంటి వ్యక్తితో జీవిస్తున్నపుడు, అలాగే అతని గురించి రాస్తున్నపుడు   ప్రణాళికాబద్ధమైన  క్రమాన్ని ఆశించటం అర్థరహితం. ఆమె జీవితాన్ని తన సమకాలీను లతో పోల్చి చూసినప్పుడు కొంత సంఘటనాత్మకం(eventful)గానే కన్పిస్తుంది.

ఈ సంఘటనల(events)ను క్రమానుగతంగా చెప్పేపని ఆమె చెయ్యలేదు. ఆమెకు అలాంటి ఆలోచనకూడా లేదు. తన ఆత్మకథలో చాలా భాగాలు బయటవాళ్ళ ఒత్తిడివల్ల, ఇతరుల దృష్టిలో తన ఇమేజ్ కు భంగం వాటిల్లకుండా, చాలా జాగ్రత్తగా కూడా రాసినట్లు తెలుస్తుంది. అందువల్ల కూడా “శ్రీ.శ్రీ. సంసార ప్రస్థానం”  ఎక్కువభాగం శకలాలుగా ఉండటం జరిగింది. ఈ శకలాల మధ్య సమగ్రతను చూడడం అనవసరం. అసాధ్యం కూడా. అయితే ఆశకలాలలోనే ఆమె తన ఆత్మకథలో అనేక నిర్మాణాలు చూడొచ్చు. వాటిని వినిర్మించే పనికూడా ఆమే చేశారు. చివరిగా పుస్తకం చదవటం ముగించిన తరువాత పాఠకులు ఈ క్రింది వాక్యాలతో ఏకీభవించటం నిజం.

“I have resolved on an enter prise which has no precedent, and which, once complete, will have no imitator”

“శ్రీ.శ్రీ. సంసార ప్రస్థానం” గురించి ఒక్కటి మాత్రం చెప్పగలం. “శ్రీ.శ్రీ. సంసార ప్రస్థానం” లాంటి రచన తెలుగులో ఇంతకు ముందు లేదు.

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.