
ప్రమద
భారతసంగీతసామ్రాజ్ఞి- ఆశాభోంస్లే
-నీరజ వింజామరం
“దమ్మారోదమ్.. . .. మిట్ జాయే గమ్ ”అనితరతరాలుగా యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్న స్వరం,
“యే మేరా దిల్యార్ కా దీవానా”అనిహృదయాలను కవ్వించే స్వరం,
“మేరా కుచ్ సామాన్తుమ్హారే పాస్ పడా హై ”అని గుండె తలుపులను తట్టిన స్వరం,
“తోరామన్ దర్పణ్కహలాయే ”అని మనను అంతర్ముఖులను చేసే శాంతమైన స్వరం
“దిల్ చీజ్ క్యా హైఆప్ మేరీ జాన్ లీజియే”అంటూ తనతో పాటు గజల్ ప్రపంచంలోకి మన మనసులను తీసికెళ్లిపోయే స్వరం ఒక్కరిదే అంటే ఆశ్చర్యపోనవసరంలేనంత పరిచితురాలు మన ఆశా భోంస్లే.
కోట్ల మంది శ్రోతలను తన గానవాహినిలో ఓలలాడించిన ఆశా గొంతు 12 ఏప్రిల్ 2026 న శాశ్వతంగా మూగబోయింది.
ఆ సంగీతసామ్రాజ్ఞికి “ప్రమద” హృదయ పూర్వక నివాళులర్పిస్తోంది.
ఆశాభోంస్లే 1933వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు. ఆమె అసలు పేరు ఆశామంగేష్కర్. ఆమె తండ్రి పండిత్దీనానాథ్మంగేష్కర్, ఒక ప్రసిద్ధ మరాఠీ గాయకుడు మరియు నటుడు. తల్లిపేరు శేవంతి. ఆమె ఇంటి వాతావరణంలో సంగీతం పరిమళించింది.
ఆమె పెద్దక్క లతామంగేష్కర్, ‘స్వరకోకిల’ గాపేరొందిన మహాగాయని. ఇంకో అక్క ప్రసిద్ధ గాయనీ ,ఉషామంగేష్కర్. ప్రముఖ సంగీతకారుడు హృదయనాథ్మంగేష్కర్ఆమె సోదరుడు. ఆ కుటుంబంలో రాగం, తాళం, స్వరం తప్ప మరేమాట వినిపించేది కాదు. తండ్రి మంగేష్కర్గారు ఈ పిల్లలందరికీ చిన్నప్పటినుండే సంగీతం నేర్పించారు.
కానీ విధి ఆ కుటుంబాన్నిచిన్న చూపు చూసింది. ఆశా కేవలం తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు వారి తండ్రి హఠాత్తుగా మరణించారు. కుటుంబాన్నిపోషించడానికి లతామంగేష్కర్ మరియు ఆశాభోంస్లే సినిమాలలో పాడటం మొదలుపెట్టారు.
ఆశాభోంస్లే పాఠశాల విద్య అంతంత మాత్రమే. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తండ్రి అకాలమరణం — ఇవి ఆమె సాధారణ విద్యకు అవరోధాలు కల్పించాయి. అయినా ఆమె సంగీతవిద్యను తండ్రి నుండి మరియు ఇతర గురువుల నుండి పూర్తిగా అభ్యసించారు. జీవితమే ఆమెకు గురువైంది. ప్రతిపాటలో ఒక నూతన అనుభవాన్ని, ప్రతి రాగంలో కొత్త జ్ఞానాన్ని సంపాదించుకున్నారు.
ఆశాభోంస్లే తన తొలిపాటను 1943లో పాడారు. మరాఠీచిత్రం ‘మాఝాబాల్’ కోసం ఆమె మొట్టమొదటిసారి మైక్ముందు నిలబడ్డారు. అప్పుడు ఆమె వయసు కేవలం పది సంవత్సరాలు. హిందీ సినిమాలలో ఆమె తొలిపాట 1948 సంవత్సరంలో ‘చునరియా’ చిత్రంలో వచ్చింది.
మొదట్లో ఆమెకు అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. అప్పటికే అక్క లతామంగేష్కర్అగ్రస్థానంలో ఉన్నారు. ఆశాకు కేవలం ‘బి’ మరియు ‘సి’ గ్రేడ్సినిమాలు మాత్రమే దొరికేవి. అయినా ఆమె నిరాశ పడలేదు. ప్రతిపాటకు ప్రాణం పోశారు. నెమ్మదిగా ఆమె గొంతు సినీ ప్రపంచానికి పరిచయమైంది.
ఆశాభోంస్లే జీవితం 1949వ సంవత్సరంలో చాలా ముఖ్యమైన మలుపు తిరిగింది .కేవలం 16 సంవత్సరాల వయసులో ఆమె గణపత్రావ్భోంస్లేను పెళ్ళి చేసుకున్నారు. ఈ వివాహం కుటుంబ సమ్మతి లేకుండా జరిగింది. లతామంగేష్కర్ ఈ పెళ్ళికి అభ్యంతరం తెలిపారు. కానీ ఆశా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.
ఆమెకు ముగ్గురు పిల్లలుకలిగారు- హేమంత్, వర్షమరియు అనీస్. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వివాహం విఫలమైంది. ఆమె తన పిల్లలతో వేరుగా ఉన్నారు. ఆ కష్టమైన కాలంలో ఆమె కేవలం పాటలనే ఆలంబనగా చేసుకున్నారు.
ఆశాభోంస్లే స్వరం ఒక అద్భుతమైన వరం. ఆమె గొంతు శాస్త్రీయ సంగీతం నుండి జాజ్వరకు, భజనల నుండి ఖవ్వాలీ వరకు, లలితగీతాల నుండి రాక్మ్యూజిక్వరకు అన్ని ప్రక్రియలలో అవలీలగా మెరిసింది.
ఆమె పాటపాడేటప్పుడు ఆ పాత్రలో ఒదిగిపోయే విధానం అనన్యసామాన్యం. వాంప్ పాత్రలకు, హాస్య పాత్రలకు, విషాద పాత్రలకు — అన్నింటికీ ఆమె గొంతు సరిగ్గా అమిరేది. ఈ బహుముఖ ప్రతిభే ఆమెను అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టింది.
నేటికీ కొత్త తరం గాయకులు ఆమె స్వరాన్ని ‘మిలేనియల్ఆర్ట్’ గా కొనియాడుతున్నారు. ఆమె ఒక్కోపాట ఒక్కో ప్రపంచం. ఆ ప్రపంచం లోప్రవేశించిన శ్రోత మళ్ళీ బయటికి రాలేడు.
ఆమె 1950ల నుండి 2000ల వరకు అర్థశతాబ్దానికి పైగా భారతీయ సంగీత ప్రపంచంలో రాజ్యమేలారు.
ఓపినయ్యర్, సచిన్దేవ్బర్మన్, రాహుల్దేవ్బర్మన్లాంటి దిగ్గజాల సంగీత దర్శకత్వంలో ఆమె గాత్రం అద్భుతమైన పాటలను సృష్టించింది. ‘పియాతూఅబ్తోఆజా’, ‘దమ్మారోదమ్’, ‘యేమేరాదిల్’, ‘చురాలియాహైతుమ్నే’ వంటి పాటలు ఆ కాలం యువతరాన్ని ఉర్రూతలూగించాయి.
హిందీ, మరాఠీ, బెంగాలీ, తమిళ, గుజరాతీ, పంజాబీ సహా అనేక భాషలలో ఆమె 20,000కు పైగా పాటలు పాడింది. తెలుగు సినీ అభిమానులకు కూడా ఆమె గొంతు పరిచితమే.‘చందమామ’ సినిమా లోని “నాలో ఊహలకు .. .. నాలో ఊసులకు నడకలు నేర్పావు” అనే సూపర్ హిట్ పాట పాడింది ఆశానే.
1980లలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్తో ఆమె స్నేహం అభివృద్ధి చెందింది. ఆ తరువాత ఆమెఆర్.డి. బర్మన్ను వివాహం చేసుకున్నారు. వీరు ఒక అద్భుతమైన సంగీతజంట. కానీ 1994లో ఆర్.డి. బర్మన్మరణించారు. ఆ బాధను ఆమె చాలా కాలం మర్చిపోలేక పోయారు.
ఎప్పటి లాగానే పాటలే ఆమె గాయానికి మందయ్యాయి. ‘రంగీలా’ (1995) చిత్రంలో ఆమె పాటలు యువతరాన్నిమళ్ళీ ఆకర్షించాయి. ‘తన్హాతన్హాజహా మే జీనా ‘, ‘యాయిరే .. .. ..యాయిరే’ పాటలు చాలా హిట్అయ్యాయి. ఆ చిత్రానికి ఆమెఫిల్మ్ఫేర్అవార్డు అందుకున్నారు.
ఆశాభోంస్లేను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు వరించాయి.
భారతప్రభుత్వం 2000వ సంవత్సరంలో ఆమెకు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ఫాల్కే అవార్డును ప్రదానంచేసింది.
2008వ సంవత్సరంలో ఆశకు భారత్లో రెండవ అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్అవార్డు లభించింది .
ఆమె ఫిల్మ్ఫేర్లైఫ్టైమ్అచీవ్మెంట్అవార్డు మరియు ఏడు ఫిల్మ్ఫేర్అవార్డులు అందుకున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహారాష్ట్రభూషణ్’ పురస్కారంతో సత్కరించింది.
2009వ సంవత్సరంలో గిన్నిస్వరల్డ్రికార్డ్స్ఆమెను ‘అత్యధికపాటలు రికార్డ్చేసిన సంగీతకారిణి’ గా గుర్తించింది. స్క్రీన్అవార్డ్స్, జీసినీ అవార్డ్స్లాంటి అనేక అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు.
ఆశాభోంస్లే జీవితంలో అనేక ఆసక్తికరమైన ఘట్టాలు ఉన్నాయి.
ఆమె వంటచేయడంలో కూడా నిపుణురాలు. ముంబైలో ‘ఆశా’ స్రెస్టారెంట్పేరిట హోటల్కూడా నడిపారు. అక్కడ ఆమె స్వయంగా వంటచేసి వడ్డించేవారట.
బాయ్జార్జ్, మైఖేల్స్టోనీ వంటి అంతర్జాతీయ కళాకారులతో కలిసి ఆమె ఆల్బమ్స్విడుదల చేశారు. ‘ఆలోచన’ అనే ఆల్బమ్ద్వారా ఆమె ప్రపంచ సంగీత వేదికపై నిలిచారు.
ఆశాభోంస్లే స్వభావం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆమె మాట నేరుగా, నిజాయితీగా ఉంటుంది. ఆమె ఏ విషయంలోనూ మొహమాట పడరు. తనకు నచ్చినది చెప్తారు, నచ్చనిది చెప్పరు.
ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఆమె ‘నేను ఎప్పుడూ నా అక్క లత దీదీతో పోటీ పడలేదు. మేమిద్దరం వేర్వేరు దారుల్లో ప్రయాణించాం. ‘ అని చెప్పారు. ఈ మాటలు ఆమె వ్యక్తిత్వాన్ని చాటుతాయి.
ఆశాభోంస్లే కేవలం ఒక గాయని మాత్రమే కాదు — ఆమె ఒక జీవనదర్పణం. తండ్రిని పోగొట్టుకున్న చిన్నారి నుండి, కష్టాలు అనుభవించిన తల్లి నుండి, ప్రేమను పోగొట్టుకున్న భార్య నుండి, చివరకు భారత సంగీతసామ్రాజ్ఞి వరకు ఆమె ప్రయాణం అసమానమైనది. ఆమె గొంతు వేలకోట్ల సంగీత ప్రియుల హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
ఆమె చివరి పాట “చల్ మేరే మాఝి” , గొరిల్లాస్అనే బాండ్ కోసం పాడింది. ఆ పాటలో పాడినట్టు సుఖదుఖాలు, జయాపజయాలు లేని ఆవలి తీరంలో ఆమె సేదదీరాలనికోరుకుందాం .
*****

నీరజ వింజామరం సెయింట్ పీటర్స్ ప్రభుత్వ ప్రాథమిక స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాను. పాటలు వినడం పుస్తకాలు చదవడం నా హాబీలు . పిల్లలంటే చాలా ఇష్టం . వంటింట్లో ప్రయోగాలు చేస్తుంటాను .
