కనక నారాయణీయం -81

పుట్టపర్తి నాగపద్మిని

కనకమ్మ వంటింట్లోకి వెళ్ళి ఒక లోటాలో మజ్జిగ తీసుకుని వచ్చి, మునిరెడ్డికిచ్చింది.

తలకు చుట్టుకుని వున్న టవల్ చేతుల్లో పట్టుకుని, ఆ గ్లాస్ అందుకున్నాడు మునిరెడ్డి భక్తిగా!

పుట్టపర్తి టేబుల్ మీద బీడీ కట్టలోనుంచీ, ఒక బీడీ తీసుకుని జేబులో ఉన్న అగ్గిపెట్టె లోంచీ ఒక    పుల్ల తీసి దానితో ముట్టించుకున్నారు.

సాపాటు ముందీ బీడీ ఎందుకని అడగలేకపోయింది కనకమ్మ.

ఇంకేమున్నాయి సంగతులు? నీ భారత పఠనం ఎంతవరకూ వచ్చిందిరా?’

‘మాదేముందయ్యా! వానాకాలం చదువులే కదా! అసలు తీరికగా చదువుకునే యోగ్యతే లేదయ్యా!  ఎప్పుడూ పొలం చింతే! పొలం పని మొదలు పెట్టిన నిమిషం నుంచే, వానలెప్పుడొస్తాయో అని

చింత! వానలొస్తే అవెట్లా కురుస్తాయో..కుంభ వృష్టో లేదా సరీ సరిపోక వచ్చినట్టాశ పెట్టి ఉడాయించేదో తెలీదు. ఇంక పండినా,  దాన్ని కాపాడుకోవడం, అమ్మడం – అన్నీ సమస్యలే స్వామీ! మా

వితాలే మహాభారత కథ అనుకోండి!’

మునిరెడ్డి మాటలకు పుట్టపర్తి దంపతుల మనసుల్లో వేదన మొదలైంది. కానీ ఎవరి వ్యవసాయం వారిది మరి! వాటిలోని సాధక బాధకాలకు తట్టుకునే మనోధైర్యం, స్థిరత్వమూ కావాలని, ఆ పైవాడికి

విన్నవించుకుంటూ ముందుకు అడుగులు వేయాలంతే!

పుట్టపర్తి అన్నారు, ‘భారతంలో లేని విషయాలే లేవంటారందుకే! స్వయం కృతం కొంత! సంచిత కర్మల ఫలం కొంత! ఈ జన్మలోనైనా ఏదో కొంతైనా మంచి చేస్తే, మరుజన్మకైనా తెరిపి వస్తుందన్న

ఆశ! ఇదేరా! అందరి జీవితాలూ అంతే! ఈ నమ్మకమే లేకపోతే మనకింక దిక్కేది? ఆ విశ్వాసమే భగవత్స్వరూపం!’

మునిరెడ్డి దంపతులిద్దరికీ సాష్టాంగ ప్రణామం చేసి, సెలవుతీసుకున్నాడు.

***

‘నాగా! ఓ నాగా! ఇదుగో యీ రాధమ్మను పట్టుకో! నేను ఊరగాయకు కాయలు కొట్టుకోవాలమ్మా!’

నాగ చేతికి రాధనిచ్చి, వెళ్ళిపోయింది గుడిపాటవ్వ.

రాధను చంకలో ఎత్తుకుని, నాగ అమ్మదగ్గరికి పోయింది.

‘అమ్మా! గుడిపాటవ్వ ఊరగాయ పెట్టుకుంటుందంటమామిడికాయలు కొట్టించుకోవడానికి పోతూందంట! మరి నువ్వెప్పుడు పెడతావ్? చిట్టి వాళ్ళింట్లో వారం రోజులకిందటే పెట్టేసినారు. ఆ పిల్ల

రోజూ మధ్యాహ్నం భోజనం లో ఊరగాయ వేసుకునే తింటూ ఉందంట! రోజూ చెబుతూనే ఉంది.’

కనకమ్మ అంది..’రేపో మాపో పెడదాం లే!’

ఆ విధంగా అన్నదే కానీ, ఎంతలేదన్నా ఓ యాభై కాయలు ఊరగాయకు పెట్టవలసిందేవాటికి ఉప్పూఆవపిండీ, కారం, నూనే.. వాటికి జాడీలు! పోయినసారివి విరిగిపోయినాయి మరి! ఇవన్నీ

కలిస్తే రెండు మూడు నూర్ల ఖర్చు! ఇప్పుడెక్కడినుంచీ తేవాలబ్బా?  ఈయనేదో ఊరికి పోయినారు. రేపో మర్నాడో వస్తారేమో!’ ఆమె ఆలోచనలిట్లా సాగుతున్నాయి.

నాగతో అందామె, ‘నాగా, మీ అయ్య ఊర్లో లేరు కదా! రేపొస్తూనే నువ్వే అడుగు మీ అయ్యను! మా చిట్టీవాళ్ళింట్లో ఊరగాయ పెట్టేసినారయ్యామనమూ పెట్టుకుందాం. అని!’

ఆ మాట వినగానే నాగ గుండెమీద చేతులు వేసుకుని, ‘అమ్మో! అయ్యను నేనడగాలా?’ అని భయంగా ముహం పెట్టింది.

ఇంతలో మళ్ళీ గుడిపాటవ్వ ఇంట్లోకి వచ్చింది.

ఇదుగో కనకమ్మానువ్వూ పెట్టుకోవాల కదా ఊరగాయ! నీకూ యాభై కాయలు కొట్టించేదా?’

నాగ ఆనందంగా అమ్మ వైపు చూసింది.

ఇప్పుడే వద్దులేవ్వా! కొన్ని రోజులు పోనీ!’

అదేంది? ఇంకా కొన్ని రోజులు పోతే కాయల్లో తడి చేరుతుందంట! మా రుక్మిణమ్మ చెప్పింది.’

‘మరి…’

డబ్బుదేముందిమళ్ళీనైనా ఇవ్వొచ్చు. కాయలు మంచివి చూసి కొట్టించుకోని వస్తాను. ఇద్దరమూ కలిసి పెట్టుకుందాం.’

తలపైన ముసుగు సవరించుకుంటూ వెళ్ళిపోయిందామె!

బాల్యవివాహమామెదిపెళ్ళైన కొన్ని సంవత్సరాలకే   యే ముద్దూ ముచ్చటా తీరకుండానే, పసుపూ కుంకుమకు దూరమైంది.  పిల్లా పీచూ లేరు.  భర్త నుండీ వచ్చిన యీ ఇంటి ఓ మూలలో

తానుంటుంది.  కొంచెం పొలమూ ఉన్నట్టుంది.  తాముంటున్న కొంచెం పెద్ద పోర్షన్ కు వచ్చే అద్దెమీదే   జీవితం. దగ్గరి బంధువుల పిల్లాడిని దత్తత తీసుకుంది, కడపకు దగ్గరే వున్న చింతకుంట

అనే పల్లెలో వాళ్ళుంటారుఈమె  పొలం  కూడా వాళ్ళే చూసుకుంటారు. ఆ దత్త పుత్రుడు ఆదిశేషయ్య. రామకృష్ణా హైస్కూల్ లోనే చదువుకుంటున్నాడు. ఆ పిల్లవాడి కుటుంబం వాళ్ళు

కూడా అప్పుడప్పుడూ వచ్చి పోతూనే ఉంటారు. ఆ ఇల్లాలి మాట మీదే ఇప్పుడు యీ ఊరగాయ వ్యవహారం.

ఇంకా అక్కడే నిలబడే ఉన్న నాగతో అంది కనకమ్మ,’అవునూ! మీ స్కూల్ డే సంగతులు చెప్పనేలేదేమే?’అని!

‘ఔనమ్మా! నేనేమో ‘విన్నావా యశోదమ్మా’ ..అనే పాటలో కృష్ణుణ్ణి. తక్కినవాళ్ళందరితో ప్రాక్టీస్ చేయిస్తున్నారు మా హనుమంత రావు సార్. గోపికలూ, యశోదా అందరూ ఉన్నారు. నేనే ముఖ్యం

కదా పాటలో! నాకోసం డ్రెస్స్ కూడ తెప్పిస్తున్నారు. తెలుసా?’ కళ్ళు తిప్పుతూ గడగడా చెప్పేసింది నాగ.

మాయాబజార్ సినిమాలోని యీ పాట బాగా ప్రచారంలోకి వచ్చింది. పిల్లలకు యీ పాట మహా ఇష్టం మరి! అందుకే స్కూల్ డే లో యీ పాట తీసుకున్నట్టున్నారు.

నీకాపాట వచ్చా మరి?’

నాకు వచ్చులే! కానీ స్టేజ్ మీద నేను ఉట్టి ఆక్షన్ మాత్రమే కదా! తెర వెనక నుండీ గిరిజ పాడుతుందీ పాట. నేను ఒట్టి ఆక్షన్, డాన్స్! గోపికలూ యశోదకు కూడా నేనే పాటకు ఆక్షన్

కూడా నేర్పిస్తున్నా తెలుసా?’

గొప్పగా చెబుతూంది నాగ.

కనకమ్మకు ముచ్చటేసింది.

‘నీకంత డాన్స్ ఎక్కడొచ్చే తల్లీ?’ అడిగింది నవ్వు దాచుకుంటూ!

‘అబ్బా! అమ్మా! పాటలో మాటలకు తగినట్టు ఆక్షన్ చేస్తాన్నేను. నన్ను చూసి తక్కిన వాళ్ళు నేర్చుకుంటారు. తెలుసా!’

కూతురు మాటలు వింటూ ప్రేమగా  ముద్దుగా తన వైపే చూస్తూ కనకమ్మ అనుకుంది.’అమ్మయ్య! ఇప్పటికీ ఊరగాయ సంగతి మర్చిపోయింది. అంతే చాలు.’ అని.

ఇంతలోనే వీధిలోనుంచీ కేక..’మల్లే పూల్..మల్లే పూల్..’ అని!

చటుక్కున నాగ దృష్టి అటువైపు మళ్ళింది.

కనకమ్మ గుండెలో రాయి పడింది.

*****

  (సశేషం)

Leave a Reply

Your email address will not be published.