కొడుకు

– వెంపరాల దుర్గా ప్రసాద్

          సాగర్ భార్య మాట కాదనలేడు. చాలా సాత్వికమయిన స్వభావం. భార్య తాను
గర్భవతి అయిన దగ్గర నుంచి, తన తల్లిని ఎలా వాడుకుందో తెలుసు. స్వాతి, భర్త సాగర్
ని లెక్క చేసేది కాదు.

          7 వ నెల వచ్చేక పుట్టింటి వాళ్ళు తీసుకు వెళతారేమో అని, ఎదురు చూసి, ఒకరోజు పొరపాటున అడిగింది వర్ధనమ్మ.

          “మీ అమ్మ గారు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు?”

          ఎందుకు ? అని ఎదురు ప్రశ్నించింది.

          “అదే నమ్మా, శ్రీమంతం చేసి నిన్ను తీసుకెళ్లడానికి” అంది వర్ధనమ్మ.

          “మా అమ్మకి కుదరదు. ఈ నెలలో అమెరికా వెళ్తోంది. మా తమ్ముడి దగ్గరకి. అయినా, మా వాళ్ళకి శ్రీమంతాలు, పురుళ్ళు పోయడాలు ఆనవాయితీ లేదు” అంది.

          వర్ధనమ్మకి అర్ధం అయింది. స్వాతికి తల్లిదండ్రులకు ఖర్చులు అవడం ఇష్టం
లేదని. మారు మాట్లాడకుండా, మొదటి సారి పురిటికి, పుట్టింటి వాళ్ళు తీసుకెళ్లకపోయినా తానే చూసుకోవాలి అనుకుంది. ఇంకేమీ మాట్లాడ లేదు. పైగా, తాను మాట్లాడితే కోడలు రబస చేస్తుంది. కొడుకు మనసు కష్ట పెట్ట్టుకుంటే తల్లిగా తనకే బాధ. అందుకు ఆమె మౌనంగా అన్నీ భరిస్తూ వచ్చింది. 9 నెలలు నిండాయి. ముసలావిడకి చాలా ఆత్రుతగా ఉంది. వంశాంకురం మనవడు పుడితే బావుణ్ణు అని వెయ్యి దేముళ్ళకి మొక్కుకుంది.

          స్వాతి నిర్మొహమాటంగా అత్తగారితో అన్నీ చేయించుకుంది. ఆ రోజు నొప్పులు వస్తు న్నాయని హాస్పిటల్ లో జాయిన్ చేసేడు. 

          సాగర్ కి అర్ధం అయిపొయింది. తల్లికి సాయంగా ఎవరూ రారని. అందుకని ఒక ఆడ
మనిషిని 5 నెలల వరకూ భార్యపని, పిల్లాడి పని చూసుకోవడానికి నియమించేడు.

          వర్ధనమ్మ ఇంటి పని చూసుకుంటే, సాగర్, ఆ పని పిల్ల, స్వాతి దగ్గర వుండే ఏర్పా టు. రాత్రి ఏడు గంటలకి నొప్పులు ఎక్కువయ్యేయని LABOUR రూమ్ లోకి తీసుకెళ్ళేరు. 8 గంటలకి ప్రసవం ఐపోయింది. నార్మల్ డెలివరీ. ఆడపిల్ల పుట్టింది. 

          సాగర్ ఒక్క క్షణం బాధ పడ్డాడు… కొడుకు పుట్టలేదని. మొదటి సారి మొగపిల్లాడు
పుడతాడని ఎంతో ఆశ పడ్డాడు అతను. అతనికి ఆడ పిల్లలంటే అయిష్టం కాదు. తల్లి కోరిక తీరలేదని బాధ.

          వర్ధనమ్మ ఒక్క క్షణం “అయ్యో” అనుకున్నా, సర్దుకుంది. మళ్ళీ సారి పుడతాడు
లేరా. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి . మన ఇంటికి అదృష్టం తెస్తుంది నాన్నా అని సర్దేసు కుంది.

          స్వాతిని మూడో రోజు డిశ్చార్జ్ చేసేరు.

          ఆమె తల్లి, తండ్రి, తమ్ముడు వీడియొ కాల్ లో పలకరించేరు. తల్లికి, తండ్రికి మరో 3 నెలల వరకు వీసా ఉంది కనుక, 3 వ నెలలో బారసాల పెట్టుకుందామని అంది ఆమె.
సరే అన్నాడు సాగర్.

          ౩నెలలు గడిచే వరకు, అన్నీ దగ్గర ఉండి, పత్యంగా చేసి పెట్టింది వర్ధనమ్మ. బారసాల డేట్ ఫిక్స్ అయింది. కూతురికి తన పుట్టింటి సంప్రదాయం ప్రకారం ఇష్ట
దేవేత పేరు పెడతాను అంటుంది స్వాతి. సాగర్ “ మన పిల్లకి వాళ్ళ సంప్రదాయం
ఏమిటి” అని అడగలేక పోయాడు. వర్ధనమ్మకి “అపర్ణ” అని పేరు పెట్టుకోవాలని ఉన్నా, తన మాట చెల్లదని తెలుసు… ఏమీ మాట్లాడ లేదు.

          ఎల్లుండి బారసాల అనగా, తల్లీ, తండ్రి అమెరికా నుండి దిగేరు. దిగిన దగ్గర నుంచీ, వాళ్ళ హడావిడి మొదలయింది. ఇన్నాళ్ళూ తనని కంటికి రెప్ప లా చూసిన అత్తగారు కనపడ్డం లేదు స్వాతికి. వాళ్ళు కూతురికి, మనవరాలికి చాలా బహుమతులు తెచ్చేరు. అందరితో ఇంక అమ్మ, నాన్నల గురించే మాట్లాడుతుండేది స్వాతి.

          బారసాల రోజు రానే వచ్చింది.

          కూతురికి “దుర్గా సాయి రమ్య ” అని పేరు FIX చేసింది స్వాతి. భార్య మాట జవదాటని సాగర్ ఆ “పేరే బియ్యం పళ్లెం లో “ రాసేడు. బారసాల క్రతువు పూర్తయింది.

          వర్ధనమ్మ మొహం చిన్న బోయింది. కానీ, తన భావాలు కనపడనీయ లేదు. సాగర్ బావమరిది కిరణ్ కి అమెరికాలో వుద్యోగం. ఇంకా పెళ్ళి కాలేదు. ఇప్పుడు బారసాలకి రాలేదు, కానీ వీడియో కాల్ లో బారసాల చూసేడు. 

          పిల్ల స్నానం, తయారు చేయడం, వంట ఇలా అన్ని పనుల్లో కోడలికి పూర్తిగా దగ్గర
వుండి చూసుకుంది వర్ధనమ్మ. చంటి పిల్ల కి 3 సంవత్సరాలు వచ్చే వరకు, వర్ధనమ్మ
సహాయం బాగానే తీసుకుంది స్వాతి.

          రమ్యని కిండర్ గార్డెన్ లో వేసే దాకా పనికొచ్చిన అత్తగారు, నెమ్మదిగా చెడ్డదయి పోయింది స్వాతికి. భర్తతో తరచూ, ఆవిడ మీద చాడీలు చెపుతుండేది. సాగర్ కి తల్లిని, భార్యని హేండిల్ చేయడం చాలా ఇబ్బందిగా మారింది.

          వర్ధనమ్మ ఈ మధ్య మళ్ళీ కొడుకుని వంశాంకురం గురించి అడగడం మొదలు పెట్టింది.

          స్వాతి ఆరోగ్యం గురించి.. కొంత గ్యాప్ ఉండాలి అంటూ పోస్టుపోన్ చేస్తూ వచ్చేడు.

          రమ్యకి 3 ఏళ్ళు వచ్చేసేయి రా, ఇంక నాకు మనవడిని కనండి అంటూ సతాయిం చడం మొదలు పెట్టింది ఆవిడ.

          ఏదో గొడవ చేస్తూ తరచూ, పుట్టింటికి వెళ్లి పోతూ, అత్తగారిని దూరం పెట్టింది స్వాతి. తన friends వాళ్ళ తల్లి తండ్రులని వైష్ణవి OLDAGE హోమ్ లో చేర్చేరు అని, అక్కడ అన్ని సౌకర్యాలు వుంటాయని అంది. అత్తగారిని అక్కడ పెట్టమని తరచూ సాగర్ ని వేధించడం మొదలు పెట్టింది. ఇంట్లో ఆవిడ చాదస్తం తాను తట్టుకోలేక పోతున్నానని, తాను చెప్పినట్లు చేయకపొతే, ఇంక పిల్ల వాడిని కనడం అనే మాట మర్చిపోండి అని బెదిరించింది.

          వంశాంకురం వుండాలని ముసలావిడ బాధ. కొడుకుని వర్ధనమ్మ ఒప్పించింది. తల్లిని అయిష్టంగానే, తీసుకు వెళ్ళి వైష్ణవి OLDAGE హోంలో జాయిన్ చేసేడు.

***

          ఈ మధ్య 2 నెలలు సెలవు పెట్టి సాగర్ బావమరిది కిరణ్ వచ్చేడు. అతనికి
సంబంధాలు చూస్తున్నారు. రమ్యకి అమ్మమ్మ, తాతయ్యల దగ్గర బాగా చేరిక. పిల్లని తరచూ, పుట్టింట్లో ఉంచేసి వస్తూ ఉండేది స్వాతి. స్కూల్ వున్నపుడే, స్వాతి పిల్లని తన దగ్గర వుంచు కునేది. సెలవలప్పుడు స్వాతి, రమ్యల మకాం ఎప్పుడూ పుట్టింట్లోనే. కిరణ్ కోసం కూడా, స్వాతి దాదాపు పుట్టింట్లోనే ఉంటోంది.

          కిరణ్ మాటల సందర్భం లో బావగారిని అడిగేడు.

          “అత్తయ్య గారు కనపడ్డం లేదేమి”అని. సాగర్ మొహం జేవురించింది. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నట్లు చెప్పేడు. అక్క సంగతి తెలిసిన కిరణ్ ఆ ప్రస్తావన అక్కడితో ఆపేసేడు.

          కిరణ్ కి బావగారు అంటే చాలా గౌరవం, అభిమానం. సాయంత్రం, ఇద్దరూ కలిసి పార్క్ కి వెళ్ళినప్పుడు, సాగర్ వివరంగా, స్వాతి వ్యవహారం, తల్లిని తనకి ఇష్టం లేక
పోయినా, ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేసిన విషయం చెప్పేడు.

          కిరణ్ బావగారి హృదయం తెలిసి మాట్లాడే రకం. అవతలి వాళ్ళ బాధని గ్రహించ గలడు. అక్క పెంకి తనం, బావ మంచితనం బాగా తెలిసిన వ్యక్తి.

          “మా అక్కకి నేను చెప్పనా బావా”అన్నాడు. సాగర్ కంగారు పడిపోయాడు.

          “వద్దు, నేను నీకు చెప్పి రచ్చ చేసెను” అని మళ్ళీ ఇంట్లో గొడవ చేస్తుంది. అన్నాడు సాగర్.

          ఇంకేం అనలేదు కిరణ్.

***

          ఆ రోజు ఆదివారం. రమ్య ని తీసుకుని మోటార్ సైకిల్ మీద బయటకి తీసుకు వెళ్ళేడు కిరణ్. వెళ్ళి గంట కూడా కాలేదు.

          స్వాతికి ఫోన్ వచ్చింది కిరణ్ నుండి.

          “చెప్పరా తమ్ముడూ” అంది.

          “అక్కా ఒక ఆక్సిడెంట్ అయింది. నాకు దెబ్బలు తగల లేదు కానీ, రమ్యకి సీరియస్ గా వుంది. శివానీ మల్టీస్పెషలిటీ హాస్పిటల్ లో జాయిన్ చేసెను. “మీరు వెంటనే
రండి అన్నాడు.

          స్వాతికి నోట మాట రాలేదు.

          ఇదేంటిరా, నా చిట్టి తల్లికి ఏమైంది అంటూ ఏడుపు లంకించు కుంది. హుటా హుటిని, స్వాతిని తీసుకుని హాస్పిటల్ కి చేరుకున్నాడు సాగర్. ICU లో వుంది రమ్య. తలకి బ్యాండేజ్ కట్టి వుంది. స్పృహలో లేదు. చేతికి కూడా కట్టు వుంది. బయట కూర్చుని వున్నాడు కిరణ్. అద్దం లోంచే PATIENT ని చూడమన్నారు.

          కిరణ్ కి తెలిసిన డాక్టర్ ట పిల్లని TREAT చేస్తున్నాడు. బయటకి వచ్చి చెపుతు న్నాడు…

          “పాప తలకి దెబ్బ తగిలింది. మోచేయికి ఫ్రాక్చర్ అయింది. 48 గంటలు OBSERVE
చెయ్యాలి” అన్నాడు.

          ఏమి జరిగిందిరా అంది స్వాతి ఏడుస్తూ.

          చిక్కడ పల్లి సెంటర్ లో సడన్ BRAKE వేయాల్సి వచ్చింది. ట్యాంక్ మీద కూర్చు న్న రమ్య తుళ్ళి పడి పోయి PAVEMENT కి తల కొట్టుకుని పడి పోయింది. వెంటనే ఈ హాస్పిటల్ కి తీసుకు వచ్చి జాయిన్ చేసెను. డాక్టర్ నా FRIEND అవడంతో స్పెషల్ కేర్ తీసుకుని TREAT చేస్తున్నారు. అన్నాడు.

          స్వాతికి తెలుసు కిరణ్ చాలా వేగంగా DRIVE చేస్తాడు. ఆమెకి తమ్ముడి మీద పట్టరాని కోపం వచ్చింది. కోపం దాచుకుంటూ మాట్లాడుతోంది.

          “చిన్న పిల్లని తీసుకెళ్లినప్పుడు స్లో గా వెళ్ళాలి కదా”.

          కిరణ్ “ఇలా అవుతుందని అనుకోలేదు అక్కా !” అన్నాడు. అతని స్వరం హీనంగా వుంది.

          ఇంటికి వచ్చేక, చాల సీరియస్ గా వుంది స్వాతి. ఆమెకి పుట్టింటి మీద సడన్ గ
చాలా కోపం వచ్చేసింది. స్వాతికి మూడ్ స్వింగ్స్ ఎక్కువ అని తెలుసు.. అందుకే సాగర్ ఏమీ మాట్లాడ లేదు. ఉదయాన్నే, వెళ్ళి అత్తయ్యగారిని ఓల్డ్ ఏజ్ హోమ్ నుండి తీసుకు రండి. పిల్లకి సాయంగా వుండమందాం, ఇంట్లో పని చేసుకుని హాస్పిటల్ కి మనం తిరగ డానికి వీలుగ ఉంటుంది. అంది.

          తల్లిని తీసుకు వచ్చేడు. 

          వర్ధనమ్మ వస్తూనే పిల్లని చూసి తల్లడిల్లి పోయింది. రమ్య పక్క రాత్రీపగలూ ఆమె ఉంటోంది. కిరణ్ కూడా, మేనకోడలు దగ్గర హాస్పిటల్ లోనే ఉంటున్నాడు.

          స్వాతి, సాగర్ HOSPITAL కి వెళ్లి వస్తున్నారు. స్వాతి తల్లి, తండ్రి హాస్పిటల్కి వెళ్లి చిన్న పిల్లని చూసి వచ్చేరు. 4 రోజులు దాకా, డాక్టర్ చాలా భయపెట్టేడు. 5 వ రోజు, “ఇంక ప్రాణ భయం లేదు. ఫ్రాక్చర్ తగ్గడం కోసమే వెయిట్ చెయ్యాలి” అన్నాడు. అందరూ రిలీఫ్ ఫీల్ అయ్యేరు.

          6వ రోజు డిశ్చార్జ్ చేసేరు. స్వాతి రమ్యకి ఆక్సిడెంట్ అయిన దగ్గర నుండీ, పుట్టింటి వాళ్ళతో … ముఖ్యంగా తమ్ముడితో ముభావంగా మాట్లాడుతోంది. పుట్టింటికి వెళ్లడం మానేసింది. ఎప్పుడయినా వాళ్ళు రావడమే.

          2 నెలలు గడిచే సరికి, పిల్ల మామూలుగా అయిపొయింది, చేతి కట్టు కూడా
విప్పేసేరు. ఆ రోజు సాయంత్రం కిరణ్ వచ్చేడు. కిరణ్ ఇలా అన్నాడు:

          “ నా FRIEND డాక్టర్ అనిల్ చెప్పిన దాని ప్రకారం, చిన్న పిల్లలకి ఎల్బో
FRACTURE అయినా, ఎముక త్వరగా మామూలుగా అతుక్కుంటుందిట, అదే, పెద్ద వాళ్ళకి మాత్రం అతుక్కోవడంలో చిన్న చిన్న లోపాలు వచ్చేసి, పూర్వపు స్థితి రాదుట “.
అందుకే రమ్యకి మామూలు అయి పోయింది. తలకి తగిలిన దెబ్బ కూడా తగ్గిపోవడం మన అదృష్టం” అన్నాడు.

          స్వాతి ముభావంగా వుంది. పిల్లని దగ్గరకి తీసుకుంది. సాగర్ టాపిక్ మార్చేడు. తల్లిని తీసుకుని హాల్ లోకి వచ్చేడు సాగర్. ఇంతలో కిరణ్ బయటకి వచ్చి, వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్లి పోయాడు.

          వర్ధనమ్మ ఇలా అంటోంది.
“పిల్లకి గండం తప్పి బయట పడింది. ఇంక పరవాలేదు, నన్ను రేపు ఓల్డ్ ఏజ్ హోమ్ లో
దింపేసేయిరా. మళ్ళీ, స్వాతి నీళ్ళు పోసుకుందని శుభవార్త చెప్పేక వస్తాను. మీకు సాయంగా వుంటాను”. అంది.

          సాగర్ తల్లిని చూస్తే, జాలి వేసింది. తన మీద తనకే అసహ్యంగా వుంది అతనికి.
“స్వాతి పిల్లల్ని కనడానికి, ఆమెకి ఇబ్బందుల్లో సాయంగా ఉండడానికే తప్ప, ఆవిడ బాగోగులు తాను చూడట్లేదు” .

          ఆమె చేతులు పట్టుకుని “అమ్మా! క్షమించు.. నాకు కొడుకుని కనాలని లేదమ్మా..
నీ కొడుకు నిన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జేర్పించినా, వాడి బాగోగులు కోసం తపిస్తున్నావు. నిన్ను సరిగా చూసుకోలేని అసమర్దుడిని. నా కొడుకు కూడా నా భార్యని చూసుకోక పొతే, నీలా క్షమించే స్త్రీ కాదమ్మా, నీ కోడలు. కూతురికి ఆక్సిడెంట్ అయిన దగ్గర నుండీ, తమ్ముడిని దూరం పెడుతోంది స్వాతి. ఇలాంటి సంఘర్షణల మధ్య బతక గలిగే ధైర్యం నాకు లేదు. నాకు ఉన్న కూతురిని జాగ్రత్తగా పెంచుకుంటే చాలు. నేను వాసెక్టమీ ఆపరేషన్ చేయించేసుకుంటాను. ఇంక నాకు పిల్లలు ఒద్దు” అన్నాడు.

          “అదేం మాటలు నాయనా” అంటోంది వర్ధనమ్మ దిగాలుగా.

          ఈ మాటలు విందేమో, ముందు గదిలోకి వచ్చింది స్వాతి. వస్తూనే, అత్తగారి కాళ్ళని చుట్టేసుకుంది. బిత్తర పోయిన వర్ధనమ్మ కోడల్ని దగ్గరకి తీసుకుంది. స్వాతి కళ్ళల్లో నీళ్ళు..

          “ఎందుకు తల్లీ, ఇంక బెంగ లేదు, నీ బిడ్డకి. పూర్తిగా కోలుకుంది” అంది వర్ధనమ్మ. స్వాతి రమ్య గురించి బెంగ పడుతోంది అనుకుంటోంది ఆ ముసలావిడ.

          ” అత్తయ్య గారు, మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళక్కర్లేదు. మాతోనే వుండండి…
నేను చేసిన పాపపు పనికే, నా బిడ్డకి ఇంత పెద్ద ఆక్సిడెంట్ అయింది.” అంది స్వాతి.

          సాగర్ మొహం వెలిగి పోయింది. స్వాతిలో ఈ మార్పు అతను ఊహించ లేదు.
వర్ధనమ్మకి కూడా కోడలిలో ఈ మార్పు ఆశ్చర్యంగా వుంది.

          “ఎందుకు లేమ్మా , నీకు శ్రమ” అంది వర్ధనమ్మ .

          “శ్రమ కాదండి, అది మా బాధ్యత ! అని, “భర్త కేసి తిరిగి, అత్తయ్యగారి అన్ని
సామాన్లు, కట్టిన డిపాజిట్.. తిరిగి తెచ్చేయండి, మనతోనే వుంటారు” అంది స్వాతి.

          మర్నాడు వర్ధనమ్మ పెట్టె, బేడా అన్నీ ఓల్డ్ ఏజ్ హోమ్ నుండి తెచ్చేసేడు సాగర్.

          ఆరోజు సాయంత్రం కిరణ్ నుండి ఫోన్ వచ్చింది.

          నన్ను క్షమించు బావా, మీ అందర్నీ బాధ పెట్టెను. నా వల్ల మీరు మానసికంగా ఎంతో కుంగిపోయారు. పిల్లకి ఇలా ఆక్సిడెంట్ అవుతుంది అనుకోలేదు అన్నాడు.

          “అంతా భగవంతుడి లీల.. నువ్వేం చేస్తావు” అన్నాడు సాగర్.

          “పోనీలే, ఈ ఆక్సిడెంట్ తర్వాత, మీ అక్కలో చాలా మార్పు వచ్చింది. మా అమ్మని
ఓల్డ్ ఏజ్ హోమ్ నుండి తీసుకుని వచ్చేసాను. ఇంక ఆవిడ శేష జీవితం మనవరాలి దగ్గర గడపచ్చు” అన్నాడు.

          “చాలా సంతోషం బావా, శుభ వార్త చెప్పేరు., మీ కుటుంబంలో మునుపటి సంతోషాలు మళ్ళీ రావాలి” అన్నాడు కిరణ్

          “అయితే, ఈ సంఘటన వల్ల, మీ కుటుంబం స్వాతి దగ్గర చెడ్డ వాళ్ళు అవడం బాధగా వుంది” అన్నాడు సాగర్.

          “పర్వాలేదు బావా, అక్క మూడ్ స్వింగ్స్ నాకు తెలుసు. నాకు పెళ్ళి కుదిరేలా వుంది. పెళ్ళి కుదిరితే, ఆడపడచు హడావిడి ఉండాలి కదా, తనని మళ్ళీ దగ్గరకు తెచ్చు కోగలను. కొంత కాలం ఇలాగె ఉండనీ” అన్నాడు కిరణ్.

          కిరణ్ మంచి హృదయానికి పొంగి పోయేడు సాగర్.

*****

Please follow and like us:

2 thoughts on “కొడుకు”

Leave a Reply

Your email address will not be published.