నీలకంఠి

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-సురేఖ.పి

          “డన్” అంటూ ఎడమ బొటనవేలు తోటి విద్యార్థులకు చూపెడుతూ దీక్షిత్ మోటార్బైక్ స్టార్ట్ చేశాడు, రాంగ్ సైడ్ నుండి దూసుకు వస్తున్నాడు. క్లాస్ ఫస్ట్ శరణ్యను ఇన్సల్ట్ చేయాలి, శరణ్య సిగ్గుతో అందరి ముందు తలదించుకోవాలి. ఈ పనికి మిగితా బాయ్ స్టూడెంట్స్ అందరూ దీక్షిత్ ను ఎరగా పురమాయించారు .

          మార్నింగ్ సెషన్లో అమ్మాయిలు, నూన్ సెషన్లో అబ్బాయిలు చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీలో శరణ్య, దీక్షిత్ ఫస్ట్ ఇయర్ లో వున్నారు. శరణ్య తెలివితేటలు చాలా మంది విద్యార్థులకు శత్రువయింది.

          నడుస్తున్న నలుగురి అమ్మాయిల్లో వున్న శరణ్య ఎదపైన గట్టిగా చేయి వేసి  “బ్యూటిఫుల్” అంటూ పయిటలాగి బైక్ స్పీడ్ పెంచాడు దీక్షిత్. వూహించని నీచ సంఘటనకు బెదరక, బైక్ హ్యాండిల్ కు వెళ్ళాడుతున్న పుస్తకాల బాగ్ ను లాక్కుంది శరణ్య. ఇది గమనించక దూరాన నిలుచుని గమనిస్తున్న అబ్బాయిలకు కుడిచేతి  బొటనవేలు సంతోషంగా గాలిలో ఉపుతూ కనుమరుగయ్యాడు దీక్షిత్.

***

          “నమస్తే ఆంటీ, నా పేరు శరణ్య, నేను కొంచెం మీతో మాట్లాడాలి” అంది శరణ్య. అడ్రసు వెత్తుకుంటూ దీక్షిత్ బాగ్ తో నేరుగా దీక్షిత్ ఇంటికి వచ్చింది. సేల్స్ గర్ల్ అనుకున్న దీక్షిత్ అమ్మగారు నీలవేణి, కూర్చోమని అనలేదు. అయినా చొరవ తీసుకొని డ్రాయింగ్ రూమ్ సోఫా పైన కూర్చొని బాగ్ నుండి దీక్షిత్ పుస్తకాలు తీసింది.

          “ఆంటీ ఈ బుక్స్ గుర్తుపట్టగలరా?”

          “ఈ బుక్స్ మా అబ్బాయివి, మొన్న కాలేజీలో పోయాయని చెప్పాడు”

          “ఇవి పోలేదు, నేనే లాక్కున్నాను” అంటూ జరిగిన ఈవ్ టీసింగ్ గురించి చెప్పింది.

          “కాలేజీ ప్రిన్సిపాల్ కు ఇవ్వాలిసిన కంప్లయింట్ మీకు చేస్తున్నాను, ఎందుకంటే ఐ పిటి యు అండ్ యువర్ సన్ క్రమశిక్షణ లేకుండా పెరుగుతున్నాడు, మరోసారి యిలాగే చేస్తే కంప్లయింట్ కాదు, నేనే యాక్షన్ తీసుకుంటాను” అని చెప్పాలనుకున్న మాటలు ఖరాఖండిగా తేల్చి చెప్పేసి సోఫా నుండి లేచింది. నీలవేణి బలవంతంగా శరణ్యను
కూర్చోబెట్టింది.

          “చాలా థాంక్స్, కాలేజీలో కంప్లయింట్ ఇవ్వనందుకు; ఇప్పుడే వస్తాను,” అంటూ లోపలి నుండి దీక్షిత్ ను వెంట బెట్టుకొని వచ్చింది, శరణ్యను చూసి అవాక్కయ్యాడు.

          “దీక్షిత్, నువ్వు ఈ అమ్మాయి పట్ల అమానుషంగా ప్రవర్తించావు, మంచితనంతో విషయాన్ని నాతో చెప్పింది, నీకు తోచిన రీతిలో ఈ అమ్మాయికి సారీ చెప్పు “తల్లి మాటకు ఎదురు చెప్పలేక, ఏదో మొక్కుబడిగా సారీ చెప్పాడు. శరణ్య దీక్షిత్ వైపు చూడకుండా నీలవేణి వద్ద సెలవు తీసుకుంది.

          ఫ్రెండ్స్ చేసిన ఛాలెంజ్ లో తాను పాల్గొని అందమయిన అమ్మాయి శరీర భాగాన్ని తాకితే తప్పా! థ్రిల్లింగ్గా వున్న ఫీలింగ్ కు సారీ చెప్పినందుకు దీక్షిత్ బాధ పడ్డాడు.అమ్మ కూడా ఆడదే కాబట్టి శరణ్యకు సపోర్ట్ చేసింది. అమ్మంటే చిరాకేసింది.

          “దీక్షిత్” అమ్మ గొంతులోని మాతృత్వం పిలిచింది. మారుపలుకని కొడుకుని దగ్గరగా తీసుకుంది.

          “నాకు తెలుసు నా మీద కోపం ఉందని, కానీ, నిజంగానే నువ్వు చేసిన పని తప్పు కన్నా! ఎంతో కష్టపడి చదివి, ఎంసెట్లో ర్యాంకుతో పాస్ అయ్యి ఒక స్థిరమైన విద్యలో సాధన చేయాల్సిన వాడివి మధ్యలో పిచ్చి పనులు చేయటం తప్పే కదా!”

          “అమ్మా! నేను చేయాలని చేయలేదు. శరణ్యకు ఇంటెలిజెంట్ అనే పొగరు ఉంది, అది అణిచి వేయాలని క్లాస్మేట్స్ ఈవ్ టీజింగ్ గురించి వారం రోజుల నుండి  చెబుతుం టే, నేను ఒక రకంగా హిప్నోటైజయ్యి అలా చేశాను, అంతే”.

          “శరణ్య గుణగణాలు మీకెందుకు, మీకు చేతనైతే ఇంకా బాగా చదివి, చదువులో పోటీ పెంచుకుని, ఆ అమ్మాయి ఇంటలిజెన్స్ ను సవాల్ చేయండి. ఈవ్టీజింగ్ వలన అమ్మాయిల గర్వం, పొగరు అణిచి వేయబడతాయనే మీ ఊహ వట్టి అపోహ మాత్రమే, అంతగా అమ్మాయిల అవయవాల గురించి ఆలోచనలు మొదలైతే, ఇంట్లో పెద్దలను సంప్రదించి తగిన సంబంధం చూసి పెళ్ళి చేసుకోండి. అంతేకానీ కాలేజీ అమ్మాయిలు గాని రోడ్డు మీద పోయే అమ్మాయిల శరీర భాగాలను తగిలితే, వాళ్ళు మనసావాచా శపించే
మాటలతో మీ తద్దినాలు పెట్టుకోవద్దు.”

          మౌనంగా వింటున్నాడు దీక్షిత్.

          “ఈనాటి ఆడపిల్లలలో ధైర్యం, విశ్వాసం ఎక్కువ పాళ్ళలో ఉన్నాయి. నిన్ను ఎవరో ఎందుకో హిప్నటైజ్ చేసినంత మాత్రాన నీ గమనం మారొద్దు”

          “ఓకే అమ్మా” తొందరగా ఈ టాపిక్ ముగియాలని దీక్షిత్ ఉబలాట.

          “ప్రతిరోజు చదువు పట్ల, మంచి నడత పట్ల నేను ఏదో రకంగా నీకు చెబుతూనే ఉన్నాను, నేను ప్రయోగించే హిప్నాటిజం నీలో ఉన్నప్పుడు మరి వేరే హిప్నాటిజం ఎలా పని చేస్తుంది రా!”

          “అమ్మా!, శరణ్యకే కాదు, నీకు కూడా నేను సారీ చెప్తున్నా, ఈ విషయం ఇంతటితో ఆపేద్దాం, ఇలా ఇంకోసారి జరగదు”

          దీక్షిత్ లో ఏర్పడిన ఉక్రోషం కాస్తకాస్తగా మాయమైపోయింది. మనసు తేలిక అయ్యింది, అంత పెద్దగా చదువుకోని అమ్మ ఎంత చక్కగా నచ్చ చెప్పింది.

***

          కాలింగ్ బెల్ మ్రోగింది భర్త ఆఫీసు నుంచి రావడంతో నీలవేణి భర్త దినచర్య కార్యక్రమలల్లో మునిగిపోయింది.

          శ్రీపాదరావుకు ప్రతీ వస్తువు చేతికి అందించాలి, అదోరకం బద్దకం!

          కొడుకును ఎంతో క్రమశిక్షణతో పెంచుతూ వీలైనంత వరకు కొడుకుకి సంబంధిం చిన పనులన్నీ కొడుకుతో చేయించి స్వశక్తిని పెంపొందించే అమ్మ; నాన్న విషయంలో మాత్రం నిదానంగా, సేవకురాలిగా అక్షరాలను పొడిపొడిగా మాట్లాడే తల్లి ప్రవర్తన, దీక్షిత్ కి అర్థం కాలేదు. దీక్షిత్ నిర్వచనంలో నాన్నంటే దూరంగా ఉంటూ తన బాగోగులు చూసే సగటు తండ్రి, కానీ అమ్మ మాత్రం మనసా వాచా తన సంక్షేమం కోరే దేవత!

***

          సాధారణంగా ఎప్పుడూ ఎక్కడికి తీసుకెళ్ళని శ్రీపాదరావు బాహుబలి సినిమాకు మూడు టికెట్లు రిజర్వు చేశారు. ఈ సినిమాని థియేటర్లో చూస్తేనే బాగుంటుంది అని వినికిడి. సినిమాకు ముగ్గురు ప్రయాణమయ్యారు. థియేటర్ నిండా జనం, నడిచే అవసరం లేకుండా క్రిక్కిరిసిన జనతోపులాటలో ముందుకు జరుగుతున్నారు. జన మంతా ఎంతో సరదాగా మంచి సినిమా చూడబోయే ఉత్సాహంతో ఉన్నారు. నీలవేణి భర్త సమక్షంలో ఇంటా బయట సీరియస్ గా ఉంటుంది. తండ్రి ఇంట్లో లేని సమయంలో ఏదో మాట్లాడిస్తూ, మాటల్లో జోక్స్ చెబుతూ ఎంతో హ్యూమరస్ గా ఉండే అమ్మ సమక్షమే ఎక్కువ కోరుకుంటాడు దీక్షిత్.

          తండ్రితో పాటు బయటకు వెళ్ళాలన్నా, కలిసి భోజనం చేయాలన్నా దీక్షిత్ ఇష్టపడడు. ఎందుకంటే కేవలం తండ్రి నుండి లభించేది ఆర్థిక బలం ఒక్కటే!

          ఎన్నో రకాల టీవీ చానల్స్ వున్నా బాహుబలి సినిమా థియేటర్లోనే చూడాలని శ్రీపాదరావు అనుకున్నాడు. ఫ్యామిలీతో పాటు చూశాడు. సినిమా అయిపోయాక హాలు బయటికి మెల్ల మెల్లగా జనం వస్తున్నారు. నీలవేణి భర్తకి కొడుకుకి మధ్య నడుస్తుంది అంటే రద్దీలో అమ్మను ఎవరైనా మగవాళ్ళు తాకుతారని దీక్షిత్ సెక్యూరిటీ గార్డులా తల్లిని ప్రొటెక్ట్ చేస్తూ నడుస్తున్నాడు. సడన్ గా ఉన్నట్టుండి దీక్షిత్ తండ్రి కోసం అటు ఇటు చూశాడు. భార్యను కొడుకును దాటేసి కొంచెం దూరంలో నడుస్తున్నాడు శ్రీపాద రావు.

          ఎవరో మధ్య వయస్కురాలు, అందాల రాణి అయినా టీనేజ్ గెటప్లో కళ్ళను మిరిమిట్లు గొలిపే అందగత్తె ప్రక్కన నాన్న నడుస్తున్నాడు. ఆమె చేతిలో చేయికలుపుతూ అప్పుడప్పుడు ఆమె శరీరం భాగాలను తగులుతూ నాన్న ఏమీ తెలియనట్టు ముఖం పెట్టి తోడుగా నడుస్తున్నాడు.

          అమ్మ సెక్యూరిటీ డ్యూటీ వదిలి నాన్న డ్యూటీ కోసం నడిచాడు దీక్షిత్ అంతటి జనంలో అపరంజి బొమ్మ నడుమున చుట్టుకున్న నాన్న చేయి చూసి దీక్షిత్ కు వెగటు కలిగింది.

          ఆ అపరిచిత అందాల బొమ్మ ఒక్కసారి నాన్న కేసి ఓరగా చూసి నవ్వింది. నాన్నలో ఎన్నడూ చూడని ఆనందం, తృప్తి దీక్షిత్ కి కంపరం పుట్టించాయి.

          జన విభజన జరుగుతున్న సృహ ఉన్నదేమో, శ్రీపాదరావు మామూలుగా వచ్చి తన కుటుంబీకుల నడకలో జతకలిపాడు.

          ఆ మర్నాడు “అమ్మా! నిన్న థియేటర్లో నాన్న…” అంటూ మరీ మరీ ఆలోచించి సమయం చూసి అమ్మకు ఎలా చెప్పాలి అని మదనపడుతూ మొదలుపెట్టాడు.

          “నాకు తెలుసు దీక్ష్” మహాజ్ఞాని సర్ది చెప్పింది నీలవేణి.

          “శరణ్య నా గురించి చెబితే నాకు పెద్ద లెక్చర్ ఇచ్చావు, మరి నాన్న ప్రవర్తన పట్ల నాన్న సరిదిద్దుకునేందుకు నీతులు చెప్పలేవా? నీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం చాలా కంపరంగా అదే అలా పట్టుకుంటే చాలా చీదరగా ఉంది”.

          “దీక్షిత్ మీ నాన్న గురించి నువ్వు కొంచెం సేపు మాత్రమే చూసావు, నేను ఈ ఇరవై ఏళ్ళ వైవాహిక జీవితంలో ఎంతో చూశాను, మీనాన్న మారాలని అలిగాను, మాటలు మానేశాను, బ్రతిమాలాను, ప్రార్థించాను కానీ ఆయన మారలేదు. నాకు ఆర్థిక బలం లేదు. పుట్టింటి వారి అండ లేదు. ఉన్నదల్లా పుత్రబలం మాత్రమే, అది నువ్వే! మీ నాన్న పుట్టి పెరిగిన పరిస్థితులు మంచివి కావు క్రమశిక్షణ లేని పద్ధతిలో వాళ్ళ తల్లిదండ్రులు ఒక
మగ పిల్లవాడిని పెంచుతున్నామనే అహంభావంతో పెంచారే గాని, విజ్ఞత గల పురుషోత్త మునిగా పెంచలేదు. మన ఇంట్లోనే కాదు, చాలామంది ఇళ్ళల్లో పిల్లలు పాడై పోతున్నారని పెద్దలు బాధపడుతున్నారు కానీ ఎప్పటికప్పుడు పిల్లల ప్రవర్తనలో జోక్యం చేసుకుని సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నించటం లేదు పెద్దలు. అందుకే మీ నాన్న విషయంలో భార్యగా నీ విషయంలో ఒక తల్లిగా నా పాత్ర లో తేడా ఉంది.”
దీక్షిత్ జాలిగా బాధగా తల్లిని దగ్గరగా తీసుకున్నాడు.

          “చూడు బాబు! నాన్నచేసిన పనికి నీకు అసహ్యం కలిగింది కదా, మరి నువ్వు చేస్తే వేరే వాళ్ళకు కూడా అసహ్యం కలుగుతుంది. కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు,  అమ్మాయిల పైన క్రేజ్ వద్దు. మనం చేసే పని ఇతరులకు బాధ కలగ వద్దు. నీ మనసు నీ ఆధీనంలో ఉండాలి. నా ధ్యేయం, నా ఆశ ఏమిటో తెలుసా, నువ్వు ఏ ఆకర్షణకు లొంగక నీ దారిలో నువ్వు సాఫీగా సన్మార్గంలో నడవాలని నీలో ఉన్న ప్రతిభకు పట్టుదల తోడుగా పెట్టి సాధనతో విజయాన్ని సాధించాలని నా కోరిక.”

          “అమ్మా, నా సంగతి సరే మరి నీ లోని బాధ తొలిగేది ఎలా ?”

          “నాకా! బాధా! నా సంతోషమంతా నా బాబు దీక్షిత్ తోనె నిండి ఉంది. అందుకే శరణ్య వచ్చి నీ గురించి చెప్పినప్పుడు బాధ కలిగింది. కానీ నిన్నటి మీ నాన్న ప్రవర్తన పట్ల బాధ కలుగలేదు ఆయన పట్ల నా జీవితం యాంత్రికం మాత్రమే నీతో నా జీవితం అమృతసారం”.

          దీక్షిత్ తల్లిని ప్రేమగా హత్తుకున్నాడు కొడుకుని ఆప్యాయంగా నిమురుతూ నీలవేణి కళ్ళ చివర్లో మిగిలిన కన్నీటి తృప్తిని మిగుల్చుతుంది.

          నీలవేణి వేసిన అందమైన అర్థనారీశ్వరుని పెయింటింగ్ డ్రాయింగ్ రూంలో ఎంతో ఆధ్యాత్మికంగా వుంది. శివుని గొంతుక పైన నీలం రంగు లేదు, కానీ సగభాగంలోని పార్వతి గొంతుక పైన నీలం రంగు వుంది. చిత్రకారిణి తప్ప ఎవ్వరూ గమనించలేదు నీలకంఠిని.

*****

Please follow and like us:

8 thoughts on “నీలకంఠి (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

  1. కథ బావుంది కని కథ ముగింపు లో ఒక గృహిణి తన కుటుంబం లో మంచి చెడుల గరళాన్ని కక్క లేక మింగలేక ప్రస్తుత సమాజంలో అసలైన నీల కంట్టి అనటం లో అతిశయోక్తి లేదు. సముద్ర మథనం లో ఉద్భవించిన విషాన్ని గొంతులో ఉంచుకున్న నీలకంఠ దుని మనం చూడలేదు కానీ కథలో చెప్పిన నీలకంఠ మాత్రం మన సమాజంలో కనిపిస్తూనే ఉంది..

  2. నమస్తే మేడమ్.” నీలకంఠి” కథ చాలా బాగుంది. నీలకంఠి తన కొడుకును ఆడపిల్లల పట్ల సభ్యతగా మెలగమని చెప్పటం వల్ల, తాను తన భర్త వల్ల పడిన మానసిక బాధలు, భవిష్యత్తులో తన కొడుకును పెళ్లి చేసుకునే అమ్మాయి తనలా బాధ పడకూడదని నీలకంఠి అనుకుంది. అందుకే ఆమె తన కొడుకును హెచ్చరిస్తూ వచ్చింది. మంచి కథ అందించారు అభినందనలు మేడం 👏👏💐💐🙏🙏

  3. కథ బాగుంది సురేఖ గారు. భర్తల తప్పులను దాచుకునే నీలకంఠి లు మన దేశంలో చాలా మందే ఉంటారు. అయితే కనీసం కొడుకు ప్రవర్తనను సరిదిద్దటం బాగుంది. తనకు ఎదురైన వేధింపును శరణ్య ధైర్యంగా ఎదుర్కున్న తీరు అభినందనీయం!

  4. అమ్మా…
    నీలకంఠి కళ్ళు తెరిపించాలి మాధందులవి.
    కథ చాలా బాగుంది

  5. నమస్కారం నెచ్చెలి సంపాదకీయం. నా కథ “నీలకంఠి” ప్రచురణకు అర్హత పొందినందుకు నెచ్చెలి సదస్సు నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏

  6. ఇలాంటి కధలవల్ల సమాజంపై మంచికన్నా చెడుప్రభావమే ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం…
    కధలోని సందేశం బాగుంది…అభినందనలు…

Leave a Reply

Your email address will not be published.