ఉత్తరాంధ్రకు చెందిన రైతు ఉద్యమ నాయకురాలు “వీర గున్నమ్మ”

-యామిజాల శర్వాణి

          ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో గుడారి రాజమణిపురం అనే ఓ కుగ్రామంకు చెందిన ఒక బీద కుటుంబానికి చెందిన వ్యక్తి గున్నమ్మ. జమిందారీ వ్యతిరేక ఉద్యమంలో రక్త బలిదానం చేసిన వీర వనిత గున్నమ్మ ఉద్దానం ఆడపడుచు. రెక్కాడితే గానీ డొక్కాడని దుర్భర జీవితంలో గున్నమ్మ పెరిగింది. తెలుగింటి ఆడపడుచుల తెగువకు ప్రతిరూపం గా నిలిచిన వీరనారి సాసుమాను గున్నమ్మకు పదేళ్ళ వయసులోనే తల్లిదండ్రులు పెండ్లి చేశారు. నిండు గర్భవతిగా ఉన్న సమయంలోనే ఆమె భర్త మాధవయ్య ఉద్యోగం కోసం రంగూన్ వెళ్ళి అక్కడే మరణించాడు. అయినా గున్నమ్మ మనోధైర్యంతో ముందు కు వెళ్ళింది. తనకు భర్త నుండి సంక్రమించిన ఆ కొద్ది భూమిలో పొలం పనులు చేసు కొనేది. ఈ గ్రామంలో రైతులు అన్ని రకాల పంటలు పండించేవారు. అయితే ఈ పంటలో మూడో వంతు భాగాన్ని కప్పం కింద రాజమణి జమీందారులు వసూలు చేసేవారు. వారికి ఆంగ్లేయులు అండగా నిలిచేవారు. అడవిలో దొరికే సహజమైన వంటచెరకు, పుల్లలు, కలప, పండ్లు, కాయలను ఇంటికి తెచ్చుకోకూడదు అని వాటికి కూడా పన్ను కట్టాలని ఎప్పుడైతే జమిందారీ దివాణం నిబంధనలను విధించిందో అప్పుడు గున్నమ్మ వారికి ఎదురుతిరిగింది ఆంగ్ల దొరలు కూడా వారికి వత్తాసు పలకడంతో, ఆమె తొలిసారిగా తిరుగుబాటు జెండా ఎగురవేసింది. 

          ఈ క్రమంలో జమీందారీ మరియు ఆంగ్ల దొరల దౌర్జన్యాలకు గురవుతున్న రైతాం గం తాము మందసలో నిర్వహిస్తున్న కిసాన్ సభకు వచ్చి గున్నమ్మను ప్రసంగించమని కోరారు. ఆ సభలో ప్రసంగించిన గున్నమ్మ 1940 మార్చి 27, 28 తేదిలలో పలాసలో పెద్ద ఎత్తున నిర్వహించిన అఖిల భారత రైతు మహాసభలలో కూడా తన అభిప్రాయాలను పంచుకుంది. రైతులను ఉత్తేజితులను చేసింది. ఈ సభ ఒక సాధారణ స్త్రీని వీరనారిగా తీర్చిదిద్దింది. ఎన్ని ఉద్యమాలు చేసినా సరే జమిందారుల ఆగడాలు ఎక్కువయ్యాయి తప్పితే, తగ్గుముఖం పట్టలేదు. వారి అధికార దర్పాన్ని సవాలు చేస్తూ మందస కొండ ల్లోని రుక్కమెట్ట అదుపు అడవికి వెళ్ళి వంద ఎడ్లబళ్ళ పై కలపను తీసుకురావడానికి రైతులు సిద్ధపడాలని గున్నమ్మ పిలుపునిచ్చి కలపను తరలించటానికి ప్రణాళికను తయారు చేసింది. ఆమెకు సహకరించేందుకు స్థానిక రైతు కుటుంబాలు కూడా ముందు కొచ్చాయి. గున్నమ్మ నాయకత్వాన రైతులు కదిలి అడవిలో కలపను నరికి బళ్ళ పై ఎక్కించారు. విషయం తెలుసుకున్న మందస జమీందారు జగన్నాధ రాజమణి బెంబే లెత్తి పోయాడు.

          రైతులు తిరుగుబాటును అణచివేయాలని దివాను రామకృష్ణదేవ్‌ను, ఫారెస్ట్‌ రేంజర్‌ కృష్ణచంద్రరాజుకు హుకుం జారీ చేశాడు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులను, వారి ఎడ్ల బళ్ళను ఆపేందుకు ప్రయత్నించారు. జిల్లా కలెక్టర్‌, ఎస్‌ఐకి, మెజిస్ట్రేట్‌లకు సమాచారం పంపించారు. అడవి నుంచి కలప తరలించడానికి వీల్లేదని ఫారెస్టర్‌హుకుం జారీ చేసాడు దివాను రామకృష్ణదేవ్‌ అండ చూసుకొని పోలీసులు మరింత రెచ్చిపోయా రు. స్త్రీలు, పసిపిల్లలు అన్న తేడా లేకుండా అందరి ఇళ్ళలోకి జొరబడి విచక్షణా రహితంగా కొట్టారు ఉత్తరాన పొలంలో గుమిగూడి ఉన్న ప్రజల్లోకి వెళ్ళి కలపను స్వాధీనం పర్చాలని గద్దించారు . రైతుల ముఖాల్లోని ఉద్రిక్తత, వీరావేశం చూసి పోలీసులు తోక ముడిచి ఇంటిదారి పట్టారు. గున్నమ్మ నాయకత్వంలో రైతులు కలపను తీసుకుపోయా రు. అనంతరం పూలదండలతో, పసుపు కుంకుమలతో ప్రజలు గున్నమ్మ నుదుట వీర తిలకం దిద్దారు. 1940 మార్చి 30న రాత్రి రాజమణిపురంలో అభినంద సభ ఏర్పాటుచేసి గున్నమ్మ ధైర్యసాహసాలను కిసాన్‌ నాయకులు ప్రశంసించారు.

          పోలీసుల దమనకాండకు గున్నమ్మ ఏ మాత్రము బెదరలేదు తన ఉద్యమాన్ని నీరుగార్చ లేదు. 1940 ఏప్రిల్ 01 న రాజపురం గ్రామ శివారులో జమిందారు సేనలకు, రైతులకు భీకర పోరాటం జరిగింది. యుక్త వయసులో ఉన్న గున్నమ్మ వీరనారిగా, తన తోటి మహిళలతో కలిసి ఆ సేనలను ధీటుగానే ఎదుర్కొంది.ఈ పరిస్థితిని తెలుసుకున్న జమీందారు ఆందోళనతో అల్లాడిపోయాడు. జిల్లా ఎస్‌పి, సబ్‌కలెక్టర్‌, పోలీస్‌ సర్కిల్‌, సోంపేట మెజిస్ట్రేట్‌ తమ బలగాలతో వచ్చి రైఫిళ్ళు, తుపాకులు చూపుతూ జనంలోకి ప్రవేశించారు. కదిలితే కాల్చి వేస్తామని బెదిరించడంతో ఈటెలు, బల్లాలతో రైతులు యుద్ధానికి సిద్ధమయ్యారు. గూడెన నరసింహులు, గొర్లే దాలి బందు, గొర్లే జంగాలు, నెయ్యిల మంగళ, గొర్లే చంద్రయ్య, గొర్లే కర్రెన్నల చేతులకు బేడీలు వేసి పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించారు. పోలీసు శకటం కదలకుండా దానికి అడ్డంగా రైతులు పడుకు న్నారు . ఈ దృశ్యాన్ని చూసిన గున్నమ్మ “బేడీలు వేసి చెరలో పెట్టడానికి మీకెన్ని గుండె లు రా” అని గర్జించింది. శకటానికి అడ్డంగా నిలిచింది. ఈ పోరాటంలో కత్తులు, కటార్లతో పాటు కొన్ని వ్యవసాయ పనిముట్లను కూడా వీరు ఆయుధాలుగా వాడారు గున్నమ్మ గుండెకు తుపాకులు గురిపెట్టి పక్కకు తప్పుకోవాలని పోలీసులు ఉన్నతాధికారులు హెచ్చరించినా గున్నమ్మ తప్పుకోలేదు.”నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ నా రైతు లను బందీలుగా పోనివ్వను” అంటూ మరలా గర్జించడంతో ఓ పోలీసు ఆఫీసర్‌ రివాల్వర్‌ పైకెత్తాడు. గున్నమ్మలో ఏ మాత్రం చలనం లేకపోవడంతో పోలీసులను ఆశ్చర్యపరిచిం ది. ఒకవైపు మొండికేసిన ప్రజలు, మరోవైపు జమీందారు హుకుంతో రెచ్చిపోయినపోలీసు అధికారులతో ఆ ప్రాంతం యుద్ధభూమిగా మారింది. కేకలు, అరుపులు, తుపాకీ శబ్దాలు మిన్నుముట్టాయి. గున్నమ్మ పొట్టలోంచి తుపాకీ గుళ్ళు దూసుకుపోయాయి.. గున్నమ్మ తో పాటు గుండ బునియాద్, గొర్లే జగ్గయ్య, కర్రి కళియాడు, గుంట చిననారాయణ పోలీసు ల కాల్పుల్లో మృతి చెంది జిల్లా రైతాంగ ఉద్యమాల చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందా రు.. అయినా సరే, ఫలితం కనిపించలేదు. గూడెన నరసింహులు, దాలిబందు, గొర్లే జంగాలు, నెయ్యిల మంగళ, చంద్రయ్య, కర్రెన్న మొదలైన రైతులు పోలీసు కాల్పులలో అక్కడికక్కడే మరణించారు. ఆ పోరాటంలో పోలీసుల తూటాలకు నిండు చూలాలుగా ఉన్న గున్నమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఆ విధముగా 1940 ఏప్రిల్‌ 1న సాయంత్రం 6.30 గంటలకు గున్నమ్మ వీరమరణం పొందింది.

          గున్నమ్మ స్మారకార్థం ఆమె నివాస గ్రామం మందస గ్రామాన్ని ప్రస్తుతం వీర గున్నమ్మపురంగా లేదా విజీపురంగా పిలుస్తున్నారు. బైరిసారంగ పురానికి చెందిన ఏకైక గంగిరెడ్ల కళాకారుడు బాడి సూరన్న గున్నమ్మ కథను ఇప్పటికీ తన బృందం ద్వారా ప్రచారం చేస్తున్నారు. బాన అప్పారావు అనే ఆయన ఆమె కథను ఓ చిత్రంగా కూడా రూపొందించారు. రచయిత నల్లి ధర్మారావు గున్నమ్మ చరిత్రను అక్షరబద్ధం కూడా చేశారు. ఆ గ్రామానికి వెళ్ళే ముఖద్వారంలో ఆమె పేరున సింహద్వారాన్ని ఏర్పాటు చేశారు. మృతి చెందిన చోట జ్ఞాపకార్ధం మసీదు నిర్మించారు. దీన్ని అప్పటి గవర్నర్ కుముద్ బెన్‌జోషి ప్రారంభించింది. తెలుగింటి ఆడపడుచుల తెగువకు ప్రతిరూపంగా గున్నమ్మ చరితార్ధమైంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.