బతుకు చిత్రం-38

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత  

***

          కమల మరణం జాజులమ్మలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించింది.

          తన ద్వారా సైదులుకు వారసున్ని ఇచ్చి ఆ కుటుంబం ఋణం తీర్చుకోవాలని అనుకున్నది. కానీ ఇలా బెడిసికొడుతుందని ఊహించలేకపోయింది. ఇలాంటి మందు లనీ మాకులనీ అమాయకులైన ప్రజల ప్రాణాలను గాలిలో కలుపుతున్న మోసగాళ్ళ పని పట్టాలని కూడా అనిపించింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యంగా తోచింది.

          ఏనాటికైనా ఆమెకు తగిన బుద్ది చెప్పినప్పుడే కమల ఆత్మకు శాంతి  కలుగు తుందని గట్టిగా నమ్మింది.

          పిల్లలకు అన్నం తినిపించే సమయం దగ్గర పడుతున్నా, జాజులమ్మ అందుకు పొయ్యి వెలిగించకుండా ఒక్కతే మ్రాన్పడి ఉండడంతో ఈర్లచ్చిమి, జాజులూ …ఏందే?పోల్లగాన్డ్లకు బువ్వయాల్లయితాంది గాదె? పొరకలు దెచ్చి పొయ్యి రాజేయ్యక పోతివి?అనుకుంటూ …

          అంతకు ముందు కుప్పపెట్టిన తుమ్మ కంపల కెళ్ళి పొరకను చాలా జాగ్రత్తగా బయటికి గుంజుతూ పొయ్యి దగ్గరకు చేర్చింది.

          అత్త చేస్తున్న పని చూసి జాజులమ్మ దిగ్గున లేచి ,

          నీ కెందుకు? ఈ పొయ్యి పని ? పాణం మంచిగలేకపాయే. కమల చనిపోయిందని ఈ మద్దెల మనాది గూడ తోడాయే. అని అత్తను కోపగించుకుంటూ లేపి తను కూచుంది.

          ఈర్లచ్చిమి జాజులమ్మని, ఆమె కోపాన్ని చూసి చిన్నగా నవ్వుకొని,

          జాజీ! నెనూ నీకు ఏ జన్మల్నో అప్పు ఉన్ననే! లేకుంటే నన్ను కన్నతల్లోలె కూసుండ వెట్టి సాదవడితివి. నేను నీకు, కమలకు ఏమి ఒరగవెట్టిన. నా సార్థంతోనే ఆనాడు నీకు, మామ సార్థంతోని కమలకు అన్నాయం చేసిన. అని కండ్ల నీళ్ళు దీసుకొని పమిట కొంగుతో తోడ్చుకోసాగింది.

          ఆ మాటకత్తే నేను మాత్రం కమలకు ఎన్నో ఆశలు వేట్టిచ్చి అడవి పాలు చేసిన గదా! ఆ పాపం నాదే అన్నది.

          ఇద్దరూ ఇట్లా మాట్లాడుకుంటుండగా…

          సైదులు, రాజయ్య ఇద్దరూ ఒకేసారి పని నుండి వచ్చి పొయ్యికాడ చేరారు.

          పోల్లగాన్డ్లేరే? అన్నడు రాజయ్య. పిల్లలు కనిపించక పోవడంతో.

          బైట ఏడ ఆడుతాండ్రో. బువ్వ యాళ్ళకు ఆళ్ళే అత్తరు తీ! అన్న ఈర్ల్చ్చిమి మాటలకు,

          రాజయ్య కస్సుమంటూ ,

          ఏందే? ఈ నడుమన పొల్లగాండ్లను ఎత్తుకవోయ్యే దొంగలు ఊర్లల్ల జోర్రవడుతాండ్ర ట. పోలీసోళ్ళు పొల్లగాండ్లు పైలమని చేవిల మైకు వేట్టినట్టు చెప్పుతాంటే గూడ నీకు చెవుల పెను పారకుంటే ఎట్లా? అని భుజం మీది తువ్వాలు గట్టిగ దులిపి లేశిండు.

          జాజీ! అవ్వకు మంచిగుంటలేదని తెలిసి నువ్వు ఇంత నిర్లచ్చనం ఎందుకు జేత్తానవ్? అన్నాడు సైదులు గూడా లేస్తూ.

          జాజి పనికి పొయ్యి రావట్టే. మీ అవ్వయితే వట్టిగనే ఉంటాంద్ గదా! దానికున్న పనేమున్నది? పొల్లగాండ్లను సూస్కునుడు గాకుంటే .

          అవునయ్యా ! నాకున్న పనేమున్నది ? ఇట్ల కూసునవరకే కన్నంటుకునే.

          కమల పోయినకాన్నుండి ఎప్పుడు నిర్దవోతాందో ! ఎప్పుడు తింటాందో ఎరుక లేకుంతుండవట్టె.

          అన్న జాజులమ్మ మాటలకు ఇద్దరూ మాట్లాడకుండా గలుమ దాటుతుండగా పిల్లలు రివ్వుమని ఉరికి వచ్చారు.

          ఏడ పోయిండ్రె? నా బంగారు తల్లులు? అన్నడు సైదులు ముగ్గురినీ పొదివి పట్టుకొని.

          పెద్దబిడ్డ చెప్పుడు సురువు జేసింది.

          నాయనా! మేము ఆడుకునటానికని చేరు పక్కేంబడి మల్లు తాత ఇంటికి పోయినం……

          అనంగనే, జాజులమ్మ పోయ్యీల కెళ్ళి మండుతున్న పొరకాసు దీసింది. కోపంగా పిల్లల దగ్గరికి వెళ్ళి ,

          ఏందీ? చెర్వు కట్టేమ్బడి మల్లు తాతింటికి పోయినారు. భయముంటే ఇట్ల జేత్తురా?చెర్ల వడితే ఎట్లుండు.పెయ్యిల భయం భాతం లేకనే కదా! ఒకసారి సురుకు వెడితే మల్ల ఆగ్నలుంటరు. అని పెద్దబిడ్డ రెక్క వుచ్చుకోవోయింది.

          ఆ పిల్లలు భయంతో సైదులు ఎనక చేరిండ్రు.

          ఏయ్! నీకేమన్న పిచ్చివట్టిందా? పొల్లగాండ్లను కాల్చి సంపుతవా? అని అందరూ అడ్డుపడ్డారు.

          ఈర్లచ్చిమి, జాజీ ! ఎన్నడన్న గిట్ల పిలగాండ్ల మీదికి గింత గుస్సయినావే? అని పోరాకాసు ఇసిరి అవతల పారేసింది.

          పొల్లగాండ్లు జడుసుకొని జరమందుకుంటే ఏం జేత్తవే ? అని

          ఈ తాప పోమని అమ్మకు చెప్పుండ్రి బిడ్డా! అని పిల్లల వయిపు తిరిగింది.

          బాపమ్మా! అసలుకు ఏమయిందో ఎరికేనా ? అని మల్ల జెప్పుడు సురువు జేసింది.

          మేము మన గాలుమట్లనే ఆడుకుంటాంటే మల్లు తాత మా కాడికి అచ్చి, బిడ్డా!         దూపయితాంది గిన్నాన్ని మంచినీళ్ళు దేపో అన్నడు. సరే అని నేను ఇంట్లకచ్చి తీసుకొని పోయేవరకే లేడు. సూస్కుంట సూస్కుంట అటేటు వోయినం……అని జెప్తుండ గానే మల్లు తాత ఆదిలచ్చిమి వచ్చింది.

          పెద్దవ్వా ! నీ మనుమరాండ్లు లేకుంటే మా నాయన నాకు దక్కేటోడే గాదె ! ఈ సక్కని తల్లులు నాయనకు మల్ల అవుసు పోసిండ్రు. బిడ్డలాల ! నా అవుసు గూడ మీరే పోసుకొని ఎయ్యేండ్లు బతుకుండ్రి బిడ్డా ! అంటూ తను తెచ్చిన అరటి పండ్లు ఇచ్చింది.

          ఈర్లచ్చిమి, జాజులమ్మ, సయిదులు, రాజయ్య గిన అందరూ బీరిపొయ్యి ఏం అర్థం గాక చూస్తుండడంతో ఆదిలచ్చిమి ఈర్లచ్చిమి కూసోమ్మని ఏసిన మంచంల కూసోని చెప్పవట్టింది.

          నాయన ఈల్లను తాగానికి మంచినీళ్ళడిగి కూసునే వరకు కుక్క ఎంబడి వడ్డదట. ఉరుకుడుపట్టి వెట్టి దిబుక్కున చెర్ల వడ్డడట. ఈత రాని మనిషాయే. మునుగుతాంటే మీ పొల్లగాండ్లు సూసి ఉరికిపొయ్యి పక్కపోంటి గోర్లగాస్తున్న పోరనికి జెప్పంగనే వాడు ఉరికచ్చి చెర్ల దునికి ధోతి దొరకవట్టి ఈదుకుంట ఒడ్డుకు దేచ్చిండట. పట్టపగటీలి గదా!జనాలు లేక ఎవ్వలు సూడకుంటే ఇయ్యాల ఎట్లుండునో! అని కండ్ల నీరు దీసుకున్నది.

          జాజులమ్మ పిల్లలను గట్టిగా అదుముకున్నది పావురంగా.

          ఇగజాలు నీ సంబురంగని తానాలు బోసి బువ్వ తినవెట్టుపో ! అని, ఆదిలచ్చిమితో 

          ఔనే లచ్చిమి! నాయనగా పొద్దు మీ అన్నల కాడ ఉంటాండు అంటివిగదా! అమాస నుండి పున్నం దాక ఒగరు, పున్నం నుండి అమాస దాక ఒగరని వంతులేసుకున్నరంటి వి. మరిప్పుడు ఇక్కడికేందుకచ్చిండు? అని అడిగింది.

          ఏం జెప్పనే పెద్దవ్వ! ఆళ్ళకు ఈనెను సాదనీకి బరువయితాంది. బుక్కెడు బువ్వ ఎసేటానికి మొద్దులు మోపులు ఎత్తినట్టు గావట్టె. ఈనె మొదటి నుండి నీసు ముట్టడు గదా! వాళ్ళకేమో నీసు లేంది ముద్దవోదు గదా !

          అయితే, తింటే తిప్పల గని తినకుంటే తిప్పలేమున్నదే? ఇచ్చంత్రం గాకుంటే ?

          గదే! ఇచ్చంత్రం. ఈనెకు మల్ల పతాకం వేరే కూరోండాల్నంటే వాళ్ళతోని అయిత లేదట. ఇగ మాపటికి రొట్టె తప్ప బువ్వ అలవాటు లెనోడాయే. చెయ్యనీకి వాళ్ళకు చాతనయితలేదు. ఒగాల అయినా, గోధుమలు, జొన్నలు దెచ్చి మర వట్టిచ్చి చెయ్యా ల్నంటే వాళ్ళకు దరిత్తలేదు. కోపను బియ్యం పుక్కిడి బియ్యం ఉదాకవెట్టి పొద్దుమాపు తినేటోల్లాయే. వాళ్ళకు వశమయితలేదు. ఇగ దీని తోని గునిపిచ్చుడు ఎక్కువయితాంది. ఇది జూసి ఇంకోగాడు గూడ వాని కాడ ఏది వేట్టినా తింటానవ్ . నా కాడికి వచ్చేసరికే ఎందుకు సతాయిన్చుతానావ్ ? అని వాడు గట్నే తయారయిండట .

          అయ్యో ! గింత పాపమానే ?

          ఇంకిను , ఆళ్ళ సంగతి. అవ్వ నగలన్నీ దొబ్బి పోయింది. నువ్వు సుతం సప్పుడు జేయ్య పోతివి. దాన్ని గ్గూడ వంతు వేట్టుడే అని మాట్లాడుడట.

          బాపు నాకు బిడ్డ లగ్గానికి అయితదని నా పెళ్ళప్పుడు వరకట్నం ఏం పొయ్యపోతి నని, ముందటికి ఈల్లిధ్ధరు పెట్టకున్నా పుట్టింటి సొమ్మని దాని ఇలువ, ఈల్ల ఇలువ ఉంటాదనేగదా ! అట్ల జేసింది.

          ఔ  మల్ల మంచిగ సోచాయించిండు.

          మనం మంచిగున్నది అన్తానం గని ఆళ్ళు ఇంటలేరు. అయినా నాకు నాయన బరువు గాదని రమ్మని అన్న. నా కాడ నీ ఇచ్చ వుట్టినన్ని దినాలు ఉండుమని అంటే , నాయన కొడుకులని కాని కాలాన సూత్తరని ఆళ్లకే వేడితి . నిన్ను లగ్గం జేసి పంపింది మొదలు ఎన్నడన్న ఉప్పోసకన్న తోలుకచ్చిండ్రా. ఆల్లకు భయపడి నేను , మీ అమ్మ సుతం సప్పుడుజేయ్యకుంటిమి . అని ఆడివిల్లని తక్కువ జూసినందుకు నాకు గిట్నే కావాల్నని కుములుతాండు.

          పొయ్యే కాలానికి ఈ చాదస్తం ఎట్లనే ?

          గదే ! నేను, ఆయన కోపం జేసినం. జేసి బల్మీటికి తోల్కపోతే పదోద్దులు ఉన్నడు. మనువండ్లు కండ్లల్ల కనవడుతాండ్రని అచ్చిండు.

          మరి వాళ్ళు రమ్మని అన్లే?

          ఆళ్ళు ఇదే సందని పెద్దాయనకు మా తిండి సహించుత లేదట. తనది తను వండుక తింటనని ఊరు వోయిండని చెప్పవట్టిరి. ఇప్పుడు సుత ఇసయం జెప్తే నిమ్మకు నీరేత్తినట్టే ఉన్నరు గని సప్పుడు జేత్తలేరు.

          మరె ట్లా !

          పెద్దవ్వా ! కన్నోడని ఆల్లకు లేకుంటే నాకేంది? నేను తోల్కపోత . లేదంటే నేనే ఈడికత్త.

          లంకంత సంసారం ఇడ్సి నువ్వెంట్లుంటవె ?

          ఉంటా ! సూస్కుంట పెద్ధమనిసిని ఆగం జేత్తే నా ఓళ్ళు అందరిట్ల నాదాను గారు అన్నది. జాజులమ్మ పిల్లల పని ముగించి వచ్చి ముచ్చట వినసాగింది.

          రాజయ్య జాజులమ్మ ఇచ్చిన కాల్చిన కంకి తినుకుంట ఆదిలచ్చిమి జెప్పేది ఇనుకుంట ఉన్నడు.

          సయిదులు పిల్లగాండ్లకు పక్కలు సర్ధవట్టిండు.

          ఆదిలచ్చిమి ఈల్లను జూసి, మిమ్ముల జూత్తాంటే ముచ్చటయితాందే. ఎవ్వల పని వాళ్ళు సక్కగ జేసుకుంటాండ్రు. నా ఓళ్ళు  గిట్లుంటే నాకెంత నిండుగుండు. అని పోవడానికని లేచింది .

          రాజయ్య, నువ్వు రంది వేట్టుకోకు బిడ్డా ! నేను నాయనతోని మాట్లాడి నీతోని తోలిత్త తీ ! నువ్వు ఆగం గాకు. అని దైర్యం జెప్పిండు.

          ఆదిలచ్చిమి వెళ్లిపోయింది.

          అందరూ భోజనాలు ముగించారు.

          పిల్లలు పడుకోవడానికి మారాం చేస్తుంటే సైదులు పడుకుంటే మీకు ఏది గావాల్నంటే అదిత్త అన్నడు.

          చిన్నబిడ్డ , గట్లయితే కమలమ్మను తీస్కరా !అన్నది.

          ఊహించని ఈ కోరికకు అందరూ ఆచ్చేర్యంగా చూడసాగారు.

          పిలువు, రమ్మను అంటూంటే ఏమనాలో తెలియక బిక్క మొగం వేశాడు.

          ఈర్లచ్చిమి వచ్చి ,

          మీ మాట మీద నేను పిలుస్త. మీ మీద కోపముంటే మాత్రం రాదు. మీరు బుద్దిగుంటే సంబురంగ వస్తదని చెప్పి పాటందుకున్నది.

ఎందువోతివే నీవు సూడ సక్కాని తల్లీ …….

మబ్బుల్ల తో గూడి వానయ్యి రారాదే …..ఓ  సుందరాంగీ !

చెరువుల్ల కమలాలయి  చెరువంత అల్లుకోవే ….ఓ సుందరాన్గీ !

అమ్మ్స పున్నముల జాడల్ల నిన్ను ……..

ఎతుకుతున్నరు గాదె ఓ సన్నుతాంగీ ………..

***

          అని పాడుకుంటూ పోగా పిల్లలు నిద్ర లోకి జారుకున్నారు. అందరి కళ్ళలో నీళ్ళు చేరాయి.       

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.