వెలుగు రేకల చీకటిపువ్వు

-వసీరా

          మా నేస్తం కత్తిపద్మ. విశాఖ సముద్రంలో ఒక చిన్నిచేపపిల్ల. ఈ చేపపిల్ల ఏకంగా సముద్రం కథనే కథలుగా చెప్పగలదు. చిన్ని చేపపిల్ల సముద్రం లోతుల్ని విస్తృతినీ, ఆకాశాన్నీ దానిలో సగమైన మట్టిబతుకుల వెతల్నీ కథలుగా చెప్పగలదు. చేపకి సముద్రం గురించి తెలిసినట్టుగా ఆమెకు జనజీవన సాగరం తెలుసు.
 
          ఆమె ఉత్తరాంధ్ర జనజీవన సాగర సంచారి. విప్లవ కారుడు నీటిలో చేపలా ప్రజల మధ్య పనిచెయ్యాలట. పద్మ ఆ పనిచేసింది దాదాపు నాలుగు దశాబ్దాలుగా. ఆమెకు వెన్నెల సముద్రం తెలుసు. దు:ఖ సముద్రమూ తెలుసు. నిజమే ఆమె ఒక ఉప్పు నీటి బిందువు. ఆమె మాటల్లో చెప్పాలంటే తానొక దు:ఖపు చారిక. ఒక బాధితురాలు. సముద్రంలోతుల్లోని చీకట్లని మధించి చీకటి పువ్వులను ఏ వెలుగులో చూడాలో చెప్పింది. చీకటి పువ్వులు వెదజల్లే పరిమళాలనూ ప్రసరించే వెలుగులనూ చూపిం చింది. నెత్తురూ కన్నీరూ కలలూ కలగలిసిన కఠోర వాస్తవ జీవితానికి పూచిన చీకటి పువ్వు లని చూపించింది. ఆమె జీవన వాస్తవికతకు నిబద్ధురాలు. తన హృదయానికి నిబద్ధురాలు.
 
          ఈ కథల్లో ఆమె బాధితుల వైపు నిలబడ్డారు. సమాజం దృష్టిలో చట్టం దృష్టిలో వాళ్ళేవరైనా పేదల కోసం నిలబడ్డారు. ఆమె మహిళల వైపు నిలబడ్డారు. పురుషుల వైపూ నిలబడ్డారు. జెండర్ అన్యాయాలను చూపిస్తూనే ఒక మొత్తం సామాజిక వాస్తవికతలో అదెలా విడదీయలేని భాగంగా ఉందో చూపించారు. 
 
          మీకు నడుస్తున్న సమాజంలోని జీవన బీభత్సాన్ని దర్శించాలని ఉందా? అయితే చీకటి పువ్వు కథలు చదవాల్సిందే. మహాయుద్ధ బీభత్సంలోనూ కళ్ళంట కారే కన్నీటిని తుడుచుకుంటూ, గాయాలు స్రవించే నెత్తురు తుడుచుంటూ, మనస్ఫూర్తిగా నవ్వే, వెటకారాలాడే సాహసమూర్తులను చూడాలని ఉందా? …వెన్నులో కత్తిదిగినా యుద్ధం ఆపని వీర వనితల్ని చూడాలని ఉందా? సమస్త ఆయుధ సంపత్తీ ఉన్న శత్రువుతో నిరాయుధంగా కలబడిపోయే ప్రేమ మూర్తులను చూడాలని ఉందా? ఓ పంది తల్లి పురిటి నొప్పుల బాధ మిమ్మల్నెప్పుడైనా కలచి వేసిందా? మనుషుల్లోనూ జంతువుల్లోనూ కూడా కన్పించే మహామాతృమూర్తుల ప్రేమ సౌందర్యం చూడాలని ఉందా. జీవన పోరాట సౌందర్యం చూడాలని ఉందా? అయితే చీకటి పువ్వు చదవాల్సిందే.
 
          రామారావు మాస్టారి కథలకు ముందుమాట రాస్తూ రావిశాస్త్రిగారు చెప్పిన చెహోవ్ కథ ఇన్ ది గల్లీ (in the ravine) గుర్తుందా? (కష్టాలు మర్చిపోడానికి పాటలు పాడుతూ ఇటుకల బట్టీలో పనిచేసే ఒక స్త్రీ. ఆమెకి నెలల శిశువు. తోటి కోడలు ఉడుకునీళ్ళు పోస్తే చచ్చిపోయిన పసికందుని ఒడిలో పెట్టుకుని, గుర్రబ్బండిలో వెళ్తుంటుంది. అప్పుడు ఆమెతో గుర్రబ్బండివాడు ఎంతో ఓదార్పుమాటలు చెప్తాడు). ఈ కథలు గుర్రబ్బండి వాడి ఓదార్పు మాటల్లా ఉండవు. బాధితురాలు శోకంతో పాడిన పాటల్లా ఉంటాయి. . బూరెబుగ్గల పిల్ల కథలో చిట్టెమ్మ శిశువు శవం మూట అందుకు నెత్తిమీద పెట్టుకుని పాడిన పాటలా ఉంటాయి. నాకు చెకోవ్ కథ గుర్తొచ్చింది. అలెగ్జాండర్ కుప్రీన్  గుర్తొచ్చాడు. ఇంకో మాట …ఆ మహారచయితల్లో నేను దర్శించలేని కొన్నికోణాలు కూడా ఇందులో కన్పించి నన్ను అబ్బురపర్చాయి. 
 
          ఎర్ర ముక్కుపుడ కథ చూడండి. రామలక్ష్మి సత్యవతి మధ్య కంపాషియన్తో ప్రారంభమైంది. ఇదే కాదు. చాలా కథల్లో బాధితుల మధ్య ఈ విధమైన కపాషియన్ కన్పిస్తుంది. బాధితుల మధ్య ప్రేమ కామ్రెడరీ ఎంత మానవీయంగా ఉంటుంది. ఈ సహానుభూతి ఎందుకో క్రూరమైన  మానవ సంబంధాల్లో కూడా ఇంకా ఏదో మంచి ఉందనే ఆశ కలిగిస్తుంది. ఆడపిల్ల పెళ్ళి కొడుక్కంటే పొట్టిగా ఉండటం ఆమె తప్పే. పొడుగ్గా ఉండంటం కూడా ఆమె తప్పే. ఆరోగ్యంగా ఉండటం తప్పు. ఆనాగోగ్యంగా ఉండటం. వైకల్యం తప్పే. వైకల్యం లేకపోవడం తప్పే. సంపాదిండం తప్పు. సంపదిం చకపోవడం కూడా తప్పు. ప్రతీ దానికీ  కూడా ప్రమాణం మగాడు. మగాడి గుణగణాలు రూపు రేఖలు బట్టి ఆడదాని అందానికి ఆరోగ్యానికి ఆర్థిక స్వాతంత్రానికి విలువలు మారిపోతాయి. ఎంత భయంకరంగా మారిపోతాయో ఈ కథలు కళ్ళకు కట్టినట్లుచెప్పాయి. వాస్తవం కంటే భయంకరమైన వాస్తవాలు దీనిలో ఉన్నాయి. 
 
          మనుషులకి ప్రేమ కావాలి. ప్రేమించాలి. ప్రేమించబడాలి. అయితే సామాజిక కట్టు బాట్లు ఆస్తి సంబంధాలు మానవీయ సంబంధాల్ని విచ్ఛిన్నం చేస్తాయి. స్త్రీ పురుషులు అనివార్యంగా రెండు వర్గాలుగా విడిపోతారు. స్త్రీ ఎప్పుడూ కూడా ఎమోషనల్ గా, శ్రమ పరంగా  దోపిడికి గురయ్యి చివరికి నడిరోడ్డు మీద ఎటు వంటి భరోసా లేకుండా నిలబడాల్సి వస్తోంది. రామలక్ష్మి  పొడుగ్గా, అందంగా సౌష్టవంగా ఆనందంగా ఉండటం కూడా ఆమె తప్పే , అయితే దానికీ రెండు కుటుంబాలూ సమాజం అంగీకరించే పరిష్కా రం ఓటుంది. నష్టపరిహారం ఉంది. అదేటంటే ఎక్కవ కట్నం అడగటం. సగర్వంగా ఎంత కట్నం ఇచ్చేసి అయినా పెళ్ళి చేసేయ్యడం. రామలక్ష్మి  ప్రమేయం లేకుండా ఈ పరిహారం అమలైపోయింది. వర్గ, పురుష సమాజానికో ఇంకో చిహ్నం షావుకారు చిన్న బ్బాయి ప్రవేశించాడు. రాము చిన్నబ్బాయి ప్రేమ కొంతకాలం నడించింది. చిన్నబ్బాయి కి పెళ్ళి చేయకపోతే ఆస్తిలో వాటా ఇవ్వం అన్నారు పెదనాన్నలు. చిన్నబ్బాయికి వాళ్ళ  నాన్న చేసిన ఉపదేశం. ‘‘పెళ్ళి చేసుకోరా చేస్సుకుని ఆయమ్మతో తిరిగితే నిన్నెవలు అడుగుతారు మొగోడివి నీకు లెక్కేటి?’’. చిన్నబ్బాయికి  తన వర్గం పరిష్కారం దొరికే సింది. పెళ్ళయ్యి పిల్లలు పుట్టేశారు. పాపం బంగారం లాంటి రాము, . ప్రియురాలు రాము  నిజానికి మొదటి పెళ్ళాం. మిల్లులో రెక్కలు ముక్కలు చేసుకుంది. అయినా రామలక్ష్మికి రెండో పెళ్ళాం హోదా కూడా లేకుండా ఉంపుడు గత్తె అయ్యింది. చిన్నబ్బాయి కొడుకు ల దగ్గరికి వచ్చేసరికి ఆహోదా కూడా పోయింది. దానికి మళ్ళీ ఆస్తి సంబంధమే  కారణ మయ్యింది. ‘‘ఇంట్లో ఉన్న నన్ను, పెళ్ళయిన నన్ను, ఎన్నడూ మాటపడని నన్ను, ఇల్లు లేకుండా ,మొగుడు లేకుండా ఒంగిపోయి లొంగిపోయేలా చేసిన ఎదవా.! ఎవడ్రా రోడ్డు మీదకి లాగిందీ. నువ్వు కాదూ!’’ అని ఫిల్టు పట్టేసుకుంది
 
          నాకెందుకో మా నేస్తేం సావిత్రి రాసిన బందిపోట్లు కవిత గుర్తొచ్చింది. కన్యాశుల్కం లో రామప్ప పంతుల్ని పట్టుకుని బందిపోటు గాడిద కొడకా అని లుబ్దావధాన్లు తిట్టిన తిట్టు గుర్తొచ్చింది. ఈ బందిపోట్లతో భార్యస్థానం కోసం పోరాడితే ఏం జరుగుతుంది. కథ మళ్ళీ మొదలవుతుంది. రామలక్ష్మికి తెలుసు. ఆమె తన కాళ్ళ మీద తను నిలబడ దల్చుకుంది. తన శ్రమకి తగిన వేతనం డిమాండ్ చేసింది. కథగా సుఖాంతంఅయ్యింది. పరిష్కారం వైయక్తికం కావచ్చు. ఈ కథలో పద్మ లేవనెత్తిన ప్రశ్నలకు  జవాబులెక్కడు న్నాయి.
 
          పద్మ చెప్పింది. ఈ జీవితాలు తనకు కొన్ని ప్రశ్నలు నేర్పాయని, అలాగే ఇంకొన్ని పరిష్కారాల వైపు ఆలోచింప చేశాయని. బహుశ సామాజిక వేత్తగా ప్రశ్నలు రేకెత్తిస్తాయి. ప్రజా రాజకీయవేత్తగా ఆలోచింప చేస్తాయి. ప్రజారాజకీయం చేసే పార్టీలన్నీ కూడా కత్తిపద్మ రాసిన కథలని అధ్యయనం చెయ్యాలి. ఆమె లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఒక మార్కిస్టుగా శ్రమకు తగిన వేతనం అడిగింది. అదనపు కోణం స్త్రీవాద దృక్పథం. అక్కడితో అవ్వలేదు. చట్టం , దాన్ని అమలు చేసే వర్గాల నుంచి విశాలమైన సమాజంలోని అన్ని వర్గాల్లో ఏ భూస్వామ్య పురుష సంస్కృతి అన్ని అవలక్షణాలకీ మూల కారణమై ఉన్నదో  దాని సంగతి ఏమిటి? దానిపట్ల ప్రజా రాజకీయాలు చేసే వారి బాధ్యత ఏమిటి? అని కూడా పద్మ ఈ కథల్లో ప్రశ్నించారని నేను అనుకుంటాను. 
 
          కత్తిపద్మ చేయితిరిగిన రచయత్రికాదు. ఇది తొలిప్రయత్నం. అయితే కథా వస్తువు లు అనితర సాధ్యం. తీసుకునే వస్తువులో ఇతరులకు సాధ్యం కాని అంశాలు ప్రజా జీవితం వల్ల ఆమెకు అలవోకగా లభించాయి. అయితే, కథనంలోనూ శిల్పంలో కూడా ఆమె ప్రదర్శించిన ఒడుపు తక్కువేమీ కాదు. దీనికి నైవేద్యం, మంత్రసాని కథలు ఉదాహరణలు. మంత్రసాని కథ జంతువుల కథ కాదు. అదొక కావ్యం. కథా కావ్యం. ఇక నైవేద్యం  కథ విషయానికి వస్తే , నైవేద్యం కథ ప్రారంభమే ఎంతో అనుభవం ఉన్న రచయిత మాదిరిగా ప్రారంభించింది. విశ్వం మావయ్య వింత ప్రవర్తన ఉత్కంఠ కల్గి స్తుంది. 
 
          పద్మచెప్పుకున్నారు. నేనూ ఒక బాధితురాలినే నని. అందుకే నేరుగా బాధితురాలి స్వగతంగా కథ చెప్తుంది. ఇలా పరకాయ ప్రవేశం కాదు. బాధితుల ఆత్మలోకి ప్రవేశిం చడం. అటు అత్తయ్య, ఇటు విశ్వం మావయ్య. అవిటి పిల్లాడి పట్ల విశ్వం మావయ్య కఠిన వైఖరి ఆమెని గాయపర్చింది. ఎంతో ప్రేమ చూపించిన విశ్వం మావయ్య చివరికి రాయి లా మారిపోయాడు. ప్రేమ రాహిత్యం ఆమెను రకరకాల దారులంట తీసుకెళ్ళింది. మరొకరితో బిడ్డను కంది. ఎవరంగీకరించినా భయటపడలేదు. తనకు పుట్టిన బిడ్డ పట్ల కఠినంగా ఉన్న విశ్వం మావయ్య , వేరొక తండ్రికి పుట్టిన బిడ్డ పట్ల ఇంకెత కఠినంగా ఉంటాడు. కుటుంబవూ , కట్టుబాట్లూ సమాజం అన్నీ ఉన్నాయి ఈ కథలో. అన్నిటికంటే ముఖ్యమైనది శిలగా మారిన విశ్వం. సైంటిఫిగ్గా ఆలోచించే మావయ్య శాపం తగిలినట్లు శిలయ్యిపోయాడు. చిన్ని పాపవల్ల మళ్ళీ మనిషిగా మారాడు. ఆ పాప తన పోలికలతో ఉండటం. తన మీద ప్రేమతో కరడు కట్టిన మనిషి తిరిగి తన మీద ప్రేమ వల్ల మనిషి కావడం , దీన్తో ఆమె మళ్ళీ తన ప్రేమ జీవితానికి కనెక్ట్ అయ్యింది. చెడు తిరుగుళ్ళు అనేది సమాజం భాష. అటు వంటి చెడు తిరుగుళ్ళ వెనుక ఉన్న సమాజాన్నీ , ప్రేమ రాహిత్యాన్నీ చూపించడం కత్తి పద్మ భాష. ఆమె వారి తరపున వకాల్తా పుచ్చుకోలేదు. తానే వారయ్యింది. వారి లోపలి మనుషుల్ని ఆవిష్కరించింది. పోషకాహారం ద్వారా మనిషికి ఐరన్, కాల్షియం అందాలి. అది పోషకాహారం ద్వారా లభించకపోతే మట్టి తినడం, గోడలకి ఉన్న సున్నం గోక్కుని తినడం జరుగుతుంది. అలాగే అందాల్సిన ప్రేమ అందనప్పుడు సో కాల్డ్ చెడుతిరుగుళ్ళు తప్పవు  ప్రేమని వెతుక్కోవడంలో భాగం గానే కత్తి పద్మ వాటిని చూశారని నేను అనుకుంటున్నాను. గొప్ప మానవీయమైన స్పర్శ నాకెందుకో ఈ కథలో కన్పించింది. వస్తువూ, ప్రారంభం, ముగింపూ, మూడూ కూడా చాలా ఒడుపు తెలిసిన రచయిత మాత్రమే ఇలా రాయగలరేమో. 
 
          చీకటి పువ్వు మనుషుల్లో క్రూరత్వానికి పరాకాష్ట. ప్రేమ రాహిత్యానికీ పరాకాష్ట. ప్రేమకీ , మానవీయ స్పర్శకీ కూడా పరాకాష్ట. ఈ కథలో అన్నీ ఎక్కువే. అచ్చియ్యమ్మ , కాంతం మధ్య మానవీయమైన సహానుభూతితో కథ మొదలవుతుంది. ఈ పుస్తకంలో చాలా కథలు బాధితుల మధ్య అటు వంటి కామ్రెడరీతో మొదలయ్యి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాయి. కాంతమ్మ ఫ్లాష్ భయానకం. పెద్దమనిషి అయ్యిన మూడు నెలలకి ఆమెను సొంత తండ్రీ మేనత్తలూ కేవలం 12వందల రూపాయలకు అమ్మేశారు. కేవలం 12 వందల రూపాయలు ఆమెను యమకూపంలోకి నెట్టి జీవితాంతం నరకంలో ఉండేలా చేసింది. కేవలం 12వందల రూపాయలకు అమ్మేసే మనుషుల వల్ల భయానకమైన జీవితం గడిపింది. దీనికి మనుషులే కాదు. వారి వెనుక ఉన్న సమాజమూ కారణమే. ఇది కుటుంబంలో క్రూరత్వానికి పరాకాష్ట. . రేపుల్లో చాలా రకాలుంటాయి. ఇందులో కనకరాజు కాంతాన్ని రేప్ చేసిన పద్ధతి క్రూరత్వానికి పరాకాష్ట. ఇటు వంటిది రావిశాస్త్రి  రాయలేదు. కుప్రీన్ కలలో కూడా ఊహించలేదేమో.. మానంలోకి గుర్రపు తోకపొడిని పొయ్యడం. పుండయిపోయిన మానంలో,  ఆమె రెండు కాళ్ళు, రెండు చేతులూ కొంత మంది పట్టేసు కుంటే కవచాలు తొడుక్కున్న  కనకరాజు అనేవాడు రేప్ చెయ్యడం. నాలుగు రోజుల వరకూ ఆమె అనుభవించిన నరకం. ఇంతకంటే క్రూరత్వానికి పరాకాష్ట ఉంటుందా? ఆమె కడుపున పుట్టిన  బిడ్డమీద కూడా వాళ్ళవే హక్కులు. అప్పటికే పిల్ల చేతులు మారి పోయింది. తల్లికి ఇచ్చేదానిలో కూడా మోసం. కపటత్వం క్రూరత్వం. అప్పటి నుంచి యంత్రంగా మారిపోయింది కాంత. రాజు ప్రేమతో ఆ యంత్రంలోని మనిషి మేల్కొంది. షోషకాహారం లేక రాజుకి ఎయిడ్సు. రాజు మీద ప్రేమ కోసం రాజు కుటుంబం కోసం తన సర్వస్వాన్ని ధారపోసింది. చీకటి పువ్వు కథ  గొప్ప ప్రేమ కావ్యం. ఆసుపత్రిలో రాజూ , అతడి భార్యా, కాంతం మధ్య కంపాషిన్, రాజు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం కోసం కాంతం ఆరాటం గొప్ప మానవీయ ప్రేమని ఆవిష్కరించాయి. కన్యాశుల్కం బీభత్సరస ప్రధాన విషాదాంత కావ్యం అన్నాడు శ్రీశ్రీ. . ఆ మాటలు చీకటి పువ్వుకీ వర్తిస్తాయి. 
కన్యాశుల్కంలో బుచ్చెమ్మని ఒక ఠస్సావేసి రంజింప చెయ్యడానికో కథ చెప్తాడు గిరీశం. దాని సారాంశం ఏమిటంటే, ముక్కుపచ్చలారని, బుడిబుడి అడుగుల పిల్లకీ  ముసిలాడికీ పెళ్ళవుతోంది. ముసలాడు పుస్తి కట్టక ముందో లేక, … కట్టిన ఉత్తర క్షణాన్నో పీటల మీదే పుటుక్కుమన్నాడు. పుస్తి కట్టాకా మరణించాడని ఆస్తిలో వాటా కోసం పిల్ల తండ్రి దావా తెచ్చాడు. పుస్తి కట్టక ముందే పెళ్ళికొడుకు పోయాడని, ఆస్తిలో వాటా ఇవ్వక్కర్లేదని పెళ్ళికొడుకు తరపు వాళ్ళు దావా తెచ్చారు. పీటల మీద పుట్టుక్కు మన్నోడు తాళి కట్టడానికి ముందు పోయాడా ?ఎనక పోయాడా ?అనే విషయం మీద దావాలు పడ్డాయి. చివరికి పెళ్ళిచేసిన ఆడపెళ్ళి వారి పురోహితుడు మగపెళ్ళి వారి దగ్గర లంచం తీసుకుని పుస్తికట్టక ముందే మరణించినట్లు సాక్ష్యం చెప్పాడట. పెళ్ళి కూతురు తండ్రికి  అల్లుడు కాని అల్లుడి ఆస్తిలో వాటా రాలేదట.
 
          కత్తిపద్మ రవికెల గుడ్డ కథలో పార్వతి పరిస్థితి చూస్తే నాకెందుకో కన్యాశుల్కంలో గిరీశం చెప్పిన స్టోరీ గుర్తొచ్చింది. పరిస్థితులు ఇప్పటికీ అస్సలేం మారలేదా అనిపిం చింది. అక్కడ ఆస్తులూ లావాదేవీలూ తప్ప ఆడదానికేం కావాలో ఎవరికీ అక్కర్లేదు. ఇక్కడ కూడా అంతే. ఆమె ప్రమేయం లేకుండా పెళ్ళి, భోజనాల దగ్గర తగాదా? ఎవరి వంశం గొప్పదనే విషయం మీద కొట్లాటలు. పుస్తి కట్టిన తర్వాత పీటల మీదే పెళ్ళి  పెటాకులు.. పార్వతి పెళ్ళయినా పుట్టిల్లు పట్టిన ఆడపడుచులాగే తండ్రికీ, అన్నలకీ, వదినెలకీ, వాళ్ళ పిల్లకీ గొడ్డులా చాకిరీ చేసింది. పేరుకు పునిస్త్రీ , చాకిరికి ఇల్లు పట్టిన వితంతువు. తిండి పెడుతున్నామా లేదా? అంతే. ఆమెకి ఇంకేం అవసరమో తెల్సుకోవా లనే ఆలోచన ఎవరికీ లేదు. ఆస్తి పంపకంలో ఆమె ఊసైనా లేకండా పోయాడు తండ్రి. అన్నలు  ఆస్తిలో భాగం ఇవ్వకపోయినా మిషను నేర్చకుని ఏదో సొంతకాళ్ళ మీద నిలబడి బతుకుతోంటే ఇక్కడా ఓ గిరీశం దాపురించాడు. రాబందు రాజుమావయ్య తనంతట తాను వచ్చి వాలాడు. లైంగికంగా ఎమోషనల్ గా దోపిడీ చేసేశాడు. చివరికి ఆమె గురించి ఏవన్నాడో చూడండి. ‘‘అంత కర్రిగుంటాది. దాన్ని నేను సేసుకోవడవేటి? అదే పిలిసీది. ఇంకా వయసు మిగిలిందా లేదా సూసుకుందావని ఎల్లీవాణ్ణి గానీ , దాన్ని పెళ్ళిసేసుకుందావనేటి? అదే ఆశపడిపోయింది. మన ఆస్తిపాస్తులు సూసీ. జాకెట్లు కుట్టుకుని బతకతందిరా. మన ఓదా సూసి కల్లు జిగేల్మనిపోయాయి దానికి, పోనీ అని సూద్దామన్నా ఆల్ల అన్నదమ్ములూ ఒప్పుకోలేదు, నా కొడుకులూ ఒప్పుకోడం లేదు. ఏదైనా మన మంచికేపోరా. తప్పిందేదో తప్పిపోయింది. మరింక ఆ ఊసు ఒగ్గీశాను ’’అన్నాడు. వీళ్ళకంటే గిరీశం చాలానయం. ముందు రోజు రాత్రే అనుభవించి పిచ్చాసు పత్రిలో చేర్చేవాడు ఒకడు. జీవితాంతం వాడుకుని చాకిరి చేయించుకుని అదెవరో నాకు తెలీదు నా ఫ్యాక్టరీలో వర్కరు అనేది ఇంకోకడు., అద్ధం కథలో మిషను కుట్టుకుని సొంతకాళ్ళ మీద నిలబడిన మనిషిని కూలదోసి, నిలువునా దోచేసి ఆమె వేలితో ఆమె కన్నే పొడిచేసి,, ఆమె తమ్ముడి చేతే ఉమ్మేయించిన ఘనుడు ఇంకోడు. ఈ రాజు మావయ్య వీళ్ళ కోవలోవాడే. . ఇందులో చాలా మంది వంచన, లేదా దౌర్జన్యం  చెయ్యడంలో అన్ లిమిటెడ్. సమరమే కథలో బంగారం దుకాణం వ్యాపారి ఆచారి,  మనసుడికిపోతే కథలో వాసుగాడి దౌర్జన్యం, గురమ్మ కపటం. శత్రు వర్గం వైపు ఖడ్గం పట్టుకునే, గురమ్మ, బూరిబుగ్గల పిల్ల కథలో అత్తింటి ఆడవాళ్ళూ, అద్దం కథలో శీనుగాడి అక్క చిట్టెమ్మ, అమ్మా ఉన్నారు. ఈ  వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?. మిత్ర వైరుధ్యమా? శత్రువైరుధ్యమా? ఇవన్నీ నాలో మెదిలిన  ప్రశ్నలు? జీవితాలని అణిచి పెట్టే శక్తులు బలమైనవి. వాటి వ్యవస్థలు చాలా బలమైనవి. అయితే జీవితం అన్నిటి కంటే బలమైనది. కొంత మంది మహిళల్లోంచి ఈ జీవశక్తి,, లేదా, జీవితేచ్చ వ్యక్తం అవుతుంది. అటు వంటి మహిళలు చీకటిపుప్వు కథలనిండా ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు లెక్కలేనంత మంది ఉన్నారు. పులస కథలో రవణమ్మ, మట్టగిడస కథలో సత్తెమ్మ, ఇసాపట్నం కొండలో నూకాలమ్మ. ఎర్రెమ్మ గొర్రెమ్మ. వీరు ఎంత రాటు దేలిపోయినా కూడా,  సహజమైన ప్రేమ కోసం ఆర్తి  వీరి నుండి వ్యక్తం అవుతుంది. అది తీరక, గొర్రెల మీదో, మనవల మీదో, చివరికి పాముల వంటి జంతువుల మీదో  ప్రేమగా మారుతుంది. వీళ్ళు నిజానికి ప్రేమ స్వరూపులు. వీళ్ళ ప్రేమని అందుకుందుకుగానీ, తిరిగి ప్రేమించడానికిగానీ అర్హత లేని వ్యక్తులు వీళ్ళ జీవితాల్లో ఉన్నారు. వీళ్ళు  పుట్టక ముందునుంచీ ఉన్నారు. వాళ్ళు మొగుళ్ళు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, అన్నలు కావొచ్చు, తండ్రులు కావచ్చు. అన్ని విధాలా దోచుకునే ప్రియుళ్ళు కావచ్చు. అత్తలు కావచ్చు, కొడుకు కోసం అడ్డగోలుగా హింసించే తల్లులు కావచ్చు. ఆడపడుచులు కావొచ్చు. వారిలోంచి వ్యక్తమయ్యే వ్యవస్థల కారణంగా వీళ్ళకీ దుర్గతి పట్టింది. అయినా వీరి జీవితేఛ్చ గొప్పది చివరి నిమిషం వరకూ పోరాటాన్ని , ప్రేమార్తిని వదులుకోని యోధులు వీరు. 
 
          అనగనగా ఓ యంత్రం ఉంది. ఎంత గారాబంగా పెంచుకున్న పిల్లయినా సరే ఆ యంత్రంలో పారేస్తే చాలు. దానిలోంచి ఓ ఇల్లాలు బయటికొస్తుంది. ఓ గృహిణి బయటి కొస్తుంది. యాంత్రికంగానే పిల్లలు కూడా వస్తారు. ఆమె మాత్రం యంత్రంలో నలుగుతూ ఘోషిస్తూ ఉంటుంది. గృహహింస. గొడ్డుని బాదినట్లు బాదుట. లైంగికంగా వాడుట. పిప్పి చేసి రోడ్డున పారేయుట. పుట్టింట్లోనూ మెట్టినింట్లోనూ యంత్రం ఒకటే దాని మీద  పని చేసే  వ్యక్తులు మారతారు. దీన్ని ధిక్కరించింది ఎర్రయ్యమ్మ, ఎర్రెమ్మ ఎలియాస్ ఇందిరాగాంధీ. ‘‘ప్రకృతి ఎర్రిదానిక్కాదు. ఎర్రమ్మలుకి ఎర్రటి ఒళ్ళూ, ఒత్తయిన ఉంగరా ల జుట్టూ, బలిష్ఠమైన కాళ్ళూ చేతులు, సొంతంగా ఆలోచించే మెదడు ఇస్తే ఎంకు నాయుడు ఇంటి నామధేయ వంశీకులు ఎదురెళ్ళి, ఆ పిల్ల భుజాలు వంచేసి, రింగుల జుట్టును తిరిగి సాఫు చేసేసి, ఆమె మొదడుని పరాధీనంగా మార్చేసి, దాన్ని ఉత్త ఆడ దానిగా మార్చేద్దామనుకున్నారు’’. చిన్నప్పుడు అన్నీ కొనిచ్చిన మావయ్యలు, బాబయ్య లు పెదనాన్నలు. అడక్కుండానే, ఇంకా చెప్పాలంటే వద్దు మొర్రో అంటూన్నా మొగుణ్ణి కొనితెచ్చేశారు. తనకు నచ్చిన వాడిని కాదు వాళ్ళకి నచ్చిన వాడిని. భర్త ఇంకొకత్తిని తెచ్చి నెత్తిన పెట్టాడు. అత్తకి, భర్తకి , అతడు తెచ్చకున్న దానికి చాకిరి తప్ప ఆమెకేం లేదు. తండ్రి కొట్టాడు.,భర్త కొట్టాడు. ఆమె అత్త మీద కర్ర తిరగేసి పుట్టింటికొచ్చింది. ఆమె చెప్పింది విన్న పుట్టింటోళ్ళకి ఆగ్రహం రాలేదు. నట్టింట్లో శవం ఉన్నట్లుగా ఏడ్చారు. విడాకులు, తన భూమి తనకిచ్చే దగ్గర మళ్ళీ యంత్రం రంగంలోకి వచ్చింది. ముందు అన్నదమ్ములకన్నారు. తర్వాత కొడుక్కన్నారు. ఎర్రెమ్మ ఉగ్రరూపం చూసి బెదిరి దారికొచ్చారు. ఆమెకి భూమి వచ్చింది. మళ్ళీ బాల్యం వచ్చింది. స్వేచ్చ వచ్చింది. తన పొలంలో తాను గుడిశె వేసుకుని ఊంటూ ఊరి జనానికి ఇందిరాగాంధీ అయ్యింది. అయినా చచ్చేదాకా యంత్రం ఆమెని వదిలిపెట్టలేదు. ముందు ఆమెలో ప్రకృతి సహజమైన ప్రేమని బలితీసుకోవాలను కుంది. అది కుదర లేదు. దాన్తో ఆమె తన ప్రేమ కి ప్రతిరూపంగా పెంచుకున్న గొర్రెని బలితీసుకుని యంత్రం సంతృప్తి చెందింది. ఆమె యోధురాలు. ఎందుకంటే ఆమె జీవితమే ధిక్కార స్వరం. 
 
          రాంబాయి కథ కూడా దీనికి భిన్నమైనది కాదు. హింసాత్మకమైన గృహజీవితమే  ధర్మం , న్యాయం, చట్టం అయ్యాయి. ఆ చట్రానికి బయట సహజమైన సహచర ప్రేమను ఆశించింది. నిజనికి వ్యవస్థే నేరం. దాని బయట సాహచర్యం ఆశించడం సహజధర్మం. అయినా ఆమే నేరస్తురాలు. వ్యవస్థ కాదు. అందుకే  జైలుపాలైంది. జైల్లో పది మందికీ ప్రేమని పంచుతూ జైల్లో జాబిలమ్మ అయ్యింది. మనుషులకి మనుషుల ఆత్మగౌరవంతో కూడిన ప్రేమాభిమానాలు కావాలి. అందుకే జైలర్ శ్రీనివాస్ దయతో కూడిన గెశ్చర్స్  ఆమెకు ఆశనీ భరోసానీ ఇచ్చాయి. ఆమె ప్రేమ కేవలం ప్రేమ కాదు. హింసాత్మకమైన గృహజీవితం, ధర్మం, న్యాయం, చట్టం అన్నిటి మూలాలనీ ప్రశ్నించే ధిక్కార స్వరం. 
భూమికీ దాని మీద పనిచేసే మహిళలకీ ఉండే సంబంధం గురించి చెప్పేదే పులస కథ. ఇది ఎదురీత. పులసచేప తన సంతానం కోసం నదికి ఎదురీది వస్తుంది. అలాగే రవణమ్మ కూడా కుటుంబ వ్యవస్థకీ, రాజ్యవ్యవస్థకి సైతం ఎదురీది తన భూమిని సాధించుకుంటుంది. వ్యవస్థలకు ఎదురీదే పోరాట స్ఫూర్తి ముఖ్యం. అందుకే కథ కూడా ఆ దిశలోనే ముగుస్తుంది. మట్టగిడసలో సత్తెమ్మ నిజానికి సత్తెకాలపు సత్తెమ్మ. అంత అమాయకురాలు అయినా మన కాలం వీర వనిత. అమెకు తన చుట్టూ ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నదీ తెలియదు. తాను ఎటు వంటి రాజ్యంతో పోరాడుతున్నదీ తెలియదు. అందుకే ఆ చిన్నగేటు తెరిస్తే చాలు బాబూ మనవల దగ్గరికెళ్ళిపోతాను అంటుంది. ఆమె తలొగ్గదు భయపడదు. చుట్టకాల్చుకోవడానికి ఆమె సాధించిన విజయం కూడా చిన్నది కాదు. ఆమె ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఇష్టం లేని మనువు. అయినా బాప్ప పోయినపుడు భర్త దిగులు చూస్తే ఆమె గుండె తరుక్కుపోయింది. రెయ్యమ్మని అతడితో పెళ్ళికి బతిమలా డింది,. ఆమె ఒప్పుకోకపోతే బంగారంలాంటి పిల్లాడు పుడతాడే అని బిడ్డని చూపించి  ఒప్పించింది. మొగుడు పోయినపుడు పెద్దభార్య హోదాని తిరస్కరించింది. రెయ్యమ్మకే భార్యహోదా ఇచ్చింది. మనవల కోసం నేరస్థురాలైంది. బయట దిక్కులేని స్థితిలో ఉన్న మనవల కోసం ఆరాటపడింది. తన కష్టసుఖాలు గంగమ్మతో చెప్పుకునేది. సముద్రం దగ్గరికి పోయి కూర్చునేది. ఒక్కోసారి గంగమ్మనే సవాల్ చేసేది. ఒక్కోసారి గంగమ్మతో నువ్వు తీర్పు ఇచ్చేదేటి నానే తీరుపు ఇస్తున్నానంటూ తీరుపిచ్చేది. తన అడ్రస్ కూడా జాలరి పేట గంగమ్మ ఒడ్డు. చెకోవ్ వాంకా కథలో మాదిరి ఆమె ఉత్తరం చేరవచ్చు చేరకపోవచ్చు. సత్తెమ్మ లాంటి వాళ్ళు వ్యక్తులు కాదు. రాజ్యధిక్కారం వాళ్ళ  ప్రేమలోనే ఉంది. జీవనపోరాటంలో ఉన్న సమూహం నుంచి వచ్చిన వారు. జీవన పోరాటంలో సమూహానికి స్పూర్తి దాతలు. 
 
          ఒక మహిళని దాదాపు 40 యేళ్ళపాటు రేప్ చెయ్యడం సాధ్యమా? బెల్టుతో కొట్టి, కాళ్ళతో తన్ని అవమానిస్తూనే నిత్యం రేప్ చెయ్యడం సాధ్యమా? కొన్ని దశాబ్దాలేంటి..?, జీవితాంతం రేప్ చెయ్యవచ్చు. ఆమె భార్య అయితే చాలు. తరాలు మారినా కూడా తాడు కట్టిన వాడు చివరిశ్వాస వదిలే వరకూ రేప్ చెయ్యవచ్చు. గుడిపాటి వెంకట చలం నెత్తీ నోరూ కొట్టుకుని మరీ మొత్తుకున్నాడు. వివాహ వ్యవస్థలో మారిటల్ రేపుల గురించి. చలం బందీలు కనే కలల్ని చెప్పాడు. వాళ్ళ తరపున తాను కలలు కన్నాడు. దేన్ని ధ్వంసం చెయ్యాలో స్పష్టంగా చెప్పాడు. సమస్య అదే. కానీ పద్మ చెప్పిన పరిష్కారాలు వేరు. వేసిన ప్రశ్నలు వేరు. వ్యక్తిగా పోరాటం చెయ్యడమే కాదు, ఓ  ప్రత్యామ్నాయ సంస్కృతి కావాలి. ప్రభుత్వం, చట్టం, న్యాయం వీళ్ళందరిదీ ఒకే బడి. ఇవన్నీ చెప్పే దొక్కటే అన్నం పెట్టి బట్టలిస్తే అతడేం చేసినా భరించాలని. ఒక మహిళా అధికారి  అనుకోవడం, ఓ ఎస్సై వాదించడం,. బహుశ కోర్టుకెళ్ళినా, అక్కడ మహిళా జడ్జి ఉన్నా ఇదే బడి నుంచి తీర్పు రాదనే గ్యారెంటీ ఏమిటి? ప్రత్యామ్నాయ సంస్కృతికావాలి. అటు వంటి సంస్కృతిక విలువలతో కూడిన పోరాట వ్యవస్థ అండదండలు కావాలి. అది బాధితుల నుంచీ, ముఖ్యంగా శ్రామిక మహిళల నుంచి వస్తుందనేది పద్మ విశ్వాసం. ఇవన్నీ విడుదల కథ చదివినపుడు నాకు వచ్చిన ఆలోచనలు. పావని మొర వినని మహిళా అధికారి ఆనందరావు పోషిస్తున్నాడా లేదా అనే ఆలోచించింది. మగోళ్ళ  బడి నించి తీర్పు చెప్పింది. తల్లి మీద హింసని భరించలేక కొడుకు తిరగబడ్డాడు. కొడుకైనా కూడా స్త్రీ వైపు నిలబడకూడదు. అందుకు వాళ్ళిద్దర్నీ ఒకే వర్గంగా చూసింది వ్యవస్థ. అదే కొడుకు తండ్రి వైపు మాట్లాడితే శభాష్ అని తమలో కలుపుకునేది. తన విడుదలకు దారి తనే ఎంచుకుంది పావని. దానికి కొడుకు భరోసా. మిగతా కధల్లో చూస్తే కొడుకులు, తమ్ముళ్ళు మావయ్యలు కూడా ‘ఆ బడి’ నుండి వచ్చిన వాళ్ళే. ఒకటో అరో మినహా యింపులు అంతే. ఏదైనా నేరానికి అతిపెద్ద శిక్ష ఉరి. తర్వాత యావజ్జీవ కారాగారం. అది కూడా 15 ఏళ్ళ తర్వాత ముగిసే అవకాశం ఉంది.. ఇక్కడ శిక్ష చచ్చేదాకా రేప్ కి గురికావడం. అదీ మొగోళ్ళ బడి.  
 
          చీకటి పువ్వు కథల్లో ఎంతో వైవిధ్యం ఉంది. ప్రతి కథా దానికదే ప్రత్యేకమైనది. జీవితాల్లో ఉన్న వైవిధ్యం ఈ కథల్లోనూ ఉంది. అంతస్సూత్రం మాత్రం ఒక్కటే. మూడు ముఖ్యమైన అంశాలు కామన్ గా ఉన్నాయి. కుటుంబం దోపిడి. సమాజం దోపిడి. కాస్త సహజమైన ప్రేమ కోసం ఆరాటపడిన పాపానికి శ్రమదోపిడి, ఆర్థిక దోపిడి. లైంగిక దోపిడి.  మూలం వివాహం, కుటుంబ వ్యవస్థల్లోని అమానవీయత. కొండగాలి యేటినీరు కథ కూడా అంతే. 
 
          అనసూయ ప్రమేయం ఏం లేదు. అంతా కసిలి నపుసంకుడితో పెళ్ళి చేశారు. కుటుంబ పరువు కోసం పిల్లల్ని కనమన్నారు. అందు కోసం కుటుంబ సభ్యులే లైంగికంగా దోచుకున్నారు. కుటుంబ సభ్యులే ఆమెకు ఆస్తిలో చిల్లిగవ్వ కూడ ఇవ్వ కుండా పిల్లల్తోపాటు బయటికి గెంటేశారు. ‘మరి అస్తి లాక్కుని గెంటేసిన పెద నాన్నని జైల్లో ఎందుకు పెట్టరు’ అంటూ కొడుకు అడిగిన ప్రశ్న సమంజసమే. పెళ్ళి దగ్గర్నించి రోడ్డున పడేదాకా ఆమె ప్రమేయం ఏమీలేదు. అంతా తక్కిన వాళ్ళు చేసిన ఘనకార్యాలే. ప్రేమో, మోహమో అవసరమో తన కింత నీడనిచ్చి, తన పై మోజుపడిన వాడితో ఉండా లనుకున్న సహజమైన చిన్న ఆశ, అనసూయని చాకిరి పరంగా శ్రమదోపిడికి, లైంగిక దోపిడికి, అన్నిటికంటే ఘోరంగా ఎమోషనల్ దోపిడికి గురిచేసింది. పిచ్చాసుపత్రి నుండి అదృష్టవశాత్తూ బయటపడింది. అనసూయ కొడుకు తల్లిని ఎంతో సానుభూతితో అర్ధం చేసుకోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది. ‘మా అమ్మ మా కంటెక్కువ బాధలు పడినట్టుంది. అందుకే మమ్మల్ని ఒగ్గీసింది’అన్నాడు. సాధారణంగా బాధితులు ప్రతీకారం కోరుకుంటా రు. శిక్షల కోణం నుండి తప్పొప్పుల్ని ఏదో ఒక చట్రంలో ఇరికించి పరిష్కారాలు చెప్పే స్తారు. లేదా ప్రతీకారంతో సమస్య పూర్తయ్యిందనుకుంటారు. అనసూయ కొడుకు భిన్నంగా ఆలోచించాడు. నేరం జరిగిన పరిస్థితులను కూడా పరిగణించాలన్నాడు.  అసలు తల్లి నేరమంటూ చేస్తే అతడు చెప్పింది కరెక్టే. మరి బందిపోటు మాస్ట్రుని ఎలా చూడాలి. వాడి పిల్లలు అనాథలైపోతారని శిక్షించకుండా వదిలెయ్యాలా?. వాడి పిల్లలు  అనాథలయ్యే పరిస్థితిలో ఉన్నారా? అది అసలు విషయం కాదు. ఈ కథలో ప్రధానాంశం ఓ తల్లి, ఆమెను ద్వేషించకుండా అర్థం చేసుకున్న కొడుకూ. సరే.. కథలో ముగింపూ, పరిష్కారాలూ ఏమైనా కావచ్చు. అసలు పరిష్కారమే చెప్పక పోవచ్చు కూడా. అది ముఖ్యం కాదు. కథలోని సామాజిక జీవన వాస్తవికత, దాన్నుంచి వచ్చే ప్రశ్నలూ అతిముఖ్యం. మహిళా శక్తి  దోపిడీ ఎన్ని రూపాల్లో కొనసాగుతోంది? కుటుంబ వ్యవస్థ ఎందుకంత అమానవీయంగా వర్గ శత్రువు మాదిరి వ్యవహరిస్తోంది? బందిపోట్ల కొత్త రూపాలు ఏమిటి? అద్దం కథ చూడండి. ఒక మహిళ తన సొంత కాళ్ళ మీద నిలబడి ఆర్థికంగా స్వావలంబన సాధించింది. తన కుటుంబాన్ని పోషించింది. స్త్రీ సహజమైన చిన్న కోరిక ఆమెది. తన వ్యక్తిత్వాన్ని చూసేవాడు, కాస్త మొచ్చుకోలు, కాస్త ప్రేమని ఆశించింది. శీను అనే బందిపోటు తన చేతికి మట్టి అంటకుండానే ఎలా దోచేసు కున్నాడో అనుభం మీద తెలుసుకుంది. సాటి మహిళలయ్యుండీ కూడా శీను కుటుంబ లోని స్త్రీలు చేసిన దౌర్జన్యాన్ని ఏమని పిలవాలి. ఏమేనా  ఆమె కోణం నుంచి చూస్తే మాత్రం వాళ్ళు శత్రువర్గం వైపు నుండి బీభత్సమైన దాడిచేశారు. వక్తిత్వహననంచేశారు. ఒక మనిషిని ధ్వంసం చేశారు. శీనుగాడిలాగే వాడివైపు నిలబడిన వాళ్ళు మహిళలైనా వాళ్ళ క్రూరత్వం వర్గశత్రువుదే. 
 
          కొండగాలి యేటి నీరు కథలో కొడుకు తల్లి వైపు నిలబడితే, ఇక్కడ అమ్మలాంటి అక్క రెక్కల కష్టం మీద నిలబడిన తమ్ముడు రవణ శత్రువర్గం వైపు నిలబడ్డాడు. ఆమె అందాన్ని చూపించలేని అద్దం ఈ సామాజిక వాస్తవాన్ని క్లియర్ గా చూపించింది. శీను లాంటి బందిపోట్లు ఒంటి మీద చెయ్య వెయ్యకుండానే సర్వం దోచేసుకుకోగలరని, సృష్టిలో ఎంత వైవిధ్యం ఉందో ఆడదాన్ని దోచుకోవడంలో అంతకంటే వైవిధ్యం ఉందని అద్దం కథ చెప్పింది. 
 
          మనకీ పెళ్ళీళ్ళు అచ్చిరావు  కథ చూడండి. మగాడి గుణాలు కొలబద్దగా మహిళ గుణగణాలు నిర్ణయంచడం. అతడు పొట్టి అయితే అమ్మాయి పొడుగ్గా ఉండకూడదు. ఉంటే దానికి అదనపు డబ్బు , అదనపు అవమానాలు భరించాలి. అతడు పొడుగు  అనుకోండి అమ్మాయి కూడా పొడుగ్గా సౌష్టవంగా ఉండకూడదు. పొట్టిగా ఉండాలి. దానికీ  మళ్తీ అవమానాలూ అదనపు బేరాలు. డబ్బిచ్చినా అవమానాల్లో డిస్కౌంట్ లేదు. అతడికి కాళ్ళు లేవనుకోండి ఆమె సొంతకాళ్ళ మీద నిలబడకూడదు కాళ్ళు  నరికేసుకో వాలన్న మాట. అతడిది ప్రైవేటు  ఉద్యోగం అనుకోండి, ఆమె ప్రభుత్వోద్యోగం చెయ్యకూడదు. అదిలక్ష్మి పెళ్ళిపీటల నుండి, ఓ బిడ్డతో పుట్టింటికి తిరిగి వచ్చేదాకా ఇలాంటి జీవితమే అనుభవించింది. పెళ్ళంటే ఎంత భయానకమో చూసింది. తన కూతురుకి అటు వంటి గతి పట్టకూడదనుకుంది.. కూతురు చదువుకుని సొంత కాళ్ళ మీద నిలబడి విద్యావంతులైన స్నేహితులతో  తిరుగుతోంది. చదువుకున్న తరువాతి జనరేషన్ తన కంటే నయం అనుకుంది ఆది. కూతురు ప్రియని ప్రేమించానని చెప్పిన వాడు పెళ్ళికి మాత్రం నిరాకరించాడు. నచ్చలేదన్నాడు. ఆదిలక్ష్మి కూతురు ప్రియ తనతో పెళ్ళి వద్దన్నాడని ఏడుస్తోంది.‘ పెళ్ళినేప్పోతే మనలాటి ఆడోల్లం బతకనేవా?’ అంది అదిలక్ష్మి, . ‘‘బాబిగాడు నన్ను పెళ్ళి చేసుకోపోతే చచ్చిపోతానమ్మా?’’ అంటూ మళ్ళీ ఏడిచింది ప్రియ.  ‘మీరు సావడం కాదు. పెళ్ళి అనే జీవితకాల హింసని మీలాంటోళ్ళంతా ఆలోచించి సంపాల’ అంది ఆదిలక్ష్మి. కాలం మారినా, తరాలు మారినా చట్రం మారలేదు. కొత్తతరం కూడా పాత చట్రం నుంచి ఆలోచిస్తోంది. ఒక వేళ సహజీవనం వంటి కొత్త ఫామ్స్ వచ్చినా,… దానిలో కూడా కొత్త మనుషుల్లోంచి ఆపరేట్ అయ్యేది అప్రజాస్వామికమైన, అసమానమైన ఫ్యూడల్ విలువలే…లేదా పూర్తి వ్యాపారాత్మకమైన పెట్టుబడిదారీ విలువలు. ఇక్కడే రూపాలతోపాటు స్త్రీ పురుష సంబంధాల్లో కొత్త ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక విలువలు రిప్లేస్ అవ్వాలని నాకు అనిపించింది.
 
          ఇలా ఆలోచింపజేసి, ఇంతటి బీభత్సమైన జీవితాలను చూపించి కళ్ళు
తెరవమంటున్న పద్మకి అభినందనలు. అంత క్రూరమైన జీవితంలోనూ జీవితేచ్చ నిండిన, పోరాట స్పూర్తిని ఇచ్చే, ధీర వనితల్ని చూపించిన పద్మకు  జేజేలూ… వందనాలూ. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.