విజయవంతంగా నెచ్చెలి సంపాదకులు డా.కె.గీత ఆంగ్ల పుస్తకావిష్కరణ!

-ఎడిటర్

          కాలిఫోర్నియా-వీక్షణం 136వ సమావేశంలో నెచ్చెలి వ్యవస్థాపక సంపాదకులు డా.కె.గీత గారి ఆంగ్ల పుస్తకాలు Centenary Moonlight and other poems, At the Heart of Silicon Valley (Short Stories) ఆవిష్కరణలు ప్రముఖ సినీనటులు శ్రీ సుబ్బరాయ శర్మ గారి చేతుల మీదుగా సాయంత్రం 6గం. నుండి 9గం.ల వరకు ఆర్ట్ గ్యాలరీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగం పల్లి, నల్లకుంట, హైదరాబాద్ లో విజయవంతంగా జరిగాయి.

          ఈ సభకు అధ్యక్షత తెలంగాణా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ కందుకూరి శ్రీరాములు వహించగా, ముఖ్య అతిథిగా మ్యూజ్ ఇండియా చీఫ్ ఎడిటర్ శ్రీ ఆత్రేయ శర్మ విచ్చేసారు. వక్తలుగా ప్రముఖ కవులు, రచయితలు, అనువాదకులు శ్రీ వసీరా, డా. ఆలపాటి ట్యాగ్ లైన్ కింగ్, శ్రీమతి శ్రీసుధ కొలచన ప్రసంగించారు. ఇందులో దాదాపు నలభై మంది కవుల కవిసమ్మేళనం కూడా జరిగింది. కవిసమ్మేళనాన్ని డాక్టర్ రాధా కుసుమ గారు నిర్వహించారు. శ్రీమతి విశ్వైక కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు. వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి (యూ.ఎస్.ఏ), వీక్షణం భారతదేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ సభను విజయవంతంగా నిర్వహించారు. ఆవిష్కరణ పూర్తికాగానే డా.కె.గీతామాధవి గారు తన పుస్తక మొదటి ప్రతుల్ని తమ తల్లి గారైన ప్రముఖ రచయిత్రి శ్రీమతి కె.వరలక్ష్మి గారికి, తమ అన్నగారైన కె.ఆర్.ఫణిరాజ్ గార్లకు అందజేశారు.  

          విశ్వైక ముందుగా డా.కె.గీతామాధవి గారిని ఆహ్వానిస్తూ వారి వివరాలు తెలియ జేసారు. డా|| కె.గీత రచయిత్రి, గాయని, భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఫీల్డు లో  “తెలుగు భాషా నిపుణురాలి” గా పనిచేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషాశాస్త్రంలో పిహెచ్.డి, అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. పది సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. 2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు” పొందారు. ద్రవ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017), అసింట(2022)  కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల ప్రచురింపబడ్డాయి. “అపరాజిత”- గత ముప్ఫైయ్యేళ్ళ స్త్రీవాద కవిత్వం  (1993-2022) పుస్తకానికి సంపాదకత్వం వహించి ప్రచురించారు. కవిత్వంలో అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం మొ.న అవార్డులు, నవలకు తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ సాహితీ పురస్కారాల్ని పొందారు. ఈ ఆంగ్ల పుస్తకాలు వీరి ప్రచురింపబడిన ఎనిమిది, తొమ్మిదవ సంపుటులు.      
          డా.కె.గీతామాధవి గారు, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గార్లు ఆహ్వాన ఉపన్యాసాలు చేసారు. పుస్తకాల్ని ఆవిష్కరించి సుబ్బరాయ శర్మ గారు కె.గీత గారు షణ్ముఖి అంటూ వేనోళ్ళ కొనియాడారు. ఈ కథలు, కవితల్లోనించి తనకు నచ్చిన కొన్నిటిని ఉదహరిం చారు. ఆ తరువాత ప్రసంగించిన ఆత్రేయశర్మగారు సోదాహరణంగా అనువాద విశేషాల్ని వివరించారు. వసీరా గారు సిలికాన్ లోయ సాక్షిగా కథల గురించి వివరంగా ప్రసంగించగా, శ్రీ సుధ గారు సెంటినరీ మూన్ లైట్  గురించి, ఆలపాటి గారు రెండు పుస్తకాల గురించి సరదాగా ప్రసంగించి సభికుల్ని విశేషంగా అలరించారు. అధ్యక్షులు కందుకూరి శ్రీ రాములుగారు సభను చక్కగా నిర్వహించి, చివరగా గీత గారి కవితల్ని చదివి వినిపిం చారు. చివరగా రచయిత్రి, కవయిత్రి డా.కె.గీత గారు తమ ప్రతిస్పందనగా మాట్లాడుతూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి, అనువాద ఆవశ్యకతను తెలియజేసారు. తెలుగువారి రచనలు ప్రపంచ వ్యాప్తం కావాలంటే అనువాదాలు తప్పనిసరి అని తెలియజేసారు.


          Centenary Moonlight and other poems డా|| కె.గీతగారి కవితాల్లో నించి యాభై ఉత్తమ కవితల అనువాదాలు కాగా, At the Heart of Silicon Valley (Short Stories) సిలికాన్ లోయ సాక్షిగా కథల సంపుటికి ఆంగ్లానువాదం. ఈ పుస్తకాల్ని మో, ఎన్నెస్ మూర్తి, అల్లాడి ఉమ, శ్రీధర్, మాధురి పాలాజీ, వి.విజయకుమార్ , వి.వి.బి. రామారావు గార్లు అనువాదం చేసారు.

          ఈ పుస్తకాల ధర రూ. 500, డాలర్లలో $25. పుస్తకాలు కావలసిన వారు సంప్రదించవల్సిన వాట్సాప్ నంబరు – +1408-483-7700.

*****

Please follow and like us:

4 thoughts on “విజయవంతంగా నెచ్చెలి సంపాదకులు డా.కె.గీత ఆంగ్ల పుస్తకావిష్కరణ!”

Leave a Reply

Your email address will not be published.