చీకటి అవతలి వెలుగు

– షర్మిల 

          “నిన్నటి నుంచి ఏమీ తినలేదు కాస్త ఉప్మా అన్నా తిను ” అంటూ వదిన ఇచ్చిన ప్లేట్ ని మాట్లాడకుండా తీసుకుని తినేశాను. తినను అంటే బతిమాల్దామనుకుందో ఏమో నేను మామూలుగా తింటుంటే కాస్త ఆశ్చర్యపోయినట్టు చూస్తూంది.

          నిద్రాహారాలు మాని ఏడుస్తూ వుండాల్సిన నేను ఇలా ఎలా వుండగలుగుతున్నాను? జీవితంలో రాటు తేలిపోయానా?

          తెల్లారింది ఇంట్లో జనాలు తిరుగుతున్నారు.

          ” ఆ ఫొటో తీసి హాల్లో టేబుల్ మీద పెట్టండి ” అంటున్నారెవరో. శివ నవ్వుతూన్న నిలువెత్తు ఫొటో అది.

          ” నేనే పెడతా ” అని తీసుకెళ్ళి హాల్లో టేబుల్ మీద పెట్టి పక్కన పళ్ళేంలో వున్న గులాబీలని చుట్టూ పేర్చి మల్లెపూల దండ వేశాను. ఈ పని చేసినప్పుడు శివ బతికి వుంటే ” ఆ పూలు అక్కడ కాదు …ఇక్కడ. అని లేకపోతే మల్లెపూల దండ బదులు చామంతి తేకపోయావా అనో వాదులాట జరిగేది. ఇద్దరం పోట్టాడుకోకుండా ఏ పనీ జరిగేది కాదు. 25 ఏళ్ళుగా ఒకే కప్పు కింద బతికాం. ఇప్పుడు నేనొక్కదాన్నీ మిగిలాను అంతే. మనసు మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఒంటరే. సాయంత్రానికి కొందరు వూరినుంచి వచ్చారని స్టేషన్ కి కారు పంపి తీసుకొచ్చారు . . ” వాళ్ళు ఈ పూట ఇక్కడికి రారంట మంగళవారం కదా ! మహిజని చూడకూడదంట, రేపు పొద్దున్న వస్తామంటున్నారు, అందుకే వేరేచోట వాళ్ళు వుండడానికి ఏర్పాట్లు చెయ్యాలి ” అంటున్న అన్నయ్య మాటలు విని అమ్మ ఏడ్చింది .

          ” వాళ్ళు ఆ మాట ఎట్లా అనగలిగారు. చిన్నప్పటి నుంచి దాని ముద్దు ముచ్చట్లు చూసి మురిసిపోయే వాళ్ళు అది కష్టంలో వుంటే వారం వర్జ్యం చూసుకుంటారా? ఇప్పుడు దాని ముఖం చూడటానికి మంచిది చూసుకుని వస్తారా? ఏం నా బిడ్డ ముఖం అంత పనికి రానిది అయిపోయిందా అంటా ఆవేశపడింది.

          నేను అమ్మ భుజాల్ని పట్టుకుని అమ్మా నేనేం బాధపడటం లేదు నువ్వెందుకే డుస్తావ్ అని ఓదార్చాను. నా కళ్ళలో నీళ్ళు రాలేదు గుండెల్లో ఒక రకమైన అనాసక్తి . నేను ఇంకెన్ని అలవాటు చేసుకోవాలో అలోచిస్తూ కళ్ళు మూసుకున్నా కానీ నిన్న శివ ఆఖరి క్షణాలు వెంటాడుతూనే వున్నాయి. నన్ను పిలుస్తూనే ఆఖరి శ్వాస తీసుకుని చచ్చే    వరకూ నిన్ను వదలను అని తను చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఆ కళ్ళు 30 ఏళ్ళ  సాహచర్యంలో జరిగిన తప్పులన్నిటినీ క్షమించమన్నట్టు నన్నే చూస్తూ వుండి పోయాయి. కళ్ళ నుంచి వెచ్చగా జారుతున్న నీళ్ళు …

          శివని మొదటిసారి నాకు 17 ఏళ్ళప్పుడు కాలనీలో వున్న పిల్లలతో నేరేడు కాయల కోసం వెళ్తూ చూశాను. మమ్మల్ని చూసి కారు వెనక్కి సర్రున బేక్ చేసుకుని వచ్చి ఆగాడు. ఎక్కడికి పిల్ల మూకతో బయల్దేరారు అంటే నేను కాస్త మొహమాటంగానే చెప్పాను. సరే మీరు కాయలు ఏరుకుని రండి, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతా అనివచ్చేటప్పుడు దింపాడు. కొంచం కాఫీ తాగి వెళ్ళమని అహ్వానించాను. నా జీవితంలోకి శివ అడుగు పెట్టిన తొలి క్షణాలు కూడా అవే …

          ” ఇంట్లో ఎవరూ లేరా ?” అడిగాడు.

          ” అమ్మ, నాన్న బయటకి వెళ్ళారు, తమ్ముళ్లు ఆడుకోవటానికి వెళ్లారు. కూర్చోండి కాఫీ తెస్తాను ” అని వచ్చీ రానట్టు కాఫీ కలిపి ఇచ్చాను.

          ” ఏం చేయబోతున్నారు “? అడిగాడు.

          ” ఇంటర్ సెకండ్ ఇయర్ సెలవులు కదా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ కి కోచింగ్ తీసుకోవాలి ” అన్నాను.

          కాఫీ కప్పులోంచి సాసర్లో పోసి ” మీరూ తాగండి ” అని వద్దన్నా వినకుండా సాసర్ చేతికి ఇస్తే తాగాను. ఆ క్షణంలో నాకు తెలియదు కాఫీతో పాటు మేమిద్దరం జీవితం కూడా పంచుకోవడానికి రంగం సిద్దమైందని. నేను ఎంట్రన్స్ చేరింది మొదలు రోజూ బస్ స్టాప్ లో రెడీగా వుండేవాడు. మొదట్లో నాకు ఇలాంటివి నాకు నచ్చవని చదువుకోవాలని చెప్పాను. నేను లేకపోతే బతకనని ఎన్నేళ్ళయినా నా కోసం చూస్తాననేవాడు.

          ఒక టీనేజ్ ఆడపిల్ల ఏం చెప్తే కరిగిపోతుందో అవన్నీ అతని నోటి నుంచి విన్నాను. ఎంట్రన్స్ సరిగ్గా రాయక క్వాలిఫై అవ్వలేదు. ఇక పూర్తిగా చదువు మానేసి శివతో షికార్లు. ఇంట్లో కూడా నేను పెళ్ళి చేసుకుంటానని చెప్పేశాను.

          చాలా మంది నా ఫ్రెండ్స్ అతను తాగుతాడని చెప్పారు.

          ” తాగితే తప్పేంటి ? నేను మానేయమంటే మానేస్తాడు. నా కోసం చావడానికి సిద్ధ పడ్డవాడు ఈ చిన్న విషయం వినడా?” అని వాదించాను. పెళ్ళయ్యాకగానీ తెలియ లేదు. పూర్తిగా తన సొంతం అయిపోయిన తర్వాత వస్తువైనా మనిషయినా విలువ కోల్పోతారని. స్వంతమైన మనిషి విలువ తెలుసుకోవడానికి కావలసిన అర్హతలేవీ అతనికి లేవని అర్ధమయ్యేసరికే ఆలస్యమైపోయింది. కష్టసుఖాలు, బాధ్యతలేవీ పట్టించుకోకుండా స్నేహితులు, తాగుడు జీవితం అనుకునే మనిషిని నేను మార్చలేనని అర్ధమైంది. అందరినీ ఎదిరించి చేసుకుని ఇప్పుడు ఓటమిని ఎలా అంగీకరించగలను. పైగా నేను తల్లిని కాబోతున్నాను.

          బిడ్డపుట్టాక పరిస్థితి మరింత దిగజారింది. రోజూ తాగి అర్ధరాత్రి రావడం, ఏదో విషయానికి గొడవ పడడం మామూలుగా మారింది. అమ్మానాన్నల దగ్గరికి వెళ్లొద్దంటూ వేధింపులు కూడా మొదలయ్యాయి. ఇంకో పక్క నువ్వు లేకుండా నేను వుండలేననీ అనేవాడు. అందరూ మీ ఆయన నువ్వు లేకుండా ఒక్క రోజు కూడా వుండడు కదా అనేవారు. నిర్భంధ ప్రేమ ఎంత దుర్భరమో అనుభవిస్తేనే అర్ధమయ్యేది. ఈ ప్రేమని ఏమంటారో అసలు అది ప్రేమేనా? అప్పటి వరకూ ఎగిరే పిట్టలా స్వేచ్చగా పెరిగిన నేను, రెక్కలు కత్తిరించిన పక్షిలా దిక్కుతోచనట్టు బతకడం మొదలెట్టాను. తోటి పిల్లలు కాలేజీ లకి వెళ్తుంటే నేను పిల్లని ఎత్తుకుని కిటికీలో నుంచి చూస్తూవుంటే కరిగినీరయ్యే మంచు పెళ్లల్లా గుండెల్లో గడ్డకట్టిన దిగులు నీరై పారేది. ఇప్పుడు నేనొక్కదాన్ని కాదు …ఆ నీటిని తుడిచే చిట్టి చేతులు తోడున్నాయి.

          19 ఏళ్ళ వయసులో పిల్లని కని 20 ఏళ్ళకే జీవితంలోని చేదుని కూడా చూసేసిన నాకు నా ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. ఆ సమయంలో ఎలా తోచిందో కూడా గుర్తులేదు ఒక నిర్ణయానికి వచ్చాను. నా సాహసం, తెలివి, తెగువ అన్నీ ఒక వ్యసనపరుడికి అంకితం కాకుండా నన్ను కాపాడింది ఆ ఆలోచనే. నాకంటూ ఒక కొత్త లోకాన్ని సృష్టించుకోవాలి. సంపద, ప్రేమగా చూసుకునే అత్తమామలు, కుటుంబం వున్నా వ్యసనానికి బానిసైన మనిషితో జీవితంలో ఏదో చెప్పలేని వెలితి, ప్రేమ రాహిత్యం.

          అందుకే చదువుకోవాలనిపించింది. ” అమ్మా ! నేను చదువుకుంటాను ” అనే మాట రావడమే ఆలస్యం అమ్మ ఆనందం అంతా ఇంతా కాదు. నేను చాలాసార్లు శివతో బతక లేనని ఇంటికి వచ్చేసినా మళ్ళీ అదే డైలాగ్ నువ్వులేకపోతే నేను చచ్చిపోతా ! అందరూ సర్దిచెప్పి పంపడం.

          ఈ ప్రహసనంతో విసిగిపోయి ఆ ప్రయత్నాలు మానేశా. కలిసి బతికినా నా తోవలో నేను బతకడం మొదలెట్టాను. డిగ్రీ పూర్తిచేసి వుద్యోగం కూడా వెతుక్కున్నాను. ఇద్దరు ముత్యాల్లాంటి పిల్లలు రెండువైపుల కుటుంబాలూ పిల్లలకు ఏ లోటూ రాకుండా చూసు కుంటున్నారు. నేను నా ఉద్యోగం నా అభిరుచులకు అనుగుణంగా బతకడం అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే నాకు అది అనివార్యం అయ్యింది. నిరంతరం మత్తులో వుండే మనిషితో మానసికంగా ఏం బంధం ఏర్పడుతుంది? జీవితం దాని మానాన అది సాగిపోతూనే వుంది. పిల్లలు ఎదుగుతున్నారు. పిల్లల్ని చూసుకున్నప్పుడు మాత్రం శివ చేసినవన్నీ క్షమించేయాలనిపిస్తుంది. ఎప్పుడన్నా తను కాస్త బాగుంటే మురిసిపోయి అంతా సజావుగా సాగుతుందని నమ్మేలోగానే మళ్ళీ మామూలే.

          ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూనే 30 ఏళ్ళు గడిచి పోయాయి. అమ్మాయి పెళ్ళి అయ్యింది. అబ్బాయి పెళ్ళి ఇంకో రెండేళ్ళు ఆగి చెయొచ్చు అనుకునే లోగానే శివ ఆరోగ్యం క్షీణించింది. ఆరోగ్యం క్షీణించినా అలవాట్లు మానలేదు.

          అమెరికాలో వున్న పిల్లలు తండ్రిని చూడాలని వచ్చారు. ఆ రోజు పొద్దున్నే గుండె ల్లో మంటగా వుందంటే ఆస్పత్రికి తీసుకెళ్దామని కార్లో ఎక్కించి వెనక సీట్లో నా వళ్ళో శివ తలపెట్టుకుని పడుకో బెట్టుకున్నాను. పిల్లల్ని మీరు తర్వాత ఆస్పత్రికి రమ్మని చెప్పి డ్రైవర్ తో బయల్దేరాను. మహీ, మహీ అని పిలుస్తూనే శివ మగతలోకి జారిపోయాడు. ఆస్పత్రి వరకూ వెళ్ళకుండానే నా వళ్ళోనే వెళ్ళిపోయాడు.

          నువ్వు లేకుండా నేను బతకలేను అన్నట్టుగానే ఆఖరి వూపిరి వరకూ ప్రేమగానో, కోపంగా, లేకపోతే నిష్టూరంగా నా పేరు స్మరిస్తూనేవున్నాడు. ఏభైల్లోనే నిండు జీవితాన్ని అంతం చేసుకున్నాడు. మరి నా జీవితం? ఇన్నాళ్ళూ తనూ నేనూ వేర్వేరు దారుల్లో నడిచాం ఇక మీదటా అంతేనేమో అనుకున్నాను. కానీ కాదని శివ చనిపోయిన తరవాతే తెలిసింది. నా చుట్టూవున్న మనుషులే నన్ను నాలా కాకుండా మరణించిన శివ భార్యగా ఇంకా చెప్పాలంటే అతని విధవగా చూడడం మొదలెట్టారు.

          మంచిరోజు చూసుకుని నా మొహం చూడాలట లేకపోతే వాళ్ళకు కీడు జరుగుతుం దట . నాకు తెలిసిన ఎందరో భర్త చనిపోతే ఆయన కోసం కాకుండా అయిదవతనం పోతున్నందుకు ఏడవడం చూశాను. సంప్రదాయం పేరిట జరిగే హింసకి నేను లొంగ కూడదని నిశ్చయించుకున్నాను. మీరు చేసే ఏం పూజలు దానాలు చేస్తారో అన్నీ చేసు కోండి. మీ నమ్మకాలు మీవి. కానీ నా జోలికి మాత్రం రావొద్దని చెప్పేశాను. నాకంటూ కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలున్నయని చెప్పాను, పదకొండో రోజు పొద్దున్నే  మంగళసూత్రా లు తీసేసి మామూలు గొలుసు వేసుకుని, చక్కగా తయారై చక చకా మెట్లు దిగుతున్న నన్ను చాలా ళ్ళు ఆశ్చర్యంగా చూడడం గమనించాను. నాకు కావలసిందీ అదే. నేను వాళ్ళ కోసం విషాదం అభినయిస్తూ వుండలేను. నాకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి బాధ కలిగితే బాధ పడతాను అంతే. భార్యలను పోగొట్టుకున్న మగవాళ్ళు గంభీరంగా కళ్ళు తుడుచుకుంటూ మిగతా కార్యాలు చక్కదిద్దినట్టే నేనూ ఏవో పనులు కల్పించుకుని తిరుగుతున్నాను.

          పక్కగదిలో నుంచి ఒక పెద్దామె ” పూర్వం మొగుడుపోతే మూల కూర్చుని ఏడ్చే వాళ్ళు, కాలమహిమ చూడండి ! 11 రోజులకే చక్కగా ఏం జరగనట్టే తిరుగుతోంది ” అని అనడం సన్నగా వినిపిస్తోంది.

          హమ్మయ్య ఇలా చర్చించుకోవడమే నాక్కావల్సింది. మార్పును అలవాటు చేస్తేనే కదా జనం మారేది. నాకు 49 ఏళ్ళు, చాలా జీవితం మిగిలి వుంది, నేను ఇప్పుడు నా కోసం బతకాలి … ” అమ్మా ! నువ్వు మాతో వచ్చి కొన్నాళ్ళు వుండు ” అని పిల్లలు అడిగారు. నేను ఎంత ప్రతిఘటిస్తున్నా ఇక్కడ అనుక్షణం మనసును గాయపరిచే సంఘటనలు జరుగుతూనే వున్నాయి. భర్త పోయిన నెలలోగా ఒక రోజు రాత్రి గుడిలో నిద్రచేసి, అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళాలి అన్నారు. పుట్టింటివాళ్ళు తీసుకెళ్ళి బట్టలు పెడితే తప్ప ఎవరింటికీ వెళ్ళకూడదంట. ఆచారం పేరిట జరిగే ఈ తంతు చాలా సహజం జరగడం ఆశ్చర్యంగా అనిపించింది.

          నేను గుళ్ళో పడుకోనని చెప్పేయడంతో కనీసం గుడికి అయినా వెళ్ళి అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళమన్నారు. ఎందుకంటే నేను గుడికి వెళ్ళకుండా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి కీడు జరుగుతుందట.

          ” ఏంటమ్మా ఇది ? నువ్వు కూడా నన్ను ఇలాచేస్తే ఎలా ? ” అని అరిచాను.

          ” మీ వదినలకు ఈ నమ్మకాలు వున్నప్పుడు నేనేం చెయ్యను? పైగా ” పిల్లజెల్లా వున్న ఇల్లు ! ఆచారం పాటించకపోతే కొంపమునుగుతుందన్నట్టు మాట్టాడుతున్నారు ” అంది అమ్మ అసహాయమంగా.

          ఏ ఇంట్లో అయితే ఆడపడుచుగా నా చేత్తోనే పాలుపొంగించడం నుంచి అన్ని శుభకార్యాలు చేయించే వాళ్ళో వాళ్ళకి ఇప్పుడు నేనో పనికిరానిదాన్నయ్యాను. నేనెలా తయారయ్యానంటే పొద్దున్నే బయట గుమ్మం వూడవడానికి వెళ్ళినా నా ముఖం పొద్దున్నే చూస్తే అపశకునం అనుకుంటారేమో అని జంకుతున్నాను. ఎవరింటికైనా ఏ పూజ చేసుకుంటున్నామో అని పిలిస్తే వెళ్తే అక్కడ బొట్లు పెట్టే కార్యక్రమం మొదలవ గానే నేను తప్పు చేసినట్టు పక్కకి వెళ్ళి పోతున్నాను. చేయనితప్పుకు శిక్ష అనుభవిస్తూ జైలుగోడలు బద్దలుగొట్టడానికి ప్రయత్నించే ఖైదీ మనఃస్థితిలా వుంది. ఇక్కడి నుంచి కొన్నాళ్ళు పారిపోతే బాగుండుననిపించింది. అందుకే ఈ తతంగాలతో విసిగిపోయిన నాకు మార్పు కావాలనిపించింది. అమెరికా ప్రయాణమయ్యాను.

          ఈ ప్రపంచం కొత్తగా కనిపిస్తోంది. అనుక్షణం వెంటాడే భయాలేవో వీడినట్టు నిర్భయంగా ఇంతకు ముందు నా 17 ఏళ్ళ వయసులో వున్నట్టు స్వేచ్చగా వుంది మనసు. అమెరికాలో వున్న ఆర్నెల్లు మనవరాలితోడిదే లోకం అయ్యింది. దాని స్కూల్ నడిచే దూరమే. స్కూల్కి దింపడం అది క్లాస్ లోపలికి వెళ్ళే వరకు వుండి అక్కడే వున్న పార్క్ లో వాకింగ్ చేసుకుని ఇంటికెళ్ళడం, ఇంట్లో పనులు, మళ్ళీ దాన్ని స్కూల్నుంచి తీసుకురావడం దినచర్య.

          ఒక రోజు మాన్వీ నేను స్కూల్ కి వెళ్తున్నాం మా ఎదురుగా 55 ఏళ్లుంటాయేమో ఒకాయన నడిచివస్తున్నారు. ఆయన్ని చూపిస్తూ మాన్వీ అమ్మమ్మా ” మీరు ఆయన్ని మేరేజ్ చేసుకోవచ్చుకదా ? అని చటుక్కున అంది. నేను కాసేపు ఆలోచించి ఎందుకు అలా అడగాలనిపించిదో చెప్పమన్నాను. ఏడేళ్ళ పిల్లకి తన అమ్మమ్మ ఒంటరిగా వుందన్న విషయం స్పష్టంగా అర్ధమైంది అందుకే తనకి తోచిన సలహా చెప్పింది.

          అప్పుడు నేను అన్నాను ” నాకు నువ్వు, అమ్మ, మామ అందరూ వున్నారు ఒక్క తాత లేకపోతేనేం ” అని దాన్ని సమాధాన పరిచాను. కానీ మన దేశంలో అలా చేసుకోరని ఒక వేళ ఎవరైనా ఆ సాహసం చేస్తే ఇంట్లో నుంచే వ్యతిరేకత ఎదురవుతుందని చెప్పలేదు. చెప్పినా దానికి అర్ధంకాదు.

          ఆడాళ్ళు మళ్ళీ తోడు కావాలనుకుంటే నిజంగా నా ఇంట్లోవాళ్ళయితే.  ఒప్పు కుంటారా? చివరికి మా అమ్మనాన్న కూడా ఒప్పుకోరు. అదే 50 ఏళ్ళ మగవాడికి భార్యపోతే ఏడాదికల్లా కొత్త పెళ్ళాన్ని వెతికిమరీ పెళ్ళి చేసి ఒక జీవితాన్ని నిలబెట్టామని తృప్తిగా నిట్టూరుస్తారు.

          అయ్యో ఇంట్లో దీపం పెట్టడానికి ఒక ఆడది వుండొద్దూ ? అంటారు. ఇంటికి వచ్చి మా అమ్మాయితో జరిగింది చెప్పాను.

          “నువ్వు ఏమని అనుకుంటున్నావ్ మమ్మీ ! అనడిగింది.

          ” 30 ఏళ్ళుగా మీ నాన్నతో పడిన తిప్పలు చాలు, నిజంగా నాకు అవకాశం వచ్చినా మళ్ళీ ఆ బంధనాలు వద్దు తల్లీ ” అని దండం పెడుతూ నవ్వేశాను. కానీ తోడు కావాలని నిర్భయంగా ఆడాళ్ళు ముందుకు రావాలని మాత్రం నూటికినూరుపాళ్ళు కోరుకుంటాను అన్నాను.

          అమెరికా అయినా అంబాజీపేట అయినా మనం ఏమీ ఇసుమంత మారమని నాకర్ధ మైంది.

          ఒకామె తన కొడుకు బర్త్ డే పార్టీలో బొట్లు పెట్టి ఆహ్వానించి ముత్తయిదువలకు మాత్రం అక్షింతలేసే భాగ్యం కలగచేయడం చూసి ఆశ్చర్యపోయాను. మాన్వీతో ఆర్నెల్లు చాలా తొందరగా గడిచిపోయాయి. రోజూ నేనూ అది పడుకొని బోలెడు కబుర్లు చెప్పుకునే వాళ్ళం. అది టెన్నిస్ కి వెళ్ళి వచ్చి..

          ” అమ్మమ్మా ! మా టెన్నిస్ టీచర్ ఏజ్ కూడా మీ ఏజే. మీరు కూడా ఆడవచ్చు కదా !? మీరు యంగ్ గ్రాండ్ మా ” కదా అంది. అది అందరిని మీ ఏజ్ ఎంత అని అడిగి ఇలాగే ఏవేవో కంపారిజన్స్ చేస్తూ వుంటుంది. కానీ మాన్వీ మాట్లాడిన ప్రతి మాట నాకో సందేశం లా వుంటుంది. నిజమే వయసు కన్నా మనసు ముఖ్యం. ఇండియా బయలుదేరే సమయం వచ్చింది. పిల్లలిద్దరు సామాన్లు సర్దుతూ “ అమ్మా నీకు ఇంకో ఆర్నెల్లకి గ్రీన్ కార్డ్ చేయిస్తాం. బట్టలు అన్నీ ఇండియా పట్టికెళ్ళకు “ అన్నారు.

          ” నేను ఇక్కడికి రాదలుచుకో లేదురా ” అన్నాను. ” ఇది నా ప్రపంచం కాదు. నా ప్రపంచంలో నేను బతకాలనుకుంటున్నా “. మాన్వీ చెప్పింది ” నాకు ఇంకా వయసు మీర లేదని ..ఏదో ఒకటి నాకు నచ్చిన పని చేస్తా ఇప్పటికిప్పుడు ఏం చేస్తావమ్మా! మనకి ఆర్ధిక ఇబ్బందుల్లేవు హాయిగా కాలం గడపచ్చుగా అన్నాడు. “ చూద్దాం నాకు ఇప్పుడు కావలసింది డబ్బు కాదు వ్యాపకం. నా కోసమే నేను బతకాలని వుంది. పోయిన స్వేచ్చ తిరిగొచ్చి కొత్త జీవితం ప్రారంభించంటోంది.

*****

Please follow and like us:

2 thoughts on “చీకటి అవతలి వెలుగు (కథ)”

  1. Ippudu aadavaallu dhairyamgaa vuntunnaru. ANDUKU abinandiddam.bharta chanipote Mangala sootraalu teyavalasina avasaramledu. avivunte elanti nashtamoo Ledu. teesiveyadam naaku nachhaledu. kaavaalante vaatini mariachi lacket gaa vesukovachhu.
    maarandi mahilala poortigaa maarandi. sagam kaadu!

  2. అనుకోకుండా ఒకే రకమైన, ఒకే వస్తువు తో వ్రాసిన కథలు ఒకే సారి చదివాను ఈరోజు. ముగింపు మాత్రం భిన్నం గా వుంది. మహిళల ఆలోచనాలలో వచ్చిన మార్పు, తనను తాను గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత తెలియచేసే ముగింపు. బాగుంది

Leave a Reply

Your email address will not be published.