నీలి మేఘాలు

-వురిమళ్ల సునంద

కవిత్వం అంటే ఒక అన్వేషణ,ఒక తీరని వేదన,కవిత్వమొక జలపాతం.

కవిత్వాన్ని తూచడానికి తూనికరాళ్ళు ఉండవంటారు చలం.

అక్షరాన్ని అణువుగా అనుకుంటే ఆటంబాంబు లోని అణుశక్తి కవిత్వమని చెప్పవచ్చు. అక్షరాలను పూవులతో పోలిస్తే ఆ పూలు వెదజల్లే పరిమళాలే కవిత్వం అనవచ్చు. 

కప్పి చెప్పేది కవిత్వం విప్పి చెప్పేది విమర్శ అని సినారె అంటే.. “కదిలేది కదిలించేది పెను నిద్దుర వదిలించేది కవిత్వమని’ శ్రీ శ్రీ గారు అంటారు. “ప్రశాంత స్థితిలో జ్ఞాపకం చేసుకున్న భావోద్రేకమే కవిత్వం” అన్నాడు విలియం వర్డ్స్ వర్త్.”అసలైన కవిత్వపు చరణాల్లో/ అనుభవం తో కూడిన ఆధ్యాత్మిక భాషల్లో/ అంతర్గతంగా ఉన్న పారవశ్యపు అవాక్కు విను” సూఫీ కవి జలాలుద్దీన్ రూమీ అంటాడు.

..’జీవితంలో అనుభవాలను దృశ్యమానం చేసి సజీవంగా సహానుభూతి పొందేలా చేయడమే కవిత్వం. ఇలాంటి కవిత్వంలో  అనేక రకాల కవిత్వం వచ్చింది.అభ్యుదయ/ విప్లవ కవిత్వం, భావ కవిత్వం, కాల్పనిక కవిత్వం.. వీటితో పాటు ఆధునిక కవితా ఉద్యమాల్లో  స్త్రీ వాద కవిత్వం   చాలా ముఖ్యమైనది. 

శీలా సుభద్రా దేవి కవిత్వాన్ని నిర్వచిస్తూ” భావాలకు ప్రతిస్పందించి, సమాజంలో ని ఏ సంఘటనల్లో మనసు చేరినప్పుడు చెమరించిన భావాశ్రువును సిరా చుక్కను చేసుకునేది కవిత్వం” అంటారు. 1980వ దశకంలో స్త్రీలు కవితా రచనను అవసరంగా గుర్తించారు. స్త్రీలు తమ సమస్యలను కవితా రూపంలో వ్యక్తం చేసే క్రమంలో స్త్రీ వాద కవిత్వం ఆవిర్భవించిందని చెప్పవచ్చు.

ఈ స్త్రీ వాద కవిత్వం గురించి నిర్వచిస్తూ డాక్టర్ కాత్యాయని విద్మహే గారు” స్త్రీ పురుషుల మధ్య అసమానతలున్నాయి, వాటి కారణంగా కుటుంబం లోనూ సమాజంలోనూ స్త్రీలు అణచివేతకు, పీడనకు   గురవుతున్నారని తెలిసి … అలాంటి స్త్రీ ల జీవితాలను, అనుభవాలను కవితా వస్తువులుగా చేసి రాసిన కవిత్వం స్త్రీవాద కవిత్వం “అంటారు.

అలాగే సుమతీ నరేంద్ర గారు “లైంగిక పరమైన అణచివేత కు తిరుగు బాటు గా వెలువడింది స్త్రీ వాద కవిత్వం” అంటారు.

స్త్రీవాదం ప్రారంభం కాకముందే ప్రముఖ స్త్రీవాద రచయిత చలం గారు ” ఆమెకు శరీరం ఉంది/ దానికి వ్యాయామం ఇవ్వాలి/ ఆమెకు మెదడు ఉంది/ దానికి జ్ఞానం ఇవ్వాలి/ ఆమెకు హృదయం ఉంది/ దానికి అనుభవం ఇవ్వాలి”  అంటూ స్త్రీవాద కవిత్వానికి తెలుగులో పునాదులు వేశారు.

***

 స్త్రీ వాదంతో  1993 అక్టోబర్ లో వచ్చిన “నీలి మేఘాలు ” ఉత్తమ స్త్రీవాద కవితా సంకలనంగా చెప్పుకోవచ్చు. ఇది  తెలుగు కవితా లోకంలో సంచలనం సృష్టించింది. 

 ఈ కవితా సంకలనంలో  సుమారుగా ముప్ఫై ఒక్క మంది కవయిత్రుల/రచయిత్రులు రచించిన కవితలు  92 ఉన్నాయి.

“కవిత్వం మనకు విలాసం కాదు/ మనకు కవిత్వం సరదా పని కాదు/ మన ఉనికి కోసం అత్యవసరం గా కవిత రాస్తాం/ కవిత్వ కాంతి పుంజాలలో మనం/ మన కలల్ని కోరికల్ని చూస్తాం/ మన మనుగడ లో/ మన జీవితాల్లో మార్పుల గురించిన/ ఆ కలలూ కోరికలకు ఒక భాషను తెచ్చుకుంటాం/ ఆ భాష నుంచి భావాల్నీ/ ఆ భావాల నుంచి స్వతస్సిద్ధ చర్యల్నీ/ కవిత్వంతో ముందుకు తెస్తాం”

అంటూ‌‌…ఈ కవితా సంకలనాన్ని ప్రముఖ స్త్రీవాద కవయిత్రి .. స్త్రీవాద కవిత్వాన్ని ముందుకు నడిపిన నల్లజాతి కవయిత్రి ఆడ్ర్ లార్డ్ స్మృతికి అంకితం ఇచ్చారు.

ఇందులో ముందు మాట రాసిన  వసంత కన్నాబిరాన్ గారు ఈ ‘ *నీలి మేఘాలు* ‘  కవితా సంకలనం ఎందుకు తీసుకుని రావాల్సి వచ్చింది. స్త్రీలుగా రాయడానికి ప్రేరణ కలిగించిన విషయాలు ఏమిటో విపులంగా చర్చిస్తూ ” పితృ స్వామ్య  సంస్కృతి లో పుట్టి పెరిగిన మనం మన అణచివేత తో సహవాసం చేస్తూ ఆ పద్దతుల్లోనే నిర్వహించుకోవాలని చూపిస్తామని ,పురుషాధిపత్యం లేని సమాజాన్ని మనం నిర్వచించలేం వర్ణించలేం అంటారు. 

ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా గారు ఈ  కవితా సంకలనం గురించి రాస్తూ.. స్త్రీ వాద కవితలను స్త్రీల స్వంత సమస్యలు గా, స్వంత అసౌకర్యాల అనుభూతుల గొడవలు గా కాకుండా, సామాజిక సమస్యలుగా గుర్తించాలి అంటారు. స్త్రీవాద సాహిత్యం స్త్రీల అణచివేతనూ, దాని స్వభావాన్నీ విశ్లేషించే పద్దతీ, ఆ అణచి వేతను వ్యతిరేకించే ఉద్యమం.ఈ ఉద్యమపు వ్యూహం గురించిన వివేచన..ఇవీ ఇవాల్టి చారిత్రక అవసరాలు అంటూ ఈ కవితా సంకలనం లోని “జుగల్ బందీ”, తెల్లారకట్ట కివతల, లేబర్ రూం లాంటి  కొన్ని కవితలను ఉదహరిస్తూ అందులోని భౌతిక వాస్తవికతను అర్థం చేసు కొమ్మని అవి స్వంత సమస్యలు కావు మొత్తం సామాజిక సమస్యలని గుర్తించాలని అంటారు.

 ఇందులో కవితల 

చివర్లో కవయిత్రులు రచయిత్రుల  పరిచయం ఉంటుంది. 

మొదటి కవిత  కొండేపూడి నిర్మల గారు రాసిన *హృదయానికి బహువచనం* లో ఆడపిల్ల నుండి అమ్మతనానికి మారిన క్రమం శారీరక మానసిక మార్పులను వర్ణిస్తూనే  ఆరుపదుల వయసులో ..  ఒకనాటి సౌందర్యం   ఎలా మారిందో   చెబుతారు ” కాలానికి చిక్కి/ రోగానికి చిక్కి/ చేదెక్కిన వాస్తవాలకు చిక్కి/ ఇదే మనసును జోలెగా/ పేగులు చీల్చి మెళ్ళో వేసుకున్నట్లు/ పల్చటి నరాలు సాగి కనిపిస్తాయి.. చెప్పలేనంత వేదనగా.. దయగా,ఓరిమిగా.. అంటూ ముగించిన ఈ కవితలో బాల్యం నుంచి ముదిమి వరకు స్త్రీ జీవితాన్ని ఆవిష్కరించారు. వసంత కన్నాబిరాన్ గారు  ‘అస్మిత’ కవితలో స్త్రీగా ఉండటమంటే ఏమిటో నేను ఎప్పుడు తెలుసుకున్నాను?  పదిహేనేళ్ల ప్రాయంలోనా,… వైవాహిక జీవితంలో అనుభవించే సుఖం లోనా.. గర్భిణీ గా  తనలో పెరుగుతున్న ప్రాణిపై పెంచుకున్న మమకారంలోనా..ప్రసవ సమయంలోనా.. పసిబిడ్డడు పాలు తాగుతున్నప్పుడా… ఎప్పుడు తెలుసుకున్నాను. శరీరం జబ్బులతో శిధిలమై …నా మూలుగులను అదిమిపెట్టి/ చిరునవ్వుతో ఇల్లంతా శాంతిని వెదజల్లినపుడా…!  కానీ నిజానికి తను స్త్రీగా ఉండటం అంటే … అసత్యాలను తేరిపార చూసినప్పుడు….భ్రమల పొరల్ని వలిచి పారేయటం మొదలు పెట్టినపుడు కదూ.. అనడంలో.. ఇంతకాలం తన మనసు శరీరాలను ఎంతగా  కుటుంబానికి బానిసగా చేసింది. బందీయై వున్నానని తెలిసిన తర్వాత ‌…నా ఉనికిని మళ్ళీ కొత్తగా ఏర్పరచుకున్నప్పుడు కదూ అనడంలోనే  స్త్రీగా వుండటమంటే అర్థమేమిటో  తెలుసుకున్నది.. తను కోల్పోయిన జీవితం నుంచి కొత్తగా మొలకెత్తి ఉనికిని చాటుకునేందుకు చేసిన ప్రయత్నం లో నే అంతా ఇమిడి ఉంది.: ఓల్గా గారు రాసిన “దాంపత్యం” కవితలో.. ఇద్దరం ఎవరి కవచాలలో వాళ్ళం/ భద్రంగా ఇరుక్కుని/.. బుసల భయం మనల్ని కలిపినప్పుడు/… స్వయం తృప్తి సాధిస్తాం/.. మనం శవాలమైతేనేం/ కవచాలు పవిత్రమే కదా.. అంట దాంపత్యంలో   కలవని మనసుల అసంతృప్తిని వ్యక్తపరిచారు.

 “సౌందర్యాత్మక హింస’ అనే కవితలో “మనమంటే 34,24,35 కొలతలమైన చోట…..ఎంత హింసను భరిస్తున్నామో కదా! చెవులు ముక్కులకు రంధ్రాలు,.. మెడ, కాళ్ళు చేతులు, నడుము ఒంటినిండా అనేక రకాల గొలుసులతో బంధించి, దైహిక సౌందర్య పిపాసయే ధ్యాసగా..అదే సహ జాతమని నమ్ముతూ మనలోంచి మనసంతా తీసేసి డొల్ల చేసిన ఈజిప్షియన్ మమ్మీల్లా ఉండిపోతామని  వాపోతూ.. అందం పోటీయైన చోట/ అందం ‘సరుకైన’ చోట/ అందాల వ్యాపారాల్ని ద్వేషిద్దాం అంటారు.. ఇలాంటి విషయం మీద మందరపు హైమావతి గారు కూడా  ఇలాంటి పోటీలను నిరసిస్తూ కవిత రాశారు.. శ్రమ సౌందర్యాన్ని,మానవ విలువల్ని ప్రేమిద్దాం/ .సహజ సౌందర్య భరిత ప్రపంచాన్ని సృష్టిద్దాం.. అంటూ  స్త్రీని అంగడి సరుకుగా . ప్రసార సాధనాల్లో ప్రదర్శన వస్తువుగా  చూపించడాన్ని వ్యతిరేకిస్తూ విమల గారు రాసిన ఈ కవిత మహిళలందరూ ఆలోచించి తామెలా ఉండాలో నిర్ణయించుకునేలా చేసే కవిత ఇది.

 ‘జుగల్ బందీ’ కవిత ఒక స్త్రీ రాయడమే ఈ సమాజానికొక పెద్ద సవాల్ అంటారు ఓల్గా గారు. వాంఛా స్నానానికి ఉద్యమించి / ఆత్మలు రెండు/ నిలువెత్తు నిస్సిగ్గుకు నిర్వచన భంగిమలవుతాయి’ .. …

పరస్పర గాత్ర సహకారంతో/ జుగల్ బందీ తారా స్థాయిని చేరుతుంది/…. క్షణం క్రితం గర్వపడ్డ హృదయం గాయమై పగులుతుంది… లైంగిక అనుభూతుల గురించి ఇదంతా కలలా కరిగిపోయి అసలు నిజం అర్థమైన క్షణాలను ఓ స్త్రీ కవయిత్రి రాయడం పురుషాధిక్య సమాజంలో ఓ సంచలనమయ్యింది.

 ‘అనురాగ దగ్ధ సమాధి’ కవితలో   కళ్ళ గురించి  రాస్తూ.. నాపై అవిరరళంగా  వర్షించే అనురాగ మేఘాలు ఆ కళ్ళు. కళ్ళ అందాన్ని వర్ణిస్తూ ఆ ఇద్దరి అనురాగ సంగమాన్ని అక్షరీకరిస్తూ.. తనువంతా మనసైన మనసంతటా తనువైన /నేనైన తనలో పరిపూర్ణమై మేము… రమిస్తే శమిస్తే దమిస్తే శాంతి శాంతి శాంతి అంటూ స్త్రీ పురుష అనురాగ సంగమం గురించి రేవతి దేవి గారు  నిర్భయంగా కవిత్వీకరిస్తారు.

డా.కె గీత గారు  “నేను ఋతువునైన వేళ- కవితలో  స్త్రీత్వం నెలసరి సమయంలో పడే బాధను గురించి ” శరీరమంతా ఒక చోటే గడ్డ కట్టినపుడు/ ఒక వైయక్తిక పర్వతం నిశ్శబ్దంగా విస్ఫోటనం చెందినపుడు/ ఆ బాధని అరచేతిలో పట్టుకోవడాన్కి.. పడే ప్రయత్నం  లుంగలు చుట్టుకుపోయే బాధతో ఎంత భయంకరంగా ఉంటుందో  కళ్ళకు కట్టిస్తూ. నెలకోసారి చచ్చినట్టు నన్ను నేను నెప్పిగా మార్చుకోవాల్సొచ్చీ- చచ్చీ…. మళ్ళీ మళ్ళీ ముప్పయ్ రోజుల కోసారి పునర్జన్మ లెత్తుతూ.. అని రాసిన కవితలో స్త్రీ గా రూపాంతరం చెందినప్పటి నుండీ నెలసరిలో ఉండి కూడా  ఆ సమయంలోనూ తప్పని విధుల నిర్వహణలో  ఎంతగా శారీరక మానసిక వేదన పడుతుందో చెబుతారు. మరో కవిత “బంగాళా” ఖాతం” లో పురుషాధిక్యత  స్టేటస్ కింద నలిగిన ఆడతనం  గురించి చెబుతూ … “ఓహ్…అన్నీ ఉన్నాయి … కానీ క్రూర వినోదాలకీ /అంతర్గత శరీరం అయిపోయింది.. మనసు కర్ణభేరి మొదటికి తెగిపోయింది/ రాగాల సరాగాల సంసారం/ ఒక్కనాడూ అనుభూతికి రాలేదు/ ప్రేమ ఎక్కడుందో మచ్చుకైనా తెలీలేదు/ఇక్కడ ప్రాముఖ్యత లేనిది/ ఇంక వుండలేనిది కూడా వుంది- నేను… అంటూ రాసిన కవితలో అన్నీ ఉన్నాయి కానీ అందులో ఎవరైతే అనుభూతి చెందాలో ఆనందించాలో ఆమే లేదు.. ఆమె అక్కడ ఓ స్టేటస్ సింబల్.వస్తువుల్లో వస్తువు అంతే తప్ప ఆమె కూడా సాటి వ్యక్తి అని చలం గారు అన్నట్టు ఆమెకూ మనసూ,

ఆలోచనలు, అనుభూతులు ఉంటాయని అర్థం చేసుకోని తనాన్ని ఈ కవితలో చెబుతారు.

మందరపు హైమావతి గారు రాసిన ‘సర్ప పరిష్వంగం’ కవితలో  ఏమంటారంటే మూడు ముళ్ల బంధంతో  భార్యాభర్తలు ‌.. ఇరువురి తనువులొకటైనాక/ అద్వైత సిద్ధి పొందినాక…సంధింపబడిన ప్రశ్నల బాణం.. జీతమెప్పుడిస్తారు?.. ఈ ప్రశ్న గురించి అంటారు కవయిత్రి వేశ్య కూడా ఆ సమయంలో/ ఆ ప్రసక్తి తేదు..అంటూ వాపోతూ అప్పటి వరకు ఆ చేతులు చేతల స్పర్శ ..వేయి రాక్షస బల్లులు / మీద పాకినట్టు..గా ఉంది అంటారు. సంప్రదాయాల సజీవ సమాధి లో/ ఊపిరాడక గిలగిల కొట్టుకుంటున్నా.. జీవితం నుంచి కాదు కదా/ శరీరం నుంచైనా కించిత్తు కూడా/ దూరమవడం నా చేతుల్లో లేని పని.. అని రాజీపడుతూనే మృత్యు పర్యంతం/ బ్రతికేస్తూ వుంటాను/ నీ సర్ప పరిష్వంగం లో… ఈ కవిత పురుషాధిక్య ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా  కుదుపుకు లోను చేసింది ఆ రోజుల్లో..

 ‘విన్నావా’ కవితలో ఆడపిల్ల పట్ల తల్లి తండ్రి ,స్నేహితుడు, సమాజంలో ఆలోచన ఎలా ఉంటుందో  ఏ విధమైన ఆంక్షలు కాంక్షల నడుమ ఎలా బందీ చేస్తారో అబ్బూరి ఛాయాదేవి గారు చిన్న కవితలో  స్త్రీ జీవితాన్ని అక్షరీకరిస్తారు. సావిత్రి గారి కవిత..ఆమె రాసిన కవితలు రాశికి తక్కువే అయినా ఎంతగా వాసికెక్కాయో  ‘బందిపోట్లు’ కవిత చదివితే తెలుస్తుంది. పాఠం ఒప్ప చెప్పక పోతే పెళ్ళి చేస్తాన”ని పంతులు గారు అన్నప్పుడే భయమేసింది/..వాడికేం మగ మహారాజ’ని ఆడా మగా వాడినప్పుడే అర్థమైపోయింది/ … మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడనీ / మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే/ మమ్మల్ని విభజించి పాలిస్తోందని.. పురుషాధిపత్యం అణువణువూ ఎలా ఉందో ఈ కవిత చదివితే చాలు తెలుస్తుంది.

అంజన గారు  రెండే మాటల్లో..

 *అమ్మ- బొమ్మ* కవితలో

బాల్యంలో/ బొమ్మకు అమ్మనయ్యానని సంతోషించాను/ ఇప్పుడు అమ్మను నేనే! బొమ్మను నేనే అంటారు. విమల గారి మరో కవిత *వంటిల్లు* లో  స్త్రీ వాద కవిత్వం గురించి మాట్లాడేటప్పుడు ఈ వాక్యాలు చెప్పకుండా ఉండలేం.. వంటింటి సామ్రాజ్యానికి  మా అమ్మే రాణి/ అయినా చివరకు వంటింటి గిన్నెలన్నింటి పైనా మా నాన్న పేరే.. అంటారు. మా అమ్మకు చేతులు లేవు / ఆమెను చూస్తే- ఒక గరిట గానో / పెనంలానో / మా వంటింటిని  అలంకరించిన ఒక పరికరం లానో… మండుతున్న పొయ్యిలా కూడా ఉంటుంది’ అనడంలో ఆమె అస్తిత్వం వ్యక్తిత్వం.. ఆశలు, కలలు కాజేసిన.. వంటరి వంట గదులు కూల్చేందుకు రండి.. అని ఆవేశంగా రాసిన కవిత చదివిన ప్రస్తుత సమాజంలో భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం వల్ల పూర్తిగా కాకపోయినా

 కొంతలో కొంతైనా  మారిందని చెప్పవచ్చు. మరో కవిత *అబార్షన్ స్టేట్ మెంట్* .. మాతృత్వం వరమా! శాపమా?.. అనే సందిగ్ధంలో.. అనివార్యంగా గర్భస్రావం చేయించుకునే పరిస్థితిలో ఓ స్త్రీ ఆవేదన ఆమెలో రూపుదిద్దుకున్న ప్రాణిని చంపుకున్నా.. పాలింకి పోయేలా మందులు వాడినా. తల్లి  మనసు పడే ఆవేదన” అయ్యో!!

పాలింకిపోవడానికున్నట్లు/ మనసింకి పోవడానికి/ మాత్రలుంటే ఎంత బావుండు! పాటిబండ్ల రజని గారు  రాసిన ఈ వాక్యాలు చదివినప్పుడు కళ్ళు చెమ్మగిల్లకుండా ఉండవు. కొండేపూడి నిర్మల గారు రాసిన *లేబర్ రూం*  కవిత చదివితే స్త్రీ ప్రసవ సమయంలో ఎంత వేదన పడుతుందో కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించారు. *సర్దుకు పో!*  ఈ కవితలో బాల్యం నుంచే ఆడపిల్లను  సర్దుకు పో  నాలుగు అక్షరాలే స్త్రీ ని అగ్నికి ఆహుతి చేసే సాధనాలు అంటూ మందరపు హైమావతి గారు రాసిన కవిత ప్రతి ఇంట్లో చర్విత చరణంగా వినిపిస్తూనే ఉంటుంది. *తరతరాల శత్రువు*  కవితలో తన కడుపున పుట్టిన కొడుకును గురించి.. అవును!

నాకొక్కటి తెలీదు-

వర్గ శత్రుత్వం చచ్చిపోదని.. వాణీ రంగారావు గారు తను ఎంత ప్రేమగా పాలిచ్చి పెంచుకున్నా వర్గ శత్రుత్వం అలాగే ఉంటుందని వాపోతూ రాశారు ఈ కవిత. ఇలా ఈ కవితా సంకలనంలో  ఎస్.జయ రాసిన “కట్టుకొయ్య” , కవిత.

 _నరమేధ కాష్టంలో రగిలే చిరు రవ్వలు

లో  పసి పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను గూర్చి ఆవేదనతో  శిలాలోలిత గారు రాసిన కవిత . నేటికీ ఇలాంటి  సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. కుప్పిలి పద్మ గారు, రత్నమాల గారు వీరే కాకుండా

 “పైటను తగలెయ్యాలి”  జయప్రభ గారి కవిత.. “ఉద్యమించి లేస్తున్నా”వకుళాభరణం లలిత గారు, “జ్ఞాపకాల తెరలు” – పుట్ల హేమలత గారు, _అంగార స్వప్నం- ఊర్మిళ గారు,వసంత కన్నాబిరాన్  ‘శరీరం’ సుధ గారి  లొంగుబాటు సంగీతాన్ని కాను, ఓల్గా గారి ‘అద్వైతం’

లాంటి కవితలు రాసిన  ముప్పై ఒక్క మంది కవయిత్రులు స్త్రీ మానసిక శారీరక వేదనలను, వేధింపులను , సమాజంలో స్త్రీల అణచివేతపై సంధించిన కవితా కవితా శరాలు.. స్వాభిమానంతో ఉరిమిన భావాలు.. ప్రస్తుతం స్త్రీలపై అన్ని స్థాయిల్లోనూ, అన్ని రూపాలలో  జరుగుతున్న అణచి వేతను నిరసిస్తూ రాసిన కవితల సంకలనం ఇది. స్త్రీవాదాన్ని , స్త్రీల  ఆత్మాభిమానాన్ని  వ్యక్తీకరించిన ఈ ‘నీలి మేఘాలు’

కవితా సంకలనం ప్రతి కవులు రచయితలు గా ప్రతి వారి వద్ద ఉండ వలసిన పుస్తకం.

అంశం: స్త్రీవాద కవిత్వం

శీర్షిక:: నీలి మేఘాలు-స్వాభిమానంతో ఉరిమిన భావాలు

మొత్తం పేజీలు:230

ప్రథమ ముద్రణ- 1993

వెల:25 -00రూ

కవర్ డిజైన్:అంజన్ బాబు

అట్ట వెనుక కవిత: ఓల్గా

ప్రతులకు

నవోదయ బుక్ హౌస్

ఆర్యసమాజ్ ఎదురుగా

కాచిగూడ, హైదరాబాద్-500027

అస్మిత

రోడ్ నెం.2

వెస్ట్ మారేడు పల్లి

సికింద్రాబాద్-500003


*****

Please follow and like us:

One thought on “నీలి మేఘాలు (పుస్తక సమీక్ష)”

Leave a Reply

Your email address will not be published.