రేవు పట్టణం ‘కొచ్చి’

-డా.కందేపి రాణి ప్రసాద్

          దేవుడి స్వంతదేశంగా పేరు పొందిన కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ ను చూడటానికి వెళ్ళాం. గత సంవత్సరం ఇదే ఫిబ్రవరి నెలలో కేరళలోని పాల్గాట్ కు వెళ్ళాము. అక్కడ దాదాపు నెలన్నర రోజులుండడంతో చుట్టు పక్కల ఉన్న వాటిని చూసి వాటి చరిత్రను తెలుసుకున్నాం. మేము కాచ్చిన్ ను చూసి పదిహేను సంవత్సరాలు అయింది. అప్పుడున్న ఎయిర్ పోర్టు భవనం చాలా చిన్నదిగా ఉన్నది. ఇప్పుడు చాలా అభివృద్ధి జరిగింది. చాలా పెద్దది గా “కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు” తన ఆకారాన్ని మార్చుకున్నది. ఈ సంవత్సరం జాతీయ పిల్లల డాక్టర్ల సమావేశాలకు ‘కొచ్చి’ వేదిక అయినందున మేమందరం కొచ్చి బయలుదేరాం.

          కేర అంటే కొబ్బరి అళం అంటే భూమి అని అర్ధం. కొబ్బరి చెట్ల భూమిగా కేరళను చెప్పుకుంటారు. దీనికి దేవుడి స్వంత దేశంగా ఎందుకు పేరు వచ్చిందంటే చేర రాజులు ట్రావెన్ కోరు మరియు కొచ్చిన్ ను అనంత పద్మనాభ స్వామికి అంకితమిచ్చారు తర్వాత ఆ స్వామి ప్రసాదంగా ఈ భూమిని భావించటం వలన కేరళను దేవుని భూమిగా అంటుం టారు. ఈ రాష్ట్రం అరేబియా సముద్రపు బడ్డున ఉండి శ్రీలంకతో సంబంధాలు కలిగి ఉన్నది. సముద్రం ద్వారా వెళితే కేరళ నుంచి శ్రీలంక 20.కి.మీ దూరంలోనే ఉన్నదట. అలాగే లక్షద్వీప్ కూడా అను సంధానించబడి ఉన్నది. లక్షద్వీప్ కు సంబంధించిన హైకోర్టు ఉన్నది.

          1947 లో స్వాతంత్య్రం వచ్చినపుడు కేరళ రాష్ట్రంగా ఏర్పడలేదు. మద్రాసు ప్రెసిడెన్సీని రాష్ట్రంగా ఏర్పరచినపుడు అందులోని కొన్ని తాలూకాలను ట్రావెన్ కోర్ కొచ్చిన్ లలో కలిపారు. 1956 నవంబరు 1 వ తేదీనాడు కేరళ ఒక రాష్ట్రంగా ఏర్పడింది. 10 వ శతాబ్దంలో ద్రావిడ భాషలు మాట్లాడేవారంతా ఒక చోట స్థిరపడ్డారు. అప్పుడు మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. కేరళ సరిహద్దులుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు న్నాయి. కేరళ రాజ ముద్రలు ట్రావెన్ కోర్ రాజ సంస్థానపు ముద్రలే. 1498 లో కేరళను వాస్కోడిగామా చూశాడు. సుగంధ ద్రవ్యాల వర్తకంలో కేరళ ముందుండటానికి కారణం ఓడల ద్వారా ప్యాపారం సాగించడమే. కేరళ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రస్తుత కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పినరాయి విజయన్. కేరళ అత్యంత అధిక అక్షరాస్యతా శాతం కలిగిన రాష్ట్రంగా పేరు పొందింది.
మలయాళ సాహిత్యం చాలా పురాతనమైనది. వీరి సాహిత్యంలో మన తెలుగు సాహిత్యం లో వలే కవిత్రయం ఉన్నారు. “కుమారన్ ఆశన్, వల్లతోల్ నారాయణ మీనాన్, ఉట్లూర్ ఎస్. పరమేశ్వర అయ్యర్” లు మలయాళ సాహిత్య కవిత్రయంగా పేరుపొందారు. అలాగే 20 వ శతాబ్దంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన సాహితీ వేత్తలు జి. శంకర్ కురుప్, ఎస్. కె. పొట్టక్కాట్, ఏమ్ టి. వాసుదేవ నాయర్ లు కీర్తిని తీసుకువచ్చారు. బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్ రచించిన నవలలో నేపధ్యమంతా కేరళలోని కోట్టాయం పట్టణం గురించే ఉంటుంది.

          24వ తేదీ రాత్రి 8 గo.. లకు ఎయిర్ Air India Express లో ‘కొచ్చి’ బయల్దేరాం. కానీ ఫ్లైట్ లేటయ్యింది. ఎయిర్ పోర్టులో సమాచర డాక్టర్లతో కబుర్లు చెప్పుకోవడం బావుంది. టైముండటంతో లాంజ్ కు వెళ్ళి ఫుడ్ తిని కాసేపు రెస్ట్ తీసుకున్నాము. రాత్రి 10:30కు కొచ్చికి చేరాము. కొచ్చిలో దిగగానే మమ్మల్ని పికప్ చేసుకోవడానికి కారు వచ్చింది. డ్రైవర్ పేరు బైజ్. మేము ‘తాజ్ వివాంటాకు’ చేరేసరికి 11:00 అయింది. పెరియార్ నదిని దాటుకుంటూ 20 ని..లు ప్రయాణం చేశాక హోటల్ కు చేరాము దారిలో కానూర్, కాలర్, పచలమ్ అంటూ రోడ్లు కనిపించాయి. రాజగిరి హాస్పిటల్, లిసీ హాస్పిటల్ అనే హాస్పిటల్ బోర్డులు కనిపించాయి. రాత్రికి తిని రెస్ట్ తీసుకున్నాం.

          మా కాన్ఫరెన్స్ “లు బోల్గట్టి ఇంటర్ నేషనల్ కన్ వెన్షనల్ సెంటర్”లో జరుగు తున్నది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని అక్కడకు వెళ్ళాలి. బ్రేక్ ఫాస్ట్ హాల్ లో పుట్టు, అప్పం, ఇడియప్పం, వట్టయప్పం, ఉన్నియప్పమ్, ఫాజిమ్ నరుక్కు, గోతాంబు అడా వంటి వంటకాలున్నాయి. స్టిమ్ డ్ బనానా, ఐస్ క్రీమ్ బనానా షేక్, కోకోనట్ మిల్క్ షేక్ లున్నాయి.

          ‘గ్రాండ్ హయత్ బోల్గట్టి’ హోటల్ కు వెళ్ళాము అక్కడ ఉన్న స్టాఫ్ అంతా అరటి ఆకుల రంగు అంటే లేత ఆకుపచ్చ రంగు టీ-షర్టులు ధరించారు. మన పేర్లు రాసిఉన్న టాగ్ కార్టులు సైతం అదే రంగులో ఉన్నాయి. కేరళ పచ్చదనానికి గుర్తుగా పెట్టారేమో తెలియదు. రిజిష్ట్రేషన్ అవుతూనే గేటు దాటగానే ఎన్నో నాట్య భంగిమలతో పెద్ద పెద్ద బొమ్మలు పెట్టారు. అందరూ అక్కడ నిలబడి ఫోటోలు తీసుకుంటూ ఆనంద పడుతు న్నారు. మనకు ప్రధానమైన నృత్య కళా రూపాలైన కథాకళి, మోహిని అట్టమ్, కేరళ వారి ప్రధాన నాట్యాలు. నేను పిల్లల కోసం ప్రధాన నాట్య రూపాల గురించి ఛార్టులు తయారు చేశాను. వాటికి ‘భారతీయ నృత్య రీతులు’ అని శీర్షిక పెట్టాను. అందులో కూచిపూడి భరత నాట్యాలతో పాటు కథాకలి, మోహిని అట్టంలు సైతం ఉన్నాయి.

          ఇంకా అక్కడ ఒక ఏనుగు నిలబడి అందరినీ తొండంతో దీవిస్తుంది. ‘హేయ్! ఏనుగును తీసుకొచ్చారు’. అని ఆనందంగా దగ్గర కెళ్ళేసరికి ఫోటోలు తీసుకునేవారు చాలా దగ్గరగా నిలబడుతున్నారు. భయం లేకుండా ఇంత దగ్గరగా ఎలా నిలబడు తున్నారని చూస్తే అది బొమ్మ ఏనుగని తెలిసింది. చాలా దగ్గరగా వెళ్ళేదాకా తెలియదు. కళ్ళు తిప్పుతున్నది. చెవులు కదిలిస్తున్నది, తోక ఊపుతున్నది. తొండం ఎత్తి దీవి స్తున్నది. ఇదంతా మోటార్ సహాయంతో చేస్తున్నారు. కానీ చాలా బాగుంది. నేను మూడు రోజులూ ఫోటోలు తీసుకున్నాము.

          ఒకప్పుడు డచ్ దేశస్థులచే కట్టబబడిన ప్యాలెస్ ప్రస్తుతం రిసార్టుగా మారింది. దీనిని ‘బోల్గట్టి ప్యాలెస్’ అంటారు. పెద్ద రాజభవనం ద్వీపం మధ్యలో నిర్మించబడింది. కొచ్చి మొత్తం ఒక ద్వీపమే ప్యాలెస్ చుట్టూ అందమైన ఉద్యానవనాలు, స్విమ్మింగ్ పూల్ మరియు పిల్లలు ఆడుకునే ఉయ్యాల, లాడర్ అండ్ స్లైడ్ వంటి ఎన్నో ఆట వస్తువులు ఉన్నాయి. ప్యాలెస్ లోపల చెక్కతో చేసిన మెట్లు, అoదమైన చెక్కడాలతో. గవాక్షాలు, సుందరమైన దర్వాజాలున్నాయి. లోపల డచ్, బ్రిటిషర్ల చిత్రాలు పెట్టుబడి ఉన్నాయి. దీనిని డచ్ మలబార్ కమాండర్ కోసం కట్టారు. 1744 లో నిర్మించబడిన ఈ ప్యాలెస్ ను 1909 లో బ్రిటిష్ వారికి లీజుకు ఇచ్చారు. స్వాతంత్య్రం తర్వాత రాష్ట్ర ఆస్థిగా మారి హెరిటేజ్ హోటల్ రిసార్టుగా మారింది. మా డాక్టర్లు కొంత మంది ఆ హోటల్ కు బుక్ చేసుకున్నారు. లోపల మంచాలు కూడా రాజుల పందిరి మంచాల వలె ఉన్నాయి. అన్నీ రిచ్ గా ఉన్నాయి. “ఐ లవ్ బోల్లట్టి” అని ఉన్న చోట ఫొటోలు తీసుకున్నాం. గ్లాస్, చెక్క ఎక్కువగా వాడబడింది. ఎర్నాకులం జిల్లాలోని బోల్లట్టి ద్వీపంలో నిర్మించబడటం వల్ల దీనికి బోల్లట్టి ద్వీపం అనే పేరు వచ్చింది.

          మధ్యాహ్నం భోజనాల సమయం అయింది. ఈసారి డైనింగ్ హాల్ చాలా ప్రశాంతం గా ఉంది. ఎప్పుడూ తోపులాటలతో ఉండేది. ఎక్కువ కౌంటర్లు, తక్కువ వెరైటీలు పెట్టడం వల్ల డైనింగ్ హాల్ లో ప్రశాంతంగా ఉన్నది. క్రిక్కిరిసిన జనాలతో ఒకరి ప్లేట్లు ఒకరికి తగులుతూ, పదార్థాల కోసం ఎక్కువ సేపు వేచి చూస్తూ, బరువైన ప్లేట్లు పట్టుకో లేక, చిన్నారులకు తినిపించలేక ప్రయాసపడేవారు. నానబెట్టిన రాజ్ మా. స్వీట్ కార్న్ గింజల రుచిగా ఉన్నాయి. ఉరబెట్టిన ఆలివ్ కాయలు అందంగా అమర్చబడి ఉన్నాయి.
భోజనాలయ్యాక గ్రాండ్ హయత్ ను మొత్తం తిరిగి చూశాం. నాకు ఎక్కడైనా వింతగా అలంకారాలు కనిపిస్తే ఆనందపడతాను. ఎస్కలేటర్లు ఎక్కి పై అంతస్తులకు వెళ్ళి నపుడు షాండ్లియర్లుగా రకరకాల ఆలంకరణలు కనిపించాయి. రెండు కిడ్నీల ఆకారంలో వెదురు అలంకారం ఆశ్చర్యమనిపించింది. దాన్ని పోటో తీసుకున్నాను, డాక్టర్లకు క్లాసులు తీసుకునే హళ్ళలో కూడా అందమైన అలంకరణలున్నాయి. అద్దాల ముక్కలు అతికించినట్లుగా పైన ఉన్న అలంకారం అందంగా ఉంది చుట్టూ గార్టెన్ లా ఎన్నో రకాల పామ్ చెట్లున్నాయి. అలాగే పక్షిముక్కు పూల మొక్కలు ఎరుపు, పసుపు, నారింజ రంగు ల్లో అందంగా, మునోహరంగా కనిపిస్తున్నాయి. ఈ బిల్డింగుకు ఆనుకుని నీళ్ళు కనిపి స్తున్నాయి. ఆ నీళ్ళు పెరియార్ నదో, వెంబనాడు సరస్సో, అరేబియా సముద్రమో అర్ధం కావడం లేదు. ఎక్కడ వంతెన వచ్చినా అడుగుతున్నాను. ఒకచోట సముద్రం అనీ, ఒకచోట నది అనీ, ఒక చోట సరస్సు అనీ చెబుతున్నారు.

          రాత్రికి ప్రారంభోత్సవ సమావేశం జరిగింది. కొత్త, ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించే సమావేశం పాత ప్రెసిడెంట్ చేసిన కార్యక్రమాలను గురించి వివరిస్తారు. ముఖ్య అతిధిగా కొచ్చి ఆరోగ్యశాఖ కార్యదర్శి వచ్చారు. ఇంకా కేరళ హైకోర్టు న్యాయమూర్తి కూడా వచ్చారు. కేరళ హైకోర్టు భవనము చాలా అందంగా ఉంది మేము ఫోటో తీసుకున్నాం. దీని వెనకాలే మంగళవనం బర్డ్ శాంక్షురీ ఉన్నది. మేము వెళ్ళి చూసి వచ్చాం. అరేబియా సమద్రపు బ్యాక్ వాటర్స్ కు అనుకునే ఈ ఉద్యాన వన పక్షి కేంద్రం ఉన్నది. బర్డ్ శాంక్షురీకి వెళ్ళె దారికి డా.. సలీం అలీ రోడ్ పేరున్నది. అక్కడ చిలకలు, పక్షులు, కొంగలు, గబ్బిలాలు ఉన్నాయి.

          డచ్ ప్యాలెస్, చైనీస్ నెబ్స్, మట్టాన్ చెర్రీని చూసోచ్చాం. ఇంతకు ముందు కూడా చూశాం. పదిహేను ఏళ్ళ క్రితం ట్రావెలింగ్ రాసినపుడు వీటి గురించి వివరంగా రాయడం వలన ఇప్పుడు రాయడం లేదు. కేరళ అనగానే రాజా రవివర్మను గుర్తు చేసుకోకుండా ఉండలేము. మా కాన్ఫరెన్స్ లో రవివర్మ చిత్రాలను ప్రదర్శనకు పెట్టారు. అందరం చూశాం. భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్ర కారునిగా పేరు తెచ్చుకున్న రాజా రవివర్మ చిత్రాల గురించి ఇంతకు పూర్వమే వ్యాసం రాశాను. మా హాస్పిటల్ లో కూడా రవి వర్మ చిత్రించిన తల్లీ బిడ్డల బొమ్మలు పెట్టాము. మా కాన్ఫరెన్స్ లో రాత్రిపూట డిన్నర్ తో పాటుగా కేరళ జానపద నాట్యలను ప్రదర్శించారు. కూడి యాట్టం, కేరళ నటనం, తెయ్యం, తుల్లాల్, చండా వంటి నాట్యాలను అద్భుతంగా నర్తించి చూపారు. ప్రముఖ నేపధ్య నాయకులు వచ్చి పాటలు పాడుతూ ప్రేక్షకులతో డాన్సులు కూడా చేయించారు. కళ్ళకు, పొట్టకు మంచి విందు దొరికింది.

          అరెప్పీలొని బాక్ వాటర్స్ లో బోటింగ్ చేయాలని వెళ్ళాం. కొచ్చి నుంచి 60 కి.మీ ల దూరంలో ఉన్న అలెప్పీకి వెళ్ళాం.

          అలెప్పీ, అలపుజా జిల్లాలో ఉన్నది. భారతదేశంలోని అత్యంత ప్రధాన ఆకర్షణ లలో ‘అలపూజ’ ఒకటి. భారత ప్రజలనే కాదు ప్రపంచ పర్యాటకుల్ని సైతం తన వైపు తిప్పుకున్న అలెప్పీ అందాలు అధ్భుతమైనవి వెంబనాడు, పంబా సరస్సులు, అరేబియా సముద్ర జలాలలో బోట్ రైడింగ్ చేస్తారు. ఇందులో హౌస్ బోట్లలో డేటూర్, నైట్ టూర్ అని వెళ్తారు. ఇక్కడ సినిమా షూటింగులు, కోకోనట్ ట్రీస్, పాడీ ఫీల్డ్స్ చూపిస్తారు. నాలుగైదు గంటల బ్యాక్ వాటర్స్ లో పడవ ప్రయాణం అద్భుతంగా సాగింది. వెంబనాడు సరస్సు, అరేబియా జలాల్లో సైతం బోట్ తిరిగింది. నీళ్ళనిండా గుర్రపు డెక్క మొక్కలు విస్తరించి ఉన్నాయి. కొంగలు, పక్షులు ఎన్నో కనిపిస్తున్నాయి. నీళ్ళలో పడవ ప్రయాణం అత్యంత మనోహరంగా ఉన్నది. అలెప్పీ ప్రయాణం తర్వాత కొచ్చి వెళ్ళాం. కొచ్చిలో శివలింగ పుష్పాల చెట్టును చూసి వివరాలు తెలుసుకున్నాను. ఈ విధంగా కొచ్చి ప్రయాణ విశేషాలు మీతో పంచుకుంటున్నాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.