డా||కె. గీత గారి వెనుతిరగని వెన్నెల & ట్రావెలాగ్స్- ఒక సమాలోచనం

-వి. విజయకుమార్

(“సేవా” సంస్థ వారి “డా||కె. గీత సాహితీ వీక్షణం” సమావేశ  ప్రసంగ పాఠం)

          నిజానికి గీత గారి సాహితీ సమాలోచనం అంటే రెండు విభిన్న ప్రపంచాల మధ్య ఇంద్రధనస్సులా వెల్లివిరిసిన రంగుల వారధిపై యాత్రా కథనం లాంటిదని చెప్పాలి. బహుముఖాలుగా, వైవిధ్య భరితమైన సాహితీ ప్రక్రియలతో అప్రతిహతంగా తనదైన శైలిలో ముందుకు వెళుతూ నెచ్చలి అంతర్జాల పత్రిక వేదిక ద్వారా అనేకమంది లబ్ద ప్రతిష్టలైన రచయితలనూ, రచయిత్రులనూ ఇంకా మంచి రచనలు చేసే అనేకమంది కొత్త వారినీ కూడా పరిచయం చేస్తూ వస్తున్న నేపథ్యంలో వారి పరిచయ భాగ్యం కలిగిన నాకు – నా కళ్ళతో అమెరికా, (ట్రావెలాగ్స్), వెనుతిరగని వెన్నెల -( నవల) గురించి ఈ సమావేశంలో కొద్దిసేపు  ముచ్చటించే అవకాశాన్ని కల్పించినందుకు, ఈ వేదికకు, ప్రత్యేకించి గీత గారికి ధన్యవాదాలు. 

          ముందుగా వారి బృహన్నవల వెనుతిరగని వెన్నెల గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం.

          స్త్రీ సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో ఇంటా బయటా తామెదుర్కునే సమస్యల్ని యువతులు తమకు తాముగా ఎలా పరిష్కారాలు వెతుక్కోవాలో తనదైన శైలిలో, చక్కని నవలా శిల్పంతో అద్భుతంగా రాసిన నవల వెనుదిరగని వెన్నెల అని చెప్పాలి. స్త్రీ సమస్యల్ని ప్రతిభావంతంగా చిత్రించిన ఏ రచననైనా చదవాల్సింది నిజానికి స్త్రీలు కాదు, పురుషులే! మారవలసింది స్త్రీ కాదు, ముందుగా పురుషుడే! వెనుతిరుగని వెన్నెల కూడా ముందుగా చదవాల్సింది నిజానికి పురుష పుంగవులే అని చెప్పటానికి సాహసిస్తున్నాను.   

          ఎప్పుడో ఏడెనిమిది దశాబ్దాల క్రితం, చలం అనే మహానుభావుడు స్త్రీకి సైతం హృదయం ఉందని చెబితే “భూమి గుండ్రంగా ఉంద” ని కోపర్నికస్ చెప్పినప్పుడు ఎంతగా విస్తుపోయిందో ప్రపంచం, అంతగా నిర్ఘాంత పోయింది తెలుగు జాతి. స్త్రీకి నచ్చిన పచ్చడీ, స్త్రీకి నచ్చిన రంగు చీరా, స్త్రీకి నచ్చిన కూరా కూడా ఉండొచ్చని చలం ప్రతిపాదించినప్పుడు పురుష ప్రపంచం మూర్చ పోయినంత పని చేసింది. స్త్రీ హృదయ వేదన గురించి ఆయన ఎంతగా పరితపించినా, శరత్ బాబు నవలలన్నీ తెలుగు లోగిళ్ళ లో అప్పటికే అందుబాటులోకి వచ్చినా, ఆ తర్వాత తెలుగు నవలా ప్రపంచంలో  రాజ్య మేలిందంతా చెలం సెలవిచ్చిన భావాలు కావు, ఊహా స్వర్గాల్లో తేల్చిన ఎగువ మధ్య తరగతి సొబగులు అద్దుకున్న అందమైన కృత్రిమ జీవితాలు. పెటీ బూర్జువా మనస్తత్వా లతో మునిగితేలిన స్త్రీ పాత్రలే! ఉప్పెనలా ముంచెత్తిన, మహిళలే అధికంగా రాసిన నవలల్లో నిజమైన స్త్రీ స్వాతంత్ర విలువనూ, ఎదిరించి ప్రకటించాల్సిన స్వేచ్ఛా స్వతంత్ర గొంతుకనూ ప్రతిభావంతంగా చిత్రించిన సాధికారిక నవల జానకి విముక్తితో పోల్చదగ్గ నవలలు రాకపోవడం గమనార్హం. ఎందుకిలా జరిగింది? స్త్రీ పట్ల పురుష వైఖరి గానీ, స్త్రీ తన పట్ల తనకున్న చైతన్యంలో మార్పులు గానీ పెద్దగా చోటు చేసుకోలేదన్నది సుస్పష్టం. 

          రంగనాయకమ్మ గారి జానకి విముక్తి తర్వాత, స్త్రీ స్వేచ్ఛ గురించీ, స్త్రీ భావోద్వే గాల్నీ, పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీకి ప్రతి చోటా ఎదురయ్యే అనేక రకాల అవమానాల్నీ, ఆవేదనల్నీ, పుట్టినప్పటి నుంచీ మరణించే వరకూ స్వేచ్ఛ కోసమే కలలుగంటూ, ఆ కలలు కల్లలుగా మారి బతకడమే అలవాటైన లక్షలాది మంది స్త్రీలకు అసలు స్వేచ్ఛ ఏమిటో, జీవితం ఏమిటో, ఏది బ్రతుకో, ఏది కాదో చెప్పసాహసించిన నవల గీత గారి వెనుతిరగని వెన్నెల.

          ఈ దేశపు యువతుల్లో చాలా మందికి చిరుగుల జీన్స్ వేసుకుంటే స్వేచ్ఛ ఉన్నట్టేననీ, నచ్చిన అబ్బాయితో డేటింగ్ చేస్తే స్వేచ్ఛ ఉన్నట్టేననీ, ఇష్టం లేకపోతే విడిపోయే అవకాశం ఉంటే స్వేచ్ఛ ఉన్నట్టేననీ  అనుకుంటూ అక్కడితో ఆగిపోయి, దాన్నే స్వేచ్ఛగా భావిస్తూ, నిజమైన స్వేచ్ఛ ఎలా ఉంటుందో కూడా తెలియని అయోమయపు అంతుచిక్కని యువతరాన్ని చైతన్యపరిచే ఉద్దేశంతో రాసిన నవల ఇది. అపజయాలను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవటమే జీవితం అంటూ యువతరాన్ని ప్రబోధిస్తూ రాసిన స్ఫూర్తివంతమైన నవల ఇది.

          సంభాషణల్లో ఆయా పాత్రల స్వభావాన్ని పుణికి పుచ్చుకున్న తీరు ఈ నవలలో చాలా అద్భుతంగా చిత్రీకరించారు గీత గారు. ఆయా పాత్రలు ప్రాతినిధ్యం వహించే వారి సామాజిక పాత్రలో ఎంతగా ఇమిడిపోతారంటే ఆయా స్వభావాలన్నీ మనం నిత్య జీవితంలో మన ఇంట్లో, మన  పొరుగింట్లో చూసేవే! “అబ్బా, ఈవిడ అచ్చం దేవిలా ఉంది, ఈవిడ మా నరసమ్మ మామ్మలా ఉంది, మా అత్తమ్మ మాట్లాడినట్టే ఉంది జ్యోతి మాట్లాడుతుంటే… ధనుంజయ మూర్తి మా నాన్నే అచ్చం, వామ్మో ఆ శేఖర్ గాడు అచ్చం మా అల్లుడే! “అనకూడదు గాని ఇట్లా మూసలా దిగిపోయాడు, వాడి బుద్దులూ వాడూనూ…పిల్ల చదువుతానంటే ఒప్పడు…అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతాడు …దాన్ని మా ఇంటి కొచ్చినా అనుమానిస్తాడు…పిల్లను వేపుకు తింటున్నాడనుకో…”  రెండు మూడు దశాబ్దాల క్రితం…శేఖర్ గానీ, తన్మయి గానీ లేని తెలుగు వారి లోగిలి లేదంటే నమ్మశఖ్యం కాదేమో!

          ఇందులో ఇంచుమించు ప్రతి పాత్రా ఏ పాత్ర ఏం మాట్లాడుతుందో తెలుగు కుటుంబాల లోగిళ్ళలో కాసేపు నిలబడి వింటే మనకు అనుభవైకవేద్యమే అన్నట్లు కనెక్ట్ అవుతాము. ఈ బృహన్నవలలో పాత్రలన్నీ రత్న కంబళిలో పడుగు పేకల జలతారులా అల్లుకుపోయి, తెలుగింటి కుటుంబ జీవన రేఖల్ని హృద్యంగా అలరిస్తాయి, ఒక్కోసారి వేదనతో పరితపించేలా చేస్తాయి.

          వెనుతిరగని వెన్నెల (2021)  అమెరికాలోని వంగూరి ఫౌండషన్  ప్రచురించింది. “కౌముది” లో ఆరు సంత్సరాల పాటూ ధారావాహిక నవలగా “నెచ్చెలి” లో ప్రస్తుతం ధారావాహిక ఆడియో నవలగా, ఆంగ్లానువాద ధారావాహికగా అత్యంత ప్రజాదరణ పొందిన నవలగా పేరుతెచ్చుకోవడం గర్వకారణం. ఈ నవల తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారంతో పాటూ అంపశయ్య నవీన్ సాహితీ పురస్కారాన్ని కూడా అందు కుంది. 

***

          రెండో అంశంగా వారి యాత్ర కథనాలు నా కళ్ళతో అమెరికా గురించి రెండు మాటలు ముచ్చటిస్తాను. రాండమ్ గా తీసుకున్న ఒకటి రెండు యాత్ర కథనాలను ఉదహరిస్తాను.

          నిజానికి యాత్రానుభవాలు రాయడం అంటే ఒక నూతన ప్రదేశాన్నో ప్రాంతాన్నో దర్శించటమే కాదు,  అక్కడ చరిత్ర చీకటి పొరల్లో మరుగున పడిన సామాజిక జీవన దర్శనం కూడా. అనేక ప్రాంతాలకు ఏదో ఒక చారిత్రక ఘట్టంతో ముడిపడిన పేజీ చరిత్ర పుటల్లో వుండే వుంటుంది. ఇప్పుడొక చారిత్రక అవశేషంగా మిగిలిన ఆ శిథిల స్మృతి, ఒకప్పుడది బహుశా అత్యంత ప్రభావశీలమైన చరిత్ర తాలూకూ ఆనవాలేమో? శిథిలమైన గతం తాలూకూ జ్ఞాపకమేమో? ఆ శిథిలాల్లో స్మృతుల్లా మిగిలిపోయిన వేదన తాలూకూ మూలుగుల్ని కూడా వినిపించడమే ఒక నిజమైన ట్రావెలాగ్ స్ఫూర్తి. 

          జీవితం ఎలా సుఖదుఃఖాల కలయికో, యాత్రా కథనం కూడా అంతే! సుఖదుఃఖాలు పెనవేసుకుపోయిన అనుభవాల చిత్రణ. ఒక జీవిత స్పర్శ, మానవీయత అంటని, మానవ స్పర్శ లేని యాత్రా కథనాలు సమాచార భారంతో మూలిగే వీకీపీడియాల నిర్జీవపు ఆనవాళ్లే అవుతాయి…

          గీత గారి యాత్ర కథనాల్లో ప్రత్యేకత ఏమంటే ఒక భావోద్వేగాన్ని పంచుకునేటప్పు డు వారు ఒంటరైపోతారు…స్థలకాల స్పృహలు వదిలేసి, మానవ స్పర్శ కోసం అన్వేషణ మొదలు పెడతారు. ప్రకృతి సౌందర్యాల సౌకుమార్యానికి అమితానందంతో పరవశం చెందుతూనే హఠాత్తుగా ఒకనాటి జ్ఞాపకంలా మిగిలిన ఈ శిథిలాల వెనుక మానవ స్పర్శ ఎక్కడ అన్నట్లు అన్వేషణ మొదలు పెడతారు. మనిషిని గురించి పట్టించుకోవటం మొదలయ్యాక ఇంకది ఒక ప్రాంతమో, ఒక చారిత్రక ఆనవాలో, ఇంకేదో కాదు అది మానవీయత అంటుకున్న ఒక వేదనా స్రవంతి. మనిషి కంటే మహాకావ్యం ఇంకెక్కడ? గీత గారు దర్శించిన ప్రతీ ప్రాంతంలోనూ మనిషి విడిచి వెళ్ళిన పాదముద్రలను పరిచయం చేయడానికి ఎక్కువ తపన పడతారు. ఇదే గీత గారిని ఒక ప్రత్యేక స్థానంలో నిలబెడుతుంది. 

ఏంజెల్ ఐలాండ్ కథనం!

ఏంజెల్ ఐలాండ్ 1910-1940 మధ్య కాలంలో ఈ ద్వీపంలో ఇతర దేశాల నుంచి ముఖ్యం గా చైనా నించి వలస వచ్చే వారిని  శాన్ ఫ్రాన్సిస్కో లో అడుగు పెట్టే ముందు ఇమ్మిగ్రేషన్  చెకింగు పేరిట ఇక్కడ ఉంచేవారు. ఈ ఎదురు చూపులు ఒక్కో సారి నెలలు దాటి సంవత్సరాలు కూడా పట్టేది. సుదీర్ఘ ఎదురు చూపు, ఒంటరి బందీతనం, అను కున్న తీరాలకు చేరాలని ఎంతో దూరం అష్టకష్టాలకోర్చి, సముద్ర ప్రయాణం చేసి వచ్చాక, ఆ ద్వీపంలో చిక్కుబడి, వేదనా భరితంగా గడపడమూ, చివరి నిమిషం వరకూ ఉండి, వెనక్కు వెళ్ళిపోవలసి వస్తుందేమోనన్న వ్యధా, వేదనా గుండెల్ని రంపపు కోతలా బాధిస్తుంది. ఇవన్నీ కళ్ళకు కట్టినట్లయ్యి మనకూ ఆ వ్యధ చుట్టుకుంటుంది. ప్రపంచం లో మనుషులు ఎన్ని రకాలైనా మనస్సుల్లోని దు:ఖమొకటే. ఈ ద్వీప గాథ విన్నాక అక్కడి కన్నీళ్ళన్నీ మన కంట్లోకి ప్రవహించక మానవని” వాపోతారు

          ఇక్కడ అలా వేచి ఉన్న గృహాలు 1970 లో తీసి వేసెయ్యవలిసి వచ్చినపుడు ద్వీపాంతరంలో వినిపించిన జ్ఞాపకాలు పొరలై రాలుతున్న గోడల మీద ప్రతిఫలించిన అవి చదువరుల మనసును వికలం చేసేవి. ఇక్కడే చెక్క గోడల మీద కత్తి మొనతో చెక్కు కున్న వందలాది చైనీయుల హృదయ ఘోషలు కంటతడి పెట్టించిన వెన్నో!…

          అలా రాసిన కవితల్లో హృదయం ద్రవించి పోయే ఒక వేదనా శకలం…

          ఈ చెక్క కట్టడాలలో పనీ పాటా  లేకుండా ఉన్న నేను కిటికీని తెరిచాను…తెల్లార గట్ల చల్లని గాలీ, సిరివెన్నెల కాంతి  పెనవేసుకునున్నాయి మేఘాల వెనుక, పర్వతాలు మూసివేస్తున్న చోట నా పల్లె జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటున్నాను …నీటి బాతుల హీన స్వర ఘోష వినిపిస్తున్న ఈ ద్వీపంలో మంచు చల్లని వేచిచూపు – దారి తప్పిపోయిన  నాయకుడు ఖడ్గం గురించి అర్థంలేని ప్రేలాపనలు చేస్తాడు… కవి చిట్టచివరకి కేవలం చిన్న గుట్టని మాత్రమే అధిరోహిస్తాడు… దేశం బలహీనమైతే స్పూర్తి మరణించినట్లే… ఈ ప్రదేశంలో ఖైదు కావడానికి తప్ప ఎందుకొచ్చాం ఇక్కడికి?

గ్రాండ్ కాన్యన్ లోయ గురించి రాసేటప్పుడు…

“ఒక్కోసారి మనసంతా అల్లకల్లోలంగా ఏవేవో పదాలు స్ఫురిస్తున్నా నోటమాట రాని ఒక మౌనం చుట్టుకుంటుంది. గ్రాండ్ కెన్యన్ చూస్తున్నంతసేపు అదే పరిస్థితి. చుట్టూ ఎవరెవరో ఏదేదో ప్రశ్నలు వేస్తున్నా, పిల్లలు అదేమిటి, ఇదేమిటి అనడుగుతున్నా, చంటి పిల్ల కేర్ మని ఏడుస్తున్నా, శరీరం మాత్రమే అక్కడ మిగతా వారితో కట్టెలా తిరుగుతూ ఉంటుంది. మనసు వారందరి మధ్య నుంచి విడిపడి మరెక్కడో సంచరిస్తూ ఉంటుంది…”

          “ఆ లోయలో ఒకప్పుడు నివసించిన గిరిజనుల మౌన సాక్ష్యంగా మిగిలిన ధాన్యా గారాల గురించి,  డ్యాం నిర్మాణం వల్ల రూపు మారిన నదీ పరీవాహ ప్రాంతాల గురించి, గిరిజనులు పోరాడి గెల్చుకున్న హక్కుల గురించి, పంటలతో అలరారే నదీ పరీవాహ ప్రాంతాలు రాతి తీరాలలో మునిగిపోయిన ఆకలి దు:ఖం గురించి ఎక్కడెక్కడో చదివిన దు:ఖమో, లేదా కనిపించే అందమైన దృశ్య పారవశ్యపు  పులకింతో తెలీదు గానీ అక్కడ తిరిగినంత సేపు నిశ్శబ్దం ఆవరించింది నన్ను….”

          అంటూ హృదయం చమర్చేలా రాసుకుపోతారు. ఇలాంటి మనసు పొరలను తాకే అనుభవాలు కోకొల్లలు. ఇవి మచ్చుకు మాత్రమే. 

          2008 నుంచీ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మొదలు పెట్టిన ఈ యాత్రా కథనాలు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని అనేక ముఖ్యమైన ప్రాంతాలను దర్శిస్తూ రికార్డ్ చేస్తూ వచ్చారు. యాత్రా సాహిత్యం పట్ల మక్కువతో తాము స్వయంగా చేసిన యాత్రల్ని కవితాత్మకంగా ట్రావెలాగ్స్ గా రాస్తూ వస్తున్నారు. 2011 లో “నా కళ్ళతో అమెరికా” శీర్షికతో విహంగ పత్రికలో ప్రారంభించి, ఇప్పుడు నెచ్చెలిలో యాత్రాగీతం వరకు ప్రపంచ యాత్రల్ని నిరాటంకంగా; కొన్ని ఉదాహరించాల్సి వస్తే, శాంతా క్రూజ్, యూసోమిటీ, లాస్ ఏంజెలస్, లేక్ తహోవ్, సాండి యాగో, శాక్రిమెంటో,లాస్ వేగాస్, గ్రాండ్ కెన్యాన్, ఆల్క్ట్రాజ్, న్యూయార్క్, బోస్టన్, వాషింగ్టన్ డిసి, ఫిలడెల్ఫియా, నయాగరా జలపాతం, ఎల్లో స్టోన్, హార్ట్స్ క్యాజిల్, సియాటిల్, డాడ్జ్ రిడ్జ్, హవాయి దీవులు, మెక్సికో నౌకాయానం… లాంటి రెండు వందల పైచిలుకు ట్రావెలాగ్స్ ను గత 13 ఏళ్ళుగా రాస్తూ వస్తున్నారు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.