వెచ్చనిదానా రావే నా చెలి (కథ)

– సింగరాజు రమాదేవి

          కనురెప్పలకి అల్లంత దూరానే ఆగిపోయి దగ్గరికి రాకుండా సతాయిస్తోంది నిద్ర. కిటికీ బయట పల్చటి వెన్నెల పరుచుకుని ఉంది. గాలికి సన్నజాజి పూలతీగ మెల్లగా కదులుతూ చల్లని గాలిని, సన్నని పరిమళాన్ని మోసుకుని వస్తోంది. ఎక్కడా ఏ అలికిడీ లేదు. కానీ అవేవీ శరణ్యకి హాయిని కలిగించట్లేదు.

          భుజం దగ్గర మొదలయి.. మోచేతి మీదుగా అరచెయ్యి దాటి వేలి కొసల వరకూ అలలు అలలుగా జలజలా సాగుతోంది నొప్పి. సర్వేంద్రియాలన్నీ ఆ నొప్పి మీదే కేంద్రీకృతమై ఉన్నాయి. విలవిలాడే నొప్పి! ఎటూ తోచనివ్వక ఉంది. ఎటు తిరిగి పడుకున్నా పడక కుదరట్లేదు.

          అప్పటికి రెండు సార్లు ..లేవటం బాత్రూంలోకి వెళ్ళి రావటం…మళ్ళీ మంచినీళ్ళు తాగటం అయింది. నిద్ర పట్టకపోతే ఇది ఒక ఇబ్బంది. ఒక చక్రం లాగా..లేవటం, టైమ్ చూడటం..,బాత్రూమ్ కి వెళ్ళటం, వచ్చి నీళ్ళు తాగటం! పడుకోవటం…అటు దొర్లి ఇటు దొర్లి మళ్ళీ గంటకి, మళ్ళీ అదే రిపీట్!

          రిపీటు!… అని అదేదో రజినీకాంత్ సినిమా పాట మధ్యలో వస్తూ ఉంటుంది. అలా రిపీటు..ఒకటే తేడా! అక్కడ పాట ఉంది. ఇక్కడ పాట్లు మాత్రమే ఉన్నాయి. ఆమె ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి!

          నెలా రెండు నెల్లుగా, కొంచం కొంచంగా మొదలైన భుజం నొప్పి ప్రస్తుతం తారా స్థాయికి చేరింది. చెయ్యి లేవదు, ముందుకు జాపుదామంటే రాదు.. ఇంకో చేత్తో సాయం పట్టి లేపాల్సి వస్తోంది. జడ వేసుకోవాలంటే వెనక్కి పోదు. పంటి బిగువున ఏదో రెండు అల్లులు అల్లుకుని పోవటంగా ఉంది. వంటింట్లో కాసేపు గరిటె పడితే , ఇంకా ఎక్కువ అవుతోంది. బండి నడిపినా భుజం లాగేస్తోంది..ఇక ఆఫీసులో కంప్యూటర్ మీద చేసి చేసి సాయంత్రానికి వేలాడిపోతుంది…కానీ ఏదీ తప్పదుగా!

          అవును.. వంటిల్లు అంటే గుర్తొచ్చింది! రేపటి టిఫినుకి పెసలు నానబొయ్యాలి. మర్చిపోయా అనుకుంటూ లేచి మెల్లగా మంచం పక్కన ఉన్న లైట్ వేసి.. వంటింట్లోకి వెళ్ళింది. అక్కడి లైట్ కూడా వేసింది. పెసలు పై గూట్లో ఉన్నాయి. ఇది వరకైతే ముని వేళ్ళ మీద నిలబడి చెయ్యి చాపి అందుకునేది. ఇప్పుడు కుదరదు. మళ్ళీ హాల్లోకి వచ్చి చిన్న స్టూలు ఒకటి తెచ్చి వేసుకుని మెల్లగా అది ఎక్కి పెసల డబ్బా తీసింది. గిన్నె తీసుకుని పెసలు, కొన్ని బియ్యం కలిపి కడిగి నానబెట్టింది. గట్టుమీద మర్చిపోయిన పాలగిన్నె ఫ్రిజ్జులో పెట్టింది. ఫ్రిజ్జు తలుపు వేస్తూ వచ్చే ఆదివారం అయినా ఇది క్లీన్ చెయ్యాలి, ఏవోవో గిన్నెలు పేరుకుపోయాయి అనుకుంటూ నిట్టూర్చింది.

          ఇది వరకు ఎన్ని పనులు చేసే దాన్ని! ఆదివారం వచ్చిందంటే చాలు ఇల్లంతా, దులిపేసి సర్దేసి, పిల్లలకి బారెడు జుట్లకి తలంటు పోసి, వంటలోకి స్పెషల్స్ చెయ్యటం, సాయంత్రం ఏ పకోడీలో, జంతికలో, స్వీట్స్ లాంటి నిలవ పిండివంటలు చెయ్యటం, వారానికి కావల్సిన ఇడ్లీ , దోసల పిండి రుబ్బి పెట్టుకోవటం, చీరలకి ఫాల్స్ కుట్టుకోవటం, పిల్లల గౌన్లు, లంగాల మీద డిజైన్ , కుట్లు …ఒకటి కాదు. ఇప్పుడు ఎక్కడ పోయిందో ఆ ఓపిక! ఏది చేద్దామన్నా చెయ్యలేను ఏమో అన్న ఒక భయం. నీరసం! నిరాసక్తత! ఊరి నించి పిల్లలు వస్తున్నారంటే ఇది వరకు ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు ఎక్స్ట్రా పని తల్చుకుని భయం వేస్తోంది! వయసు మళ్ళటం అంటే ఇదేనా..ఏమో. 

          లైట్ తీసేసి, మళ్ళీ పడగ్గదిలోకి వచ్చింది. రమేష్ సన్నగా గురక పెడుతున్నాడు. అతని నిద్రా భంగం కాకుండా మళ్ళీ భుజం నొక్కుకుంటూ పక్క మీద వాలింది. నిద్ర వచ్చే సూచనలు ఎక్కడా లేవు… భుజంలో మళ్ళీ నొప్పి అలలు.

          “నీవు రావు…నిదుర రాదు…నిలిచి పోయే ఈ రేయి ..తనలో తనే సన్నగా కూనిరాగం తీసుకుంటూ కళ్ళు మూసుకుంది. హు…నీవు రావు కాదు..నీవు పోవు నిదుర రాదు అని తన నొప్పి గురించి పాడాలి.

          అవునూ..అసలు ఈ పాట చరణంలో సాహిత్యం ఎంత బాగుంటుంది!

          “తారా జాబిలి ఒకటై సరసమాడే ఆ రేయి… చింతా చీకటి తోడయి చిన్నబోయే ఈ రేయి”… ఆహా… ఎలా రాస్తారో ఇంత గొప్పగా కవులు!

          తనకు మాత్రం ఈ రేయి చింతా, చీకటి తోడే అనుకుంది.

          దిండు కిందే పెట్టుకున్న మూవ్ ఆయింట్ మెంట్ తీసి మెడ, భుజానికి బాగా పట్టించింది. ఇది వరకు దిండు పక్కన ఉండే అత్తర్లు, మల్లెపూల స్థానంలో ఇప్పుడు జండూ బాములు, మూవ్ లు వచ్చి చేరాయి. దిళ్ళ మధ్య దూరం పెరిగింది. యవ్వనం గువ్వ లాంటిది… ఎగిరిపోయింది. పిల్లలు పెద్దయి రెక్కలు వచ్చి ఎగిరిపోయారు. తెలీ కుండానే నడి వయసు వచ్చేసింది. యవ్వనవతి కాదు ఇప్పుడు తను మరి ఏమంటారు? … మధ్యమావతా?…నవ్వు వచ్చింది !

          “సంధ్యారాగం చంద్ర హారతి పడుతున్న వేళ..మసక చీకటి మధ్యమావతి పాడు తున్న వేళ”

          వేటూరి… జానకి పాట చటుక్కున మెదిలింది. మసక చీకటి ఏం ఖర్మ …కటిక చీకటి వచ్చేసింది. అయినా నొప్పి పోదు నిద్రరాదు!

          అవునూ…అసలు ఇన్ని పాటలు రాసిన వాళ్ళు నొప్పి మీద పాట ఏమీ రాయలేదా.. ఆ…యెస్ ఉంది…నొప్పి నొప్పి..ఒళ్ళంత నొప్పి..ఏదో ఆ మధ్య ఒక సినిమాలో ఉంది. అసలు ఆ నొప్పి ఈ నొప్పి గురించేనా.. ఏమో! తర్వాత పదాలేంటో గుర్తుకు రావట్లేదు… అయినా అంత గుర్తుపెట్టుకునే పాట కూడా కాదు అది. పాత పాటలు అయితే సాహిత్యం బాగుండి గుర్తు ఉండిపోయేవి.

          అసలు ఇది వరకు ఏ పాట అయినా మొత్తం నోటికే వచ్చేసేది. అలాంటిది ఇప్పుడు చటుక్కున గుర్తుకే రాదు. నోట్లో ఆడుతూ ఉన్నా బయటికి రాదు. నెట్ వర్క్ స్లోగా ఉన్నప్పుడు ’లోడింగ్’ అని తిరుగుతున్నట్టు తన మెదడులో నెట్ వర్క్ కూడా నెమ్మది అయిపోయినట్టు ఉంది. అవును.. యాభైకి దగ్గర పడుతోంది. మెల్లగా వయసుతో వచ్చే మార్పులు మొదలు అవుతున్నాయి.

          కానీ ఖర్మ! ఈ పాటలే మర్చిపోవాలా, ఏ పాల బాకీనో మర్చిపోవచ్చుగా… కానీ ఒకటో తేదీ రాగానే అది వచ్చి అడుగుతారుగా…ఇది మాత్రం ఎవరూ అడగరు… ఆలోచనలు అల్లిబిల్లిగా సాగుతున్నాయి. ఎక్కడో ఒక చిన్న మత్తు తెర వచ్చింది. వెల్లకిలా పడుకు న్నది అలవాటుగా పక్కకి తిరిగేసరికి మళ్ళీ భుజం కలుక్కుమంది. 

          ఫ్రోజెన్ షోల్డర్ అట…మొన్ననే డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పింది. నడి వయసు.. మెనోపాజ్..హార్మోనల్ ఇంబాలెన్స్…ఏవేవో చెప్పింది. ఎముకలు బలహీన పడటం, నిద్ర పట్టక పోవటం, హాట్ ఫ్లాషెస్ ఇలా రకరకాల లక్షణాలు ఉంటాయట! నొప్పికి, బలానికి మందులు రాసిచ్చింది. భుజం నొప్పికి ఫిజియోథెరపీ చేయించుకోమంది.  దేవుడా!…. భుజం లేవట్లేదురా మొర్రో అంటే లేపితేనే లేస్తుందట. లేకపోతే ఇంకా బిగుసుకు పోతుందట!

          లే…లే..లే…లేలేలే…నా రాజా…మళ్ళీ పాట

          రాజా లేవడు.. బజ్జున్నాడు..

          లేలేలే నా భుజమా.. లేపమంటావా..నువ్వే లేచి వస్తావా!

          పాటకి పేరడీ.. నొప్పితో పాటు శరణ్యకి నవ్వు వచ్చింది. ఎవరైనా వింటే పిచ్చి అనుకుంటారు.. కానీ అదేంటో చిన్నప్పటి నుండి ఇదొక అలవాటు. ఏ పదం విన్నా దానితో ఉన్న పాట చటుక్కున బుర్రలో మెదులుతుంది. పాటల పిచ్చి! చిన్నప్పుడు పొద్దున లేచిన దగ్గర నుండి రేడియోలో తెలుగో, హిందీనో పాటలు ఎప్పుడూ మోగుతూ ఉండాల్సిందే! వాళ్ళు రాత్రి జైహింద్ చెప్పి వెళ్ళిపోయే దాకా చెవి పక్కన చిన్న ట్రాన్సిస్టర్ పెట్టుకునే పడుకునేది. ఆ తర్వాత కొంచం పెద్దయ్యాక తనూ అక్కా కేసెట్లు, సీడీలు విపరీతంగా కొనే వాళ్ళం! పాటలకి సరదా పేరడీలు కట్టి తెగ నవ్వుకునే వాళ్ళం అక్కా నేను! 

          మళ్ళీ ఒక నిట్టూర్పు!

          ఎన్ని జ్ఞాపకాలు తవ్వుకున్నా నిద్ర మాత్రం రావట్లేదు. నొప్పి సలుపుతూనే ఉంది. నొప్పి మాత్రలు ఏవో ఇచ్చారు. వేసుకుంది కూడా.. మరి  ఫలితం మాత్రం ఏమీ లేదు! టైమ్ రెండు… పట్టదు ఇంక ఈ రాత్రికి ఇంతే.. నిద్ర పట్టకపొతే ఎక్కువ సేపు దొర్లదట.. లేచి వెళ్ళి ఏ పుస్తకమో చదివి, ఇంకేదన్నా చేసి మళ్ళీ కాసేపు ఆగి నిద్ర వస్తున్నట్టు అనిపించినప్పుడు పడుకోవాలిట.

          లేద్దామా..వద్దా అనుకుంటూ మెల్లగా పక్కన స్టూలు మీద పెట్టిన సెల్ అందుకుని వాట్సప్ మెసేజిలు చూసింది. ఆఫీసు గ్రూప్ మెసేజులు, ఫ్రెండ్స్ గ్రూపులో ఏవో జోకులు, సూక్తులు…అన్ని గ్రూపుల్లో అవే మెసేజులు తిరుగుతూ ఉంటాయి. రొటీన్! యూ ట్యూబ్ లోకి వెళ్ళి ఫ్రోజెన్ షోల్డర్ అని కొట్టింది..వెంటనే బోలెడన్ని వీడియోలు! ఒకొక్క వీడియోకి లక్షలలో వ్యూస్, లైకులు… అంటే లోకంలో ఇంత మందికి ఈ జబ్బు ఉందా….నా కిన్నాళ్ళు ఈ పదమే తెలియదు అనుకుంది. ఏదైనా మనదాకా వస్తేకానీ తెలియదు అంటారు అందుకేనేమో..

          ఒక్కో వీడియోలో ఒకొక్క చిట్కా చెబుతున్నారు. ప్రోటీన్ తినాలని ఒకళ్ళు చెపితే, అవిసె గింజలు తినమని ఒకళ్ళు, తైలాలు రాయమని కొందరు. ఏవేవో ఎక్సర్ సైజులు చూపించి అవి చేస్తే తగ్గుతుంది అంటున్నారు.

          నొప్పి కొంచం తగ్గి చెయ్యి కాస్త లేపగలిగితే వాళ్ళు చెప్పిన ఆ ఎక్సర్ సైజులు చెయ్యచ్చు… కానీ ఈ విలవిలలాడే నొప్పితో ఏం చేస్తాం. అదేదో సినిమాలో అక్కినేని చెప్పినట్టు…

          ‘తాగితే మరిచిపోగలను…తాగనివ్వదు, మరచిపోతే తాగగలను…మరువనివ్వదు!’

          అన్నట్టు  ‘నొప్పి తగ్గితే చెయ్యగలను..తగ్గలేదు! , చేస్తే తగ్గుతుంది… చెయ్యలేను!  అంతేనా కరెక్టుగానే చెప్పానా… ఏమో..అసలు ఇలాంటి డైలాగులు ఎవరు రాస్తారు… ఆత్రేయా? ఆత్రేయ రాస్తే.. అక్కినేని చెప్తాడు. మనం ఇదిగో అక్కినేని ఇలా అన్నాడు..ఏం చెప్పాడు అంటాం! రాసేదొకరు..చేసేదొకరు…అంతా మాయ!

          దేవదాసులోనే చెప్పాడుగా జగమే మాయ అని… తాగితే ఇన్ని జీవితసత్యాలు తెలుస్తాయా?… అవును అసలు ఒక పెగ్గు వేసుకుని పడుకుంటే…నొప్పి గిప్పి పోయి హాయిగా నిద్ర పడుతుందేమో… మరి ఇంట్లో లేదుగా…ఈ సారి సరుకులతో పాటు ఒక బాటిలు తెచ్చుకోవాలి! షాపు కెళ్ళి కిలో కందిపప్పు, నూనె, ఉప్పూ, కారం, ఒక బాటిల్ స్కాచ్ అని అడిగితే షాపు అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? షాప్ లో అందరూ నిర్ఘాంత పోతారా.. ఆ దృశ్యం ఊహించుకుంటే తెరలు తెరలుగా నవ్వు వచ్చింది. అయినా అక్కడ అమ్మరు అనుకుంటా..వైన్ షాపుకి వెళ్ళి కటకటాలలో నుండి అడిగి తెచ్చుకోవాలి!

          మళ్ళీ ఒక అనుమానం!… తీవ్రమైన నొప్పి వలన స్క్రూలూజు అయి పిచ్చి ఎక్కుతుందా?

          సెర్చ్ లో కొట్టి చూద్దాం… ‘డజ్ పెయిన్ మేక్ యూ క్రేజీ?’…కొట్టింది.

          వరుసగా వీడియోలు!.. “క్రేజీ ఆంటీ …కాలేజీ కుర్రాడు”..ఈ ఆంటీ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు! వీడియో ప్రత్యక్షం అయింది.

          ఛీ! నేను అడిగినది ఏంటి.. ఇది చూపిస్తున్నది ఏంటి..  నేను అడిగిన దాంట్లో ‘క్రేజీ’ అన్న ఒక్క పదం దీనికి బాగా నచ్చినట్టుంది.. పైగా కింద ఒక మెసేజ్… ఈజ్ దిస్ సజెషన్ గుడ్ ఫర్ యూ…నీ బొంద!.. నీ బొందలా ఉంది నీ సజెషన్!.. నొప్పి గురించి అడిగితే బూతు వీడియోలు చూపిస్తోంది… యువర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏన్ ఇన్సల్ట్ టు మై ఇంటెలిజెన్స్..డర్టీ ఫెలో!

          సెల్ పక్కకి విసిరి కొట్టింది! ఆ విసురుకి మళ్ళీ కలుక్కుమన్న భుజాన్ని అమ్మా! అంటూ ఇంకో చేత్తో గట్టిగా పట్టుకుంది. ఇక నిద్ర రాదా…నిద్రా దేవి కరుణించదా…

          కరుణించు మేరి మాతా.. శరణింక మేరి మాత! మిస్సమ్మలో సావిత్రి గుర్తొచ్చింది.  కరుణించు మేరీమాత… కాదు నిద్ర మాతా! కానీ మాతకి కరుణ లేదు…మీరు కాల్ చేసిన దేవత ప్రస్తుతం స్పందిచుటలేదు!

          అబ్బా… నొప్పి… లాభం లేదు..ఏదో ఒకటి చెయ్యాలి! పక్కన రమేశ్ రగ్గు కప్పుకుని మరీ వెచ్చగా పడుకుని ఉన్నాడు! అదృష్టవంతుడు! అసలు ఈ చిక్కటి రాత్రిలో ఆదమరచి నిదురించే ప్రతివారు అదృష్టవంతులే!

          అత్త వడి పూవు వలే మెత్తనమ్మా, ఆదమరచి హాయిగా నిదురపోమ్మా..

          హాయిగా… వెచ్చగా నిద్ర…ఎంత బాగుంటుంది..కళ్ళు కూరుకు పోయేటంతటి నిద్ర…ఆపుకోలేక మెడ వాలిపోయేటంతటి నిద్ర!

          వెచ్చగా అవును..వెచ్చగా బిగుసుకుపోయిన భుజాన్ని మెల్లగా వదులు చేసే వెచ్చదనం…  హీటింగ్ బేగ్!  

          ఛా! అప్పటి నుంచి అసలు గుర్తుకే రాలేదు. మట్టి బుర్రకి తట్టనే లేదు! హీటింగ్ బేగ్ గురించి గుర్తే లేదు…అదే లోడింగ్ ప్రాబ్లెమ్!

          పాపం ఒక రోజు హాట్ వాటర్ బేగ్లో నీళ్ళు మరగపోసి పోసుకుంటుంటే, ఐషూ వచ్చి అంది.. ఏంటి పిన్నీ? దీనితో అవస్థ పడుతున్నావు. ఇప్పుడు కరెంట్ తో పని చేసేవి వచ్చాయి. ప్లగ్ వేసుకుంటే టూ మినిట్స్ లో వేడిగా అయిపోతుంది! లీకేజ్ ప్రాబ్లెం కూడా ఉండదు. నేను నీకు నెట్ లో ఆర్డర్ చేస్తాను ఉండు అని చేసింది. మొన్ననే డెలివర్ కూడా అయింది! డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టాను. ఒకటి రెండు సార్లు వాడాను కూడా కదా చాలా రిలీఫ్ ఇచ్చింది! 

          ఇంత వరకూ పిచ్చి దానిలా అవస్థ పడుతూ ఉన్నాను. యెస్…గబగబా లేచి వెళ్ళి తెచ్చుకుని మంచం పక్కనే ఉన్న ప్లగ్ పెట్టి ఆన్ చేసింది. బేగ్ మెల్ల మెల్లగా వేడి ఎక్కుతోంది. రెండు నిమిషాలకి తీసి భుజం కింద పెట్టుకుంది. ఆ వేడి మెల్లగా వెచ్చగా లోపలికి పాకుతోంది. నొప్పి అలలు మెల్లగా వెనుతిరుగుతున్నాయి.

          ఐషూ ఐ లవ్ యూ! నువ్వే నా బంగారు తల్లి!

          ఆప్యాయంగా ఆ బేగుని అదిమి పట్టుకుని పక్కకి ఒత్తిగిలి పడుకుంది. హమ్మయ్య ఇప్పటికి పడక కుదిరింది. కిటికీ బయట చంద్రుడు వెన్నెలలు కురిపిస్తున్నాడు. మనోహరంగా ఉన్న ఆ దృశ్యానికి తోడు…. బేగ్ నుండి వస్తున్న వెచ్చదనం!

          మెల్లగా మగత కమ్ముకుంటోంది.. కనురెప్పలు మూత పడుతున్నాయి. నిద్రా దేవి స్పందించింది!

          ‘వెన్నెల రేయి ఎంతో  చలి చలీ.. వెచ్చని దానా రావే నా చెలీ!’  మదిలో పాట మెదులుతుండగా హీటింగ్ బేగును ఇంకా దగ్గరికి పొదవుకుని పడుకుంది శరణ్య!

          ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం ! జైహింద్!

*****

Please follow and like us:

6 thoughts on “వెచ్చనిదానా రావే నా చెలి (కథ)”

  1. శరణ్య లాంటి వాళ్ళు ఎందరో, అందరి పనులు అయిపోవాలి ఏ ఒక్క పనికి నట్టు వచ్చినా ఎవరి తిన్న వాళ్ళే అసహనం పడిపోతారు.
    ఎందుకు చెయ్యలేదో అని ఆలోచించరు.

    హాస్యం మేళవించి రాసినా అన్నీసత్యాలే
    బావుంది కథ రమ గారు

  2. రమాదేవి గారు నా కథే రాశారా !!!’ అనిపించింది. నేను కూడా చాలా రాత్రుళ్లు నొప్పులతో , నిద్ర రాక ఇలాగే బాధ పడుతూ ఉంటాను. చాలా బాగా రాశారు

Leave a Reply

Your email address will not be published.