కాదేదీ కథకనర్హం-1

కుక్కపిల్ల

-డి.కామేశ్వరి 

          చలి ఎముకలు కొరికేస్తుంటే పాడుపడిన యింటి అరుగు మీద, ఇంటి మీదే కాక వంటి మీదా ఏ కప్పూ లేని సింహాద్రి – పొట్టలోకి కాళ్ళు తప్ప పెట్టుకోడానికో ఏమి లేని సింహాద్రి కాళ్ళు ముడుచుకుని మూడంకేసి , చలితో జ్వరంతో వణుకుతూ మూలుగు తున్నాడు. అడుక్కోడానికో మట్టి మూకుడు, దాహం తీర్చుకోడానికో పాత డాల్డా డబ్బా, మానం కప్పుకోడానికి ఏ ధర్మాతుడో దయతల్చి యిచ్చిన చిరుగుల కాకి నిక్కరు, ఏ పెంట మీద నిండో ఏరుకుని తెచ్చుకున్న చీలికలు నాలికలు అయిన తుంగచాప సింహాద్రి ఆస్థి! వాటితో పాటు ఏడాదిగా పేగులు తోడేస్తున్న దగ్గు, సాయంత్రం అయ్యేసరికి చలి కుదుపుతో వచ్చే జ్వరం కూడా వున్నాయి.

          కట్టుకున్న పెళ్ళాం – ముష్టెత్తయినా ముద్దపెట్టలేని అసమర్దుడని మరో మంచి ముష్టివాడితో లేచిపోయింది. కన్న ఒక్క కొడుకు కళ్లిప్పకుండానే కన్నుమూశాడు. అతనికీ లోకంలో తోడూ నీడ, నేస్తం అని చెప్పుకోడానికి వున్నది, ఒకే ఒక్క కుక్కపిల్ల!  ఏ వూర కుక్కో కనిపారేస్తే తల్లి నించి తప్పడి ఏడుస్తున్న కళ్లిప్పని కుక్క పిల్లని జాలిపడి దగ్గిరికి తీసి, తాను తాగే గంజి యింత పోసి, అడుక్కు తెచ్చుకున్న అన్నం ఓ ముద్ద పడేసి, యింటింటికి ముష్టికి తిప్పి, పసి పాపలా గుండెల మీద పడుకో పెట్టుకుని కుక్క పిల్లని పెంచుకున్నాడు సింహాద్రి.

          గత రెండు మూడు నెలలుగా, సింహాద్రి రోగం ముదిరి, ధర్మాసుపత్రి డాక్టర్లు నీ గుండె చిల్లు పడింది, మరి బతకవు ఫో….. రోజులు లెక్క పెట్టుకో ఫో….అని చెప్పేశాక – యిల్లిల్లు తిరిగే ఓపిక లేక చెట్టు కింద గుడ్డ పరచుకుని పడుకుని ఏ ధర్మాత్ములో విసిరినా పైసలు నాలుగు కూడ తీసి ఏ టీ కొట్టువాడో దయతలచి యిన్నీ టీ నీళ్ళు పోస్తే , ఆ డబ్బులతో చిన్న రొట్టె కొనుక్కుని దాన్లో ముంచుకుని తింటూ చావుకోసం ఎదురుచూస్తూ చావలేక బతుకుతున్నాడు. తన బతుక్కే టికాణాలేని సింహాద్రి కుక్కపిల్ల బతుక్కి హామీ యివ్వ లేకపోవడంతో కుక్కపిల్ల తన బతుకు తెరువు తాను వెతుక్కుంది మధ్య. చలికి మెలకువ వచ్చి వెచ్చదనం కోసం పక్కలో కుక్కపిల్లని దగ్గిరకు లాక్కోబోతే చేతికి అందలేదు. జ్వరం మగతలోంచి బలవంతంగా కళ్లిప్పి చూసేసరికి కుక్కపిల్ల లేదు – దూరంగా ఆ అరుగు మీద మరోమూల పడుకున్న ముష్టి రాములు గాడి పక్కలో దూరి వెచ్చగా పడుకున్న కుక్కపిల్లని చూసేసరికి సింహాద్రిగాడికి తిక్కరేగింది-

          సింహాద్రి రోగం ముదిరి కదలలేని స్థితికి వచ్చిందగ్గిర నించి కుక్కపిల్లకి తిండి కరవయి తోటి ముష్టివాడు రాములు గాడి చుట్టూ తోకాడించుకుంటూ తిరిగి వాడు జాలిపడి పడేసే మెతుకులు తినడం మొదలుపెట్టింది కుక్కపిల్ల. సింహాద్రి మరి లాభం లేదని కుక్కపిల్లకీ అర్ధం అయిపొయింది. సింహాద్రి పిలిస్తే దగ్గిరికి రావడం మానేసింది. రాములు గాడి దగ్గిర చేరి పడుకోడం మొదలు పెట్టింది. “దొంగనంజా యింతప్పటి నించి సాకాను, యిస్వాసం లేదే నీకు, నీయమ్మ …..రాయే….” బండ బూతులు తిడ్తూ సింహాద్రి తూలుకుంటూ లేచి కుక్కపిల్ల చెవులు పట్టుకు లాక్కొచ్చి అది కదలకుండా కావలించు కుని పడుకున్నాడు. కుక్కపిల్ల గింజుకుంటూ లేచి దూరంగా పోయి మిడుకు మిడుకు చూస్తూ గుర్రు గుర్రుమంది – ‘రంకు నంజా నాలుగురోజులు తిండేట్టకపోతే మరీడ్నీ మరిగావ్ గుడిసేటి నంజా – ” సింహాద్రి కోపం పట్టలేక ఓ రాయి తీసి విసిరాడు – కుక్కపిల్ల చెంగున గెంతి తప్పించుకుని “ఎంత కుక్కనైతే మాత్రం తిండెట్టకపోతే యిస్వాసం ఏమిటన్నట్టు” సింహాద్రిని నిరసనగా చూసి, నిర్లక్ష్యంగా రాములు గాడి పక్కలో దూరి పడుకుంది మళ్ళీ ——

*****

– తెలుగు వన్ సౌజన్యంతో

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.