నిత్య సౌందర్య వ్రతం

-ఉమాదేవి సమ్మెట

          ఓరే వాసూ! నువ్వటరా నేను చూస్తున్నది నిజమేనా? ఎన్నేళ్ళయిందో నిన్ను చూసీ.. నర్మదా! ఒకసారి ఇటురా.. ఎవరొచ్చారో చూడు. నా చిన్ననాటి స్నేహహితుడు వాసూ..” ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్న మహేంద్రకు మాట తడబడిపోతున్నది.

          అతను పిలిచినంత వేగంగా ముందు గదిలోకి వెళ్ళడానికి నర్మదా అడుగులు తడబడిపోతున్నాయి. సిగ్గుతోనో, భయంతోనో, మోమాటముతోనో, కొత్తదనంతోనో వగైరా వగైరా కాదు. వేసుకున్న నైటీ కాళ్ళకు అడ్డం  పడుతున్నది. దువ్వని తల, దిద్దుకోని మోము ఆమెను ఎవరో వెనక్కు లాగిపట్టినట్టయి ఒక్కసారిగా ఆగిపోయింది.

          మహేంద్ర మళ్ళీ “నర్మదా!” అని పిలిచాడు.. ఆ మిత్రులు దాదాపు పదేళ్ళకు కలుసుకున్న మధుర క్షణాల్లో వున్నారు. అట్టి దృశ్యంలో ఇట్టి మాసిన నైటీతో.. జిడ్డు ముఖంతో వెళ్తే ఆ సీన్లో తానో ఎక్సట్రా క్యారెక్టర్ లా ఉంటుందేమో అనుకుంటూ.. కాస్సేపు లోపలే వుండిపోయింది. ఆనందోద్వేగంలో మహేంద్ర మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నాడు. కనీసం మంచినీళ్ళన్నా ఇచ్చి రమ్మనమని కూతుళ్ళు అరుణ, కరుణలకు చెప్పింది. వాళ్ళు మాత్రం తక్కువా షార్ట్స్ వేసుకుని, జుట్టు విరబోసుకుని వింత రూపుల్లో వున్నారు.  

          ‘అయినా ఎంత ప్రాణ.. ప్రాణ స్క్వేర్’ మిత్రుడయినా ఒక ఫోన్ చేసి వస్తే.. కాస్త ఒళ్ళూ.. కొద్దిగా ఇల్లూ సర్దుకుందుము కదా! ఊహూ తన మిత్రున్ని ఆశ్చర్యంలో ముంచి అవాక్కయ్యేలా చేసి ఆనందసాగరంలో ఓలలాడించాలని అతని ప్రయత్నం కాబోలు! అందుకే చుక్క తెగిపడ్డట్టుగా వచ్చి వాలాడు. నైటీ మార్చుకుని చీర కట్టుకోవడమంటే అదేమన్న నిముషంలో అయ్యే పనా.. అతిధి ఇంటికి వచ్చి పావుగంటయినా ఇంటి ఇల్లాలు  ముందుగదిలోకి వెళ్ళి పలుకరించనే లేదు. గ్లాసుడు మంచినీళ్ళన్నా పంపనే లేదు. భావ్యం కాదిది భామలకు. పద్దతి కాదు తనయలకు అని చింతించినదై. అమ్మాయి లిద్దరినీ బట్టలు మార్చుకుని రమ్మని హుకుం జారీచేసి వెళ్ళి ముఖం కడుక్కుని నైటీ అవతారం చాలించి, చీర కట్టుకుని ముందు గదిలోకి వెళ్ళింది.

          “బాగున్నారా అన్నయ్యగారూ! అని పలుకరించింది.. నర్మదను చూసి వాసు మురిసిపోయాడు కానీ.. మహేంద్ర మాత్రం కాటేస్తానికి సిద్ధంగా వున్న నాగుపామల్లె రహస్య బుసలు కొట్టాడు. అవి నర్మదకు అర్థమయినా తనని కాదన్నట్టు.. “పిల్లలు బాగున్నారా అన్నయ్య గారూ? ఏమి చదువుతున్నారు? వంటి ప్రశ్నలు వేసి.. టీ తాగుతారా? కాఫీ తాగుతారా?” అమాయకంగా ముఖం పెట్టి అడిగింది. ఒక వరుస టీలు అయ్యాక వాళ్ళు.. బాల్యపు జ్ఞాపకాల్లోకి, కాలేజీ రోజుల్లోకీ చక్కర్లు కొట్టి మళ్ళీ ప్రస్తుత జీవితంలోకి వచ్చి.. అంతలోనే మళ్ళీ బుడుంగున బాల్యంలో మునిగి తేలుతుండగా నర్మద నాలుగురకాల కూరలూ. సేమ్యా పాయసం చేసి భోజనాలకు పిలిచింది. పాయసం చూసి కూడా పతి కరగలేదు. మధ్యమధ్య కోపంగానే చూస్తున్నాడు. అప్పడాలు, వడియా లు వడ్డించినా వదనం మారలేదు. ఉరిమి ఉరిమి చూస్తున్నాడు. భోజనానంతరం మీఠా పాన్ తెప్పించి పెట్టినా, వాసు తిరిగి వెళ్ళేలోగా అప్యాయంగా అల్లంటీ ఇచ్చినా..మిత్రుడు చూడనప్పుడల్లా నర్మద వంక కొరాకొరా చూస్తూనే వున్నాడు. మొత్తానికి మిత్రుడు వెళ్ళి పోయాడు. మహేంద్ర తన గదిలోకి వెళ్ళి మౌనంగా టీవీ చూడసాగాడు. మామూలుగా అయితే గుక్క తిప్పుకోకుండా అలనాటి ముచ్చట్లు అదేపనిగా పంచుకునేవాడు. అందరు భర్తల్లా ఇతను గబాగబా ఏదో నాలుగు తిట్లు తిట్టేస్తే అక్కడికి ఆ చాప్టర్ ముగుస్తుంది. ఊహూ! మహేంద్ర అట్లా కాదు. కోపమొస్తే అరవడు. మౌనంగా బిగుసుకుపోయి కూర్చుం టాడు. అది ఒక సాప్తాహమ్ లా వారంరోజులు సాగుతుంటుంది.

          “నాన్నా! ఆ అంకుల్ వస్తారని ముందుగా తెలియదు కదా! మేమేదో ఇంట్లోనే వున్నాం కదా అని నైటీలూ, షార్ట్ ల్లో వున్నాం” అమ్మాయిలిద్దరూ నచ్చజెప్పాలని చూశారు. ఎప్పుడూ ఉరమని మహేంద్ర మాటల వడగళ్ళు కురిపించాడు.

          “ఎప్పుడు చూసినా పిచ్చి అవతారాలేసుకుని కూర్చుంటారు. గతంలో ఎవరైనా అతిధి వస్తే.. భోజనం చేస్తున్నా సరే ఎంగిలి చేత్తో వచ్చి పలకరించి కూర్చోబెట్టి ఆ తరువాతే భోజనం చేసేవారు. వచ్చింది చూట్టాలైతే ఇంట్లోవాళ్ళే వెళ్ళి నమస్కరించి క్షేమ సమాచారాలు అడిగేవారు.. వచ్చింది ఇంట్లోవారికి తెలియని వారైతే ఇంటి పెద్దే అందరినీ పిలిచి పరిచయం చేసేవారు. ఇప్పుడు సమస్త ఆడ జనమంతా నైటీ ధారులే.. ఇక పిల్లలైతే వాళ్ళేమి వేసుకుంటున్నారో వాళ్ళకే తెలియడం లేదు. గట్టిగా మా మొగ వాళ్ళు ఏమన్నా అంటే ఆడిపోసుకోవడానికి సిద్ధమైపోతారు. ఇది వరకు గోడ దగ్గరకు చేరి ఒకరో ఇద్దరో మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు ఊ అన్నా.. ఆ అన్నా.. ఆ ఫేస్ బుక్ గోడెక్కి చిత్రాలతో సహా గోడు వెళ్ళబోసుకుంటున్నారు. వాట్సప్పులో వాయినాలు పంచినట్టుగా వైనాలు వైనాలుగా మమ్ములను వాయించి వేయించేస్తారు. ఎక్కడ ఏమీ జరిగినా.. ఏది చేసినా ఆడవాళ్ళకేదో అన్యాయం జరిగిపోతుందని కోడై కూస్తారు. అసలు మా మోగాళ్ళ కష్టాలు కూడా.. కోడి పుంజై కూసే రోజు కోసం చూస్తున్నాను..” అంటూ హూంకరించాడు. అంతేనా..

          “మీరు పార్టీలకూ ఫంక్షన్లకూ వెళ్తే అరచేతి మందాన మేకప్పులు.. అద్దుకుంటారు. బుట్టెడు పువ్వులు పెట్టుకుని కిలోల కొద్దీ బరువైన నగలు ధరిస్తారు.. నేలన జీరాడే సాంప్రదాయ దుస్తులో మోకాళ్ళను దాటాని మోడ్రన్ స్కర్టులో వేసుకుంటారు. మీరు అందరికీ అందంగా కనపడాలనుకోవడం వరకూ బాగానే వుంది. ప్రత్యేక సందర్భాలల్లో ప్రత్యేక అలంకరణ అర్థవంతమే. మరి ఇంట్లోవాళ్ళేం పాపం చేశారు? గోతాంసంచీ లాంటి నైటీలూ.. దువ్వని తలలూ.. ఏమిటిదంతా?” ఆక్రోశించాడు. పిల్లలిద్దరూ కిమ్మనకుండా తమ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. నర్మదా కూడా పశ్చాత్తాపంతో దహించుకుపోయి.. ఏసీ వేసుకుని కూర్చున్నదే తప్ప పతి మాటలకు మారాడలేదు.

* * *  

          మహేంద్ర నర్మదలకు అన్యోన్య దంపతులని పేరు.. చీటికి మాటికి కీచులాడు కోవడం అరుచుకోవడం ఇల్లు అల్లరి చేసుకోవడం అస్సలు ఎరుగరు. మౌనంగా అతను అన్నవన్నీ తలవంచుకుని విన్నది. విన్నవన్నీ అక్షర సత్యములే కదా! సత్య వాక్యము లే కదా! అనిపించిందామెకు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకూడదని ఆ కాంత భావించింది.

          నిజంగా చిన్నచిన్న విషయాలకే ఆడవాళ్ళు ముక్కెగబీలుస్తూ వెక్కిళ్ళు పెడ్తూ.. కొంగులు తడుపుతూ మొగజాతి మీద ఎన్నెన్నో కొండీలు చెప్తుంటారు. కడుపు చించు కుంటే.. అన్నట్టు మొగవాళ్ళ కడుపులో కూడా ఆడాళ్ళా మీద ఎన్నెన్ని ఆరోపణలు వున్నాయో కాదా! వాటికి బాధ్యత వహించి.. వారిని కాస్త ఊరడింప చేయవల్సిన కర్తవ్యం తరుణుల మీదే వున్నది కదా! మరి తరుణోపాయమేది?”

          “పిచ్చి అవతారాలు.. పిచ్చి అవతారాలు..” అని మహేంద్ర అన్న మాట పదేపదే వినపడుతుంటే .. మంచి అవతారాలుగా మారుటెలా? అని ఆలోచిస్తూ అటూ ఇటూ పచార్లు చేయసాగింది. అవతారాల మార్పుల గురించి జరుగుతున్న అంతర్మధనం అందరికీ పంచి, ఇది అందరిళ్ళ సమస్య.. కావున అత్యవసర చర్చలు జరగాలని భావిం చింది. 

          అంతే.. ఇష్ట సఖులతో.. వాట్సప్ గ్రూప్ ల్లో అంతర్గత సమావేశాలు ఏర్పాటైనాయి. రెండుమూడు గంటల చర్చల అనంతరం కొన్ని నిజాలు వెలికివచ్చాయి. పాపం వాళ్ళెప్పుడూ ఆడవాళ్ళ మీద గృహహింస కేసులు పెట్టరుగానీ.. మనవైపు నుండీ వస్తున్న లోటుపాట్లను, లోపాలను మనం ఒప్పుకుని తీరాలి. మనం కొంత మారాలి. కొన్ని పద్దతు లు మార్చుకోవాలి. పురుష జనోద్ధరణకు స్త్రీలే నడుం బిగించాలి. వాళ్ళ బాధలను మన బాధలుగా భావించి, ప్రతీ పురుషుడి ఆనందం వెనుక స్త్రీలు వున్నారనీ, వుంటారనీ రుజువు చేయాలి అనుకున్నారు. మూడు నాలుగు గంటలు ఆవేశపడ్డాక.. మొగవారి ఆవేదనలు అర్థం చేసుకున్నాక.. భారీ తీర్మానాలు తీసుకున్నారు.

          “సమస్త నైటీజనులారా మేల్కొనండీ..! ఇంతకాలం ఈ పిచ్చి బట్టలు వేసుకుని ఇంట్లో వాళ్ళను బాధించడం ఇంకానా! ఇక పై చెల్లదు. మగాడు మనవాడే కదా! మనం మనువాడినవాడే కదా! కిమ్మనకుండా చూస్తుంటాడులే అనుకోకండి. అతని గుండెల్లో అలజడిని గమనించండీ. మన అలంకరణల పట్ల చెలరేగుతున్న అసంతృప్త అగ్ని జ్వాలలను ఆర్పేయండి. సాగతీత సీరియల్లలో వెతక వలసింది వెతలు కాదు వేరియస్ శారీస్… అందులోని పగలు కాదు, మనకు నగలు ముఖ్యం. కక్షలు కాదు కావలసింది కాస్మాటిక్స్. గొడవలు.. గోడ మీద ముచ్చట్లు కాదు గ్లామర్.. మోర్ అండ్ మోస్ట్ గ్లామరస్ మేకప్స్. మలుపులు తిరుగుతున్న కథాంశాలు కాదు కేశాలంకరణలు.. అనురనిరాటం మనం అనుసరించవలసింది.. వాళ్ళ వస్త్రధారణ.. ఏ వేళలోనయినా అలరించే అలంకరణలు..

          ‘వంటలక్క’ కూడా పిచ్చి చీరలు కట్టిందేకానీ.. నైటీలు ఎప్పుడూ వేయలేదు. ‘కాటుక రేఖ’లో.. ‘పిడికెడంత మనసు’, ‘పెళ్ళి చుక్క’, ‘బంగారువనం’ సీరియళ్ళలోగానీ.. సినిమా ల్లోగానీ, రియాల్టీ షోలలోగానీ, ఎప్పుడైనా ఎవ్వరైనా నైటీలుగానీ, షార్ట్స్ గానీ వేస్తున్నారా? ఏం? ఎందుకు వేయడం లేదు?

          ఎప్పుడు చూసినా సీరియల్స్ చూస్తున్నారన్న నిందలు భరిస్తున్నామే తప్ప.. అసలు సీరియల్స్ చూసి మనం ఏమి నేర్చుకుంటున్నాం అని ఎలుగెత్తి ఎవరయినా అడిగితే మన జవాబేంటి? ఇకనైనా ‘అఖండ దీపం’ సీరియల్ లో అత్తగారిలా అద్భుత మయిన చీరలూ ధరించండి. ‘ఈమె కథ’లో ఆమెలాగా జీరాడే కుచ్చులకు తోడు కొత్తగా కుచ్చులు కుట్టిన చీరలు కట్టండి. ఫ్యాషన్లు మార్చండి. మనం అందంగా కనపడాలన్న మగవారి ఆశలను తీర్చండి..

          ‘పదే పదే అదే కథ’ లో ప్రతినాయకిలా రకరకాలుగా జాకెట్లు కుట్టించుకోండి.. ‘ఆరనిజ్వాల’ సీరియల్ లో అత్తయ్యగారిలా కొత్తరకం నగలు ధరించండీ. బంగారాలే అక్కరలేదు. పది వరుసల పూసల దండలతోనో, వరుస దారాల హారాలతోనో మీ మెడను నింపండి. ముక్కుకు మూడో వైపు లేదు కానీ.. వున్న రెండు వైపులా ముక్కాభరణాలు పెట్టేయ్యండి. ఒరుసుకు పోతున్నా ఓర్చుకుని వడ్డాణాలు పెట్టండి. బరువైతున్నా భరించి  చెవులకు చారెడంత దిద్దులుగానీ.. చాంతాడుకు బొక్కెన వేసినట్లున్నవో.. గాలనికి చిక్కిన బక్కెట్టులాంటీవో చెవి పోగులు ధరించండి. అప్పుడు ప్రతి కాంతా సుందర వదనే! ప్రతి ఇల్లూ శోభాయమానమే!

          ఊరికే ముగ్గులు వేస్తూ కూర్చోకండి. ఇంటి ముందు పెద్ద ముగ్గు స్టిక్కర్ అతికిం చండి. దేవుణ్ణి మన్నించమని వేడుకుని నిత్య దీపారాధన బదులు నిత్యం వెలిగే ఎలక్ట్రి కల్ దీపాల స్విచ్ వేయండి చాలు.. సమయమంతా వంటింట్లో, దేవుని గదిలో గడప కండి.. అన్నీ సహస్రనామలూ యూ ట్యూబ్ లో పెట్టేయండి. తగు మాత్రం వంటలు వండి మమ అనిపించండి. స్వీగ్గీలు జోమేటోలను ఆదరించండి. తగిన రీతిలో అలకరించుకుని అయిన వాళ్ళను ఆహ్లాదపరచండి..

          దీన్ని ఒక ‘అనునిత్య సౌందర్య వ్రతం’లా చేపట్టండి. సీన్ ఏదయినా సరే.. వర్ణ వర్ణాల చీరలే అనివార్యం. సంధర్భం ఏదయినా సరే.. నగలు వేసుకొనుట తధ్యం.. చింతలో ఉన్నాసరే.. మందపాటి మైపూతలు మరీ ముఖ్యం.. పగలయినా రాత్రయినా సరే..  చక్కటి కేశాలంకారణ తప్పనిసరి.. ఏ వేళలో నయినా తోరణాలు తోరణాలుగా వేలాడే పూమాలలు వడలకూడదు. నలగకూడదు. కురులు విరబోసుకుంటే అవి ముఖాన్ని సగం కప్పేస్తూ భుజాల పై.. ఓ మోపెడు జుట్టు వుండాలి. తలకట్టు కేశాల తట్టలా వుండాలి. కాబట్టీ కాంతలారా! కార్యచరణకు సన్నద్ధంకండి.. సర్వ వనితా అలంకరణమస్తు! సర్వేజనా సుఖీనోభవంతు!” అంటూ పెను నిద్దరలో వున్న మహిళల ను కీబోర్డ్ తో కదిలించింది. సెల్ ఫోన్ తో అతివలను ప్రేరేపించింది.  

* * *  

          ఆలస్యంగా నిద్రలేచిన మహేంద్రకు ఎదురుగా చీటీ రెప రెపలాడుతూ కనిపిం చింది.

          “మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, కార్ కీస్ ల కోసం వెతుక్కోకండీ. అవి మా దగ్గరే వున్నాయి”

          చీటి చూసి చిగురాటాకులా వణికిపోయాడు మహేంద్ర. అతని గుండె చెరువయ్యిం ది.. అతని కన్నులు చిల్లుపడ్డ కుండల్లా అయ్యాయి.

          ‘మిత్రుడు వచ్చిన ఆనందంలో భార్య పిల్లలను పరిచయం చెయ్యాలని తాపత్రయ పడ్డ మాట వాస్తవమే.. వెంటనే కదిలి రానందుకు కోపంతో నాలుగు మాటలన్నదీ నిజమే! దానికే ఇంత బాధపడాలా? తనను వదిలి వెళ్ళిపోయారా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్లు?’ విపరీతంగా బాధపడ్డాడు మహేంద్ర. ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోకుండా ఎలా ఉండాలో అర్థంకాలేదు. ఊహించని విఘాతానికి విల విలలాడిపోయాడు. ఆఫీస్ కి వెళ్ళబుద్ది కాలేదు. ఇవ్వాళ రానని ఫోన్ చేసి చెప్పేశాడు. తన భార్యా బిడ్డలను ఎక్కడని వెతకాలి? ‘పాపం పిచ్చినర్మదా వంట కూడా చేసిపెట్టింది. ఫ్లాస్క్ లో కాఫీ పోసిపెట్టింది. రేపటి నుండి నన్ను ఏమి చేద్దామనుకుని వెళ్ళావు నర్మదా? అయ్యో పిల్లలూ! మీకు ఈ డాడీ గుర్తుకు రాలేదా? నన్నుఎట్లా వదిలి వెళ్ళబుద్దయ్యింది మీకూ?’ మద్యాహ్నం వరకు అయోమయపు దుఃఖంతో గడిపి.. చివరకు రాత్రి పొద్దుపోయాక..

          “అత్తయ్యగారూ నన్ను మన్నించండి.. నిన్న మిత్రుడు వచ్చిన వెంటనే వచ్చి పలకరించలేదన్న కోపంలో నాలుగు మాటలన్నాను. దానికి నర్మదా పిల్లలు ఇంత బాధ పడతారనుకోలేదు. వాళ్ళ ఫోన్లు కూడా ఇక్కడే పెట్టి.. ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళి పోయారత్తయ్యగారూ” ఫోన్ చేసి చెప్పి బావురుమనబోయాడు..

          అంతలో భళ్ళుమన్న శబ్దంతో తలుపు తెరుచుకుని నర్మదా పిల్లలూ బిల బిల మంటూ లోనికి వచ్చారు.. మూడు మంచాల మీద మూటెడు ప్యాకట్లు పడేశారు.

          “ఇప్పుడు వంట చేసే ఓపిక లేదు. బిర్యానీ తెచ్చేసాం. తినేసెయ్యండీ” అన్నది నర్మదా. మహేంద్ర ముఖంవంక కూడా చూడలేదు కానీ.. చూసి వుంటే కరిగి నీరై.. నర్మదయి ప్రవహించేదే.. పొద్దుటి నుండీ ఆకలి మీద వున్నాడేమో మౌన గంభీరంగా.. గంభీర మహేంద్రగా బిర్యానీ తిన్నాడు. అక్కడ మంచాల మీద పరుచుకున్న ప్యాకెట్ల లోని వస్తువులు రేపటి నుండీ తమ జీవితాలను ఆవరించి వేస్తాయని, ఆవహించేస్తాయని తమ బ్రతుకులను మార్చివేస్తాయని తెలియని మహేంద్ర.. మనసు అలసట తీరి బజ్జున్నాడు.

* * *  

          “పొద్దున్నే అమ్మా కూతుళ్ళు ఏ పెళ్ళికి వెళ్తున్నారు?” అడిగాడు మహేంద్ర.. ఇదే ప్రశ్నకాస్త మార్పుతో ఇకో సౌండ్ లో ఒక వందల ఇళ్ళల్లో వినిపించింది. “ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు?” అని. కిసుక్కున నవ్వులు కూడా గంటనుండీ వెలువడ్డ శబ్దంలా రింగ్ రింగ్ న  వెలువడ్డాయి. “ఎక్కడికీ వెళ్ళడం లేదు ఇక నుండీ ఇంట్లో కూడ ఇలాగే వుంటాము. నిండుగ వుంటాము.. మీ కన్నుల పండుగలా వుంటా ము..” ఇకో సౌండ్ లో ఈ మాటలు మార్మోగాయి 

          అవాక్కయ్యారు ఆయనగార్లు. పొంగిపోయారు పురుష పుంగవులు. ఆశ్చర్యపోయారు కుమార రత్నాలు.. అయోమయంలో పడ్డారు వృద్దజీవులు.

          ప్రతిన పూనిన ప్రతీ కోడలూ.. అత్తలకూ, అమ్మలకు సైతం అందమయిన జరీ బార్డర్ చీరలు కట్టబెట్టారు. సౌందర్య వ్రతం ఆచరిస్తున్నఅత్తలంతా.. కోడళ్ళకు కోరినన్ని చీరలూ, నగలూ అమర్చారు. సెల్ఫ్ లెస్ గా సెల్ఫీలు దిగి షేర్ చేసుకున్నారు. గ్యాలరీ నిండిపోతే హార్డ్ డిస్క్ లు కొని దాచుకున్నారు.

          ఇక మొగ మిత్రుల వాట్సప్పుల్లో ఇంటి ఇంతుల అలరించే మేకప్పుల సంగతులు, పోగొట్టుకుంటున్న తమ మతులు, వర్ణ వర్ణాల చీరలు, వారి అలంకరణలో ఆకస్మికంగా  వచ్చిన ఆహ్లాద మార్పుల గురించిన ముచ్చట్లే. ఈ మార్పులు మహాబాగా నచ్చి,మనసారా మెచ్చి.. ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. తమ వారిని మురిపంగా చూసుకున్నారు. పిన్నలనూ పెద్దలనూ సమస్త కుటుంబ స్త్రీలనూ చూసి ముచ్చటపడ్డారు. మురిసి పొయారు.  

          ఇప్పుడు ప్రతీ ఇల్లూ నిత్య పేరంటంలా కళ కళలాడిపోతున్నది. ప్రతి గృహమూ శుభకార్యం జరుపుకుంటున్న నివాసంలా నిగనిగలుగా వెలుగుతున్నది. ప్రతి మగువా అప్పుడే షూటింగ్ కి వెళ్తున్న హీరోయిన్లా మెరిసిపోతున్నది. మగని మోమునా ఓ వింత వెలుగు. భర్తల వదనం ప్రమోదం భరితం. పతికి ఇల్లే కోవెలలా.. ఇల్లాలే పరమ దేవత ల్లా.. పిల్లలు దేవ తనయుల్లా, దేవ సుతుల్లా.. కనిపించి గృహమే స్వర్గసీమలా అందాల ఆనందాలమయంగా మారింది.

          నెలరోజులు గిర్రున తిరిగాయి. అలంకరణాల్లో ఆడవాళ్ళు అలసిపోలేదు. నగలు మోయడంలో విసుగు రాలేదు. మేకప్పులు వేసుకోవడంలో వేసారి పోలేదు.

          అతివ తలుచుకుంటే సాధించలేనిది ఏముంటుంది? ఇంటిని సౌందర్య సీమగా మార్చేసామని సబలలంతా సంతోషపడిపోయారు. అలంకార సహితంగా సంబరపడ్డారు

          కానీ.. కానీ..ఇప్పుడు మగవారి మనసు నిండిపోయిందే కానీ, ఖాళీ అయిన జేబులు గుబులు కలిగిస్తున్నాయి. కాంతలందరూ కన్నుల పండుగలాగే వున్నారుగానీ.. వారు గీసి గీసి ఏటీఎమ్ కార్డులు కరిగిపోయాయి. గోముగా తెప్పించుకున్న వన్ గ్రామ్ నగల ఫోన్ పే లు పేలిపోతున్నాయి. గాగుల్స్, బ్యాగ్స్, చెప్పల్స్, గూగుల్ పేలు గుండెను బేజారెక్కిస్తు న్నాయి, అమెజాన్ ఆర్డర్లు అదిరిపోతున్నాయి. డెబిట్ కార్డులు డెడ్ అయ్యాయి. కొంత మంది మొగవారికి హై బీపీలు వస్తే.. మరికొందరికి లో బీపీ, పల్స్ రేట్ పడిపోసాగింది.

          సమస్త పురుష ప్రపంచం మంచం పట్టకముందే.. ఉలిక్కిపడి మేలుకొన్నది. ఈ కొత్త పరిణామాలను అడ్డుకోవడానికి భామినులతో పోరాటాలకన్నా.. బతిమాలుకొనుట మిన్నయని భావించింది.

* * *

          “ఓ వనితల్లారా! ఉవిదల్లారా! నెలతల్లారా! సమస్త బిల్లులూ.. బెల్లుల్లా మోగు తున్నవి.. 

          ఇంత వరకూ వున్నవీ, ఇప్పటిదాకా కొన్నవీ చాలు.. ఇక ముందు నిల్లు బాలన్స్ లు నిక్కము సుమా!

          ప్రస్తుతం కోరి కొనుక్కున్న ఖర్చుల నుండీ కోలుకోవడానికే కొన్ని నెలలు పడుతుం ది.

          ఓ శ్రీమతుల్లారా..! శ్రీ మహాలక్షముల్లారా..!

          మమ్మానంద పర్చడానికి ఆరంభించిన ఇట్టి సౌందర్య వ్రతం ఇక ఆపేసి. .మీ నూతన అవతారాలు చాలించి.. మామూలు అవతారాలలోకి మారిపోయి.. మీరు మీరుగానే వుండి..మమ్ముల్ని మాలాగే వుండనిచ్చి.. మా మొరాలకించి, మమ్మానందింప చేయ ప్రార్థన!”

          ఈ రీతిని బాధిత పురుషులు.. ఇళ్ళల్లోని గది గదికి ప్ల కార్డ్ లు పూలగుత్తుల్లో అమర్చారు.

          “వనితా వార్తా వాట్సప్ వ్రతం” చేపట్టిన వనితలందరికీ మెసేజులు పంచారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.