కనక నారాయణీయం -55

పుట్టపర్తి నాగపద్మిని

          ఇంతలో కింద నుండి నాగపద్మిని వచ్చి, అయ్యా, మిమ్మల్ని స్కూల్ కు రమ్మంటు న్నారంట! ఎవరో వచ్చినారని చెప్పమనిందమ్మ!’ అని చెప్పింది.

          పుట్టపర్తి ,’ఆ అవును, మర్చేపోయినాను. పదరా నాయనా! స్కూల్ లో ఏ పని పడిందో నాతో! పోవాలప్పా!’ అంటూ లేచారు.

          ఇద్దరూ మిద్దె నుండి దిగి కిందికి వచ్చేశారు. వల్లంపాటికి ఆ పుంభావ సరస్వతికి పాదాలంటి నమస్కరించాలనిపించింది.

          అతనలా వంగుతుంటే పుట్టపర్తి అన్నారు నవ్వుతూ, ‘ఎందుకురా నాయనా ఇవన్నీ? ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప నేను కూడా సామాన్యమైన మనిషిని,! నాకు మొక్కడం వల్ల నీకేదో ఒరుగుతుందని మాత్రం అనుకోవద్దు. సరేనా?’

          స్వామి ధోరణి అర్థమైపోయిందిప్పటికే వల్లంపాటికి! అందుకే అవన్నీ పట్టించుకో కుండా పాదాలంటి నమస్కరించి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

          పుట్టపర్తి ఇంట్లోకొచ్చి, పడసాలలో ఒక మూల గోడమీద కొండికి వేసిన జుబ్బా తీసుకుని వేసుకుంటూ, ‘కనకా! నేను స్కూల్ కు పోయి వస్తా! ఈ నాగేదీ?’ అని అడిగారు.  తానెక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరినైనా వెంట ఉంచుకోవటం వారి అలవాటు మరి.

          ‘ఇక్కడే యెక్కడో ఉండాలే?’

          ‘పోనీలే!’

          పుట్టపర్తి పడసాల నుండీ బైటికి వచ్చి చెప్పులు వేసుకోబోతుండగా, ఎక్కడి నుంచో తూనీగలా వచ్చేసింది నాగ, అయ్య పాదరక్షలు తెచ్చి సిద్ధంగా కాళ్ళ దగ్గర పెట్టింది.

          ముచ్చటగా నాగ వైపు చూస్తూ అన్నారు, ‘నాతో పాటూ స్కూల్ కు వస్తావా?’

          మెరుస్తున్న కళ్ళతో తలూపి, అయ్య వెంట బయలుదేరింది నాగ. నిజానికి యీ రోజు స్కూల్ లేదు, ఆదివారం. ఐనా స్కూల్ నుంచీ పిలుపు  వచ్చిందంటే కరస్పాండెంట్ రంగనాథం గారు ఏదో ఆలోచనలో ఉన్నారన్న మాట!

          ఏదో ఆలోచించుకుంటూ అడుగులు వేస్తున్నారాయన. ఆయనతో పాటూ అడుగు లు వేస్తున్న నాగ, ఉన్నట్టుండి  ఒకచోట ఆయనకన్నా ఒకచోట పరుగులు పెట్టి ఒక ఇంట్లోకి దూరి మళ్ళీ తూనీగలాగే వచ్చి పుట్టపర్తితో కలిసింది.

          ‘ఎక్కడికి పోయినావమ్మా?’

          ‘మా ఫ్రెండ్ రామసుబ్బలక్ష్మి వాళ్ళిల్లయ్యా! తను ఇంట్లో లేదంట వాళ్ళమ్మ   చెప్పింది. నవ్ రంగ్  సినిమాలో కారికారి ఆరి అనే పాట భలే ఇష్టమామెకు!!ఆ పాటకు డాన్స్ చేస్తుంటా కదా నేను! ఆమె ఎన్ని సార్లు చూసిందో తెల్సా నా డాన్స్!’ నాగ కళ్ళల్లో మెరుపులు.

          తన సంగతులన్నీ నాకూ తెలుసునన్నట్టుగానే చెబుతూంది అమాయకంగా!!           

          పుట్టపర్తికి ముచ్చటేసింది. నవ్ రంగ్ సినిమా తనకూ చాలా ఇష్టం. అసలు సినిమా అంటేనే పడని తనను, అందులో చిత్రీకరణ, పాటలు, సంగీతం, ఎంతో నచ్చాయి. కానీ ఇప్పుడొక కొత్త సంగతి తెలిసింది. నాగ అందులోని పాటకు డాన్స్ చేస్తుందనీ, ఆ డాన్స్ ను ఇష్టపడేవాళ్ళున్నారనీ!

          ‘ఔనా? నా కస్సలు తెలీనే తెలీదే? నీకు డాన్స్ చెయ్యడమెవరు నేర్పించినారమ్మా?’

          ‘ఆ సినిమా రెండు సార్లు చూసినానులేయ్యా, రామసుబ్బలక్ష్మి వాళ్ళతో పాటీ!అక్కడ చేసి అట్లా అట్లా నేర్చుకున్నాను.’

          ఆ మాటలు వింటుంటే తెగ ముచ్చటేసిందాయనకు! డాన్స్ అంటే అట్లా నేర్చుకోవటమేననుకుంటూ ఉంది పిచ్చి తల్లి! తాను చిన్నప్పుడు మహాలక్షుమ్మ దగ్గర నేర్చుకున్న పద్ధతి గుర్తుకు వచ్చింది. ఈ పిల్లకు నాట్యమంటే ఇష్టమని ఇప్పుడే కదా, తెలిసింది! అసలు తనకు ఇంటి సంగతులేవైనా పడితే కదా, ఇటు వంటి సంగతులు తెలిసేందుకు? ఒకసారి ఎవరికో వ్యాసం పంపవలసి ఉండి, కనకను పిలిస్తే, ఏదో కారణం చెప్పి, మూడో  కూతురు తులజను పంపింది. మొదట్లో కోపం వచ్చింది, యీ పిల్ల సరిగ్గా వ్రాయగలదా? అని! పైగా యీ మూడో బిడ్డ కాస్త మాటలు తక్కువే!

          గంభీరంగా దూర దూరంగానే ఉంటుందని వాళ్ళమ్మే చెబుతూ ఉంటుంది. అందుకే కాస్త భయం వేసింది, కానీ తీరా చూస్తే, అచ్చం వాళ్ళమ్మ చేతి వ్రాతే! గుండ్రటి పొందికైన అక్షరాలు! ఇంక అప్పటి నుంచీ వ్యాసాలూ అవీ వ్రాసేందుకు తులజనే పిలుస్తున్నాడు తను! ఇదిగో ఇప్పుడీ నాగ! తనకు డాన్స్ అంటే ఇష్టమని ఇప్పుడు తెలిసింది కదా! తాను నేర్చుకున్న ఆ నాట్యం వంటి శాస్త్రీయ నాట్యం నేర్పించవలె!   ఇంతకూ నాగ ఇంకా నాలుగవ తరగతో ఐదో తరగతో చదువుతూ ఉంది, సీతారామయ్య వీధి బడిలో! తను రామకృష్ణా హై స్కూల్ కు వస్తావా అనగానే వెంటనే సిద్ధమై పోయింది. తనకూ ఆ పెద్ద స్కూల్ చూడాలని అనిపిస్తుందేమో!’

          గెంతుకుంటూ తనతో నడుస్తున్న తన బిడ్డను చూస్తూ నడుస్తున్న అచార్యులవారు గమనించనేలేదు, తామిద్దరమూ స్కూల్ ఆవరణలోకి వచ్చేసినట్టుగా! నాగ తన జుబ్బా లాగుతూ అడుగుతూంది,’అయ్యా, అదుగో, ఆ ఎర్రెర్ర పూలున్నాయే, ఆ చెట్టేమి చెట్టు?’

          ఆ మాటలకు యీ లోకంలోకి వచ్చారాయన. నాగ చెబుతున్న ఆ చెట్టేమిటబ్బా అని చూశారు. నిండుగా ఎర్రెర్రని కాంతులు చిమ్ముతూ నిలబడి ఉంది పలాశ చెట్టు అందంగా! దీన్నే తెలుగులో మోదుగ అంటారు.

          ‘అరెరే! నేనెప్పుడూ గమనించనే లేదమ్మా! నువ్వెప్పుడు చూసినావు దీన్ని? భలే ఉంది కదా! దీన్ని పలాశ చెట్టు అంటారు సంస్కృతంలో! తెలుగులో మోదుగ అంటారు.  ఉగాదికి ముందు వసంతం వస్తుందని హెచ్చరిస్తూ పూలు పూస్తుంది. ఎర్రగా, ఎంతో అందంగా వుంటాయి చూడు. నీకు ఇష్టమా ఇవి?’

          తలాడిస్తూ అంది నాగ,’నువ్వు చూడలేదా? మీస్కూల్ లో ఉన్న చెట్టే కదా? నువ్వేమో పలాశ అన్నావు కానీ, దీన్ని మోదుగ అంటారని అమ్మెప్పుడో చెప్పిందే?’

          పుట్టపర్తికి చిన్న బిడ్డ తెలివి తేటలకు తెగ ముద్దేసింది. అంటే ముందే వాళ్ళమ్మను అడిగి తెలుసుకుని, మళ్ళీ తనను అడుగుతోందింకా అంటే, ఏదో తన నుంచీ తెలుసు కోవాలనే కదా అర్థం?

          ‘నిజమేనమ్మా. తెలుగులో దీన్ని మోదుగ అంటారు. సంస్కృతంలో పలాశ, కింశుకము అని కూడా అంటారు. దీన్ని గురించి సంస్కృత కవులు ఎన్నెన్నో కల్పనలు చేసినారు తమ రచనల్లో అద్భుతంగా! 

                        పలాశ కుసుమ భ్రాంత్యా

                        శుక తుండే పతత్యలి:

                       సోऽపి జంబూ ఫల భ్రాంత్యా

                    తమలిం ధర్తుమిఛ్ఛసి.

          ‘అంటే?’ నాగ ప్రశ్న.

          తుమ్మెద, చిలుక ఎర్రని నోటి దగ్గరికి వస్తుందట పాపం పలాశ పువ్వులు అనుకుని! చిలుక కూడా నల్లగా ఉండే తుమ్మెదను, నేరేడు పండు అనుకుని తినేందుకు ప్రయత్ని స్తుందట! అంటే రెండూ పొరబడ్డాయని అర్థం! ‘

          ‘అయ్యో, తుమ్మెదను చిలుక తినేస్తుందా మరి?’

          భళ్ళున నవ్వేశారు పుట్టపర్తి. అలా నవ్వుతూ ఉండగా వెనక నుంచీ మరో నవ్వు కూడా వినిపించింది, ఎవరబ్బా అని వెనక్కి తిరిగారు, పుట్టపర్తి.

          స్కూల్ లో మరో సంస్కృతం టీచర్ రామేశ్వర శర్మ.

          ‘భలే ఉంది స్వామీ, మీ బిడ్డకు ఇప్పటి నుంచే సంస్కృత పాఠాలు చెబుతున్నారా?’

          పుట్టపర్తి నవ్వేస్తూ, ‘లేదు శర్మా! ఈ చెట్టు పేరేమిటని అడిగితే దానితో పాటూ యీ శ్లోకమూ గుర్తుకు వచ్చింది. అంతే!!’

          ‘కింశుక కుసుమాల గురించి చెప్పాలంటే, ఋతు సంహారం చెప్పవలసిందే మరి!’ అతను నవ్వందుకున్నాడు.

          ‘భలే వాడివి శర్మా! ఆ కావ్యం చెప్పుకునే వయసు తనకెక్కడిది? చిన్నపిల్ల! ఏదో అడిగింది కదా అనీ! సరే, ఇంతకూ, ఇప్పుడు మనలను కరస్పాండెంట్ రంగనాథం గారు ఎందుకు పిలిచినట్టు?’

          ‘ఏమో స్వామీ! నాకూ తెలీదు. ఇంతకూ ఇంకా ఎవరూ కనబడక పోతే, నేను అట్లా రోడ్డు దాకా పోయి వస్తున్నా. ఇంతలో మీరూ వచ్చినారు. ఏమ్మా నాగా! పెద్ద గేటు దగ్గర తోటలో చిలుకలున్నాయి, చూసి రాపో మరి?’ అనగానే, నాగ తుర్రుమని వెళ్ళిపోయింది.

          ‘ఆ..ఇప్పుడు చెప్పండి స్వామీ, ఆ పలాశ కుసుమ సౌందర్యం?’

          ‘ఓరోరి శర్మా? భలేవాడివయ్యా! ఒకపక్క వాళ్ళొచ్చి ఉన్నారు, మనమిక్కడ మాట్లాడు కుంటూ కూర్చుంటే బాగుంటుందా?’

          ‘లేదు లేండి. వాళ్ళు ఏదో బడ్జట్ గురించి మాట్లాడుకుంటున్నారు, నేను బైటికి వచ్చినాను. ఇంతకూ ఆ ఋతు సంహారం శ్లోకం ఎంత చక్కగా ఉంది స్వామీ? ఆ దీప్త వహ్ని సదృశై:..’ గుర్తుకు తెచ్చుకుంటున్నట్టు ఆగిపోయాడతను.

          వెంటనే పుట్టపర్తి అందుకున్నారు,

               “ఆదీప్త వహ్ని సదృశై: మరుతావధూతై:

                సర్వత్ర కింశుక వనై: కుసుమావనమ్రై:

               సద్యో వసంత సమయేన సమాగతేయం 

               రక్తాంశుకా నవ వధూరివ భాతి భూమి:.’                               

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.