భూమాత పుత్రిక (హిందీ అనువాద కథ)

హిందీ మూలం – డా. లతా అగ్రవాల్ `తులజ’

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

          “ఏమే! రోజంతా ఎక్కడపడితే అక్కడ గంతులేస్తున్నావు పోరీ!” సకూ తన కూతురు శేవంతిని కోప్పడుతూ అంది.

          “అరే! అమ్మా, సోనీతోనూ మంజులతోనూ పొలం వెళ్ళొచ్చాను.” శేవంతి అంది.

          “చాల్లే రోజూ నీ ఆటలూ, గంతులూను. శేవంతీ, ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు. ఇంట్లో ఉండి మీ వదినతో కాస్త వంటావార్పూ చెయ్యడం నేర్చుకో.”

          “ఆయీ! నీకన్నా మా నాన్న నయం. నువ్వు ఎప్పుడు చూసినా నన్ను కోప్పడుతూనే ఉంటావు. మా నాన్న చూడు. నన్నెంత ముద్దుగా చూసుకుంటాడో.”

          “పోరీ! నీ మంచికోరే చెబుతున్నాను నేను. అరే, ఆడపిల్లవి. రేపు అత్తారింటికి వెడితే వంట చెయ్యడం రావాలి కదా.”

          “అరే! ఏమయిందే ఎవరికి గీతోపదేశం చేస్తున్నావు?” శేవంతి తండ్రి లోపలికి వస్తూ అన్నాడు.

          “ఇదిగో, ఈయనకి నేనేం చెప్పినా ఉపదేశం లాగానే కనిపిస్తుంది. ఆడపిల్ల తండ్రి నన్న మాట అసలు మరిచిపోయారేమిటి? కూతురికి కావలసిన సంస్కారం ఇవ్వదలుచు కోలేదా?”

          “ఏమిటి నువ్వు కూడానూ… సంస్కారం అనేది కూడా ఎవరైనా ఇచ్చేదా? అరే, ఇది తల్లినీ, తండ్రినీ చూసి కూతుళ్ళలో వాటంతట అవే వస్తాయి. అందుకే నేననేది ప్రతి దానికీ అరవడం మానెయ్. ఈ సంస్కారం…”సదాశివరావు ఏదైనా చెప్పేలోపలే శేవంతి తో పాటు వంటగదిలో పని చేస్తున్న కోడలు కూడా నోటికి కొంగు అడ్డం పెట్టుకుని నవ్వింది.

          “అవును నాన్నా, నువ్వు నాకు అందరికన్నా మంచి నాన్నవి.” అంటూ శేవంతి తండ్రిని చుట్టుకుపోయింది.

          “చెడగొట్టుకోండి నాదేం పోయింది?”

          “అదేం కాదులే… నీ కూతురి మీద నమ్మకం ఉంచు…అది సరేకాని, దాని మీద అలా అరవకు. నాకు బాధ కలుగుతుంది.”

          “అది నా క్కూడా కూతురేకదండీ. నేను దాన్ని కన్నాను. దానికి జన్మనిచ్చాను.”

          “నాకు తెలుసులేవే. నా కూతురు ఎంతో పుణ్యం చేసుకుంటే, ఎన్నో మొక్కులు మొక్కుకుంటే పుట్టింది. ముగ్గురు కొడుకుల తర్వాత తులజ భవాని తల్లికి కాలినడకన వస్తామని మొక్కుకున్నాం. మన అమ్మాయి సాక్షాత్తు ఆ భవాని తల్లి ఆశీర్వాదమే. దాని సంస్కారాల గురించి మనం అసలు చింతించక్కరలేదు.”

          నాసిక్ జిల్లాలో ఉండే సదాశివరావు వ్యవసాయం చేసుకునే రైతు. వ్యవసాయం బాగానే నడుస్తోంది. పచ్చని నిండు సంసారం. ముగ్గురు కొడుకుల తరువాత శేవంతి రావడం ఆ యింటి సుఖసంతోషాలని ఇనుమడింపజేసింది. అందువల్లనే శేవంతి తన తండ్రికి ముద్దులపట్టి. ఊళ్ళోని స్కూల్లో పదకొండు చదువుతున్న శేవంతి విషయంలో వాళ్ళ అమ్మకి దాని గృహస్థ జీవితం గురించిన దిగులుపట్టుకుంది. సాధారణంగా ప్రతి తల్లికి ఈ విధమైన దిగులు సహజంగానే ఉంటుంది. 

          సదాశివరావు తనకి దగ్గరలోనే ఉన్న ఊళ్ళోని భూస్వామి మల్హార్ రావు కొడుకు ఉమేష్ మొహంతిని శేవంతికి వరుడిగా ఎంపిక చేశాడు. ఉమేష్ మిలిటరీలో సైనికుడు. … అన్నీ సమృద్ధంగా ఉన్న ఇల్లు, సంతోషంగా ఉన్న కుటుంబం, అందునా భార్యకి మెండు గా ప్రేమనిచ్చే ఉమేష్. కూతురి గృహస్థ జీవితం సుఖంగా నడవడం చూసి అందరికన్నా ఎక్కువగా సంతోషించినవాడు శేవంతి తండ్రి. తన యోగక్షేమాలు తెలుస్తూ ఉండాలని కూతురి అత్తవారి ఇల్లు దగ్గరలోనే ఉండేలా చూశాడు.

          సైనికుడి జీవితానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. పెళ్ళి కోసం 20 రోజుల సెలవు మంజూరయింది. ఆ ఇరవై రోజులూ, పట్టుకున్న తెల్లని పావురం చేతిలోంచి తుర్రుమని ఎగిరిపోయినట్లు ఇట్టే గడిచిపోయాయి. ఉమేష్ తన ఉద్యోగానికి తిరిగి వెళ్ళి పోయాడు మళ్ళీ త్వరగానే వస్తానని మాటయిచ్చి. కాని సరిహద్దులో నెలకొన్న పరిస్థితు లు శేవంతితో మరికొంత సమయం గడిపేందుకు ఉమేష్ కి అవకాశం ఇవ్వలేదు. ఈలోగా శేవంతి గర్భం ధరించింది. రెండు కుటుంబాల్లోనూ దీనిని ఎంతో సంతోషంగా స్వాగతిం చారు. తనకి ఇష్టమైన వంటకాలు చేసి తినిపించడం, సీమంతం… సంప్రదాయబద్ధంగా చేసుకునే వేడుకలన్నీ చేసుకున్నారు. కాని ఈ ఉత్సవంలోని ఆనందాన్ని ఉమేష్ కేవలం ఫోన్ ద్వారానే పొందగలిగాడు.

          “ఏమండీ! మీరు బాగా జ్ఞాపకం వస్తున్నారు. ఎప్పుడు వస్తారు?”

          “శేవంతీ! వీలైనంత తొందరగానే వస్తాను. నా బిడ్డ పుట్టినప్పుడు నేను స్వయంగా అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. బిడ్డ కళ్ళు తెరిచినప్పుడు మన ఇద్దరినీ ఒక్క సారే చూడాలి. వాడు మొట్టమొదట ఏమంటాడో వినాలని ఉంది.”

          “మరయితే వచ్చేయండి. తొమ్మిది నెలల సమయం కూడా అయింది. ఎప్పుడైనా పురుడు రావచ్చునని డాక్టర్లు అంటున్నారు.”

          “నేను బాస్ కి అప్లికేషన్ ఇచ్చాను శేవంతీ, సెలవు మంజూరు కాగానే నేను ఎగిరి వచ్చి నీ దగ్గరికి చేరుకుంటాను.”

          మొదటి కాన్పు పుట్టింట్లో జరుగుతుంది కనుక ఈ ఆనవాయితీ ప్రకారం సదాశివరావు తన ముద్దుబిడ్డని తన ఇంటికి తీసుకువచ్చాడు.

          మూడు రోజులే గడిచాయి. రాత్రి పన్నెండున్నరకి సకూబాయి తన భర్తని లేపింది. “ఏమండీ! శేవంతిని తీసుకుని మనం ఆసుపత్రికి వెళ్ళాలి. దానికి నొప్పులు మొదల య్యాయి.” సదాశివరావు వెంటనే తన చెక్కపెట్టె లోంచి డబ్బులు తీసుకున్నాడు. పొరుగింట్లోనే ఉన్న అక్కని వెంటబెట్టుకున్నాడు. మనం ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పాడు. శేవంతిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.

          డాక్టరు, నర్సు గదిలో ఉన్నారు. బయట సదాశివరావు అశాంతితో పచార్లు చేస్తు న్నాడు. ఒకసారి లేబర్ రూం వరకు వెడుతున్నాడు. మళ్ళీ కిటికీ దగ్గర నిలబడి చేతులు జోడించి దేవుడిని ప్రార్థిస్తున్న భంగిమలో ఉన్నాడు. భార్య ఆయన దిగులుని అర్థం చేసు కుంది. “అయ్యో! మీరు ఇలా తిరుగుతూ ఉంటే పురుడు తొందరగా వస్తుందా? మీరు ఒక చోట కూర్చోకూడదా?”

          సదాశివరావు కళ్ళలో శేవంతి పెళ్ళి అయినదగ్గర నుంచి ఆ రోజు వరకు జరిగిన వన్నీ దృశ్యాలు ఒక్కొక్కటిగా కదలాడుతున్నాయి. తన ముద్దుల కూతురిని తను ఉమేష్ కి అప్పగించాడు. అల్లుడు సైనికుడు కనుక అతని కర్తవ్యం అతనికి ఉంది. కాని తను కూతురి పట్ల తన కర్తవ్యాన్ని బాగా నిర్వర్తించాడు. ఈ నాడు అదే చిన్నారి శేవంతి తల్లి కాబోతోంది. కూతురు తల్లి కాగానే తనకి కూడా ప్రమోషన్ వస్తుంది. ఆయన ఆలోచనా స్రవంతి కొనసాగుతూనే వుంది. ఇంతలోనే ముందుగా నర్సు గదిలోంచి బయటికి వచ్చింది. ఆమె వెనకాల డాక్టరు కూడా. వెంటనే వాళ్ళు అటు పరుగెత్తారు.

          “ఏమయింది డాక్టరుగారూ? నా బిడ్డ ఎలావుంది?”

          అప్పుడే అక్క కూడా పరుగున వచ్చింది.

          “డాక్టరుగారూ, అబ్బాయా అమ్మాయా?”

          “అరే, అబ్బాయి పుట్టాడు మీ కూతురికి. ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.” డాక్టరు సంతోషం వ్యక్తపరుస్తూ అంది.

          “చాలా చాలా ధన్యవాదాలు డాక్టరు గారూ, చాలా చాలా థాంక్స్.” సదాశివరావు చేతులు జోడించి వినయంగా అన్నాడు.

          “మేము బిడ్డని చూడచ్చునా?”

          “అప్పుడే కాదు. కొంచెం సేపట్లో పిల్లవాడినీ, వాడి తల్లినీ లేబరు రూం నుంచి ఇంకో గదిలోకి షిఫ్టు చేస్తాం. అప్పుడు.”

          సదాశివరావు మొట్టమొదటగా ఫోన్ అల్లుడికి చేశాడు.

          “ఇదిగో అల్లుడూ! నీకు ప్రమోషన్ వచ్చింది. నువ్వుకూడా నాన్నవి అయ్యావు. నీకు కొడుకు పుట్టాడు.”

          “నిజంగానా” ఉమేష్ సంతోషంగా అన్నాడు, “నేనిప్పుడే సెలవు గురించి మాట్లాడ తాను. ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా వస్తాను.” సదాశివరావు ఆనందానికి అవధుల్లేవు.

          “బావగారూ, శుభవార్త. మీ మీసాలు పట్టుకుని ఆడుకునేవాడు వచ్చాడు.” వియ్యం కుడు గారికి ఫోన్ చేసి చెప్పాడు.

          “నిజంగా… మీరయితే మీసాలు ఉంచుకోరు. అయినా మీకు కూడా అభినందనలు. మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం.”

          అప్పటికే శేవంతిని వేరే గదిలోకి షిఫ్టు చేశారు. అందరికన్నా ముందు సదాశివరావు పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకున్నాడు. పసిపిల్లలలాగా వాడితో ముద్దుముద్దుగా చిన్నపిల్లల భాషలో మాట్లాడసాగాడు, వాడుకూడా ఆయనతో ఇప్పుడే మాట్లాడతాడన్నట్లుగా.

          “ఒరే అబ్బాయిలూ, మీరు మావయ్యలయ్యార్రా. శేవంతికి అబ్బాయి పుట్టాడు.” ఆయన తన ముగ్గురు కొడుకులకీ ఫోన్ లో శుభవార్త చెప్పాడు.

          “అమ్మా! వీళ్ళ నాన్నగారికి ఫోన్ చేశారా?” శేవంతి తన తల్లిని అడిగింది.

          “ఇంతసేపా…మీ నాన్నఉండగలరా చెప్పకుండా? ఆయన అందరికీ ఫోన్ చేసి చెప్పారు. సెలవు దొరకగానే బయలుదేరుతానని అల్లుడుగారు అన్నారు. మీ అత్తయ్య గారు, మామయ్యగారు కూడా వస్తూ ఉండవచ్చు.”

          “అరే! వియ్యంకుడుగారు వస్తున్నారు. ఇంత వరకూ స్వీట్లు తెచ్చుకోలేదా… నాకూ జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది.” ఆయనకి ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అర్థం కావడంలేదు. ఆయన వెంటనే బజారువైపుకి బయలుదేరాడు. ఇంచుమించు అరగంట తరువాత ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన రెండుచేతుల్లోనూ మిఠాయిల ప్యాకెట్లు ఉన్నాయి. ఒక సంచిలో పిల్లవాడి కోసం ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయి.

          కాని, ఆసుపత్రి గేటు దగ్గర ఆయన ముగ్గురు కొడుకులూ విషణ్ణవదనాలతో నిలబడి వున్నారు.

          “ఏమిట్రా, మీరు మేనమామలై వుండి ఏమిటలా దిగులుగా నిలబడ్డారు? శేవంతి కొడుకుని చూశారా?”

          “నాన్నా ఒక దుర్వార్త.” ఒక కొడుకు అన్నాడు.

          “దుర్వార్త ఏమిట్రా…!!”

          “బావగారికి తుపాకీగుండు తగలడం వల్ల ఆయన స్వర్గస్థులయ్యారు.”పెద్దకొడుకు అన్నాడు. సదాశివరావుకి తన చెవుల్లో ఎవరో మరుగుతున్న నూనె పోసినట్లయింది.

          “ఎవరు చెప్పార్రా నీకీ దౌర్భాగ్యపు విషయం?”

          “నాన్నా! శేవంతి అత్తవారింటి నుంచే ఫోన్ వచ్చింది. మీరు చెప్పిన శుభవార్త విని వాళ్ళు ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటూ వుండగానే మిలిటరీ నుంచి ఫోన్ వచ్చింది. నాన్నా అక్కడ బాగా దుఃఖపూరిత వాతావరణం నెలకొంది.” సదాశివరావు చేతుల్లోంచి మిఠాయి ప్యాకెట్లు కిందపడి రోడ్డు మీద చెదిరిపోయాయి. ఆటబొమ్మలు నిష్ప్రాణంగా అయిపోయాయి. ఇటు వంటి దిక్కుమాలిన వార్త విని ఆయన కూడా నిష్ప్రాణంగానే అయిపోయాడు. ఆయన కళ్ళముందు చీకటి నెలకొంది. ఆయన కళ్ళు తిరిగి పడిపోబోతుండగానే కొడుకులు ఆయన్ని పట్టుకున్నారు.

          “దేవా! నాకు ఎటు వంటి కర్మఫలాన్ని ఇచ్చావు తండ్రీ? అలా ఎలా జరిగింది… పొద్దున్న ఏడు గంటలకే కదా నేను ఆయనతో మాట్లాడాను?”

          “నాన్నా, సైనికులంతా పొద్దున్నే గ్రౌండులో పెరేడ్ చేస్తున్న సమయంలో శత్రు సైనికులు అక్కడ ఎటాక్ చేశారు. 20-25 సైనికులు హతమయ్యారు.”

          “శేవంతికి ఈ సంగతి తెలుసా?” సదాశివరావు ఏడుస్తూ అడిగాడు.

          “లేదు నాన్నా, మేము లోపలికి వెళ్ళనేలేదు. మాకు ధైర్యం చాలలేదు. నీ కోసమే ఎదురు చూస్తూ నిలబడ్డాము.”

          “నాయనా! అన్నిటికన్నా ముందు ఎలాగో అలా శేవంతి గదిలోని టీవీ వైరు తీసెయ్యండి. తనకి ఎవరూ మొబైలు ఏదీ ఇవ్వకండి… లేకపోతే దాని మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు తను చాలా బలహీనంగా ఉంది. కొన్ని గంటల కిందటనే నా తల్లి ప్రసవవేదన అనుభవించింది. ఇంతట్లోకే భగవంతుడు ఇలా… హే దేవా, ఇదెక్కడి న్యాయం తండ్రీ… నాకర్థం కావడంలేదు. ఒక్క సంవత్సరంలోనే నా తల్లి వితంతువైపోయింది.”సదాశివరావు తన చేతుల్తో తల బాదుకుంటున్నాడు. అప్పుడే అక్క ఆయన్ని చూసి బయటికి వచ్చింది.

          “వచ్చావా అన్నయ్యా, మిఠాయిలు తెచ్చావా?”

          “నా బిడ్డకేమీ చెప్పకు అక్కా….” అంటూ సదాశివరావు అక్క కాళ్ళ మీద పడ్డాడు.

          “అరే! ఏమయిందిరా, ఇదంతా ఏమవుతోంది… శేవంతికి ఏమని చెప్పద్దు?… బాబూ, ఈ మిఠాయి ఇలా మట్టిలో…!”

          “అక్కా! మా అల్లుడు, శేవంతి భర్త కాలంచేశాడు.”

          “అయ్యో భగవంతుడా… ఇదేం కబురు చెబుతున్నావు నువ్వు?”

          “నేనూ ఇదే చెబుతున్నానక్కా, ఈ సంగతి తెలిసే ముందు నాకు చావు ఎందుకు రాలేదు?” సదాశివరావు తన రెండు చేతుల్తోనూ గుండెల మీద కొట్టుకోసాగాడు. కొడుకులు అతికష్టం మీద ఆయన్ని గట్టిగా పట్టుకున్నారు.

          “నాన్నా, మీరిలా చేస్తే శేవంతిని మనం ఎలా పట్టుకోగలం?”

          కొంతసేపు క్రిందట ఉత్సవ వాతావరణం ఉన్నచోట ఇప్పుడు స్మశాన సదృశమైన శోకం వ్యాపించింది. ఏదో విధంగా సదాశివరావు తన ముగ్గురు కొడుకులతో లోపల గదిలోకి వచ్చాడు. ఆయన శేవంతిని తన కళ్ళతో తిన్నగా చూడలేకపోతున్నాడు. కూతురు తన ముఖంలోని ప్రతి అక్షరాన్ని చదువుతుందని ఆయనకి తెలుసు. ఏదో విధంగా ఒక కొడుకు శేవంతి చూడకుండా టీవీ కనెక్షన్ తీసేశాడు.       

          జీవితంలో వచ్చిన తుఫాను గురించి తెలియని శేవంతి తండ్రిని చూడగానే అంది- “నాన్నా! నువ్వు మిఠాయిలు తేవడానికి వెళ్ళావు కదా, ఏవి స్వీట్లు?”

          “అరే అమ్మా! ఏం చెప్పను ఇవాళ ఈ స్వీటుషాపుల వాళ్ళకి ఏమయిందో తెలియదు. ఒక్క షాపు కూడా తెరిచిలేదు. ఎందుకనో?”

          “అలాగా, ఈయన ఫోన్ వచ్చింది కదా, ఏం చెప్పారు?”

          “తొందరగానే వస్తానని చెప్పాడు.” అంటూ సదాశివరావు వేగంగా బయటికి వచ్చేశాడు. కిటికీ ఫ్రేముకి తల కొట్టుకుని ఏడవసాగాడు.

          “అరే! నాన్న ఉన్నట్టుండి బయటికి ఎందుకు వెళ్ళిపోయాడు?”

          “అది, ఏదో మందు తేవడం మరిచిపోయినట్టున్నాడు. అదే తేవాలని జ్ఞాపకం వచ్చివుంటుంది.”

          “కాస్త ఫోన్ నాకు తెచ్చి ఇయ్యి. నేనే మాట్లాడతాను”

          “ఈ గదిలోకి నెట్ వర్క్ రాదమ్మా.”

          ఇంటి నుంచి అందరికీ భోజనం వచ్చింది. కాని, శేవంతి తప్ప ఇంకెవరూ అన్నం తినలేదు. పాపం శేవంతి జీవితంలో లభించిన ఈ సంతోషాన్ని అనుభూతి చెందడంలో నిమగ్నమైవుంది. ఆమె దృష్టి భవిష్యత్తుకి చెందిన ఈ ప్రమాద సంఘటనని గుర్తించలేక పోయింది.

          సాయంత్రం వాళ్ళ అన్నయ్య మళ్ళీ అన్నం తీసుకువచ్చాడు. తండ్రిని ఒకపక్కకి తీసుకువెళ్ళి చెప్పాడు- “నాన్నా, ఇవాళ నుంచి అయిదోరోజున మిలిటరీవారు బావగారి పార్థివ శరీరాన్ని తీసుకువస్తారుట. ఈ లోగా అక్కయ్యకి చెప్పడం బాగుంటుందా?”

          “వద్దురా తండ్రీ, అసలు వద్దు. గారాబంగా పెరిగిన నా బిడ్డ తట్టుకోలేదు. దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.”

          సదాశివరావు తన కూతురిని ఒక్క క్షణం కూడా ఒంటరిగా విడిచిపెట్టడం లేదు. కూతురితో ఎదురుగా మాట్లాడేందుకు ఆయనకి ధైర్యం చాలడం లేదు. కొంతకొంత సమయం ఎడంలో వెళ్ళి ఆమెని చూసి వస్తున్నాడు. ఆ కుటుంబానికి ఆ నాలుగు రోజులూ నాలుగు యుగాలుగా గడిచాయి. కూతురి విషయంలో జరిగినదాన్ని దాచి పెట్టారు. కాని ఆ సంఘటన వాళ్ళని లోలోపల ఎంతగా కుంగదీసిందో వాళ్ళకే తెలుసు.

          అయిదో రోజున తెల్లవారగానే ఆసుపత్రి గుమ్మం ముందు జీపు వచ్చి నుంచుంది. శేవంతికి కడుపునిండా టిఫిన్ తినిపించారు. ఇప్పుడీ పిల్ల మళ్ళీ సంతోషంగా ఎప్పుడు తినగలుగుతుందోనన్నది చెప్పలేమని వాళ్ళకి తెలుసు.

          సదాశివరావు అన్నాడు- “పదమ్మా, నువ్వు నీ యింటికి వెళ్ళాలి.”

          “అప్పుడేనా! నాన్నా, ఇంత తొందరగా పంపించేస్తావా నా యింటికి?”

          “తల్లీ! చంటిబిడ్డ అయిదోరోజు వాళ్ళ ఇంట్లో గడపాలని మీ అత్తవారు అంటు న్నారు. ఈ ఆనవాయితీ పూర్తికాగానే సాయంత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం.”

          “అలాగా! ఇలాంటి ఆనవాయితీ ఉందని నాకు ఎవరూ చెప్పలేదు.” జీపులో కూర్చుంటూ శేవంతి అంది. ఆమె చెప్పేది పట్టించుకోకుండా వాళ్ళ అమ్మ అంది- “అమ్మడూ! పిల్లాడికి కడుపునిండా పాలు పట్టు. అక్కడ టైము దొరుకుతుందో లేదో తెలియదు.”

          అరగంటలో జీపు శేవంతి ఊరికి చేరుకుంది. సదాశివరావు కూతురిని దృష్టిలో ఉంచుకుని జీపుని గుడ్డతో ప్యాక్ చేయించాడు.

          “నాన్నా! ఇవాళ ఊళ్ళో ఇంత సందడిగా ఎందుకుంది? ఇంత పెద్దపెద్ద బళ్ళు……ఆర్మీ బండి కూడా ఉంది… ఇక్కడ ఎర్రదీపం బండికూడా ఉంది. ఇవాళ ఊళ్ళోకి పెద్దపెద్ద ఆఫీసర్లు వచ్చారు. ఏదో విశేషం ఉన్నట్టుంది.” సదాశివరావు ఏమీ మాట్లాడకుండా నేరుగా బండి నడుపుతున్నాడు.

          “నాన్నా! అటెక్కడికి? అటువైపు స్కూలు ఉంది. తిన్నగా ఇంటికి తీసుకెళ్ళు.” అయినా సదాశివరావు మౌనంగా ఉన్నాడు.

          జీపు స్కూలు గ్రౌండు దగ్గరికి చేరుకుంటోంది. ఒక కంఠస్వరం గట్టిగా వినిపిస్తోం ది…” ఉమేష్ మొహంతి అమర్ రహే!” బండి మూడువైపుల నుంచి దుప్పటితో ప్యాక్ చేసినప్పటికీ ఎదురుగా అద్దంలోంచి కనిపిస్తోంది. స్తంభాల పైన, గోడలకి కట్టిన జండాలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. వాటి మీద ఉమేష్ ఫొటో ఉంది. ఇంకా పెద్దపెద్ద అక్షరాలతో వ్రాసి ఉంది. “అమరవీరుడు ఉమేష్ మొహంతి”

          ఒక్క క్షణంలో ఆ సైనికుడి భార్యకి అంతా అర్థమైపోయింది. ఒక్కొక్క విషయం ఆమె స్మృతిపటలంలో రాసాగింది. హఠాత్తుగా ఆసుపత్రిలో టీవీ పాడైపోవడం, మొబైల్ నెట్ వర్క్ దొరక్కపోవడం, తండ్రి స్వీట్లు తేవడానికి వెళ్ళి ఉట్టిచేతులతో తిరిగిరావడం, తనకి ముఖం చాటువెయ్యడం, పిల్లవాడి అయిదోరోజు వంకతో తనని ఇక్కడికి తీసుకు రావడం 

          జీపులోంచి దిగుతూనే ఎదురుగా చెక్కపెట్టెలో త్రివర్ణపతాకతో చుట్టిన ఉమేష్ పార్థివశరీరం పెట్టివుంది. దానికి ఒకవైపుగా ఉమేష్ తల్లిదండ్రులు, దగ్గర బంధువులు నిలబడి ఉన్నారు. ఇది చూడగానే శేవంతి ఆర్తనాదం చేసింది. పరుగెత్తి వెళ్ళి చెక్కపెట్టె మీద పడిపోయింది. ఆమె తదేకంగా ఉమేష్ ని చూస్తూ అంది- “మీరు అబ్బాయి పుట్టి నందుకు వస్తానన్నారు కదా, నా కొడుకు నా ఎదురుగా నా ఒళ్ళో కళ్ళు తెరుస్తాడని అన్నారు కదా…. మరి మీరు ఒక సైనికుడై ఉండి మీరిచ్చిన మాట మధ్యలోనే విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? మా నాన్నగారు ఎలా ఉండేవారని మనబ్బాయి నన్ను అడుగు తాడు. వాడికి నేనేం చెప్పను? నాన్న ఒడిలో ఆనందం ఎలా ఉంటుందన్నది నేనేం చెప్పను?” ఇలా అస్ఫుటంగా ఏమేమో అంటూనే ఆమె స్పృహ తప్పిపోయింది. అందరూ ఆమెని స్పృహలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇంకా అంత్యక్రియలు జరుపవలసి వుంది. తన కూతురి పరిస్థితి అలా వుండటం చూసి సదాశివరావు తన గుండెలో బాధని సహించుకోలేక పోతున్నాడు. 

          కాలం అనేది ఎవరికోసమూ ఆగదు. ఉమేష్ పార్థివశరీరాన్ని చితిమీద ఉంచినప్పు డు ఆ రోజున భారతమాత కళ్ళలోంచి రక్త కన్నీరు కారుతోంది. అతని తండ్రి ఒకచేతిలో చితికి అంటించడానికి నిప్పుతో వున్న కర్ర, రెండో చేతిలో ఉమేష్ నవజాతుడైన కొడుకు. ఆ పసికందు చేతులతో తలకి కొరివి పెట్టే సంస్కారం పూర్తి అయింది. శిశువు ఈ ధరిత్రి పై రాగానే విధాత వాడిని జన్మమరణాల జంజాటంలో బంధించేశాడు. పుట్టిన సంతోషా న్ని, మృత్యువు శోకాన్ని వాడెరుగడు. ఒక అమరవీరుడి చితి భగభగా మండుతోంది. ఇద్దరు తల్లుల కడుపు (ఒకరు జన్మనిచ్చిన తల్లి, మరొకరు భారతమాత) తరుక్కుపో తోంది. ఒక సుమంగళి పసుపుకుంకుమలు శత్రువుల పరం అయ్యాయి. మరోపక్క టెంట్ లో మైకుతో ఉన్న సభలో ఆఫీసరు ఉమేష్ శౌర్యం గురించిన సంఘటనల గురించి చెబుతున్నాడు. సంతాప సందేశంతో బాటు ఒక ప్రకటన చెయ్యబడింది- “సైన్యం ద్వారా అమరవీరుడు ఉమేష్ మొహంతి భార్యకి సమస్త సౌకర్యాలతో స్కూలులో ఉద్యోగం ఇవ్వబడుతుంది.” ప్రకటన అప్పుడే పూర్తి అయింది. హఠాత్తుగా శేవంతి తను కూర్చున్న చోటు నుంచి లేచింది. తన మామగారి ఒడిలోంచి చంటిబిడ్డని తీసుకుంది. అయిదు రోజుల ఆ సద్యప్రసూత నడవలేక నడుస్తూ మైక్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. సదాశివరావు అవాక్కైపోయాడు.

          “ఈ పిల్లవాడికి ఇంకా కొన్నాళ్ళు తన కడుపు నింపుకునేందుకు నా అవసరం ఉంది. ఆ తరువాత నేను నెరవేరకుండా మిగిలిపోయిన నా భర్త కలలని పూర్తి చేయడానికి సైన్యంలో చేరాలనుకుంటున్నాను. నా భర్తకి దొరకకుండా తప్పించుకున్న శత్రువులని ఇప్పుడు నేను ఎదుర్కొంటాను.”

          సభ అంతా కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. ఆ తరువాత మిన్నుముట్టిన కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణం అంతా మారుమోగింది. దూరంగా నిలబడివున్న సదాశివరావు తన చెయ్యి పైకెత్తాడు. ఒక తండ్రి, ఆయనతో పాటు ఆ గ్రామస్థులు తమ కూతురిపట్ల  గౌరవసూచకంగా సెల్యూట్ చేస్తున్న భంగిమలో నిలబడివున్నారు.

***

డా. లతా అగ్రవాల్ – పరిచయం

26 నవంబరు 1966 న షోలాపూర్, మహారాష్ట్రలో జన్మించిన డా. లతా అగ్రవాల్`తులజ’ ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, విద్యావేత్త. ఎన్సిఇఆర్టీ, భోపాల్ లో లెక్చరర్ గా, వైష్ణవ యూనివర్సిటీ, ఇండోర్ లో బోర్డు మెంబరుగా, భోపాల్ యూనివర్సిటీకి అనుబంధ సంస్థ అయిన మిత్తల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, భోపాల్ కి ప్రిన్సిపాల్ గా, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో కౌన్సెలర్ గా పనిచేశారు. వీరి రచనలు ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రసారితమయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురిత మయ్యాయి. వీరి పుస్తకాలు 16 విద్యకి సంబంధించినవి, 7 కవితాసంకలనాలు, 12 బాల సాహిత్యం, 5 కథాసంకలనాలు, 7 మినీకథా సంకలనాలు, 3 నవలలు, 4 సమీక్షాగ్రంథాలు, 20 నాటికలు, 1 ఇంటర్ వ్యూల సంకలనం ప్రచురితమయ్యాయి. హిందీ కల్చరల్ ఆర్గనైజేషన్, టోక్యో, జపాన్ నుంచి `కళాశ్రీ’ సన్మానం, మారిషస్ హిందీ సాహిత్య అకాడమీ నుంచి `హిందీ సాహిత్యరత్న’ సన్మానంతో సహా అంతర్జాతీయ స్థాయిలో 4 సన్మానాలు పొందారు. 2 సార్లు కమలేశ్వర్ స్మృతి పురస్కారంతో బాటు జాతీయస్థాయిలో ఇంచు మించు 60 కన్నా ఎక్కువగా పురస్కారాలతో సన్మానింపబడ్డారు. ఉత్తమసాహిత్య సృజనకు 14 రాష్ట్రాల నుంచి సత్కారం పొందారు. డా. లతా అగ్రవాల్ భోపాల్ వాస్తవ్యులు.

*****

Please follow and like us: