మిట్ట మధ్యాహ్నపు మరణం- 31

– గౌరీ కృపానందన్

          అందరి గుండెలు ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకున్నాయి. అందరి చూపులు డి.సి. మీదే ఉన్నాయి. ఉమ తలెత్తి చూసింది. రాకేష్ చేతి నుంచి సిగరెట్ క్రింద పడిపో యింది. మణి గోళ్ళు కొరక సాగాడు. ఉదయకుమార్ తల గోక్కుంటూ చూశాడు. దివ్య రామకృష్ణ వైపు చూసింది. రామకృష్ణ మణి వైపు చూశాడు. మాధవరావు అందరినీ పరిశీలనగా చూస్తూ ఉండగా డి.సి. ప్రభాకరం చెప్పడం ప్రారంభించారు.

          “రాకేష్ ఈ హత్యను చేసి ఉంటాడు అని అనుమానం రావడానికి కారణం ఏమిటి?

          ఉమా! ఆరోజు మీరు ఎన్ని గంటలకి గది నుంచి బైటకి వెళ్ళారు?”

          “పదకొండూ ఇరవై ఉండవచ్చు సార్.”

          “తిరిగి వచ్చింది?”

          “పన్నెండు గంటలు. బాగా గుర్తు ఉంది. గడియారం చూసుకున్నాను.”

          “సరిగ్గా నలబై నిమిషాలలో హత్య జరిగింది. ఉమా! మీరు వెళ్ళేటప్పుడు మూర్తి తలుపులు గడియ వేసుకున్నారా?”

          ఉమ ఆలోచించింది.“వెళ్ళేటప్పుడు గడియ పెట్టుకోమని చెప్పాను. ఆయన నిద్ర మత్తులో సరే అన్నారు. ఈ విషయం మీకు ముందే చెప్పాను.”

          “ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళకి ఈ విషయం స్పష్టంగా తెలుసుకోవాలనే మళ్ళీ అడిగాను. అంటే హత్య చేసిన వాళ్ళెవరైనా సరే, మూర్తిని లేపి ఉండాలి కదా.” అందరినీ చూస్తూ అడిగారు.

          ఉదయకుమార్ మాత్రం తల ఊపాడు.

          “దారుణంగా చేయబడ్డ ఈ హత్య వెనక ఎంతో పగ, ప్రతీకారం ఉండాలి. మూర్తి లాంటి ధృడమైన వ్యక్తిని హత్య చేయడానికి హంతకుడికి చాలా బలం ఉండాలి.

          హత్య జరిగిన గది నంబరు 424. కారిడార్ లో రూం నంబర్లు ఒక వైపు సరి సంఖ్య, ఇంకో వైపు బేసి సంఖ్యలో ఉన్న గదులు ఉన్నాయి. 426 గదిలో ఉన్న వ్యక్తి మసాలా దోశకోసం ఆర్డర్ ఇచ్చి, దానికోసం ఎదురు చూస్తున్నాడు ఆ సమయంలో. 428 గదిలో ఒక హనీమూన్ జంట ఉన్నారు. వాళ్ళు శవాన్నిచూసి ఉమ పెట్టిన కేకలని విన్నారు. కాని అంతకు ముందు ఏ శబ్థమూ వినబడలేదని ఖచ్చితంగా చెప్పారు.

          హత్య చేయడానికి వచ్చిన మనిషి మూర్తిని లేపి ఉండాలి. హత్య జరిగిన సమయం లో మూర్తి మేల్కొనే ఉన్నాడు. మూర్తిని లేపింది రాకేష్ అని తెలుస్తోంది. అతని షూ గుర్తులు ఉన్నాయి. అతని తల వెంట్రుక ఒకటి మూర్తి శవం మీద దొరికింది. దీనిని గురించి బాగా ఆలోచించాము. మూర్తి హంతకుడితో పోరాడినప్పుడు అతని చేతుల్లో చిక్కుకు పోయి ఉండవచ్చు. అలా కాకుండా రాకేష్ మూర్తి మాట్లాడేటప్పుడు చేత్తో తలను దువ్వుకునేటప్పుడు అక్కడ పడి ఉండవచ్చు. ఆ అలవాటు రాకేష్ కి ఉన్నదని తెలుస్తోంది. తల వెంట్రుక, షూ ప్రింట్స్ మూర్తి గదిలోకి రాకేస్ వెళ్ళాడని నిరూపిస్తు న్నాయి. అంతమాత్రాన అతనే హంతకుడు అని చెప్పడానికి వీలు లేదు.

          426లోనూ 428లోనూ ఉన్న వాళ్ళకు ఎటువంటి శబ్దమూ వినబడలేదు ఎందుకు? మిట్టమధ్యాహ్న వేళలో అతడిని నిద్ర లేపి, క్రూరంగా కత్తితో పొడిచి చంపితే, అతను ఎదురు తిరగలేదా? కేకలు పెట్టలేదా?

          మూర్తిని రాకేష్ ఒంటరి మనిషిగా హత్య చేయడం అసాధ్యం. ఒకచేత్తో గట్టిగా నోరు మూసి, రెండో చేత్తో పది సార్లు కత్తితో పొడవడం అసాధ్యమైన పని. రాకేష్ చేసి ఉంటాడు అనుకుంటే అతనికి ఇంకొక వ్యక్తి సహాయం చేసి ఉండాలి. ఒకరు నోటిని మూయడానికి, ఇంకొకరు కత్తితో పొడవడానికి.

          ఇప్పుడు మాయా అన్న పదానికి వద్దాము. నిలువుటద్దంలో మాయ అని స్పష్టంగా రక్తంతో వ్రాసి ఉంది. ఎందుకు? ఈ నేరం చేసిన వ్యక్తి ఏదో విధంగా మాయా స్పోర్ట్స్ క్లబ్బు తో ముడిపడి ఉన్నాడని చెప్పడం కోసమా? పోలీసులని సవాలు చేయడానికా? కానీ ప్లాన్ చేసి హత్య చేసే వాళ్ళెవరూ ఇలా తాము పట్టుబడే విధంగా క్లూ వదిలి పెట్టి వెళ్ళరు.

          సో.. ఈ హత్య ముందే ప్లానువేసి చేయబడింది. ఒకరి కన్నా ఎక్కువ వ్యక్తులు చేసి ఉండాలి. పోలీసులను తప్పుదారి పట్టించడం కోసం, హంతకుడు మాయాగా, స్పోర్ట్స్ క్లబ్బుకు సంబంధించిన వ్యక్తిగా చూపించడానికి అలా వ్రాసి ఉండాలి.

          అలా అయితే రాకేష్ మాయా టీ షర్ట్ వేసుకుని మొదటి రోజు ఉమా మూర్తీలను వెంబడించాడు. మాకు ఫోటో కూడా దొరికింది. ఇలా పబ్లిక్ గా తిరిగి, మర్నాడు అలా నిలువుటద్దం మీద రాకేష్ వ్రాసి ఉంటాడు అనుకుంటే ఏదో ఒక గుండె ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం మాకు రాకేష్ దగ్గర కనబడలేదు.

          ఆ సమయంలోనే ఇంకో కోణంలో ఆలోచించాము. వేరే యిద్దరు వ్యక్తులు లేకపోతే గ్రూప్ మూర్తిని హత్య చేసి రాకేష్ మీద అనుమానం ఏర్పడే విధంగా ఇలా వ్రాసి ఉండ వచ్చు కదా. ఇలా ఆలోచిస్తే కొత్త ధియరీ ఒకటి రూపు దిద్దుకుంది.

          రాకేష్ మూర్తి దంపతులను వెంబడించినదంతా వాళ్ళు నోట్ చేసి ఉండాలి. వాళ్ళ  ప్లాను ప్రకారం మూర్తిని మరునాడు హత్య చేసే ముందు, రాకేష్ మూర్తి గదిలోకి వెళ్ళడాన్ని గమనించి ఉండాలి. అతను మూర్తితో మాట్లాడి వెళ్ళేవరకు వెయిట్ చేసి, తిరిగి వెళ్ళేముందు చూసినప్పుడు, అతన్నిమొదటి రోజు సాయంత్రం ఉమా మూర్తీలను వెంబడించిన వ్యక్తిగా గుర్తు పట్టి ఉంటారు. అతను వేసుకున్న మాయా టీ షర్ట్ గుర్తుకు వచ్చి ఉంటుంది.

          “సార్! అప్పుడు కూడా ఆ టీ షర్ట్ వేసుకున్నాను” అన్నాడు రాకేష్.

          “అలాగా. రాకేష్ గదిలో నుంచి బైటికి వచ్చిన తరువాత ఆ టీ షర్ట్ ని ఆ అక్షరాలని చూసి ఉంటారు. తరువాత ఇద్దరూ లోపలికి వెళ్ళారు. వాళ్ళప్లాన్ ప్రకారం ఒకరు అరవ కుండానోటిని మూసి, ఇంకొకడు కత్తితో పొడిచి, హత్య చేసిన తరువాత నిలువుటద్దంలో మాయ అని వ్రాసి వెళ్ళిపోయారు.

          వాళ్ళు ఎవరు? దాన్ని చెప్పే ముందు ఈ విధంగా హత్య చేయడానికి బలమైన కారణాలు ఉండాలి. సైకిక్మెంటాలిటి ఉన్న వ్యక్తులై ఉండాలి.

          రాకేష్ ని చూస్తే అతనికి కారణాలు బలంగా ఉన్నాయి. తాను ప్రేమించిన స్త్రీని మరొకడు పెళ్ళి చేసుకున్న ఒక్క కారణమే చాలు. మొదటి అనుమానితుడు రాకేష్!

          రామకృష్ణకి డైరక్ట్ గా కారణం ఏదీ లేదు. మిగిలిన దివ్య, మణి ఇద్దరికీ కారణాలు ఉన్నాయి. మణి సంవత్సరాల తరబడి ఉమ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి. లోలోపల ఆమెను ప్రేమించి ఉండవచ్చు. ఆమెను పెళ్ళి చేసుకున్న వ్యక్తి  మీద ద్వేషం ఉండటా నికి ఆస్కారం ఉంది. మణి హత్య చేయదగిన వాడేనా? అతను కొంచెం ఎక్సేంట్రిక్గా కనిపించాడు. తను చేసే నేరానికి భగవత్ గీతను ఆధారం చేసుకునే వ్యక్తి.

          అలాగే దివ్య! తనని పెళ్ళి చేసుకుంటానని చెప్పి, తనతో స్నేహంగా ఉన్న మనిషి, మాట మారిస్తే ఆ కోపం ఆమెలో ప్రతీకార జ్వాలను రేకెత్తించవచ్చు.

          హత్య ఆమె స్వయంగా చేయక పోయినా ఇంకొంకరి సహాయం తీసుకుని ఉండ వచ్చు. రామకృష్ణ యొక్క హెల్ప్! మూర్తిని హత్యచేస్తే తాను అతనికి చేరువ అవుతానని మభ్య పెట్టి ఉండవచ్చు.

          కాబట్టి ఈ హత్యను మణి రామకృష్ణ ఇద్దరూ కలిసి చేసి ఉండవచ్చునని ఆలోచిం చాము.

          మొదటగా మణి ఆ హోటల్లో ఉమ మూర్తిల కోసం రూమ్ బుక్ చేశాడు. వాళ్ళ హనీమూన్ సమయంలో అకస్మాత్తుగా ఆడిట్ కి బెంగళూరుకి వచ్చాడు. ఆ టూర్ తనే ఏర్పాటు చేసుకున్నది. దివ్య, రామకృష్ణ అదే హోటల్లో ఐదవ అంతస్తులో రూమ్ తీసు కున్నారు. కాబట్టి ముగ్గురూ ఆ గదిలో కలిసి పధకం వేశారు. రెండు కత్తులు ఉపయోగించ బడి ఉన్నాయి. మర్నాడు రాకేష్ ఆ గదిలో నించి వెళ్ళిపోగానే ఈ యిద్దరూ వెళ్ళి ఒకరు మూర్తిని పట్టుకోగా, మరొకరు కత్తితో పొడిచారు. కత్తితో పొడిచింది ఎవరు? మణియా? రామకృష్ణనా?”

          మణి కంగారుగా లేచి, “అన్నీఅబద్దాలు!” అని అరుస్తూ టేబిల్ మీద పిడికిలి బిగించిగుద్దాడు.

          “కూర్చోండి మణి. మిగిలినది కూడా వినండి.”

          రామకృష్ణ, “దీనిలో ఏ విషయాన్ని కూడా మీరు నిరూపించ లేరు” అని అరిచాడు.

          “ఉండండి. చెబుతాను. అన్నీ సరే. ఆ కత్తి రాకేష్ ఇంట్లో అతని బెడ్ రూములో దొరికింది. దాని సంగతి ఏమిటి అని అడగబోతున్నారు కదా.”

          “అవును. అదీ అసలు పాయింటు. మీరు ఇంకా దాన్ని నిరూపించ లేదు.”

          “ఆ కత్తి వ్యవహారం వీళ్ళ తెలివితేటలకి నిదర్శనం. రాకేష్ మీద సందేహం వచ్చేలా చేసి, నేరాన్ని పూర్తిగా అతని పై నెట్టడానికి వేసిన ఎత్తు. మీ ముగ్గురిలో ఎవరి ఐడియానో తెలియదు కాని వాళ్ళకి మా జోహార్లు!

          మిస్టర్ రామకృష్ణన్ తెలివిగా రాకేష్ ఇల్లు తెలుసుకుని అతని ఇంట్లో ఆ కత్తిని, బట్టలను దాచి వచ్చాడు. అవన్నీ అతనే చేసాడని మేము ఇంకా నిరూపించ వలసి ఉంది. నౌకరిని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారణ చేస్తున్నాము. కొంచం కొంచంగా పిక్చర్ క్లియర్ అవుతూ ఉంది.”

          “మైగాడ్! ఇది చాలా అమానుషం. మీరు దీన్ని నిరూపించలేరు.”

          “నిరూపించగలం రామకృష్ణా! నేను ఇంకా కేసు యొక్క కీలకమైన విషయానికి రాలేదు. దానికి ముందు ఈ కేసులో ఏర్పడ్డ మరో గందరగోళం గురించి చూద్దాం. అది రాకేష్ హోటల్ గదిలో స్టే చేసినప్పుడు గదిలో వదిలి పెట్టిన సిగరెట్ పాకెట్. దానిలో మాయా చెన్నై 4 అని వ్రాసి ఉన్నది, కబోర్డ్ పైన దొరికింది.

          దాని వలన చాలా ప్రాబ్లంస్ వచ్చాయి. తప్పు దారి పట్టాము. అన్నీ కలిసి రాకేష్ ని నేరస్తుడిగా నిలబెట్టాయి. రాకేష్! ఆ పేకెట్ మీద ఎప్పుడు వ్రాశారు?”

          “హత్య జరిగిన రాత్రి సార్. ఉమ గురించి ఆలోచిస్తూ సిగరెట్ కాల్చాను. మాయ అని నిలువుటద్దం మీద వ్రాసి ఉన్నట్లు విని ఉన్నాను. ఉమ వాళ్ళు ఉండేది చెన్నైలో మైలాపూర్ లో అంటే చెన్నై4 అంటే మైలాపూర్ ని సూచిస్తుంది కదా. మాయాకు చెన్నై నాలుగుకు ఏదైనా కనెక్షన్ ఉంటుందేమోనని ఆలోచిస్తూ సిగరెట్ పెట్టె మీద వ్రాసానను కుంటాను. ఆ తరువాత సిగరెట్ పాకెట్ ను ఎగరేసినప్పుడు అది కబోర్డు మీద పడిపోయి ఉంటుంది.”

          “అందువలన ఎంత గందరగోళం అయ్యిందో తెలుసా. రామకృష్ణ, మణి ఆ కత్తిని రాకేష్ ఇంట్లో దాచేశారు. ఒక ముఖ్యమైన విషయం మరిచిపోయారు. కత్తి మీద ఫింగర్ ప్రింట్స్ ని శుభ్రం చేయడాన్ని మర్చిపోయారు. దానిమీద మాకు క్లియర్ గా ఒక ఫింగర్ ప్రింట్ దొరికింది. ఆ వేలి ముద్ర మీదే రామకృష్ణా.

          అక్కడే ఈ కేసు బోల్తా పడింది. ఇంత సేపూ మా ఆలోచనలు అన్నీ రాకేష్ మీదే ఉన్నాయి. ఇక్కడ ఇలా మలుపు తిరగగానే మాధవరావు స్టన్ అయ్యారు. మొదటి సారిగా లాబ్ రిపోర్టు వచ్చినప్పుడు రాకేష్ వేలి ముద్రలతో కత్తి మీద ఉన్న వేలి ముద్రలుమ్యాచ్ అవలేదని మాత్రమే తెలిసింది.

          అప్పుడు కూడా మాధవరావు రాకేష్ని అనుమానించడం మానలేదు. కాని నిన్న అనుమానితుల ఫింగర్ ప్రింట్స్ తీయించి పోల్చి చూసినప్పుడు అసలు విషయం బయటపడింది. రామకృష్ణ మొదటి కత్తిని బాగా తుడిచాడు. రెండో కత్తి విషయంలో కొంచం నిర్లక్ష్యంగా ఉండిపోయాడు. ఆదర్వైస్ ఇట్వాస్ ఎ పర్ఫెక్ట్ మర్డర్.”

          రామకృష్ణ దిగ్గునలేచాడు. 

          మాధవరావు అతని దగ్గిరికి పరిగెత్తినట్లే వెళ్ళి గట్టిగా పట్టుకున్నారు.

          “నేనుగా చేయలేదు. ఈమే నన్ను చేయమన్నది” అన్నాడు రామకృష్ణ.

          “అయ్యో అయ్యో! అబద్దం! నాకూ దీనికీ ఏ సంబంధమూ లేదు ఎవరినైనా అడిగి చూడండి” అంది దివ్య.

          “రామకృష్ణే కత్తితో పొడిచాడు” అన్నాడు మణి.

          “లేదు లేదు. నేను నోటిమీద చెయ్యివేసి నొక్కి పట్టాను. మణి కత్తితో పొడిచాడు. నాకూ మూర్తికీ సంబంధమే లేదు. దివ్య నన్ను సాయం చేయమని అడిగింది.”

          “నేనేమీ అడగలేదు.”

          “రాక్షసీ! నువ్వేగా నాకు ఆశ పెట్టావు. సాయం చేస్తే స్వర్గ సుఖాలను చూపిస్తానని నన్ను ఊరించలేదూ.”

          “అబద్దం! అభాండం! నేను గుమ్మం దగ్గర నిలబడి ఎవరైనా వస్తున్నారేమోనని కాపలా కాసాను. అంతే.” దివ్య అంది.

          “చూడండి సార్. ఇద్దరూ నన్ను వాడుకుని ఇప్పుడు నేరాన్ని పూర్తిగా నా మీదికి నెట్టేస్తున్నారు.” పిచ్చి పట్టినవాడిలా అరిచాడు రామకృష్ణ.

          “నువ్వే!

          “నువ్వే!”

          “కాదు మీరిద్దరూ.”

          “షట్అప్!” ధృడంగా డి.సి. గొంతు వినబడింది.

          “మిస్టర్ మణి, మిస్టర్ రామకృష్ణ మీ ఇద్దరినీ మూర్తి హత్యానేరం క్రింద అరెస్ట్ చేస్తున్నాము. మాధవరావ్! కంగ్రాజులేషన్స్! చాలా బాగా పరిశోధించారు.”

          “ఆఖరున పప్పులో కాలేసాను సార్.”

          “అయ్యో! నేను కాదు. నేను చేయలేదు.” దివ్య అరవడం మొదలు పెట్టింది.

          “నీ వల్లే నేను చెడ్డాను.” రామకృష్ణ అన్నాడు.

          రాకేష్ దిగ్బ్రమ చెందిన వాడిలా అందరినీ చూశాడు. అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. “ఉమా! ఇలా రండి.” పిలిచాడు.

          ఉమ లేచి అతని దగ్గిరకి వెళ్ళింది.

          “ఉమా! నేనే హత్య చేసానని ఎప్పుడైనా నమ్మావా?”

          “అవును రాకేష్! నేను అందరిలాగే అనుకున్నాను.”

          “ఎలా అనుకోగలవు ఉమా? నీకు అలాంటి హాని నేను చేస్తానని ఎలా అనుకోగలి గావు? నేను నీ మీదనే నమ్మకం పెట్టుకున్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని, మిగిలిన వాళ్ళు అనుమానించినా, నువ్వు నన్ను అనుమానించ లేవు అని నమ్మకం పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ నమ్మకం కదా పోయింది.”

          “రాకేష్! సారీ.. మీకుకాస్త ఇబ్బంది కలిగింది.” అన్నారు మాధవరావు.

          “ఫరవాలేదు సార్. ఇంత గందరగోళం మధ్య నిజం అన్నది ఎలాగో ఒకలాగాబయట పడింది. కంగ్రాజులేషన్స్! నేను బయలుదేర వచ్చునా?”

          “యెస్. మీరు ఇప్పుడు ఫ్రీ అయిపోయారు.”

          “వస్తాను సార్. వస్తాను ఉమా!” రాకేష్ ఎర్రబడిన కళ్ళతో ఆ గది నించి నిష్క్రమిం చాడు.

          ఉమ ఒక్క క్షణం స్తంభించి పోయినట్లు అలాగే నిలబడి పోయింది. మరుక్షణం ఏదో ఒక తీర్మానం చేసుకున్న దానిలా రాకేష్ వెళ్ళిన వైపు పరుగెత్తింది.

          విశాలమైన, పొడవైన ఆ కారిడార్ లో రాకేష్ జేబు రుమాలుతో ముఖం తుడుచు కుంటూ వెళ్ళిపోతున్నాడు.

          “రాకేష్! రాకేష్! కాస్త ఆగండి.”

          “ఏమిటి?” అన్నాడు రాకేష్.

          “మీరు నాకు ఒకటి కొని ఇవ్వగలరా?” అడిగింది ఉమ.

          “ఏమిటది?”

          “కుంకుమ.”అంది.

*****

(సమాప్తం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.