అమ్మా! ఎత్తుకోవే

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-ఎం.వి.చంద్రశేఖరరావు

బెంగుళూరు.
హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ.
ఉదయం ఏడు గంటలు.
 
          “అమ్మా,ఎత్తుకోవే, నేను స్కూలు కెళ్ళనే”మారం చేస్తున్నాడు, ఐదేళ్ళ కల్యాణ్.
 
          “అలా అంటే ఎలా, స్కూలుకెళ్ళి, బాగా చదువుకుంటే, మంచి ఉద్యోగం వస్తుంది, బోల్ఢెన్ని చాక్ లెట్లు, బిస్కెట్లు కొనుక్కోవచ్చు”ఆశ చూపించింది,ఆద్య. కొడుకుని మెయిన్ గేట్ బస్ షెల్టర్  దగ్గరకు తీసుకెడుతూ.
 
          “ఐతే,నన్నెత్తుకు తీసుకువెళ్ళు”అన్నాడు, కల్యాణ్.
 
          “ఒరేయ్, నీ అల్లరి రోజురోజుకు పెరిగిపోతోంది, ఈ చేత్తో, నేను, నిన్ను ఎత్తుకోవడం
సాధ్యమయ్యే పనేనా” అంది, తన మొండిచెయ్యి చూపిస్తూ.
 
          “ఐతే, నేను స్కూలుకు  వెళ్ళను”మారాం చేస్తూ, అన్నాడు, కల్యాణ్.
 
          దూరంగా, వాకింగ్ చేస్తున్న అనురాగ్ , ఇదంతా గమనిస్తూ, ఆమె అవస్థకు జాలి పడుతూ, దగ్గరకు వచ్చి “పోనీ, నేను ఎత్తుకోనా” అని అడిగాడు, కల్యాణ్ ని, నవ్వుతూ.
 
          “నో,మా అమ్మే ఎత్తుకోవాలీ” అన్నాడు, కల్యాణ్.
 
          “వాళ్ళ నాన్నను, తీసుకురావల్సింది” అన్నాడు, ఆద్యతో.
 
          అనురాగ్ వంక చూస్తూ…”ఆయన మరణించారు” అంది, ఆద్య.
 
          “ఓ, ఐ యామ్ సారీ, నా పేరు అనురాగ్, కొత్తగా వచ్చాం, ఇక్కడకు” అన్నాడు, అనురాగ్.
 
          ఈ లోపల, అనురాగ్ భార్య అర్చన, వాళ్ళ దగ్గరకు వచ్చి ‘వెళ్దామా, అనురాగ్” అంది.
 
          అర్చనాను, ఆద్యకు చూపిస్తూ “నా శ్రీమతి అర్చన” అన్నాడు, అనురాగ్.. అర్చన, ఆద్య వంక చూస్తూ, “నమస్తే అండి”అంది, ప్రతి నమస్కారం చేస్తూ “చూడముచ్చని జంట మీరు” అంది, ఆద్య.
 
          “పద, స్కూలు బస్ వచ్చే టైమయ్యింది”అని తొందరచేసింది, కల్యాణ్ ను, ఆద్య.
 
          వాడు “ఎత్తుకోవే అమ్మా, లేకపోతే నేను స్కూలుకెళ్ళను” అని భీష్మించాడు.
 
          వాడిని చూసి నవ్వుతూ,ఎత్తుకుంటూ “పిల్లలులేని కొరత ఈ రకంగా  తీరింది” అంది, గేట్ వేపు నడుస్తూ, అర్చన.
 
          “అయ్యో, మీకెందుకు శ్రమ” అంది, ఆద్య నొచ్చుకుంటూ.
 
          “పర్వాలేదు, ఇందులో శ్రమేముంది, నా కోరిక తీరింది” అంది, అర్చన.
 
***
          కల్యాణ్ ను, స్కూలు బస్ ఎక్కించి, తిరిగి వస్తూ
 
          “ఊ, చెప్పండీ, మీ చెయ్యికేమయ్యింది” అని అడిగారు, అనురాగ్, అర్చనాలు.
 
          “నేను, నా భర్త అఖిల్ ఇద్దరం ఆర్మీ ఆఫీసర్లం. ఇద్దరం ప్రేమించి, పెళ్ళి చేసు కున్నాం ఒకరోజు LOC దగ్గర డ్యూటి చేస్తుండగా, చైనా కవ్వింపు దాడులు మొదలు పెట్టింది. పెట్రోలింగ్ చేస్తున్న, మా హెలీకాఫ్టర్ పై, మిసైళ్ళతో దాడిచేసింది. అప్పుడ ప్పుడు, ఇలా సరిహద్దులలో కవ్వింపు చర్యలు జరుగుతుంటాయి. ఆ మిసైళ్ళదాడికి, మా హెలీకాఫ్టర్ నేలకూలింది. నా భర్త , అఖిల్ అక్కడికక్కడే మరణించాడు. నా చేయ్యి
మోచేతి వరకు తీసేసారు” అంది,ఆద్య.
 
          “అయ్యో,అలానా,
మీరు, మీ భర్తలాంటి, వీరయోధుల త్యాగాల వల్లనే, మేమందరం, ఇలా సుఖంగా ఉన్నాము, ఈ యుధ్ధం కాని యుధ్ధం, కవ్వింపు చర్యలు, సరిహద్దు దేశాలు ఎందుకు చేస్తాయో, అర్ధంకాదు, ప్రతీ ఏటా అనేక మంది వీరజవాన్లు, ఈ కవ్వింపు చర్యలలో మరణిస్తున్నారు, పాపం, వారి కుటుంబాలు, రోజూ చాలా కష్టాలు పడుతున్నాయి” అని అన్నాడు, అనురాగ్.
 
          “ఇందులో త్యాగమేమీ లేదు, అది మా ఉద్యోగధర్మం, అంతే, ఆర్మీ ఉద్యోగంలో చేరినప్పుడే దేశం కోసం, మా ప్రాణాలు పణంగా పెట్టాం” అంది, ఆద్య.
 
          “మీ భార్యాభర్తలిద్దరూ ఆర్మీ ఆఫీసర్లవడం, ఈ అపార్ట్ మెంట్లోనే ఉండటం, మా కెంతో గర్వకారణం” అంది, అర్చన.
 
          “ఖాళీగా ఉన్నప్పుడు మా ఇంటికి రండీ” అని ఆద్యను ఆహ్వానించి, తమ ఫ్లాట్ నెంబరు చెప్పింది, అర్చన.
 
***
          ఇంటికి వచ్చినా, అనురాగ్ కళ్ళ ముందు ఆద్య, కల్యాణ్ లు, కనపడసాగారు, అనురాగ్ కు. దేశం కోసం ప్రాణాలొడ్డిన ఆ కుటుంబం అలా అవస్థపడటమేమిటీ?అన్పించింది.
 
          “అమ్మా,ఎత్తుకోవే “అన్న కల్యాణ్ మాటలు, చెవులలో ప్రతిధ్వనించసాగాయి.
     ఆలోచిస్తూ, వాట్సప్ చూస్తున్న అనురాగ్ , ఆ వాట్సప్ మెసేజ్ దగ్గర  ఆగిపొయ్యాడు. నగరంలోని ప్రముఖ సేవా సంస్థ, దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్ళు, చేతులు అమరుస్తున్నారు. కావల్సిన వాళ్ళు సంప్రదించండీ, అని వివరాలు ఇచ్చారు.
 
          “అర్చన, ఈ మెసేజ్ చూడు, వీళ్ళు కృత్రిమ కాళ్ళు, చేతులు అమరుస్తారట, ఆ చేతులతో, సహజ చేతులలానే, బరువులెత్త వచ్చు, కారు డ్రైవ్  చెయ్యవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు” అన్నాడు, అనురాగ్, ఆ మెసేజ్ చూపిస్తూ.
 
          ఆ మెసేజ్ చూసి అర్చన
 
          “పదండి, ఆద్యవాళ్ళ ఇంటికి వెడదాం, ఆ అమ్మాయికి సహాయం చేసినట్టు వుంటుంది” అంది, అర్చన.
 
***
          ఆ మెసేజ్ చూసి, ఆద్య “వీళ్ళు ఇలాగే ఉచితం అంటారు, కానీ, కనిపించని ఖర్చు లుంటాయి. హాస్పిటల్ లో ఎన్ని రోజులుండాలో, తీరా, కృత్రిమ చెయ్యి  పెట్టించు కున్నాక, అది పనిచేస్తుందో లేదో, మరి, హాస్పిటల్ లో ఉన్నంత కాలం, కల్యాణ్ ఎలా?” అని ఆనేక సందేహాలు వెలిబుచ్చింది, ఆద్య.
 
          “మీకా సందేహాలనవసరం, అవన్ని మేము చూసుకుంటాము, కృత్రిమకాలుతో అరుణిమసిన్హా, ఎవరెస్టు శిఖరాన్నే అధిరోహించింది, మీకే సందేహాలు అవసరంలేదు, కల్యాణ్ ను మేము చూస్తాం, దేశంకోసం ప్రాణాలొడ్డిన కుంటుంబానికి, ఆ మాత్రం సాయం చెయ్యటం, మా కనీస బాధ్యత” అన్నారు, అనురాగ్, అర్చన.
 
          ఎట్టకేలకు, ఆద్యను ఒప్పించి హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు.
 
***
          ఉదయం ఏడుగంటల ముప్పై నిముషాలు.
 
          అనురాగ్, అర్చనాలు వాకింగ్ చేద్దామని “సీ” బ్లాకు నుంచి కిందకు దిగారు. “ఏ” బ్లాకు నుంచి నల్లని గాగుల్స్ పెట్టుకొని, కొడుకును ఎత్తుకొని, ఒకావిడ లైట్ బ్లూకలర్ వోక్స్ వ్యాగన్ కారు దగ్గరకు వచ్చి, డోర్ తీసి, కొడుకుని ముందుసీట్లో కూర్చోపెట్టి, కారు స్టార్ట్ చేసింది.
 
          “అమ్మా, అనురాగ్ అంకుల్, అర్చనఆంటీల వల్ల నన్ను నువ్వు ఎత్తుకోవాలన్న నా కోరికా తీరిందీ, నువ్వు, మళ్ళీ ఇంతకాలానికి కారులో నన్ను స్కూలుకు కూడా తీసుకెడు తున్నావ్, నాకు చాలా హాపీగా ఉంది” అన్నాడు, కల్యాణ్.
 
          “అవును, వాళ్ళవల్లే నిన్ను ఎత్తుకోగలుగుతున్నాను, కారు డ్రైవ్  చేయగల్గు తున్నాను, నేను అందరిలా, మామూలు మనిషినయ్యాను”అంది, ఆద్య.
 
          ఈ లోపల అనురాగ్, అర్చనాలు వాకింగ్ చేస్తూ, ఎదురువచ్చారు. కల్యాణ్,
ఆద్యాలు వాళ్ళకి, ఆనందంగా, టాటా చెప్పి స్కూలుకు వెళ్ళారు.
 
          “ఇలా ఆద్యాను, కల్యాణ్ చూస్తుంటే, నాకు చాలా ఆనందంగా ఉంది” అంది,
అర్చన, కల్యాణ్ కు టాటా చెబుతూ.
 
          “దేశానికి అంకితమైన కుటుంబానికి, మనం అండగా నిలబడటం, ఆద్య, కల్యాణ్ ను ఎత్తుకోగలగటం, కారులో స్కూలు కెళ్ళడం, నిజంగా చాలా ఆనందించదగిన విషయం” అంటూ తనుకూడా కల్యాణ్ కు, టాటా చెప్పాడు, అనురాగ్.
 
          “ఆ పుణ్యం ఊరికేపోదు, త్వరలో మీరు కూడా తండ్రి కాబోతున్నారు” నవ్వుతూ, ఆనందంగా చెప్పింది, అర్చన.

*****

Please follow and like us:

3 thoughts on “అమ్మా! ఎత్తుకోవే (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

  1. పక్కన ఇంటి వారెవరు అన్నది తెలుసుకోని ఈ రోజుల్లో అందరూ ఒకేలా ఉండరు అని చెప్పడమే కాకుండా ఒక సందేశం ఇచ్చారు. బాగుంది చాలా

  2. కధ లో మంచి సెన్సిబిలిటీ ని చూపించారు రచయితా గారు. ధన్యవాదాలు!

  3. కథలో ఏదో సందేశాన్ని చెప్పాలనే తపన కనిపించింది. కానీ ఎక్కడో, ఏదో వెలితి కనపడుతున్నది కథనంలో. పక్కవారు ఎలా పోతే నాకేమిటి అన్న ధోరణి నుంచి, సాటివారికి సాయం చేయాలనే సందేశంతో కథ చక్కని ముగింపును ఇచ్చింది. రచయితకు అభినందనలు

Leave a Reply

Your email address will not be published.