ప్రమద

కథా సాహిత్యంలో విశిష్ట సంతకం- వాసిరెడ్డి సీతాదేవి

-పద్మశ్రీ

          వృత్తిపరంగా చేసే కొన్ని పనులు వ్యక్తి గత జీవితాన్నీ ప్రభావితం చేస్తాయి. మనసుకి హత్తుకుపోయి మరువలేని జ్ఞాపకాలుగా మిగులుతాయి. ఒక్కోసారి మన వ్యక్తిత్వాన్నీ ప్రభావితం చేస్తాయి. నాకు అలాంటి ఓ అపురూప జ్ఞాపకం వాసిరెడ్డి సీతాదేవిగారి పరిచయం.

          1992లో మొదటిసారి ఆమెను చూశాను. ఆ తర్వాత ఓ ఐదారుసార్లు కలిశానేమో! అందులో రెండుసార్లు ఈనాడు ‘వసుంధర కోసం, ఒకసారి ‘చతుర’ కథ వెనుక కథ శీర్షిక కోసం ఇంటర్వ్యూలు చేశాను. మరోసారి బెంగుళూరు నుంచి రచయిత్రి, సహకారోద్యమ నేత అయిన రుక్మాయీ సంపత్ వస్తే ఆమెను ఇంటర్వ్యూ చేయమని పిలిస్తే సీతాదేవి గారింటికి వెళ్ళాను. అప్పుడు నాకు ఎనిమిదో నెల. ఆమె పిలిచారని కాదనలేక వెళ్ళాను. చూసి చాలా నొచ్చుకున్నారు. నాకు చెప్పాల్సింది కదమ్మా… అన్నారు. మిమ్మల్ని కూడా చూడాలనే వచ్చానని చెప్పాను. లెక్కప్రకారం చూస్తే ఆమెతో గడిపింది కొద్దిపాటి సమయమే.

          పాత్రికేయురాలిగా పరిచయమై, ఆత్మీయురాలిగా మారిన నేపథ్యంలో అది గాఢమైన అనుభూతుల్నే మిగిల్చింది. ఆమె ఆగ్రహంతో మొదలు పెట్టి అనుగ్రహం వరకూ అన్నీ చవిచూశాను. మొదటిసారి ఫోన్ చేసి ఫలానా విషయం మీద మీ ఇంటర్వ్యూ కావాలని అడిగినప్పుడు… నా మీద, నా వృత్తి మీద అంతెత్తున ఎగిరారామె. పెద్దపేరున్న రచయిత్రి, ఇలా కోప్పడుతున్నారేమిటని భయపడ్డాను. నేను ఉద్యోగంలో చేరి అప్పటికింకా మూడు నెలలే. భయపడుతూనే వెళ్ళాను. ఆస్త్మా ఎటాక్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చిన మర్నాడే కళ్ళకలకలు వచ్చాయామెకు. సరిగ్గా అప్పుడే నేను వెళ్ళాను. ఆ పరిస్థితిలో కోపం సహజమేననిపించింది. తర్వాత చెప్పారామె. మరో పత్రికకు చెందిన జర్నలిస్టు మిత్రులు ఇంటర్వ్యూ చేసి ప్రచురించలేదట. ‘టైమ్ వేస్ట్ కదమ్మా. అసలే నాకు ఆరోగ్యం బాగోలేదు’ అన్నారు. దురదృష్టవశాత్తూ అప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూ కూడా ప్రచురితమవలేదు. ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన అంశం కాబట్టి ఏ క్షణమైనా పరిస్థితి మారవచ్చనీ ప్రచురణావకాశం ఉంటుందో ఉండదోననీ ముందే చెప్పాను. దాంతో నా పట్ల ఆమెకు సద్భావం ఏర్పడింది. ఆ తర్వాత కలిసినప్పుడు పత్రికలో వచ్చిన నా రాతల్లోని గుణదోషాలను వివరించి చెప్పేవారు.

జీవితమే సాహిత్యానికి ముడిసరకు

వ్యక్తిగా, రచయిత్రిగా సీతాదేవికి వేర్వేరు కోణాలు లేవు. ఎందుకంటే ఆమె జీవితమే ఆమె రచనకు ముడిసరకు. రచనలోనైనా, జీవితంలోనైనా తనకు నచ్చిందే చేశానని, నమ్మిందే రాశానని చెప్పేవారు సీతాదేవి. ఆమె గురించి వివరంగా తెలుసుకోవాలంటే కనీసం ఆరేడు దశాబ్దాల వెనక్కి వెళ్ళాలి. స్త్రీని పురుషుని ఆస్తిగా పరిగణించడం, ఇంటి నాలుగు గోడల మధ్యే ఆమెను బంధించడం అప్పటి సాంఘిక నీతి. ఆమె మాటల పై ఆంక్షలు… మనుగడ పై ఆంక్షలు. కట్టే బట్ట, పెట్టే నగ… ఏవీ ఆమె ఆనందం కోసం కాదు. అలాంటి సమాజంలో ఓ రైతు కుటుంబంలో పుట్టారు సీతాదేవి. తండ్రికి తన సేద్యమేమో తానేమో… మరో విషయం పట్టించుకునే తీరిక లేదు. తల్లికి మాత్రం తన బిడ్డ బాగా చదువుకోవాలని కోరిక…  సమాజమేమంటుందోనని భయం. ఎలాగైతేనేం ఐదో తరగతి వరకు చదివించింది. ఆరోతరగతికి వెళ్ళాలంటే స్కూలు మారాలి. వీధి దాటాలి. ఆడపిల్లకది కూడనిది కాబట్టి ఇంట్లో కూర్చోమన్నారు. అప్పుడు మొదలైంది చిన్నారి సీతాదేవి మనసులో తొలిప్రశ్న… మగపిల్లలకు లేని ఆంక్షలు ఆడపిల్లలకెందుకూ అని. ఆ తర్వాత ఆమె ప్రశ్నించని రోజు లేదు. ఈ ప్రశ్నించే క్రమంలోనే ఆమె రచనలకు పునాది పడింది.

బాల్యం చేదు జ్ఞాపకం

బాల్యం గురించి మాట్లాడుతూ ఓసారి ‘అందరూ బాల్యాన్ని ఆనందంగా గడుపుతారు. బాల్యం తాలూకు జ్ఞాపకాల్ని మధుర స్మృతులుగా పదిలపరుచుకుంటారు. కానీ నాకన్నీ చేదు జ్ఞాపకాలే. వయసుకి మించిన ఆలోచనలతో సతమతమయ్యే నేను బాల్యాన్ని ఏ మాత్రం ఎంజాయ్ చేయలేకపోయాను’ అన్నారు. తోటి ఆడపిల్లలు పేరంటాలని, పండగలని సరదా పడుతుంటే అవి ఆమెకు నచ్చేవి కావు. వద్దన్నా తల్లి వెండి పట్టాలు చేయించిందని వాటిని తీసుకెళ్ళి బావిలో పడేసి చావుదెబ్బలు తిన్నారటామె. మగవాళ్ళే  ఎప్పుడూ భార్యలను జుట్టుపట్టుకుని రోడ్డు మీదికి ఈడుస్తారెందుకు? భార్యలెప్పుడూ మొగుడ్ని బయటకు గెంట రెందుకు? కోనేట్లో ఎప్పుడూ ఆడవాళ్ళ శవాలే తేలతా యెందుకు? ఇటు వంటి సమాధానం దొరకని ప్రశ్నల గురించి ఆలోచనలతో అంతర్ముఖిగా మారారామె. అందరిలాంటి మామూలు జీవితం తాను గడపకూడదన్న గట్టి నిర్ణయమూ ఆ ఆలోచనల్లోంచే వచ్చింది.

కథతో ఊస్టింగ్! నవలతో రివర్షన్!!

హిందీ పరీక్షలు రాసి, స్నేహితురాలి సహాయంతో ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న సీతాదేవి తర్వాత ఏ మాత్రం కష్టపడకుండానే ఆ ఉద్యోగం పోగొట్టుకున్నారు. అప్పుడామె మద్రాసులో హిందీ టీచరుగా ఉద్యోగం చేస్తున్నారు. ‘రత్తమ్మ కష్టాలు’ అని ఆమె రాసిన కథ ఆ స్కూలు ప్రిన్సిపాల్ భార్యను దృష్టిలో పెట్టుకుని రాసిందేనన్న దుష్ప్రచారం జరిగింది. ఇంకేముంది? ఊస్టింగ్ ఆర్డర్ చేతి కందింది. అదృష్టవశాత్తూ అప్పటికే ప్రైవేటుగా ఎం.ఎ. పూర్తిచేయడంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం పోతేపోయింది కానీ నాకు చిన్న వయసులోనే రచన విలువ తెలిసింది… అని చెప్పారు సీతాదేవి ఓ సందర్భంలో. 1952 నుంచీ కథారచన మొదలెట్టారామె. 1954లో ‘వాసిరెడ్డి సీతాదేవి కథలు’ పేరుతో తొలి పుస్తకం ప్రచురితమైంది. నవల బహుళ ప్రజాదరణ పొందిన సాహితీ ప్రక్రియగా ఉన్న రోజుల్లో ఆమె రచనలు ప్రారంభిం చారు. విషయాన్ని ఎంచుకోవడంలో అప్పటివారికి భిన్నంగా తనదైన మార్గాన్నెంచు కున్నారు. చుట్టూ ఉన్న జీవితాన్ని కథల్లోకి లాగారు. మొట్టమొదటి నవల ‘వైతరణి’లోనూ ఆ తర్వాత రాసిన సమతలోనూ స్త్రీవాద దృక్పథం స్పష్టంగా కన్పిస్తుంది. సాయుధ విప్లవ నేపథ్యంతో రాసిన ‘మరీచిక’ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఉద్యోగం లో ఆమెకు రివర్షన్ ఇచ్చింది. తర్వాత హైకోర్టు ఉత్తర్వుతో నిషేధాన్ని ఎత్తివేశారు. ‘మరీచిక’ లో ఇద్దరు యువతులు ఒకరు సాయుధపోరాటం వైపు, మరొకరు హిప్పీ సంస్కృతి వైపు ఆకర్షితులౌతారు. అవగాహన లేకుండా ముందుకు సాగే యువతరం గురించి రచయిత్రి ఆవేదన ఇందులో కన్పిస్తుంది. ఇక వ్యవసాయ రంగ నేపథ్యంతో రైతుని కథానాయకుడిని చేసి సీతాదేవి రచించిన ‘మట్టిమనిషి’ నవల ఎందరినో కదిలించింది. రైతుకు భూమితో ఉండే అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించారామె. సాంబయ్య స్థానంలో మా తాతయ్యను ఊహించుకుంటూ నేనా నవల చదివానంటే అందులోని వాస్తవికతను అర్ధం చేసుకోవచ్చు. సీతాదేవి రచనలు చాలా వరకు హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదితమయ్యాయి. ఆంధ్రా పెరల్‌ బక్ అనీ, ఆడ కుటుంబరావనీ ఆమెను అభిమానంగా పిలుచుకున్నారు పాఠకులు.

ఆమెది ఒంటరిబాట

వేసిన దారి వెంట వెళ్ళడం సులభం, పైగా పదిలం… అంటారు శ్రీశ్రీ. కానీ సీతాదేవిది ఒంటరిబాట. తనకు తానుగా వేసుకుని నడిచిన బాట. ఆ దారిలో ఎదురుదెబ్బలు, గాయాలు సహజం. అయినా  వెనుదిరిగి చూడలేదు. ఎంత కష్టమైనా, ఎలాంటి సమస్య నైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవడం తప్ప ఎవరి చేయూతకూ ఎదురుచూడలేదు. ఈ క్రమంలో బాహ్యసంఘర్షణ కన్నా అంతః సంఘర్షణ ఎక్కువగా అనుభవించారామె. ‘ఇది నేను కోరి వరించిన మార్గం. వెనక్కి తిరిగి చూసే అలవాటు లేదు. ఈ యాత్రలో చేదు అనుభవాలున్నా ఆ చేదు నా మనసుకు తాకలేదు. చెడు గురించి బాధపడుతూ కూర్చోక ఎప్పటికప్పుడు అందులో నుంచి బయటపడడం గురించే ఆలోచించేదాన్ని. నా మార్గం లో నేను కొద్దో గొప్పో సాధించానేమో. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు దొరకాలంటే ఈ జీవితం చాలదు. గతం గురించి నాకెలాంటి ఫిర్యాదులు లేవు. వర్తమానంలో బతికాను. అలా బతకడమే మనిషిని సంతృప్తిగా ఉంచుతుందని నమ్ముతాను..’ అని చెప్పారు సీతాదేవి 2004లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.

మాట ప్రతిధ్వనిస్తుంటుంది

సీతాదేవిగారితో ప్రత్యక్షంగా గడిపిన సమయం కన్నా ఫోనులో మాట్లాడిన  సమయం ఎక్కువే. మొదటిసారి కలిసినప్పుడు తన రచనలు కొన్ని నాకిచ్చారు. తర్వాత ఎప్పుడో వాటిల్లో ఒకటి పునర్ముద్రణకివ్వడానికి తన దగ్గర కాపీ లేదంటే నా దగ్గరున్నది తీసుకెళ్ళి  ఇచ్చాను. ఎప్పు డైనా ఫోను మా పాప తీస్తే ‘అమ్మమ్మని చూడ్డానికి రావా’ అని అడిగే వారట. ఎప్పుడూ ఏదో ఒక ఇంటర్వ్యూ కోసమే వెళ్ళేదాన్ని. ‘ఆ పుస్తకమూ, పెన్నూ పక్కన పెట్టి ఒకరోజు కాస్త తీరిగ్గా రాకూడదూ. మీ ఆయన్నీ, పాపనీ తీసుకుని రా. నేను వంటలేమీ చేయలేనని నీకు తెలుసుగా. వంటమనిషి చేసిందే పెడతాను. మా వంటమనిషి హాఫ్ బాయిల్డ్ ఎగ్ బాగా చేస్తుంది…’ అని ఫోనులో ఆప్యాయంగా ఆమె పిలిచిన పిలుపు ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటుంది. ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించే అదృష్టాన్ని మాత్రం అంది పుచ్చుకోలేకపోయాను. ‘చతుర’ కథ వెనుక కథ శీర్షిక కోసం మరీచిక గురించి వెళ్ళిన సందర్భంగా ఫోటోలు తీస్తూ మా ఫొటోగ్రాఫర్ ‘ఇక్కడ నిలబడండి మేడమ్… తల ఇటు తిప్పండి…’ అంటూ సూచనలు ఇచ్చాడు. ఫోటో తీయగానే ఆమె అతన్ని వంగోమని సరదాగా మొట్టికాయ వేస్తూ… వాసిరెడ్డి సీతాదేవికి నువ్వు సలహాలిస్తావా? … అని నవ్వారు.

విశిష్ట పురస్కారాలు

అప్పటి సమైక్య ఆంధ్ర రాష్ట్రప్రభుత్వం తరఫున ఉన్న మూడు అత్యున్నత పురస్కారాలు సీతా దేవికి లభించాయి. తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం, ఆత్మగౌరవ పురస్కారం, హంస అవార్డు… ఈ మూడు అందుకున్న రచయిత్రి బహుశ ఆమె ఒక్కరేనేమో. 1971లో తొలిసారిగా ‘సమత’ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారామె. అకాడమీ తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనమయ్యాక మరో నాలుగు అవార్డులు లభించాయి. రెండు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ఇచ్చాయి.

సన్మానం నూతనోత్తేజాన్నిస్తుంది

రచయిత్రిగా ఐదు దశాబ్దాల కృషికి గుర్తింపుగా 1998లో హైదరాబాదులో సీతాదేవి సాహితీ స్వర్ణోత్సవం జరిగింది. ఆ సందర్భంగా చేసిన ఇంటర్వ్యూలో ఆమె ఇలా చెప్పారు… ‘చాలా కాలంగా నేనేమీ రాయడం లేదు. ఇంకా ఏం రాస్తాంలే అనుకుంటున్నప్పుడు ఈ సన్మానం మళ్ళీ రాయాలన్న ఉత్సాహాన్నిస్తోంది. పాఠకులు నా నుంచీ ఇంకా రచనలు ఆశిస్తున్నారనిపిస్తోంది. సన్మానాలు రచయిత బాధ్యతను పెంచుతాయి. రచయిత పూర్తిగా పరిణతి సాధించకమునుపు ఇలాంటి హడావుడి మంచిది కాదు కానీ కొంతకాలం తర్వాత అయితే రచయితలో నూతనోత్తేజాన్ని నింపుతాయి. అప్పుడు పేరుకోసం, డబ్బు కోసం రాయడానికి రచయిత భయపడాల్సివస్తుంది. సమాజం తన నుంచి ప్రయోజనకరమైన రచనలు ఆశిస్తోందని ఎరిగి మంచి రచనలు చేసే అవకాశం ఉంది’.

(ఈ వ్యాసం  2010 డిసెంబర్ నెల చతురలో మొదట ప్రచురితం అయింది.)

*****

Please follow and like us:

One thought on “కథా సాహిత్యంలో విశిష్ట సంతకం- వాసిరెడ్డి సీతాదేవి”

  1. వాసిరెడ్డి సీత దేవిగారి పై పద్మశ్రీ గారి విపులమైన ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారి జీవితం పై ఆసక్తి కలిగించే వ్యాసం ఇప్పుడే ఏక ధాటిగా చదివాను. వ్యాసం చాలా బావుంది అనటం చాలా చిన్న మాట. నా చిన్నప్పటి నుంచీ వింటున్న విన్నపేరు ప్రఖ్యాతలు ఆమెవి. వ్యాసం చదవ ఆరంభిస్తే మధ్య లో వదలానిపించ లేదు. అంత చక్కగా రాసారు జర్నలిస్టు పద్మశ్రీ గారు. ధన్యవాదములు.

Leave a Reply

Your email address will not be published.