యాదోంకి బారాత్-17

-వారాల ఆనంద్

గోదావరిఖని ఒక మజిలీ

మనిషి నిరంతర అవిశ్రాంత

ప్రయాణికుడు

లోనికీ బయటకూ..

అంతేకాదు

బతుకు బాటలో కొంత సవ్యమూ

మరికొంత అపసవ్యమూ

రెంటినీ సమన్వయము చేయడమే విజ్ఞత..

***

          అలాంటి చిన్న విజ్ఞత ఎదో మేల్కొని నేను బదిలీని అంగీకరించి గోదావరిఖని బయలుదేరాను. మనకు కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే ఇష్టం కలుగుతుంది.. అట్లే అయిష్టం కూడా. గోదావరిఖని విషయంలో అదే జరిగింది.

          ఎవరమయినా డైరీ రాయడం జ్ఞాపకాలు రాయడం వేర్వేరు అనుకుంటాను. ఎందు కంటే డైరీ ఏ రోజుకారోజు తేదీల వారిగా సమయాల వారిగా రాస్తూ పోతాం. అందులో సంఘటనలుంటాయి. కాలెండర్లాగా రాస్తూ పోతాం. కానీ బహుశా జ్ఞాపకాలు అట్లా కాదు. ఆయా కాలాల నాటి అనుభవాలు జ్ఞాపకాలయి ముప్పిరిగొంటాయి. అంతేకాదు వాటి ప్రభావాలూ అప్పుడప్పుడూ స్పురణకొస్తాయి. సంబరపరుస్తాయి. బాధపెడతాయి. ఆ క్రమంలో జ్ఞాపకాలు రాసేటప్పుడు తేదీల వారీగా క్రమంగా రాయలేకపోవచ్చు. తన్ను కొస్తున్న జ్ఞాపకాలు నేనంటే నేనని తోసుకొస్తాయి. అందుకే కొంచెం ముందూ వెనకా కావచ్చు. క్షమించాలి మరి.

          కరీంనగర్ నగరమే అయినా నియమిత ప్రాంతంలో వున్న జనం, పుట్టి పెరిగిన ప్రాంతం కావడంతో మనది మన సొంతం అనిపించేది. కానీ గోదావరిఖనికి వెళ్ళే సరికి అది చాలా చిత్రమయిన వూరు. విసిరేసినట్టున్న కాలనీలతో బోసి బోసిగా అనిపించింది. కానీ మార్కెట్, బాజార్ మాత్రం ఎప్పుడూ రద్దీనే. డ్యూటీ వేళకి కార్మికులు వెళ్తున్నప్పుడు రోడ్లన్నీ యమ రద్దీగా ఉండేవి మిగతా సమయాల్లో మామూలే. ఇక బస్ స్టాండ్ కు కూత వేటు దూరంలో మా కాలేజీ దాని పక్కనే డిగ్రీ కాలేజీ. జాయిన్ ఐనప్పుడు తెలిసిన వాళ్ళు తక్కువే. క్రమంగా స్నేహాలు కుదిరాయి. మాకు ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీలో బాటనీ ఫాకల్టీగా వున్న వెంకటేశంగారు అక్కడ వున్నారు. జంతు శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ ఆర్.కనకయ్యగారి దగ్గరి నుండి లైబ్రరీ చార్జ్ ఫార్మల్ గా తీసుకున్నాను. నా మొత్తం కారీర్ లో ఈ చార్జ్ తీసుకోవడం ఇవ్వడం పెద్ద గగనం అయిపొయింది. ఒక్కో బుక్ చూసి టిక్ చేసి తీసుకోవాలంటే నాతో అయ్యేది కాదు. విద్యార్థుల్ని పుస్తకాలు చదవడం పట్ల సాహిత్యం చదవడం పట్ల ఇన్ స్పైర్ చేయడం ఇష్టమయిన పని. బుక్స్ ఇవ్వడం తీసుకోవడం ఒకే. కానీ ఈ చార్జ్ గొడవలే బాగా ఇబ్బందిపెట్టేవి. కొన్ని చోట్ల మిత్రులే సర్దు బాటు చేస్తే మరికొన్ని సార్లు డబ్బులు కట్టాను. ALL IN THE GAME. ఇక గోదావరిఖని కాలేజీలో అంతా స్నేహంగానే వున్నారు. అందులో ఇద్దరు మాత్రం నా పై గొప్ప ప్రభావాన్ని చూపారు. ఒకరు ఫిజికల్ డైరెక్టర్ మధుసూదన్, మరొకరు సివిక్స్ అధ్యాపకు డు రమేష్ బాబు. మధు గొప్ప జిమ్నాస్ట్. వద్దేపల్లికి చెందిన వాడు. చాలా సరదా అయిన మనిషి. నన్నుఎంతగా ప్రభావితం చేసాడు అంటే నేను జిమ్నాస్ట్ పేర ఒక కథ రాసాను. అది వీక్లీలో వచ్చింది. మంచికథ అన్నారు. ఇక రమేష్ బాబు కరీంనగర్ లో తమ దగ్గరి బంధువు డాక్టర్ హైమవతి గారిని పరిచయం చేసాడు. తర్వాతి కాలంలో డాక్టర్ గారు మా ఇద్దరు పిల్లల విషయంలో ఎంత అండగా నిలబడ్డారో తర్వాత రాస్తాను. మేము ముగ్గుర మూ న్యూ అశోక టాకీసు వెనకాల గదుల్లో ఒక దాంట్లో కలిసివున్నాం. మా పక్కన డిగ్రీ అధ్యాపకుడు జగన్నాధాచారి గారు ఉండేవారు. మొదట్లో కొంత సక్రమంగానే కాలేజీకి వెళ్ళినా ఆదిలాబాద్ జిల్లా బోద్ కు చెందిన నారాయణ రావు గారు ప్రిన్సిపాల్ గా వచ్చిన తర్వాత ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. నాకు అప్పుడే పెళ్ళి అయింది. కొత్త పెళ్ళి కొడుకువి ఎందుకొచ్చావు పనిలేదా అని సరదాగా అంటూ పొమ్మనేవాడు.

          ఇది ఇట్లా వుంటే గోదావరిఖనిలో మరో వైపు నాకు లభించిన గొప్ప మిత్రుడు సుప్రసిద్ధ రచయిత శ్రీ తుమ్మేటి రఘోత్తం రెడ్డి. సింగరేణిలో సర్దార్ గా చేసేవారు. తాను నేను రెగ్యులర్ కలిసేవాళ్ళం. తనకు ఖాళీ వున్నప్పుడు కాలేజీకో రూముకో వచ్చేవాడు. తనకి ఓ రాజ్దూత్ బండి వుండేది దాని పై తిరిగే వాళ్ళం. అప్పుడే మార్కెట్ లో వున్న బండారి కిష్టయ్య పాన్ షాప్ గొప్ప కేంద్రంగా వుండేది. అన్ని పత్రికలూ రావడంతో పాటు అక్కడికి అందరూ వచ్చేవాళ్ళు. ఎంతమందిని కలిసానని. పిట్టల రాజేందర్, పిట్టల రవీందర్, టి.జగన్మోహన్ రావు ఇట్లా ఎందరో. జగన్ మోహనరావు గోదావరిఖని ఫిలిం సొసైటీని నడిపించేవారు. నేనూ రాఘోత్తంమ్ రెడ్డి గారు కూడా అందులో చేరి దాన్ని మరింత ప్రభావవంతం చేయడానికి కొంత కృషి చేసాం. ముఖ్యంగా రఘోత్తం బాగా చొరవ తీసుకున్నాడు. చాలా సినిమాలు టాకీసులోనూ కొన్ని సింగరేణి ఆఫీసర్స్ క్లబ్ లోనూ ప్రదర్శించాం. ఆపుడే మద్రాస్ లో జరిగిన Federation of film societies of India (SR) regional general body meeting కి నేనూ జగన్మోహన్ రావులము హాజరయ్యాం. కరీంనగర్ నుంచి డి.నరసింహా రావు, ఆర్ సుధాకర్ లు వచ్చారు. చాలా గొప్ప మీటింగ్. అప్పటి నుండి 30 సంవత్సరాల పాటు Federation of film societies of India తో వున్నాను. హైదరాబాద్ నుండి మొదట ఫిలిప్ బాధ్యుడిగా వుంటే తర్వాతి కాలంలో బి.హెచ్.ఎస్.ఎస్.ప్రకాష్ రెడ్డి గారు అన్నీ తానే అయి నడిపించారు నడిపిస్తున్నారు. మంచి సినిమాల గురించి ఆ సమావేశం నాకో గొప్ప కనువిప్పు.

          అప్పటి మద్రాస్ ఇప్పటి చెన్నయిలో ఆ సమావేశాలకు వెళ్ళినప్పుడు ఆత్మీయ మిత్రుడు కొడం పవన్ కుమార్ నాకు ఆతిథ్య మిచ్చాడు. తాను అప్పుడక్కడ AMIE కోసం వున్నాడు. పవన్ కూడా నాకు అత్యంత దగ్గరి వాడు. తాను కరీంనగర్ లో ఇంటర్ చదువు తున్నప్పుడు, నేను సిరిసిల్లాలో పనిచేసినప్పుడూ కూడా అన్ని విధాలుగా నాతోవున్నా డు. ఇక నాకు మద్రాస్ అంతా తిప్పి చూపించాడు. మిగాతా మిత్రులు తిరిగి వచ్చేసినా నేను అక్కడే రెండు రోజులుండి అనేక మందిని కలిసి వచ్చాను వస్తున్నప్పుడు నాతో పాటు వచ్చిన కొడం పవన్ తో కలిసి తిరుపతి దర్శనంచేసుకున్నాం. విజయవాడలో హాల్ట్ అయి పురాణం గారిని, మోహనప్రసాద్ గారిని కలిసి మరీ వచ్చాం.

          అయితే గోదావరిఖని ఫిలిం సొసైటీలో నేను తక్కువ సమయమే వున్నాను. కరీం నగర్ కు పోవడం రావడం ఆదివారాలు అక్కడ ఉండక పోవడం వలన రఘోత్తం ఎక్కువ శ్రమతీసుకున్నారు. తను అప్పుడు తిలక్ నగర్ లో ఉండేవాడు. వారి ఇంటికి కూడావెళ్ళే వాడిని. భోజనాలూ అవీ కూడా చేసేవాళ్ళం. తాను నాకు గొప్ప ఇన్స్పిరేషన్. తర్వాతి కాలంలో కూడా నా అనారోగ్య కష్ఠకాలంలో రఘు నా వెంటే వుండి అండగా నిలిచాడు. ఆయన ఋణం తీర్చుకోలేనిది.

          రచయితగా ఎన్నో విషయాలు చెప్పేవాడు. ఎందరో రచయితల గురించీ వివరించే వాడు. ఆయనతో మాట్లాడడం గొప్ప ఎడ్యుకేషన్.

***

          ఇక గోదావరిఖనిలో నేను కలిసిన మరో బంధువర్గ కుటుంబం రంగమ్మ అత్త వారిది. కరీంనగర్ లో మా మిఠాయి దుకాణం పక్కనే వున్న ఇల్లు వాళ్ళది. నాయనమ్మ సత్యమ్మ ద్వారా దూరపు చుట్టాలు. వారి అబ్బాయి కిషన్ బావ మొదట గోదావరిఖనిలో పెద్ద బట్టల షాప్ పెట్టారు. తర్వాత టీచర్ గా పనిచేసాడు. పలుసార్లు వారింటికి షాప్కి వెళ్ళే వాణ్ని.

          అట్లా గోదావరిఖనిలో కాలం ఆడుతూ పాడుతూ గడిచింది. చివరిలో పీడీ మధు వాళ్ళది వరంగల్ వడ్డేపల్లి గనుక వరంగల్ ఆర్ జేడీ ఆఫీసులో కొంత పలుకుబడి వుండే ది. తాను వరంగల్ కు నేను చొప్పదండి కాలేజీకి బదిలీ రిక్వెస్ట్ పెట్టాం. నేను దరఖాస్తు పంపి మర్చిపోయాను. మధు తానే దగ్గర వుండి నా ఆర్డర్ పంపించి నాకు కబురుచేసాడు. ఇక ఏముంది అక్కడి నుంచి చొప్పదండి చేరుకున్నాను కరీంనగర్ కు దగ్గరే.

          అట్లా ముగిసిన గోదావరిఖని ప్రస్థానంలో రెండు వార్తలు ఓ కుదుపు కుదిపాయి. ఒకటి పెద్దపల్లి బస్ స్టాండ్ లో ఆగినప్పుడు సిరిసిల్లాకు చెందిన ఒక పాత విద్యార్తి కలిసి నాకు ఆప్తుడు అయిన విద్యార్తి నారాయణను కామారెడ్డిలో ఎన్కౌంటర్ చేసారని చెప్పి వెళ్ళిపోయాడు. హతాశున్నయ్యను. ఆ షాక్ నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అది కూడా ఓ కథ రాసాను. ఇక మరో సంఘటన అప్పటి పెద్దపల్లి డీ.ఎస్.పీ. బుచ్చిరెడ్డి ని నక్సల్స్ కాల్చివేయడం. ఆ సంఘటన నన్నే కాదు మొత్తం జిల్లానే కుదిపే సింది.

***

“గ్రామీణ చలన చిత్రోత్సవం” పోరండ్ల

కలవడం విడిపోవడం, అదో క్షణం ఇదో క్షణం

కలిసిన సంతోషం, వీడిన దుఖం,

కానీ

జ్ఞాపకమే వెన్నంటి వుండే నీడ…

          జీవన గమనంలో ఎందరినో కలుస్తాం, విడిపోతాం. ఎన్నో పనుల్లో మునిగిపోతాం. కొన్ని మనతో దశాబ్దాల పాటే కాదు జీవితాంతం అట్లా ఉండిపోతాయి. అప్పటిదాకా సాహిత్యం కవిత్వం ఆలంబనగా గడిచిన నా జీవితంలోకి ఏ క్షణం ఆర్ట్ సినిమా అన్న అర్థవంతమయిన సినిమా ప్రవేశించిందో కానీ అప్పటి నుండీ “వీక్షణం ప్రదర్శనం” భాగం అయిపొయింది. అది ఒక ఉద్యమంలా ఉండిపోయింది. క్రమంగా సినిమా సాహిత్యాలు మాత్రమే కాదు అన్ని కళారూపాలూ ఒకటేనని అవన్నీ మానవ వ్యక్తీకరణలో భిన్న రూపాలని అర్థం కాసాగింది. ఒకసారి నా కార్యక్షేత్రం కరీంనగర్ కు మారిన తర్వాత ముఖ్యంగా కరీంనగర్ ఫిలిం సొసైటీ నా జీవితంలో దాదాపు అంతర్భాగమయి పోయింది.

***

కలల లోకం లోంచి వాస్తవ ద్వారం గుండా

విశ్వం లోకి చేసే ప్రయాణమే

‘కళ’

——

కళా సృష్టి అనేది

మనసుకు అంటిన మాలిన్యాన్ని తొలగించి

ప్రతిమను రూపొందించడం లాంటిది

***

          ఇట్లా భావిస్తూ కరీంనగర్ లో ఫిలిం సొసైటీలో చురుకుగా పాల్గొనడం మొదలు పెట్టాను. 1984-85 ల నుంచీ సెలవోస్తే చాలు ఉదయాలు నారాయణ రెడ్డి లక్ష్మి సానిటరీ షాపులో పాత మిత్రులతోనూ, సాయంకాలాలు గడియారంకాడ వున్న రేణికుంట రాములు గారి బాలాజీ డ్రెస్సెస్ లోనూ మా అడ్డ. మొదట్లో నారాయణ రెడ్డి షాపులో టీలు మాత్రం తాగేవాళ్ళం. దామోదర్, అయ్యగారి వెంకన్న ఒక్కసారి చింతకింది వేణు ఇట్లా పాత స్నేహితులం కలిసి గప్పాలు కొట్టడం అంతే. ఇక సాయంకాలాలయితే రాములు సార్ దగ్గర నేనూ, నరెడ్ల శ్రీనివాస్, డి.నరసింహా రావు, గోపు లింగా రెడ్డి, కొండా వేణుమూర్తి, ఉప్పల రామేశం, ఆర్.సుధాకర్, నారదాసు లక్ష్మన్ రావు ఇట్లా అనేక మంది ఫిలిం సొసైటీ కార్యర్తలం కలిసేవాళ్ళం. కొంచెసేపు ముచ్చట్ల తర్వాత గడియారం కాడే వున్న ‘మామాజి జిలేబివాలా’ దగ్గర జిలేబీలో, జాంగ్రీలో కానిచ్చి సెలవు తీసుకునే వాళ్ళం. ఇక ఆదివారాలయితే వెంకటేశ్వర టాకీసులో ఉదయం 8 గంటలకే సినిమా తర్వాత దాని మీద చర్చలు. ఇట్లా కొనసాగేవి మా రోజులు. అప్పటి కలెక్టర్ పరమహంస, జిల్లా పరిషద్ చైర్మన్ కేతిరి సాయిరెడ్డి మా కఫిసోకు పూర్తి అండదండలుగా వుండేవాళ్ళు. అప్పుడు మమ్మల్ని ముందుండి నడిపించిన వాళ్ళు శ్రీనివాస్, నరసింహా రావు గార్లు. నేనేమో మొదటి నుంచీ చదవడం అలవాటు వున్నవాన్ని కావడంతో సాహిత్య అధ్యయనంతో పాటు సినిమాకు సంబంధించిన పత్రికలూ, దేశంలోని వివిధ ఫిలిం క్లబ్స్ వెలువరించే బులెటిన్స్ ఎక్కువగా చదివేవాన్ని. అదే సమయంలో స్క్రీన్ లోనొ ఎక్కడో ఒక వ్యాసం చదివాను. ‘రూరల్ ఫిలిం ఫెస్టివల్ ఇన్ హేగ్గోడు’ అని. అది నన్ను బాగా ఆకర్షించింది. అప్పుడు ఇంటర్నెట్ లేదు సమాచారం కోసం. ఎం చేయను, మరింత లోతుగా దాని గురించి వివిధ పత్రికలూ బెంగలూరు సుచిత్ర వాళ్ళ పత్రిక చదివాను.

          “నినాసం” ఓ గొప్ప ప్రయోగం, విశిష్ట ప్రయత్నం. విశేష ఫలితాల్ని ఇచ్చిన కళాత్మక కృషి. హేగ్గోడు అన్న చిన్న గ్రామం కర్నాటకలోని సాగర్ తాలూకాలో వుంది. అక్కడ 1949 లో స్థాపించబడ్డ ‘నినాసం’( నీలకంటేశ్వర నాట్య సంఘ) ఒక విలక్షణ సంస్థ. నాటకం దాని ప్రాధాన శ్వాస, కార్యవేదిక. కానీ సాహిత్యం సినిమాలు కూడా ఆ సంస్థకు రెండు రెక్కలు. నినాసం వ్యవస్థాపకుడు కే.వి.సుబ్బన్న. కన్నడ నాటక, సాహిత్య, సినిమా రంగాలకు ఆ సంస్థ చేసిన సేవ అందించిన ఫలాలు అనితర సాధ్యాలు. సుబ్బన్న చేసిన కృషికి ఆయనకు మెగసేస్సే అవార్డు, సంగీత నాటక అకాడెమీ అవార్డు, సాహిత్య అకాడెమీ అవార్డుతో పాటు పద్మశ్రీలు కూడా వచ్చాయి. ఆయన ఆ పల్లెలో నిర్వహించిన నాటక, సినిమా ప్రదర్శనలు, ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులు అత్యంత ప్రభావంత మయినవి. ఆ కాలంలో హేగ్గోడుకు వెళ్ళని భారతీయ నటులు దర్శకులు లేరు. అత గొప్ప కృషి ఆయనది. ఆ విశేషాలన్నీ చదివిన నేను ఒక రోజు సాయంత్రం మా జిలేబీ ఆరగించే సమయంలో నరెడ్ల శ్రీనివాస్ తో ఈ విశేషాలన్నీ చెప్పాను. మనమూ ఒక రూరల్ ఫిలిం ఫెస్టివల్ చేస్తే అని మాట ముగించానో లేదో ఎంతో ఉత్సాహవంతుడు గొప్ప కార్యకర్త అయిన శ్రీనివాస్ వెంటనే చేద్దాం అన్నాడు. ఏ వూర్లో అన్న ప్రశ్న వచ్చింది. పక్కనే వున్న కోమటిరెడ్డి దామోదర్ రెడ్డి మా వూర్లో అన్నాడు. అంటే పోరండ్లలో. ఇంకే ముంది నిర్ణయాలు చకచకా జరిగిపోయాయి. రే ‘పతేర్ పాంచాలి’, కురుసోవా’ రాషోమన్’, డే సి కా ‘బిసికిల్ తీఫ్’ వేద్దామని నిర్ణయించాం. ప్రొజెక్టర్ల కోసం అనుమతుల కోసం శ్రీనివాస్, నరసింహారావు సర్, గోపు లింగారెడ్డిలు కదిలారు. పరమహంస సాయిరెడ్డిలు తాము మీ వెంటే ఉన్నామన్నారు. దామోదర్ వాళ్ళ బాపు కే.వెంకట్ రెడ్డి గారు అప్పటికి సహకార శాఖలో అధికారి. ఆయన పోరండ్లలో ఆతిథ్యం మా ఇంట్లో అన్నారు. ఇంకే ముంది అదొక ఊపు. నారదాసు లక్ష్మణరావు, గోపు అన్నా రెడ్డి, నారాయణ రెడ్డి, సుధాకర్, రాజమౌళి, వేణు మూర్తి ఒకరేమిటి అంతా కదిలారు. సినిమాల కోసం ప్రయత్నం. ప్రింట్స్ వచ్చాయి. పోరండ్లలో 12,13,14 అక్టోబర్ 1985 తేదీల్లో గ్రామీణ చలన చిత్రోత్సవం. ఫెస్టివల్ ఏర్పాట్లల్లో దామోదర్ అన్నీ తానే అయి ఏర్పాట్లు చేసాడు.

          మిగతా వారి సంగతేమో కానీ కరీంనగర్ లో పుట్టి పెరిగిన నాకు జీవితంలో మొట్ట మొదట పరిచయమయిన వూర్లు రెండు ఒకటి మా పెద్దమ్మ వాళ్ళ వూరు ‘కిష్టాపూర్’ అయితే రెండవది నా చిన్ననాటి మిత్రుడు అంతర్ బహిర్ ప్రాణాల్లా మెలిగిన దామోదర్ వాళ్ళ పోరండ్ల. ఆ వూర్లో వాళ్ళ మిద్దె ఇల్లు పొలాలు అన్నీ నాకు బాగా నచ్చేవి. మొదటి సారి పోరండ్లకు దామోదర్ చెల్లె సరోజ పెళ్ళికి వెళ్ళాను. పక్కనే వున్న మరో గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డితో తన పెళ్ళి. అది నాకు ఆ వూరి మొదటి జ్ఞాపకం. మరోటి దామోదర్ వాళ్ళ బుర్ర మీసాల తాత. భలే వుండే వాడాయన. ఎన్నో సామెతలు ముచ్చట్ల తో అలరించే సరదా మనిషి. మీరంతా పిల్లగాండ్లు ఏందో అనుకుంటరు గని “ ఆ ఏముం దోయి దీపమార్పేస్తే దిసుసంతా ఒక్కటే” అన్న ఆయన వాక్యం ఇప్పటికీ నా జ్ఞాపకంలో స్థిరంగా ఉండిపోయింది. ఎంతో నవ్వొస్తుంది. దామోదర్ వాళ్ళ బాపు మాత్రం ఎంతో గంభీరంగా వుండేవారు.

అలాంటి పోరండల్లో గ్రామీణ చలన చిత్రోత్సవం అనేసరికి ఉత్సాహం కలిగింది. 12 అక్టోబర్ సాయత్రం అప్పటి కలెక్టర్ కే.ఆర్.పరమహంస, జిల్లా పరిషద్ చైర్మన్ కేతిరి సాయిరెడ్డి లు అతిథులు. 

పౌరసంభందాల శాఖ వారి సహకారంతో 16 ఎం ఎం ప్రొజెక్టర్లు వచ్చాయి. కలెక్టర్ పరమహంస గారు గొప్ప ఉపన్యాసం ఇచ్చారు. పల్లెలు కళలు అన్న అంశం మీద బాగా మాట్లాడారు. తర్వాత మొదటి సినిమాగా సత్యజిత్ రే ‘పతేర్ పాంచాలి’ ప్రదర్శించాం. అప్పటిదాకా కేవలం న్యూస్ రీళ్ళు మాత్రమే చూసిన ఆ వూరి ప్రజలకు పాత్రలున్న ఒక సినిమా అదీ తమకు ఎలాంటి పరిచయం లేని అర్థం కాని బెంగాలీ సినిమా. స్పందన ఎట్లా వుంటుందోనన్న భయం మా అందరి లోపలా వుంది. కానీ సినిమా ముగిసిన తర్వాత నేనూ శ్రీనివాస్, నారదాసు లక్ష్మణరావు సినిమా చూసిన ఒక్కొక్కరి దగ్గరికీ వెళ్ళి అభిప్రాయాలు అడగడం మొదలు పెట్టాం. నా టేప్ రికార్డు ఆన్ చేసి రికార్డు చేసాం. ‘ఏముంది సారూ అంతా మా బతుకుల్లెక్కనే వుంది..మమ్ముల్ని మేము చూసు కున్నట్టే వుంది” అని వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆశ్చర్యపోవడం మా వంతు అయింది. మన తెలుగు మాటలు కావు కదా అంటే ఆ వూరు మనుషుల్ని చూస్తూ వుంటే ఇంక మాటలెం దుకు సారూ అన్న మాట విని నిజంగా గొప్ప సినిమాకు మాటలెందుకు ప్రతిభావంత మయిన ప్రభావవంతమయిన దృశ్యమే దాని భాష కదా అనిపించింది. నలు దిక్కులా వెళ్ళి అభిప్రాయాలు సేకరించిన మా రాజమౌళి, లింగా రెడ్డి, సుధాకర్ ల అందరి అనుభవమూ ఒక్కటే. ఆ మూడు రోజులూ అదే ఫలితం. అది ఏ దేశసినిమా, ఏ భాషా సినిమా అన్నది ఆ వూరి వాళ్ళకు ప్రధానం కాలేదు. అర్థం చేసుకోవడానికి భాష అడ్డంకీ కాలేదు. బాగా అర్థం చేసుకున్నారు. ఆ సినిమాలల్లో తమని తాము చూసుకున్నారు. చాలా సంతోషం వేసింది. స్థానిక పత్రికల్లో ఎదో రాసారు కానీ అప్పటికి ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటిసారి నిర్వహించిన రూరల్ ఫిలిం ఫెస్టివల్ కి రావలసినంత పేరు గుర్తింపూ రాలేదు. మేము కూడా పని జరగడమే ముఖ్యం తప్ప ప్రచారం అంత ముఖ్యం కాదనే భావనతో వున్నాం కనుక పెద్దగా ప్రయత్నాలూ చేయలేదు. IT WAS AN EXPERIMENTAL FILM FESTIVAL. గొప్ప సంతృప్తిని ఇచ్చింది. తర్వాత కొన్నేళ్ళకు మేమే గ్రామీణ బాలల చిత్రోత్సవం జిల్లాలోని అనేక గ్రామాల్లో నిర్వహించాం

***

తెలియకుండానే మనసు పొరల్లో కొన్ని మరుగున పడతాయి

కానిగిరి పాఠాలూ, కన్న కలలూ, తొలి ప్రేమలూ

కాల గమనంలో అట్లా కలిసిపోతాయి, మనమిట్లా మిగిలిపోతాం

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.