వలస పక్షులు

-కందేపి రాణి ప్రసాద్

          సరస్సు అంతా నీటి పక్షులతో కళకళ లాడుతోంది. సరస్సు అంటే మామూలు సరస్సు కాదు. ప్రఖ్యాతమైన పులికాట్ సరస్సు. ఇది దేశంలోనే రెండవ పెద్ద సరస్సు. సరస్సు లోపలేమో చేపలు రొయ్యలు గిరగిరా తిరుగుతూ సయ్యాటలాడుతున్నాయి. నిళ్ళ మీదనేమో అనేక పక్షులు ఎగురుతూ, దూకుతూ ఆటలాడుతున్నాయి. పెలికాన్ లు, కార్మోరాంట్ లు, స్పాట్ బిల్డ్ డక్ లు, పెయింటెడ్ కొంగలు, గ్రే హేరాన్లు, చిన్న ఎగ్రైట్లు వంటి ఎన్నో పక్షులు ఈ సరస్సులో సేద తీరుతాయి.
 
          పులికాట్ సరస్సులో ఒక బాతు తన పిల్లలతో నివసిస్తోంది. చల్లని నీటిలో నాట్యం చేస్తూ గెంతుతూ ఆట లాడుతుంటాయి. పిల్లలకు భలే సరదాగా ఉంటుంది అంతేకాక ప్రతి సంవత్సరం వలస వచ్చే ఫ్లెమింగోలను చూస్తూ కూడా సంతోషపడతాయి. చిన్న చిన్న సరస్సుల నుంచి వచ్చిన బాతు పిల్లల స్నేహితులు ఎన్నో విషయాలు చెప్పాయి. మిగతా సరస్సులు పులికాట్ వలె పెద్దగా ఉండవంట. అలాగే కొన్ని సార్లు నీళ్ళు కూడా ఉండవట. ఆహారం దొరకక ఇబ్బంది పడతాయట. తర్వాత నీటీ పక్షులకు ఎక్కువ లోతు లేకుండా ఉంటేనే బాగుంటుందట. ఇవన్నీ విన్నాక బాతు పిల్లలు చాలా సంతోషపడ్డా యి. తాము పెద్ద సరస్సులో, మంచి ఆహారం దొరికే సరస్సులో పుట్టినందుకు  ఆనంద పడ్డాయి.
 
          ఈశాన్య ఋతుపవనాలు ప్రారంభంకాగానే ఈ పులికాట్ సరస్సుకు ఫ్లెమింగో పక్షులు వేల సంఖ్యలో వలస వస్తాయి. ఆ పక్షులు ఎంత అందంగా ఉంటాయో! గులాబీ రంగు ఒంటితో, పొడవాటి కాళ్ళతో, ఎస్ ఆకారంలో వంపు తిరిగిన మెడతో అందంగా వయ్యారంగా నడుస్తూ ఉంటాయి. సరస్సు జలాల మీద పొడవాటి కాళ్ళతో వయ్యారంగా ‘రాంప్ వాక్’ చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు. అంతేకాదు ఈ ఫ్లెమింగోలను చూడటానికి మానవులు విపరీతంగా వస్తారు. అలా పులికాట్ సరస్సు సందడిగా  ఉంటుంది.
 
          పులికాట్ సరస్సులో పుట్టిన పక్షులన్నిటికీ ఫ్లెమింగోలు రావడం చాలా ఇష్టం. అది ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. కాబట్టి ఆయా సముద్రాలు, ఎడారులు, ద్వీపకల్పాల గురించి ఎన్నో విషయాలు చెబుతాయి. అందుకే చాలా పక్షులు ఫ్లెమింగోల రాక కోసం, వాటి స్నేహం కోసం ఎదురు చూస్తూంటాయి. శీతాకాలాల్లో గుజరాత్ నుంచి వచ్చే ఫ్లెమింగోలు పిల్లల్ని పెడతాయి ఆ తర్వాత పిల్లలతో సహా తమ ప్రాంతాలకు ఎగిరి వెళతాయి. ఫ్లెమింగోలు నడుస్తుంటే పొడవాటి కాళ్ళతో ‘క్యాట్ వాక్’ చేస్తున్నట్లే ఉంటుం ది. గులాబీ రంగుతో మెరిసే వాటి శరీర వర్ణం చూస్తే అన్ని పక్షులకూ మతిపోతుంది.
ఈ విషయాలన్నీ విన్నటువంటి బాతు పిల్లలకు ఎప్పుడెప్పుడు ఫ్లెమింగోలు వస్తాయా అని ఎదురు చూడసాగాయి. అమ్మా నాన్నలను రోజూ అడుగుతున్నాయి.
 
          “అమ్మా! పులికాట్ సరస్సంతా పింక్ కలర్ లో కనిపిస్తుందట కదా! ఫ్లెమింగోలు ఎప్పుడోస్తాయి” అని బాతు పిల్లలు అమ్మను అడిగాయి.
 
          “మీరు చెప్పింది నిజమే నాన్నా సరస్సు మీద ఫ్లేమింగోలు వరసగా సందడి చేస్తూంటే వాటిని చూడటానికొచ్చే మనుషుల హడావిడి కూడా బాగుటుంది. కానీ ఈ మధ్య మన పక్షుల్లో కూడా రాజకీయాలు మొదలయ్యాయి. పులికాట్ సరస్సులో పెత్తనం చేసే కొన్ని పక్షులు ఫ్లెమింగోలను రానివ్వడం లేదు” అంటూ నిట్టూర్చింది తల్లి బాతు.
 
          “ఎందుకనమ్మా! అలా చేయడం. ఫ్లెమింగోలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా! అని అడిగాయి పిల్లలు.
 
          “లేదమ్మా! ఫ్లెమింగోలను చూడటం కోసమే ఎంతో మంది వస్తారు. అంత మంది వచ్చి మన సరస్సును చూస్తుంటే మనందరికీ ఆనందంతో పాటు గొప్పదనం కూడా! ఆ తర్వాత దేశ దేశాల వార్తాల్ని కూడా చెపుతాయి. లోకంలోని వింతలు విశేషాలు కూడా చెపుతాయి. చాలా స్నేహంగా ఉంటూ అందరితో కలిసిపోతాయి” అని చెపుతూ ఆగింది అమ్మ.
 
          “మరింకెందుకమ్మా! ఫ్లెమింగోలను రానివ్వడం లేదు” అమాయకంగా అడిగాయి బాతు పిల్లలు.
 
          “అమ్మా! రాజకీయ పక్షులు కొన్ని మనలో ప్రాంతీయ విభేదాలు సృష్టించాయి. వలస వచ్చే పక్షుల్ని రానివ్వద్దు అని చెప్పాయి. ఫ్లెమింగోల ముందు తమ అందం, తెలివితేటలు తక్కువ అయిపోతాయని ఆసూయ పడి రానివ్వడం లేదు. ఎంతో అన్యోన్యంగా ఉండే మన మధ్య తగాదాలు పెట్టి అవి తమాషా చూసున్నాయి.” ఇంకా చెప్తూ ఉండగానే …
 
          “అమ్మా మరి ఫ్లెమింగోలు రాకపోతే మనల్ని చూడటానికి మనుషులు రారు కదా ! మనషులు రాకపోతే నిశబ్దంగానే ఉంటుంది కదా! ఎవరూ రాకపోతే ఏం బావుంటుంది” సందేహం తీరక ఆడిగాయి బాతు పిల్లలు.
 
          “రాజకీయ పక్షులకు మంచి జరగటం అవసరం లేదు. అందరూ కలసిమెలసి ఉంటే ఓర్వలేరు. వాళ్ళ వంటి నిండా అసూయే అందుకే ఆ ప్రాంతపు పక్షుల్ని మన ప్రాంతం రావద్దని చెపుతున్నాయి. వలస పక్షిల్కి రానివ్వద్దని మన పక్షుల మెదళ్ళలో విషం నింపుతున్నాయి. ఈ కుట్రను అర్థం చేసుకోని మన పక్షులు ఫ్లెమింగోల మీద పగ పెంచుకున్నాయి. ఇక నుంచీ ప్లెమింగోలు వేరే ప్రాంతానికి వెళతాయి. ఆ ప్రాంతం పులికాట్ సరస్సులా అభివృద్ధి చెంది మనుషులతో నిండి ఉటుంది. దేశ విదేశాల్లోని పక్షులు కూడా గిరి గీసుకుని బతుకుతాయి. మనం కూడా పగ ప్రతీకారాలతో యుద్ధాలు చేసుకుని కొట్టుకుని చావాలి అనీ వాళ్ళ ఉద్దేశ్యం” ఆవేశంగా అమ్మ చెపుతోంది.
 
          అమ్మా మనం రాజకీయ పక్షుల్ని బయటికీ తరిమేస్తే అందరం హాయిగా ఉంటాము కదా! దీనికి ఎందుకు బాధపడటం అమ్మ! అన్నది బాతుపిల్ల.
 
          “వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదమ్మా! రాజకీయ పక్షులు ప్రేమింగోలను బాధ పెట్టాయని మనం కూడా అలా చేయకూడదు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమన్నాడు జాతిపిత” అన్నది. అమ్మ నచ్చ జెప్పుతున్న ధోరణిలో.
 
          “అదే మనం చేస్తున్న తప్పమ్మా! వాళ్ళు చేస్తున్న తప్పేమిటో వాళ్ళకు తెలియాలి. దాని వలన పడే బాధ వాళ్ళూ అనుభవించాలి. అప్పుడే వాళ్ళలో మార్పు వస్తుంది. ఎప్పుడూ ఎదుటి వారే బాధ పడుతుంటే వాళ్ళకేమీ అర్థం కాదు” అన్నది నిబ్బరంగా బాతుపిల్ల.
 
          తల్లి ఆశ్చర్యపోయింది చిన్నపిల్ల అయినా ఎంత వివేకమైన ఆలోచన చేసింది. తరాల అంతరంకావచ్చు. “అలాగే తల్లి! అందరం మాట్లాడుకుని నిర్ణయం  తీసుకుం దాం! అంటూ బాతుపిల్లను ముద్దులాడింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.