అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 15

– విజయ గొల్లపూడి

జరిగినకథ: విశాల, విష్ణు ఆస్ట్రేలియా వచ్చి స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారు. గోపీ ఇంటిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నారు. గోపీ డైవోర్సీ అని తెలుసుకుని విశాల త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని విష్ణుతో చెపుతుంది. విశాలకి టేఫ్ కాలేజీలో వర్క్ ఎక్స్ పీరియన్స్ అవకాశం వచ్చింది. విష్ణుకి ఉద్యోగ అవకాశం వచ్చినా, ఇంటికి దూరం, కారు
కంపల్సరీ అని కన్సల్టెంట్ చెప్పడంతో నిరాశ చెందుతాడు. ఆస్టేలియా వచ్చి తప్పు చేసానా అని ఆలోచనలో పడతాడు. విశాల అతనికి ధైర్యం చెపుతుంది. విశాల డాక్టర్ చెకప్ కోసం మెడికల్ సెంటర్ కి విష్ణుతో వెళ్ళింది.

***

          కాలగమనంలో ఏది ఎపుడు ఎలా జరగాలో ముందే రాసిపెట్టి ఉంటుందా? మానవుని
ప్రమేయం ఎంతవరకు? పూర్వజన్మ తాలూకు కర్మశేష ఫలాలని బట్టి నుదుటిరాత ముందే రాసి ఉంటుందా?

          భరతభూమి కర్మభూమి. కర్మసిద్ధాంతాన్ననుసరించి, వచ్చిన అవకాశాలను జార విడుచుకోకుండా, మానవ ప్రయత్నం చేస్తూ, చివరివరకు ఏ పరిస్థితి ఎదురైనా ఎదురొడ్డి ముందుకు సాగితే అటువంటి వారికి అష్టలక్ష్ములు తోడుంటాయి. ఫలితం ఎలా ఉండాలో భగవంతుడే నిర్ణయిస్తాడు.

          విశాల మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. పెళ్ళి అయి, ఏడాదైనా కాలేదు. ఇండియాలో ఆమెకు పుట్టింటి నుంచి, విష్ణుకి ఆస్తి, పాస్తులు దండిగా ఉన్నా, ఇపుడు ఆస్ట్రేలియాలో బేస్ లెవెల్ నుంచి కొత్త జీవితం ప్రారంభించినట్లే కదా? అన్నీ స్వశక్తితో ఇపుడు సమకూర్చుకోవలసిన పరిస్థితి. డబ్బు ఎలా పడితే అలా ఖర్చు పెట్టడానికి లేదు. ఎందుకంటే ఇపుడు వారిదగ్గర ఉన్నది ఇండియన్ కరెన్సీతో కొనుక్కున్న ఆస్ట్రేలియన్ డాలర్లాయే! తనకు స్వతహాగా పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ ఇపుడున్న పరిస్థితు లలో….

          ఇంతలో నర్స్ పిలుపుతో ఆలోచనల నుంచి బయటపడి, ఆమె ఏమి చెపుతుందో నని, పరీక్ష బాగా రాయనపుడు రిజల్ట్ ఎలా ఉంటుందోనని ఎదురుచూసే విద్యార్థిలా విశాల గాబరాగా నర్స్ వైపు చూసింది. బ్లడ్ టెస్ట్, కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలకి ఫలితం నెగెటివ్ అని వస్తే మనిషి హాయిగా ఊపిరి పీల్చుకోవటం జరుగుతుంది.

          నర్స్ సారా విశాలవైపు చూసి, ఇట్స్ నెగెటివ్ అని తేల్చి చెప్పింది.

          విశాల ఆ మాట విని గట్టి శ్వాస విడుస్తూ, హమ్మయ్యా, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ నౌ అని మనసులో అనుకుంది. డాక్టర్ తాన్య ఆమె రిజల్ట్ చూసి, “ఈ దేశానికి కొత్తగా రావటం
వల్ల కల్చర్ షాక్, స్ట్రెస్ వల్ల కావచ్చు. ఈ మెడిసిన్స్ వారం రోజులు వాడండి.” అని ప్రిస్కిప్షన్ రాసి ఇచ్చింది.

          డాక్టర్ గది నుంచి బయటకు వచ్చి, విష్ణుకి విషయం చెప్పింది విశాల. “మందులు తీసుకోవాలా?” అని విష్ణు అడిగాడు. దానికి విశాల, “ప్రస్తుతానికి వద్దు. నేను  సాధ్యమై నంత వరకు ఇంగ్లీష్ మందులకు దూరంగా ఉంటాను. అవసరమైతే తప్ప వాడను.” అంది.

          విష్ణు, విశాల ఇద్దరూ రిలీఫ్ గా ఫీలయ్యారు.

          “ప్రస్తుతానికి బరువు, బాధ్యతలు పెరగలేదు, మనం త్వరపడి కొన్ని పనులు పూర్తి చేయాలి, అవి ఏమిటో చెప్పుకో?” అన్నాడు విష్ణు.

          “చెప్పనా, డ్రైవింగ్ లైసెన్స్, జాబ్ సెటిల్మెంట్, ఇల్లు మారడం” అని లిస్ట్ ఏకరువు పెట్టింది విశాల.

          “అరె విశాలా! స్పాట్ ఆన్. సరిగ్గా నేను కూడా ఇవే అనుకున్నాను. నా మనసులో ఆలోచనలు బాగా కాచ్ చేసావ్.” అన్నాడు విష్ణు ఆమె వంక మెచ్చుకోలుగా చూస్తూ.

          “అవునండీ! మీరు నా ఆరాలో ఉన్నారు, టెలీపతీ స్విచ్ నాలో నిక్షిప్తం చేసుకు న్నాను. ఈ పతి గారు మనసులో ఏమనుకున్నా, నాలో టెలీపతీకి అందుతాయి” అంది నవ్వుతూ విశాల.

          ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ, అదే కాంప్లెక్స్ లో ఉన్న న్యూసౌత్ వేల్స్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలోకి వెళ్ళి కంప్యూటర్ దగ్గర ఆన్లైన్ లో లెర్నర్ డ్రైవింగ్ టెస్ట్ కి అదే రోజు బుక్ చేసుకున్నారు. అక్కడే ఉన్న మాన్యువల్ ఇద్దరూ ఒక అరగంట చదివి ఆన్ లైన్ లో ప్రాక్టీస్ చేసారు. వెంటనే ఇద్దరూ చెరో కంప్యూటర్ పై ఆన్ లైన్ లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చక చక ఇస్తూ, సునాయాసంగా పరీక్ష పాసయ్యారు. కౌంటర్లో ఆశ ఇద్దరికీ కంగ్రాట్యులేషన్స్ చెప్పి, ఫోటోలు తీసుకుని అప్పటికప్పుడు లెర్నర్ డ్రైవర్ లైసెన్స్ కార్డ్స్ ఇచ్చింది. దానితో పాటు లెర్నర్ లాగ్ బుక్, ఇన్ స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చింది.

          విశాల, విష్ణు ఇద్దరూ ఆనందంగా బయటికి వచ్చారు. ప్రక్కనే దానికి ఆనుకుని ఉన్న కోల్స్ సూపర్ మార్కెట్ లోకి ఇద్దరూ దారి తీసారు. కోల్స్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న నోటీస్ బోర్ద్ దగ్గర విష్ణు ఆగాడు. అందులో డ్రైవర్ ఇన్ స్ట్రక్టర్ ఫర్ లెర్నర్స్ కార్డ్ చూసి వివరాలు తన పాకెట్ నోట్ పాడ్ లో రాసుకున్నాడు. విశాల లోపలికి వెళ్ళి, కావలసిన పాలు, పండ్లు, కూరగాయలు, స్నాక్స్ తీసుకుంది.

          విష్ణు డ్రైవర్ ఇన్ స్ట్రక్టర్ కరణ్ కి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాడు. యాభై క్లాసులు తీసుకోవాల్సి ఉంటుంది. క్లాస్ కి నలభై డాలర్లు. పది క్లాసులు తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది అని అన్ని వివరాలు కరణ్ ఇచ్చాడు.

          ఇంతలో విశాల సరుకులకి కార్డ్ లో పే చేసి, రెండు కేరీ బ్యాగ్ లతో విష్ణు దగ్గరికి వచ్చింది.

          “ఏమిటి, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మీరు లోపలికి రాలేదే?” అనిఅడిగింది.

          “మనకి లెర్నర్స్ లైసెన్స్ వచ్చిందిగా. ఇక్కడ డ్రైవింగ్ క్లాసులు తీసుకోవటానికి వివరాలు కనుక్కున్నాను. చాలా ఎక్స్పెన్సివ్. పది క్లాసులకి నాల్గొందల డాలర్లు అవుతుంది.” అన్నాడు విష్ణు.

          “అమ్మో! అంత రేటా? ఒక పని చేద్దాం. ముందు మీరు క్లాసులు మొదలు పెట్టండి. నాకు కంగారు లేదుగా. నేను మీకు లైసెన్స్ వచ్చాక తీసుకుంటాను.” అంది విశాల.

          విష్ణుకి విశాల ఐడియా నచ్చింది. “సరే చూద్దాం. ఈ లోపుగా ఎక్కడైనా జాబ్ దొరుకుతుందేమో చూడాలి.” అన్నాడు.

          ఆ రోజు బుధవారం కావడంతో విష్ణు డైలీ టెలిగ్రాఫ్ పేపర్ తీసుకున్నాడు. ప్రతి బుధవారం, శనివారం జాబ్స్ ప్రత్యేకంగా రిక్రూట్ మెంట్ అడ్వర్టైజ్ మెంట్స్ పడతాయని అతను విధిగా చూడటం అలవాటు చేసుకున్నాడు.

          విష్ణు అపుడే కొన్న పేపర్ తిరగేయసాగాడు. ఇంటికి దగ్గర్లోనే ఆస్ట్రేలియా పోస్ట్ ఆఫీస్ లో పొజిషన్స్ వివరాలు చూసాడు. కేవలం వాకింగ్ డిస్టెన్స్ మాత్రమే. పైగా నార్మల్ బిజినెస్ అవర్స్. పార్ట్ టైం. రోజుకి నాలుగు గంటలు మాత్రమే. వెంటనే ఆ జాబ్ కోసం
అప్లికేషన్ తయారుచేసి పంపాడు.

          ఆ రోజు డిన్నర్ కి విశాల చపాతి, ఆలు కుర్మా కూర తయారుచేసింది. వాళ్ళు ఇద్దరూ నిర్దేశించుకున్న లక్ష్యాల పై దృష్టి పెట్టి, ఇద్దరూ హాయిగా నిద్రలోకి  జారుకు న్నారు.

          ప్రొద్దున్న లేవగానే విష్ణు టీ సిప్ చేస్తూ న్యూస్ పేపర్ లో రెంటల్ సెక్షన్ చూడసా గాడు.

          విశాల టిఫిన్ లంచ్ బాక్స్ రెడీ చేసి, వర్క్ ఎక్స్ పీరియన్స్ కి వెళ్ళిపోయింది.

          విష్ణు మనస్సు చాలా వేగంగా పనిచేస్తోంది. ‘అనుకున్నదే తడవుగా, మార్గం సుగమం అవుతోంది, ఇక ఆలస్యం చేయకుండా పరుగులు పెట్టవలసిన సమయం.’ అనుకున్నాడు.

          విష్ణు తను అప్లై చేసిన పోస్ట్ ఆఫీస్ జాబ్ కోసం ఫోన్ చేసాడు. వెంటనే ఉదయం పది గంటలకు పాస్ పోర్ట్, డ్రైవర్స్ లైసెన్స్ తీసుకుని ఇంటర్వ్యూకి రమ్మన్నారు.

          డాక్యుమెంట్స్ కావలసినవి అన్నీ చూసుకుని, ఐదు నిమిషాలలో అక్కడకు
చేరుకున్నాడు. ప్రక్కనే కేఫిటేరియాలో కెపాచినో ఆర్డర్ చేసాడు. ఇంకా పది నిమిషాలు ఉందనగా, పోస్ట్ ఆఫీసుకి చేరుకున్నాడు.

          వెళ్ళగానే, “ఐ యామ్ కర్తార్ సింగ్!” అని కౌంటర్ లో ఉన్న వ్యక్తి పరిచయం చేసుకుని, లోపల గదిలోకి తీసుకెళ్ళాడు.

          “పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైస్ తీసుకుని నా భార్య మన్ ప్రీత్ తో నడుపుతున్నాను” అని చెప్పాడు.

          విష్ణు డాక్యుమెంట్స్ అన్నీ చూసి, ఫోటో కాపీ తీసుకున్నాడు. అతనికి టాక్స్ డిక్లరేషన్ ఫారం ఇచ్చి ఫిలప్ చేయమన్నాడు.

          విష్ణు పెర్మనెంట్ రెసిడెంట్ కావడంతో అతనికి కాజువల్ జాబ్ ఇస్తున్నట్లుగా చెప్పి, ఇండక్షన్ పాక్ ఇచ్చాడు. కంప్యూటర్ లో ట్రైనింగ్ పాక్ సెల్ఫ్ పేస్ డ్ లెర్నింగ్. రేపే వచ్చి జాబ్ లో చేరమని చెప్పి కర్తార్ సింగ్ మళ్ళీ కౌంటర్ దగ్గరకి వెళ్ళిపోయాడు.

          విష్ణు అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ ఏజెన్సీ దగ్గరకు చేరుకున్నాడు. ఏజెంట్ లీసా అతనికి స్వాగతం పలికింది.

          విష్ణు అదే ఏరియాలో సింగిల్ బెడ్ రూం అద్దెకి చూస్తున్నాను అని చెప్పి అప్లికేషన్ పూర్తి చేసాడు.

          రియల్ ఎస్టేట్ ఏజెంట్ అతనికి కారు లేకపోవడంతో తన కారులో రెంట్ కి రెడీగా ఉన్న ఒక యూనిట్ చూపెట్టాడానికి తీసుకుని వెళ్ళింది.

          ఆ యూనిట్ గ్రౌండ్ మొదటి ఫ్లోర్ లో ఉంది. చిన్న హాలు, కిచెన్ ఎలెక్ట్రిక్ స్టౌ, ఓవెన్, బెడ్ రూం, బాల్కనీ ఒక జంటకి సరిగ్గా సరిపోతుంది ఆ యూనిట్.

          వారానికి రెంట్ నూటపది డాలర్లు. రెండు వారాలకి అడ్వాన్స్, డిపాజిట్ మనీ ఇవ్వాలి. రెండు వారాలలో అందులోకి మారవచ్చు. లీసా అన్ని వివరాలు విష్ణుకి చెప్పి అతనికి పేపర్ వర్క్ ఫిలప్ చేయమని ఇచ్చింది. మొట్టమొదటిసారి లీస్  తీసుకుంటు న్నారని తెలిసి, 100 పాయింట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసింది. లీస్ అగ్రిమెంట్ పై సంతకం చేయమంది.

          విష్ణు పనులన్నీ పూర్తి చేసుకుని, విశాలకి ఫోన్ చేసి స్టేషన్ కి రమ్మన్నాడు. ఇద్దరూ హంగ్రీ జాక్స్ లోకి వెళ్ళి టీ ఆర్డర్ చేసారు.

          ఆ రోజు అక్కడ ఒక వైపు పిల్లల బర్త్ డే పార్టీ జరుగుతోంది. ప్లే ఏరియాలో పిల్లలు అందరూ జారుడు బల్ల జారుతున్నారు. బార్బీ గాళ్ థీమ్ కానెప్ట్. పిల్లలందరూ ఆకర్షణీయంగా తయారయ్యారు. మఫిన్ కేక్స్, పొటాటో చిప్స్ బల్ల పై అమర్చారు.

          విశాల అక్కడ ఏంబియన్స్ చూస్తూ ముద్దుగా ఉన్న పిల్లలవైపు ఎడ్మైరింగ్ గా చూసింది.

          విష్ణు పిలవటంతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది.

          “పిల్లలు, ప్రకృతి, చెట్లు, బీచ్ లు ఉంటే ఇంక నన్ను, నిన్ను నువ్వు పూర్తిగా మర్చి పోతావు విశాలా!” అన్నాడు విష్ణు.

          “భలే! ఎంత ముద్దుగా, బుజ్జిగా ఉన్నారు పిల్లలంతా. వీళ్ళకి కనుక మన ఇండియన్ కాస్ట్యూమ్స్ వేస్తే ఇంక అసలు గోపికా, గోప బాలుర్లలా ఉంటారు కదా!” అంది విశాల.

          విశాల ధ్యాసని మరలుస్తూ విష్ణు “నీతో చాలా విషయాలు మాట్లాడాలి విశాలా! మనం ఇద్దరం కలిసి ఏ క్షణాన అనుకున్నామో కానీ, ఆ సమయంలో దేవతలు మన మాటలు విని తథాస్తు అన్నట్లు ఉన్నారు. ఈ రోజు ఒక గుడ్ న్యూస్. ఊహూ! ఒకటి కాదు, రెండు ఉన్నాయి, నీతో చెప్పడానికి.” 

          “వావ్! వండర్ ఫుల్! కాన్ట్ వెయిట్. తొందరగా చెప్పండి.” అంది విశాల ఆతృతతో.

          “నాకు ప్రస్తుతానికంటూ ఒక జాబ్ వచ్చింది ఆస్ట్రేలియన్ పోస్ట్ ఆఫీస్ లో. ఈ రోజే ఇండక్షన్, ట్రైనింగ్ పూర్తి చేసాను. లక్కీగా అతను కూడా ఇండియన్ సర్దార్ జీ. ఇంక రెండోది మనకి ఒక సింగిల్ బెడ్ రూమ్ యూనిట్ అద్దెకి చూసాను.” అన్నాడు విష్ణు సంతృప్తి నిండిన స్వరంతో.

          “అద్భుతం. మనం సెలబ్రేట్ చేసుకోవాలి.” అంది ఉత్సాహంగా విశాల.

          “ఈ వీకెండ్ నిన్ను ఒక ప్లేస్ కి తీసుకెడుతున్నాను. సర్ప్రైజ్! వేచి చూడుడు.” అన్నాడు విష్ణు.

          ఇద్దరూ ఎవరి జాబ్ కి వాళ్ళు వెళ్ళీపోతూ, రొటీన్ కి అలవాటు పడుతున్నారు.
ఎదురుచూస్తున్న వీకెండ్ రానే వచ్చింది. ఆ రోజు విష్ణు ఇద్దరికీ ట్రావెల్ డే పాస్ తీసు కున్నాడు. అంటే పది డాలర్ల టికెట్ తో బస్సు, రైలు, ఫెర్రీ, మోనో రైలు ఎందులోనైనా,
ఎక్కడికైనా తిరగవచ్చు. ఇద్దరూ రైలు ఎక్కి, విన్ యార్డ్ దగ్గిర దిగారు.

          ప్రపంచంలోనే విలక్షణమైన అద్భుత కట్టడం, ఆస్ట్రేలియా సిడ్నీ నగరానికి వన్నె తెచ్చిన ఒపెరా హౌస్ దగ్గరకు చేరుకున్నారు విశాల, విష్ణు.

          చుట్టూ సిడ్నీ హార్బర్ మిరిమిట్లు గొలిపే అందాలు. పావురాలు గుంపులు  గుంపులు గా అటు ఇటు తిరుగుతున్నాయి. ఆ పరిసరాలు చూస్తూ క్రొంగొత్త జంట చేతులు పట్టు కుని, మైమరచి పోయారు. కెమెరాతో ఇద్దరూ ఒకరికొకరు ఫోటోలు దిగారు. అటువైపు వచ్చిన మరో ఆస్ట్రేలియన్ జంట వారివురికి ఫోటో తీస్తామని ముందుకి వచ్చి నాలుగు, ఐదు ఫోటోలు వివిధ భంగిమలలో టకటకా నొక్కారు. ఇద్దరూ ఒపెరా మెట్ల పై కూర్చున్నా రు.

          అక్కడ డిస్ ప్లే లో ఉన్న ఒపెరా చరిత్రను విశాల చదివి తెలుసుకుంది. డానిష్ ఆర్కిటెక్ట్ జోర్న్ ఉట్జోన్ ఒపెరా హౌస్ కు రూపకల్పన చేసారు. కానీ పీటర్ హాల్ నాయక త్వంలో ఆస్ట్రేలియన్ ఆర్కిటెక్చరల్ టీమ్ దీన్ని పూర్తి చేసారు. ఈ అపురూప భవనాన్ని క్వీన్ ఎలిజబెత్ II అధికారికంగా 20 అక్టోబర్ 1973న ప్రారంభం చేయడమైనది. 1958లో అప్పటి ప్రధానమంత్రి జోసెఫ్ కాహిల్ నేతృత్వంలోని న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం ఉట్జోన్ నిర్మాణాన్ని ఆదేశించడంతో పని ప్రారంభించేందుకు అధికారం ఇచ్చింది. ఈ ఒపెరా హౌస్ లో ఎన్నో వేదికలు ఉన్నాయి. ప్రతి ఏటా పదిహేనువేలకు పైగా  ప్రదర్శ నలు జరుగుతాయి. 1.2 మిలియన్లకు మించి ప్రేక్షకులు హాజరవుతారు. ఇద్దరూ గంటకు పైగా ఒపెరా హౌస్ చుట్టూ తిరిగారు. తరువాత అక్కడ నుంచి ఫెర్రీలో తరంగా జూ కి పయనమయ్యారు. ఫెర్రీ బోట్ లో చుట్టూ అలలను చూస్తూ, 360 డిగ్రీల కోణంలో అన్ని వైపులా సిడ్నీ, ఒపెరా అందాలు, సిడ్నీ హార్బర్ బ్రిడ్జి చూస్తూ విశాల, “ఈ రెండు కళ్ళు చాలనే చాలవు. భూతల స్వర్గం అంటే ఇదే కదా! నా కాలేజ్ డిగ్రీ చదివే రోజుల్లో నా బెస్ట్ ఫ్రెండ్ అక్క పెళ్ళి చేసుకుని, ఆస్ట్రేలియా వచ్చింది. అపుడు నా ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో
వాళ్ళ అక్క ఫోటోలు చూపించింది. ఆ రోజు అనుకున్నాను, నిజంగా ఇంత అందమైన
దేశం ఒక్కసారైనా ఆస్ట్రేలియా వెళ్ళకపోతానా అని కలలు కన్నాను. ఇపుడు ఆ కల నిజమైంది. థాంక్యూ శ్రీమాన్ జీ! హౌ లక్కీ ఐయామ్! హౌ బ్యూటిఫుల్ ఈస్ దిస్ ప్లేస్” అని మెరిసే కళ్ళతో విశాల అంది.

          విష్ణు నవ్వుతూ, విశాలా! నేను మాత్రం అనుకున్నానా? కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని, నీతోనే ఇంత సుందర ప్రదేశంలో తిరుగాడతానని. ఒక విధంగా నీ లక్ అనుకో. నన్ను ఇంత దూరం తీసుకువచ్చింది.

          ఆ మాటలకు విశాల, సిగ్గు మొగ్గై, ఎగిసే అలలవైపు చూస్తూ ఉండిపోయింది.
వీకెండ్ కావటంతో పైన, క్రింద, లోపల యాత్రికులతో ఫెర్రీ నిండుగా ఉంది.

          ఇంతలో తరంగా జూ స్టాప్ రావడంతో విష్ణు, విశాల ఇద్దరూ చెయ్యి పట్టుకుని నెమ్మదిగా దిగారు.

          ఎంట్రన్స్ దగ్గిర విష్ణు టికెట్స్ తీసుకుంటున్నపుడు తరంగా హిస్టరీ ఉన్న రాతి పలకల వైపు దృష్టి పెట్టింది విశాల. తరంగ జూ అక్టోబర్ 7 వ తేదీ, 1916 వ సంవత్సరంలో అధికారికంగా ప్రారంభించబడింది.

          విష్ణు టికెట్స్ తీసుకుని వచ్చాడు. విశాల విష్ణుతో అంది, “నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఎందుకో తెలుసా?” జీవితంలో ఎపుడూ పరుగులు పెడుతూ, ఉరుకుతూ  ముందు కు సాగిపోయే వండర్ ఫుల్ ఏనిమల్, ఆస్ట్రేలియన్ నేషనల్ ఏనిమల్, పైగా ఆస్ట్రేలియా ప్రభుత్వ పత్రాలు, కాగితాల పై ఉండే కంగారూ జంతువుని చూడబోతున్నాము. నా కిష్టమైన జంతువు. అది ఒక్కటే కాదు. గువ్వలా ఒదిగిపోయే కోలా బేర్ చూడాలని ఎప్పటి నుంచో ఉవ్విళ్ళూరుతున్నాను. “

          “అవునా! నాకీ విషయం ఇపుడు చెపుతున్నావా!” అని ఆశ్చర్యంగా విష్ణు, విశాల వైపు చూసాడు.

          అన్ని జంతువులు వరుసగా చూసుకుంటూ, వెతుక్కుంటూ ఎట్టకేలకు కంగారూలు
ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు విశాల, విష్ణు.

          తన పొట్టలో మరో బుల్లి కంగారూ బేబీని భద్రంగా దాచుకున్న తల్లి కంగారూని మురిపెంగా చూసింది విశాల. బేబీ కంగారూని జోయి అంటారు. వెనుక కాళ్ళు పెద్దవిగా ఉండి, పొడవైన తోక, చిన్న మొహంతో దూకడానికి అనుకూలంగా వాటి శరీర ఆకృతి ఉంది. మార్సుపియల్స్ అంటారు వీటిని. ప్రతి జంతువు ఉన్నచోట వాటి గురించి వివరణ ఉంది. విశాల ప్రతిచోట తన కళ్ళను ఆ రాతి పలకల పై ఉన్న అక్షరాల వెంబడి వేగంగా పరుగులు తీసి చదవటం ఆమెకున్న అరుదైన ఆస్తి. పైగా చదివి వెంటనే ప్రక్క నున్న భర్తతో ఆ విషయాలు చెప్పసాగింది.

          అక్కడే ఉన్న కంగారూ కేరర్ సాయంతో విశాల కంగారూని ప్రేమగా నిమిరి, భర్తతో కలిసి ఒక ఫోటో దిగింది. చివరగా చెట్టుపై నక్కి ఉన్న కోలా బేర్ దగ్గిర కెళ్ళి ఆగారు
ఇద్దరు. కోలా యూకలిప్ట్సస్ ఆకులని నమలటం చూసింది. అక్కడ జూలో పనిచేసే కేరింగ్ లేడీ వాటిని చిన్న బేబీని ఎత్తుకున్నట్లుగా సుతారంగా చేతిలో పట్టుకుంది.

          అలా విశాల పగ్గాలు లేని ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ అసలు సిసలైన
ఆస్ట్రేలియా ఐకానిక్ బ్యూటీలను ఆస్వాదించింది. ఆ ఙ్ఞాపకాలను ఎప్పటికీ మరిచి పోకుండా తన గుండెలోతుల్లో నిక్షిప్తం చేసుకుంది ఆ క్షణాలను విశాల. దారిలో సలాడ్ సాండ్ విచ్ ఆర్డర్ చేసి, డిన్నర్ అయిందనిపించారు ఇద్దరూ.

          ఆపై ఇద్దరూ తిరుగు ప్రయాణం అయి ఇంటికి తిరిగి వచ్చారు. అయితే ఇంటికి
చేరుకోగానే, ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. తలుపులు లోపల అన్నీ బార్లా తెరిచి ఉన్నాయి.

          విశాల, విష్ణు వైపు తిరిగి, “మనం వెళ్ళేటపుడు లైట్లు ఆపి, తలుపులు అన్నీ లాక్ చేసుకుని వచ్చాము కదా! అసలే ఇది మన ఇల్లు కూడా కాదాయె. లోపలికి వెళ్ళాలంటే భయంగా ఉంది. భగవంతుడా! ఇంతసేపు ఆనందంగా ఉన్నాము అనుకుంటే, మళ్ళీ మరుక్షణంలో ఏమిటి ఈ గందరగోళ పరిస్థితి? కొంపదీసి ఇంట్లో దొంగలు పడలేదు కదా!”

          “విశాలా ఆపు, ఏమిటి నీ ఊహాగానాలు. లెట్ మి గో ఇన్ సైడ్” అన్నాడు కాస్త కోపంగా విష్ణు.

          “ఏమండీ వద్దండీ! లోపలికి వెళ్ళొద్దు.” అంది భయంగా విశాల.

          “కాస్త ఆగు, నీ భయంతో నన్ను ఊదరగొడుతున్నావు.” అంటూ నెమ్మదిగా తలుపు తెరిచే ప్రయత్నం చేసాడు విష్ణు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

2 thoughts on “అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-15”

Leave a Reply

Your email address will not be published.