యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

భాగం-15

కెయిర్న్స్ నించి మెల్ బోర్న్ కి

గ్రేట్ బారియర్ రీఫ్ టూరు నించి వెనక్కి వచ్చే పడవలో పిల్లలు దారంతా నిద్రపోతూనే ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నంతసేపు మధ్యాహ్న సమయానికి అందరికీ జెట్ లాగ్ చుట్టుముట్టేది. మూడు, నాలుగు ప్రాంతంలో వద్దన్నా నిద్ర ముంచుకొచ్చేది మా అందరికీ. 

          ఇక గ్రేట్ బారియర్ రీఫ్ టూరుకి పెద్దవాళ్ళకి దాదాపు 175 ఆస్ట్రేలియన్ డాలర్లు, పిల్లలకి వంద డాలర్లు టిక్కెట్టు, ఇక అదనపు యాక్టివిటీలైన స్నోర్కిలింగ్ ట్రైనింగుకి పెద్దవాళ్ళకి  50, అండర్ వాకింగ్ టూరుకి మరో 150 అదనం. 

          ముందు రోజు వెళ్ళిన గ్రాండ్ కురండా టూరుకి పెద్దవాళ్ళకి 255 ఆస్ట్రేలియన్ డాలర్లు, పిల్లలకి 135 డాలర్లు టిక్కెట్టు. 

          మొత్తమ్మీద ప్యాకేజీ టూరు కాకుండా అప్పటికప్పుడు మేం వెళ్ళాలని నిర్ణయించు కున్న అదనపు యాక్టివిటీస్ కి మొత్తం మూడువందల డాలర్ల వరకూ అదనంగా ఖర్చు పెట్టాం.  

          ఇక సాయంత్రం పడవ దిగేసరికి సత్యకి, సిరికి ఓపిక అయిపోయిందని వాళ్ళు హోటలుకి వెళ్ళిపోయారు. నాకు మామూలుగా రోజంతా బయట తిరిగినా సాయంత్రానికి ఇంకా ఓపిక ఉంటూనే ఉంటుంది. 

          మర్నాడు కెయిర్న్స్ నించి వెళ్ళిపోవాల్సి ఉండడంతో ఒకసారి అలా బీచ్ ఒడ్డున నడిచి వెళదామని వరుని తీసుకుని నేను ముందుకు కదిలేను. ఆహ్లాదకరమైన ఆ సాయంత్రం ప్రశాంతంగా ఉంది. 

          ఒక పక్క అనంతమైన సాగరం, మరోపక్క మబ్బులతో అందంగా మెరుస్తూన్న  ఆకాశం. ముందురోజు రాత్రి ఉరుముల వాన కురిసింది. అమెరికాలో మేమున్న శాన్ ఫ్రాన్ సిస్కో ప్రాంతంలో ఉరుముల వాన చాలా అరుదు. సిరి ఉరుములకి చెవులు గట్టిగా మూసుకుని కూర్చోవడం గుర్తొచ్చి నవ్వుకున్నాం.  

          బహుశా: ఇక్కడ ఈ పగలు కూడా వాన కురిసి వెలిసినట్టుంది. చుట్టూ చెట్ల మీద వాన వెలిసిన నీటి అందం బొట్లు బొట్లుగా అద్భుతంగా ఉంది. 

          సముద్రపు ఒడ్డున నిర్మించిన ఆ నడక దారిలో దాదాపు అరగంట నడిచాం. అక్కడక్కడా స్థానిక అబోరీజినల్ పిల్లలు ముందురోజు మేం చూసిన పొడవాటి చెక్క డిడ్జిరిడూలు వాయిస్తూ, అడుక్కుంటూ కనిపించారు. ఒంటి మీద చెడ్డీలు తప్ప చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నారు ఆ  పిల్లలు. ఏవో కాస్త డబ్బులు ఇచ్చినా ఎందుకో ఎంతో దిగులుగా అనిపించింది. వాళ్ళ నేలని లాక్కుని, నిరాశ్రయుల్ని చేసిన నాగరికతకి ఏ చరిత్రని నిలదీయాలి? ఎవర్ని నిందించాలి? 

          వరు తన కాలేజీ విశేషాలేవో హుషారుగా కబుర్లు చెప్పసాగింది. అంతలోనే  నైట్ మార్కెట్ కి చేరుకున్నాం. చిన్న చిన్నవేవో కొన్న తరువాత, మసాజ్ సెంటర్ కి తీసుకెళ్ళమని అడిగింది వరు. 

          పొద్దున్నంతా  ఈత కొట్టి అలిసిపోయిందేమో అరగంట మసాజ్ లో శుభ్రంగా నిద్రపోయింది. నిన్నటి అమ్మాయిలానే ఈ దేశానికి వలస వచ్చి కష్టపడుతున్న మరో ఇద్దరు జపాను అమ్మాయిలకి అమెరికన్ డాలర్లలో పదేసి డాలర్లు టిప్పు ఇచ్చేను. ఎంతో సంతోషించేరు వాళ్ళు. కొనే సరుకుల దగ్గిర వంద బేరాలు ఆడే నేను అలా అంతలేసి టిప్పులు ఇవ్వడం చూసి వరు ఆశ్చర్యంగా అడిగింది. ‘కష్టపడే వాళ్ళకి తగిన ఫలితం దక్కని ఈ ప్రపంచంలో వాళ్ళని నాకు తోచినట్లు గౌరవించడం ఇది. అంతే.’ అని ముందుకు కదిలేను. 

          రాత్రి భోజనంగా అక్కడే రెండు మూడు రెస్టారెంట్లలో నూడుల్స్, స్క్యూయర్స్, క్రేప్స్ వంటి వేవేవో కొనుక్కుని రూముకి పట్టుకెళ్ళేం. 

          వెళ్తూనే సత్య మర్నాడు ఉదయాన ఆరుగంటలకి మేం కెయిర్న్స్ నించి పదకొండు గంటలకల్లా మెల్ బోర్న్ కి వెళ్లాల్సిన డైరక్ట్  ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందని వార్త చెప్పాడు. 

          ఇక ప్యాకేజీ టూరువాళ్ళకి కాల్ చేసే ఓపిక లేక అప్పటికప్పుడు కూర్చుని మేమే మళ్ళీ బుక్ చేసాం. అయితే డైరక్ట్  ఫ్లైట్ లు లేక రెండు ఫ్లైట్ లు మారి వెళ్ళాల్సి ఉంది.  అంటే ఒక ఫ్లైట్ లో సిడ్నీ వెళ్ళి అక్కణ్ణించి మరో ఫ్లైట్ లో మెల్ బోర్న్ కి వెళ్ళాలి. ఇదంతా అయ్యేసరికి సాయంత్రం నాలుగో, అయిదో అవుతుంది. 

          మేమేమో పొద్దున్నే వెళ్ళిపోతాం కదా అని ప్యాకేజీ టూరుతో సంబంధం లేకుండా మధ్యాహ్నం ఒంటిగంటకు మెల్ బోర్న్ రివర్ టూరు, సాయంత్రం మెల్ బోర్న్ స్కై డెక్  టూరు, అందులో ఏవేవో యాక్టివిటీస్ అంటూ మొత్తం ఏవేవో బుక్ చేసేసుకున్నాం. ఇక చేసేదేముంది? మెల్ బోర్న్ రివర్ టూరు క్యాన్సిల్ చేసాం. అదృష్టం కొద్దీ అది ఎక్స్ పీడీయా సైటు నించి బుక్ చేసి ఉండడం వల్ల క్యాన్సిల్ చేసినా డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. ఇక స్కై డెక్  టూరుకి వెళ్ళలేక పోతే ఇంతే సంగతులు! 

          అలా ఆ రోజు కొంచెం టెన్షను అయ్యింది. ఈ రిజర్షేషన్లు పూర్తయ్యి, మొత్తానికి సామాన్లన్నీ సర్దుకుని పడుకునేసరికి పన్నెండయ్యింది. పొద్దున్న ఎయిర్ పోర్టు డ్రాప్ ఆఫ్ కోసం వెహికిల్ మూడు గంటలకే వచ్చేస్తుండడంతో రెండు గంటలకి లేవాల్సి వచ్చింది. పాపం పిల్లలు ఈ ప్రయాణంలో లేటుగా పడుకున్నా, మళ్ళీ ఎప్పుడు లేపినా బుద్ధిగా లేచి మా వెంట నడిచారు. 

          పదిహేను నిమిషాల్లో చేరిపోయి పిట్టమనిషి లేని ఎయిర్ పోర్టులో కునికిపాట్లు పడుతూ కూర్చున్నాం. 

          మొత్తానికి అయిదుగంటల వేళ చెకిన్ చేసి ఫ్లైట్ గేటు దగ్గిర కూర్చున్నాం. బోర్డింగ్ కు టైం అవుతున్నా ఎవరూ లేకపోయేసరికి నాకు అనుమానం వచ్చి టిక్కెట్టు చూద్దును కదా! మేం తొమ్మిదో నంబరు గేటు దగ్గిర కూర్చోవలసినది మూడో నంబరు గేటు దగ్గిర కూర్చున్నాం పొరబాటున. అంటే వెళ్ళాల్సిన టిక్కెట్టు కాకుండా మరో టిక్కెట్టు చూశా మన్నమాట. అసలే సత్య చుట్టూ చూసొస్తానని ఎటో వెళ్ళేడు. ఫోను చెయ్యడానికి సిగ్నల్ సరిగా లేదు. మెసేజీ వెళ్ళడం లేదు.  

          ఇక నేను పిల్లల్ని, లగేజీని తీసుకుని గేటు దగ్గిరికి వెళ్ళి అక్కడ వాళ్ళని కూచోబెట్టి సత్య కోసం మళ్ళీ వెనక్కి వచ్చేసరికి స్థిమితంగా కాఫీ కప్పుతో రాసాగేడు. మొత్తానికి అప్పటికప్పుడు పరుగెత్తి చివరి నిమిషానికి ఫ్లైట్ అందుకున్నాం. ఈ ప్రయాణంలో ఇలా పరుగెత్తడం రెండోసారి. ‘పిల్లలతో వెళ్ళినపుడు ఒకటికి రెండు సార్లు గేటు నంబర్లు సరిగా చూసుకోవాలి.’ అని పాఠం నేర్చుకున్నాం. 

          6.45 కి బయలుదేరి పదిన్నరకి సిడ్నీ చేరుకున్నాం. సిడ్నీ చేరేవరకూ ఎక్కడి వాళ్ళం అక్కడ పడి నిద్ర పోయేం. అక్కణ్ణించి ఒంటిగంటకి మెల్ బోర్న్ వెళ్ళే ఫ్లైట్.  దార్లో నిద్రపోవడం వల్ల కాస్త ఓపిక వచ్చి హుషారుగా నడిచేరు పిల్లలు. సిడ్నీ ఎయిర్పో ర్టులో స్థిమితంగా మధ్యాహ్న భోజనం చేసే సమయం దొరికింది మాకు. ఆస్ట్రేలియాలో తిని తీరవలసిన “చికెన్ పై”  ని అక్కడ తిన్నాం. అరచేతిలో ఇమిడేటంత చిన్నదది. లోపల చప్పటి పొటాటో చౌడర్ లాంటిదేదో పెట్టాడు. కానీ రుచిగా ఉంది. 

          ఇక కేకులు, సాండ్ విచ్ లు, కాఫీలు, థాయ్ టీలు కొనుక్కుని సరదాగా గడిపాం. 

          సమయానికి మెల్ బోర్న్ ఫ్లైట్ ఎక్కి మూడు గంటలకల్లా దిగేం. లగేజీ తీసుకుని బయటికి వచ్చేసరికి మూడున్నర దాటింది. అక్కడ కూడా మా కోసం బోర్డు పట్టుకుని ఎగ్గిక్యూటివ్ డ్రెస్ లో సిద్ధంగా ఉన్నాడు డ్రైవరు. 

          మెల్ బోర్న్ ఎయిర్పోర్టు నించి పార్కింగ్ కాస్త దూరంగా ఉండడంతో నడుస్తూ ఉన్నపుడు లగేజీకి బాగా సాయం కూడా చేసాడతను. 

          మొత్తానికి  మెల్ బోర్న్ డాక్ ల్యాండ్స్ లోని ఫోర్ పాయింట్ షెరటాన్ హోటలుకి నాలుగున్నర ప్రాంతంలో చెకిన్ అయ్యాం. కానీ ఎనిమిది గంటల కల్లా స్కై డెక్ యాక్టివిటీస్ సమయం అయిపోతుండడంతో గబగబా రిఫ్రెష్ అయ్యి ఊబర్ తీసుకుని స్కై డెక్ కి పరుగెత్తాం. 

*****

(సశేషం)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.