ప్రమద

అధికారం… అనురాగం మధ్య వికసించిన ‘ఛాయ’

-పద్మశ్రీ

          అబ్బూరి ఛాయాదేవి గారి గురించి మొదటిసారి జర్నలిజం క్లాసులో మా మాస్టారు బూదరాజు రాధాకృష్ణ గారి నోట విన్నాను. 1992 నాటి సంగతి ఇది. ఆమెను ‘మహా ఇల్లాలు’ అన్నారాయన. ఆయన ఎవరినైనా ప్రశంసించారూ అంటే అది నోబెల్ బహుమతి కన్నా గొప్ప విషయం.

          అప్పటికి నాకు సాహిత్యంతో పరిచయం లేదు. తెలిసీ తెలియని వయసులో యద్ధనపూడి నవలలూ ఆ తర్వాత పోటీ పరీక్షలకు అవసరమైన ఏవో కొన్ని పుస్తకాలూ తప్ప మరేమీ చదవలేదు. ఫెమినిజం అన్న మాట కూడా తెలియదు.

          వసుంధరలో చేరాక కొన్నాళ్ళకే ఛాయాదేవి గారి గురించి మళ్ళీ విన్నాను. పేజీ కోసం ఆమె చేసే బొమ్మలతో శీర్షిక నిర్వహించే బాధ్యతని నాకు అప్పజెప్పారు. అప్పుడు మొదటిసారి వెళ్ళాను వాళ్ళింటికి. ఆ ఇల్లే కళల పుట్టిల్లులా ఉంది. ఎటు చూసినా పుస్తకాలు… ఆమె చేతిలో రూపుదిద్దుకున్న అందమైన బొమ్మలు. మరో పక్క సందడి చేస్తూ తిరిగే పిల్లులు. పిల్లులంటే ఆ దంపతులకు ఎంత ఇష్టం అంటే- కర్టెన్లు, టేబుల్‌ క్లాత్‌లు… అన్నిటి మీదా ముద్దు ముద్దుగా ఉన్న పిల్లి బొమ్మల ప్రింటులే.

          వారం వారం వెళ్ళి ఒక్కో బొమ్మ తయారీ పద్ధతి గురించి తెలుసుకుని, ఫోటో తీసుకుని వచ్చి రాసేదాన్ని. చేట భారతం పేరుతో – మహాభారత ఘట్టాలను గుడ్డ ముక్కలతో బొమ్మలుగా చేసి చేటలో అందంగా అతికించేవారు. అట్టముక్కలతో రకరకాల ఆకృతులు తయారుచేసేవారు. ‘తీరికవేళ’ అన్న ఆ శీర్షిక కింద ప్రచురించిన బొమ్మలతో ఒక పుస్తకం కూడా వేశారు. దానికి రివ్యూ కూడా నేనే రాసాను. తర్వాత వెళ్ళినప్పుడు చెప్పారు… ఈనాడులో రివ్యూ వచ్చినందుకు ఒకేసారి చాలా కాపీలు అమ్ముడయ్యాయని.
ఆఫీసుకు వెళ్తూ అప్పుడప్పుడు దారిలో వారింటి దగ్గర ఆగేదాన్ని. కాసేపు పిల్లులతో ఆడుకుని కొన్ని కబుర్లు చెప్పుకుని వెళ్ళేదాన్ని. మహిళల కోసం మొట్ట మొదట ప్రారం భించిన డైలీ పేజీ వసుంధర. అందులో కుట్లూ అల్లికలూ తప్ప సీరియస్‌ విషయాలు వేయడం లేదని కొందరు విమర్శించేవారు. ఒకసారి ఆ మాటే ఆమెతో చెప్పాను. చాలా మంది చాలా రకాలుగా అంటారు, పట్టించుకోవద్దు. అన్నప్రాసన నాడు ఆవకాయ పెట్టం కదా… ముందు ఆడవారికి న్యూస్పేపర్ చదవడం అలవాటవ్వాలి. అది అవ్వాలంటే నిత్య జీవితంలో వాళ్ళను ఆకట్టుకునే విషయాలు కనపడాలి. అప్పుడు క్రమంగా కొత్త, ఆలోచింప జేసే విషయాలను ఇవ్వొచ్చు.. అంటూ ఆమె సమర్థించడం నా కెంతో నచ్చింది. తాను నమ్మిన విధానాన్నే మనస్ఫూర్తిగా ఆచరిస్తూ మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళే ఆమె స్వభావాన్ని ఆరాధనగా చూసేదాన్ని.

          అలా ఆమె పరిచయం నాకో కొత్త ప్రపంచాన్ని చూపించింది. నిజానికి మా ఇద్దరికీ చాలా తక్కువ మాట్లాడే అలవాటు. ఓసారి మాటల్లో చదువుకునేటప్పుడు నేను రాసిన చిన్న కథ గురించి చెప్పాను. ఎవరిని పెళ్ళి చేసుకోవాలనే విషయంలో ఓ యువతి అంతర్మథనం అది. అంతా విని అప్పుడు తన కథల పుస్తకం ఇచ్చారు. అలా మొదలు పెట్టి ఆమె కథలూ ఇంకా ఎన్నో పుస్తకాలు… ‘వరద స్మృతి’ వరకు చదివాను. ఆమె కథల్లో బోన్సాయ్‌ బతుకులు, సుఖాంతం నాకు చాలా ఇష్టం. 2004 లో ఒకసారి వసుంధర కోసమూ, ఆ తర్వాత చతుర కథ వెనుక కథ శీర్షిక కోసమూ ఇంటర్వ్యూలు చేశాను.
సంప్రదాయ కుటుంబం

          కట్టుబాట్లనూ ఆచారాలనూ తు.చ. తప్పక ఆచరించే సంప్రదాయ కుటుంబంలో ఒద్దికగా పెరిగిన ఆమె అదృష్టవశాత్తూ ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగమూ చేయగలి గారు. ఆడపిల్ల నోరు తెరిచి నవ్వడమే తప్పుగా భావించే ఆ నాటి తను పెరిగిన వాతావరణమే తన రచనలకు ప్రేరణ అయిందని చెప్పేవారు ఛాయాదేవిగారు. ఒక్క కొడుకు కొడుకు కాదు… అని నమ్మే రోజులవి. అప్పటికే ఒక కొడుకూ కూతురూ ఉండ డంతో మూడో సంతానం అబ్బాయి కావాలనుకుని సూర్యనమస్కారాలు చేశారట ఆమె తల్లిదండ్రులు. అమ్మాయి పుట్టడంతో ‘ఛాయాదేవి’ అని పేరు పెట్టి ఐదారేళ్ళు  వచ్చే వరకూ అబ్బాయి దుస్తులు వేసి పెంచారట. ఒక విధంగా అది ఆమె చదువుకీ దోహదం చేసింది. ఆమెకు విద్యారేఖ బాగుందనీ, మగపిల్లవాడైతే చదివించనా అనీ… తండ్రి ఆమె చదువును ప్రోత్సహించారట. భారతి పత్రికలన్నీ ఇంటికే తెప్పించేవారట. అయితే ఒక దశలో తన అక్కకి చేసినట్లే స్కూలు ఫైనల్‌ కాగానే తనకీ పెళ్ళి చేద్దామనుకున్నారనీ, అన్నయ్యే తనకి అండగా నిలిచి చదువుకునేలా చూశాడనీ చెప్పారు. మధ్యతరగతి కుటుంబాలూ సమాజపు కట్టుబాట్లూ పురుషాధిక్యతా… వీటన్నిటినీ చూస్తూ పెరిగి, బి.ఏ. వరకూ చదువుకున్న ఛాయాదేవి ఎం.ఏ.లో చేరాక తన ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడం ప్రారంభించారు. ఆమె తొలికథ ‘అనుభూతి’ 1952లో నిజాం కళాశాల మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. వాళ్ళ ఇంట్లో అన్నింటా తండ్రి అజమాయిషీనే నడిచేది. తల్లీకూతుళ్ళు ఏ చీరలు కట్టుకోవాలో ఆయనే నిర్ణయించేవారట. దాన్నే భార్యాభర్తలకు ఆపాదిస్తూ భార్య ఏ చీర కట్టుకోవాలో, ఏ నగలు పెట్టుకోవాలో, ఏ సంగీతం వినాలో … అన్నీ భర్త శాసిస్తున్నట్లు రాసిన కథ అది. పత్రికల్లో అచ్చయిన తొలి కథ ‘విమర్శకులు’. 1955లో తెలుగు స్వతంత్రలో ప్రచురితమైంది.

          తన కథలకు ముడిసరకును ఆమె ఎంతగా జీవితంలో నుంచి తీసుకున్నారనడా నికి ఉదాహరణ… ‘మూణ్ణాళ్ళ ముచ్చట’ అనే కథ. ‘చతుర’ కోసం ఇచ్చిన ఇంటర్‌వ్యూలో దాని గురించి వివరాలను పంచుకున్నారామె. నెలసరి సమయంలో స్త్రీలు దూరంగా ఉండటాన్ని ప్రశ్నిస్తూ అది వారికి ఎంత అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉంటుందో చెబుతూ రాసిన ఆ కథ ఆ నాటి ఛాందసవాద సమాజంలో పెద్ద సంచలనమే సృష్టించిం దట.

అది ముచ్చట కాదు

ఈ కథ 1973లో ఒక ప్రముఖ వారపత్రికలో ప్రచురితమైంది. నిజంగా దాన్ని ప్రచురిస్తారన్న ఆశ లేకపోయినా పంపించారు ఛాయాదేవి. పంపించాక ఆ విషయం మీద కథ రాసి పంపానని భర్తకు చెప్పారు. ఆయన ‘లాభం లేదు, ప్రచురిం చరు’ అన్నారట నవ్వుతూ. అసలు కథకు ఆమె ఆ అంశాన్ని ఎంచుకోవడానికీ ఒక కారణముంది. 1960లో ఒక వారపత్రిక ‘స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటి’ అని వ్యాసరచన పోటీ పెట్టింది. అది చూసి ఛాయాదేవి భర్తని అడిగారట ఆయన ఉద్దేశం లో స్త్రీల సమస్య ఏమిటని. నెలనెలా పడే బాధ- అని ఠక్కున సమాధానమిచ్చారట ఆయన. అది వినగానే తాను ‘ఛీ’ అన్నాననీ కానీ తీరిగ్గా ఆలోచిస్తే నిజమే కదా అనిపించిం దనీ అయితే దాని మీద వ్యాసం రాస్తే ఏం బాగుంటుందని రాయలేదనీ చెప్పారు. కానీ తల్లి చాదస్తం వల్ల తాను చాలా బాధపడ్డాననీ, కాలేజీకి వెళ్ళడానికి ఆమెతో పోరాటమే చేయాల్సి వచ్చేదనీ, హైదరాబాద్‌లో సోదరుడి ఇంటికి వచ్చాక తనకి ఆ విషయంలో స్వేచ్ఛ లభించినట్లయిందనీ చెప్పారామె. పెళ్ళయ్యాక అత్తగారింట్లో అంత ఛాంద సత్వం లేకపోవడం వల్ల బతికిపోయినప్పటికీ తల్లికి అబద్దాలు చెప్పవలసి రావడం, ఆమె తమ ఇంటికి వచ్చినపుడు ఆచారాన్నిపాటిస్తున్నట్లు నటించాల్సిరావడం, ఈ క్రమంలో భర్తకీ తల్లికీ మధ్య తాను నలిగిపోవడం… జరిగేది. స్వతహాగా ఆమెది మెత్తటి స్వభావం. ఎదుటివారితో దబాయించి మాట్లాడలేరు. దాంతో తన ఆలోచనలన్నిటినీ కథలుగా రాసి అందులో సాంత్వన పొందడం మొదలెట్టారామె. ఆ క్రమంలోనే ‘మూణ్ణాళ్ళ ముచ్చట’ రాశారు. అది చదివి పాఠకులు కొందరు ‘ఛాయాదేవి గారేంటి… ఇలాంటి కథ రాశారూ’ అని పత్రికా కార్యాలయానికి ఉత్తరాలు రాస్తే ఆమె అక్కయ్య వాళ్ళేమో ‘కథ రాయడానికి ఇంతకన్నా మంచి విషయం దొరకలేదా’ అని తిట్టుకున్నా రట. తనని మాత్రం ఎవరూ నిలదీయలేదనీ, కాకపోతే క్రమంగా బంధువుల ఇళ్ళలో పట్టింపులు సడలడాన్ని తాను చూశాననీ చెప్పారు ఛాయాదేవి గారు. ఆ తర్వాత చాలా కాలానికి ఆ కథ చదివిన స్త్రీవాద రచయిత్రులు కొందరు ఆ రోజుల్లోనే ధైర్యంచేసి ఆమె అలాంటి కథ రాసినందుకు మెచ్చుకున్నారట. అయితే ఒకప్పుడు కేవలం అగ్రకులాల సమస్యగా ఉన్న ఈ ఆచారం తర్వాత పూజల పేరుతో అన్నికులాలకీ పాకడాన్ని గమనిం చిన ఆమె ఆ కథా వస్తువు ఈనాటికీ వర్తిస్తుందన్న ఉద్దేశంతో ‘మూణ్ణాళ్ళ ముచ్చట’ని 2002లో వచ్చిన తన కథల సంకలనంలో చేర్చారు.

పెళ్ళీ ప్రత్యేకమే!

ఛాయాదేవిగారికి బి.ఏ. అవగానే ఒక పెళ్ళి సంబంధం కుదిరింది. నిశ్చితార్థం చేసుకుని వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి పెద్దలకు చెప్పకుండా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసేసుకున్నాడట. ఛాయాదేవిగారి నాన్న రాజమండ్రిలో ప్రముఖ న్యాయవాది. ఈ సంఘటనతో తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని బాధపడుతున్న ఆయన్ను ఊరడించి ఛాయాదేవిని హైదరాబాద్‌ తీసుకొచ్చి ఎం.ఏ.లో చేర్పించారు ఆమె అన్నగారు. నగరానికి వచ్చాక ఆమె ప్రపంచం మరింత విశాలమైంది. మొదటి నుంచీ నాటకాలంటే ఇష్టం ఆమెకు. ఉత్సాహంగా రేడియో కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అప్పుడు ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూ టివ్‌గా ఉన్న భాస్కరభట్ల కృష్ణమూర్తిగారు ‘భర్తను ఎంచుకోవడం ఎలా’ అనే విషయం మీద ప్రసంగం రాయమన్నారట. అందులో ఆమె రాసిన అభిప్రాయాలను చూసిన కృష్ణా రావుగారు- అబ్బూరి వరద రాజేశ్వరరావుగారు ఆమెకు తగిన వరుడని సూచించారట. కట్నం అడగనంటే చేసుకుంటానన్నారట ఛాయాదేవి గారు. కట్నమే కాదు, కానుకలూ వద్దని కబురు చేశారట రాజేశ్వరరావుగారు. ఖర్చేమీ లేకుండా రిజిస్టర్‌ పెళ్ళి చేసుకుందా మని ఆయన అనుకున్నా ఛాయాదేవి గారి కుటుంబం అంగీకరించక సంప్రదాయ పద్ధతుల్లోనే చేశారట. కట్నాలూ కానుకల పేరుతో పురుషులూ, నగలూ చీరల పేరుతో స్త్రీలూ పెళ్ళిళ్ళకు దుబారా చేస్తున్నారని ఆమె అభిప్రాయపడేవారు.

అధికారం స్థానంలో అనురాగం

అన్నయ్య, వదినల్ని చూసి పెళ్ళి చేసుకుంటే స్వేచ్ఛ లభిస్తుందనుకునేవారట ఛాయా దేవి. ఒకరి మీద ఆధారపడకుండా తన ఇంట్లో తన ఇష్టప్రకారం ఉండొచ్చనుకునేవారట. మరి ఆమె కోరిక తీరిందా… అని అడిగితే ‘అదంతా భ్రమేనని తేలిపోయింది, తన ఎంపిక బాగుంటుందన్న నమ్మకంతో ఆయనే చీరల ఎంపిక చేసేవారు. పుట్టింట్లో నాన్న అధికారంతో చేస్తే ఇక్కడ భర్త అనురాగంతో చేసేవారు. అదే తేడా’ అని చెప్పారు నవ్వుతూ. పెళ్ళయిన వారానికి భర్త జీతం తెచ్చి తన చేతికి ఇస్తే స్వేచ్ఛ ఇచ్చినట్లు అనిపించలేదనీ, బాధ్యత అప్పజెప్పినట్లు అనిపించిందనీ అన్నారు. జ్ఞాపక శక్తి తక్కువ గా ఉండడం, నలుగురి ఎదుట గట్టిగా మాట్లాడలేకపోవడం తన మైనస్‌ పాయింట్లనీ, అవగాహనాశక్తి తన బలమనీ గుర్తించి తనకి లెక్చరర్‌ ఉద్యోగం కన్నా లైబ్రేరియన్‌ ఉద్యోగం నప్పుతుందని అదే చేయమని ప్రోత్సహించారట వరద రాజేశ్వరరావుగారు. అయితే ఆఫీసు నుంచి రావడం కాస్త ఆలస్యమైతే ఏమైపోయిందోనని కంగారు పడిపోయే వారట. దాంతో ఆయన ఏమనుకుంటారోనన్న భయం తనని నిత్యం వెంటాడేదనీ, స్వేచ్ఛ లేనట్లు బాధపడేదాన్ననీ, అన్నీ ఉన్నా ఏమీ లేనట్లు అసంతృప్తిగా ఉండే దాన్ననీ అన్నారామె. ‘చిన్నప్పుడు నాన్నగారు పెంచిన రెక్కల పై కొత్త రెక్కలు అతికిం చారు మా వారు. వాటితో ఎగురుతున్నట్లనిపించేది కాదు, సొంతంగా పెంచుకున్న రెక్కల్తో ఎగరాలనిపించేది. నా అంతట నేను ఏదో సాధించాలనిపించేది. కానీ ఇప్పుడు తలచుకుంటే అదంతా తెలివి తక్కువ తనం అనిపిస్తుంది. రెక్కలు కట్టుకున్నా ఎక్కడికి ఎగరగలం, ఎక్కడో చోట దిగాల్సిందేగా. హక్కుల కోసం పోరాడటం, ఛాందస సంప్రదా యాలపై తిరగబడటం అవసరమే. కానీ ఎదుటివారిలో ఆధిపత్యాన్ని కొంత వరకు సహిస్తూనే వారి ఆధిపత్యధోరణి ఎలా ఉందో వారికి చూపించి, అవగాహన కలిగించడం మరింత ముఖ్యమని జిడ్డు కృష్ణమూర్తి రచనల ప్రభావంతో తెలుసుకున్నా’ అని చెప్పారు ఛాయాదేవిగారు. అన్నట్లుగానే ఆమె ఎంతో సాధించారు. ఎందరి మనసుల్లోనో స్వాభి మానం తాలూకు సరికొత్త ఆలోచనలను రేకెత్తించారు.

          ఛాయాదేవిగారు చాలాకాలం ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా ఉద్యోగం చేశారు. 1980వ దశకంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి హైదరాబాద్‌ తిరిగి వచ్చేశారు. ఛాయాదేవిగారి రచనలు పలు భారతీయ భాషల్లోకే కాదు, విదేశీ భాషల్లోకీ అనువాదం అయ్యాయి. ‘తన మార్గం’ కథాసంపుటికి ఆమె కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ‘వనిత’ పేరుతో ఒక మాసప్రతికను ప్రారంభించి దాదాపు ఏడాది పాటు నిర్వహించారు. జిడ్డు కృష్ణమూర్తి రచనలను తెలుగులోకి అనువదించారు. ఆమె రాసిన ‘బోన్సాయ్‌ బ్రతుకు’ కథని తెలుగు, ఆంగ్ల భాషల్లో పదో తరగతి, ఇంటర్‌మీడియట్‌ విద్యార్థులకు పాఠంగా పెట్టడం విశేషం.

          స్త్రీవాదం అన్న మాట తెలియని రోజుల్లోనే స్త్రీకి ఒక ఆత్మ ఉంటుందనీ దానికీ ఇష్టాయిష్టాలు ఉంటాయనీ చెప్పే కథలు రాసిన ఆలోచనాపరురాలు ఆమె. చదువూ, దాని ద్వారా వచ్చే వ్యక్తిత్వవికాసమే స్త్రీల అభివృద్ధికి బాట వేస్తాయని నమ్మేవారు. మనసుని మన నియంత్రణలో ఉంచుకోవాలి, ప్రాక్టికల్‌గా ఆలోచించాలి… అని చెప్పే వారు. స్త్రీలను సమాజం మరుగుజ్జులుగా మార్చేస్తోందనీ, ఆలోచనల్లో ఆచరణలో సమానత్వం ఉండాలనీ, స్త్రీల పై ఆంక్షలు ఉండకూడదనీ, అందుకోసమే పోరాడాలనీ, తన దృష్టిలో స్త్రీవాదం అంటే అదేననీ చెప్పేవారామె. పురుషుడు స్త్రీని గౌరవించడం నేర్చుకున్ననాడు సమానత్వం సాధ్యమేననేవారు. సంప్రదాయం ముసుగులో మహిళాశక్తి నిస్తేజంగా, నిరుపయోగంగా మారకుండా జవజీవాలు పొందాలన్నదే తన ఆరాటమని చెప్పేవారు. రచయిత్రిగా అర్థ శతాబ్ద సుదీర్ఘ ప్రయాణంలో మహిళల జీవితాలకు సంబం ధించి ఆమె తాకని అంశం లేదంటే అతిశయోక్తి కాదు. అంతటి సహనం, సౌజన్యం నేను ఇంకెవరిలోను చూడలేదు. బూదరాజు రాధాకృష్ణ గారు ఆమె గురించి అలా ఎందుకన్నారో ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నాను.

*****

Please follow and like us:

6 thoughts on “ప్రమద – అబ్బూరి ఛాయాదేవి”

  1. చాలా బాగా రాసారు పద్మశ్రీ గారూ! అబ్బూరి ఛాయాదేవి గారి గురించి చాలా కొత్త సంగతులు తెలిసాయి. అభినందనలు.

  2. చాలా బాగా రాసేరు , ఆవిడ జీవన రేఖలు, అభిప్రాయాలు ఈ వ్యాసంలో రచయిత్రి సులభ పదాలతో చివరివరకూ ఆసక్తి గా చదివేలా రాసేరు. అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.