పేషంట్ చెప్పే కథలు – 26

బలి

ఆలూరి విజయలక్ష్మి

          పాలరాతి శిల్పంలా నిశ్చలంగా కూర్చుంది శచి. సూన్య నయనాలతో ఎదురుగా వున్నా గోడవంక చూస్తూందామె. 

          “ఏమ్మా! ఒంట్లో ఎలా వుంది?” ఆమె భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా అడిగింది శృతి. 

          “ఏం బావుండడం, ఎత్తుబారం బావుండడం..” శచితల్లి వైదేహి పెద్దకంఠంతో అందుకుంది. 

          “ఒక్క నిమిషం, మీరిలా రండి” వైదేహి చెయ్యి పుచ్చుకుని ప్రక్క రూమ్ లోకి తీసుకు వెళ్ళింది శృతి. 

          “ఆ అమ్మాయి జడుసుకునేలా మీరంత గట్టిగా చెప్తే ఎలా?” మందలింపుగా అడిగింది శృతి. 

          “నా తీరే అంత. ఇప్పుడు క్రొత్తగా ఏం నేర్చుకుంటాను?” కరుగ్గా అంది వైదేహి. 

          “సాచి పూర్తిగా కోలుకోకుండానే వద్దన్నా వినకుండా తీసుకెళ్ళిపోయారు.” ఆవిడ మాటల్ని పట్టించుకోకుండా ఏదో చెప్పబోతున్న శృతిని మధ్యలోనే ఆప్పిందావిడ. 

          “అంతా మా ఖర్మ. నేనట్లాంటి  నోములు నోచాను. ఇట్లాటి కొరకరాని కొయ్య పుట్టుకొచ్చింది” ఆవిడ వేదాంత శ్రవణం చిరాకు పుట్టిస్తూంది శృతికి. 

          “లక్షణంగా పెళ్ళిచేస్తే మొగుడితో కాపరం చేసుకోకుండా ఈ పెంకెతనమేమిటి, మీరైనా చెప్పండి” శృతిని నిలదీసిందావిడ. ఆవిడలా అనగానే మొదటిసారి తాను చూసిన సాచి రూపం గుర్తుకొచ్చి వెన్ను జలదరిస్తూంది శృతికి. 

          వాచిపోయి ఎర్రగా వున్నా కళ్ళు, కందిపోయిన చెక్కిళ్ళు, కుసుమ కోమలంగా వున్నా ముఖం నిండా గాట్లు, ఛిద్రమై తెగి వేలాడుతున్న మల్లెలమాల, మెడలో పసుపుతాడు, రక్తసిక్తమైన తెల్లచీర, పెను తుఫానులో లేలేత ఆకులా కంపిస్తున్న శరీరం.. శచిని చూడగానే బాధతో వొణికింది శృతి గుండె. 

          “ఏం జరిగిందమ్మా?” శచిని పరీక్షచేస్తూ శచి వదిన సూవర్చలను అడిగింది శృతి. 

          “ఈ రోజు శోభనం…” సంకోచంతో, సిగ్గుతో ఆగిపోయిందామె. 

          “ఏమవుతుంది అమ్మాయి మీకు?” సెలైన్ స్టార్ట్ చేస్తూ అడిగింది శృతి. 

          “మా ఆడబడుచు.”

          “మీరు కాసేపు బయట కూర్చోండి” గ్లోవ్స్ చేతికి తొడుక్కుంటూ చెప్పింది శృతి. శచిని టేబుల్ మీదకు మార్పించి మర్మావయవాల్ని విడదీసి రక్తం ఎక్కడి నుంచి వస్తుందో చూడడానికి ప్రయత్నించింది. మత్తు ఇంజక్షన్ చేసినా బాధతో విలవిలలాడింది శచి. మర్మావయవాలు, యోని ద్వారం, యోని లోపలి భాగం లోతుగా చీరుకుపోయాయి. చీరుకుపోయిన చోటల్లా కుట్టీ బ్లీడింగ్ ఆగిందని నిర్ధారణ చేసుకుని, గాయాలన్నిటికీ ఆయింట్ మెంట్ రాసింది శృతి. 

          ఒక బాటిల్ రక్తం, రెండు బాటిల్స్ సెలైన్ ఎక్కించాకగాని శచి జనరల్ కండిషన్ మెరుగుపడలేదు. మరునాటి ఉదయం దాకా భయంతో, బాధతో శచి వేస్తున్న కేకలు శృతి చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే వున్నాయి. ఏ చిన్న శబ్దమయినా సరే, తన భర్తే వస్తున్నాడేమోనని బెదిరిపోతూ విహ్వలంగా అరుస్తున్న ఆ పసిదాన్ని చూస్తూంటే హృదయం దేవేసినట్లుగా వుంది శృతికి. 

          “యింత చిన్న పిల్లకి అప్పుడే పెళ్ళి చేసారేమిటమ్మా?” సువర్చలను అడిగింది శృతి. అప్పటిదాకా సువర్చలలో ఆవిర్లు కక్కుతున్న ఆవేశం శృతి ప్రశ్నతో ఒక్కసారిగా బయటికి పొంగింది. 

          “ఏం చెప్పమంటారు, ఒట్టి మూర్ఖులు. నేనూ మా వారూ అప్పుడే దానికి పెళ్ళేమిటి, చదివించుదామని చివరి క్షణం దాకా దెబ్బలాడాము. వినిపించుకుంటేనా?! మా అత్తగారిది మొండిపట్టు. ఇంతోటి సుగుణాభిరాముడు మరి దొరకనే దొరకడని ఆవిడ అభిప్రాయం… దానికి నిండా పన్నెండేళ్ళు లేవు. మెట్యూర్ అయి రెండు నెలలన్నా అవలేదు. ఆ మహానుభావుడు దీని ప్రాణం తియ్యడానికి ముప్పైయేళ్ళు నిండుతున్నా ఇప్పటిదాకా పెళ్ళి చేసుకోకుండా కూర్చున్నాడు. మా అత్తగారికి స్వయానా తమ్ముడు – దానికితోడు వెయ్యిరూపాయలు ఉద్యోగం, వెనక కట్టుకుపోయినా తరగనంత ఆస్థీ. డబ్బు మైకంలో ఆవిడకు ఇంకేం తెలియడం లేదు. అతని తిరుగుళ్ళు, వ్యసనాలు తెలిసి కూడా పెళ్ళయితే వాడే కుదురుగా ఉంటాడని కొట్టి పారేసి మా అందరితో యుద్ధం చేసి ఈ పిల్ల మెడలు వంచి తాళి కట్టించింది.”

          “భలే ఆవిడే!” ఆశ్చర్యంగా చూసింది శృతి. 

          “భలే ఆవిడని నెమ్మదిగా అంటారు, దేవాంతకురాలు! అంత డబ్బుయావ వున్నా మనిషిని ఇంకెక్కడా చూడం… ఇంకా అతనెలాంటి వాడో చూసారుగా!” ఏదో పీడకల కంటున్నట్లుగా సువర్చలా కళ్ళు భయంతో, బాధతో రెపరెపలాడాయి. 

          “అతి భయంకరంగా రేప్ చేసాడు దాన్ని. భయంతో అది అరిచినా అరుపులు విని నా గుండె లవిసిపోయాయి. దాని ఏడుపు విని నా ప్రాణం కడగట్టిపోయింది” సువర్చల గొంతు రుద్దమయింది. 

          నాలుగయిదు రోజుల్లో శారీరకంగా కొంత కోలుకుందిగాని మానసికంగా అలాగే వుంది శచి. అవే బిత్తర చూపులు, భయంతో కంపించి పోవడం, ఉన్నట్టుండి పెద్దగా ఏడవడం, ఆమె భయాన్ని పోగొట్టి మానసిక స్వాస్థ్యము చేకూర్చడానికి శృతి ప్రయత్నిస్తూ ఉండగానే శచి తల్లి బలవంతంగా ఆమెను యింటికి తీసుకుపోయింది. 

          “మిమ్మల్నే” వైదేహి అదిలింపుతో వాస్తవంలోకి వచ్చింది శృతి. 

          “దాన్లో ఏం జబ్బుందో కాస్త కనిపెట్టి చూడండి. ఆడినో దెయ్యాన్ని చూసినట్లు చూస్తాంది. ముట్టుకుంటే చాలు తెలివితప్పి పడిపోతాంది. దీని వాలకం చూసి దీన్నసలు ఏలుకోను పొమ్మంటున్నాడు. ఇంకో పెళ్ళి చేసేసుకుంటానంటున్నాడు… నాలుగు రోజుల్లో కోలుకుని కాపరానికెళ్ళేలా మంచి మందులు రాసివ్వండి. మీ ఋణముంచుకోను.” బడాబడా చెప్పుకు పోతూందావిడ. 

          “ఆ అమ్మాయినిప్పుడు కాపురానికి పంపడం కంటే తెలివితక్కువ పని మరొకటుండదు. కొన్నాళ్ళు ఆమె మానాన ఆమెను వదిలేయండి. చదువుకోనివ్వండి. ఏదో ఒక వ్యాపకంలో పడితే అన్నీ క్రమేపీ సర్దుకుని మామూలు మనిషవుతుంది. అప్పుడు ఆలోచించుదురుగాని కాపురానికి పంపే సంగతి.” ఆవిడ దురుసుగా మాట్లాడుతున్నా సహనం వహించి ఆమెతో ఎంతోసేపు వాదించి నచ్చజెప్పాలని చూసింది శృతి. 

          “మంచి బాగా చెప్తున్నావు. నీ దగ్గరకు రావడం కొరివితో తలా గోక్కున్నట్లుగా ఉంది. చాల్చాల్లె ఇట్టాంటి సలహాలింకెవ్వరికీ యివ్వమాకు. కాపరం నిలబెట్టడం గొప్పగాని, కాపరం కూలదోయ్యడం పెద్ద బ్రహ్మవిద్యకాదు” తెల్లబోయి చూస్తున్న శృతిని దులిపేసి రుసరుసలాడుతూ శచి చెయ్యి పుచ్చుకుని బరబరా లాక్కుపోయింది వైదేహి.

*****     

Please follow and like us:

2 thoughts on “పేషంట్ చెప్పే కథలు-26 బలి”

  1. ‘ బలి కథ చదువుతుంటే ఒళ్ళు జలదరించింది. శచి భర్త లాంటి వాళ్ళు ఉంటారేమో గానీ , వైదేహి లాంటి తల్లులు ఈ కాలంలో కూడా ఉంటారంటే నమ్మలేం. కానీ , సుప్రసిద్ధ వైద్యులు, రచయిత్రి అయిన డా. ఆలూరి విజయ లక్ష్మి గారు తమ సర్వీసులో ఇలాంటి వాళ్ళను ఎందర్ని చూసి ఉన్నారో! శచి భర్త లాంటి వాళ్ళు , వైదేహి లాంటి వాళ్ళు ఒక్కరు మారినా రచనకు ప్రయోజనం చేకూరినట్టే ! మంచి కథ .. ధన్యవాదాలు

  2. నమస్తే మేడమ్ గారు🙏 పేషెంట్ చెర్పే కథలు చదువు తుంటే చాలా బాధనిపించింది. ఇలాంటి మూర్ఖులు కూడా ఉన్నారా అనిపించింది మేడమ్ గారు చాలా బాగా వ్రాశారు కళ్ళకు కట్టినట్లు గా 👏👌💐👏👌💐👏👌💐👏👌💐🙏

Leave a Reply

Your email address will not be published.