నా అంతరంగ తరంగాలు-15

-మన్నెం శారద

          ఆర్ట్ మీద ఇంటరెస్ట్ కొద్దీ కొన్ని రోజులు నా చదువుకి సంబంధించని ఆర్టిస్ట్ జాబ్ ఒక ఫ్యామిలీ ప్లానింగ్ ట్రైనింగ్ సెంటర్ లో చేశానని మీకు అదివరలో చెప్పాను కదా!

          అందులో చేయడం కోసం డ్రాయింగ్ హయ్యర్ కూడా పాసయితే బాగుంటుందని , లోయర్ పాస్ కాకుండా డైరెక్ట్ గా హయ్యర్ ఎగ్జామ్ మద్రాస్ లో రాయవచ్చని తెలిసి   గుంటూరులో ఒక మాస్టర్ గారి దగ్గర జాయిన్ అయ్యాను.

          ఆఫీస్ నుండి వస్తూ ఒక గంట అక్కడ నేర్చుకునేదాన్ని.

          ఆ మాస్టారు డ్రాయింగ్ టీచర్ కావాలనివచ్చే పిల్లలకు నేర్పించేవారు.

          ఆయన సిటీలో చాలా షాపులకి, హోటల్స్ కి, హోర్డింగ్స్ కూడా  వేస్తుండేవారు.

          మా నాన్నగారి గురించి తప్పా నేను మరే విషయం ఆయనకు చెప్పలేదు.

          నా చదువు, ఉద్యోగం గురించి ఏమీ చెప్పలేదు. ఆయన కూడా స్టూడెంట్ అనే అనుకునేవారు.

          ఆయన తన హోర్డింగ్స్ వేసుకుంటూ మాకు నేర్పిస్తుండేవారు.

          నన్ను తప్పా మిగతా పిల్లల్ని కొంచెం హేళనగా తిడుతూ నేర్పిస్తుండేవారు.

          నేను ఒకపక్క నేర్చుకుంటూనే ఆయన హోర్డింగ్స్ వేసే బొమ్మలకు ఎలా  రంగులు మిశ్రమం చేస్తున్నారో, షేడ్స్ ఎలా ఇస్తున్నారో క్రీగంట గమనించేదాన్ని.

          ఎప్పుడయినా ఆయన గమనిస్తే నన్ను ఏమీ అనలేక  పిల్లలందర్నీ కలిపి  కేకలేసేవారు.

          ఇంటికొచ్చి నేను మా అక్కకి ఎలా కలర్స్ మిక్స్ చేస్తున్నారో చెప్పేదాన్ని.

          మాకు అప్పట్లో నిర్మల్ పెయింటింగ్స్ లా వేయాలని చాలా ఆశక్తి ఉండేది. అందుకోసం ఆ బొమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలించి అలాగే Masonite sheets కట్ చేయించి  ఫ్రెమ్ చేయించేవాళ్ళం. దానికి ప్రైమర్ పూసి పైన  బ్లాక్ కలర్ emulsion రెండు మూడు కోటింగులు వేసి వాటిని  దుమ్ము దూళి పడని గదిలో మంచం క్రింద అతిజాగ్రత్తగా  భద్రపరిచే వాళ్ళం.

          తెల్లావారి పరిగెత్తుకెళ్ళి చూస్తే సన్నటి దూళి పొర పెయింట్ మీద అతుక్కుని ఉండేది.

          మళ్ళీ సాండ్ పేపర్ తో క్లీన్ చేసి మళ్ళీ పెయింట్ చేసేవాళ్ళం.

          అయినా ఇంత కష్టపడినా నిర్మల్ పెయింటింగ్స్ ఉన్నంత స్మూత్నెస్ వచ్చేది కాదు.

          సరే, ఇప్పుడు దాని మీద  బొమ్మ ట్రేస్ చెయ్యాలి.

          ఎలా??

          మేము తీసుకున్నంత  ఫ్రేమ్ సైజ్ లో ఒక షీట్  తీసుకుని దాని మీద బొమ్మ వేసేవాళ్ళం. ఆ బొమ్మకు వెనుక పెన్సిల్ లైన్ ని అనుకరిస్తూ చాక్ పీస్ తో గట్టిగా రుద్ది, దాన్ని చెక్కమీద పెట్టి పెన్సిల్ తో దిద్దితే చాక్ పీస్ లైన్ పడేది. అప్పుడు మిగతా డస్ట్ దులిపేసి రంగులు వేయడం మొదలెట్టేవాళ్ళం.

          అప్పట్లో ఏ రంగులయినా ప్రైమరీ కలర్స్ మాత్రమే దొరికేవి. ఇప్పటిలా సెకండరీ  కలర్స్ లేవు.

          ప్రైమరీ కలర్స్ అంటే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు… అలా. షేడ్స్ కావాలంటే మనం వీటికి మరో రంగు మిశ్రమం చేయాల్సివుంటుంది. వాటిని సెకండరీ  కలర్స్ అంటారు.

          కానీ ఇప్పుడు అవన్నీ డైరెక్ట్ గా అందుబాటులోకి వచ్చేసాయి. ఆర్టిస్ట్ కి ఇప్పుడు పూర్వపు అంత శ్రమ లేదు.

          స్కిన్ కలర్ వేయాలంటే మేము ఎన్నో ప్రయోగాలు  చేయాల్సివచ్చేది.

          మొత్తానికి  బొమ్మలు బాగానే  తీర్చి దిద్దేవాళ్ళం.

          నేను ఎక్కువగా వడ్డాది పాపయ్య గారి  బొమ్మలు, జేపీ. సింఘాల్ గారి  బొమ్మలు అనుకరించేదాన్ని.

          సరే ఇప్పుడు అసలు విషయానికి  వస్తాను.

          మొత్తానికి  మద్రాస్ లో పరీక్ష టైం వచ్చేసింది. మాస్టారు  స్టూడెంట్స్ తీసుకుని  చెన్నై బయలుదేరారు.

          మేం వేరుగా చెన్నైలో వున్న అక్క ఇంటికి వెళ్ళాం.

          అలా ఆ  పరీక్ష  ముగిసింది

          రిజల్ట్స్ వచ్చేయి

          అవి మాస్టర్ గారి దగ్గరకే  వస్తాయి.

          నేను ఫస్ట్ క్లాస్ లో పాసయ్యే ను.

          ఆ  విషయం  చెప్పాలని  మాస్టారు  నా  సర్టిఫికెట్ తీసుకుని  మా  ఇంటికొచ్చి క్రింద ఆఫీస్ లో వున్న మా  నాన్నగారిని  కలిశారు.

          అప్పుడు మా  నాన్నగారు  గుంటూరు అగ్రహారం  (పట్నంబజార్ ) పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. క్రింద పోస్థాఫీస్… పైన  మా  రెసిడెన్స్.

          మెట్లు ఎక్కిరాగానే  పొడవాటి   వరండా.. లోపల ప్రవేశించ గానే  అంత పొడవు  హాల్ ఉండేది. అదే మా  అక్కాచెల్లెళ్ళ స్థావరం!

          అదే మా పెయింటింగ్స్ ప్రదర్శన శాల!

          మాస్టారు లోపలికి వస్తూనే  అక్కడ  హాల్లో బొమ్మలు చూసి అదోలా అయ్యారు. నేను నవ్వుతూ ఎదురెళ్ళి నమస్కరించి ఆహ్వానించినా వారి మొహంలో ఆనందం  కనిపించ లేదు.

          అమ్మ కూడా  ఆయన్ని  గౌరవం గా  ఆదరించి  నమస్కరించింది.

          నేను ఆయనకు  బట్టలు, కొంత  గురుదక్షిణగా  నగదు  ఇచ్చి పాదాభివందనం చేసాను. నాన్నకూడ  కాసేపు  పైకి వచ్చి  వారిని  పొగిడారు.

          అయినా వారి మొహంలో కళ లేదు.

          చివరగా  లేచి వెళ్తూ  ఆయన  “ఒక్కరోజన్నా నువ్వింత పెద్ద ఆర్టిస్ట్ వని  చెప్పలేదే మమ్మా “అన్నారు గోడలకు తగిలించిన  బొమ్మల కేసి చూస్తూ.

          నాకు  అప్పుడర్ధమయ్యింది  కారణమేంటో.

          “నేను పెద్ద ఆర్టిస్ట్ ని కాదు సర్, కేవలం  నాకున్న ఇంటరెస్ట్ కొద్దీ వేసిన బొమ్మలు ఇవి! పైగా నేర్చుకోవడానికి ఒక  శిష్యురాలిగా  వచ్చి అతిశయం  ప్రదర్శించకూడదు  కదా  “అన్నాను వినయంగా నేను.

          మాస్టారు ఏమనుకున్నారో  మరి!

          ఆ తర్వాత  నాకు  ఆ జాబ్  నచ్చలేదు. అవన్నీ  మెడికల్ ఛార్ట్స్. అందులో నేను ఆశించిన  ఆర్ట్ ఏమీ లేదు.

          కొన్ని నెలల్లోనే నేను ఆ జాబ్ వదిలేసి  R&B department లో జాయిన్ అయిపోయాను.

          నాకు  నేర్చుకునే అవకాశం  రానందు వలన  మా  అమ్మాయికి నేర్పించాను.

          అలా  నా ఆర్టిస్ట్ జాబ్ సరదా తీరింది.

          కానీ  అప్పుడప్పుడూ  మాస్టారు  గుర్తొస్తే నేనేమయినా తప్పు  చేసానా  అని బాధ కలుగుతుంది.

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.