అయ్యగారు మళ్ళెప్పుడొస్తారమ్మా!

హిందీ మూలం –`సాహబ్ ఫిర్ కబ్ ఆయేంగే మా’- దామోదర్ ఖడ్సే

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

          రిసెప్షన్ నుంచి మానేజరుకి ఫోన్ వచ్చింది –కాల్ కలెక్టరు ఆఫీసు నుంచి. ఇంకా ఇప్పుడేముంది? మానేజరు మనస్సులోనే గొణుక్కున్నాడు. ఉదయం నుంచి ఇది అయిదో ఫోన్. ప్రతిసారి వచ్చిన ఫోన్ ఏర్పాటుల్లో ఏదో ఒక మార్పుని తీసుకువచ్చింది. కాని విసుగుదల అనేదాన్ని మర్యాద అనేది ఫార్మాలిటీగా అణచి వుంచుతుంది కనుక ఇటువైపు నుంచి ఆ చిరాకు ఏదీ బయటపడదు. ఉపయోగించవలసింది బిజినెస్ కి సంబంధించిన మృదువైన భాష. అదీకాక ఇంతపెద్ద కస్టమరుని నెత్తిమీద పెట్టుకోవడం తప్ప మానేజరు దగ్గర మరో గత్యంతరం లేదు. “హలో… మానేజర్ స్పీకింగ్ … హోటల్ గోల్డెన్ గేట్…”

          “చూడండి, మెనూలో ఒక ముఖ్యమైన మార్పు చెయ్యాలి…”

          “కాని సార్… నిన్నటి నుంచి మూడుసార్లు చేంజి అయింది…”

          “ఇదే ఆఖరిది కావచ్చు, కాని చాలా అవసరం… నిజానికి రేపు జరిగే మీటింగుకి ముఖ్యమంత్రిగారు కూడా వస్తారు. అందువల్ల ఆయన కూడా లంచ్ అక్కడే చేస్తారు…”

          “సార్, మేము అన్ని ఏర్పాట్లూ చేస్తాం. కాని సెక్యూరిటీ గురించి మీరు బాగా…”

          “సెక్యూరిటీ మేము ఎలాగూ చూసుకుంటాం. కాని లంచ్ గురించి మినిస్టర్ నుంచి ప్రత్యేకంగా కొన్ని ఆదేశాలు వచ్చాయి. దీన్ని మీరు సరిగా నోట్ చేసుకోండి.” కలెక్టరుగారి పి.ఎ. పూర్తి అధికారపూరిత స్వరంతో చెబుతున్నాడు.

          మానేజరు ప్యాడ్ లో రెండు పదాలు `మొక్కజొన్న రొట్టి’, `ఆవాకు కూర’ ఉద్బవిం చాయి. దానితోపాటే నూనె, కారం ఎంత ఉండాలన్నది… అన్నీ పూర్తిగా సింపుల్ గా!

          `గోల్డెన్ గేట్’ మానేజరు `యస్ సార్’ అని ఎన్నిసార్లు అన్నాడో అన్నదాన్నిబట్టి ఉత్తరువుల సంఖ్యని తేలికగా లెక్కపెట్టుకోవచ్చు. మానేజరు ఉన్నదే ఈ పనికోసం. అందులోనూ ముఖ్యమంత్రి వంటి అతిథి ఆ హోటలుకి మొదటిసారి వస్తున్నాడు. దీని వల్ల పబ్లిసిటీకి కూడా లాభం కలుగుతుంది. ముఖ్యమంత్రి అంటూ ఉన్నప్పుడు ఏదయినా ప్రకటన కూడా చేయబడుతుంది. అతని హోటలు పేరు దశదిశలా ప్రతి ధ్వనిస్తుంది. అదికూడా ఏమాత్రం ఖర్చులేకుండా…

          మానేజరు ఆదేశం అంతా బాగా జరగాలని. హోటలు యజమానులు కూడా ఈ ఏర్పాటుల గురించి చాలా జాగ్రత్తగా ఉన్నారు. మినిస్ట్రీ వరకు వాళ్ళ కాంటాక్టు ఉంది కనుకనే ఈ మీటింగు వాళ్ళ హోటల్లో జరుగుతోంది. అంతేకాక, మరేదైనా హోటల్లో ఈ ఏర్పాట్లు చెయ్యాలనే ప్రస్తావన కూడా వచ్చింది. కాని దీనివల్ల మరో హోటలుకి ఈ క్రెడిట్ దక్కుతుంది లేదా ఈ హోటలు గురించిన దుష్ప్రచారం కూడా జరుగుతుంది. ఈ హోటలుకి మంచిపేరు ఉంది. అంతేకాక ఈ రోజుల్లో పేపర్లు కూడా… వీళ్ళకి వేరే విషయాలు ఎందుకు దొరకవో తెలియదు. ఇలాంటి విషయాలు వీళ్ళు తప్పకుండా ప్రచురిస్తారు. అక్కడ పాత్రికేయులు కూడా ఉంటారు. గిట్టనివాళ్ళెవరైనా వాళ్ళ చెవిలో ఈ సంగతిని వెయ్యవచ్చు.

          ఈలోగా షెఫ్ లేదా హెడ్ కుక్ అనబడే ముఖ్యమైన వంటవాడు మానేజరుని కలుసు కున్నాడు. అతను సంతోషంగా ఉన్నాడు. విజయం సాధించిన అతని మందహాసం అతను ఏదో పరిష్కారం కనుక్కున్నట్లు చెబుతోంది. “సార్, పని జరుగుతుంది… నేను మంగతో మాట్లాడాను…”

          మానేజరు ఉలిక్కిపడి అడిగాడు, “ఈ మంగ ఎవరు?”

          “సార్, అదేనండి. గిన్నెలు తోమే మనిషి.”

          “మీరు నిశ్చింతగా ఉండండి సార్… ఏర్పాటంతా జరుగుతుంది.”

          మానేజరు వెంటనే హోటలు యజమానికి చెప్పాడు. అందరూ ఊరటగా ఊపిరి పీల్చుకున్నారు.

          ఆ రోజు మంగ ఉన్న పరిస్థితి హోటల్లోని `సేఫ్’ లాగా ఉంది. అనుకోకుండా హఠాత్తుగా తనకి ప్రాముఖ్యం లభించినందుకు ఆమె కొంచెం కంగారుపడింది. ఆ రోజు ఆమె వంట చెయ్యాలి. ఎవరి కోసం అన్నది ఆమెకి తెలియదు. కాని ఆ రోజు తన అవసరం అనేది తెలిసింది కనుక ఆమెకి చాలా బాగా, గొప్పగా అనిపించింది. అందుకే ఆమె సంతోషంగా ఉంది. లేకపోతే హోటలుకి వెనుక భాగంలో గుట్టలుగా పడివున్న పాత్రల మధ్య ఆమె తన తోటి పనివాళ్ళతో గిన్నెలు తోముతూ ఉండేది. మిగిలిపోయిన వంటకాల కోసం తపన చెందేది. ప్లేట్లు ఎత్తే బేరర్లతోనే మిగిలిపోయిన బాగున్న వంటకా లు మాయమైపోయేవి. కాని ఆ రోజు తను స్వయంగా వంట చేస్తుంది. కాని ఆమె చీఫ్ గెస్ట్ కి నిజంగా సంతోషం కలిగిస్తుందా అన్న విషయంలో వంటవాళ్ళకి నమ్మకం లేదు. కాని మంగకు మాత్రం తన మీద తనకి నమ్మకం ఉంది.

          మంగకి కావలసిన సామాను అంతా అందజేశారు. మర్నాడు ఉదయం ముఖ్య అతిథి కోసం వంటచేసే భారం ఆమెపైనే ఉంది. అందువల్ల హఠాత్తుగా ఆమె స్టేటస్ పెరిగింది. ఆ రోజు పని చేస్తూ ఉన్నప్పుడు ఆమెని ఎవరూ కోప్పడలేదు. రాత్రి ఇంటికి బయలుదేరినప్పుడు ఆమెకి భోజనం ఇచ్చారు. కాని తను తినలేదు. చిన్న కొడుకు జ్ఞాపకం వచ్చాడు. భోజనం అంతా తను ప్యాక్ చేయించింది. ఆ రోజు ఊహించకుండా తనకి ఇంత గౌరవం లభిస్తూ ఉంటే ఆమె సంతోషాన్ని పట్టలేకుండా ఉంది. తనకి మిగిలిపోయిన భోజనమే ఇచ్చారు. కాని దాని వల్ల ఏమయింది. తను తన పిల్లలకి ఎన్నో రోజుల తరువాత సరిగా అన్నం పెట్టగలుగుతుంది. ఇంత మంచి భోజనం చూసి వాళ్ళు ఎంత సంతోషపడతారు!

          హోటలు నుంచి బయలుదేరేటప్పుడు ఆమెకి ఎన్నోసార్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఆమె ఏమీ మాట్లాడకుండా వింటూ వుంది. ఈ రోజు వరకు ఎవరిని వంట చేసే చోటికి కనీసం రానివ్వలేదో అలాంటి తను మర్నాడు భోజనం వండాలి –మొక్కజొన్న రొట్టి, ఆవాకు కూర…

          తనవైపు నుంచి ఆమె అందరికీ హామీ ఇచ్చింది. హామీ ఇవ్వడం కూడా ఏముంది. కేవలం తల వంచుకుని అంగీకరించడమే.

          భోజనం ప్యాక్ చేసిన ప్లాస్టిక్ బ్యాగ్ చేత్తో పట్టుకుని ఆమె ఎంతో సంతోషంగా ఉంది. తన కాళ్ళకి రెక్కలు వచ్చినట్లుగా ఉంది. తన ఇంటివైపుకు వడివడిగా అడుగులు వేస్తూ బయలుదేరింది. మాటిమాటికీ ప్లాస్టిక్ సంచిని తడుముకుంటోంది—ఇందులో ఏమేం ఉండవచ్చు… ఎంత ఉండవచ్చు… ముగ్గురు పిల్లలకూ సరిపోతుందో లేదో… ఏమేమిటో అంచనాలు వేసుకుంటూ ఆమె తన పూరింటివైపుకు నడిచింది.

          హోటలుకి బయటవున్న ప్రపంచం ఆమెకి చిరపరిచితమైనది. బయట ముష్టి వాళ్ళ ఆకలితో వున్న కళ్ళు ఆమెని పట్టించుకోవు. ఆ రోజున ఆమె ముష్టివాళ్ళవంకకు చూసింది. కాని వాళ్ళ దృష్టిలోకి ఆమె రాదు. వాళ్ళు తమకి కావలసినవాళ్ళ కోసం ఎదురుచూడటంలో నిమగ్నమై వున్నారు. వేరేవాళ్ళని చూస్తూనే వాళ్ళు తమ రాగాన్ని ఆలాపించడం మొదలుపెడతారు. ప్లాస్టిక్ సంచిని తను ఎప్పుడు ఒక మూటగా చేసిందో కూడా తనకి తెలియదు. దాన్ని తను చంకలో గట్టిగా నొక్కిపట్టుకుని ఉంచింది. అనుకో కుండా తన మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. ఎవరైనా దాన్ని లాక్కుంటే తను ఏం చెయ్యగలదు. కాని ముష్టివాడెవరూ తనవంక చూడనేలేదు. అయినా తన అడుగుల్లో త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆదుర్దా ఉంది. ఆ రోజు తన భర్త కూడా ఇంట్లో లేడు. అతను కాపలావాడిగా పని చేస్తున్నాడు. అతని డ్యూటీ కూడా రాత్రిపూటనే ఉంది.అతను కూడా ఆ రోజు ఇంట్లోనే ఉంటే ఎంత బాగుండును. కేవలం ఇంట్లో అందరూ కడుపు నిండా అన్నం తినే దృశ్యమే ఆమె కళ్ళ ముందు కదలాడుతోంది.

          దారిలో చాలాసార్లు ఆమె మనస్సులో మొక్కజొన్న రొట్టిని, ఆవాకు కూరని చాలా బాగా చెయ్యాలనే ఆలోచన వస్తోంది. కాని మళ్ళీ పిల్లల ముఖాలు మనస్సులో తలుచుకో గానే చంకలో అణచిపెట్టి ఉంచిన భోజనం తింటున్నట్లుగా వాళ్ళని ఊహించుకుంటోం ది. అందులోంచి సువాసన కూడా బాగా వస్తోంది.

          చాలా రోజుల తర్వాత ఆమెకి తన యిల్లు దూరంగా ఉన్నట్లు అనిపించింది. ఎంతసేపటి నుంచి నడుస్తోంది తను! రోజూ ఇంటికి వెళ్ళేటప్పుడు తన మనస్సులో వంట చేసుకోవాలనే దిగులు ఉండేది. పిల్లలు ఆ చుట్టుపక్కల నుంచి కట్టెపుల్లలు ఏరుకుని పట్టుకువచ్చేవారు. వాళ్ళాయన తరచు సారా తాగి వస్తూ ఉంటాడు. ఇంట్లో అన్నం తినడానికి రోజూ ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంటికి చేరుకున్నాక పిల్లలు ఎవరితోనైనా గొడవ పడుతూ ఉంటారు. తను పని నుండి తిరిగిరావడం—అలిసిపోయిన ఒళ్ళు, లేమితోకూడిన నిరాశ తప్ప ఇంకేమీ ఉండేది కాదు. అందువల్ల ఇంటిపట్ల కూడా ఆకర్షణ తక్కువగానే ఉంటుంది. తను భారంగా కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి బయలుదే రేది. కాని ఆ రోజు పరిస్థితి మరోలా ఉంది. ఇల్లు ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోతోంది. తను ఇంటికి చేరుకోవాలని తొందరపడుతోంది.

          ఇంటికి చేరుకుని ఆమె చిన్నకొడుకుని ముద్దులతో ముంచెత్తింది. రెండేళ్ళుం టాయి వాడికి. వాడిని ఆరేళ్ళ కూతురు చూసుకుంటుంది. పదేళ్ళ పెద్దకొడుకు ఈ మధ్యనే హోటలుకి చెందిన ఒక తోపుడుబండి మీద పని చేస్తున్నాడు. మంచినీళ్ళు, టీ తీసుకు వెళ్ళి అందిస్తూ ఉంటాడు వాడు. వాడు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. కొండచరియలో ఉన్న ఆ పూరిళ్ళవాడ చాలా జనసమ్మర్దంతో కూడుకుని ఉంది. ఆమె వెంటనే తన యింటి రేకుతలుపుని లాగి తెరిచింది. చిన్నదీపం వెలిగించి పిల్లలిద్దరినీ ప్రేమగా దగ్గరికి తీసుకుంది. సంచి తెరిచి చూసింది. అందులో చాలా భోజనం ఉంది. కాని అయిదుగురికీ సరిపోతుందని చెప్పేందుకులేదు. అయినా కొన్ని తీపిసరుకులు తీసి వేరుగా పెట్టింది తన భర్త కోసం, పెద్దకొడుకు కోసం. కొంచెం పలావు, రొట్టి-కూర తీసి ఇద్దరు పిల్లలకి వడ్డించింది. అటువంటి రొట్టి సువాసన పిల్లలకి మొదటిసారి దగ్గర నుంచి అందుతోంది. అయినా, ఆమెకి తనకైతే అప్పుడప్పుడూ హోటల్లో ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది. కాని వంటకాలేవయినా పాడైపోయినప్పుడు మాత్రమే ఆమె వరకు వస్తూ ఉండేవి.

          పెద్దకొడుకు వచ్చేవరకు తను మేలుకునే ఉంది. వాడితోపాటుగానే కొంచెం అన్నం తింది. కొడుకు అలిసిపోయి ఉన్నాడు. అన్నం తినగానే నిద్రపోయాడు. ఇప్పుడింక తను ఒక్కతే మిగిలింది. పిల్లలు అన్నం తినేసి పడుకున్నారు. వాళ్ళ ముఖాలలో వెల్లివిరు స్తున్న ఆనందం ఆమెకి సంతృప్తిని కలిగిస్తోంది. ఇప్పుడింక ఆమె మనస్సులో ఆ మర్నాడు చేయవలసిన వంటకి, భోజనానికి చెందిన ఒక్కొక్క దృశ్యం మెదిలింది.

          భర్త దగ్గర లేని కారణంగా ఆమె అన్నం కూడా తినలేకపోయింది. పిల్లలతోబాటు ఏదో కొద్దిగా రుచి చూసింది. అంతే. తను ఒక్కతే తినడం ఆమెకి ఏదో నేరం చేస్తున్నట్లని పించింది. పొద్దునే తొందరగా లేవడం తప్పదనే కారణంతో తను ఆ రోజు తొందరగా పడుకోవాలనుకుంది. ఉదయం చేసిన దాంట్లో మిగిలిందేదో తిని తనుకూడా నిద్ర పోవడానికి ప్రయత్నించసాగింది. ఆ రోజు తను వంట చేసుకునే అవసరం లేకపోయింది. ఇది ఆమెకి చెప్పలేని సంతోషాన్ని ఇచ్చింది.

          ఆ రోజు రాత్రి కూడా మొత్తం పూరిళ్ళ వాడలో ఎక్కడో అక్కడ తిట్లు, కలహాలు, దెబ్బలాటలు, కొట్లాటలు, పోట్లాటలు, అరుపులు, కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. పొరుగింట్లో తాగేసివచ్చిన భర్తచేతిలో దెబ్బలు తింటూ భార్య ఎదురు సమాధానాలు చెప్పడం స్పష్టంగా తెలుస్తోంది. ఆ భర్త తిడుతున్న తిట్లు ఏవీ ఆమెకి కొత్త కాదు. ఆ విధంగా ఆమెకి తన ఇంట్లో కూడా సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇటు వంటి జగడాలలో ఎవరూ తలదూర్చరు. అంతా దానంతట అదే సర్దుకుంటుంది. తనకి నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియనే తెలియదు. ఆమె నిద్రలోనే ఏదో కలవరిస్తోంది. తన ముఖంలో ఉదయం గురించి భయం ఏమీ లేదుకాని, ఒక విధమైన ఆదుర్దా కనిపిస్తోంది. ఎప్పుడైనా తను ఏవిధమైన ఆదుర్దాతో నైనా నిద్రపోయిందా అన్నది జ్ఞాపకంలేదు. కాని ఆ రోజు మాత్రం ఆత్రుతతో కూడిన భావాలు కనిపిస్తున్నాయి. కళ్ళు ఎంత గాఢంగా మూతపడ్డాయో, మనస్సులో అదేవిధమైన బంగారు కలలతో, రంగు రంగు ల దృశ్యాలతో నిండిపోయింది….ఆ ఊహాలోకంలో ఆవాకు కూర, మొక్కజొన్నరొట్టి పెద్ద అయ్యగారికి బాగా నచ్చాయి. అందరూ సంతోషించారు. అంతా దానిగురించే మాట్లాడుకున్నారు. హోటల్లో అది శాశ్వతంగా ఒక ఐటమ్ గా కొనసాగింది… తనను ఒక పెర్మనెంటు వంటమనిషిగా పెట్టుకున్నారు. పిల్లలకి తిండి విషయంలో ఏమీ లోటు లేదు. చాలా బతిమాలుకున్న తరువాత తనభర్త తాగడం మానేశాడు. పెద్దకొడుకు చదువుకునేందుకు ఇప్పుడు దగ్గరలోనే వున్న మునిసిపాలిటీ స్కూలుకి వెడుతున్నాడు. తన పూరింటిని ఇప్పుడెవరూ తొలగించలేరు. ఇప్పుడు నీళ్ళపంపు, కరెంటు కనెక్షన్ కూడా వచ్చాయి. చూస్తూ ఉండగానే `గోల్డెన్ గేటు’ కి పర్యాయపదం ఆవాకు కూర అయింది…. ఆ కలల్లోనే ఆమెకి తన నైపుణ్యం మీద గర్వం కలిగింది…ఆమె ఒత్తిగిలి పడుకుంది. ఆమె చెవుల్లో నీళ్ళకోసం పాత్రలు చేసే చప్పుళ్ళు వినిపించసాగాయి.

          ఆమె కంగారుగా లేచింది. ఆలస్యం కాలేదు కదా? చూస్తే ఇంకా సూర్యోదయం కూడా కాలేదు.

          స్నానపానాలు ముగించుకుని తను హోటలుకి చేరుకుంది. కాని హోటలు నిర్మానుష్యంగా ఉంది. ఏం ఫరవాలేదు. తను కాస్త ఎదురుచూడగలదు. 

          కొంచెం సేపట్లోనే హోటలు పరిసరం అంతా పోలీసులకు అప్పగించబడింది. పది గంటల నుంచే జనం చేరుకోసాగారు. నిజానికి చిన్నపరిశ్రమల గురించి రాష్ట్రస్థాయిలో ఒక మీటింగు ముఖ్యమంత్రిగారి అధ్యక్షతలోనే జరగవలసి వుంది. ముందు అయితే  ఏ కారణంచేతనో ఆయన రాలేకపోతున్నారని తెలిసింది. కాని అనుకోకుండా కార్యక్రమంలో మార్పు జరిగి, ముందు అనుకున్న విధంగా సమయానికి ఆయన రావడం కారణంగా చాలా రకాల మార్పులు చేయవలసి వచ్చింది. ముఖ్యమంత్రి రాగానే మొత్తం హోటలు అంతా అయస్కాంతం ఆకర్షించినట్లుగా ఆయనచుట్టూ కేంద్రీకృతమయింది. ముఖ్య మంత్రి తన పైపుతో పొగ వదులుతూ ఎవరో స్థానిక నాయకుడితో మాట్లాడుతున్నారు. హాలులో హడావిడిగా ఉంది.

          ముఖ్యమంత్రిగారు తన ఉపన్యాసం ఇచ్చారు. ఆయన ఒక పది నిమిషాలు మాట్లాడి వుంటారు. అందులో అయిదు నిమిషాలు స్థానిక నాయకులను పొగడటంలో గడిచి పోయాయి. మరో అయిదు నిమిషాలపాటు చిన్న పరిశ్రమలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్న సందేశం ఇవ్వబడింది. పేదవాళ్ళని పైకి తీసుకురావాలనిఅన్నారు. తరువాత ఆయన `గ్యాట్’ గురించి కూడా కొంచెం మాట్లాడారు. కాని ఎవరికీ ఏమీ అర్థం కాలేదు.

          చిన్న-చిన్న నాయకులు ముఖ్యమంత్రిగారితో ఫోటో తీయించుకోవడంలో తమ ప్రయత్నం అంతా చేసుకుంటున్నారు. ఒకాయన ఏదో సమస్య తెలియపరిచే కాగితం ఆయనకి అందిస్తున్నాడు. మరొకాయన ఆయనకి చెవిలో ఏదో చెబుతున్నాడు….. ఇంకో ఆయన ఆయనకి ఇంకా దగ్గరగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రిగారు అందరితోబాటు భోజనం చెయ్యసాగారు. అయితే ఆయన కోసం వేరే ఏర్పాటు చేయబ డింది.

          ఆయన ఉన్నట్టుండి హోటలు మానేజరుకి కబురు పెట్టారు. మానేజరు అక్కడే తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రిగారు మొక్కజొన్నరొట్టి, ఆవాకుకూరలని తెగ మెచ్చు కున్నాడు. ఎన్నో ఏళ్ళ తరువాత ఇంతగా తనకి ఇష్టమైన భోజనం లభించిందని అన్నాడు. షెఫ్ అనబడే ముఖ్యమైన వంటవాడు`థ్యాంక్స్ సార్ ’ అని మాటిమాటికీ అంటున్నాడు.

          ముఖ్యమంత్రిగారు తన ప్లేటు కింద పెట్టగానే ప్రభుత్వ అధికారులు కూడా తమతమ ప్లేటులు కింద పెట్టసాగారు.

          అందరూ చురుగ్గా హోటలు బయటకి వచ్చి గుమికూడారు. ముఖ్యమంత్రిగారు పైపుతో పొగ వదులుతూ గోల్డెన్ గేట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. నిర్వాహకులు తప్ప మిగిలినవారందరూ వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు.

          మంగకి పెద్ద అయ్యగారిని చూడాలని వుంది. కాని తను చూడలేకపోయింది. కాని, షెఫ్ మాత్రం ఆమె దగ్గరికి వచ్చాడు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అతడు మంగకి యాభై రూపాయలు ఇచ్చాడు. ఆమె ఆవాకు కూర తెచ్చిన బుట్టని కూడా అతను నింపివేశాడు—రొట్టెలు, పలావు, కూర, అన్నీ ఒక్కసారిగా లభించాయి. బయలుదేరేట ప్పుడు ఆమె ఆ షెఫ్ ని కలుసుకోవాలని అనుకుంది. కాని అతను అప్పటికే వెళ్ళిపోయా డు.

          తనుకూడా తన బుట్ట తీసుకుని హోటలు నుంచి బయలుదేరింది ముందులాగానే అమాయకంగా.

          ఇంటికి వచ్చాక చూసింది – ఆరేళ్ళ కూతురు తన కోసం ఆదుర్దాగా ఎదురుచూస్తోం ది. బుట్టని పాకలో కింద పెట్టిందోలేదో అది ఆ తెచ్చిన భోజనంలోంచి తనకి ఇష్టమైనవి బయటికి తీసుకుంటోంది. చిన్న కొడుకు కూడా ఆ బుట్ట పట్టుకుని నిలబడ్డాడు.

          “ఒరేయ్, కొంచెం ఆగరా”…అని తను చెప్పాలని అనుకుంది. కాని ఏమీ చెప్పలేకపోయింది. అక్కడే కూర్చుండిపోయింది. పిల్లలిద్దరూ బుట్టలోంచి వాళ్ళకి కావలసినవి తీసుకుని తింటున్నారు. ఆ రోజు బుట్ట నిండుగా ఉంది. అందుకే ఇంక వేరే తీసి పెట్టాలని తనకి అనిపించడం లేదు. ఒకటే అనుమానం పీడిస్తోంది రాత్రి వరకూ పాడైపోకుండా ఉంటాయా అని. ఆ రోజు కూడా ఆమెకి ఏమీ తినాలని అనిపించడం లేదు. కాని ఆకలి అయితే వేస్తోంది. తరువాత తనుకూడా పిల్లలతోబాటు ఆ బుట్టలోంచే తీసుకుని తింది.

          అంతకు ముందు రాత్రి తను పిల్లలతో అంది- “హోటల్లో పెద్ద అయ్యగారు వస్తారు. ఆయన కోసం ప్రత్యేకమైన భోజనం చేస్తారు.”

          పిల్లలకి కడుపు నిండింది. వాళ్ళు బుట్టని విడిచిపెట్టి దూరంగా వెళ్ళారు. కుండలోంచి మంచినీళ్ళు తీసుకుని తాగారు. ఒక గ్లాసుతో మంచినీళ్ళు మంగకి ఇస్తూ ఆరేళ్ళ కూతురు తనని అడిగింది- “అమ్మా, అయ్యగారు మళ్ళెప్పుడొస్తారు?”

***

డా. దామోదర్ ఖడసే – పరిచయం

డా. దామోదర్ ఖడసే గారి సాహిత్యసేవ విస్తృతమైనది. వీరి 9 కథాసంకలనాలు, 4 నవలలు, 10 కవితాసంకలనాలు, 1 సమీక్ష, 4 ట్రావెలాగ్స్, 8 అధికారభాషకి సంబంధిం చిన గ్రంథాలు ప్రచురితమయ్యాయి. కొన్ని డాక్యుమెంటరీలకి, టెలీఫిలింలకి స్క్రిప్టు రాశారు. వీరి సాహిత్యం పైన, వ్యక్తిత్వం పైన విద్వాంసులు రాసిన 7 పుస్తకాలు వెలువడ్జాయి. వీరి రచనలు ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధ భారతి, దూరదర్శన్, టీవీ ఛానళ్ళలో ప్రసారితమయ్యాయి. ఈయన వివిధ విద్యాసంస్థలలో 1200 కన్నా ఎక్కువ ఉపన్యాసాలు ఇచ్చారు. వీరి రచనలను వివిధ విద్యాసంస్థల కోర్సులలో పాఠ్యాంశాలుగా తీసుకున్నారు. ఈయన మరాఠీ నుంచి, ఆంగ్లం నుంచి 19 సాహిత్య గ్రంథాలను అనువదించారు. 7 పుస్తకాలకి సంపాదకత్వం నిర్వహించారు. వీరి రచనలు ఆంగ్లంతోసహా 10 భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి సాహిత్యం పై కొల్హాపూర్, అమరావతి, షోలాపూర్ యూనివర్సిటీలలో 5 పిహెచ్ డి, పుణే యూనివర్సిటీ ద్వారా 1 ఎం.ఫిల్. డిగ్రీలు ప్రదానం చేశారు. డా. ఖడసే ఎన్నో సాహిత్య, సాంస్కృతిక సంస్థల ద్వారా సన్మానం పొందారు. గౌ. రాష్ట్రపతి గారిద్వారా 1992లో, 2012లో సాహిత్య పురస్కారం ప్రదానం చేయబడింది. వీరు కేంద్రప్రభుత్వానికి చెందిన కొన్ని ఉన్నత స్థాయి కమిటీలలో సభ్యులు. నాలుగు యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యులు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 30 సంవత్సరాలు సేవ చేసిన అనంతరం అసిస్టెంట్ జనరల్ మానేజరుగా రిటైర్ అయ్యారు. డా. ఖడసే పుణే వాస్తవ్యులు.

*****

Please follow and like us:

2 thoughts on “అయ్యగారు మళ్ళెప్పుడొస్తారమ్మా! (హిందీ అనువాద కథ- దామోదర్ ఖడ్సే)”

  1. అయ్యగారు మల్లెప్పుడు vastaru’ కథ దాని అనువాదం రెండూ చాలా బావున్నాయి. మూల కథ పేరు కూడా చెప్తే బావుంటుంది.

    1. అక్షర గారూ! మీ సూచనకు ధన్యవాదాలు. మూల కథ పేరుని కూడా ఇస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published.