మా ఊరు చూడాలని ఉందా?

-డా.కె.గీత

ఉభయకుశలోపరి!

రేపు ఉదయం మీరు మా ఊరు మీదుగా వెళ్తూ మార్గమధ్యంలో ఓ పూట మాఊళ్ళో  ఆగాలనుందని, ఏమేం చూడాల్సిన విశేషాలున్నాయో చెప్పమని మీ నించి మెసేజీని అమెరికా సమయంలో తెల్లారగట్ల చూసినపుడు ఇక నిద్ర పడితే ఒట్టు.

          ఎప్పుడో ఊరొదిలి వలస పక్షినైన నేను, నాలుగేళ్ళకో, అయిదేళ్ళకో ఓ సారి వెళ్ళోచ్చే నేను మా ఊళ్ళో చూడ్డానికి ఏమున్నాయని చెప్పను? కిందటేడాది చంటిదాని మొక్కు తీర్చడానికి అన్నవరం వెళ్తూ, ఊళ్ళో బంధువుల ఇంటి దగ్గిర రాత్రి బస చెయ్యడం, ఆ పొద్దున్నే చిన్ననాటి నాలుగైదు వీథులు తిరగడం తప్పితే ఈ మధ్య వెళ్ళింది లేదు.

          నాకు తెలిసిన నా చిన్ననాటి అందమైన ఊరు ఇప్పుడు లేదు. అయినా నేను వెళ్ళి నపుడు చూడాలనుకునేవి నా చిన్నప్పుడు మేం నివసించిన ఇళ్ళు, వీథులు.

          అసలెక్కణ్ణించి మొదలెట్టను? మా ఊరంటే హైవేకి ఒక వైపు పాత ఊరు, మరో వైపు కొత్త ఊరు.

          పాత ఊరి మధ్యన కొంగల్రావి చెట్టు, దాన్నానుకుని ఓ వైపుగా ఉన్న పెద్ద దొడ్డీ, ఇల్లూ. అది నాకు ఊహ తెలిసి బుద్ధెరిగేక మేం మొదటగా అద్దెకున్న ఎత్తరుగుల ‘కొత్త వారి ఇల్లు’ (ఇప్పుడుందో, లేదో). చుట్టూ పెద్ద ప్రహరీ గోడ, బయటి నించి ఇట్టే తీసెయ్య గల చెక్క గెడ ద్వారం దాటి ఆవరణలో అడుగుపెడ్తే ఒక పక్కగా కాకులు, పిచుకలు సావాసం చేసే పెద్ద వేపచెట్టు. చెట్టు కింద వేప పళ్ళు విరగరాలి ఉండేవి. పిల్లలమైన మేం ఏవీ తోచనప్పుడు వాటిని కూడా వదిలేవాళ్ళం కాదు. గింజ తగలకుండా ఒక్క జుర్రుతో చప్పున జుమికి ఊసేస్తే చేదు మాయమై తియ్యగానే ఉండేవి మరి!

          ఇంటి చుట్టూ పొలోమంటూ విరగబూసిన లేడీ కనకాంబరం మొక్కలు, బంతి పూలు. ఎత్తరుగుల మీదే ఒకటి నించి మూడు దాకా నేను చదువుకున్నది. అదుగో, జొరం వచ్చినపుడు అరుగునానుకుని ఉన్న గదిలో మూలుగుతూ పడుకుని ఉండక పరీక్ష రాసేసి క్లాసు ఫస్టు వచ్చిన రోజు! మా అమ్మ స్థాపించిన సొంత బడి కావడం వల్లనూ, ఇల్లూ, బడీ ఒకటి కావడం వల్లనూ కలిగిన సౌలభ్యం అన్నమాట!!

          దీపావళి శబ్దాల భయానికి నక్కి, కుండలో నించి బెల్లాన్ని, ఉప్పులో నంజుకుని చింతపండునీ దొంగతనంగా తినేది ఈ వంటింట్లోనే.

          మా ఇంటి మీదుగా వెళ్తే ఒక వైపు వీధిలో శివాలయం, మరో వీధిలో విష్ణాలయం.

          శివాలయం దార్లో మా అమ్మని చిన్నప్పటినించీ ఆప్యాయంగా “గన్నా” అని పిలిచే నూజిళ్ళ మేస్టారు, పలకరించే కరణం ఎర్రప్ప గారిల్లు, మునసబు రాజు గారి పొన్నుగర్ర, కూలిపోబోతున్నా దర్పం ఒలకబోసే దివాణం, పెద్ద వాకిట్లో ఏడాదికోసారెప్పుడో జరిగే “నగుమోము గనలేని” పారవశ్యపు సంగీత కచేరీలు, దాటితే గులాబీ రంగు బఠానీ పూలు, హాయైన సుగంధాన్నిచ్చే దేవగన్నేరులు.

          కార్తీకమాసంలో తప్ప పెద్దగా శోభ లేని, శ్రీ కాళముల నిలయమైన శివాలయం దాటి వెళ్తే దుంపల బడి, చిరపరిచిత తాతముత్తాతల గొల్ల వీథి, గోపాలకృష్ణ మేస్టారి ట్యూషను రణగొణ, పశువులు యథేచ్ఛగా ఈదులాడే కోనేరు, ఎప్పుడటు వెళ్ళినా ఎడమ కాలి బొటనవేలి ధూళిని బొట్టెట్టుకోవాల్సిన శ్మశానం, దూరంగా పచ్చని పంటల, మా వైపు కడియమైన పల్లెటూరు, పేరు “నగరం”.

          కోనేటి నించి ఊరికి వీపు పెట్టి నించుంటే కనబడేదే కాకినాడ రోడ్డు. మొక్కజొన్న పొత్తులు ఎప్పుడూ దొరికే కాట్రావులపల్లి, గొల్లల మామిడాడ కోదండ రామ దేవాలయం అద్దాల మేడ, ఆంధ్రా ఫేమస్ పెద్దాపురం, పాండవుల మెట్ట. సీతమ్మ వారి పాదాలు ఆ పైన ఉన్నాయని చెప్పుకోవడమే గానీ ఎవరూ చూసిన దాఖలాలు లేవు. రామాయణపు గుర్తులున్నా మహాభారతం నాటి పాండవుల మెట్ట ఎలా అయ్యిందో!

          దాటితే పంచారామాల్లో ఒకటైన కుమార భీమేశ్వరాలయం, అరవై అడుగుల ఆంజనేయుడి విగ్రహం, మా ఊరు రైల్లో వెళ్ళాలంటే ఎక్కి దిగాల్సిన స్టేషను – సామర్ల కోట. దాటితే తూ.గో.జీ జిల్లా కేంద్రం, నేను, మా అన్నయ్య, చెల్లి పుట్టిన గవర్నమెంటు ఆసుపత్రి కాకినాడ, జగన్నాధపురం అమ్మమ్మ పుట్టింట పీతల పులుసు, సుబ్బయ్య హోటలు అరిటాకు భోజనం, గొట్టం కాజా. చీరలకి, చేపలకి ప్రసిద్ధి ఉప్పాడ.

          మా ఊళ్ళో విష్ణాలయం వీథికి తిరిగితే చక్రం కిళ్ళీ కొట్టు, గంగరావి చెట్టు, ధాన్యం మిల్లు, కుమ్మరగంటి డాక్టరు గారిల్లు, దారా వారి మేడ, వినాయక చవితి ఉత్సవాల హడావిడి, వేదమంత్రాల ఘోష, వెలిగిపోతున్న రథం, పరుగెత్తే పూజారి గారితో బాటూ ఊరంతా గంటలో తిరిగొచ్చే దేవుడి పల్లకీ. ఎత్తైన ధ్వజస్తంభం, అభయమిచ్చే గరుత్మంతుడు, రాముడితో బాటూ మనకీ నమస్కరిస్తున్నట్టున్న ఆంజనేయుడూ.. సీతమ్మ వారి వైపు అందరిలో చూస్తే బావుండదని తనలో తాను మందస్మితం చేసే రాముల వారు…పూజారి గారి భార్య చివర్లో చేతిన వేసే చిట్టి చిట్టి బియ్యపు అప్పాల ప్రసాదం.

          నంది వీధిలో మా అమ్మమ్మ గారింట్లో ఉప్పునీటి బావి పళ్లాన్ని ఆనుకుని ఎర్ర జాంచెట్టు, ఇంటినల్లుకుని బ్రహాండమైన సువాసన వెదజల్లే రాధాకృష్ణ తీగె దాటితే, చిన్నవయసులో శివైక్యం చెందినా చెక్కుచెదరని మా తాతయ్య వెంకటరమణ గారి పందిరి మంచం, అమ్మమ్మకిష్టమైన రంగం పెట్టె, ఎప్పుడెళ్ళినా భోజనం సిద్ధంగా ఉండే వేణమ్మ అత్తయ్యగారిల్లు.

          వెనక వీథిలో “అశ్శరభ శరభ” అంటూ వీరంగం వేసే వీరముష్టాళ్ళు, విభూది పళ్ళు, బొమ్మలతో వీరభద్రుని సంబరం లేకుండా పెళ్ళిళ్ళు జరగని గద్దె. ఈ సందుల్లోనే “బోడీ బోడీ పెళ్ళిళ్ళు – బొమ్మల బొమ్మల పెళ్ళిళ్ళంటూ” తాటాకు బొమ్మలకి గుడ్డముక్కలు చుట్టి, కాటుక, బొట్లు పెట్టి నెత్తిన పీటెట్టుకుని ఇంటింటా తిరిగినది.

          ముత్తా వారి వీథి, బిల్ కలెక్టర్ మావయ్య గారి ఇల్లు దాటి ఇటు వస్తే, ఊర్లో మాంఛి హస్తవాసి గల ఆర్.ఎం .పీ డాక్టరు జయగారి ఆసుపత్రి, కొంచెం ముందుకెళితే శ్రీ రామ నవమికి తలా చెంబు నిండా పానకం పంచిపెట్టే రామ కోవెల, దాటగానే పేద కోమటి పెద్దమ్మ అమ్మే ఊరబెట్టిన ఉసిరి కాయలు, రేగు వడియాలు, తాటి తాండ్ర. రెండిళ్ళ కవతల ఎప్పుడూ బుట్టల అల్లిక పనిచేస్తూనే ఉండే మేదరోళ్ల వీథి.

          చెరువు గట్టుకి వచ్చేసాం కదా! ఎత్తైన చెరువు గట్టుకి నాలుగు మంచినీళ్ళ రేవులు, గట్ల మీద నాలుగు పెద్ద పెద్ద బావులు. ఒకే నీటికి నాలుగు రేవులెందుకో అర్థం కాని చెరువు గట్టున బుర్ర మీసాల చెరువు కాపరి. మాలపేట రేవు, శూద్రుల రేవు, బ్రాహ్మల రేవు, బ్రహ్మం గారి మఠం రేవు.

          నాలుగు బావుల్లో ఒకటి, ఊళ్ళో ఎందరో అందులో దుమికి చస్తూ ఉంటారని చెప్పు కోవడం వల్ల దరిదాపులకి వెళ్ళని కారణంగా నాచు పట్టిన చావుల బావి.

          ఇక కుళాయిలు కల్లో కూడా ఊహించని రోజులు కావడం వల్ల బడికాగానే మొదటగా చెయ్యాల్సినది వయసుకి రెండింతలు బిందె, చేద పుచ్చుకుని మంచినీళ్ళు తేవడమే. భాద్రపద మాసంలో వర్షాలు పడ్డ కొత్తలో చెరువు నీళ్ళు తియ్యగా ఉన్నా, బురద నీరు కాబట్టి ఇండిగ పిక్కలు అరగదీసి నీటిలో కలిపితే బురద కిందికి పోయి స్వచ్ఛమైన నీరు పైకి తేలేది. ఇంత సేవ ఎందుకనుకుంటే బావిలో నీళ్ళు కాస్త ఉప్పగా ఉన్నా చేదుకుని తాగెయ్యడమే.

          బ్రాహ్మణ రేవు దిగి వస్తే ముమ్మిడివరపు డాక్టరుగారిల్లు, లైబ్రేరియన్ శివాజీ గారిల్లు, ఆ ఎదురుగా గంతల ఎద్దు అవిశ్రాంతంగా తిరిగే నూనె గానుగ. మాతంశెట్టి వారిల్లు, లయన్సుక్లబ్బు దాటితే ఆ కనబడే పెద్ద మండువా లోగిలి మా రెండో అద్దె ఇల్లు- కుప్పయ్య గారిల్లు. గట్టి టేకు కర్రతో నిర్మించిన దర్జా లోగిలైనా వందేళ్ళ నాటిది కావడం వల్ల మేడ మీద వీణ గదిలో నడుస్తుంటే కింది పడక గదిలో మట్టి రాలుతూ ఉండేది. చావిట్లో దూలాల మీద గబ్బిలాలు యథేచ్ఛగా వేళ్ళాడుతూ ఉండేవి.

          ఆ మిద్దె మీద కిటికీలోనే కూర్చుని ప్రతి ఏడాదీ వేసవిలో టామ్ సాయర్, హకల్ బెరీఫిన్ నవలలు కంఠతా పట్టినది. మెట్ల మీంచి చూస్తే మా అమ్మ ఎప్పుడూ పుస్తకాలు చదువుకుంటూ, రాసుకుంటూ కనిపించేది. కోతులకంటే ముందే మేం సగం తినేసిన పిందెల మామిడిచెట్టుని అందుకోవాలంటే డాబా రెయిలింగు బయటివైపు కాలేసి కర్రతో ఛెళ్ళున కొమ్మల్ని దులపాల్సిందే. కింద దట్టంగా రాలిన ఎండుటాకుల మీద రాలిన పిందెల కోసం ఆత్రంగా తోసుకుని కొట్టుకుంటున్నపుడు అదుగో మండ్రగబ్బ చటుక్కున కుట్టిన జ్ఞాపకం. ఎర్రప్పగారి చీపురు పుల్ల తేలు మంత్రం, చితక్కొట్టిన ఉల్లిపాయ మందు ఏ కాస్తా పనిచెయ్యని గగ్గోలు రాత్రి అక్కడే గడిచింది.

          మా పెరటి గోడనానుకుని ఉన్న ఊరి గ్రంథాలయంలోకి వెళ్ళాలంటే మా దొడ్లో జామచెట్టెక్కి దుమికితే సరి!

          ఆవరణలో పెద్ద పెద్ద బక్కెట్లతో కాయలు ఏరి, కడిగి పంచిపెట్టిన ఆకాశాన్నంటే అల్ల నేరేడు చెట్టు. మరోవైపు శనివారం ఉప్పిండి కోసం ఆకులు కలిపి కుట్టుకునే బాదం చెట్టు. వరదలకి చెట్టు ఇంటి మీద కూలి, సగం గదులు నేలమట్టం కాకుండా ఉండి ఉంటే మరికొన్నేళ్ళు అక్కడే ఉండేవాళ్ళమేమో!

          ఇక బ్రహ్మంగారి మఠం దాటితే కాపులు, పద్మశాలీలు, కంసాలుల వీథులు. అవీ దాటితే అన్నీ పొలాలే. చుట్టూ తిరిగొస్తే పక్క వీథిన ‘ఊరంతా అక్కడే’ అన్నట్టున్న పాత ప్రెసిడెంటు గారి చావిడీ.

          చెరువుకొక వైపు మాలపేట మీంచి నడిచి రోడ్డెక్కితే అంబేద్కరు విగ్రహం. దాటితే మూలకి సాంబ్రాణి పొగ ఎగజిమ్మే గాజులమ్మ ఇల్లు. ఆవిడ భర్త బస్టాండులో ఎర్ర దుస్తుల కూలీ అయినా, పిల్లలందరం మొదటగా ఆమె గాజులకి దణ్ణం పెట్టుకుంటేనే పరీక్షల్లో ఫస్టు మార్కులొచ్చేది.

          అసలు మా ఊరి జంక్షనులో ఇప్పట్లా అంతా ఆక్రమించి ఊరి స్వరూపాన్ని మార్చేసిన ఫ్లై ఓవరు బదులు, రయ్యిన దూసుకొచ్చి ఎందరి ప్రాణాలో ఎత్తుకెళ్ళిపోయిన లారీలు తిరిగే నేషనల్ హైవే ఉండేది.

          నాలుగు రోడ్ల కూడలిలో బస్టాండు. దాన్నానుకుని మంగళ వారాలు సినిమా పాటల ట్యూన్లతో భక్తి పాటలు ఊదరగొట్టే ఆంజనేయుడి గుడి, ఎదురుగా పోలీసు స్టేషను. ఆ పక్కనే ఠాణా.

          ఈ పక్కన అయ్యరు గారి శాఖాహార భోజనం హోటల్ , నాలుగడుగుల్లో మాంసాహార మిలట్రీ హోటలు, ఎదురుగా ఎన్నాళ్ళుగానో మేం ఎప్పుడెప్పుడు చదివి పెద్దవుదామా అని ఎదురు చూసే హైస్కూలు. గేటు బయట అమ్మే బఠానీలు, తేగలు, ఉప్పూ, కారం పెట్టిన పుల్ల నారింజ చిప్పలు అమ్మే బుట్టల వాళ్ళు.

          తరగతి గదుల మీదుగా మెండుగా పూసే కాడమల్లె పూల చెట్టు , డ్రిల్లు మేష్టారు విజిలు హోరెత్తే గ్రవుండు దాటి వెళ్తే ముళ్ళు గుచ్చుకునే రేగు తుప్పలు. ఎదురుగా ఎండిపోయిన జగ్గమ్మ చెరువు.

          దాటితే ఆంధ్రా బ్యాంకు, హిందీ మేస్టారి లెక్కల ట్యూషను ఇల్లు, సత్యకృష్ణ డాక్టరు గారి ప్రసూతి ఆసుపత్రి, పాత సినిమా హాలు, తల తిప్పి చూడకూడని బార్ అండ్ రెస్టారెంటు.

          సెంటర్లో పోలీసు స్టేషను దగ్గిర నిలబడి చూస్తే దూరంగా అన్ని వైపులా పొగలు చిమ్మే పెంకుల మిల్లులు, ఠీవిగా నిలబడ్డ తూర్పు కనుమల్లో దోబూచులాడే జటాద్రి కొండ.

          సెంటర్లో తాజాగా తాపేశ్వరం కాజా దుకాణం, దేవరపల్లి వారి బెల్లం మిఠాయి, కొత్తగా పెట్టి ఊరిని ఊపేస్తున్న సేటు మిఠాయికొట్టు, పక్కనే రుచి చూసి తీరాల్సిన వల్లీబాబు గారి ద్రాక్ష జ్యూసు దుకాణం.

          ఎదురుగా అప్పుడప్పుడే మొదలైనా ఎప్పుడూ రద్దీగా ఉండే లేడీస్ ఫాన్సీ షాపు, పక్కనే సరుకుల కోసం చిట్టీ పట్టుకొచ్చి గంటల తరబడి వేచి చూడాల్సిన కిరాణా దుకాణం. ఎంతసేపైతే ఏం? చివర్లో పిల్లకాయల చేతిన పుట్నాల పప్పో, బెల్లం ముక్కో కొసరుగా విసురుతారుగా మరి!

          కోనేటి నించి సెంటరు వైపు నడిస్తే సోమవారం సంత వీథి దగ్గిర ఆగితే ఒకవైపు కష్టపడి బేరాలాడి, కొసరు సంపాయించి గొప్పలు పోయిన ఉల్లిపాయలు, కూరగాయల దుకాణాలు, మరోవైపు చేపలు, మాంసం దుకాణాలు. దార్లో కొనుక్కోమని ఇచ్చిన పావలాతో సేమ్యా, సబ్జా గింజల రంగుల నీళ్ళ పాయసం కొనుక్కు తినాల్సిందే. ఇప్పట్లా దుమ్మూ, ధూళీ ఉంటాయని ఆరోగ్యసూత్రాలు ఏవీ ఉండేవీ కావు, ఉన్నా ఎవరి బుర్రలకీ ఎక్కేవీ కావు.

          సంత ఎత్తివేసిన సందె వేళ అడుక్కుని, ఏరుకుని తెచ్చుకున్న కూరా నారా అక్కడే వండుకు తినే దేశద్రిమ్మరుల వంటల సువాసన తల్చుకుంటే ఇప్పటికీ నోట్లో నీళ్ళూరు తుంది.

          ఆ పక్కనే తూము కివతల ఏ జబ్బునైనా ఇట్టే మాయం చేసే మహిమగల తావీదుల నిచ్చే తురకల ఇళ్ళు దాటితే రోడ్డు మీద కొత్తగా వెలిసిన కృష్ణుడి మందిరం, మా ఊరికి మండల ప్రధాన కార్యాలయం రాకముందు ఉండే పంచాయతీ ఆఫీసు.

          కాస్త ఇటు వస్తే తాటిపర్తి డాక్టరు గారి చిన్నపిల్లల ఆసుపత్రి, అటుకులు, కారం మిల్లు, వేడి వేడి బఠాణీలు ఇసుకలో ఇట్టే వేయించి అమ్మే దుకాణం, రొట్టెల బట్టీ. “అల్లా…” అంటూ రోజుకి మూణ్ణాలుగు సార్లు పెద్ద శబ్దంతో నమాజు చేసే మసీదు, గేటు దగ్గిర ఫాషన్ దుస్తుల టైలర్ జానీ దుకాణం. పక్కనే వాచీల రామం గారి రిపేరు కొట్టు.

          ఎదురుగా సిమెంటు, ఎరువుల దుకాణాల పక్కనే క్రమం తప్పకుండా ఏటా జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో హరికథ, బుర్రకథ, రోజుకో వీథి నాటకం. రాత్రుళ్ళు పందిట్లో రాటల చుట్టూ పరుగెత్తి ఆడుకోవడానికి, మోసుకెళ్ళిన పీటలు నిద్రమత్తులో నెత్తిన పెట్టుకుని నడిచి ఒంటరిగా రావడానికి భయం లేని రోజులవి.

          ఊరంతా తిరగడానికి బయలుదేరే సంక్రాంతి సంబరాల బండ్ల కోలాహలాలు ఇక్కడే మొదలయ్యేవి. సంబరాల్లో తొలిగా వచ్చే గరగలకి దణ్ణం పెట్టుకుంటేనే అప్పట్లో ఊరంతా అలుముకునే ఆటలమ్మ, మశూచి వ్యాథులు తగ్గేది. తరువాత వరసగా పులివేషం, శక్తి వేషం, ఏసుక్రీస్తు, రామలక్ష్మణులు, హరిదాసు, ఎరుకుల సానులు, తప్పెటగుళ్ళు, కోలాటం, చివరగా మొగుడూ, పెళ్ళాల హాస్యపు కీచులాట.

          మా ఊర్లో సెంటరు నించి హైస్కూలు వగైరా రాజమండ్రి రోడ్డులో ఉంటే సరిగ్గా వ్యతిరేకదిశలో అన్నవరం, తుని వెళ్ళిపోవచ్చు. మా ఊరు జగ్గంపేటలో దాదాపు కలిసిపోయిన రాగంపేట, తాళ్ళూరు తీర్థం, జియ్యన్న స్వామి మఠం, మల్లేపల్లి , గండేపల్లి, మురారి దాటితే రాజానగరం నించి వన్య సంరక్షణ, అరచెయ్యి పట్టనితియ్యని సీతాఫలాలు దొరికే లాలాచెరువు, దివాన్ చెరువు దాటితే ఆదికవి నన్నయ్య గారి ఊరూ, నాన్నమ్మ గారి ఊరూ రాజమండ్రి. గోదారమ్మ పరవళ్ళ మీద అప్పుడే కడుతున్న మూడో బ్రిడ్జీ, సన్నిధానం శర్మగారి గౌతమీ గ్రంథాలయం, దామెర్ల ఆర్ట్ గ్యాలరీ. పెద్ద నాన్నమ్మ అల్యూమినియం ఫాక్టరీని ఆనుకుని చివరి ఆస్తి పెంకుటిల్లు, “పిట్టు” టిఫిను, పుల్ల ఐసు. పక్కనే కళ్ళు చెదిరే సర్కసు, కళ్ళు తిరిగే జెయింట్ వీల్ ల స్టేడియం. ఎప్పుడూ బొగ్గు వాసనేసే రైల్వే క్వార్టర్సులో మా బళ్ళో ఇంగ్లీషు టీచరు కుటుంబంతో బాటూ ఎందరో ఆంగ్లో ఇండియన్సు.

          అన్నవరం రోడ్డులో ఊరి చివర కొత్తగా చెట్టు కింద వెలిసిన రావులమ్మ తల్లి, సినిమా టిక్కెట్టు ఖరీదుతో సమానమైన రిక్షా బాడుగ పెట్టాల్సొచ్చే రాజవేణి, కృష్ణవేణి కొత్త జంట థియేటర్లు. జి.ఎన్.టి రోడ్డెక్కగానే సత్తెమ్మ తల్లి ఉంది కదా అన్న ధీమా కామోసు, మట్టి రోడ్ల దారంతా కంచిత్రం ముళ్ళ తీగలైనా జగ్గంపేట సంతకి కబుర్లాడుకుంటూ బుట్టలు నెత్తిన పెట్టుకుని నడిచొచ్చేసే కష్టజీవుల పల్లెటూళ్ళు గుర్రప్పాలెం, గొల్లలగుంట. పెంకుల మిల్లులు, సగ్గుబియ్యం ఫ్యాక్టరీలు మెండుగా ఉన్న రామవరం, బూరుగుపూడి, ఎప్పుడూ రోడ్ల పక్కనుండే అరటిపండ్ల సంత ఎర్రవరం దాటితే, పూతరేకుల్లా బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి తెచ్చే మా ఇంటి చాకలి ఊరు గోనాడ, ఏటా కాండ్రకోట తీర్థం, మా నాన్నగారు గవర్నమెంటు మేష్టారుగా ఎక్కువకాలం పనిచేసిన ఏలేశ్వరం, మరో పక్క ప్రత్తిపాడు, కత్తిపూడి దాటితే పిఠాపురం రాజావారు, కుక్కుటేశ్వరాలయం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పురుహూతికా దేవి ఆలయం. అన్నవరం సత్యనారాయణ స్వామి, పంపానది, చూసి తీరాల్సిన తలుపులమ్మ లోవ.

          కాకినాడ వెళ్ళే రోడ్డుకి వ్యతిరేకదిశలో గోకవరం వెళ్ళే రోడ్డు ఉంటుంది. అంటే కోనేరు, శివాలయం, నగరం అన్నీ కాకినాడ రోడ్డులో ఉంటే, గోకవరం రోడ్డులో మా ఊరు దాటంగానే కొత్తూరు, రాజపూడి, మల్లిశాల, చింతలన్నీ దీర్చే సింగరమ్మ చింత.

          మా ఇంటి కుంకుడుకాయలు, చింతపండు వచ్చే మన్యం వారి పాలెం, మా నాన్నగారు ఎం.ఈ.ఓ గా ప్రమోషను పొందిన మారేడుమిల్లి, నాన్నగారి వెంట చిన్నప్పు డెప్పుడో వెళ్ళినా జ్ఞాపకాల్లో ప్రవహించే జలపాతాలైన జడ్డంగి, వాతంగి, అడ్డతీగల. ఆ కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయమే మా నాన్నగారు అద్దెకున్న ఒంటి స్తంభం మేడ మీంచి కనబడేది.

          గోకవరం రోడ్డు అంటే మా ఊరికి ఏజెన్సీ ముఖద్వారం. తెల్లారగట్ల లెక్కలు ట్యూషనుకి సైకిలేసుకుని వెళ్ళేటపుడు వచ్చే ఒకటీ ఆరా బస్సులు తప్ప ఏవీ ఉండేవి కావు. ఊడల మర్రిచెట్లు రోడ్లకటూ ఇటూ వేళ్ళాడుతూ పగలు ఆటస్థలాలు గానూ, రాత్రుళ్ళు దెయ్యాలు తిరిగే భయం వేసేవిగానూ ఉండేవి. సెంటరు తరవాత కుర్రకారు సరదాకి కూర్చునే మొదటి తూము దాటి చాలా దూరం నడిస్తే కోళ్ళ ఫారాలు, పేకాట క్లబ్బునబడే నిషిద్ధ స్థలం తప్పితే జనావాసాలు లేని రోడ్డది.

          సెంటరులోకి నడిచొచ్చి హైవే దాటి ఇటొస్తే కొత్త ఊరు. ఒకప్పటి పంట పొలాల్ని ప్లాట్లు చేస్తే మొలిచిన శ్రీ రామ్ నగర్. మొదటి వీథిలో ఉన్న పోస్టాఫీసు, కొత్త సినిమా హాలుకి వెనకగా, రెండో వీథిలో చివర ఇల్లుగా, అందంగా కనబడుతున్న తెల్ల సున్నపు కొత్త డాబాయే మా ఇల్లు.

          డాబా మీదికి పాకిన సన్నజాజి పందిరి దాపున గూడు చేసుకుని ఎప్పుడు చూసినా తెల్ల కాగితాన్ని నలుపు చేసే బక్క పలుచని పదహారేళ్ళ అమ్మాయినే నేను. గోధూళి వేళ వీథి చివర నించి మేకపిల్లల్ని మలుపు తిరిగే వరకూ చూస్తే అందమైన గులాబీలు పూయించే చిట్టచివరి ఇల్లు డ్రాయింగ్ మేష్టారి ఇల్లు. దాటితే చెరుకు తోటలు. ఆకతాయి కుర్ర ప్రేమ జంటలకి మేష్టారి కంటబడకుండా కాపలా కాసేది ఆ గట్టునే.

          నాకు తెలిసిన నా చిన్ననాటి జ్ఞాపకాల్లోని ఊరు ఇప్పుడు మీకు కనిపిస్తే చూసి రండి.
ఇవీ మా ఊరి విశేషాలు. మరోసారెప్పుడైనా మర్చిపోకుండా తట్టిలేపే నిశిరాత్రి వేళ ఇప్పట్లా రాస్తానులెండి. ఉండనా మరి!

ఇట్లు
సదా
మీ మిత్రురాలు

*****

Please follow and like us:

11 thoughts on “మా ఊరు చూడాలని ఉందా?”

  1. ‘గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి…’ సినిమా పాట గుర్తుకొచ్చింది. అమ్మంటే, పుట్టిన ఊరంటే ఎవరికుండదు ఇష్టం. కాని, చాలామది ఆ ఇష్టాన్ని మనసులోనే భద్రంగా ఉంచేసుకుంటారు. మరికొందరు, పది మాటల్లో పంచుకొంటారు. అంతే కాని, ఇంత తెలుగులో, ఇంత ఇష్టంగా చెప్పడం కొందరికే చెల్లు. ఇల్లు, బడి, అమ్మ, పంతులమ్మ ఒకరే(టే) అయితే ఇక నిత్య విద్యార్థియే. జామచెట్టెక్కి దూకితే గ్రంథలయం వస్తే, ఇక చదువుకోవటమే ఆలస్యం. మా వూళ్ళో శివరాత్రికి శివుని ఊరేగింపులో వీరభద్రులే ‘ఆశ్శరభ ఆశ్శరభ ‘ అంటూ ఊగిపోయేది వారికి వారసత్వంగా వస్తున్న ఆచారం. ఇప్పుడూ వస్తున్న so called development ఊళ్లను చెరిపేస్తున్నది. కాని, కొద్దిపాటి ప్లానింగుతో అభివృద్ధి పొందుతూ, ఊళ్ల అమాయకత్వాన్ని కూడా కాపాడుకోవచ్చు.

    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు MJ గారూ!

  2. చదివిన ప్రతి ఒక్కరికి వారి ఊరు పుట్టిన గడ్డ చిన్ననాటి స్నేహము మట్టి వాసన ప్రతిబింబించే విధంగా ఉన్న ఈ కథ మనందరినీ మన ఊరికి తీసుకు వెళ్తుంది

    1. మీ స్పందనకు ధన్యవాదాలు సరసిజ గారూ!

  3. ఇంత వర్ణించాక అలాంటి వూరు చూడాలని ఉండదా ?

    మీ చిన్నప్పటి జ్ఞాపకాల వూరు ఇప్పుడు అలాగ వుండకపోవొచ్చు.

    అయినా చూడాలనిపించేలా చక్కగా రాసేరు.

    ఇంట్లో పీతల పులుసు కూర తినేసి, జగ్గంపేట సెంటర్లో నుంచుని కాకినాడ కాజా తింటూ

    తూరుపు కొండలమీద గాలి తగిలాక , హైవే లో లారీ ఒకటి అర్ధరాత్రి కాడ మెల్లగా వెళ్ళిపోయాక

    ఎండుగడ్డి యెగిరి కాలికి వొచ్చి తగిలినంత అనుభవం.

    ధన్యవాదాలు.

    1. మీ స్పందనకు అనేక నెనర్లు హరి గారూ! ఎంత బాగా చెప్పేరు!

  4. ఇంత వివరంగా మీ ఊరు గురించి
    వ్రాస్తే,”మీ ఊరు చూడలన్పించదా
    ఎవరికైనా?”అభినందనలు

    1. ధన్యవాదాలు చంద్రశేఖరరావు గారూ!

  5. చాలా చాలా బాగుంది గీతా మేడమ్ గారు మీ ఊరి పరిచయం సో…. స్వీట్ మెమోరీస్ చదువుతుంటే చాలా ఆనంద మనిపించింది హృదయపూర్వక అభినందనలు మీకు 👏👌💐👏👌💐👏👌💐👏👌💐👏👌💐🙏

Leave a Reply

Your email address will not be published.