బతుకు చిత్రం-39

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత  

***

          కాలం ఆగకుండా నడుస్తనే ఉన్నది. కమల మరణం కూడా పాత వడ్డది. జాజుల మ్మకు ఈర్లచ్చిమి ఆరోగ్యం గురించి బెంగ పట్టుకుంది. దేవతక్కను వెళ్ళి కలిసింది.ఈ మధ్య డాక్టర్ గారింట్లో పనికూడా మానివేయడంతో ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీయలేక పోయింది. దేవతక్క చెప్పిన ముచ్చట విని చాలా సంతోషించింది .

          ఈ మధ్యనే విదేశాలనుండి వచ్చిన డాక్టర్ ఒకరు ఇటు వంటి కేసులను దత్తతగా తీసుకొని ఉచితంగా వైద్యం అందిస్తున్నారని వారిలో మొదటిగా ఈర్లచ్చిమి పేరు చేర్చామని చెప్పింది.

          జాజులమ్మకు నోట మాటరాలేదు. దేవుడు తన పట్ల, తన పిల్లల పట్ల దయజూసి ఈ సాయం జేస్తున్నాడని ఆనందించి పూర్తి వివరాలు ఎరుక జేసుకొని వచ్చి సైదులుకు
తెలియజేసింది. ట్రీట్మెంట్ కు కనీసం నెల రోజులయినా పడుతుందని అప్పటివరకు పిల్లల బాధ్యత ఎలా అనుకున్టుండగా ,రాజయ్య , పిల్లలను గురించి మీరు బెంగ  పడకం డి. వారిని కంటికి రేప్పోలె నేను కాపాడుత మీరు వెళ్ళి వైద్యం చేయించుకు రమ్మని భరోసా ఇవ్వడంతో జాజులమ్మ మనసు కుదుట పడింది.

          జాజులమ్మ తండ్రికి ఈ విషయాలన్నీ చెప్పి మామకు తోడుగా ఉండడానికి రమ్మని
పిలిచింది. అలా వారం లోపలే ఈర్లచ్చిమి వైద్యానికని పట్నం చేరారు.

***

          ఆపరేషన్ ద్వారా క్యాన్సరు సోకిన భాగాన్ని తొలగించి మరలా రాకుండా చేయ వచ్చునని డాక్టర్ గారు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. డాక్టర్ గారి మాట తీరు , మర్యాదా జాజులమ్మను డాక్టర్ పట్ల ఆరాధనా భావాన్ని పెంచి, ఇటు వంటి కొడుకును గన్న తల్లిదండ్రులు ఎంత గోప్పవారో కదా ! నా బిడ్డలలో ఒగరు ఇటువంటి డాక్టర్ అయితే బాగుండునని ఆశ పడింది.

          ఈర్లచ్చిమి ఆరోగ్యం మెరుగవసాగింది. డాక్టర్ కూడా ఆమె ఆత్మా స్థయిర్యమే చికిత్స కంటే బాగా పనిచేసిందని చెప్పాడు.

          నెల రోజులు అనుకున్నది రెండు నెలలు పట్టింది. ఈ మద్య్లో పిల్ల దగ్గరకు వెళ్ళి వస్తున్నారు ఇద్దరూ. నానమ్మకు ఏమయిందమ్మా ? అంటున్న వారి ప్రశ్నలకు దాటవేస్తూ
నేట్టుకోస్తున్నది.

          వైద్యం ఖర్చు అంతా ఆ డాక్టర్ గారే భరించడం ఎంతో ఊరటనిచ్చింది. కూటికి గతిలేనివాళ్ళకి ఇలాంటి పెద్ద రోగాలు వస్తే తీర్చడానికే ఇటువంటి మంచి మనసున్న డాక్టర్లను ఇచ్చాడని ఎన్నిసార్లు అనుకుందో లెక్కలేదు. ఈర్లచ్చిమి ఆ రోజు సంపూర్ణ ఆరోగ్యంతో ఇల్లు చేరింది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొన్నది. రాజయ్య , ఈర్లచ్చిమిని చూసి కన్నీరు పెట్టాడు.

          జాజులమ్మను ఆ నాడు ఇంటి కోడలును చేసుకోవద్దని నేను అడ్డుపడ్డా నువ్వు చేసిన ధైర్నం వల్లే ఈనాడు ఇంటి కోడలు అయి నీ పాణాలు నిలవెట్టింది. ఆడోళ్ళు అన్నా అహానికి బుద్ది చెప్పింది. అని పరి పరి విధాలుగా పశ్చాత్తాపం చెందాడు.

          జాజులమ్మలోను, ఈర్లచ్చీమిలోనూ రాజయ్య పట్ల అభిమానం కలిగింది. ఆడపిల్ల పట్ల ఆయనకున్న మూర్ఖత్వం నెమ్మది నెమ్మదిగా తగ్గుతున్నందుకు కుదుటపడ్డారు.

          రాజయ్యలోనూ పిల్లలకు మంచి భవష్యత్తు చూపించాలనే తపన మొదలయింది.
ఆ తపనలో నుండే తనూ ఏదైనా పని చూసుకోవాలనే ప్రయత్నం కలిగింది. దానికి ఊతమిస్తూ పీరయ్య తన ఇంటిచుట్టు ఉన్న ఖాళీ స్థలంలో కోళ్ళ పెంపకం చేపడుదా మని ఆలోచన చెప్పడంతో రాజయ్యకు ఆ ఆలోచన నచ్చింది. పీరయ్య నేను త్వరలోనే వచ్చి మిగతా అన్ని ఏర్పాట్లు చేస్తానని మాటిచ్చి ఊరు బయలుదేరాడు.

***

          పీరయ్య తన గుడిసె చుట్టున్న కుంటలను పూర్తిగా కూడిపించి చదరంగా చేసి కోళ్ళ ఫారం పెట్టడానికి అనుమతి కొరకు దరఖాస్తు చేసుకున్నాడు.

          కానీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు ఫారం ద్వారా వచ్చే దుర్వాసనలు ఆరోగ్యా నికి హాని చేస్తాయని ఒప్పుకోక పోవడంతో ఆదిలోనే హంసపాదులా తయారవడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది.

          పీరయ్య చాలా నిరాశలో కూరుక పోయాడు.

          జాజులమ్మ కు తండ్రి ఆరాటం అర్థమై అతడికి మామకు ఒక వ్యాపకం కల్పించా లని గట్టిగా అనుకున్నది. ఇది కేవలం వ్యాపకం మాత్రమె కాక ఆర్థికంగా కూడా చాలా
ఉపయుక్తమవుతుందని ఆలోచించినదై ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఇందులో కమల తరుపున ఆస్తిని తాకట్టు పెట్టాలనే ఆలోచించించింది. కానీ ఎలా ముందుకు పోవాలో అర్థం కాలేదు. ఈర్లచ్చిమిని సలహా అడగాలనుకుంది.

          అత్తా ! మామకు ఏదోఒక పని చేయాలనే యావ పడ్డట్టున్నది. ఏదన్న పని వేట్టిత్తే
బాగుండు.

          హు …వయసు మీదున్నప్పుడు ఏ యావ లేదు. గిప్పుడు వత్తే ఏం లాభం ?ఆయన కు ఏం చాతనయితది ?

          చాతనయ్యేదే చూద్దాం. మనకూ ఆసరా ఉంటది. పొలగాండ్లు పెరుగుతాండ్రి . ఆళ్ళకు మంచి బతుకు చూపెట్టాలే.

          అవును బిడ్డా ! నువన్నది నిజమే , గని , బరువులేత్తని పని , పయిసా లేకుండా అయ్యే యాపారాలు ఏమున్నాయ్ గనుక . పైసా లోనే పరమాత్మ కదా !అందుకే నేను కమల బాపతు ఆస్తిని ఎక్కన్నన్న తనఖా పెట్టి వచ్చిన డబ్బులతో చిన్న యాపారం పెట్టిద్దామని అనుకుంటున్న. మంచిదే !ముందుగాల సయిదులుకు ముచ్చట చెప్పు , వాని సలహా కూడా తీసుకుందాం. వాడు సుత ఏమన్న ఆలోచన చెప్తాడేమో !

          తప్పకుండా అత్తమ్మ !ఆయనను కాదని నేను ఏ పనీ చెయ్యను.

          నాకు తెలియదా బిడ్డా !వాన్ని అందరు తాగుబోతు అని పెరనాలు పెడుతుంటే నువ్వే కదా! వాణ్ని మనిషిని చేసి వానికింత మర్యాదిచ్చింది. ఆని అద్రుట్టం, నా అద్రుట్టం …

          అత్తా !ఇగ ఆపు , నువ్వు , నన్ను , నేను నిన్ను ఇట్లానే పోగుడుకుందమా ! పనేమన్న చేసుకుందామా !

          మరే !నేను పోల్లగాండ్ల సంగతి చూస్తా .నువ్వు మిగతా పని చూడు.

          అత్తా కోడళ్ళు కాసేపు ఉబుసు పోనీ ముచ్చటలా మాట్లాడుకొని ఎవరి పనిలో వారు
మునిగిపోయారు.

***

          కమల తరుపున బంధువొకరు ఆ రోజు వచ్చారు . జాజులమ్మ , ఈర్లచ్చిమి గిన అందరు ఉన్నరు. జాజులమ్మకు ఆయన ఎవరూ అనేది తెలియ రాలేదు. కమల కూడా ఎప్పుడూ చెప్పినట్టు లేదు. అదే అడిగింది .

          నా దోస్తు అన్ని ముచ్చట్లు ఏది దాయకుండా చెప్పింది గని , మీ ముచ్చట ఎప్పుడూ
చెప్పలేదు అన్నది.

          అవును తల్లి ! ఎట్లా చెప్తది, ఆ పాపం నేను చేసి ఉండక పోతే చెప్పేదే . ఏమిటి ?అన్నట్టుగా చూశారు .

          అవునమ్మ ! కమల మా దూరపు చుట్టాల అమ్మాయి. నా భార్యకు పాణం బాగా లేకుంటే నేను మా ఇంట్లో పని కోసమని ఇంత బుడ్డ పిల్లప్పటి నుండే ఉంచుకున్న……
గదేంది ? నేను తను కలిసే తిరిగినం. నిన్నెప్పుడు నేను చూల్లె .

          అవును ,అప్పుడప్పుడు వారం , పది రోజుల వరకు కనిపించేదా ?

          కనిపించేదా అంటే అప్పడప్పుడు ……అంది గుర్తు చేసుకుంటునట్టుగా .

          ఆ కారణం నేనే .అప్పుడు మా ఇంటికే వచ్చేది .మా ఇంట్లో పని వాళ్ళు లేకుంటే వారు వచ్చేదాకా ఉండి వచ్చేది .

          పాపం ఏమిటి ?

          పాపం అంటే తనతో పుణ్యానికి పని చేయిన్చుకున్నామే తప్ప ఏనాడు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. ఒకసారి బాగా డబ్బు అవసరముండి బతిమిలాడింది. కానీ నా కొడుకులు ఇవ్వనియలేదు. డబ్బులు ఇచ్చేస్తే తిరిగి ఎప్పటికీ రాదనీ, అంతా అవసరమయితే చూద్దాం అంటూ దాటవేశారు. చాలాసార్లు తిరిగింది. కానీ, నా భార్యకు చాకిరీ చేయించుకోవడం మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం అని దాత వేయడం చేసేది.
ఇట్లా చాలాసార్లు జరిగాకా మా ఇంటికి రావడం మానేసింది. ఎందుకని ఆరా తీస్తే పెళ్ళి
చేసుకుందని తెలిసింది.

          మేమంతా డబ్బులు మిగిలాయని సంబురపడినము. ఈ లోగా నా భార్య చని పోవడంతో మేము ఇంకా ఆమెను గురించి వదిలివేశాం. నేనూ ఊరు విడిచి దేశం పోయాను. అక్కడ ఒక విచిత్రం జరిగి నేను మళ్ళీ కమలను వెతుక్కుంటూ వచ్చాను .

          ఏమిటది ?

          కమల లాంటి ఒక అమ్మాయిని నేను అక్కడ చూశాను. కావల పిల్లల లాగే ఉన్నారు. నాకు ఒకవేళ కమల ఎవరినయినా ఈ దేశపు వాళ్ళను పెళ్ళి చేసుకొని ఇక్కడకు వచ్చి
ఉంటుంద? అనే అనుమానం కలిగింది.

          ఒకరోజు ఆ పిల్లను అడిగాను .వివరాలు. తను చెప్పింది విన్న తరువాత మన కమల కాదని ఋజువు దొరికింది కానీ, కమల వంటి మంచి పిల్లకు నేను చేసిన మేలు ఏదీ లేదని అనిపించగా బాధ పడ్డాను. ఆమె కండ్ల ముందు ఉన్నప్పుడు డబ్బులు యాచించి నపుడు ఏ మాత్రం కరగని నేను ,ఇప్పడు దేశం కాని దేశంల్లో అమె మీద జాలి పడడం నా పై నాకే అసహ్యంగా అనిపించింది. నేను చూసిన కమలను పోలిన అమ్మాయి చాలా ఆరోగ్యంగా, మంచి బట్టలు కట్టుకొని హుందాగా దొర బిడ్డల్లె ఉండడంతో నాకు కమలను కూడా ఇలా చక్కగా చూడాలనిపించి ఆమె కష్టం అంతా ఆమెకు అప్పగించి  ఇప్పటి కయినా ఆమెకు మేలు చేయాలని అనుకున్నాను .

          దేశం తిరిగి రాగానే ముందుగా ఆమె ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టాను .
అలా అలా మీ ఊరుకు కూడా వెళ్ళాను, అక్కడ జరిగిన విషయాలన్నీ తెలిసి చాలా బాధతో ఇక్కడికి వచ్చాను , ఇప్పుడు మీరూ ,మేమూ చేయగలిగింది ఏదీ లేదు బాధ పడడం తప్ప .

          అవును, అందరికీ తన వల్ల మేలు జరగాలని తపించిన మనిషి. ఆ మంచితనం వల్లే పానాల మీదకు తెచ్చుకొని మన మధ్య నుండి ఈ లోకం విడిచి వెళ్ళి పోయింది.

          జాజులమ్మ గతం కళ్ళ ముందు తిరగగా వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఈర్లచ్చిమితో పాటు అందరూ ఆమె చుట్టూ చేరి ఓదార్చడానికి ప్రయత్నించారు. కానీ జాజులమ్మ తీరని వ్యధతో కుప్పకూలింది.

          వచ్చినతను కమలకు ఒక జీవితాన్ని ఇవ్వడానికి మీరు చేసిన ప్రయత్నానికి మీకు ఎంత చేసినా తప్పులేదు. అందుకే అప్పుడు ఇవ్వలేక పోయిన ఆమె కష్టానికి సొమ్మును
ఇప్పుడు ఇవ్వడానికి వచ్చాను. అన్నాడు.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.