యాదోంకి బారాత్-18

-వారాల ఆనంద్

కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరిక-ప్రస్తానం

కలల లోకంలోంచి వాస్తవ ద్వారం గుండా

విశ్వంలోకి చేసే ప్రయాణమే

‘కళ’

***

          అలాంటి ప్రయాణమే నాకు ఆలంబన అయింది. చదువు ముగించి చిన్నదో పెద్దదో జూనియర్ కాలేజీలో లైబ్రెరియన్ గా చేరాక అటు ఉద్యోగంతో పాటు ఇటు సాహిత్యం మరో పక్క సినిమాలూ నన్ను ఆవరించాయి అనేకంటే కమ్ముకున్నాయి అంటే సబబేమో. వేములవాడ ఫిలిం సొసైటీ ఏర్పాటు నిర్వహణ తదితర కార్యక్రమాల తర్వాత ఇంతుకు ముందే చెప్పుకున్నట్టు నా కార్యస్థలం కరీంనగర్ కు మారింది. నేను పెరిగింది చదివిందీ అక్కడే. 1984-85 సంవత్సరాలు నన్ను అమితంగా ప్రభావితం చేసిన కాలం. కరిమ్ నగర్ లో పాత మిత్రులు దామోదర్, నారాయణ్ రెడ్డి వెంకన్న వేణు ఇలా అనేక మంది సహచర్యం ఒక వైపు. మరోవైపు కరీంనగర్ ఫిలిం సొసైటీ దాన్ని నిర్వహిస్తున్న మిత్రులు. జీవితం బిజీ అయిపొయింది. అప్పటిదాకా ప్రధానంగా కవిత్వం, కథలు రాయడం చదవడం, ప్రధాన అభిలాష. పుస్తకాల అధ్యయనంలో అధిక కాలం గడిపిన కాలం. కానీ చాలామంది కవుల్నీ రచయితల్నీ దగ్గరగా చూడడం, వారి వారి వ్యక్తిత్వాలు నన్ను ఎందుకో చెప్పలేని కన్ఫ్యూజన్ లో పడేశాయి. సరిగ్గా అప్పుడే అర్థవంతమయిన సినిమా నన్ను క్రమంగా రీలులా చుట్టుకోవడం ఆరంభించింది.

          కళా సృష్టి అనేది మనసుకు అంటిన మాలిన్యాన్ని తొలగించి “ప్రతిమను  రూపొందించడం లాంటిది” అనిపించింది. అంతేకాదు ఆ ప్రతిమ నాలుగు గోడలనడుమ నలుగురు మనుషుల మద్య కాకుండా గొప్ప కళా సృస్తి ఎక్కడ ఏ రూపంలో జరిగినాదాన్ని పదిమందికి, వంద మందికి, వేల మందికి చేర వేయాలనే తపన పెరిగింది. దాంతో అత్యంత ప్రభావ వంతమయిన అర్థవంతమయిన సినిమాను ప్రజలకు చూపించాలనే భావంతో క్రమంగా కాలమంతా ఫిలిం సొసైటీతోనే గడపడం ఆరంభించాను.

“డబ్బునీ, స్నేహాన్నీ, ప్రేమనీ పొదుపు చేయగలవు కాలాన్ని కాదు, దాని ముక్కుతాడు నీ చేతిలో లేదు” అందుకే కాలంతో పరుగెత్తడం మొదలు పెట్టాను. అటు సాహిత్యంతో పాటు ఒక రకంగా సాహిత్యం కంటే ఎక్కువగా సినిమాల్ని చదవడం ఆరంభించాను. మంచి సినిమాల గురించి ఎక్కడ ఎవరు ఏది రాసినా గుండెలకు హత్తుకుని చదవడం మొదలు పెట్టాను. అప్పుడు ప్రధానంగా ‘స్క్రీన్’, హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ తర్వాత NFDC వారి సినిమా ఇన్ ఇండియా, మరో పత్రిక CINIMAA INDIA INTERNATIONAL, BLITZ, CARAVAN, లలో ఎక్కడ సమాంతర సినిమాగా పిలవబడ్డ సినిమాల గురించి వచ్చినా చదవడం, వీలయితే filing అప్పటి వ్యాపకం.

          ఆ కాలంలో ఇంకో వైపు ఉత్తర తెలంగాణా అట్టుడికి పోయిన కాలం. ప్రజా ఉద్యమా లతో పల్లెలన్నీ రగులుతున్న సమయమది. దానిపట్ల అభిమానం అధ్యయనం ఆరాధన మాత్రమే కలిగివున్న నాలాంటి వాళ్ళకు పట్టణాల్లో పత్రికలు సాహిత్య సంస్థలు ఫిలిం సొసైటీలు ప్రధాన వ్యక్తీకరణ వేదికలయ్యాయి. దేశంలోని వివిధ భాషా సినిమాలతో పాటు వివిధ దేశాల సినిమాల్ని కూడా ప్రదర్శించడం తర్వాత వాటి పైన చర్చలు అది గొప్ప ఉద్యమం. కరీంనగర్ లో ఆదివారం వెంకటేశ్వర టాకీస్ క్రిక్కిరిసిపోయేది. సాయంకాల మయ్యేసరికి పక్షులన్నీ గూటికి చేరినట్టు అంతా అక్కడ చేరేవాళ్ళు. ఎన్ని చర్చలో ఎన్ని మాటలో. అందరినీ కలిపే ఇరుసు సినిమా అయితే వ్యక్తిగా నరేడ్ల శ్రీనివాస్ ది వివరించ లేనంత గొప్ప పాత్ర.

          1984 లో నేను కరీంనగర్ ఫిలిం సొసైటీ బరిలోకి పూర్తిగా దిగలేదు. రింగు అవతలే వుండి శ్రీనివాస్, రాములు, లింగారెడ్డి తదితరులతో కలివిడిగా వుండేవాన్ని. నేను చదివిన చదువుతున్న సినిమాల గురించి దర్శకుల గురించీ అప్పుడప్పుడూ మెల్లిగా బెరుకు బెరుకుగా మాట్లాడేవాన్ని.

          ఇక ఏ సంస్థయినా వ్యక్తుల సమూహమే. సంస్థ నిర్వహణలో వ్యక్తుల అభీష్టాలూ కోరికలూ పోటీలూ ఉండనే వుంటాయి. 84లో ఆ స్థితి కఫిసో ఎదుర్కొంది. కార్యదర్శిగా నేనంటే నేనని గోపు లింగా రెడ్డి, ఆర్. సుధాకర్ లు ముందుకు వచ్చారు. ఆ పోటీ పరిస్థితి సంస్థకు అంత మంచిది కాదని శ్రీనివాస్, నరసింహారావు సార్ ఆలోచించి కొండా వేణు మూర్తిని కార్యదర్శిగా ఉండమన్నారు. నేనేం చేయగలను బాబోయి అంటే మేమున్నా మని అంతా హామీ ఇచ్చారు. కార్యదర్శిగా ఉంటామన్న లింగారెడ్డి, సుధాకర్ లు కూడా హృదయపూర్వకంగా ఆహ్వానించారు. అమ్మయ్య అనుకున్నారంతా. అదట్లా వుంటే ఆ ఏడుకూడా కఫిసో గౌరవాధ్యక్షులుగా అప్పటి కలెక్టర్ ఆర్.చంద్రశేఖర్ వున్నారు. ఆయన సహకారంతో కఫిసో రెండు 35mm portable projectors కొనుగోలు చేసింది. దాన్ని కలెక్టర్ ఆర్.చంద్రశేఖర్ ‘కళాభారతి’ మున్సిపల్ ఆడిటోరియంలో ప్రారంభించారు. నాకు తెలిసి అప్పటికి స్వంతంగా 35mm portable projectors కలిగి వున్న ఫిలిం సొసైటీగా కఫిసో దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకుంది. అప్పటికే అంపశయ్య నవీన్ గార నేతృత్వంలో కే.ఎస్. శర్మ గారి సహకారంతో 16mm projector ను కలిగి వుంది కఫిసో. ఇంకే ముంది కేవలం టాకీసు లో సినిమాలు వేయడమే కాకుండా పోర్టబుల్ ప్రొజెక్టర్ లతో తన కార్యక్రమాల్ని విస్తృతం చేసింది. అప్పటి కార్యవర్గంలో విముక్తి కోసం సినీ నిర్మాత శ్రీ నారదాసు లక్ష్మణ రావు, రచయిత శ్రీ తాడిగిరి పోతరాజులు కూడా వున్నారు.

          ఆ సంవత్సరం ఫిలిం సొసైటీ ఎన్ని కార్యక్రామాలు చేపట్టిందో లెక్కలేదు. నాకు అన్నీ గుర్తు లేవు. కానీ కొన్నింటిని గుర్తు చేసుకుంటాను. ‘ప్రాంతీయ సినిమాలు నవ్య ధోరణులు’ అన్న అంశం మీద జరిపిన సెమినార్ లో దర్శకుడు శ్రీ బి.నరసింగ రావు ప్రధాన ప్రసంగం చేసారు. ప్రాంతీయ సినిమా అంటే కేవలం ప్రాంతీయ భాషా సినిమా కాదని, ఒక ప్రాంత సామాజిక రాజకీయ ఆర్ధిక స్థితుల్ని ప్రతి ఫలించేదని అయన గొప్ప సాధికారిక ప్రసంగం చేసారు. ఇక తర్వాత ‘NEW INDIAN CINEMA” అన్న అంశం పైన జరిపిన కార్యక్రమమలో FEDERATION OF FILM SOSITIES OF INDIA ప్రాంతీయ కార్యవర్గ సభ్యుడు ఎం.ఫిలిప్ పాల్గొని ప్రధాన ప్రసంగం చేసారు. అట్లే జాతీయ యువజన వారోత్సవాల సందర్భంగా అప్పటి యూత్ కో ఆర్డినేటర్ శ్రీ వి.రామారావు గారి సూచనల మేరకు కఫిసో ఏర్పాటు చేసిన ‘FIMS MADE BY YOUTH FOR YOUTH’ అన్న సెమినార్లో ప్రముఖ కవి దేవిప్రియ ప్రధాన ప్రసంగం చేసారు.

ఇక సినిమాల్లో ఆర్ట్ అన్న అంశం మీదా ప్రముఖ ఆర్టిస్ట్ చంద్ర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అట్లా సంవత్సరమంతా ఎదో ఒక సెమినార్ జరుగుతూనే వుంది. క్రమం తప్పని సినిమాల ప్రదర్శన సరేసరి. సినిమాలకు వెంకటేశ్వర టాకీసు అధినేతలు జగన్ మోహన్ రావు, మురళీ మోహన్ రావులు ఎప్పుడూ సహకరించారు.

అతి తక్కువ అంటే కేవలం కార్బన్, కరెంటు ఖర్చులు మాత్రం తీసుకుని హాలు ఇచ్చేవారు. ఇక టాకీసు నిర్వాహకుల్లో కార్మికులంతా మా వెంటే వుండేవాళ్ళు. ముఖ్యంగా మేనేజర్లు విఠల్ రెడ్డి, మురళి లయితే పూర్తి సహకారంతో వుండేవాళ్ళు. ఆపరేటర్ల నుండి స్వీపర్ల దాకా ఆది వారం ఉదయమే ఫిలిం సొసైటీ సినిమా అంటే ఉత్సాహంగా వచ్చేవాళ్ళు. అందరితో అందరమూ ఎంతో స్నేహంగా వుండేవాళ్ళం. అది వాళ్ళకు మమ్మల్ని బాగా దగ్గర చేసింది. ఇక 16/35 mm portable projectors ఉపయోగించడంలో పౌర సంభందాల శాఖ కు చెందిన శ్రీనివాస్ కఫిసోకు పెద్ద బలం. చుక్క వేసి వచ్చినా ఆయన నిబద్దత ఎన్న దగినది. ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు. మీరంతా ఇంత కష్టపడుతున్నారు నాదే ముంది అనేవాడు.

          అట్లా కఫిసోతో నా ప్రయాణం ఆరంభమయింది. 1985లో మొట్టమొదటి సారి కరీంనగర్ ఫిలిం సొసైటీ కార్యవర్గంలో సభ్యుడిగా చేరాను. ఇక అప్పటి నుండి దశాబ్దాల పాటు దానిలోనే వున్నాను దాని వెంటే వున్నాను. కఫిసో ఎదుగుదల, సినిమాల పట్ల నా అవగాహనా క్రమంగా పెరుగుతూ వచ్చాయి.

          సరిగ్గా అదే సమయంలో శ్రీ బి. విజయకుమార్ సంపాదకత్వంలో “జీవగడ్డ” సాయంకాల దినపత్రిక మొదలయింది. జీవగడ్డ కరీంనగర్ పట్టణానికే కాదు, జిల్లాకు, మొత్తంగా ఉత్తర తెలంగాణాకు గొప్ప చైతన్య దీపిక.

***

‘జీవగడ్డ’- ఆత్మీయ సృజనాత్మక వేదిక

‘లోపల జ్ఞాపకాల జాతర

వర్తమాన జెండా పట్టుకుని

నేనేమో ముందు నడుస్తున్నా’

          ‘యాదోంకి బారాత్’ అనుకున్నప్పటి నుండీ ఈ మాటల్ని ఎన్ని సార్లు మననం చేసుకున్నానో. జీవితంలో ఎన్ని తీరాలు దాటుతామో ఎంత దూరం ప్రయానిస్తామో.. ఎన్నో గుర్తుంటాయి మరెన్నో మరపు అరల్లో మిగిలిపోతాయి. అదంతే. తవ్వుతూ గుర్తు చేసుకుంటూ రాస్తున్న ఒక చిన్న ప్రయత్నమే ఈ బారాత్. ఇందులో కూడా ఎన్నో వాదాలూ వివాదాలూ.. నన్ను మరిచిపోయావనే చిరు ఆత్మీయ అలకలూ కోపాలూ. తమ తమ జ్ఞాపకాల్ని పంచుకునే ప్రయత్నాలు. నిజంగా ఇదంతా గడిచిన జీవితాన్ని గుర్తు చేసుకున్నట్టు లేదు. తిరిగి జీవిస్తున్నట్టుంది. అందులో కూడా చీకటీ వేల్తురూ.. ఎంత యినా జీవితమే కదా.

          ఇక 1984-85లు ఆ తర్వాతి కాలం నా జీవితంలో ఎంతో ముఖ్యమయినది. ఎంత గానో ప్రభావితం చేసిన కాలమది. ముఖ్యంగా రచనా అధ్యయన జీవితానికి సంబంధించి. అంతే కాదు ప్రింట్ అండ్ విజువల్ మీడియాలతో నాకు పరిచయం ప్రవేశం కలిగినదీ అప్పుడే. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో సాహితీ సాంస్కృతిక రాజకీయ ఉద్యమాల చైతన్యం పెల్లుబికిన కాలమది. పల్లెలన్నీ అతలాకుతలమవుతూ తమ దారిని నిర్దేశించు కుంటు న్న సమయమది.

          అదే సమయంలో నగరాలూ కరీంనగర్ లాంటి పట్టణాలూ కూడా చైతన్య జెండాల్ని అందుకున్నాయి. మధ్యతరగతి ప్రజల్లో అభిమానం ఆదరణ పెల్లుబికాయి. అప్పటికింకా నేనూ నాదీ నాకేమిటి అన్న భావన అంకురించలేదు. మనమూ మనదీ అన్న భావనతో పాటు ఒక అనిర్వచనీయమయిన సామాజికత్వం, సామూహికత్వం కనిపించేది. మనుషులు కలవడం సాధారణం. కలిసినప్పుడు ఇవ్వడం పుచ్చుకోవడం, నవ్వుకోవడం, చర్చించుకోవడం శ్వాస తీసుకున్నంత సాధారణంగా వుండేది. వాదాలు ఏమేరకంటే వాదం తర్వాత వీళ్ళు కలిసుంటారా అనేంత తీవ్రంగా జరిగేవి. కానీ చిత్రంగా వాదన ముగియగానే జిలేబీ తిందామా, మిర్చీ బజ్జీనా అంటూ కలిసి పోయేవాళ్ళం. దానికి ప్రధాన కారణం బహుశా అందరినీ కలిపి ఉంచిన ఇరుసు లాంటి భావ చైతన్యమేమో.

          ఆ నేపధ్యంలోనే కరీంనగర్ లో “ జీవగడ్డ” సాయంకాల దిన పత్రిక మొదలయింది. అందరమూ విజ్జన్న అని ఆప్యాయంగా పిలిచే శ్రీ బి.విజయకుమార్ దాని సంపాదకుడు, వ్యవస్థాపకుడు.

‘పత్రికొక్క టు న్న పదివేల సైన్యమ్ము

పత్రీ కొక్క టు న్న మిత్రకోటి

వాస్తమ్ము నార్ల వారి మాట ‘ అన్న నార్ల మాట కరీంనగర్ లో జీవగడ్డ తో అక్షర సత్య మయింది.

          అప్పటికే నిర్మల ప్రింటింగ్ ప్రెస్ తో అనుభవమున్నవాడు విజయ కుమార్. అంతే కాదు ఒక సారి పోలీసుల నిర్భందాన్నీ హింసనీ చవిచూసిన వాడు. అయినా ఎంతో సరదాగా స్నేహంగా చైతన్యవంతంగా ఉండేవాడు. నాకు తెలిసి అప్పుడు జిల్లా కేంద్రం లో ఒక పత్రిక పెట్టాలనే ఆలోచన చేసింది విజయకుమార్ తో పాటు రచయిత బి.ఎస్. రాములు. అన్ని మండలాల్లో యువకులు సానుభూతి పరుల్ని విలేఖరులుగా నియమిం చాలి అన్నది వాళ్ళ ఆలోచన. వాళ్ళందరికీ గుర్హింపు కార్డులు, వీలయితే అక్రిడిటేషన్ ఇప్పించాలన్నది లక్ష్యం. దాంతో చైతన్యవంతమయిన యువ విలేఖరులు తయారవు తారన్నది ఆలోచన. అయితే బీ.ఎస్. ప్రతిపాదించిన జీవగడ్డకు అనుమతి వచ్చింది. కానీ అప్పటికే ఆయన ప్రజా జీవితంలోకి వెళ్ళి పోయాడు. దాంతో విజయ కుమార్ ‘జీవగడ్డ’ను ఆరంభించాడు. కరీంనగర్ శాస్త్రీ రోడ్ కు కింది భాగాన రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర బ్రాహ్మణ వాడలో పత్రిక శురూ అయింది. శారదా ప్రింటింగ్ ప్రెస్ యజమాని శ్రీ నాగభూషణం తన ప్రెస్ లో అచ్చువేయడానికి ముందుకు వచ్చాడు. శ్రీ నాగభూషణం అప్పటికే ఉన్నత విద్యావంతుడు. తన వ్యాపారం తాను చూసుకుంటూనే పెద్ద లాభాపేక్ష లేకుండా జీవగడ్డను ప్రచురించడానికి ముందుకు వచ్చాడు. అట్లా సాయంకాలం దిన పత్రికగా మొదలయింది. దినపత్రిక అంటే మాటలు కాదు. సిబ్బంది నిర్వహణ పెద్ద సవాలే. అప్పటికి ఇంకా ఆఫ్ సెట్, డిజిటల్ వ్యవస్థ లేదు. లెటర్ ప్రింటింగ్ ప్రెస్సు మాత్రమె.

          అప్పుడే అసిస్టెంట్ ఎడిటర్ గా కే.ఎన్.చారి రంగ ప్రవేశం చేసాడు. తాను అప్పటికే ఉస్మానియాలో పీజీ చేసి కవిత్వం, జర్నలిజంల పట్ల ఆసక్తితో జీవగడ్డలో చేరాడు. నేను కలిసిన మొదటి రోజే హాయ్ ఆనంద్. మనిద్దరికీ ఇంతకు ముందు పరిచయం లేదు కానీ ఇద్దరం ఉస్మానియా రైటర్స్ సర్కిల్ లో పనిచేశాం. అంటే మనం పాత వాళ్ళమే అన్నాడు. అట్లా సులభంగా కలిసిపోయాం. అప్పుడే ప్రజా జీవితం నుంచి వచ్చి ఉస్మానియాలో ఎం.ఏ సోషియాలజీ పూర్తి చేసిన కవి అల్లం నారాయణ సబ్ ఎడిటర్ గా జీవగడ్డలో చేరాడు. ఇంకేముంది అటు సామాజికం ఇటు సాహిత్యం రెండూ జీవగడ్డకు ఉచ్వాస నిశ్వాసాలయ్యాయి. ఇక క్రికెట్ అంటే విపరీతమయిన అభిమానంతో పాటు క్రికెట్ ఆడే యువకుడు నరేందర్ రావు ని స్పోర్ట్స్ రాయమని చారి బాగా ప్రోత్సహించాడు. నాకు గుర్తున్నంత వరకు దాదాపు అదే సమయంలో ఘంటా చక్రపాణి కరీంనగర్ లో ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో విద్యార్థి. సాయంకాలాలు విద్యార్థి సంఘ ప్రకటనలు తీసుకుని జీవగడ్డ ఆఫీసుకు వచ్చేవాడు. క్రమంగా అది గమనించిన చారి ఒక రోజు ఏయి ఆగు అని చక్రపాణీని ఆపాడు. ఈ ప్రకటనల్ని ఎవరు రాస్తారు అని అడిగాడు. నేనే అన్నాడు చక్రపాణి. నువ్వేనా లేక మీ సార్లు ఎవరయినా రాస్తారా అని అడిగాడు. లేదు నేనే రాస్తానన్నాడు. అయితే ఇట్లా కూర్చుని ఇది రాయి అంటూ ఒక ప్రకటన ఇచ్చాడు. రాయగానే ఇక రోజూ సాయంత్రం రా ఇక్కడ కూర్చుని రాయి అని ఓ పెద్దన్న చెప్పినట్టు చెప్పాడు. ఏముంది స్టూడెంట్ చక్రపాణి కాస్తా ఘంటా చక్రపాణి అయిపోయాడు.

          అప్పటిదాకా ఫిలిం సొసైటీ అడ్డా ఎడమ నారాయణ రెడ్డి ‘లక్ష్మి సానిటరీ’. దాన్నుండి క్రమంగా జీవగడ్డకు మారింది. అక్కడా ఇక్కడా వుండేవాళ్ళం. పగలయితే లక్ష్మి సాయంత్రమయితే జీవగడ్డ. ఒకరా ఇద్దరా ఎంతమందని. ఓహ్.. నరేడ్ల శ్రీనివాస్, నారదాసు లక్ష్మణ రావు, గోపు లింగా రెడ్డి, పెండ్యాల సంతోష్ కుమార్, కే.దామోదర్ రెడ్డి, నారాయణ రెడ్డి, పీజీ సెంటర్ జే.మనోహర్ రావు, లెక్చరర్ డి.నరసింహ రావు, కే.విజయ్, సి.పుల్లయ్య, అన్నా రెడ్డి, జాప లక్ష్మా రెడ్డి ఇట్లా అనేక మంది దాదాపు రోజూ కలిసేవాళ్ళం. అనేక చర్చలు వాదాలూ వివాదాలూ కొనసాగేవి.

          ఒక రోజు ఎట్లా వచ్చిందో ఏమో చారికి ఒక ఆలోచన వచ్చింది. ఇట్లా రోజూ వూరికే కలవడం మాట్లాడడమే కాదు అందరూ ఏమయినా రాయాలి అన్నాడు. ఏమిటి ఎట్లా అన్నాం. ఒక్కొక్కరూ ఒక్కో రోజు జీవగడ్డ లో కాలం రాయాలి అన్నాడు. ఎడిటర్ విజ్జన్న బాగుంటుంది రాయండి అన్నాడు. ఇంకే ముంది. శీర్షికలూ, రాయాల్సిన రోజులూ చారి నిర్ణయించేసాడు. రాయాల్సిన వాళ్ళ పేర్లూ చెప్పేసాడు. సోమవారం గోపు లింగా రెడ్డి ‘జానపదం’, మంగళ వారం నరెడ్ల శ్రీనివాస్ ‘పెన్నుపోటు’, బుధవారం చారి ‘న్యాయ వాదం’, శుక్రవారం అల్లం నారాయణ ‘ఎన్నెల కోనల్లో’ రాయాలన్నాడు. బాగుందన్నాం. నువ్వెట్లా తప్పించుకుంటా వన్నాడు చారి. ఆదివారం ‘వారానందం’ రాయాలన్నాడు. ఏముంది సరేనన్నాను. అప్పటికే నేను కొంత కవిత్వం మరికొంత సమాంతర సినిమాల మీద రాస్తున్నవాన్ని. చారి దానికదే దీనికిదే అన్నాడు.

          గోపు లింగా రెడ్డి తన జానపదం కాలంలో జనపదంలో వూరు ఊరులోని మనుషులు వారి నడుమ అనుబంధాలు పాటలు రాసాడు. మంచి మాండలికంలో ఆ కాలం సాగింది. ఇక నరెడ్ల శ్రీనివాస్ తన ‘పెన్నుపోటు’ లో సమాజంలో జరిగుతున్న అనేక అక్రమాల గురించీ అన్యాయాల గురించీ విశేషంగా రాసాడు. కొంచెం ఘాటుగా కటువుగా సూటిగా రాసాడు. బాగా చదవాలనిపించెంత ఆసక్తిగా వుండేది ఆయన కాలం. ఇవ్వాళ ‘పోటు’ ఎవ్వరి మీద అని సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. కే.ఎన్.చారి తన ‘న్యాయవాదం’ లో సామాజిక న్యాయాన్యాయాలూ చర్చకు పెట్టె వాడు. బాగా చదువుకున్న వాడు జర్నలిస్టు కనుక చాలా స్పష్టంగా వుండేది ఆ కాలం. ఇక కవి భావుకుడూ అయిన అల్లం నారాయణ తన ‘ఎన్నెల కోనల్లో’ లో అద్భుతమయిన కవితాత్మక మయిన రచనలు చేసాడు. ఆర్తిగా భావ స్పోరకంగా వుండేది ఆ ‘కాలం’. ఆ ఎన్నెల కోనల్లోను పుస్తకంగా తెద్దామని ప్రయత్నం జరిగింది కానీ ఎందువల్లో అప్పుడు అది సాధ్యం కాలేదు. ఇక నా వంతు వచ్చేసరికి అరె ఎంది భాయి ‘వారానందం’ అన్నావు హాస్యం రాయాలా ఎం రాయాలి అని చారిని అడిగాను. కవిగాడికి హద్దు లేముంటాయి నీ ఇష్టం పొ అన్నాడు. అయినా అనేక వారాల పాటు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనల్ని ఆధారం చేసుకుని కొంత హాస్యాన్ని జోడించి రాసాను. మరి కొన్నిసార్లు మనిషి విలువలు అనుబంధాల మీదా రాసాను. ఆ రకంగా ఒక దిన పత్రికలో వారం వారం కాలం రాయడం, రాసే అవకాశం రావడం అప్పటికి గొప్ప విషయమే. ఆ ఘనత అంతా కే.ఎన్ చారీ, విజయ కుమార్ లదే.

          జీవగడ్డ కు క్రమం తప్పకుండా జాప లక్ష్మా రెడ్డి గారు వచ్చేవారు. ఇంకా న్యాయ వాదులు గులాబీల మల్లా రెడ్డి, గుణవంత్ సింగ్, గోపు రాజి రెడ్డి కూడా వచ్చేవారు.

          ‘జీవగడ్డ’ మా అందరి స్నేహాలకూ, కళాత్మక రాజకీయ చర్చలకూ ఉత్తమ వేదికగా మారింది.

          అంతే కాదు కరీంనగర్ ఫిలిం సొసైటీ కొత్త కార్యక్రమాలకూ, వాటి రూపకల్పనకూ జీవగడ్డ ఊతమిచ్చింది. ఇంకా “కరీంనగర్ ఫిలిం క్రియేటర్స్” అన్న ఆలోచనకూ వేదికయింది… ఇంకా ఎన్నో… మళ్ళీ కలుస్తాను

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.