ఒక బానిస (ఫ్రెడరిక్ డగ్లస్) ఆత్మకథ

-పి. యస్. ప్రకాశరావు

          స్పార్టకస్, ఏడుతరాలు,స్వేచాపదం, అంకుల్ టామ్స్ కేబిన్ వంటి నవలలు నచ్చిన వారికి “ఒక బానిస ఆత్మకథ” తప్పకుండా నచ్చుతుంది.

          1817-18 లలో పుట్టి అమెరికాలో బానిసజీవితం గడిపిన ఫ్రెడరిక్ డగ్లస్ ఆత్మకథ ఇది. తన బానిస జీవిత అనుభవాలనూ, అక్కడి నుంచి పారిపోయిన విధానాన్నీ, క్రైస్తవుల దుర్మార్గాలనూ కళ్ళకు కట్టినట్టు వర్ణించి “ఎవరి సాయంతో పారిపోయానో చెబితే వారికి అపకారం” అన్నాడు డగ్లస్.

          అమెరికాలో ఉన్నవాళ్ళు ఆఫ్రికా వచ్చి అక్కడివారిని గొలుసులతో బంధించి తీసు కొచ్చి బానిసలుగా మార్చేస్తారు. శిశువుకి ఏడాది దాటకముందే తల్లి నుంచి వేరు చేస్తారు. తల్లిని 12 కి.మీ. దూరంలోని పనికి పంపిస్తారు. ఆమె సూర్యోదయానికి ముందే నడిచి వెళ్ళి పని చేసి తిరిగి రావాలి. కాబట్టి నా ఏడేళ్ళ వయసులోనే నా తల్లి మరణించింది. ఆమెను చూడ్డానికి నాకు అనుమతి దొరకలేదు. నా తండ్రి ఎవరో నాకు తెలియదు. ఏడెనిమి దేళ్ళు వచ్చే వరకూ ఇంచుమించు నేను నగ్నంగానే బతికాను, మోకాళ్ళదాకా ఉండే ముతకషర్ట్ తప్ప. చలికి వణికి చచ్చిపోయేవాణ్ణి. మొక్కజొన్న తెచ్చే ఓ గోతాంలో తల దూర్చి తేమగా ఉన్న నేల మీద నిద్రపోయే వాణ్ని. చలికి నా కాళ్ళు ఎంతగా పగిలా యంటే ఇప్పుడు నేను రాసే కలం వాటిలో పట్టేది. యజమానికి పుట్టిన బానిస పిల్లలు బాలికలైతే సెక్స్ బానిసలు. బాలురైతే సేవకులు. యజమాని తనకు పుట్టిన బానిస పిల్లల్ని ప్రేమగా చూస్తే అతని భార్యకు కోపం వస్తుంది. అందుకని వీరు ఇతర బానిస పిల్లలకంటే ఎక్కువ కష్టాలనుభవిస్తారు.

          బానిస కడుపు కాలితే తప్ప మాట వినడని వారి దుర్మార్గమైన ఆలోచన. కానీ తిండి పెట్టకపోతే ప్రాణంతో ఉండరు, పైగా పనిచేయడానికి శక్తి ఉండదు. కాబట్టి (చాలీ చాలని) తిండి పెట్టేవారు. అది సరిపోక అడుక్కుని, దొంగిలించీ కడుపునింపుకునేవాళ్ళం. వీధిలో పందులకు వేసిన ఆహారాన్ని మేరీ తినడం నేను చూశాను. అలా తిన్నందుకు ఆ తరువాత ఆమె దెబ్బలు తినాల్సివచ్చింది. భోజనం సరిపోలేదన్నవారికి చాలా ఎక్కువ ఆహారాన్ని ఇచ్చి వెంటనే తినెయ్యమంటాడు. తినలేకపోతే ‘నీకసలు ఆకలిగా ఉందా?’ అంటూ కొరడాకి పనిచెబుతాడు. మాకు తిండి తినడానికి సమయముండేది కాదు. ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో మా భోజనం పూర్తవ్వాలి. ఓ పక్క మమ్మల్ని ఆకలి తో మాడుస్తున్న యజమానులు తమకు సంపదలివ్వమని భగవంతుని ప్రార్ధిస్తారు. బానిసలు పనిచేసే ఆపిల్ తోట కంచెకు తారు పూస్తారు. ఆకలికి తాళలేక ఆపిల్ కోసుకు తిన్న బానిసకు ఆ తారు అంటుతుంది. దొంగతనం బయటపడి ఆ బానిస కొరడా దెబ్బలు తింటాడు.

          ఒళ్ళు జలదరించే చిత్రహింసలు పెట్టేవారు. యజమాని మా మేనత్తను ఒకసారి స్తంభానికి కట్టేసి తోలు కొరడాతో చర్మం కమిలి, చిట్లి నెత్తురు ధారగా కారేటట్టు కొట్టాడు. ఆమె బిగ్గరగా కేకలేస్తే గాయాల మీదే మళ్ళీ మళ్ళీ కొట్టేవాడు. ఒకసారి ఆంటీ (మరో బానిస స్త్రీ) అతని మాట వినలేదని నడుం దాకా వివస్త్రను చేసి స్థూల మీద ఎక్కించి తోలుబెల్ట్ తో రక్తం కారి నేలమీద గడ్డకట్టే వరకూ కొట్టాడు. మాకు తెల్లారేసరికి బూర చప్పుడు వినిపి స్తుంది. సూపర్ వైజర్ బెల్ట్ తోనూ కర్రతోనూ బానిసల కొట్టం బైట నిల్చుంటాడు. బానిసలు వెంటనే పొలంలోకి వెళ్ళకపోతే గొడ్లను బాదినట్టు బాదుతాడు. విరామం లేకుండా పని చేయాలి. మేం మొక్క జొన్న చేలో ఉన్నప్పుడు యజమాని లేడు కదా అని ఒక్క క్షణం మేను వాలిస్తే ఆ రాక్షసుడు దొంగతనంగా కాళ్ళ మీదా చేతుల మీదా పాక్కుంటూ వచ్చి వీపులు చీరేస్తాడు. అతనికి బానిసను కొట్టడానికి ప్రత్యేకించి కారణం అక్కర్లేదు. గుర్రం పరుగెత్తకపోయినా, తలపైకెత్తక పోయినా అతనికి కోపం వస్తుంది. వెంటనే షర్ట్ విప్పి మోకాళ్ళ మీద కూర్చుని 30 కొరడా దెబ్బలు తినాలి. ఒకసారి కల్నల్ లాయడ్ (యజమాని) కొట్టిన దెబ్బలకు పోయి బండవెనుక దాక్కున్నాడని తుపాకీతో తల మీద కాల్చాడు. ఆ బానిస మెదడు బయటికొచ్చింది. యజమాని భార్య, ఓ సారి అర్ధరాత్రి తన పసిబిడ్డ ఏడ్చిన వెంటనే చూడ్డానికి వెళ్ళలేదని పదిహేనేళ్ళ నల్లజాతి పిల్లను దుడ్డు కర్రతో కొట్టి చంపేసింది. వీటి మీద కేసులూ తీర్పులూ ఉండవు.

          బానిసలు యజమాని ఆస్తి. నాకు 12 ఏళ్ళ వయసప్పుడు గొర్రెలనీ పందుల్నీ గుర్రాలనీ మమ్మల్నీ( బానిసల్నీ) ఒక దగ్గరపోగేసి మా యజమాని కొడుకులు పంచు కున్నారు. కోవీ (యజమాని పేరు) ఒక ఆడబానిసను కొని మరో పురుష బానిసను అద్దెకు తెచ్చాడు. ఆ ఇద్దర్నీ ఒకే గదిలో పెట్టాడు. వారికి కవలపిల్లలు పుట్టారు. కోవీ తన ఆస్తి పెరిగిందని పొంగిపోయాడు.

          నా కొత్త యజమానురాలు మొదట ఏబీసీడీలు నేర్పించింది. కానీ ‘చదువుకున్న బానిసలు మాట వినరు. కాబట్టి వారు చదువుకోకూడదు’. అని భర్త చెప్పడం వల్ల ఆ రోజు నుంచీ నా చేతిలో వార్తాపత్రిక కనిపిస్తే కోపంతో ఊగిపోయేది. ఆమె సమావేశాలకు వెళ్ళి నప్పుడు బుల్లియజమాని నోటుబుక్కుల ఆధారంగా నేను రాత నేర్చుకున్నాను. ఈ  క్రైస్తవ మతబోధకులు బానిసలను రక్తపుటేరులు కారేలా కొరడాలతో కొట్టి, ఆదివారం వస్తే మాత్రం చర్చిలో శాంతి సందేశాలిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లు వెచ్చించి బైబిల్ ప్రచారం చేస్తారు. కానీ తమ బానిసల్ని దాన్ని చదవనివ్వరు.

          డగ్లస్ రెండుసార్లు పారిపోడానికి ప్రయత్నించి యజమానులచేత శిక్షకు గురయ్యాడు. మూడోసారి విజయం సాధించాడు. బానిసల విముక్తి  కోసం పోరాడాడు. 1895 లో.

దున్నకుండానే పంట కోరుకొనేవారే ఉద్యమం లేకుండా స్వేచ్ఛ కోరుకుంటారు. ఉరుములూ మెరుపులూ లేని వానలు కోరుకునేదీ వారే ” — ఫ్రెడరిక్ డగ్లస్.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.