అమ్మ అభ్యర్థన

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-వాడపల్లి పూర్ణ కామేశ్వరి

          మమత జీవన్మరణ పోరాటంలో ఓటమిని ఒప్పునివ్వడంలేదు. పాశాంకుశాల్ని తెంచుకోలేక ప్రాణాలను నిలుపుకోవాలన్న తాపత్రయం. ఉగ్రరూపం దాల్చిన వ్యాధి విన్యాసానికి తల ఒగ్గక తప్పట్లేదు. మృత్యువు లాగేస్తుండగా, కనురెప్పలు బరువెక్కి వాలిపోతున్నాయి. మనసులో మాత్రం ఏదో ఆవెదన, ఆందోళన. చేజారిపోతున్న శ్వాస.
తుఫాను సమయంలో సముద్రంలా అల్లకల్లోలంగా ఉంది దివ్య మనసు. బ్రతకాలని అమ్మ పడుతున్నతాపత్రయాన్ని, చావునెదిరించలేక పడుతున్న వేదనను చూసి విలవిలలాడిపోతోంది. కన్నతల్లిని కన్నబిడ్డగా కంటికిరెప్పలా కాపాడుకుంటూ సేవలుచేస్తోంది. తండ్రి వున్నా పిచ్చిమారాజు. ఏదో అమాయకత్వపు ధోరణి. విగ్రహపుష్టి, నైవేద్యనష్టి అన్నట్టు, భౌతికంగా ఉంటాడే కానీ కొండంతధైర్యాన్ని నూరిపోస్తూ నేనున్నా నని నిబ్బరంగా నిలబడగల శక్తిలేదు. తల్లి బ్యాంకు అకౌంట్ల దగ్గర్నుంచి, చీఫ్ ఆంకాల జిస్టుతో మాట్లాడేవరకూ అన్నీ ఇరవైరెండేళ్ళ దివ్యే చూసుకుంటోంది. కేన్సరు మహమ్మా రితో పోరాడుతున్న తల్లిని ఎలాగైనా కాపాడుకోవాలని అహర్నిశలూ ప్రయత్నిస్తోంది. అందుకు దివ్య చెయ్యని మానవ యత్నమూ లేదు, ప్రయత్నించని ఔషధ విధానమూ లేదు. మొక్కని వేల్పూ లేదు, ఎక్కని కోవెల మెట్టూ లేదు. రాతికింద దాగిన నీళ్ళల్లా ఊరిపోతున్నాయి ఆమె గుండెలనిండా కన్నీళ్ళు. జీవితం పెడుతున్న కఠినమైన పరీక్ష ను ఎదుర్కోగలుగుతోందే కానీ, తేనెపట్టు మీద రాయి వేసినట్టు చుట్టుముడుతున్న జ్జాపకాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమ్మ మాటలు గుర్తుకొస్తున్నాయి దివ్యకి. 

***

          సరిగ్గా నాలుగునెలల క్రితం వినవలసి వచ్చింది ఆ దుర్భర వార్త.

          ఆ రోజు ఆఫీసుకి సెలవు పెట్టింది శ్రావ్య. సీనియర్ కొలీగైన మమతగారితో రోజంతా గడపాలన్నదే సెలవు ఉద్దేశ్యం. అప్పటికే మూడు రోజుల నుండి ఆసుపత్రిలో ఉంది మమత. వ్యాధేంటో అంతుచిక్కక సతమతమవుతున్నారు డాక్టర్లు. అనేక పరీక్షలు చేస్తున్నారు. అప్పటి వరకూ ఊహించిన వ్యాధుల దాఖలాలేవీ పరీక్షల్లో తేలలేదు. పురీషనాళములో ఏదో సమస్య ఉందని మాత్రం ప్రాథమిక పరీక్షల ద్వారా తెలిసింది. గ్యాస్ట్రో-ఎంటెరోలోజిస్ట్ సలహామేరకు కలోనోస్కోపీ చేయాలని నిర్ణయించారు. పరీక్ష పూర్తి
అవ్వకుండానే డాక్టర్లు నిర్ఘాంతపోయారు. కంగారు పడ్డారు. ఐతే, వారు అనుమానించినది నిర్ధారించేందుకు ఆ పరీక్ష చాలదు. వెంటనే కాన్సర్ ఇనస్టిట్యూట్ కి రిఫర్ చేసారు. నిలువెల్లా మనిషిని మింగేసే కాన్సరేమోనన్న అనుమానం బలపడడానికి అక్కడ పరీక్ష లు చేసారు. నిర్ధారించారు.

***

          “ఎలా వుంది మేడం” అనునయంగా అడిగాడు డ్యూటీ డాక్టరు. 

          “నాకు బతకాలని వుంది డాక్టర్. నేను బతకాలి. చేయవలసిన పనులెన్నోఉన్నాయి. నా కూతురికి పెళ్ళి చెయ్యాలి. నేనింకా ఆఖరి ప్రయాణానికి సిద్ధంగాలేను. ఇది కేన్సరే అయినాసరే నేనుపోరాడితీరతాను” గుండెనిబ్బరాన్ని చూపిస్తూ అంది మమత.

          ఇదే, ఈ ఆత్మస్థైర్యమే మమత శ్రావ్యకు నూరిపోసేది. ఆ ధైర్యమే ఇంటాబయటా ఎన్నో సవాళ్ళను ఎదుర్కునేలా చేసింది. ఆమె వద్ద నుండి ఎన్నో విషయాలు నేర్చు కుంది. ముందురోజు ఆమె పరిస్థితి చూసి గుండె తరుక్కుపోయింది శ్రావ్యకి.
కలొనోస్కోపీకై కడుపుని శుభ్రం చేయడం కోసం మూడు లీటర్లకు పైగా సెలైన్-వాటర్ తాగించారు. బెడ్-పాన్ కూడా ప్రయోజనకరంగా లేనంతగా విరేచనాలు. సరిగ్గా అదే సమయానికి బిల్-కౌంటర్ వద్దకు దివ్య వెళ్ళ వలసివచ్చింది. మమతగారు పడుతున్న ఇబ్బందిని గమనించింది శ్రావ్య. పరిస్ధితిని గ్రహించి నర్సు సహాయంతో మమత గారిని వీల్-చైర్లో కూర్చోపెట్టింది. పక్కనే ఉన్న బాత్రూములోకి తీసుకు వెళ్ళి గోరువెచ్చని
నీళ్ళతో స్నానం చేయించి, ఎక్కువసేపు నాననివ్వకుండా వెంటనే ఒళ్ళంతా శుభ్రంగా తుడిచి, పౌడరు రాసి తీసుకొచ్చి పడుకోపెట్టింది. పక్కబట్టలు మార్చి, మరో బెడ్-నాప్కిన్ వేసి, ఒకటికి నాలుగుసార్లు మారుస్తూ. తుడుస్తూ సేవచేసింది. ఎప్పుడూ శుభ్రంగా ఉండే మమతకు, ఆమెతో ఆ పనులు చేయించుకోవడానికి మొహమాటం వేసినా, ఒంట్లో చికాకు వదిలి ఎంతో హాయిగా అనిపించింది.

          “నిన్ను ఇబ్బంది పెట్టాను శ్రావ్య” కంట-తడి పెట్టుకుంది.

          “మీరు నన్ను పెద్దకూతురు అన్నారు, ఇప్పుడు ఇలా అంటే ఆనాటిది నాలుక పై మాటే అవుతుంది. దివ్యే తప్ప మీకీ చిన్నసేవ చేయడానికి కూడా నేను తగనా?”  కోపం నటిస్తూ అంది శ్రావ్య.

          “నువ్వు ఎన్నటకీ నాకు పెద్ద కూతురివే శ్రావ్యా” అన్నారు. మమతను పంచిన ఆ సార్థక నామధేయురాలు ఆమెకు చేసిన మేలు గుర్తొచ్చి ఆ క్షణం శ్రావ్య కళ్ళుచమర్చాయి. నువ్వు నా పెద్దకూతురివి అన్న రోజును స్మరించుకుంది.

          ఒంట్లో నలత, తెలిసీ తెలియనితనం. రెండు నెలలు కూడా నిండకుండా గర్ఫ స్రావం జరిగింది. ఊరు నుంచి అమ్మ రాలేని పరిస్థితి. కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నారు మమతగారు. తలారా నీళ్ళు పోసి, పథ్యం ఒండి పెట్టినప్పుడు అన్న మాటలవి. అమ్మై ఆప్యాయతను పంచారు.

          శ్రావ్య అంటే దివ్యకు కొద్దిపాటి అయిష్టమే. మమత దంపతులకు దివ్య ఏకైక కూతురు. అల్లారుముద్దుగా గారాలతో పెరిగింది. అమ్మ ప్రేమను మరో వ్యక్తితో, అదీ పరాయి వ్యక్తితో అక్కస్థానం ఇస్తూ పంచడం ససేమిరా నచ్చేదికాదు. ఉడుక్కోవడం తప్ప మరేమీ అనగలిగే పరిస్థితీ లేదు.

***

          హైస్కూలులోనూ, ఇంటరులోనూ ఫష్టు మార్కులు తెచ్చుకుని అందరి మన్నన లనూ అందుకుంటున్న దివ్యను చూసి మురిసిపోయింది మమత. ఉద్యోగానికి వెళ్ళడం తో చిన్నప్పటి నుంచి అక్క చేతుల్లో పెరిగిన దివ్యకు అమ్మలోటు తెలియకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ప్రతీ రోజూ లంచ్-టైములో ఇంటికి వెళ్ళి వచ్చేది మమత. అలా అపురూపంగా పెరిగింది దివ్య.

          దివ్య బీ.టెక్కు ఆఖరి సంవత్సరం చదువుతున్న రోజులవి. ఆమె ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది. తల్లితో పెడసరంగా మాట్లాడడం, అహంకారంతో అవమానిస్తూ మాట్లాడడం లాంటి మార్పులు వచ్చాయి. గొప్ప చదువులు చదివించి, ఉన్నత పదవిలో దివ్యను చూడాలన్నది మమత ఆశ. స్వావలంబనతో తన పురోగతి బాటన నడవగా యోగ్యుడికిచ్చి వివాహం చేయాలని ఎన్నో కలలు కంటోంది మమత. గాడి తప్పుతున్న దివ్య ధోరణి అర్ధమవ్వటం కష్టంగా వుంది.

          “ఈ రోజింత ఆలస్యమైందేంటి దివ్యా?” నాలుగు సార్లు అడిగిన తరువాత మొబైలు లోంచి తలను ఎత్తి చూస్తున్న దివ్యను అడిగింది మమత.

          “కాలేజీ నుంచి ఒక్క రోజు లేటుగా వచ్చే సరికి ప్రశ్నలూ, అజమాయిషీలూ, అనుమా నాలూ. నసపెట్టి చంపుతున్నావమ్మా” విరుచుకు పడుతూ తలబిరుసు సమాధానం చెప్పింది.

          ఒక అపరిత్యాజ్యమైన దానిగా తనను తాను ఊహించుకుని మానసికంగా తానే అందలమెక్కి, కన్నవారూ, శ్రేయోభిలాషులూ చెప్పే మంచిని గ్రహించలేని  మూర్ఖురాలై య్యింది. దానికి అంతర్లీన కారణం అహంకారం. నాకు అన్నీ తెలుసుననుకోవడంతో మొదలుపెట్టి, నాకే అన్నీ తెలుసునన్న స్థాయికి ఎదిగింది ఆమె అహంకారం. ఉన్నత మైన మాతృ ప్రేమ మాధుర్యాన్నే విషగుళికలుగా భావిస్తూ, అమ్మను నిందించేంత
మూర్ఖురాలైయ్యింది. కొన్నిసార్లు ఆ తల్లి కన్నీరు కూడా పెట్టుకునేంత విశృంఖల  ప్రవర్తన. ఆరోగ్యం పై దుష్ప్రభావం పడేంతగా ఆమెను మానసిక వ్యధకు గురిచేసింది.

          మమత గారి కంటతడిని చూసి నలిగిపోయింది శ్రావ్య. విచ్చలివిడితనాన్ని స్వాతంత్య్రంగా భావిస్తూ, గమ్యంలేని జీవితాన్నిసాగిస్తూ అవివేకంతో అహంకారపు చీకట్ల లో కూరుకుపోతున్న ఈ తరం పిల్లల మానసిక ధోరణి శ్రావ్యకూ ఆశ్చర్యాన్నే కలిగించిం ది.

          ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ, బాధ్యత గల పదవిలో సేవలందిస్తున్న తల్లితో, “నువ్వు చదివిన బోడి బి.ఎస్సీ లాంటిది కాదు ఇప్పుడు మేము చదువుతున్నది ఇంజనీరింగు. మీ ఆఫీసులో పాత ఫైళ్ళు చూసుకుంటూ అదే గొప్పపని అనుకుంటారు. నీకూ కంప్యూటరు తెలుసు అనుకోకు. దాన్ని మీరు టైపురైటరుగా వాడతారు. మా సాఫ్ట్ వేర్ ప్రోగ్రామింగ్ పని అలాకాదు. కంప్యూటరు ప్రయెజనాలు మీకు అర్ధంకావు” అంటూ వాదన. అమ్మ జీవిత కాలం అనుభవాన్ని వెంట్రుకపోచతో సమంగా తీసిపారేసింది దివ్య.

          “చూడు దివ్యా, ఫైనల్ ఇయర్ లోకోచ్చావు, సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 గ్రూప్-2 సర్వీసెస్ పరీక్షలు రాస్తే బాగుటుంది. ఆ రోజుల్లో మేము స్టాఫ్ సెలక్షన్ అనీ, పబ్లిక్-సర్వీస్ కమిషన్ పరీక్షలనీ అంత వరకే ఆలోచించగలిగాము. అప్పట్లో మాకున్న అవగాహన అంతే. ఇప్పుడు మీ పరిస్థితి అలాకాదు. ఉన్నత స్థాయి పరీక్షలను లక్ష్యంగా పెట్టుకోవడమేకాక వాటిని చేజిక్కించుకునే అవకాశం మీకు ఎక్కువే. ప్రాపంచిక జ్ఞానమూ, నెట్టింట పరిజ్ఞానం ఈ తరానికి ఎక్కువ. మీకున్న ఎక్సపోషరుకు కష్టపడి చదివితేతప్పక ఉన్నత పదవులు మీ స్వంతమవుతాయి” ఎంతో ఆశగా చెప్పింది మమత. 

          “నాకు గవర్నమెంట్ జాబ్స్ మీద ఇంటరెస్ట్ లేదు మమ్మీ. అసలు వర్క్ చెయ్యాల న్న ఆలోచన మీదే నాకింకా క్లారిటీ లేదు” అమ్మ మాటను మరోసారి తీసి పారేస్తూ అంది దివ్య.

          చదివిన చదువులకు తగ్గ వివేకం కానీ, విచక్షణ కానీ లేకపోగా, వ్యక్తిత్వంతో స్వశక్తురాలినవ్వాలన్న ఆలోచన లేక పోవడం ఆమోదకరంగా అనిపించక పోయినా, చేయగలిగింది లేక ఊరుకుంది మమత. పదిమంది పిల్లలున్న ఇంట్లోపెరగడం వల్ల చదువుకోవడానికే పోరాడవలసి వచ్చింది. చదువుకున్నాక, ఆర్ధిక అవసరం ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టనిచ్చినా, పరీక్షిస్తూన్న పరిస్ధితులు ఎప్పటికప్పుడు లక్ష్య సాధనకు అడ్డంకులుగానే వుండేవి. వీళ్ళు ఆ ఇబ్బందులు పడకూడదని అన్ని సౌకర్యాలూ సమకూర్చి, మంచి చదువులు చెప్పించినా, ఎందుకో ఈ తరం పిల్లలు అన్నిటినీ నిర్లక్ష్యం చేస్తూ జీవితం విలువ తెలుసుకోలేకపోతున్నారని మనసులోనే బాధ పడింది మమత. ఐనా అమ్మ ప్రయత్నం మానలేదు.

          “అది కాదమ్మా దివ్యా, జాబ్ అన్నది కేవలం డబ్బు సంపాదించడం కోసం మాత్రమే కాదు. నా జీవిత భారం ఎవ్వరిపైనా లేదు అన్న భావన ఆత్మస్థైర్యాన్నిచ్చి ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తుంది. మాట భరించలేని నీకు అది మరీ అవసరమని అందామని పించి కూడా ప్రయోజనం ఉండదని మానేసింది. గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం కానీ తాగించలేము కదా అని నిట్టూర్చింది. 

          పెంకితనం, మొండితనం దివ్యకి ఆభరణాలు. అలిగినప్పుడల్లా గదిలోకెళ్ళి గడియ పెట్టేసుకుంటుంది. ఏ అఘాయిత్యం చేసుకుంటోందోనని భయం. ఇవాళ ఇంటికి రాను అంటూ బెదిరింపుగా కాలేజీ నుంచి ఫోన్ చేసినప్పుడుల్లా గుండెలుజారిపోవడం. క్రమేణా ఇవన్నీ షరా మామూలైపోయాయి. తొందరపాటు తనం, మాట దురుసుతనం,  అహం కారం, వీటన్నిటికీ తోడు తగని కోపం. మమత మానసికంగా రోజురోజుకీ కుంగిపోసాగింది.

          దివ్యను శ్రావ్యలా తీర్చి దిద్దాలన్న కోరిక మాత్రం కోరికగానే మిగిలి పోయింది.
జీవితపు రాటుపోట్లను తట్టుకుంటూ, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటూ రావాలంటే ఎంతో నేర్పు, ఓర్పు కావాలి. అన్నిటికీ మించిన ఆత్మస్థైర్యం కావాలి. మొన్నటికి మొన్న తన పై అనాగరికంగా చేయిచేసుకున్న భర్త చేష్టలకు కుంగిపోకుండా, మహా చాతుర్యంగా డీల్ చేస్తూ, చాకచక్యంగా బుద్ధిచెప్పింది.

          పిల్లలు ప్రభావితమవ్వకుండా వారి ఎదుట ఆవేశంగా వాగ్వివాదాలకుగానీ, అనాలోచితంగా తెగతెంపులకుగానీ పూనుకోలేదు శ్రావ్య.

***

          దివ్యను గురించి ఆలోచనలతో మానసికంగా కృంగిపోతోంది మమత. గోరుచుట్టు మీద రోకలి పోటులా కాన్సర్ వ్యాధి. కలోనోస్కోపీలో మూడవ దశ అని తేల్చేసారు. వెంటనే పెద్ద కాన్సర్ స్పెషలిటీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. కోలన్, రెక్టమ్, తదితర అవయవాలన్నీ దెబ్బతిన్నాయి. జీవితకాలం అతి తక్కువగా వుంటుందని చెప్పేసారు. వున్నన్నాళ్ళూ ఏదో ఉపశమన చికిత్స తప్ప గుణమయ్యే అవకాశమే లేదని నిర్ధారించే శారు. 

          గారాలు మురిపాలు అన్నీ కట్టిపెట్టాల్సిన సమయం వచ్చింది. అమ్మలేని స్థితిని క్షణమైనా ఊహించి ఎరుగదు దివ్య. అలాంటిది, రానున్న జీవితం ఆమె అండదండలు లేకుండా గడపవలసి వస్తుందన్న భావననే భరించలేకపోతోంది. అమ్మకు సేవలు చేస్తున్నన్నాళ్ళూ అపరాధ భావనతో కుమిలిపోయింది దివ్య. తనవల్ల అమ్మ పడిన
బాధలను తలుచుకుంటూ కుమిలిపోయింది. నా పాపానికి నిష్కృతి లేదని ఏడుస్తున్న దివ్యతో “పిల్లలు చేసిన తప్పులును తల్లితండ్రులు ఎన్నడూ మనసులో పెట్టుకోరు. అమ్మ పేరు మమత, క్షమ ఆవిడ గుణం.

          ఇప్పుడు నీ కంటిపాపకంటే పదిలంగా అమ్మను చూసుకుంటున్నావు.గడచిపోయిన ఆ దశని పీడకలగా మరచిపో. అసలు, నువ్వేనా ఇంత బాధ్యతగా అమ్మకు సేవలు చేస్తున్నదీ అని నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నీ సేవలతో ఆ తప్పులని కడిగేసావు. అనుకోని మలుపులు, ఆశించని సఘటనలు జీవితంలో కొన్ని మార్పులు తెస్తాయి.నువ్వు నీ బాధ్యతను సలక్షణంగా నిర్వర్తిస్తున్నావు. భగవంతుడు తప్పక ఫలితం చూపిస్తాడు. ఎలాంటి ఫలితమన్నదీ ఆ పరమాత్ముడే నిర్ణయిస్తాడు” సముదాయిస్తూ ఓదార్చింది శ్రావ్య. 

          విధి బలీయమైనది. దాన్ని ఎవరు జయించగలరు. దివ్య ప్రయత్నాలూ, మమత పోరాటమూ మృత్యువుని ఆరు నెలలు మాత్రమే వాయిదా వేయగలిగాయి తప్ప ఆపలేక పోయాయి. ఎడాది పాటు మృత్యువుతో పోరాడి అలసి ఓడిపోయింది. ప్రపంచమంతా కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఆహ్వానిస్తున్న తరుణంలో కొత్త లోకాలకు తరలిపోయింది మమత.

***

          దివ్యకు సరికొత్త జీవితం ప్రారంభమైంది. అదే అమ్మలేని జీవితం. తన ఒడిలో ఒరిగి భోరుమన్న దివ్యను ఓదార్చింది శ్రావ్య.

          “దివ్యా, అమ్మ తన మమతానురాగాలను రంగరించి అపురూపంగా యీ కవరులో పొందుపరిచారు. తన తదనంతరమే నీకివ్వమని నాకు ఇచ్చారు” మమతగారి చేతి వ్రాతతోనున్న అందమైన కవరు అందించింది శ్రావ్య.

నా కన్నుల దివ్వె దివ్యను ఆశీర్వదిస్తూ,

          ఈ ఉత్తరం నీ చేతికందేసరికి నేను ఊపిరితో ఉండను. అసురక్షితమైన జీవితం ఎలా ఉంటుందో ఆ క్షణంలో కానీ నీకు అర్ధంకాదు. తినడానికి రుచిగా ఉందని తీపి ఎక్కువగా తింటే వెగటు పుడుతుంది. చేదు పదార్ధం మనకి మింగుడు పడదు. ఐతే తీపి విలువ తెలియడానికి చేదు చాలా అవసరం. అలాంటి చేదుని నీకు రుచి కూడా చూపించకుండా పెంచి నేనే పొరపాటు చేశాను. గత రెండేళ్ళుగా నీలో ఎంతో మార్పు
చూసాను. నీకు హితం చెప్పాలని ఎన్నో విధాల ప్రయత్నించి విఫలమైయ్యాను. ఈ ఉత్తరం రాస్తున్ననాటి నుంచీ ఇది నీకు చేరేలోపు (నేను మృత్యువుతో పోరాడే కాలం) జీవితం నీకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. దీన్ని చదివే సమయానికి నేర్చుకున్న ఆ కొత్త పాఠాలతో సరికొత్త నిర్ణయాలు తీసుకోగలిగేంత శక్తిసంపన్నురాలిగా మారికూడా ఉంటావు. అంచేత ఇట్టి చేదు అనుభవమే నీ జీవితానికి తీపి బాట వేస్తుందని నమ్ముతున్నాను.

          అమ్మగా నీకు నేను ఇస్తున్నది ఆదేశంగానో, సలహాగానో కాక విన్నపంగా భావించు.

          సర్వీసులోనే వుండి నేను కన్ను మూస్తాను కనుక, నీకు కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వం నియామకం ఇస్తుంది. నేను బ్రతికి వుండగా చెయ్యలేనిది నా తదనంతరం జరగాలి. దయచేసి ఉద్యోగాన్ని తిరస్కరించకు దివ్యా.

          సమాజంలో బ్రతకడానికి, జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడానికి సబలగా నిలబడ డం స్వావలంబనతో బ్రతకడం చాలా అవసరం. అది కేవలం ఆర్ధికబలం మాత్రమే కాదు, మనోధైర్యాన్ని ఇస్తుంది. నిన్ను ఎన్నడూ అబలగా, బలహీనంగా నిస్సహాయంగా చూడకూడదన్నదే నా అభిలాష. నీ ఉద్యోగం ఎప్పుడూ శ్రీరామరక్షై నిన్ను కాస్తుంది. ఈ ఒక్క అభ్యర్థనని మన్నిస్తావు కదూ!!! జూనియర్ ఇంజినీరుగా నిన్ను చూస్తే నేనిక్కడ ఆత్మతృప్తితో ఉంటాను. నిన్ను వదలి ఎన్నాళ్ళో వుండలేని నేను మళ్ళీ నీ కడుపున
నీ బిడ్డగా వస్తాను. పెళ్ళికూతురిగా నిన్ను చూసుకోలేకపోతున్నందుకు బాధ పడుతూ నిస్సహాయురాలిగా వెళ్ళిపోతున్న మీ అమ్మ.

          ఉత్తరాన్ని గుండెలకు అణచుకున్న వెక్కివెక్కి ఏడ్చింది దివ్య.

***

          అమ్మ పని చేసిన అదే కార్యాలయంలో తనకు కేటాయించిన కుర్చీలో కూర్చుంటూ, అమ్మ పటానికి దణ్ణం పెట్టుకుంది దివ్య.

          ‘అమ్మా, నువ్వు దూరమైన తరువాత కానీ నువ్వు ఎప్పుడూ నేర్పాలనుకున్న
విలువలను తెలుసుకోలేక పోయానమ్మా. ఉద్యోగంలో చేరి, పెళ్ళికూతురినై నీవు ఆశించిన విధంగా నువ్వు గర్వపడేలా ఉంటాను’ తీర్మానించుకున్న దివ్య మనసు సాంత్వన చెందింది.

          “తనలా గుండెల్లో పెట్టుకుని చూసుకునే తోడు దివ్యకు దొరికినపుడే మా అక్కయ్య ఆత్మకు శాంతి” జల్లెడపట్టి సంబంధాలు చూశారు మేనమామలు. ఆరునెలల్లో అక్కయ్య ఆనందించేలాంటి అల్లుడిని వెతికారు. యోగ్యుడైన వరుడు సృజన్ తో  అంగరంగ వైభవంగా దివ్య పెళ్ళి జరిగింది.

          తొమ్మిది నెలలు నిండాయి దివ్యకి. కడుపులోని బిడ్డ ప్రతికదలికలోనూ అమ్మ కనబడుతోంది దివ్యకు. బిడ్డ కదలిక ఒక్క క్షణం తెలియకపోతే విలవిలలాడిపోతోంది.

          ‘అమ్మా, నాకోసం నువ్వు ఇలాగే తహతహలాడిపోయావు కదమ్మా. అప్పుడు నేను గ్రహించలేకపోయాను. ఆ అమృతాన్ని ఆస్వాదించలేకపోయాను’ కనిపించని అమ్మతో కబుర్లు చెప్పుకుంది.

          “మా అమ్మా నా కోసం ఇలాగే కదా పరితపించేది. అతి పదిలంగా నాలో పెరుగు తున్న నా పాప గురించే నేను ఇంత తపించిపోతున్నానే, పాతికేళ్ళు నన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి అమ్మ ఎంత తపించిపోయిందో. అప్పుడు తెలుసుకోలేక పోయాను” పురిటి నెప్పులు పడుతూ అమ్మతనాన్ని అర్థం చేసుకుంది. పడుతున్న నెప్పిలో అమ్మ తన కోసం పడిన ఆవేదనను గ్రహించింది. 

          అడ పిల్ల పుట్టింది. మా మమత మళ్ళీ పుట్టింది అన్నారు మమత తోడబుట్టినవారు. ఆనందంతో గెంతులు వేసారు.

          మూడునెలలు ఇట్టే గడిచిపోయాయి. మెటర్నిటీ లీవ్ ముగిసింది. చిన్నారిని విడిచి
వెళ్ళాలంటే మనసు దిగాలుగానే ఉంది. తను పెరిగిన పెద్దమ్మ సంరక్షణలోనే తన పాపనూ వదిలి ఆఫీసుకి బయలుదేరింది దివ్య.

          “మా మమతే మళ్ళీ పుట్టింది. నీ కూతురికే లోటు రానివ్వను, నిన్ను పెంచినట్టే దాన్నీ పెంచుతాను. దీనిలో మళ్ళీ మన మమత కనబడుతోంది. నువ్వు ఆఫీసుకి నిశ్చింతగావెళ్ళిరా అమ్మా” అభయమిచ్చింది పెద్దమ్మ. 

***

          జూనియర్ ఇంజినీరుగా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించింది దివ్య. అమ్మను తలచుకుని మొదటి సంతకం పెట్టింది. ఆ క్షణం, నేను నా ఉనికి అని ఒక నవచైతన్యం నిలువెల్లా కలిగింది.

          అమ్మ అభ్యర్థనను ఆశీర్వాదంగా భావించింది. ఆమె మాటను మన్నించి, స్త్రీ సాధికారత విలువలను తెలుసుకుని జూనియర్ ఇంజినీర్ పదవిని చేపట్టడమే కాకుండా అనతి కాలంలోనే ఆ విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. కార్య దీక్షతో చేస్తున్న ఆమె పనితీరుని చూసి సీనియర్లు ఆనందించారు. దివ్యను చూసి పొంగి పోయింది శ్రావ్య.

          “నా వంటి వారందరికీ మీరు రంగరించిపోసిన ధైర్యసాహసాలు, ఎన్నడూ వీడ కూడదన్న మనోధైర్యం జీవితాన్ని ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. మీ శ్రమ వృధా కాలేదు. అదేబాటన ఇప్పుడు దివ్య నడుస్తోంది. మీ తపస్సు ఫలించింది.

          ఆ రోజు మీరు అభ్యర్థించారు కానీ, స్త్రీ సాధికారత విలువ మీరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు అనేక విషయాలను చూస్తూ సమస్యలను ఎదుర్కుంటూ తెలుసుకుది దివ్య.
ఇప్పుడు మీ ఆ మాటలను మీరు వేసిన బంగారు బాట చేసుకుని మీ ఆశీర్వాదంతో ఉద్యోగంలో అడుగు పెట్టింది దివ్య. అనతి కాలంలోనే ఉద్యోగంలో మెళకువలు అన్నీ నేర్చుకుని అందరి మన్ననలు పొంది సీనియర్ ఇంజినీరుగా ప్రమోషను కూడా సాధిం చింది. మా ఇద్దరి పై మీ ఆశీర్వదాలు ఎప్పుడూ ఉంటాయని తెలుసును’…

          మనసులోనే మమతగారికి నమస్కరించుకుంది శ్రావ్య.

*****

Please follow and like us:

6 thoughts on “అమ్మ అభ్యర్థన (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

  1. నమస్తే మేడమ్. “అమ్మ అభ్యర్థన” కథ చదువుతుంటే పాత్రలు కళ్ళముందు కదిలాయి. తన తల్లి మమత, తనకు కూతురుగా పుట్టినందుకు దివ్య సంతోష పడింది. తన ఉద్యోగంలోనూ, ప్రతి పనిలోనూ తల్లిని దైవంగా భావించి జీవితంలో ముందుకు సాగుతున్న దివ్య పాత్రను చక్కగా మలిచారు. మంచికథ అందించారు అభినందనలు మేడం 👏👏💐💐🙏🙏

  2. చిన్నికథలో వివిధ పార్శ్వాలను చూపాలనే తపన కనిపించింది. తల్లి పట్ల అంత నిర్లక్ష్యాన్ని చూపిస్తున్న దివ్య, తల్లికి జబ్బు చేయగానే బాధ్యతను గుర్తించి, అంతా తానే అయి తల్లికోసం తల్లడిల్లడం నేటితరం అల్లరిచిల్లరగా తిరిగినా సమయం వస్తే స్పందిస్తారని చెప్పినట్టు అయింది. ఇక తరువాత మమత మరణం, కారుణ్య నియామకం, దివ్య మరల తన తల్లే తనకు పుట్టిందనుకోవడం వంటివి కొత్తదనాన్ని కథకు ఇవ్వలేక పోయాయి. కథలో కొంత సాగదీత కనిపించింది. ముగింపులో మెరుపు తగ్గిందని అనిపించింది. కథను మంచి సామెతలతో, చక్కని తెలుగు పదాలతో నడిపించి రక్తి కట్టించారు రచయిత్రి. ఎన్నో బహుమతులను అందుకున్న కామేశ్వరి గారు మంచి కథనే పాఠకులకు అందించారు. అభినందనలు

  3. అమ్మ అభ్యర్థన
    అమ్మ ఆవేదనను హృదయమును కదిలించినట్లుగా వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారు తమ కథలో వివరించారు . మాతృ దేవో భావ అను సనాతన సంప్రదాయమును గుర్తు చేయుచున్నారు .అమ్మ బ్రతకాలని తాపత్రయము పడిన బిడ్డ వేదనా ధోరణి కాల్తాను తొలచి వేస్తున్నది.
    విగ్రహపుష్టి, నైవేద్యనష్టి అను సామెతలను జనబాహుళ్యములో వాడు పదాలతో కథను రక్తి గట్టించినది .గుండెలనిండా కన్నీళ్ళు
    జీవితం పెడుతున్న కఠినమైన పరీక్ష ను ఎదుర్కోగలుగుతోందే కానీ, తేనెపట్టు మీద రాయి వేసినట్టు,ఉక్కిరిబిక్కిరి మాటలు పాఠకులకు హత్తుకొనిపోయి నాట్లు కథా గమనము సాగినది
    . డాక్టర్ల ప్రయత్నమూ , బ్రతకాలన్న ఆశ , సెలైన్ వాటర్ , దివ్య చదువు , అమ్మ లోటు పూడ్చిన అక్క బాధ్యతాయుత సంస్కారానికి నంది వేయుచున్నట్లు కథ సాగుచున్నది . గోరుచుట్టు మీద రోకలి పోటులా కాన్సర్ వ్యాధి. జాతీయముల వాడుట నచ్చినవి . దివ్యకు కారుణ్య నియామకపు ప్రయత్నమూ , నేటి ఉద్యోగ వ్యవస్థలోని విధానాలు ఉచిత రీతిలో యున్నవి . ఉద్యోగములో తాళి పై చేసిన కుర్చీ లో కూర్చొనుట భావావేశారంగములో ప్రతిస్పందనలు మళ్ళీ తల్లి పుట్టిందా అనుట సహజస్వభావమునకు ప్రతీకలు . స్త్రీ సాధికారతకు దర్పము పట్టుతున్నది – మామిళ్ళ లోకనాథం

    1. ధన్యవాదములు లోకనాథం గారూ. మీ సుదీర్ఘమైన సమీక్ష నాకెంతో ఆనందం కలిగించింది. నమస్సులు.

  4. కధ చాలాబాగుంది…హృద్యంగా వ్రాశారు…అభినందనలు…

    1. ధన్యవాదములు అండి. మీ స్పందనకు ఆనందం కలిగింది.

Leave a Reply

Your email address will not be published.