
కనువిప్పు (కథ)
– డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
పొద్దున్నే లేచి వాకిలి ఊడ్చి,నీళ్ళుచల్లి చక్కగా ముగ్గుపెట్టింది కమలా బాయి. ఇంటిపని చేసుకుని .పిల్లలకు స్కూల్ కు టైం అవుతుందని స్నానం చేసి వంటింట్లోకి వెళ్లి రాత్రే కోసిపెట్టుకున్న కూరగాయలు తీసి పోపు వేసింది.కుక్కర్ లో అన్నం,పప్పు వండుతుంది.
ఇంతలో అమ్మ అమ్మా అంటూ పిలిచాడు పెద్ద కొడుకు పవన్.
ఏంటి నాన్నా అంటూ అడిగింది తల్లి.”రాత్రి హోంవర్క్ చేసి అక్కడ పెట్టి మర్చిపోయా? నా నోటు బుక్.కనిపించడం లేదమ్మా” అంటూ ఏడుస్తున్నాడు తొమ్మిదవ తరగతి చదువుతున్న కొడుకు.
వెతికింది ఇల్లంతా దొరకలేదు.తర్వాత ఎక్కడో మంచం కింద పడిందేమో! తమ్ముడు ఏడవ తరగతి చదువుతున్నాడు. నోట్ బుక్ కోసం.తమ్ముడు ఫణి కూడా ఇల్లంతా వెతికి మంచం కింద తొంగి చూసాడు . ఉంది .అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
టిఫిన్ బాక్స్ లు కట్టింది.తీసుకుని స్కూల్ కు వెళ్లారు పిల్లలు.
భర్త నాగేశ్వర్ విద్యుత్ సౌధలో ఉద్యోగం.ఆయనకు టిఫిన్ బాక్స్ కట్టిస్తే ఆఫీస్ కు వెళ్ళాడు.
సాయంకాలం వచ్చేప్పుడు అరటి పండ్లు,ఆపిల్,బొప్పాయి పండ్లు తీసుకొచ్చాడు.పిల్లలు తిన్నారు ఇష్టంగా.
రోజులు గడుస్తున్నాయి ఆనందంగా.పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు.ఒకబ్బాయి డాక్టర్,ఒకబ్బాయి ఇంజనీర్.ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి.
పెద్దబ్బాయి మహబూబ్ నగర్ హాస్పిటల్లో ఉద్యోగంలో చేరారు.
చిన్నబ్బాయి తండ్రిలాగా ఎలక్ట్రిక్ ఇంజనీర్.ఇద్దరికీ మంచి అమ్మాయిలను చూసి పెళ్లి చేశారు.కోడళ్లు మంచిగా కలిసుంటారు.మంచి కుటుంబం నుండి వచ్చారు.చదువుకున్నవాళ్ళు.
భర్త నాగేశ్వర్ రిటైర్ అయ్యాడు. స్వంత ఇల్లు .భార్య భర్తలిద్దరూ హాయిగా వున్నారు. పిల్లలు ఎవరి సంసారం వారిదే.
పెద్దబ్బాయికి ఒక కొడుకు,ఒక కూతురు.చిన్నబ్బాయికి ఇద్దరు కూతుళ్లు.
పొద్దున్నే వాలు కుర్చీలో కూచుని టీ తాగుతూ పేపర్ చదువుకుంటున్నాడు.లోపల ఇంటి పని చేసుకుంటుంది కమలా బాయి.
అబ్బా అబ్బా అంటూ బాధపడుతున్నాడు.కమల కమల అంటూ పిలిచాడు .పలకలేదు.ఒక్కసారి అరిచి నొప్పి నొప్పి అంటూ తట్టుకోలేక పడిపోయాడు కింద.ఏదో పడ్డ శబ్దం వినిపించి పరుగెత్తుకుంటూ వచ్చింది కమల.భర్త పడిపోయాడు.”ఏమైందండి? అంటూ అరుస్తూ ఏడుస్తుంది.అయ్యో అయ్యో”! అని నెత్తి నోరు కొట్టుకుంది.పక్కింటి వాళ్ళు ఏడ్పు విని ఏమైందని వచ్చి 108 కు ఫోన్ చేశారు. వాహనం వచ్చింది.తీసుకెళుతున్నారు హాస్పిటల్ కి.
పిల్లలకు ఫోన్ చేసింది ఏడుస్తూ నే.ఏమైందమ్మా అంటూ పిల్లలు కంగారు పడ్డారు. “ఏమో నాయనా పేపర్ చదువుతూనే వున్నారు. ఏమైందో ఏమో.ఎప్పుడు పడ్డారో తెలీదు” అంటూ ఏడుస్తూనే ఉంది.
హాస్పిటల్ లో చేర్చారు.చెకప్ చేశారు.గుండెపోటు అని చెప్పారు డాక్టర్లు.లబోదిబో మంటూ మొత్తుకుంది. భార్య.పక్కింటివాళ్ళు వెంటనే వచ్చారు.కాస్త ఆమెను అనునయించారు.పిల్లలు కార్లో వచ్చారు. సాయంకాలానికి.రెండు రోజులు హాస్పిటల్లో వున్నాడు తండ్రి.కానీ లాభం లేకపోయింది.మళ్ళీ గుండె నొప్పి వచ్చింది.ఈ లోకం విడిచి వెళ్ళాడు.
అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాక ఎవరింటికి వారు వెళ్లారు కొడుకులు.పాపం అమ్మ ఒక్కతే.
“అమ్మను ఎవరింటికి తీసుకెళదాం అంటే నువ్వంటే నువ్వంటూ ఒకరి మీద ఒకరు తోసేసుకున్నారు”. చివరికి ఇద్దరబ్బాయిలు తల్లిని ఆస్తి పంపకంలాగా పంచుకుని తలా రెండు నెలలు వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు.
ముందు పెద్ద కొడుకు పవన్ తీసుకెళ్లాడు.మనవడు మనవరాలితో ఆడుతూ పాడుతూ హాయిగా గడుపుతుంది కాలం. చిన్నప్పుడు తన పిల్లలను పెంచిన జ్ఞాపకాలు మదిలో తడుముతూనే ఉన్నాయి. కోడలికి పనిలో సాయం చేస్తుంది.
అలా రెండు నెలలకోసారి పిల్లల ఇంటికి మారుతుంది కమలాబాయి.అలా రోజులు నెలలు యేండ్లు గడుస్తున్నాయి.
పెద్దకొడుకు ఇంటికి వచ్చి రెండు నెలలు అయ్యింది.
*జీవన సంధ్యలో ఆస్తుల పంపకం వలె తన కుమారులు ఇద్దరు తలో రెండు నెలలు తీసుకెళ్తున్న నేపథ్యంలో… కమలాబాయి తెల్లారితే చిన్న కొడుకు వద్దకు వెళ్ళాలని… రాత్రంతా నిద్ర పోక తన వస్తువులు బ్యాగులో సర్దుకుంటోంది…*
మనవడు దగ్గరికి వచ్చి నాయనమ్మ “బాబాయి దగ్గరకు వెళ్తావా?. వెళ్లద్దు నాన్నమ్మ” అంటూ బాధపడుతున్నాడు.నాయనమ్మ చెప్పే నీతి కథలు,శతక పద్యాలు విని ఎంతో జ్ఞానం ఆర్జించాడు.పిల్లలతో అటాచ్ మెంట్ బాగా అయ్యింది.వయసు పెరిగింది కమలాబాయికి.తిరిగే ఓపిక తగ్గింది.కానీ వెళ్ళాలి.
నిన్ను ఎట్లా పంచుకున్నారో నాన్నమ్మ. “నువ్వేమన్నా ఆస్తివా?” అంటూ మనవడు అడిగేసరికి అవాక్కయింది కమలాబాయి.
కాదు నాన్న మీ దగ్గరున్నట్టే బాబాయి దగ్గర ఉండాలి కదా.అంటే మనవడు ఇంత వయసు వచ్చింది.నీకు చాతకావడం లేదు.ఎందుకు వెళ్తావ్ అంటే “తప్పదు నాన్న అంటూ ఆయాసపడుతూ చెప్పింది.” నాన్నమ్మ దగ్గరే పడుకున్నాడు మనవడు.
తెల్లవారింది.చిన్న కొడుకు ఫణి వచ్చాడు తల్లిని తీసుకొనిపోవడానికి. మనవడు తెలిసి తెలియని వయసు అయినా నాన్నమ్మ చెప్పిన కథలు విని తెలివిని సంపాదించాడు. కోపంగా “అమ్మను పంచుకుంటారా ఎవరైనా.మానవత్వం లేదా మీకు.అంత పెద్ద వయసు ఉన్న ఆమెను ఇలా తిప్పుతారా? ఈ వయసులో ఒక దగ్గర హాయిగా ఉండాల్సిన ఆమెను స్వార్థం కోసం పంచుకుంటారా? అంటూనే చిన్నప్పుడు మిమ్మల్ని ఎంత కష్టపడి పెంచింది మరచిపోయారా? అమ్మ మీద ఇదేనా మీకున్న ప్రేమ? “అంటూ చిన్నవాడైనా ఎన్నో మాటలు మాట్లాడితే తండ్రి,తల్లి భయపడ్డారు.
” మిమ్మల్ని కూడా మేము పెద్దయ్యాక ఇలాగే చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అన్నారు.మాకు వీలు లేక వృద్దాశ్రమాలో వేస్తే ఎలా ఉంటుంది? “అంటూ ఏవేవో మాట్లాడాడు.
తల్లికి తండ్రికి భయం వేసి “తప్పయిందిరా నాన్న అంటూ కనువిప్పు కలిగి మనం నానమ్మను ఇక్కడే ఉంచుకుందాం” అన్నారు.
చిన్నబ్బాయి ఫణితో వాళ్ళ అన్న “అమ్మ మా దగ్గరే ఉంటుంది.వయసు కూడా అయిపోయింది కదా.మేము అమ్మను చూసుకుంటాం.మీరు సెలవుల్లో వచ్చి వెళ్ళండి.అందరూ కలిసి ఉందాం అన్నాడు”.సరే అన్నయ్య అని వెళ్ళాడు.
కమలాబాయి సంతోషానికి అంతులేదు. కలిసివుంటే కలదు సుఖం..
*****

