ప్రమద

గానకోకిల ఎస్. జానకి – భావాలను పలికించిన అపూర్వ స్వరం

-నీరజ వింజామరం

ఆకాశం ఏ నాటిదో …. అనురాగం ఆనాటిది ..

మరుగేలరా.. ఓ రాఘవా …

వెన్నెల్లో గోదారి అందం ….నది కన్నుల్లో కన్నీటి దీపం …

ఎదలో లయ ….ఎగసే లయ ..

నీ ఇల్లు బంగారం గాను ..

ఏ పాట విన్నామన కళ్ళ ముందు ఆ పాత్రలే కదలాడుతాయి. తన విలక్షణమైన స్వరంతో పాటలకు , పాత్రలకు జీవం పోసిన గాయని ఎస్ . జానకి .

తెలుగు సంగీత ప్రపంచంలో ఎప్పటికీ చెరిగిపోని పేరు ఎస్. జానకి. ఆమె పాట వినిపిస్తే భావాలు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ప్రేమ, విషాదం, భక్తి, మాతృత్వం, చిలిపితనం, కోపం, ఆవేదన – ఏ భావమైనా తన గాత్రంలో ఒదిగి వినిపించే అద్భుత ప్రతిభ ఆమె సొంతం. అందుకే ఆమెను “దక్షిణ భారత గానకోకిల”, “క్వీన్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అండ్ మాడ్యులేషన్” అని అభిమానులు, సంగీత విద్వాంసులు కొనియాడారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రయాణం భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం.

ఎస్. జానకి పూర్తి పేరు శిష్ట్ల శ్రీరామమూర్తి జానకి. ఆమె 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని పల్లపట్ల గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యుడు, ఉపాధ్యాయుడు. చిన్నతనం నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి కలిగిన జానకి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పాటలు పాడడం ప్రారంభించారు. బాల్యంలో కొంతకాలం సిరిసిల్ల ప్రాంతంలో గడిపారు. తొమ్మిదేళ్ల వయసులోనే మొదటిసారి వేదికపై పాట పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సాధారణ కుటుంబంలో పెరిగినా, చిన్ననాటి నుంచే సంగీతంపై ఆమెకు అపారమైన ఆసక్తి. ఇంట్లో వినిపించే భక్తిగీతాలు, జానపద గీతాలు, రేడియోలో వచ్చే పాటలు ఆమె మనసును ఆకర్షించేవి. రాగాలపై పట్టు, స్వరశుద్ధి, లయజ్ఞానంచిన్ననాటి నుంచే పెంపొందించుకున్నారు. కుటుంబ సభ్యులు ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు.

నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతపు ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. అయితే ఆమె అసలు గురువు ఆమె వినికిడి శక్తి. ప్రముఖ గాయనీమణుల పాటలు విని, స్వయంగా సాధన చేసి తన గాత్రాన్ని మెరుగుపరుచుకున్నారు. ఒక సందర్భంలో “లతా మంగేష్కర్ నా తొలి గురువు” అని చెప్పడం ఆమె వినయానికి నిదర్శనం.

జానకి సంగీత జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన చెన్నైకి వెళ్లడం. ఆమె మామయ్య సలహాతో చెన్నైలోని AVM స్టూడియోలో చేరారు. 1957లో తమిళ చిత్రం విధియిన్విలయట్టుకోసం పాట పాడి సినీ నేపథ్య గాయనిగా అరంగేట్రం చేశారు. అదే సమయంలో తెలుగు సహా పలు భాషల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి.

జానకి తొలి తెలుగు పాటలలో ఒకటైన ఎం.ఎల్.ఏ.చిత్రంలోని ‘ఇదేనండి… ఇదేనండి .. భాగ్యనగరం ..’పాట ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తరువాత వచ్చిన అనేక చిత్రాలలో ఆమె గానం శ్రోతల హృదయాలను గెలుచుకుంది. క్రమంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆమె పాట లేని చిత్రాలు చాలా తక్కువగా వచ్చాయి.

జానకి గాత్రంలో అత్యంత విశేషమైన లక్షణం భావ వ్యక్తీకరణ. ఆమె పాట వినేటప్పుడు గాయని కనిపించదు; పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అదే ఆమె స్వర మాయాజాలం. చిన్నపిల్ల స్వరం, యువతి స్వరం, వృద్ధురాలి స్వరం, జానపద గాత్రం, భక్తి గానం – ఏ రూపాన్నైనా ఆమె స్వరం ధరించగలిగేది. అందుకే సంగీతాభిమానులు ఆమెను “వాయిస్ అక్రాస్ఏజెస్” అని పిలిచేవారు.

ఆమె పాడిన అనేక తెలుగు పాటలు తరతరాలుగా వినిపిస్తున్నాయి.

“సిరిమల్లె పువ్వల్లే నవ్వు
చిన్నారి పాపల్లే నవ్వు”

“గున్నమామిడి కొమ్మ మీద…”

“మౌనమేలనోయి
ఈ మరపురాని రేయి”

ఇలాంటి పాటల్లో ఆమె గాత్రంలోని మాధుర్యం, భావోద్వేగం స్పష్టంగా వినిపిస్తాయి. స్టూడియోలో పాట రికార్డు చేయడానికి ముందు పదాల అర్థం పూర్తిగా తెలుసుకొని పాడేవారని సంగీతకారులు తరచుగా చెప్పేవారు. జానకి దృష్టిలో పాట అనేది కేవలం స్వరాల కలయిక కాదు; అది భావోద్వేగాల భాష. అందుకే ప్రతి పాటలో పాత్ర మనసును అర్థం చేసుకొని పాడేవారు. ఆమె గానం విన్నప్పుడు పాట పాడుతున్నది గాయని కాదు, ఆ పాత్రే అనిపించేది. ఇదే ఆమెను ఇతర గాయకుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది.

అపారమైన ఖ్యాతి సంపాదించినప్పటికీ జానకి చాలా నిరాడంబరంగా జీవించారు. సంగీతమే తన జీవితం అన్న భావనతో జీవించారు. తన విజయాలను ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదు. సహగాయకులు, సంగీత దర్శకుల పట్ల ఎంతో గౌరవం చూపేవారు. కొత్త గాయకులను ప్రోత్సహించడంలో కూడా ఆమె ముందుండేవారు. అభిమానులు ఆమెను ప్రేమగా “జానకమ్మ” అని పిలిచేవారు.

జానకి, రామ్ ప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ, సంగీత జీవితాన్ని కూడా సమతుల్యంగా కొనసాగించారు. బహిరంగ వేదికలపై వ్యక్తిగత విషయాలను చాలా అరుదుగా ప్రస్తావించేవారు. కుటుంబాన్ని గోప్యంగా ఉంచడం ఆమె స్వభావం.

భర్త మరణం తరువాత కూడా ఆమె సంగీత సేవ కొనసాగింది.

జానకి కేవలం తెలుగు గాయని మాత్రమే కాదు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా సహా అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడారు.

ఎస్. జానకి అందుకున్న పురస్కారాలు అనేకం. నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 33 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, కర్ణాటక రాజ్యోత్సవ ప్రశస్తి , తమిళనాడు కళైమామణి పురస్కారం, మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ వాటికి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

కళాకారుల సేవలకు తగిన గుర్తింపు రావాలనే తన అభిప్రాయాన్ని,2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించడం ద్వారా చాలా బలంగా వ్యక్తపరిచారు. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కళాకారులకు సముచిత గౌరవం సమయానికి అందాలి అనే భావనను ఆమె వ్యక్తం చేశారు. అది ఆమె ఆత్మగౌరవానికి నిదర్శనంగా చాలామంది భావించారు.
దీర్ఘకాల గానప్రస్థానం అనంతరం జానకి గారు వేదికలపై, చిత్రగీతాల్లో గానం తగ్గిస్తూ విశ్రాంతి జీవితం వైపు మళ్లారు. అప్పుడప్పుడూ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులను ఆనందింపజేశారు.
2026 జూలై 11న మైసూరులో ఎస్. జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం దక్షిణ భారత సంగీత ప్రపంచానికి తీరని లోటుగా నిలిచింది. అయితే ఆమె స్వరం మాత్రం ఎన్నటికీమూగబోదు. వేలాది పాటల రూపంలో ఆమె శాశ్వతంగా సంగీతాభిమానుల హృదయాల్లో జీవిస్తూనే ఉంటారు.

ఎస్. జానకి కేవలం ఒక నేపథ్య గాయని కాదు; భావాలను స్వరాలుగా మార్చిన కళాకారిణి. శాస్త్రీయ సంగీతంలో పెద్దగా శిక్షణ లేకపోయినా, అసాధారణ ప్రతిభ, కృషి, సాధనతో భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఆమె స్వరం తరతరాల ప్రజల ఆనందంలో, విషాదంలో, ప్రార్థనలో, ప్రేమలో భాగమైంది. అందుకే ఎస్. జానకి పేరు వినగానే మనసులో మొదట వినిపించేది ఒక పాట కాదు – ఒక భావం. ఆమె స్వరం ఒక యుగం. ఆ యుగం ఇంకా మనతోనే ఉంది. ఉంటుంది.

*****

Leave a Reply

Your email address will not be published.