
చెప్పుకింద నొక్కిపెట్టి
जूते की नोक पर
హిందీ మూలం – డా. రమాకాంత శర్మ
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
దినేష్ బాబు ఎప్పుడూ ఎవరినీ లెక్కచెయ్యలేదు. ఆయన అంటూ ఉండేవాడు- “నేను మానాన్ననే లెక్కచెయ్యనప్పుడు మిగిలినవాళ్ళని ఎందుకు చేస్తాను?” ప్రతివ్యక్తిని చెప్పుకింద నొక్కిపెట్టి ఉంచగలిగే బలం ఆయనకి ఆ దేవుడే బహుశా ఇచ్చివుండవచ్చునేమో. తిండికి, గుడ్డకి లోటులేని ఇంట్లో జన్మించాడు. వాళ్ళమ్మకి ఆయన ఎంతో గారాబు తనయుడు. ఆవిడ తన కొంగుతో రక్షణనిస్తూ, ఎప్పుడూ ఆయన్నిజాగ్రత్తగా చూసుకునేది. దినేష్ బాబు నోటినుండి ఏదయినా మాట వస్తే చాలు, అది నెరవేర్చడానికి ఆమె పూర్తిగా ప్రయత్నించేది. చివరికి తన భర్తతో కూడా వాగ్వాదం చేసేది. “ఇది గారాబం కాదు, నువ్వు వాడిని చెడగొడుతున్నావు”– అని ఆయన ఎప్పుడయినా అంటే, ఆవిడ నవ్వేసి మాట దాటవేసేది.
దినేష్ బాబు చదువులో చురుకైనవాడు మాత్రమే కాదు, మంచి కళాకారుడు కూడా. చదువులో ఎప్పుడూ ముందు ఉంటూ, బాల్యం నుండి కూడా నాటకాలలో పాల్గొంటున్న కారణంగా ఆయన ఎన్నో ప్రశంసలనందుకున్నాడు. స్నేహితుల బృందంలో ఆయన ఒక హీరోగా, ఒక లీడర్ గా ఉండేవాడు. ఆయనకి తను సామాన్య జనులకన్నా కొంచెం భిన్నమైనవాడిననీ, తనని ఆ దేవుడు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడానికి ఈ లోకంలోకి పంపించాడనీ గర్వం ఉండేది. ఆయన వ్యక్తిత్వం కూడా చుట్టూఉన్నవాళ్ళు కాస్త తగ్గిఉండటానికీ, ఆయనకి కొంచెం ప్రత్యేకంగా గౌరవం ఇవ్వడానికి కారణంగా ఉండేది. తండ్రిగారు ఏం చెప్పినా అమ్మచాటున ఆయన దానికి ఏమాత్రం ప్రాముఖ్యం ఇచ్చేవాడుకాదు. క్రమంగా తండ్రిగారితో ఆయనకి దూరం పెరిగింది. భగవంతుడు ఆయన సామ్రాజ్యాన్ని కొనసాగించడానికే కాబోలు బహుశా ఆయనకి సహోదరుడిని ఎవరినీ ఇవ్వలేదు. ఒక చెల్లెలు ఉండేది కాని ఆయనకి ఎప్పుడూ దూరంగానే ఉండేది. ఎందుకంటే ఆమెపట్ల ప్రేమకూడా తను అన్నయ్య కావడంవల్ల అహంకారంతో నిండివుండేది.
మేధావి అయిన కారణంగా ఆయనకి మంచి ఉద్యోగం దొరికింది. ఆ తరువాత ఆయన అహంకారానికి ఇంకా రెక్కలు వచ్చేశాయి. నాటకాల్లో పాల్గొనడమనేది ఎప్పటిలాగా కొనసాగుతూనే ఉంది. నాటకాల్లో పనిచేసే ఎందరో అమ్మాయిలు ఆయన వ్యక్తిత్వంతో ప్రభావితులై ఆయన్ని వివాహం చేసుకునేందుకు కలలు కనేవాళ్ళు. కాని దినేష్ బాబు వాళ్ళని స్నేహం వరకే పరిమితంగా ఉంచేవాడు. ఎప్పటికీ పెళ్ళి చేసుకోకూడదని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన దృష్టిలో పెళ్ళి అంటే బానిసత్వం. అందుకే ఆయనకి అది ఏమాత్రం ఇష్టంలేదు. తల్లికూడా ఏడ్చి మొత్తుకుని చివరికి ఓటమి స్వీకరించింది. కాని ఆయన ఆవిడ మాట కూడా వినలేదు. ఆయన స్పష్టంగా చెప్పేశాడు- “అమ్మా, నేను నా జీవితాన్ని స్వేచ్ఛగా నాకు కావలసినట్లు బతకాలనుకుంటున్నాను. నన్ను నేను ఎటువంటి బంధనంలోనూ చిక్కుకోనివ్వను. నా మాట విని నువ్వు నాయనమ్మ కావాలని కలలు కనడం మానెయ్. మనవలు, మనవరాళ్ళ సుఖం నీకు సరళ ఎలాగూ ఇస్తుంది. దాని పిల్లలు నిన్ను అమ్మమ్మా అని పిలుస్తారు. అది చాలదా నీకు?”
తనకి కావలసిన విధంగా జీవితం గడపడానికి దినేష్ బాబు తనని తాను చాలా బిజీగా ఉంచుకుంటున్నాడు. ఆఫీసునుంచి బయటికి రాగానే ఆయన నాటకాల రిహార్సలుకి వెళ్ళిపోయేవాడు. స్నేహితులతో కబుర్లు, `మందు’ ఇచ్చిపుచ్చుకునే క్రమంలో అర్ధరాత్రి ఎప్పుడయిపోయిందో కూడా ఆయనకి తెలిసేది కాదు. ఏ పనులు చెయ్యకూడదంటారో అవన్నీ చేసి చూడటానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు. ఈ లోకంలోకి వచ్చేశాం కనుక ప్రతిరకమైన ఆనందాన్ని దర్శించి చూద్దాం. ఈ ఆలోచనతోనే ఆయన సిగరెట్టు కాల్చడం, అన్నిరకాల మత్తుపదార్థాలు సేవించడం, మాంసాహారం భుజించడం మొదలుపెట్టాడు. ఇవన్నీ ఆయన ఇంటికి బయట ఉన్నప్పుడే చేస్తాడు. వాళ్ళ ఇంట్లోకి అయితే మాంసాహారం పేరుతో ఆఖరికి కోడిగుడ్డు కూడా రాదు. నిజం చెప్పాలంటే తండ్రిగారిని హేళన చెయ్యడంలో ఆయనకి ఎంతో సంతోషం కలిగేది. కాని, ఎప్పుడూ తన పక్షాన నిలబడే తల్లి విషయంలో మాత్రం తెలిసి ఆవిడకి ఏవిధంగానూ ఆయన బాధ కలిగించేవాడుకాదు.
వాళ్ళ ఇంట్లోనూ, సంఘంలోనూ ఎప్పటినుంచో వస్తున్న ఎన్నో ఆనవాయితీలను ఆయన భంగం చేశాడు. అదంతా చెయ్యడంలో ఆయన అద్భుతమైన ఆనందాన్ని అనుభూతి చెందేవాడు. తనగురించి ఇంట్లో ఎవరు ఏమంటున్నారన్నది ఆయన ఎప్పుడూ లెక్క చేసేవాడు కాదు. దాన్ని గురించి అసలు ఆలోచించేవాడు కాదు. తనకి కావలసినవిధంగా తను జీవిస్తున్నానని ఆయనకి అనిపించేది. ఆయన్ని ఆపుజేసే శక్తిసామర్థ్యాలు ఎవరికీ లేవనే చెప్పాలి.
కాని, ఆయనకి కొన్ని రోజులనుంచి తన వశంలో తాను లేనట్లు అనిపిస్తోంది. విజయ అనే అమ్మాయి ఆయన జీవితాన్ని ఇబ్బందికరంగా చేసింది. ఆయన కూర్చున్నా, లేచినా, ఏంచేస్తున్నా ఆమె ముఖం ఆయన కళ్ళముందు కదలాడుతోంది. ఎంతోమంది అమ్మాయిలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవారు. కాని ఆయనకి ఇటువంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదు. ఆ అమ్మాయికూడా ఆయన తనని చూడకుండా ఆయన్ని చూస్తూఉండేదని, ఆయనతో మాట్లాడేందుకు ఏదో ఒక వంక వెతుకుతూ ఉండేదని ఆయనకి తెలుసు. నాటకం రిహార్సలు సమయంలో ఆమె ఆయనతో పని చేస్తూ రొమాంటిక్ సీను ని నటిస్తున్నట్లు కాకుండా, జీవిస్తున్నట్టుగా చేసేది. కాని దినేష్ బాబు అంతా అర్థం చేసుకున్నా, ఏమీ తెలియనట్లు ఉండేవాడు. ఇలాంటి ఎంతమందో అమ్మాయిలని ఆయన తన చెప్పుకింద నొక్కిపట్టి ఉంచేవాడు. కాని ఈసారి మాత్రం ఏం జరిగిందో తెలియదుకాని, ఆయన తనని తాను వశంలో ఉంచుకోలేకపోతున్నాడు. బయటికి ఆయన ఎలా కనిపిస్తున్నప్పటికీ, లోపల మాత్రం విజయ ఎప్పుడూ ఆయనకి ఎదురుగానే ఉండాలని ఆశించేవాడు.
ఆరోజు రాత్రి నాటకం ముగిసిన తరువాత ఆయన స్నేహితులదగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. కాని ఆయన ఒక కాలు ముందుకి వేస్తే రెండోకాలు ముందుకి పడటంలేదు. విజయ ఇంకా బయలుదేరలేదని ఆయనకి తెలుసు. విజయకి ఏమాత్రం ప్రాముఖ్యం ఇవ్వకూడదని ఆయన మెదడు హెచ్చరిస్తోంది. కాని ఆయన గుండె మాత్రం ఆమెని ఒక్కసారి చూడాలని తపిస్తోంది. ఆయన ఊరికేనే వెనక్కి తిరిగి చూస్తే విజయ తన స్కూటరుమీద వస్తూ కనిపించింది. ఆయన తన జేబులు తడుముకుంటూ గ్రీన్ రూంలో తనది ఏదో వస్తువు మరిచిపోయిన భంగిమలో ఆమెవైపుకి నడిచాడు.
విజయ ఆయన దగ్గరికి చేరుకుని తన స్కూటరు ఆపుజేసి అడిగింది- “ఏమన్నా మరిచిపోయారా దినేష్ బాబూ? రండి. నా స్కూటరుమీద కూర్చోండి. మిమ్మల్ని నేను తీసుకెడతాను.”
“అబ్బే, అదేం లేదు. నా పర్సు అక్కడే మరిచిపోయానని అనిపించింది. కాని అది లోపలి జేబులో దొరికిందిలే.”
“అయితే నేను వెళ్ళనా మరి?” విజయ అడిగింది.
“నీ ఇష్టం.” దినేష్ బాబు తన భుజాలు ఎగరేస్తూ అన్నాడు.
“నా యిష్టమైతే కాసేపు సముద్రతీరంలో కూర్చుని రాత్రివేళ ఒడ్డుని తాకుతున్న కెరటాలని చూస్తూ ఆనందించాలని ఉంది. వస్తారా మీరు?”
అనుకోకుండా లభించిన ఈ ఆహ్వానానికి దినేష్ బాబు కొంచెం కంగారుపడ్డాడు. మళ్ళీ ఏదో ఆలోచిస్తూ వెళ్ళి విజయ స్కూటరు వెనకాల ఉన్న సీటులో కూర్చున్నాడు. కొంతసేపు తరువాత వారిద్దరూ సముద్రం ఒడ్డున ఇసుకమీద కూర్చుని సముద్రతరంగాలు తీరానికి వచ్చి కొట్టుకోవడాన్ని, మళ్ళీ తిరిగి చెదిరిపోయి వెనక్కి సముద్రంలోకి వెళ్ళిపోవడాన్ని చూశారు. ఇద్దరి హృదయాల్లోనూ అదేవిధంగా కెరటాలు లేచిపడుతున్నాయి. ఈ తరంగాల ఉద్వేలనం వాళ్ళకి అశాంతి కలిగిస్తోంది. దినేష్ బాబుకి తన ప్రేమని తాను స్వయంగా తెలియపరచడం అసలు ఇష్టం లేదు. చివరికి విజయ తనంతట తానే మనస్సులోని మాట బయటపెట్టింది. “దినేష్ బాబూ, మా యింట్లో నా పెళ్ళి విషయం చాలా జోరుగా నడుస్తోంది. కాని, నేను నా జీవితమంతా మీతో గడపాలని కోరుకుంటున్నాను. మీ కళ్ళలో నేను నాకోసం ప్రేమ ఉన్నట్లుగా అనుభూతి చెందాను. అందుకే ధైర్యంచేసి ఇవాళ ఈ విషయం మీకు చెబుతున్నాను. చెప్పండి. నన్ను పెళ్ళి చేసుకుంటారా?”
దినేష్ బాబు కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. అప్పుడు అన్నాడు- “ఏ అమ్మాయి గురించికూడా నాకెప్పుడూ అనిపించని విధంగా కొంత సమయం నుంచి నీగురించి నాకు అలా అనిపిస్తున్నమాట నిజమే. నీ తోడు కావాలని కోరుకుంటున్నాను. కాని పెళ్ళి చేసుకోవాలని, పిల్లలని పెంచుకోవాలనే బంధనంలో చిక్కుకుని ఉండటం నాకిష్టం లేదు.”
“మీరేం చెప్పదలుచుకున్నారు? నేను పెళ్ళి చేసుకోకుండా మీతో ఉండనా? అది నా సంస్కారంలో లేదు. అదీకాక నేను పిల్లాపాపలతో నా నిండుకుటుంబంలో ఉండాలని అనుకుంటున్నాను. పైగా, సంఘం అనేది కూడా ఒకటి ఉంది కదా.”
“నీ సంఘం చట్టుబండలు కానూ. మనిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నామంటే పెళ్ళి చేసుకుని ఉంటామో, చేసుకోకుండా ఉంటామో ఈ సంఘానికెందుకు? దానివల్ల వీళ్ళకేం తేడా ఉంది? నువ్వెప్పుడైనా
అసలు ఆలోచించావా, రేపు పిల్లా-జెల్లా పుడితే మనం మన జీవితాన్ని మనకి కావలసిన పద్ధతిలో బతగ్గలమా? నేను మాత్రం నా జీవితాన్ని నాకు కావలసిన పద్ధతిలో బతకాలనుకుంటున్నాను. అంతే. నువ్వు నాకు తోడు ఉంటే నాకు బాగుంటుంది.”
విజయ దినేష్ బాబుని ఆశ్చర్యంగా చూసింది. ఆయనకి నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించింది. కాని తను ఒక రాయితో తన తలని కొట్టుకుంటున్నానని ఆమెకి త్వరగానే అర్థమయింది. అక్కడనుంచి లేస్తూ ఆమె అంది- “మీ మనస్సులో ఏమాత్రమైనా మార్పు వస్తే నాకు తప్పకుండా చెప్పండి. నేను ఎదురుచూస్తాను.”
దినేష్ బాబు చెప్పే సమాధానంకోసం ఎదురుచూడకుండానే విజయ అక్కడినుండి వెళ్ళిపోయింది. దినేష్ బాబు కొంచెం సేపు అక్కడ అలాగే కూర్చుని ఉన్నాడు. విజయని తనతో ఉండటానికి ఒప్పించలేకపోయానని ఆయనకి మనస్సులో బాధగా ఉంది. కాని తన సిద్ధాంతాన్ని సరిపెట్టుకోవడానికి తగిన కారణం ఏదీ అర్ధం కావడంలేదు. అంతేకాక ఏ అమ్మాయి అయినా ఆయనకి నచ్చిందన్న సాకుతో తను చెప్పేదాన్ని తనకి కావలసినట్లుగా ఆయన్ని ఒప్పించాలనుకోవడం ఆయనకి అసలు ఇష్టం లేదు.
నాటకాల రిహార్సలు సమయంలో ఆయన ఇంచుమించు ప్రతిరోజూ విజయని కలుసుకుంటూనే ఉన్నాడు. విజయ ఎంత అవసరమవుతుందో ఆయనతో అంతే మాట్లాడుతోంది. ఆయన తన స్వభావానికి తగినట్లుగానే తను ఎవరినీ లెక్క చెయ్యడని చూపించడానికి ప్రయత్నం చేసేవాడు. కాని ఒకరోజున విజయ కళ్ళనీళ్ళతో తన పెళ్ళి కుదిరిందని చెప్పినప్పుడు ఆయన హృదయంలో కొంచెం బాధ కలిగింది. కాని ఆయన నవ్వుముఖంతో ఆమెకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి, నువ్వు పిలిస్తే నేను నీ పెళ్ళికి తప్పకుండా వస్తానని అన్నాడు. విజయ విచిత్రంగా ఆయన్ని తదేకంగా చూసింది. ఆ తరువాత తల వంచుకుని వెంటనే అక్కడినుంచి వెళ్ళిపోయింది.
ఆ రోజు తర్వాత ఆమె ఆయనకి మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. ఆయన చూపులు ఆమెని అన్వేషిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత విజయ పెళ్ళి చేసుకుని ఇంకోవూరికి వెళ్ళిపోయిందని ఒక మిత్రుడిద్వారా ఆయనకి తెలిసింది. ఒక్క క్షణం ఆయన తనదగ్గర ఉన్నదంతా కోల్పోయినట్లుగా అనుభూతి చెందాడు. మరుక్షణమే ఆయన తన తలని విదిలించుకుని తనలో తనే అనుకున్నాడు- “ఆమె పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందంటే ఈరోజున నా జీవితంలోంచి కూడా వెళ్ళిపోయింది. నేనెప్పుడూ ఎవర్నీ లెక్కచెయ్యలేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు విజయని మాత్రం ఎందుకు లెక్కచెయ్యాలి?”
దినేష్ బాబుని పెళ్ళికి ఒప్పించడం ఇంక ఎప్పటికీ సాధ్యంకాదని ఆయన తల్లికి అర్ధం అయిపోయింది. సరళకోసం మంచి సంబంధం రాగానే ఆవిడ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆమెకి పెళ్ళి జరిపించింది. కూతురు ఎప్పుడైనా తన భర్తతో అత్తవారింటినుంచి వచ్చినప్పుడు దినేష్ బాబు ఆమె భర్తతో ఎక్కువ మాట్లాడకపోవడం, ఎప్పుడైనా మాట్లాడినా అతనికన్నా తన ఆధిక్యాన్ని చూపించు కోవడానికి, కారణం ఏదీ లేకుండానే అతన్ని తనకన్నా తక్కువగా చూపించే ప్రయత్నం చెయ్యడం ఆవిడకి ఏమాత్రం నచ్చలేదు. క్రమంగా వాళ్ళు అక్కడికి రావడం తగ్గిపోయింది. తల్లి, తండ్రి ఈ విషయానికి దిగులుగా ఉండేవారు. కాని దినేష్ బాబుకి మాత్రం దీనివల్ల ఏమీ తేడా అనిపించలేదు.
ఆఫీసులో కూడా దినేష్ బాబు తన సీనియర్లతో తగువులాడుతూ ఉండేవాడు. ఎవ్వరూ ఆయనమీద హుకుం చెలాయించడం ఆయనకి అసలు ఇష్టం లేదు. ఇన్ని సంవత్సరాలనుంచి ఆయన తను పని బాగా చేస్తాడనే కారణంగానే అక్కడ అంటిపెట్టుకుని ఉన్నాడు. కాని, సిన్హాగారు ఆయనకి బాస్ గా వచ్చినప్పటి నుంచి ఆయన ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తోంది. సిన్హా గారు కేవలం ఆయన పని బాగా చేస్తాడనే కారణంగా ఆయన వ్యవహారాన్ని ఉపేక్షించడానికి సిద్ధంగా లేరు. ఆఫీసులో ఎవరి పని, వ్యవహారం రెండూ బాగుంటాయో వాళ్ళే సఫలీకృతులవుతారని, వీటిలో ఏ ఒక్కటైనా సరిగా లేకపోతే ఆవ్యక్తి స్వయంగా తన గొయ్యి తనే తవ్వుకుంటాడని ఆయన దినేష్ బాబుకి స్పష్టంగా చెప్పేశారు. దినేష్ బాబు ఈ విషయాన్ని ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేశాడు. ఈ సిన్హా తనని తను ఏమను కుంటున్నాడు, ఇలాంటివాళ్ళని నేను నా చెప్పుకింద నొక్కిపెట్టి ఉంచుతూ వచ్చానని తను మనస్సులోనే అనుకున్నాడు.
వాళ్ళిద్దరి మధ్య దూరాలు పెరగసాగాయి. ఒకానొకరోజున దినేష్ బాబుకి ఒక గట్టి దెబ్బ నెమ్మదిగా తగిలింది. ఆయన చేతుల్లో ఆయన ట్రాన్స్ ఫర్ ఆర్డరు పెట్టారు. ఆయన్ని వెంటనే మరో ఊళ్లో రిపోర్టు చెయ్యమని ఆదేశం ఇచ్చారు. దీనితో దినేష్ బాబు అంతర్గతంగా చలించిపోయాడు. ఇరవైయేళ్ళపాటు కష్టపడి పని చేసినందుకు ఆయనకి లభించిన ప్రతిఫలం ఇదా? కేవలం యాదృచ్ఛికంగా తనకి బాస్ అయినంత మాత్రాన ఆ కారణంతో ఎవరైనా తనమీద అధికారం చూపించదలుచుకుంటే దీన్ని ఆయన ఎలా అంగీకరించగలడు. ఆ మర్నాడే ఆయన విఆర్ఎస్ కోసం అప్లై చేశాడు. సహోద్యోగులు ఆయనకి ఎంతగానో హితబోధ చేశారు. కాని ఆయన దినేష్ బాబు కావడంవల్ల, తన నిర్ణయం ఏమాత్రం మార్చుకోలేదు.
ఇరవై సంవత్సరాల సర్వీసు పూర్తి చెయ్యడంవల్ల ఆయన విఆర్ఎస్ అప్లికేషన్ ఆమోదించారు. ఆయనకి ఇవ్వవలసిన డబ్బులు ఒక్కసారిగానే ఇచ్చేశారు. వాటిని ఆయన బ్యాంకులో వేసుకున్నాడు. ఆ డబ్బుమీద వచ్చే వడ్డీతో తన అవసరాలు తీర్చుకుంటూ ఉండవచ్చునని ఆయన ఆలోచన. ఇంక ఇప్పుడు ఆయన నాటకాలతో తనకి ఉన్న అనుబంధం దృష్ట్యా , తన అభిరుచిని తీర్చుకోవడంలో పూర్తిగా నిమగ్నుడయ్యాడు.
తండ్రిగారి మరణాన్ని ఆయన తేలికగానే తీసుకుని సరిపెట్టుకున్నాడు. తండ్రి-కొడుకుల మధ్య ఉండే సహజమైన ప్రేమానుబంధం ఆయనతో ఎప్పుడూ లేదు. కాని తండ్రి గతించిన రెండేళ్ళకి తల్లికూడా వెళ్ళిపోయినప్పుడు మాత్రం ఎవరో తల్లిని తననుంచి బలవంతంగా లాక్కుపోయినట్లు ఆయనకి అనిపించింది.
నాటకాలలో మునిగిపోయి ఉన్నప్పుడు కాలం ఎంత వేగంగా గడిచిపోయిందో, ఆయనకి తెలియనేలేదు. పెరుగుతున్న వయస్సు ప్రభావంతో బాటు, సమయం కాని సమయంలో తింటూ, తాగుతూ ఉండటంవల్ల చాలా జబ్బులు ఆయన్ని చుట్టబెట్టాయి. ఇంక విడవకుండా నాటకాల్లో పాల్గొనే శక్తి ఆయనలో మిగల్లేదు. మరోపక్క ఆయన సహచరులకి కూడా వయస్సు సహకరించడంలేదు. నెమ్మదిగా ఆయన నాటకబృందం కూడా చెదిరిపోసాగింది. మిత్రులంతా తమ-తమ దారుల్లో వెళ్ళిపోయారు. చివరికి ఒకరోజున ఆయన పెంచి పోషించిన సంస్థ నుండి నాటకాల ప్రదర్శన పూర్తిగా ఆగిపోయింది. అప్పటివరకూ నిరాటంకంగా ఉండే ఆకాశంలో ఎగురుతూ వున్న పక్షి చివరకు ఒక పంజరంలో బంధించబడి ఉండిపోయింది.
అనారోగ్యం కారణంగా ఎప్పుడైనా తప్పనిసరి అయిన పరిస్థితిలోనే ఆయన బయటికి వస్తున్నాడు. ఎప్పుడైనా నాటకాల్లో వేసిన మిత్రుడెవరైనా ఫోన్ చేసినా, లేకపోతే మరెవరైనా స్నేహితుడు అనుకోకుండా ఇంటికి వచ్చినా ఆయనకి చాలా బాగుంటోంది. అలా ఎవరైనా వస్తే ఆయనకి కాస్త ఊరట లభిస్తోంది. కాని నెమ్మదిగా ఆ క్రమం కూడా తగ్గిపోయింది. ఆయనకి చాలా అవసరమైనప్పుడే ఎవరికైనా ఫోన్ చేస్తున్నాడు. అలాగే, చాలా తక్కువగానే ఎవరినుంచైనా ఫోన్ వస్తుంది. నాటక మండలి చెదిరిపోయిన తరువాత ఆయన మొబైల్ ఫోన్ మోగడం ఇంచుమించు పూర్తిగా ఆగిపోయింది. విసుగు వచ్చి ఆయన దాన్ని తీసి ఒకచోట పెట్టుకున్నాడు. ఆయన టి.వి. మాత్రం విడవకుండా ఆన్ చేసి ఉంచేవాడు. దానితో ఆయనకి మనస్సు కాస్త రంజిల్లుతూ కాలక్షేపం అవుతోంది. ఇంట్లో నెలకొన్న శూన్యం కూడా బాధించడంలేదు.
పెరుగుతున్న వయస్సు, పట్టుకున్న రోగాల కారణంగా ఆయనకి నడవటంలో ఇబ్బందిగా ఉంటోంది. అందువల్ల భోజనం చెయ్యడానికి రోజూ దూరం వెళ్ళడానికి ఆయనకి ధైర్యం చాలడంలేదు. ఇంటికి దగ్గరలో సరయిన భోజనం లభించే చోటు కూడా ఏదీలేదు. వంటచేసి పెట్టేవాడెవరైనా దొరుకుతాడేమోనని చాలా ప్రయత్నించాడు. కాని ఆయన స్వభావం ఇరుగు-పొరుగువారితో బాటు ఆ చుట్టుపక్కల ఉండేవారిలో ప్రసిద్ధి చెందటంవల్ల ఈవిషయంలో ఆయనకి సహాయపడేందుకు ఎవరూ ముందుకి రాలేదు. ఎవరిముందూ ఓటమిని అంగీకరించని దినేష్ బాబు ఇప్పుడు స్వయంగానే ఇంట్లో వంట చేసుకోవడం మొదలుపెట్టాడు. వంట ఎలా చేసుకున్నా, ఆయనకి దీనితో కాస్త కాలక్షేపం అవుతోంది.
ఒక వేళాపాళా అంటూ లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు కరెంటు పోవడం అనేది గొప్ప విషయమేమీ కాదు. ఆరోజు ఉదయం నుంచి కరెంటు జాడ-జవాబు లేకుండాపోయింది. ఆయన ఏదయినా చదవడంకాని, టి.వి. చూడటం కాని ఏదీ చెయ్యలేకపోతున్నాడు. టి.వి. నడుస్తూ ఉంటే తను ఒంటరిగా లేనని ఆయనకి అనిపిస్తుంది. కాని, గంటలతరబడి టి.వి. నడవకపోవడంవల్ల తను ఒంటరివాడినైపోయాననే భావం ఆయనలో గూడుకట్టుకోసాగింది. ఆయనలో కంగారు నెలకొనసాగింది. ఎవరితోనైనా మాట్లాడాలని ఆయన మనస్సు తపించసాగింది. ఆయనతో మాట్లాడేందుకు ఎవరైనా ఉంటే బాగుండునని అనిపించసాగింది. ఆ కంగారు పెరిగి పెద్దదై ఇంక ఇంట్లో ఉండలేక ఆయన బయటికి వచ్చి నిలబడ్డాడు. చీకటిగా ఉన్న కారణంగా వీథిలో ఎవరో ఒకరూ-ఇద్దరే వస్తూ-పోతూ ఉన్నారు. వాళ్ళ ముఖాలు కూడా ఆయనకి కనిపించడంలేదు. కొంతసేపటికే అలసట అనిపించి ఆయన అక్కడే సమీపంలో ఉన్న ఒక రాయిమీద కూర్చున్నాడు. కాస్త కంగారు తగ్గినతరువాత ఆయన తనలో తానే మాట్లాడుకుంటూనే నేను ఎందుకు బతకలేనని అనుకున్నాడు. ఇంకెవరితోనైనా మాట్లాడకుండా ఆయనలో అశాంతి ఎందుకు నెలకొంటోంది?
ఆయన తనకి తానే నచ్చజెప్పుకోలేకపోతున్నాడు. అప్పుడే ఆయనకి దగ్గరనుంచి వెడుతున్న ఒక నీడని ఆయన అడిగాడు- “కరెంటు ఎప్పుడొస్తుంది?”
“నాకు తెలియదు.” సంక్షిప్తంగా జవాబు చెప్పి ఆ నల్లని నీడ అక్కడినుంచి ముందుకి సాగిపోయింది. ఆయన వెర్రిముఖం వేసుకుని అక్కడినుంచి లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన మనస్థితి కొవ్వొత్తులు ఎక్కడ ఉన్నాయో వెతుక్కుని వెలిగించుకునేందుకుకూడా అనుకూలంగా లేదు. ఆయన చీకట్లో తడుముకుంటూ తన మంచం వరకూ వచ్చాడు. నిలవలేక మంచం మీద వాలిపోయాడు. ఎవరైనా అపరిచితుడైన వ్యక్తి అయినా సరే ఇంట్లోకి వచ్చి తనతో కాసేపు మాట్లాడితే బాగుండునని, లేకపోతే తను ఊపిరి కూడా పీల్చుకోలేనని ఆయనకి అనిపించింది.
ఆ కంగారులోనే ఆయన లేచి కూర్చున్నాడు. చీకట్లో ఆయన కళ్ళముందు కొన్ని నీడలు కనిపించసాగాయి. ఆ చీకటిగోడని చీల్చుకుని అమ్మ, నాన్నగారు ఆయనదగ్గరికి వచ్చి నిలబడినట్లు, ఆయన తలని ప్రేమతో నిమిరినట్లు అనిపించింది. ఆయనలో తెలియని మేఘాలేవో కమ్ముకోసాగాయి. ఆ మేఘాలు కళ్ళలోంచి వర్షించేలోగానే చీకట్లో గోడలోంచి మరొక నీడ ఆయన వైపుకివేగంగా వస్తున్నట్లు చూశాడు. ఆయన ఆ నీడని వెంటనే గుర్తు పట్టాడు. సందేహం లేదు, అది విజయే. భావావేశంతో ఆయన లేచి నిలబడ్డాడు. ఇంక ఏమయినా సరే ఆమెని తననుంచి దూరంగా వెళ్ళనివ్వకూడదు. తన బాహువుల్లో బంధించడానికి ఆయన తన వణుకుతున్న చేతులు ఆమెవైపుకి చాచుతున్నంతలోనే గది వెలుతురుతో నిండిపోయింది. కరెంటు వచ్చింది. నీడలన్నీ ఎలా మాయమైపోయాయో, ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలియలేదు. ఆయన తన చేతులని ఇంకా చాచుకునే ఉన్నాడు. నిశ్శబ్దంగా ఆ వెలుగుకెరటాలలో ఓలలాడుతున్న ఆ గోడని అదే పనిగా పరికిస్తున్నాడు.
***
డా. రమాకాంత శర్మ – పరిచయం
1950 లో భరత్ పుర్, రాజస్థాన్ లో జన్మించిన డా. రమాకాంత శర్మ 100కి పైగా కథలు వ్రాశారు. పది కథాసంకలనాలు, రెండు వ్యంగ్యసంకలనాలు, ఎనిమిది నవలలు, ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు ప్రతిష్ఠాత్మకమైన యు.కె. కథాకాసా, కమలేశ్వర్ స్మృతి పురస్కారంతోబాటు మహారాష్ట్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ, కియాన్ ఫౌండేషన్ ల ద్వారా సన్మానం పొందారు. కొన్ని కథలు ఇతర భాషలలోకి అనువదించ బడ్డాయి. బ్యాంకింగ్, మానేజిమెంట్ మొ. విషయాలపైన వ్రాసిన పుస్తకాలకు రాష్ట్రపతి మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డులు పొందారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మానేజరుగా రిటైరయ్యాక ముంబయిలో ఉంటున్నారు.
*****

బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.
