వానొచ్చింది

-చిలుకూరు ఉషారాణి

వానొచ్చింది
ఉరుముల మెరుపులతో శబ్దం చేస్తూ
మండుటెండల్లో హఠాత్తుగా..

మాగాయ పచ్చడికోసం మామేడ పైన ఆరబెట్టిన మామిడి కాయల ముక్కల రుచి చూడాలని కాబోలు.
ఊరిస్తున్న ఊరమిరపకాయల ఘాటును కూడా తగ్గించాలని అనుకుందేమో !

వానొచ్చింది
వసారా పైరేకులపై దభా దభా మని బాదుతూ ..
పిలుస్తుంది గట్టిగా..

ఒంటరిగా కూర్చొని చరవాణి ఆటలో మునిగున్న
నన్ను కలవాలని కాబోలు,
వాళ్ళమ్మకు కూడా చెప్పకుండా వచ్చినట్లుంది, కాసేపు నాతో సరదాగా కలిసి ఆడుకోవాలని.

వానొచ్చింది
తెరిచిన కిటికీలో నుంచి జాలు వారుతూ
చప్పుడు చేయకుండా మెల్లగా..

పట్నం నుంచి వచ్చిన మా మేనత్త మోసుకొచ్చిన కబుర్లును రహస్యంగా చెవిన వేసుకోవడానికి కాబోలు,
అత్తగారి రుసరుసలు, ఆడపడుచు ఆరిందలూ, బావగారి గొంతెమ్మ కోర్కెలు.. అన్నింటినీ హావభావాలతో సహా తిలకించడానికేమో !

వానొచ్చింది
ప్రచురణకు నోచుకోని వార్తలను
వార్తా పత్రికలా మోసుకొస్తూ …

ప్రకృతి ఒడిలోనే ఆటలు, పాటలు నేర్చుకొని, జీవిత పాఠాల సారాంశంగా మిగిలిన నిలువెత్తు అనుభవాల ముదుసలిని జ్ఞాపకాల జల్లుల్లో తడపాలని కాబోలు

తన ముందుతరాలతో వారికున్న అనుబంధాన్ని పంచుకోవడానికేమో !

*****

2 thoughts on “వానొచ్చింది (కవిత)”

Leave a Reply

Your email address will not be published.