కనక నారాయణీయం -86

–పుట్టపర్తి నాగపద్మిని

తిరుమల వీధుల్లో బంధువులంతా, తిరుమణి పొట్లాలూ, చెక్క బొమ్మలూ, ఇంకా ఏవేవో కొనుక్కుందామనుకుంటుంటే, కనకమ్మ అన్నది,’అది కాదమ్మా! ముందు పుష్కరిణిలో మునిగి, తరువాత వరాహ స్వామి దర్శనం, తరువాత స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి, ఆ తరువాత కొనుక్కుంటే, ఇంక కొండ దిగొచ్చు ఒకేసారి! ఒక గంటలో వచ్చేస్తాం కదా!’

ఆ మాటా నిజమేననుకుని, అందరూ పుష్కరిణి వైపుకు కదిలారు.

నాగకు ఇదంతా ఏదో అద్భుత ప్రపంచంలాగే ఉంది. పెద్ద పెద్ద కళ్ళేసుకుని చుట్టూరా చూసుకుంటూ అడుగులు వేస్తూ ఉంది. పక్కనుంచీ ఒక చోట ‘నాకొద్దు, నాకు భయం..’ అని గుక్కపట్టి ఏడుస్తూ మాటిమాటికీ చేతుల్లోనుంచీ జారిపోతూ ఉన్న నాలుగైదేళ్ళ కుర్రవాడిని వాళ్ళమ్మావాళ్ళు నాలుగు తగిలిస్తూ లాక్కునిపోతున్నారు.

‘అమ్మా, ఏడుస్తూ ఉన్నా లాక్కుని పోతున్నారు, వాళ్ళ అమ్మావాళ్ళు వాణ్ణి?’అడిగింది నాగ.

‘ఇక్కడ కొండ మీద చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఇస్తామని మొక్కుకుని ఉంటారు వాళ్ళమ్మావాళ్ళు స్వామికి! ఎవరో పిల్లలను చూసి వాడికి భయమేసి ఉంటుంది. అక్కడ తల వెంట్రుకలు తీసేటప్పుడు అప్పుడప్పుడు కత్తి తగిలి గీరుకుపోతుంటుంది. రక్తం వస్తుంది కదా! అందుకే వాడు ఏడుస్తుంటే, వాళ్ళమ్మా వాళ్ళు రెండు తగిలించి తీసుకు పోతున్నారులే! రా రా..అందరూ పోతున్నారు.’ కనకమ్మ నాగ చెయ్యి పట్టుకుని తొందరగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది తక్కిన బంధువులనందుకోవాలని!

నాగ కూడా అడుగులు తొందరగా వేస్తూ అడిగింది,’మరీ, అమ్మా, వాళ్ళమ్మావాళ్ళు ఎందుకు మొక్కుంటారు యీ స్వామికే ఇస్తామని?’

కనకమ్మ అసహనంగా నాగ చెయ్యి పట్టుకుని గుంజుతూ అంది,’ఆబ్బా!! నీకన్నీ సందేహలేనే తల్లీ!! వేంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంటి దేవుడై ఉంటాడు.అందుకే మొక్కుని ఉంటారు. కొంతమంది పిల్లలు ఎన్ని రోజులకూ పుట్టకపోతే కూడా మొక్కుంటారు, పిల్లో పిల్లవాడో పుడితే, తలనీలాలు ఇస్తాము స్వామీ! అని! అందుకే ..’

‘ఔనా! తల నీలాలంటే?’

‘అబ్బబ్బా! చంపుతున్నావే! ఇదుగో చెప్తున్నాను, నీ ప్రశ్నలన్నీ గుర్తు పెట్టుకో ఇప్పటికి! ఇంటికి పోయినతరువాత చెబుతా! ఇప్పుడు నడవ్వే తొందరగా!

వాళ్ళెక్కడున్నారో, పట్టుకోవాలంటే..కష్టమే, ఇప్పుడు?’ కనకమ్మలో కంగారు!!

గబ గబా అడుగులు వేస్తూ చుట్టూ చూసుకుంటూ నడుస్తున్న కనకమ్మకు బంధువులు పుష్కరిణి దగ్గర కనబడ్డారు, అక్కడి మెట్ల మీద కూర్చుని! ‘ఏమో వదినా! నువ్వెంతసేపటికీ రాకపొయ్యేసరికి ఇదిగో ఇక్కడికి రావలనుకున్నాం కదా ఎటూ, అని ఇక్కడికి వచ్చేస్తిమి అందరూ! ఏమీ అనుకోవద్దు.’ అంది, లక్ష్మీ నరసరసమ్మ.

లక్ష్మీ నరసమ్మ పుట్టపర్తికి వరుసకు చెల్లెలు. పుట్టపర్తికీ ఆమె అంటే చెల్లెలన్న ఆప్యాయత! తోడబుట్టిన చెల్లెలు ఇందిర ఎప్పుడో గతించింది! ఆమెను యీమెలో చూసుకుంటూ ఉంటాడాయన! లక్ష్మీనరసమ్మకూ అదే ఆప్యాయత! అన్నంటే వల్లమాలిన ప్రేమ. ఆమె భర్త జాతక శాస్త్రంలో ఉద్దండుడు. రాళ్ళపల్లి గోపాలకృష్ణమాచార్యులవారి వద్దే యీ విద్య నేర్చుకున్నాడు.

రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారికి స్వయానా అన్నగారే యీ గోపాల కృష్ణమాచార్యులవారు. జాతక శాస్త్రం గురించిన వీరి ఆంగ్ల వ్యాసాలు ఆంగ్ల పత్రికలలో తరచూ ప్రచురింపబడుతూనే ఉంటాయి. పుట్టపర్తి కి కూడా జాతకాల పిచ్చి కాస్త ఎక్కువే అవటం వల్ల కూడా చెల్లెలి కుటుంబం వైపు మొగ్గు ఎక్కువే. కరుణ తరులతల పెళ్ళిళ్ళు కుదరడంలో యీమె పాత్ర చాలా ఎక్కువ కూడా!అందుకే కనకమ్మకు కూడా లక్ష్మీ నరసమ్మ అంటే చాలా ఇష్టం.

‘అదేం లేదులే! ఇదిగో యీ నాగతో వచ్చింది తంటా! ఎక్కడైనా ఏమన్నా కనబడితే చాలు, అక్కడే నిలబడిపోతుంది. పైగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుందమ్మా! ఇంట్లో ఉండవే తల్లీ! అంతే నేనెక్కడికి పోయినా తోక మాదిరి నాతో రావాల్సిందే! ఈ సంగతికేమిగానీ, మనం పుష్కరిణిలో స్నానలు ముగించుకోని, వరాహస్వామి దర్శనం చేసుకోవాలమ్మా! తరువాతే లోపలికి పొయ్యేది!’ వాళ్ళను తొందర పెట్టింది కనకమ్మ.

‘మేము రెడీగానే ఉన్నాం కనకమ్మా..’అంటూ తక్కిన ముగ్గురూ, తమ సంచీల్లోనుంచీ తన బట్టలు బైటికి తీసుకోవటం మొదలుపెట్టారు.

నాగకు పుష్కరిణి చూస్తుంటే చాలా సరదాగా ఉంది. కడపలో కృష్ణ బట్టలుతికేందుకు కాలువకు పోయినప్పుడల్లా, ఆ నీళ్ళలో కాళ్ళు తపతప లాడిస్తూ ఎంత సేపైనా కూర్చునే ఉంటానంటుంది. అటూ ఇటూ ఎవరినా యీత కొడుతూంటె, తనూ ఆ నీళ్ళల్లో దూకి యీత కొట్టగలిగితే? అనిపిస్తూ ఉంటుంది.

ఇప్పుడీ పుష్కరిణిలో స్నానం చెయ్యాలని చెప్పిందమ్మ.

‘అమ్మా! కడప కృష్ణ కాలువలో ఈత కొడుతుంటారే, అట్ల ఇక్కడ కూడా యీత కొట్టొచ్చా?’

కనకమ్మ నుదుటిపై కొట్టుకుంటూ లక్ష్మీ నరసమ్మ వైపు తిరిగి అంది, ‘చూస్తున్నావా లక్షమా? ఇదుగో, మళ్ళీ ప్రశ్నలతో సిద్ధం!’

లక్ష్మీ నరసమ్మ నవ్వు ముఖంతో తల్లీ బిడ్డలను చూస్తున్నది.

‘ఇదిగో నాగా! ఇది పుణ్య క్షేత్రం. సాక్షాత్తూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువున్న చోటు. ఈ పుష్కరిణీ, కడప కృష్ణకాలువా ఒకటేనా? చెంపదెబ్బలేసుకో! దీన్ని సాక్షాత్తూ వైకుంఠం నుంచీ తెచ్చి గరుడుడు ఇక్కడ పెట్టినట్టు పురాణాల్లో ఉంది. ఈ పుష్కరిణిలో స్నానం చాలా పవిత్రం. ఇక్కడ స్వామి గురించి తపస్సు చేసిన వాళ్ళకు మోక్షం లభించిందంట! పాపాలు తొలగి పోవాలని కోరుకున్న వాళ్ళందరి పాపాలూ తుడిచిపెట్టుకుపోయిన చోటు. ఇంకా ఎంతమందికో వారు కోరిన కోరికలు తీర్చిన పవిత్ర పుష్కరిణిది. భక్తిభావంతో పుష్కరిణిలో మునగాలంతే! ఈత కొట్టడం కాదే తల్లీ!’

వింటున్న బంధువులందరి ముఖాల్లోనూ భక్తి తొణికిసలాడుతూ ఉంది.

‘అమ్మా! ఇక్కడ తపస్సెవరెవరు చేసుకున్నారసలు?’మళ్ళీ ప్రశ్న.

‘తల్లీ! ఊరికి పోయిన తరువాతే నీ ప్రశ్నలకు జవాబులు! ముందు పుష్కరిణిలో మునుగు!’

*****

  (సశేషం)

Leave a Reply

Your email address will not be published.