
వాకింగ్
(నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-చిట్టత్తూరు మునిగోపాల్
మెడ చుట్టూ వేసుకున్న చుడీదార్ సవరించుకోవడం అది ఎన్నోసారో లెక్క లేదు. మెడకు బాగా దగ్గరగా చేర్చి, గుండెలు కనబడకుండా అంచులతో జాగ్రత్తగా కప్పింది. దాన్ని ఒక చేత్తో సవరించుకుంటూనే మరో చేత్తో బోటమ్ వేర్ ను నాభికి సుమారు జానెడు పైకి లాక్కుంది. అనీజీగా ఉంది అలా చేయడం. గజ్జల దగ్గర పట్టేసినట్టుగా ఉంది. తప్పదు… ఈమాత్రం పైకి ఉండాలి. పైన వేసుకున్న కుర్తా గాలికి పొరపాటున పైకి లేస్తే… ఎంత అసహ్యంగా ఉంటాయో అక్కడ గుచ్చుకునే చూపులు. భరించలేదు తను.
మరోసారి రోడ్డు మీదికి చూసింది. దూరంగా ఎదురుగా అటుపక్క కనిపించింది ఇళ్ల వరుస. చిన్నచిన్న అపార్ట్మెంట్లు. మూడో అపార్ట్మెంట్ ముందు పిల్లలు ఆడుకుంటున్నారు. ఫరవాలేదు… అందరూ పదీపన్నెండేళ్ల లోపువారే. ధైర్యం చేసి మెట్లు దిగుదామనుకుంటూఉండగా మోగింది మొబైల్. పక్క వాటా వైపు చూసింది. అంతదాకా ఆమెనే ఆబగా చూస్తున్న రెండు కళ్ళు కలవరపడి అటు చూపులు తిప్పేసుకున్నాయి. గవర్నమెంటు ఇచ్చిన అపార్టుమెంటులోని రెండో ఫ్లోర్లోని సింగిల్ బెడ్రూం ప్లాట్ అది. ప్లాట్ ముందున్న మూడు అడుగుల జాగాలో నిలబడి వుంది ఆమె. చిరాగ్గా ముఖం చిట్లించి, తన వాటాలోకి వచ్చి తలుపు వారగా వేసి, మొబైల్ ఆన్ చేసింది.
“వాడిని రావద్దన్నావట…” ఏమాత్రం సంబోధన లేకుండా అలా మాట్లాడేది మావయ్యే. పెళ్ళిచేసి మెడకు ఉరితాడు బిగించి పుణ్యం కట్టుకుంది ఈ పెద్ద మనిషే. ఇప్పుడు రాయబారానికేమో ఫోన్ చేశాడు.
ఆయన మాటలో గదమాయింపు వినీవినీ రోసిపోయింది. అందుకే ఇప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు.
“అవును…” నీకేం నొప్పి అన్నట్టు బదులిచ్చింది.
“వాడిని రాచిరంపాన పెట్టావు. భరించలేక తల్లిదగ్గరికి పారిపోయాడు. ఆ మహాతల్లి కూడా ‘పొయ్యి సంసారం చెయ్యిరా ముండా. లేదంటే నీ పెళ్ళాం బరితెగించిపోతుంది.’ అని వాడికి బుద్ధి చెప్పలా. నువ్వూ వాడిని వెనక్కు పిలవలా. ఇప్పుడు వాడికై వాడు వస్తానని అంటున్నాడు. మీయమ్మతో చెప్పాడు. వొద్దు రావద్దని అని నువ్వు వదరుతున్నావు. ఏం చూసుకుని నీకీ బలుపు? చూస్తావుంటే నీ యవ్వారం మొగుడు లేకుంటే ఇడిసిపెట్టిన దానిలా ఊరుమీదపడి బలాదూర్ తిరగొచ్చు అన్నట్టుగానే ఉండాది.” రెచ్చిపోతున్నాడు మావయ్య.
“నాకిష్టం లేదు, అంతే.” ఖరాఖండిగా చెప్పేసి మొబైల్ కట్ చేసింది.
నిజమే, ఏం చూసుకుని తనకింత ధైర్యం. మొగుడు లేని ఆడదాన్ని ఈ ఏరియాలో ఎలా చూస్తారో, చూస్తున్నారో తెలియదా తనకు.
సరే, వాడి ఏడుపు మన్నించి ఇంట్లోకి రానిచ్చిందే అనుకో. ఏం పెట్టి పోషించాలి? వాడి తాగుడికి, తిండికి ఏ గడప ముందు అడుక్కోవాలి?
పదో తరగతి పాస్ అవుతూనే ఈ తాగుబోతుతో పెళ్ళిచేసి పడేసింది ఈ పెద్దమనిషే. ఆ వయసులో ముక్కుకు తాడు వేయకపోతే చెడిపోతుందట.
చెడిపోవాలంటే ఎంతసేపు…ఇప్పుడు ఈ క్షణంలో కనుసైగ చేస్తే ఇదే వీధిలో క్యూ కట్టవూ తోకలూపుకుంటూ కుక్కలన్నీ.
వాడు ఇంటిని, తనను వదిలేసి తల్లి దగ్గరికి వెళ్ళి నెల్లాళ్లే అవుతోంది కానీ, ఆ పచ్చి తాగుబోతుతో సంసార సుఖం చూసి రెండుమూడేళ్ళు దాటింది. నిజానికి ఇదే సుఖంగా ఉంది.
దడ దడ మని శబ్దమయితే అటు చూసింది. ఒక మూలకు పడివుంది గోనె మూట ఒకటి. పురి దారంతో బిగించి కట్టిన దానిమీది నుంచి కిందికి దూకింది పిల్లి. మ్యావ్ మంటూ తెరచి వుంచిన ద్వారం గుండా బయటకు పరుగెత్తింది.
ఇదిగో… ఈ మూటలో అమ్మకం కాకుండా మిగిలిపోయిన వెల్డింగ్ సామాన్లు. ఆ సామాన్ల లాగే తన బతుకు కూడా ఈ పెళ్ళితో సర్వనాశనమై ఎందుకూ పనికిరాకుండా పోయింది.
సరే చేయడానికి నీకు చేతకాదు. రోజంతా తాగి పడిపోవాలి. ఇద్దరు పని పిల్లోళ్ళు ఉన్నారు కదా. నేను వచ్చి షాప్ లో కూచుంటాను. షాపును ఒక దారికి తెస్తాను. అంటే ఒప్పుకున్నాడా. ఆఖరికి వెల్డింగ్ దుకాణాన్ని తాగుడుకు తాకట్టుపెట్టి వొంటినిండా రోగాలతో మూలన ముడుక్కున్నాడు.
కుట్లు… అల్లికలు… కష్టం చేసిచేసీ వాడి తాగుడుకు, తిండికీ పెట్టీపెట్టీ అలిసిపోయింది. దున్నపోతు లాంటి వాడిని ఇంట్లో కూర్చోబెట్టుకుని ముప్పుటలా మేపడం, పైనుంచి తాగుడుకు పైసలు సర్దడం. భరించినంత కాలం భరించింది. ఇక వల్లకాలేదు. నిజానికి వాడంతట వాడు వెళ్లిపోలేదు. వెళ్ళగొట్టింది తనే.
మగ మహారాజు కదా… పెళ్ళాం ఇంటినుంచి తన్ని తరిమేసింది అంటే ఎంత తలవంపులు. అందుకే “ఆ పొగరుబోతు దాన్ని నేనే వదిలేశాన”ని ఊరూవాడా ప్రచారం చేశాడు. ఇప్పుడేమో ఇంటికి వస్తానంటూ కాళ్ళబేరానికి వస్తున్నాడు. ఎవరెవరితోనో రాయబారాలు పంపిస్తున్నాడు.
“ఎంతచెడ్డా వాడు నీ మొగుడు. నువ్వే తరిమేశావో, వాడే వెళ్లిపోయాడో… లోకం ఆడిపోసుకునేది నిన్నే. ఒంటిగా ఇక్కనపక్కన వాళ్ళ మాటలు పడుతూ ఎలా బతగ్గలవే?” కళ్ల నీళ్ళు పెట్టుకుంటుంది అమ్మ.
వాడున్నప్పుడైనా ఏం బతికింది? అమ్మకు తెలియదా. కొన్నాళ్ళు అమ్మ ఇంటి పక్కింట్లోనేగా సంసారం వెలగబెట్టింది.
ఏనాడన్నా తాగి తూలకుండా ఇంటికి వచ్చాడా? ఇంటికి కావాల్సిన వస్తువు ఒక్కటైనా తెచ్చాడా?
అమ్మ ఎన్నిసార్లు అడగలేదు… తన ఇంట్లో ఉన్నదేదో తెచ్చి ఇవ్వడానికి ఎన్నిసార్లు ప్రయత్నించలేదు?
తనే… పట్టుబట్టి అమ్మకు దూరంగా వచ్చేసింది.
“మొగుడిని వదిలేయడం ఏమిటే. మన ఇంటావంటా ఉందా ఇలా బరితెగించడం?” ఇంట్లోనుంచి వాడిని తరిమేసిందని తెలిశాక, అమ్మ మొదటి స్పందన ఇండి. పట్టలేని ఆగ్రహం కూడా.
“నా మాట వినే. మొగుడిని బతిమాలి బామాలి దారికి తెచ్చుకోవాలి కానీ, ఇలా నీలాగా తెంచుకుంటారా? మొగుడుపెళ్లాలన్నాక సవాలక్ష ఉంటాయి ఇద్దరిమధ్యా. అంతమాత్రాన మొగుణ్ణి కొట్టి మొగశాలకు ఎక్కుతారా నీలాగా? ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు.” అంతులేని దుఃఖం అమ్మది.
కూతురి బతుకు ఇలా అయిపోయిందన్న బాధతో అలా అంటుందే కానీ… అమ్మకు తెలియదా తనేమిటో.
అప్పటికీ డ్రైవింగ్ నేర్చుకుంది. అది కూడా అరకొరగా నెలరోజులు, వారానికి రెండు రోజులు మాత్రమే. పూర్తి శిక్షణకు బడ్జెట్ అనుమతించలేదు. సిటీకి వెళ్ళి ఏదోఒక ట్రావెలింగ్ కంపెనీలో డ్రైవర్ గా చేరుదామని ప్రయత్నం. సేల్స్ గాల్, బొటిక్… ఆఖరికి పెట్రోల్ బంకులో గాల్. వాడికి తెలియకుండా ఓపెన్ వర్శిటీ డిగ్రీ చేసింది కదా… డేటా ఎంట్రీ ఆపరేటర్. సాహసించి అమ్మకు తెలియకుండా రెండుమూడు సార్లు సిటీలో ఇంటర్వ్యూలకు హాజరైంది కూడా.
“నువ్వు అలా ఉద్యోగమంటూ వీధిలో పడితే నేను ఉరేసుకుని చస్తానంతే.” అమ్మ బెదిరింపులకు భయపడడం. ఎటూ కాకుండా ఇదిగో ఇలా మిగిలిపోవడం.
ఈమధ్య ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. జ్వరం కాదు కానీ, ఒళ్ళంతా బాగా నీరసంగా అనిపిస్తోంది.
“ఒబేసిటీ” చెప్పింది డాక్టర్. ఉండాల్సినడానికన్నా శరీరం బరువు ఎక్కువైందట.
ఇప్పుడు మోస్తున్న బతుకు బరువుకంటేనా…నవ్వు వచ్చింది డాక్టర్ మాటకు.
గర్భాశయంలో బోలెడు సిస్టులు ఇప్పటికే తిష్ట వేశాయి. పెళ్ళయిన ఏడాదికి వాటివల్ల మిస్ క్యారీ అయింది కూడా. తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదు. మొదట్లో ఇక్కనపక్కన వాళ్ళ సూటిపోటి మాటలకు బాధపడేది. లోకం దెప్పిపొడిచిన ఆ గొడ్రాలి తనమే ఇప్పుడు అదృష్టమైంది. ఒకవేళ పిల్లాపీచూ ఉండివుంటే…
‘తాను దూర సందులేదు.. మెదకో డోలు’ అన్న సామెత గుర్తుకు వచ్చింది. నవ్వు కంటిన్యూ అయింది.
“ఇది నవ్వాల్సిన సమస్య కాదు. ఇప్పటికే సిస్టులు, ఇప్పుడీ ఒబేసిటీ. జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది.” డాక్టర్ అసహనంగా అంది.
“సరే, ఏం చేయాలి డాక్టర్?’ సర్దుకుని అడిగింది ఆమె.
“బాడీకి ఎక్సర్ సైజ్ కావాలి. కనీసం వారంలో నాలుగు రోజులు రెండు పూటలా అర్ద గంటపాటు నడవాలి.”
ఆ సలహాతోపాటు డాక్టర్ ఏవో మందులు రాసిస్తే రెండు రోజులకు మాత్రం తీసుకుని బయటకు వచ్చింది.
ఆమాత్రం తెలుసు తనకు, ఒబేసిటీకి వాకింగ్ మించిన మందు లేదని. తెలిసి ఏం చేయగలిగింది..!
చిన్నప్పుడు…
పంట కాలువలో- మడమలెత్తు మాత్రమే పారుతున్న నీటిలో పాదాలు తపతప లాడించుకుంటూ, అరటి తోటల వెనుకనుంచి తొంగి చూస్తున్న పొద్దుకు అభిముఖంగా పచ్చటి వరిచేల గట్ల వెంట బడికి నడవడం…
ఉదయం తేవడం మరచిపోయిన పాలకోసం- గోధూళి వేళ ఇంటినుంచి మొదలై నేరేడాకుతో చేసుకున్న పీపాయి ఊదుకుంటూ, ఇళ్లకు తిరిగి వస్తున్న ఆవుల తోకలతో ఆడుకుంటూ, గొల్లవాళ్ళ ఇళ్లకు పరవశమెత్తడం…
ఇప్పుడేదీ ఆనందం..!?
ఒక సాయంత్రం పూట అలా నడచుకుంటూ నడచుకుంటూ ఈ లోకం అంచుదాకా చేరి, అగమ్యమైన అనంతంలో లీనమవ్వాలని…
వాకింగ్…
చాలా చిన్న కోరిక. ఇప్పుడది ఆరోగ్య అవసరం కూడా.
“టింగురంగా అంటా బయలుదేరింది చూడు వయ్యారి. వీధి చివర ఏ మిండగాడు కాసుకొని ఉండాడో. ఛీ ఛీ… సిగ్గూశరం లేని ముండ. పొద్దు వాలితే చాలు ఈదిలో పడతాది. దీని రంకు చేష్టలు భరించలేకే ఆ మొగుడు గుండె పగిలి హరీ మనుంటాడు.” రెండు వాటాల అవతల పదేళ్ళ కొడుకుతో ఒంటరిగా నివశిస్తున్న గురించి ఇరుగుపొరుగువాళ్ళు చేసే నిత్య పారాయణ, ఆమె చెవుల్లో గింగురు మంది.
వీధిలో పడకపోతే ఆవిడకు, ఆవిడ బిడ్డకు బువ్వ ఎవరు పెడుతారు? వీళ్ళు రారు కదా. నిజానికి ఆమె చేసేది ఒక చిన్న పాల డైరీలో క్యాన్లు కడిగే పని. ఆ పనికి వెళ్లాల్సింది సాయంత్రమే. ఒక్కోసారి ఇంటికి వచ్చేసరికి రాత్రి ఎనిమిది దాటుతుంది కూడా.
“సిక్సర్…” గట్టి అరుపుతోపాటు బంతి ఒకటి విసురుగా వచ్చి వెనుక గోడకు తగిలి, అంతే వేగంతో వెనక్కు వచ్చి పిట్టగోడకు కొట్టుకుని గిరగిరా తిరుగుతూ వచ్చి ఆమె పాదాలను ముద్దుపెట్టుకుని ఆగింది.
శరీరంలో ఒకరకమైన విరుపు… ఆమెకే సాధ్యమైన గదమాయింపు చూపు…
అంతే… కింద క్రికెట్ ఆడుతున్న కుర్రోళ్లు క్షణంలో పలాయనం చిత్తగించారు.
నవ్వు వచ్చింది. నవ్వేసింది కూడా దాచుకోకుండా. మగాడు అనేవాడినే కాదు… తుష్కారణంగా మాట్లాడే ఆడంగులను కూడా కట్టడి చేయగలిగిన శక్తి తన చూపుకుంది. హద్దులెరిగి ప్రవర్తించడం అమ్మదగ్గర చిన్నప్పుడే నేర్చింది.
నవ్వుకుంటూనే వంగి బంతిని చేతిలోకి తీసుకుంది. గురిచూసి వికెట్లకేసి విసిరింది. ఆకాశానికి తలయెత్తి పొగరుగా నిలబడ్డ మిడిల్ వికెట్ టప్ మంటూ నేలకు పడింది.
ధైర్యం చేసుకుని బయటకు వచ్చిన కుర్రాడు చూశాడు ఆశ్చర్యంగా- పడిన వికెట్ వైపు… ఆమె వైపు మార్చిమార్చి.
కనురెప్పలు ఎగరేసింది చిత్రంగా… ‘ఎలా ఉంది నా బౌలింగ్’ అన్నట్టు.
క్షణం తటపటాయించిన ఆ కుర్రాడు ఆపైన తేరుకుని, కుడిచేతి బొటన వేలు, చూపుడు వేలు కలిపి చూపించాడు “ఫెంటాస్టిక్” అన్నట్టు.
థంబ్ చిహ్నంతో అతడికి బదులిచ్చి గిరుక్కున వెనుదిరిగింది.
జూన్ నెలాఖరు రోజులు కదా… జివ్వుమంటూ దూసుకొచ్చిన
ఈదురుగాలి ఈడ్చికొట్టింది.
ఈసారి సవరించుకోలేదు. సన్నగా ముడుచుకుపోయి గుండెల మీంచి కాస్త పక్కకు జరిగిన చున్నీని అలాగే వదిలేసింది. నాభికీ జానెడు పైకి లాగివున్న బోటమ్ వేర్ ను యథా స్థానానికి చేర్చింది. బిగిసినట్టున్న ఊపిరి ఆడుతోంది. గుండెల నిండుగా స్వచ్చమైన గాలి పీల్చుకోగలుగుతోంది. అంతదాకా వున్న బంధనాలు తెగిపోయిన భావన. ఇప్పుడు చాలా హాయిగా ఉంది.
ఒకసారి అలవోకగా వీధిలోకి చూసి మెట్ల వైపు కదిలింది.
మళ్ళీ ఫోన్మోగింది.
“హెలో…” అంటూనే ఉంది.
“మీ మావయ్య ఫోన్ చేశాడా?” అంతలోనే ఆత్రంగా అమ్మ గొంతు.
“ఉమ్మ్… చేశాడు కానీ…”
“ఏం అన్నాడు? నువ్వేం చెప్పావు?”
“నేనేం చెబుతానో నీకు తెలియదా. ఆ విషయం పక్కనపెట్టు. నేనే నీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను. ఇంతలో నువ్వే చేశావ్. నీకొక సంగతి చెప్పాలి.”
“ఏందే అది?”
“నేను రేపు సిటీకి వెళ్తున్నాను.”
“వెళ్ళి?”
“అక్కడ ఒక ఫ్రెండు రమ్మంది. ఆమె రూములో జాబ్ సెర్చ్ చేస్తాను.”
“మరి మొగుడు? నీకు ఎన్నిసార్లు చెప్పాలే. లోకులు ఊరుకోరు, కాకుల్లా పొడుస్తారు. అంతా నా ఖర్మ… ఆయనతోపాటే పోయిఉంటే నాకీ యాతన తప్పేది…” క్రమేణా దుఃఖపు జీర కమ్మేస్తోంది అమ్మ మాటను.
“నాకే మొగుడూ లేడు. నాకంటూ ఉన్నది నువ్వొక్కరే. ఇక లోకులు అంటావా. నువ్వే అన్నావు వాళ్ళు కాకులని. మనం ఊరికే చూస్తూ ఉంటే పొడుస్తూనే ఉంటాయి కాకులు. వాటి నైజమది. కొట్టనక్కరలేదు- ఒక్కసారి చెయ్యెత్తి ‘హుష్’ అన్నామా ఒక్క కాకీ మిగలదు. ఈ లోకం మహా బలమైనది అని మనం అనుకుంటాము కానీ… నిజానికి దీనియంత బలహీనమైనదీ, పిరికిదీ మరేదీ లేదు. మనం ఆత్మనిబ్బరంతో నిలబడితే తోక ముడిచి పలాయనం చిత్తగిస్తుంది.”
“నువ్వు మాకు అర్థం కావే..”
“అర్థం అయినా కాకపోయినా నువ్వు నాకు అమ్మవి. నా గురించి నీకు తెలియని సంగతులు లేవు. నిదానంగా కూర్చుని ఆలోచించు. నీ కూతురు బతుకు గెలిచి చూపిస్తుందో లేదో నీకే తెలుస్తుంది. ఆ అమ్మా, చెప్పడం మరచిపోయాను. సాయంత్రం ఇంటికి వస్తాను. వేడివేడిగా మటన్ బిరియానీ రెడీ చేసిపెట్టు, సిటీకి వెళ్లేముందు నీ చేతివంట తినాలని ఉంది. కొన్నిరోజులే… నాకు జాబ్ దొరికాక ఎలాగూ నువ్వూ నాతోనే వచ్చేస్తావు కదా.” ఇక చెప్పడానికేమీ లేనట్టు కాల్ కట్ చేసింది.
అప్పటికే నడుస్తున్న దారిలో- దూరంగా గాలికి తలలూపుతున్న పొద్దుతిరుగుడు పువ్వులు… పరచుకున్న పచ్చటి గరికపోచలపై వాలుతున్న పొద్దు వెలుగు రేఖలు పడి మెరుస్తున్న అప్పుడే కురిసి వెలిసిన వాన తుంపర్లు… నిండైన ఆత్మవిశ్వాసానికి ఆహ్వానం పలుతూ.
*****

పుట్టింది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దగ్గరి తిమ్మసముద్రం అనే చిన్న పెల్లెటూరు. చదువు శ్రీకాళహస్తి. ప్రస్తుత నివాసం
చిత్తూరు జిల్లా కుప్పం. ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికలో విలేకరివిత్వం. సాహిత్యమంటే మక్కువ. కథలు, కాకర కాయలు రాయడం ఏడాదినుంచే.
ఆంద్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఒకటి, వేర్వేరు వెబ్ మ్యాగజైన్లలో మూడు కథలు ప్రచురితమయ్యాయి.
