స్వర్ణపురి గ్రామస్థులు – 5

– మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’

– హృషికేష్ పాండా

అనువాదం – స్వాతి శ్రీపాద

మరో రోజు, ఉత్సాహం హిమపాతంలా వెల్లువెత్తింది స్వర్ణపురిలో. స్వర్ణపురి కొండల నుండి, ఇళ్ల నుండి స్త్రీలు పరుగులు తీశారు. పిల్లలు కొంత దూరం పరిగెత్తి, ఆయాసంతో ఆగి, కళ్లు పెద్దవి చేసుకుని చూశారు. రామహరి ముసలి తల్లి అతి కష్టం మీద బయటకు వచ్చి ఎప్పటిలాగే, అక్కడున్న ప్రతి ఒక్కరి చేతులను, పెదాలను తాకి, ” నా కొడుకును చూశారా?’ అని అడిగింది. ప్రతిసారీ పెద్దగా ఆవిడ మొహం మీదే నవ్వేవారు కాని ఇప్పుడు నవ్వలేదు. ముసలివాళ్లు తమ నులక మంచాలు దిగి బయటకు నడిచారు వీధి రహదారిలో సమావేశమయ్యారు. నెలసరి సమయంలో ఆమె ఎవరినీ ముట్టుకో కూడదన్న విషయాన్ని మర్చిపోయి ఆ అమ్మాయి గ్రామ వీధిలో గుమిగూడిన జనాలను తోసుకుంటూ గుంపు మధ్యకు వచ్చింది. జగన్నాథ్ పెద్ద నాయక్ అలసిపోయి, రెపరెపలాడుతున్న కళ్లను రుద్దుకుంటూ వచ్చి, చేరుకున్నాడు. ఆ పైన గ్రామం మొత్తం వాగు వద్దకు వెళ్ళారు. ముసలీ ముతకా, ఆడా మగా, పిల్లలు, యువతులు, రామహరి తల్లి, నెలసరిలో ఉన్న అమ్మాయి, కోళ్లు, పందులు మరియు సీతాకోకచిలుకలు వాగును దాటి అవతలి ఒడ్డుకు వెళ్లారు. వారు కేశవ్, రామహరిని తమ గుంపులోకి చేర్చుకుని, ఆలింగనం చేసుకుని, వారిని స్పృశించారు, తద్వారా ఆ ఇద్దరు యువకులు వారి గ్రామంతో ఏకమయ్యారు.

జగన్నాథ్ గ్రామానికి పుష్కలంగా ఈత కల్లు ఇచ్చి, ఒక జత ఎద్దులతో సాగు చేయగల భూమిని తాకట్టు పెట్టి, వారికి కోడి కూర, చిక్కటి జొన్న పులుసుతో విందు ఇచ్చాడు. యువతులు రాత్రంతా నృత్యం చేశారు. కేశవ్ మద్యం తాగడు, కోడి మాంసం తినడు. చాలా మటుకు తనలో తానే లీనమై ఉండేవాడు. అందరి అవగాహనకు అందని స్వాతంత్య్ర ఉద్యమం గురించి పదే పదే మాట్లాడేవాడు. కానీ అతని తండ్రి జగన్నాథ్ పూర్తిగా మతిస్థిమితం కోల్పోయి, ప్రతి గ్రామస్థుని వద్దకు వెళ్లి, ప్రతి ఒక్కరికీ శ్రద్ధగా వివరించాడు: ‘మీకు అర్థమైందా? హీ-హీ. నా కొడుకు! నా కొడుకు! హా-హా. నా కొడుకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాడు. హీ హీ. నా కొడుకు!’ అతను ఈ మాటలను పదే పదే చెప్పకపోతే, కేశవ్ తన కొడుకేనని రుజువు కాదన్నట్లుగా.

రాత్రంతా నృత్యాలు కొనసాగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం వచ్చారు. రామహరి బాగా తాగి, ఎంతోసేపు నృత్యం చేసి, అడవుల్లో ప్రతిధ్వనించే స్వరంతో పాటలు పాడాడు. రాత్రంతా, జగన్నాథ్ పెద్ద నాయక్ ప్రతి నర్తకి వద్దకు వెళ్లి చెవిలో గుసగుసలాడాడు: ‘నా కొడుకు మన దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టాడు. దాని ప్రాముఖ్యత, దాని గొప్పతనం మీకు తెలుసా?’

రాత్రంతా, రామహరి పువ్వులతో, పువ్వుల వంటి యువతులతో, వెన్నెల వెలుగులో పాడే పాటలతో పరివేష్టితమై ఉన్నాడు. గ్రామంలో ప్రతిమొక్కా ప్రతి చెట్టూ పచ్చని ఆకులను కప్పుకుని ఉంటుంది.
ప్రతివారికీ కడుపునిండా జొన్న గంజి దొరుకుతుంది. కావలసినంత తాటి కల్లు కూడా మనసును సంతృప్తి పరుస్తుంది. భూదేవి నిండి పొంగిపొర్లుతుంది. ప్రతి తాటి చెట్టు ఎప్పుడూ నిండుగానే ఉంటుంది
ఎవరికీ దాహమనేదే తెలియదు. మహువా చెట్లు నిండా మహువానే. లభిస్తుంది. మామిడి చెట్లు మొత్తం మామిడి పళ్ళే మనుషులు, జంతువులు, పక్షులు తినగలిగే దానికంటే ఎక్కువే కనబడతాయి.
అడవులలో దుంపలు, వేట జంతువులు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ ఎవరూ ఆకలితో మాడి చావరు. మీ ఊరి నుండి, మా ఊరి నుండి, లేదా మన గ్రామం నుండి వెళ్ళే ఏ అపరిచితుడైనా సరే.
వరి కంకులపై వరి. చిరు ధాన్యపు కాడలపై చిరు ధాన్యం ఈ గ్రామం బంగారమే. అపరిచితులు సంచరించే ఇక్కడ పండిన పంటల సువాసనకు మైమరచిపోతారు. ఏ యువకుడూ బానిసగా వెళ్ళడు,
ఏ వయసులో భర్త తన వయసులోని భార్యను అస్సాం వెళ్ళడానికి విడిచిపెట్టడు. ప్రభుత్వ అధికారులు ఈ గ్రామానికి రారు. రాజుగారి రాజభవనం నుండి ఎవరూ ఇక్కడికి రారు. వాళ్ళు రారు, వాళ్ళు రారు.
దూతలు, బందిపోట్లు, మత ప్రచారకులు, కల్తీ మద్యం వ్యాపారులు, వారు ఇక్కడికి రాకూడదు వారు ఇక్కడికి రానేరాకూడదు మేము వెన్నెల వెలుగులో నృత్యం చేస్తాము, మేము చీకటి రాత్రులలో నృత్యం చేస్తాము, వ్యవసాయ భూముల్లో, అడవుల్లో బంగారం దొరికే ఈ గ్రామం ఇది మా గ్రామం.

మా గ్రామం స్వర్ణపురి.

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Leave a Reply

Your email address will not be published.