
చిత్రం-79
-గణేశ్వరరావు
‘చందమామ’ ప్రాచుర్యానికి కొకు పురాణ కథలు రామాయణ, మహాభారతాలు, దాసరి మాయాజాలం గొలుసు నవలలు ఎంతగా తోడ్పడ్డాయో , వాటికి బొమ్మలు అందించిన ‘చిత్ర’ రాఘవన్, ఎం టి వి ఆచార్య, శంకర్ తో పాటు వడ్డాది పాపయ్య కూడా అంతగానూ తోడ్పడ్డారు. విమర్శకులు వ.పా. ది ‘పట చిత్రకళ’ (Calender Art) అంటారు, అది సరి కాదు. వ.పా. ది రూపకళ!’
వడ్డాది పాపయ్య పుట్టుకతోటే అద్భుత శక్తి గల వ్యక్తి, ఐదేళ్లకే బొమ్మలు వేసేవారు, తండ్రి డ్రాయింగ్ మాస్టర్ అవటం వలన వారసత్వంగా లభించిన చిత్ర కళలో మెలకువలు ఇంట్లోనే నేర్చుకున్నారు. రాజా రవి వర్మ, దామెర్ల రామారావు చిత్రాలు, రామాయణ, మహా భారత గ్రంథాలు, సంస్కృత నాటకాలు ఆయన్ని ప్రభావితం చేశాయి. 1938 లో చిత్రకారులుగా గుర్తింపు పొందారు. కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు ప్రోత్సాహంతో ‘ఆంధ్రపత్రిక’ కోసం బొమ్మలు 1942లోనే వేశారు, ఆ పత్రిక సంపాదక వర్గంలో ఉన్న కొడవటిగంటి కుటుంబరావుతో పరిచయం ఏర్పడింది. ‘ ధనికొండ హనుమంతరావు ‘అభిసారిక’ మాస పత్రికకు కూడా పని చేశారు, చక్రపాణికి పరిచయం చేసింది ధనికొండే. ‘చందమామ’ లో చేరి కొన్ని దశాబ్దాలపాటు బొమ్మలు వేశారు. వ.పా.( తెలుగులో కాక ఇంగ్లీషులో కూడా ) అనే పొట్టి సంతకంతో పాటు – 0 ! 0 సింబాలిక్ సంతకం కూడా చేసేవారు, ఈ చివరి సంతకానికి వ.పా. ‘గతం శూన్యం, వర్తమానం శూన్యం, భవిష్యత్తులో నిలుచున్నాను’ అంటూ తాత్వికంగా అనే వారు.
చందమామ కోసం వ.పా. వేసిన రంగుల ముఖ చిత్రాల గురించి చెప్పుకుందాం. ఆయన చిత్రించే పధ్ధతి అసమానం. అది స్వతంత్ర బాణీ. చాలావరకు అవి నీటి వర్ణ చిత్రాలు, ఆయన రేఖలు ఏదో ఆవేశంలోనో, భావోద్వేగంలోనో వేసినట్లు ఉండేవి, చిత్రంలో ఖాళీ జాగా మిగిలేది కాదు. బాపు అతి తక్కువ లైన్స్ తో చిత్రాలు గీస్తే, దానికి విరుద్ధంగా వ.పా. బొమ్మలు – రేఖలలో రేఖలతో, చెట్టు పైకి పాకి అల్లుకునే లతల్లా, నిండుగా ఉంటాయి. ఇక ఆయన గీసిన చేతులు, నడుము, కాళ్ళు – ఆయా వ్యక్తుల మొహాలకి (disproportionate గా) సరితూగేవి కావ,, కాని ఆ అపనమ్మకాన్ని మనకు మనమే దూరంగా తరిమేస్తాం!
అదేమిటి, ఆమె ఎడమ చేతి వేళ్ళు అలా ఉన్నాయేమిటి? అంత అందమైన ముఖానికి కుడి భుజం నప్పుతుందా? ఆమె అన్ని ఆభరణాలు ఎలా ధరించ కలిగింది? బొమ్మ చూస్తున్న సమయంలో ఇందులో ఏ ఒక్క సందేహం మన మనస్సులో ఉత్పన్నం కాదు! ఏ కళ అయినా అది అచ్చంగా మన aesthetic sense ను ఆకట్టుకోవడానికే కానక్కరలేదు, దృశ్యమానంగా చూపరులను ప్రభావితం చేసే శక్తి ఆ కళకు ఉంటే చాలు, కళాకారుని సృజనాత్మకతను అందులో మనం గుర్తించగలం.
బొమ్మల్లో వ.పా. సృష్టించిన అందం అతని బొమ్మల్లో ఉంది, అది మనుషులలో లేదు వ.పా. చిత్రాలలో ఏదో తెలియని ఆకర్షణ ఉండేది, అతని చిత్రకళలో శిల్పం నిర్దుష్టంగా వుంటుంది. అదే మనల్ని మాయాజాలంలో ముంచెత్తుతుంది. ఆయన బొమ్మల్లోని రేఖలు నాట్య విన్యాసంతో కదులుతుంటాయి. నిల్చున్న భంగిమలో, ధరించిన దుస్తులు, వేసుకున్న ఆభరణాలలో, శరీరం వంపు సొంపులలో వ.ప. భావుకత కనిపించేది. వ.పా. తనదైన ఒక విశిష్ట పధ్ధతిలో కథల్లోని. సన్నివేశాలు అద్భుతంగా రూపు కడతారు, నాటకీయతతో పండిస్తారు, అపురూపమైన భావచిత్రాలతో పురాణాలలోని పాత్రల ను వ్యక్తం చేస్తారు ముఖ్యంగా అతను వాడిన దట్టమైన రంగుల మిశ్రమం ఆ అనుభూతిని కలిగిస్తూ, రసానుభూతికి లోనుచేస్తుంది. . అతనిది నిజంగా విలక్షణమైన శైలి.

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
