స్వేచ్ఛ ఖరీదెంత?

(నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-మళ్ళ కారుణ్య కుమార్

నా కళ్ళు ఆమె కోసమే వెతుకుతున్నాయి!. నా రాక కోసం ఎప్పుడూ వేయి కళ్ళతో ఎదురుచూసే ఆమె ఇప్పుడు కనిపించడం లేదు. కాస్త నిరాశ చెందాను.

“నైమిశ! ఎలా ఉన్నావు. ఎన్ని రోజులైంది నిన్ను చూసి.” ఆప్యాయంగా నా బుగ్గలు నిమిరి, నన్ను గట్టిగా వాటేసుకున్న అమ్మ స్పర్శతో ఒక్కసారిగా ఆలోచనలు నుండి బయటకు వచ్చాను. అమ్మ వైపు చూసి, చిరునవ్వు చిందిస్తూ, “నేను బాగానే ఉన్నాను అమ్మ.” మరింత గాఢంగా కౌగలించుకుంటూ అన్నాను. నన్ను చూసి మురిసిపోతూ, “ఎలా ఉన్నారు మేడం.” నవ్వుతూ అడిగారు నాన్న. “ఏంటి నాన్న నన్ను మేడం అంటున్నారు? ఏమిటి ఈ కొత్త పిలుపు.” ఆశ్చర్యంగా అడిగాను.

“ఇప్పుడు తమరు మా అందరి కంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్నారు కదా, మరి మేడం అని పిలవాలి కదా.” నన్ను చూసి గర్వపడుతూ ఉబ్బితబ్బిబ్బివ్వడం నాన్న కళ్ళలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
చెంగున అమ్మ కౌగిలి నుండి విడిపించుకొని వేగంగా నాన్న దగ్గరకు చేరుకున్నాను. “నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీరే కదా నాన్న!.” అంటూ నాన్న ఎదురుగా నిలబడ్డాను. ఆప్యాయంగా నా తల నిమురుతూ, ” నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆడపిల్లలంటే ఎందులోనూ తక్కువ కాదని నువ్వు నిరూపించి, నలుగురికీ ఉపాధి కల్పించే స్థాయికి నువ్వు చేరుకోవాలి.” అని ఎప్పుడూ చెప్పే
మాటే మళ్ళీ చెప్పారు.

మాట్లాడుతూ, చుట్టూ పరికించి చూసాను. టక్కున ఏదో గుర్తొచ్చి నట్టుగా, “నాన్న ఇప్పుడే వస్తాను.” అని చెప్పి పక్కనే ఉన్న పూల వనంలోకి చేరుకున్నాను. ఎప్పటి కంటే అందంగా పువ్వులు వనం మొత్తం వ్యాపించి నన్ను పలకరిస్తునట్టుగా పిల్ల గాలులకు ఊగుతూ ఉన్నాయి. ఆ వనం తో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆ వనంలో కూర్చోబెట్టుకొని కథలు చెబుతూ, ఎప్పుడైనా నేను అలిగితే బుజ్జగిస్తూ తన దగ్గరకు తీసుకున్న నాన్నమ్మతో ముచ్చటించిన క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. ఆమె కోసం మొత్తం వనం అంతా వెతికాను. ఆమె ఎక్కడా కనపడటం లేదు. ఇంకాస్త నిరాశ పడుతూ వెనుతిరిగాను. నాన్న దగ్గరకు చేరుకుంటూ, “ఎక్కడ పెద్ద మేడం లలితాంబ గారు! కనిపించడం లేదు?.” అని అడిగాను.

“అమ్మ మోటివేషన్ క్లాసులకు కు వెళ్లివుంటుందమ్మ, బిజీ షెడ్యూల్ కదా.” అని బదులు ఇచ్చారు నాన్న.

“నేను వస్తున్నట్టు నానమ్మ కు తెలుసు కదా, ఎప్పుడూ నా రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుండేది. కానీ ఈరోజు తాను ఇంట్లో కూడా లేదు.” చిన్నబుచ్చుకుంటూ అడిగాను.

“తల్లి, చెప్పాను కదా అమ్మకు బిజీ షెడ్యూల్ వుందని, వస్తుంది లే.” అని సర్ది చెప్పి ఇంటి లోపలకు తీసుకు వెళ్ళడానికి సిద్దం అయ్యారు నాన్న. ఆ రోజు సరదా కబుర్లతో సాయంత్ర సమయం  సమీపించింది. నేను క్షణానికి ఒకసారి గుమ్మం వైపు చూస్తున్నాను నాన్నమ్మ రాక కోసం. ఎట్టకేలకు నాన్నమ్మ వస్తూ కనిపించింది. చెంగున లేడి పిల్లలా ఎగురుతూ నాన్నమ్మ దగ్గరకు చేరుకొని చుట్టేస్తూ, “నాన్నమ్మ నేను వచ్చేశాను. నా కోసం నువ్వు ఎదురుచూస్తూ ఉంటావని అనుకున్నాను. కానీ నువ్వు నా రాక గురించి తెలిసి కూడా ఎక్కడికో వెళ్ళిపోయావు.” ముఖం వేలాడేస్తూ అడిగాను. నా అలక చూసి, “క్షమించాలి బంగారం! కాస్త క్లాసులు ఎక్కువగా ఉండడం కారణంగా ఉండలేక పోయాను. ఏం చేస్తాను.” అని నన్ను బుజ్జగిస్తూ, “సరే తర్వాత మాట్లాడుదాం.” అని అక్కడ నుండి తన రూంకి చేరుకుంది నాన్నమ్మ.

నాన్నమ్మ వెళ్లిపోవడంతో నాన్నమ్మ వైపు చూస్తూ, ‘నాన్నమ్మ చాలా మారిపోయింది. అసలు నన్ను పట్టించుకోవడం లేదు.’ అని నాలో అనుకుంటూ అక్కడ నుండి లోపలికి చేరుకున్నాను. రాత్రి భోజనం చేసిన తర్వాత నాన్న రామచంద్ర , అమ్మ జానకితో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కానీ లలితాంబ నాన్నమ్మ మా వైపు రాకుండా తన రూం వైపుకు వెళ్ళిపోయింది. ఎప్పుడూ భోజనం చేసిన తర్వాత దగ్గరకు చేర్చుకొని ఎన్నో విషయాలు చెప్పే నాన్నమ్మ ఇలా వెళ్లిపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అమ్మానాన్నతో కాసేపు మాట్లాడి నిద్రకు ఉపక్రమించడానికి సిద్దం అయ్యాను. కానీ నిద్ర రాకపోవడం తో నాన్నమ్మ దగ్గరకు వెళ్ళాలని నిర్ణయం తీసుకొని నాన్నమ్మ గది దగ్గరకు చేరుకున్నాను. అప్పటికి నాన్నమ్మ ఇంకా మేల్కొనే ఉంది. ఎవరితో మాట్లాడటం రూం బయట నిల్చొని వున్న నాకు  వినిపిస్తున్నాయి.

“మీరేం బాధపడకండి! మీ అమ్మాయికి నేను తోడుగా ఉంటాను. మీ అమ్మాయికి న్యాయం జరిగేలా చేస్తాను.” అని బుజ్జగిస్తూ, ఏవేవో వివరాలు అడుగుతూ కొంత సమయం అయిన తర్వాత ఫోన్ పెట్టేసింది నాన్నమ్మ. నేను మెల్లగా నాన్నమ్మ దగ్గరకు చేరుకున్నాను. నన్ను చూసి, “ఏంటి ఇంకా నిద్రకు ఉపక్రమించలేదా” అని అడిగింది నాన్నమ్మ.

“లేదు నాన్నమ్మ ఎందుకో నిద్ర రావడం లేదు.” అని సమాధానం ఇస్తూ, “నాన్నమ్మ! ఎవరితో సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నట్టుగా ఉన్నావు? అసలేం జరిగింది?.” అని అడిగాను.

నా ప్రశ్నకు నా వైపు చూస్తూ, “నైమిశ ఒక మాట అడుగుతాను చెప్తావా?.” అడిగింది నాన్నమ్మ.

చెప్తాను అన్నట్టుగా తలూపాను.

“స్వేచ్ఛ అంటే ఏమిటి?.” అడిగింది నాన్నమ్మ.

ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. నాకేం అర్ధం కావడం లేదు? నాన్నమ్మ ఎందుకు ఆ ప్రశ్న వేసిందో అని. నేను మౌనంగా ఉండడంతో, “చాలా సార్లు నాకు ఫ్రీడం లేదు, లేదు అని గొడవ చేసే
దానివి. ఆ స్వేఛ్ఛను సాధించావు కూడా. ఇప్పుడు ఆ స్వేఛ్ఛకు అర్ధం చెప్పలేక పోతున్నావు?.” అడిగింది నాన్నమ్మ.

కొంత సమయం ఆగి, “నాన్నమ్మ! ఎప్పుడూ ఇలాంటి తికమక ప్రశ్నలుతో నన్ను తికమక పెడుతూ ఉంటావు. అసలు విషయం ఏమిటో చెప్తావా లేదా?.” అసహనంతో అడిగాను.

“చెప్తాను! తెలిసిన అమ్మాయి, ఒక మోసగాడి కపట ప్రేమ ఉచ్చులో చిక్కుకొని చివరికి మోసపోయింది. ఆమెకు ఇప్పుడు మూడవ నెల. చనిపోదాం అని నిర్ణయం తీసుకుంది, విషయం నా దృష్టికి వచ్చింది. ఆమెకు ధైర్యం చెప్పి ఆమెకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను.” అసలు విషయం చెప్పింది నాన్నమ్మ.

కాసేపు స్తబ్దుగా ఉండిపోయాను. కొంత సమయం తర్వాత, “ఆ అమ్మాయిని అంత గుడ్డిగా అతన్ని ఎవరు నమ్మమని చెప్పారు. ఇప్పుడు చూడు ఆమె పరిస్థితి.” అని అన్నాను.

“అదంతా ఇప్పుడు అనవసరం. జరగాల్సింది చూడాలి ఆమెకు న్యాయం జరగాలి.” అని అంది నాన్నమ్మ.

“చక్కగా పోలీసు కంప్లయింట్ ఇస్తే సమస్య తీరిపోతుంది.” సలహా ఇచ్చాను నేను.

“ఇవ్వొచ్చు, కానీ విషయం బయట పడితే అమ్మాయికి అపనింద వస్తుందని ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు. మొత్తం ప్రయత్నం చేసి, అప్పటికి కూడా లాభం లేక పోతే అప్పుడు లీగల్ గా ప్రొసీడ్ అవుదాం అని చెప్పాను.”

“ఈ తలనొప్పి అంతా నీకు ఎందుకు నాన్నమ్మ! వాళ్ల సంగతి ఏదో వాళ్ళు చూసుకుంటారు కదా.”

“అలా అంటే ఎలా? అమ్మాయికి న్యాయం జరగాలి. నేను నీలా ఆలోచించ లేను.”

నాన్నమ్మ సమాధానంతో నా మనస్సు బాధపడింది. ‘ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోదు కానీ ఇతరుల గురించి మాత్రం పట్టించుకుంటుంది.’ అని లోలోపల అనుకుంటూ కోపంతో ఆ రూం నుండి బయటకు వచ్చేసాను. ఎప్పటిలానే నాన్నమ్మ మరుసటి రోజైనా నాకు సమయం కేటాయిస్తుందని ఆశ పడ్డాను. ఎన్నో విషయాలు నాన్నమ్మ తో చెప్పి ఆనందించాలనుకున్నాను. కానీ నాన్నమ్మ నన్ను పట్టించుకోకుండా తన పనుల్లో తలమునకలవుతూ తిరుగుతుంది. ఈసారి ఎలాగైనా నాన్నమ్మ తో గొడవ పడైనా,నాన్నమ్మ ను నాలుగు రోజులు ఇంటి పట్టున ఉండేలా చేయాలనుకున్నాను. ఎప్పటిలానే రోజంతా తన పనులకు కేటాయించి, పనులు పూర్తి చేసుకొని రాత్రి సమయానికి ఇంటికి చేరుకుంది నాన్నమ్మ. నాన్నమ్మ దగ్గరకు చేరుకున్నాను. మళ్ళీ ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ కనిపించింది. సందేహం లేదు ఆ అమ్మాయి గురించే అని నాన్నమ్మ మాటలు విన్న తర్వాత అర్దం అయింది. నాన్నమ్మ ఫోన్ మాట్లాడటం పూర్తి చేసే వరకు వేచి చూసాను. ఫోన్ మాట్లాడడం పూర్తి చేసి నా వైపు చూసి, “ఏంటే అలానే చూస్తూ నిల బడ్డావు వచ్చి కూర్చో.” అని అంది నాన్నమ్మ.

“నాన్నమ్మ నీ పద్ధతి నాకేం నచ్చడం లేదు. చాలా రోజులు తర్వాత నేను వస్తె నన్ను పట్టించుకోకుండా నీ పనులు చూసుకుంటూ తిరుగుతావా? నాకంటే నీకు ఆ పనులే ఎక్కువ అయ్యాయా.” అని ప్రశ్నించాను.

సమాధానం చెప్పకుండా ఆలోచనలో పడింది. నాన్నమ్మ వైపు చూస్తూ, “నాకు బాగా అర్థమైంది!. ఆ అమ్మాయి సమస్య తేలే వరకు నువ్వు నన్ను పట్టించుకోవు అని. అలాగే కానివ్వు, నేను కూడా నీతో  జాయిన్ అవుతాను. ఆ అమ్మాయి సమస్య తీర్చడానికి నీకు సహాయ పడతాను. అప్పుడైనా నాకు సమయం కేటాయించడానికి నీకు తీరిక దొరుకుతుంది. రేపే ఆమె దగ్గరకు వెళ్దాం.” అని నాన్నమ్మ తో అన్నాను. నా మాటలు విని కంగారు పడుతూ, “నువ్వు అక్కడికి వస్తావా? అవసరం లేదు.” అని నన్ను అడ్డుకోవడానికి చూసింది. “నువ్వు ఎన్ని చెప్పినా నేను వినదలుచుకోలేదు. నేను నీతో పాటు వస్తున్నాను.” అని చెప్పి అక్కడ నుండి వచ్చేసాను.

మరుసటి రోజు నాన్నమ్మ కంటే ముందే లేచి సిద్దంగా ఉన్నాను. నాన్నమ్మ తన పనులు పూర్తి చేసుకొని వచ్చి, నన్ను చూసి నిలబడి, “వస్తాను అని నిర్ణయం తీసుకున్నావు అన్నమాట! అలాగే కానివ్వు. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది.” అని అంటూ అక్కడ నుండి బయలుదేరింది నాన్నమ్మ. నాన్నమ్మ మాటలు అర్దం కాక ఆమెను అనుసరించాను. కొంత సమయానికి ఒక ఇంటి దగ్గర మా కారు ఆగింది. దిగి ఆ ఇంటి వైపుకు నడిచింది నాన్నమ్మ. నేను అనుసరించాను. ఆ ఇంట్లో వాళ్ళు నాన్నమ్మను చూసి లోపలికి ఆహ్వానిస్తూ నన్ను ఆశ్చర్యంగా చూడటం నా కంట పడింది. ఆ అమ్మాయి దగ్గరకు
చేరుకున్నాం. దుఃఖంతో ఆమె కళ్ళు బాగా లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి. ఆమె ముఖం కళ తప్పి నీరసంగా తయారు అయ్యింది. ఆమె వైపు చూస్తూ, “నాన్నమ్మ! ఈమేనా ఆ అమ్మాయి. నేను మాట్లాడుతాను.” అని ఆమె దగ్గరకు చేరుకొని,

“మీ గురించి నాన్నమ్మ దగ్గర విన్నాను. అతను ఎవరో నాతో చెప్తారా?.” అతను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఆమె అతని గురించి ప్రస్తావించకుండా, “నేను మోస పోయాను. అతను నన్ను అన్నీ విధాలుగా వాడుకొని, ఇప్పుడు వేరే అమ్మాయి తో వున్నాడు.” ఆమె చెప్పింది.

“ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా! ఆ అమ్మాయికి ఈ విషయం తెలిస్తే అతన్ని వదిలేస్తుంది కదా!. ఆ అమ్మాయి తో నేను మాట్లాడుతాను” భరోసాగా అన్నాను.

ఉబికి వస్తున్న తన కన్నీళ్లను ఆపుకుంటూ, “అది ఎవరో కాదు మీరే.” అని ఆమె చెప్పింది. అర్దం కాక మళ్ళీ ప్రశ్నించాను.

“అవును నేను చెప్తున్నది నిజమే. మీతో ప్రేమలో ఉంటూ లివింగ్ టుగెదర్ రిలేషన్ నడుపుతున్న రాజేష్ నన్ను ప్రేమించి నన్ను మోసం చేశాడు.” ఏడుస్తూ చెప్పింది ఆమె. ఆ మాటను జీర్ణించుకోలేక పోయాను, “లేదు నువ్వు అనవసరంగా నిందలు వేస్తున్నావు. రాజేష్ గురించి నాకు బాగా తెలుసు.” కోపంతో పలికాను.

“నువ్వు ఎంత అరిచినా ఆ అమ్మాయి చెప్పేది నిజం! రాజేష్ ఒక మోసగాడు. నేను పూర్తి వివరాలు సేకరించాను. అమ్మాయిలను ఆట బొమ్మలా చూస్తూ వాళ్ళను వాడుకొని వదిలేయడం అతని నైజం. ఈ అమ్మాయి వాడి మాయలో పడి జీవితం బలి చేసుకుంది. కాస్త ఆలస్యం అయి ఉంటే నీ జీవితం కూడా ఇలానే అయ్యేది.” అని అంది నాన్నమ్మ.

“నాన్నమ్మ! అది కాదు, నేను చెప్పేది విను.” ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఒక్కసారిగా నా చెంప పై చెళ్ళున నాన్నమ్మ చేయి తాకింది. బుగ్గ పై చేయి పెట్టుకొని తల దించుకున్నాను. అప్రయత్నంగా నా కళ్ళు కన్నీటిని కార్చడం మొదలు పెట్టాయి.

“ఆ అమ్మాయి నీ వివరాలు తెలుసుకొని చివరికి నా దగ్గరకు వచ్చి జరిగింది చెప్పి న్యాయం చేయమని ప్రాధేయపడింది. నిన్ను కాపాడుకోమని హితవు పలికింది. విషయం మీ అమ్మ నాన్న వరకు వెళ్లకుండా నేను జాగ్రత్త పడ్డాను. ఒకవేళ మీ అమ్మానాన్నలకు ఈ విషయం తెలిసి ఉంటే వాళ్ల పరిస్థితి ఏమిటి? వాళ్ల పరిస్థితే కాదు, తమ కూతురు పెళ్లి కాకుండా ఇంకో అబ్బాయితో రూం షేరింగ్ చేసుకుంటుందని తెలిస్తే ఏ తల్లితండ్రులు అయినా ఎలా భరిస్తారు. మీరేదో ఉద్దరిస్తారన్న నమ్మకం తో మిమ్మల్ని దూరాలకు పంపిస్తారు. మీరు ఇలాంటి పిచ్చి పనులు చేసి, చివరికి వాటిని ఇంటి మీదకు తెస్తారు. అసలు మీరు ఎటు నడుస్తున్నారు. సమాజానికి మీరు ఇస్తున్న సందేశం ఏమిటి?”

నాన్నమ్మ మాటలు నా మనస్సును తొలిచేస్తున్నాయి. కొంత సమయం నా తల స్తంభించినట్టు అయిపోయింది. నా తప్పు తెలుసుకొని, “నన్ను క్షమించు నాన్నమ్మ” అంటూ నాన్నమ్మ కాళ్ళ పై పడ్డాను.

“నైమిశ! స్వేఛ్ఛ అంటే ఉన్న రెక్కలను నరుక్కోవడం కాదు. కలల సౌధం వైపు స్వేఛ్ఛ రెక్కలతో అడుగులు వేస్తూ, కల సాకారం చేసుకోవడం. ఇప్పటికైనా స్వేఛ్ఛ కి అర్దం తెలుసుకొని, క్రమ శిక్షణ తో నడుచుకుంటావు అని ఆశిస్తున్నాను. ఇప్పటికీ కూడా నీలో సత్ప్రవర్తన రాలేదు అంటే నీ ఖర్మ. అలాగే ఈ అమ్మాయిని ఆ రాజేష్ ను కలిపే బాధ్యత నీదే. ఎందుకంటే ఈ అమ్మాయి ద్వారా నిజం తెలిసి, నీ బ్రతుకు ప్రమాదం నుండి బయట పడింది. ప్రతి సారీ నిన్ను కాపాడేందుకు ఈ నానమ్మ రాదు.” అని అంటూ నన్ను హెచ్చరించింది నాన్నమ్మ.

*****

Leave a Reply

Your email address will not be published.