ప్రమద

నైక నాయిక – ఫాల్గుణి నాయర్

-నీరజ వింజామరం

జీవితంలో మనం ఎక్కడి దాకా  వచ్చామన్నది ముఖ్యమే.

కానీ కొన్ని సందర్భాల్లో అంతకంటే ముఖ్యమైన ప్రశ్న—

“ఇక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్లగలను?”అనేదే.

ఆ ప్రశ్న నుంచే ఒక కొత్త ప్రయాణం మొదలవుతుంది.

భారతీయ సమాజంలో ఒక మహిళకు యాభై ఏళ్ల వయసు  అంటే …….

పిల్లల చదువులు పూర్తవుతున్న వయసు. ఇంటి బాధ్యతలు కొంత తీరిన వయసు. ఎన్నో సందర్భాల్లో తనకోసం కేటాయించుకున్న కలలను పక్కన పెట్టి, కుటుంబం కోసం జీవించిన సంవత్సరాలను వెనక్కి తిరిగి చూసుకునే వయసు. మన సంస్కృతిలో అయితే, ఈ దశను చాలాసార్లు “విశ్రాంతి దశ ”గా మాత్రమే చూస్తాం.

కానీ ఒక మహిళ యాభై ఏళ్ల వయసులో తన వృత్తి జీవితానికి కొత్త ఆరంభం ఇస్తే?

కొన్ని విజయగాథలు చిన్న వయసులోనే ప్రారంభమవుతాయి. మరికొన్ని జీవితంలో ఎన్నో సంవత్సరాల అనుభవం, బాధ్యతలు, విజయాలు దాటిన తర్వాత మొదలవుతాయి. ఫాల్గుణినాయర్ కథ రెండో రకానికి చెందుతుంది.యాభై ఏళ్ల వయసులో ఒక స్థిరమైన కార్పొరేట్ జీవితాన్ని వదిలి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం—ఇది కేవలం ఒక వ్యాపారం కోసం తీసుకున్ననిర్ణయం కాదు; తన జీవితంలో మరో అధ్యాయాన్ని తానే రాసుకోవాలని తీసుకున్ననిర్ణయం.

ఫాల్గుణి సంజయ్ నాయర్ 1963 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని ముంబైలో ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఒక చిన్న బేరింగ్ కంపెనీని నిర్వహించేవారు, ఆయనకు వ్యాపారంలో ఆమె తల్లి కూడా సహాయపడేది. చిన్నతనం నుంచే ఇంటి వాతావరణంలో వ్యాపార మెళకువలను గమనించిన ఫాల్గుణి, విద్యాభ్యాసంలోనూ విశేష ప్రతిభ కనబరిచారు. ముంబైలోని ప్రముఖసిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్నుండి బి.కామ్ (B.Com) పట్టా పొందిన ఆమె, 1985లో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) అహ్మదాబాద్నుండి ఎంబీఏ (MBA) పూర్తి చేశారు. 1987లో బిజినెస్ స్కూల్ మిత్రుడు సంజయ్ నాయర్‌ను ఆమె వివాహమాడారు.

తన కెరీర్ ప్రారంభంలో ‘ఎ.ఎఫ్. ఫెర్గ్యూసన్ అండ్ కంపెనీ’లో కన్సల్టెంట్‌గా పనిచేసిన ఫాల్గుణి, 1993లో కోటక్ మహీంద్రా గ్రూప్‌లో చేరారు. అక్కడ M&A బృందానికి నాయకత్వం వహించడమే కాకుండా, లండన్ మరియు న్యూయార్క్‌లలో కోటక్ ఈక్విటీ కార్యాలయాలను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. 2005 నాటికి కోటక్ మహీంద్రా క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, కోటక్ సెక్యూరిటీస్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, 18 ఏళ్లకు పైగా బ్యాంకింగ్ రంగంలో విశేష సేవలు అందించారు.

మరి  ఇంతటి స్థిరమైన జీవితాన్ని ఫణంగా పెట్టి  కొత్తగావ్యాపారం ఎందుకు ప్రారంభించాలి?

అదే ఫాల్గుణినాయర్ కథలోని ఆసక్తికరమైన మలుపు.

2012లో తన 50 ఏళ్ల వయసులో ఎవరికీ కనిపించని ఒక అవకాశాన్నిఆమె చూశారు. ఆ సమయంలో భారతదేశంలో ఆన్‌లైన్ ద్వారా అందం, వ్యక్తిగత సంరక్షణ (Beauty & Personal Care) ఉత్పత్తులు లభించే నమ్మకమైన వేదికలు లేకపోవడాన్ని ఆమె గమనించారు.ఆ లోటును పూరించేందుకు కోట్ల రూపాయల జీతాన్నిచ్చే MD పదవికి రాజీనామా చేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ‘FSN E-Commerce Ventures’ (ఆమె పేరులోని మొదటి అక్షరాలతో) ప్రారంభించి, దానికి ‘Nykaa’ అని నామకరణం చేశారు.

అలా Nykaa ఒక డిజిటల్-ఫస్ట్ బ్యూటీ రిటైల్ సంస్థగా ప్రారంభమైంది.

‘Nykaa’ అనే పేరు సంస్కృతంలోని ‘నాయిక’అనే పదం నుంచి వచ్చింది. వెలుగులో నిలిచే వ్యక్తి అనే భావనతో ఈ పేరు ఏర్పడింది.కేవలం ముగ్గురు ఉద్యోగులతో, 60 ఉత్పత్తులతో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్, నాణ్యత మరియు అసలైన బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయంలో ఎప్పుడూ రాజీపడలేదు.

తొలిదశలో అందం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై దృష్టి పెట్టిన సంస్థ క్రమంగా ఫ్యాషన్, పురుషుల ఉత్పత్తులు, B2B వంటి విభాగాలకూ విస్తరించింది.

అయితే ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం ఒక ఎత్తు ; దానిపై వినియోగదారుల నమ్మకాన్ని పొందడం మరో ఎత్తు.

బ్యూటీ ఉత్పత్తుల విషయంలో నాణ్యత, భద్రత కీలకం. తన ప్లాట్‌ఫారమ్‌లో ఉత్పత్తులు, బ్రాండ్ల నుంచి లేదా వారి అధీకృత పంపిణీదారుల నుంచి పొందుతున్నామని, వాటి నాణ్యతకు  ప్రాధాన్యం ఇస్తామని Nykaa పేర్కొంటుంది.వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లను నేరుగా అందించడమే లక్ష్యంగా Nykaa పనిచేసింది.

Nykaa ఎదుగుదలతో భారతదేశంలోని బ్యూటీ రిటైల్ రంగం కూడా మారింది.

సౌందర్య ఉత్పత్తుల కొనుగోలులో వినియోగదారులకు నేరుగా చూసి, పరీక్షించే (Shade Matching) అనుభవం ముఖ్యమని గ్రహించిన ఫాల్గుణి, ఆన్‌లైన్‌తో పాటు భౌతిక స్టోర్లను కూడా ప్రారంభించే ఓమ్నీచానెల్ (Omnichannel) మార్గాన్ని ఎంచుకున్నారు. నైకా లక్స్ (Nykaa Luxe), నైకా ఆన్ ట్రెండ్ (Nykaa On Trend) పేరిట దేశవ్యాప్తంగా వందలాది స్టోర్లను నెలకొల్పారు. ప్రస్తుతం నైకా ప్లాట్‌ఫామ్‌లో1,900 పైగా ప్రముఖ బ్రాండ్లకు చెందిన 1,20,000కంటే ఎక్కువ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

2020లో భారతదేశంలో ఒక మహిళ నేతృత్వంలో ‘యూనికార్న్’ (Unicorn) హోదా సాధించిన మొదటి స్టార్టప్‌గా నైకా చరిత్ర సృష్టించింది.2021 నవంబర్‌లో Nykaa స్టాక్ మార్కెట్‌లో IPOగా ప్రవేశించినప్పుడు సంచలనం సృష్టించింది.అతి తక్కువ సమయంలోనే దాదాపు 13 బిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యుయేషన్‌ సాధించి, భారతీయ కార్పొరేట్ చరిత్రలోనే ఓ మహిళా వ్యాపారవేత్త నేతృత్వంలోని సంస్థగా రికార్డు నెలకొల్పింది.

ఈ చారిత్రాత్మక విజయంతో ఫాల్గుణి నాయర్ రూ. 50,000 కోట్లకు పైగా నికర సంపదతో భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన ‘సెల్ఫ్-మేడ్’ మహిళా బిలియనీర్‌గా నిలిచారు.

వ్యాపార రంగంలో ఆమె సాధించిన అత్యుత్తమ ప్రగతికి గానుఈవై (EY) ‘ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2021’ పురస్కారంతో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ గౌరవాలను అందుకున్నారు.

ఫాల్గుణి నాయర్ ప్రయాణంలో మరో ఆసక్తికరమైన అంశం కుటుంబం. ఆమె భర్త సంజయ్ నాయర్ కూడా ప్రముఖ ఆర్థికరంగ నిపుణుడు. కేకేఆర్ (KKR) ఇండియా మాజీ సీఈఓ మరియు ప్రస్తుతం సోరిన్ వెంచర్స్ సహ-వ్యవస్థాపకులు. వీరి కవల పిల్లలు అద్వైత నాయర్ (నైకా ఫ్యాషన్ సీఈఓ) మరియు అంచిత్ నాయర్ (రిటైల్&ఈ-కామర్స్ అధిపతి) కూడా సంస్థ నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఫాల్గుణినాయర్ పేరు తరచుగా సంపన్న మహిళ , బిలియనీర్ హోదా, Nykaa విలువ వంటి అంశాలతో కూడిన వార్తల్లో కనిపిస్తుంది. 2025 Forbes India Rich Listలో ఆమెను $4.2 బిలియన్ల నికర సంపదతో 71వ స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు.

కానీ ఆమె కథను కేవలం ‘సంపన్న మహిళ’ కథగా చూడటం కొంచం సంకుచితమే.

భారతీయ సమాజంలో వయసు పెరిగేకొద్దీ మహిళలపై అంచనాలు కూడా మారుతుంటాయి.

యువతలో కెరీర్ గురించి మాట్లాడటం సహజం. కానీ నలభై, యాభై దాటిన తర్వాత ఒక మహిళ “నేను కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్నాను” అంటే, ఆమెకు ఎదురయ్యే మొదటి ప్రశ్న చాలా సందర్భాల్లో—

“ఇప్పుడెందుకు?”

అదే ప్రశ్న పురుషుడిని అడిగినప్పుడు మన స్పందన అలాగే ఉంటుందా?

ఇది ఒక సామాజిక ప్రశ్న. దీనికి ఒకే  సమాధానం ఉండకపోవచ్చు. ప్రతి కుటుంబ పరిస్థితి వేరు. ప్రతి వ్యక్తి ఆర్థిక పరిస్థితి వేరు. ప్రతి ప్రారంభానికి ప్రమాదాలు, అవకాశాలు వేరు.

వ్యాపార ప్రపంచంలో కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేది  యువతే అనిసాధారణభావన. కానీ నాయర్ ప్రయాణం ఆ భావనను ప్రశ్నిస్తుంది. ఆమె అప్పటికే దాదాపు రెండు దశాబ్దాల కార్పొరేట్ అనుభవాన్ని సంపాదించారు. ఆ అనుభవాన్నే కొత్త రంగంలో ఉపయోగించారు.

అంటే ఇది ‘కొత్తగా మొదలుపెట్టడం’ కాదు.అనుభవాన్ని కొత్త కలకు పెట్టుబడిగా మార్చడం.

“ఇప్పటికే సాధించింది చాలదా?”అనే ప్రశ్నకు ఆమె జీవితం ఇచ్చిన సమాధానం nykaa.

అయితే ఫాల్గుణినాయర్ కథను “వయసు గురించి ఆలోచించకుండా ఏదైనా చేసేయండి” అనే సరళమైన ప్రేరణాత్మక సందేశంగా మార్చడం కూడా సరైంది కాదు.

ఆమె విజయం వెనుక విద్య ఉంది. దాదాపు రెండు దశాబ్దాల పెట్టుబడి బ్యాంకింగ్ అనుభవం ఉంది. మార్కెట్‌పై అవగాహన ఉంది. వ్యాపార నిర్వహణలో అనుభవం ఉంది. అంతేకాదు, కొత్త రంగంలోకి అడుగుపెట్టే సమయంలో ఎదురయ్యే అనిశ్చితిని స్వీకరించే ధైర్యమూ ఉంది.

వ్యాపారంలో విజయం సాధించడానికి అనుభవం, వయస్సు కంటే సంసిద్ధత, దూరదృష్టి ఎంత ముఖ్యమో, నమ్మకం, పట్టుదల ధైర్యం కూడా అంతే ముఖ్యమని ఫాల్గుణి నాయర్ జీవితం నిరూపిస్తుంది. “కలలు కనడానికి ఏ వయస్సైనా సరైనదే; నేర్చుకోవడానికి, రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆకాశమే హద్దు”అనే భావనను ఆమె ప్రతి అడుగులో చాటిచెప్పారు.

*****

Leave a Reply

Your email address will not be published.