
నది – ఒక రాగం
(నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– సత్యగౌరి మోగంటి
కొండల ఒడిలో పుట్టి
పాట పాడుకుంటూ వస్తుంది
అడుగులో అడుగు వేస్తూ
వయ్యారంగా
గోదారి అన్నా కృష్ణ అన్నా
ఆమె గొంతు ఒక్కటే
రాయి తగిలితే గలగలా
ఇసుక తాకితే సవ్వడిలేని
నిశ్శబ్దం
వేసవిలో ఒడ్డున నిలబడిచూస్తే
నీడలా సాగుతుంది సన్నగా
“నేనున్నాను” అని మాత్రమే చెబుతుంది
అరవకుండా
వర్షం పడితే నిండుతుంది
ఒడ్డు దాటి పొలాల్లోకి
పరుగెడుతుంది
అప్పుడు ఆమె కోపం కాదు
అది తన ప్రేమ పొంగి పొరలడం
రాత్రయ్యేసరికి చందమామని
దింపుకుంటుంది
నీళ్లలో వెండి పరుపు పరుస్తుంది
పగలైతే చేపలకు ఊయల కడుతుంది
పక్షులకు దాహం తీరుస్తుంది
ఆమె మనకు ఏం నేర్పుతుంది తెలుసా?
“ఇవ్వడం ఆపకు బిడ్డా” అని
“ఒదులుకోవడం నేర్చుకో బిడ్డా” అని
“నీ దారి నువ్వు చేసుకో బిడ్డా” అని
నది అంటే కేవలం నీళ్లు కాదు
అది కాలం యొక్క కదలిక
మనిషి యొక్క మనసు
నది ఒడ్డున కూర్చుంటే చాలు
జీవితం ఎంత సరళమో అర్థమవుతుంది
వచ్చేది రానీ, పోయేది పోనీ
మనం ప్రవహిస్తూనే ఉండాలి
*****

సత్యగౌరి మోగంటి కవయిత్రి. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ఎమ్.ఎ; బి.ఎడ్, బి.ఎల్. చదువుకున్నారు. కాకినాడకు చెందిన వీరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పదవీ విరమణ చేశారు. తెలుగు సాహిత్యంలోనూ, రచనావ్యాసంగంలోనూ అభిరుచి వున్న శ్రీమతి సత్యగౌరి, రేడియో ప్రసంగాలు, అడపా దడపా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.
