నా జీవన యానంలో- రెండవభాగం- 62

-కె.వరలక్ష్మి

నన్ను ఎక్కడికైనా ఎవరైనా మరీమరీ ప్రోత్సహించి పిలిస్తే తప్ప కదలబుద్ధికాదు.

సెప్టెంబర్ 25 సాయంకాలం మల్లీశ్వరి ఫోన్ చేసి విజయవాడలో జరిగే ‘ప్రరవే’ సమావేశానికి రమ్మని పిలిచింది, 26 ఉదయం మల్లీశ్వరి కారులో బులుసు సరోజిని, అమరజ్యోతిలతో కలిసి వచ్చింది. కంఫర్టబుల్ గా ఉంటుందని నన్ను డ్రైవరు పక్క సీట్లో కూర్చోమన్నారు. దారిలో ఏలూరు రోడ్డు దగ్గరకి మల్లీశ్వరి అమ్మ, నాన్నగార్లు వచ్చి పునుగులు, కారప్పొడి, కోవా కజ్జికాయలు ఇచ్చారు. అవి తింటూ ప్రయాణించి విజయవాడలో తాతినేని వనజ ఇంటికి చేరుకున్నాం. వనజ మాకోసం భోజనాలు సిద్ధంగా ఉంచింది. తిన్నాక బయలుదేరి అలకనంద ప్రచురణల అశోక్ బుక్ సెంటర్ అశోక్ కుమార్ గారింట్లో బేగ్స్ పెట్టుకుని రజనీకాంతరావు గార్ని చూడడానికి వెళ్లేం. వందేళ్లు పైబడ్డాయట ఆయనకి. పెద్దకొడుకింట్లో ఉంటున్నారు. అవతలి వైపున్న ఆయన గదిలోంచి జాగ్రత్తగా నడిపించుకొచ్చి ఇవతలింటిహాల్లో కూర్చోబెట్టారు కోడలు ప్రసూన. ఆ మధ్య ఒకసారి అజో-విభో సంస్థవారు ఈయనకు, మరోసారి రావు బాలసరస్వతీదేవి గారికి జీవనసాఫల్య పురస్కారాలు ఇచ్చినప్పుడు చూసాను. ఇప్పుడు వయసు పూర్తిగా లొంగదీసుకుంది. పసిపిల్లవాడి తీరు వచ్చేసింది. పాడమంటే పాడడం, నవ్వమంటే నవ్వడం. అందరం ఆయన్తో ఫోటోలు తీసుకుని తిరిగి వచ్చేం.

రాత్రి 10.30 కి ఎమెస్కో విజయకుమార్ గారు పంపించిన ఫుడ్ పేకెట్స్ పట్టుకుని ఏలూరు రోడ్డువైపు 24 కి.మీ. దూరంలో ఉన్న తెన్నేరులో ఊరి బైట పొలంలో అద్భుతంగా కట్టుకున్న దేవినేని మధుసూదనరావు గారింటికి ఆయన కారులో నేను, విమల, సరోజిని, నీల వెళ్లేం. ఆయన శ్రీమతి జయశ్రీగారు అంతరాత్రి మా భోజనాలు అయ్యేవరకూ మాతో టేబుల్ దగ్గరే కూర్చున్నారు. వారింట్లో ఎంతో సదుపాయంగా ఉన్న రూమ్స్ లో బోలెడన్ని కబుర్లు చెప్పుకొని నిద్రపోయాం. తెల్లారి లేస్తూనే పక్షుల కిలకిలారావాలు ఆహ్వానించగా గార్డెన్ లోకి నడిచేను. రకరకాల పూలమొక్కలు, చెట్లు, పూలు, పళ్లు, పాదులు, మొక్కల మధ్య కాలికి మట్టి అంటకుండా నిర్మించిన రహదార్లు, బోలెడుమంది ఆడ-మగ పనివాళ్లు, పశుసంపద, సొంతంగా గోబర్ గేస్ ప్లాంట్ లోపలికొస్తే అతిపెద్ద లైబ్రరీ, అందంగా అమర్చిన పుస్తకాలు, అతి సింపుల్ గా ఉన్న జయశ్రీగారు, ఆవిడ వండించి పెట్టిన తాటికుడుముల రుచి అన్నీ ఇప్పటికీ కళ్లల్లో కదిలేంతగా మనసుకు హత్తుకున్నాయి. ఆ అందాలు కొన్నిటిని ఫోన్ లో ఫోటోలు తీసుకున్నాను. ఉదయం 8.30 కి వాళ్లకి బై చెప్పేసి వాళ్ల కారులోనే సభ జరగబోతున్న విజయవాడ సిటీ గ్రంథాలయానికి వెళ్లేం. రోజంతా కవిత్వ పఠనాలు. 50 మంది పైగా కవితలు చదివేరు. ఉదయం సెషన్లో పాపినేని, పి.సత్యవతి, కొండేపూడి నిర్మల, సీతారాం విశ్లేషకులు. మధ్యాహ్నం సెషన్లో నేను, అరణ్యకృష్ణ, రజిత, మందరపు హైమవతి, దర్భశయనం శ్రీనివాసాచార్య విశ్లేషకులుగా స్టేజిపైన కూర్చున్నాం. కొన్ని మంచి కవితలు, చాలా వరకు అకవితలు విన్నాం. అంతలో గుంటూరులో జరిగిన జాషువా 120వ జయంతి సభనుంచి కె. శ్రీనివాస్ వచ్చేడు. అతన్తో మరో సమావేశం, పుస్తకావిష్కరణ జరిగాయి. రాత్రి 7.00 వరకూ అందరం ఒకర్నొకరు పలకరించుకుని బైటికి వచ్చి చూస్తే అమ్మేచోట పెట్టిన నా పుస్తకాలు ఎవరెవరో పట్టుకు పోయారు. తిరిగి ఎమెస్కో విజయకుమార్ గారింట్లో భోజనాలు 9.15 కి కారెక్కేం. డ్రైవర్ శ్రీను మంచి పిల్లవాడు. నెమ్మదైనవాడు. ఎక్కడా ఆపకుండా నడిపితే రాత్రి 12.30 కి జగ్గంపేట చేరుకున్నాం. అంతరాత్రి ప్రయాణం వద్దని అంటే ఉండిపోయారు. తెల్లారి 7.30 కి కాఫీలు మాత్రం తాగి బయలుదేరేరు.

అలా అప్పుడప్పుడూ బైటికి వెళ్లి ఒక చేంజ్ తో జీవితాన్ని నింపుకోవడం బావుంటుంది.

‘కష్టాలు మనుషుల్ని పునీతం చేస్తాయనే మనుషులున్నారు. అది నిజంకాదు. సాధారణంగా అవి మనుషుల్ని అల్పులుగా, దెబ్బలాడే మనుషులుగా, స్వార్థపరులుగా తయారుచేస్తాయి’ అనేది ‘సోమర్ సెట్ మామ్’ అభిప్రాయం. అది తన అనుభవం కావచ్చు. అదే నిజం కావాల్సిన అవసరం లేదు. ఎవరి అభిప్రాయాలు వారివి.

2015వ సంవత్సరం అక్టోబర్ నెల సగం వరకూ తూర్పుగోదావరి జిల్లా వేడితో అట్టుడికిపోయింది. అక్టోబర్ 14 సాయంత్రం హఠాత్తుగా మబ్బులు కమ్మి కుండపోతగా వర్షం కురిసింది. విరజాజులు కోసే నెపంతో డాబాపైకి వెళ్లి చాలా సేపు తడిసేను. అక్టోబర్ 17 రాత్రి 12.30 కి మా పెద్ద చెల్లి క్రిష్ణవేణి భర్త డెంటిస్ట్ శ్రీరామచంద్రమూర్తి కాలం చేసినట్టు 18 ఉదయం మా పెద్దతమ్ముడు ఫోన్ చేసి చెప్పేడు. మా చెల్లి కొడుకు తెలిసో తెలీకో ‘ఫర్వాలేదు, కష్టపడి రాకండి అన్నాడట కబురు చెప్పి. అంతే, వాళ్లు రావడం మానేసారు. అలా ఉంటాయి బంధుత్వాలు. నేను మాత్రం వెంటనే టేక్సీ చేయించుకుని దారిలో మాచిన్న చెల్లినీ మరిదినీ ఎక్కించుకుని తాడేపల్లి గూడెం వెళ్లి సాయంకాలం కార్యక్రమాలు ముగిసేవరకూ ఉండి వచ్చేను.

అక్టోబర్ 22 విజయదశమి రోజు అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అమరావతి పరిసరాల్లో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఏడాదికి మూడు పంటులు పండే అతిసారవంతమైన 35 వేల ఎకరాల భూమిని సేకరించి రాజధాని నిర్మాణానికి ప్రధానిని కూడా పిలిచి శంకుస్థాపన చేసారు. ఆ శంకుస్తాపనకి 400 కోట్ల రూపాయలు ఖర్చైందట.

అప్పటి ప్రభుత్వం ప్రజాస్వామిక విధానాన్ని మంటగలుపుతున్నందుకు నిరసనగా కేంద్రసాహిత్య అకాడమీ అందుకున్న రచయితలు తమ అవార్డులను తిరిగి ఇచ్చేసారు.

ఆ నవంబరు 15 న పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు ఫోన్ చేసి తన పేరుతో ప్రతీ సంవత్సరం ఇస్తోన్న పెద్దిభొట్ల సాహితీ పురస్కారం ఈ సంవత్సరం డిశంబర్ 15న విజయవాడలో నాకూ, వి. చంద్రశేఖర రావుకీ ఇవ్వబోతున్నామని చెప్పేరు. నేను ఆనందంతో కృతజ్ఞతలు చెప్పేను.

ఆ సంవత్సరం ఎండలు కాసి కాసి నవంబర్లో రైలు బళ్లు ఆగిపోయేట్టుగా వానలు కురిసాయి.

నవంబర్ 18న ఆయన పిలిస్తే ఆవంత్స సోమసుందర్ గారి పుట్టిన రోజుకి పిఠాపురం వెళ్లేను. మువ్వా శ్రీనివాసరావు, సీతారాం, చందుసుబ్బారావు, శాంతి నారాయణ, కె. జగదీష్, చిలుకూరి దేవపుత్రలు సన్మానగ్రహీతలు. సీతారాం మేనల్లుడు రమణని బొమ్మూరు తెలుగు యూనివర్శిటీ సెమినార్స్ కి వాళ్లమామయ్య వెంట వచ్చినప్పుడు చిన్నపిల్లవాడుగా చూసాను. ఇప్పటికి మంచి వక్తగా, అందమైన యువకుడుగా ఎదిగేడు, పిల్లలు ఆ వయసులో అలా ఆగిపోతే బావుంటారు. కాని, క్రమంగా ముదురు తేలతారు. ఆరోజు సోమసుందర్ గారు నన్ను దగ్గరకు పిలిచి ‘‘నీ అందం పొంకం అంతా ఏమైపోయింది? చాలా చిక్కిపోయేవు, మారిపోయేవు’’ అన్నారు. ఇప్పటివాళ్లకి అలా మాట్లాడడం నిషేధం కాని, మాముందు తరం వాళ్లు అలాగే మాట్లాడతారు. ‘‘వయసు మీద పడింది కదాండి, ఇంకా అలా ఎలా ఉండ గలను?’’ అన్నాను. నవంబర్ 29న ఇస్మాయిల్ స్మారక సభ కాకినాడ పి.ఆర్. డిగ్రీ కాలేజ్ లో జరిగింది. ఆ ఏడాది ఇస్మాయిల్ ఎవార్డు యాకూబ్ కి ఇచ్చేరు, మళ్లీ రచయితలు కొందర్ని కలిసి, భోజనాల తర్వాత మునిసిపల్ గెస్ట్ హౌస్ లో కబుర్లు, పాటలతో గడిపి వచ్చేను, ఆ రోజు హైలైట్ ఆదిత్య స్కూల్లో టీచర్ గా చేస్తున్న మాధవి పాటలు. చక్కని గొంతుతో మంచి లలితగీతాలు పాడింది.

డిశంబర్ 14న తన ఇంటికి రమ్మని పిలిచేరు పి. సత్యవతి గారు. రాత్రి 9 కి విజయవాడలో వారింటికి చేరుకున్నాను. 15 సాయంకాలం సత్యవతిగారి కారులో పెద్దిభొట్ల అవార్డు సభ జరిగే ప్రెస్ క్లబ్ కి వెళ్లేం. ఛీఫ్ గెస్ట్ సీతామహాలక్ష్మి గారు రావడం బాగా ఆలస్యం కావడంతో వక్తలకి ఎక్కువ టైం దొరకక సభ ఆదరాబాదరాగా ముగిసినట్టన్పించింది. నా రచనల మీద చినుకు రాజశేఖర్, చంద్రశేఖర్రావు రచనల మీద బి. తిరుపతి రావు మాట్లాడేరు. సన్మాన పత్రాలు, షీల్డ్స్, షాల్స్, చెరో పదివేలు మరియు దారిఖర్చులు ఇచ్చి పూలమాలలు, బొకేలతో చక్కని సన్మానం చేసారు పెద్దిభొట్ల వారు. సభముగిసేక తమ ఇంటికి రమ్మని పిలిచేరు కాని, సత్యవతి గారి భర్త హెల్త్ బాగా లేక మంచంలో ఉండడం, ఆయన భోజనానికి ఆలస్యం కావడంతో పెద్దిభొట్లవారికీ, ఆయన భార్యకీ మరోసారి వస్తానని చెప్పేసి వచ్చేసాను. సత్యవతి గారికి మరీ మరీ కృతజ్ఞతలు చెప్పి మర్నాడు ఉదయం 6 కి రత్నాచల్ ఎక్కి ఇంటికి చేరుకున్నాను.

2015 లో అమెరికా ప్రయాణం, తిరిగి వచ్చేక కూడా సరిగా రాత మీద దృష్టి పెట్టకపోవడంతో ‘ఆనాటి వాన చినుకులు’ సంకలనం కోసం రాసిన ‘అఘాడీ’ కథ ఒకటే ఆలిండియా రేడియోలో వచ్చింది.

అలా 2015 దీర్ఘంగా ప్రత్యేకంగా నడిచి ముగిసింది.

మా మనవడు కోమల్ ఇచ్చిన స్మార్ట్ ఫోన్ వలన 2016 జనవరి ఫస్ట్ బోలెడన్ని పిక్చర్ మెసేజెస్ తో ప్రత్యేకంగా అన్పించింది. జగ్గంపేటలో నా ఇల్లు, చుట్టూ మొక్కలు – చెట్లు, అవిపూసే పూలు, కాసేకాయలు, ఆకులు అన్నీ ప్రియమైనవే నాకు. వాటి మధ్య తిరుగుతూ వాటితో కబుర్లు చెప్పుకోవడం ఎంతో బావుంటుంది. అలాగే నా చుట్టూ కబర్డ్సోలో ఉన్న పుస్తకాలు నాకెంతో ప్రియమైనవి. అవి నాతో కబుర్లు చెప్తాయి. అవి మనల్ని బాధించవు. నాకు ఒంటరితనం అన్పించేది కాదు. ఏకాంత మౌనస్రోతస్వినిలో ఒక ఆశ్రమవాసం అన్పించేది.

*****

Leave a Reply

Your email address will not be published.