మా నాయనమ్మ కథలు-6

నాయనమ్మ – అటుకులు

-లక్ష్మిమదన్

ఆ రోజుల్లో తెలంగాణలో ఎక్కువగా టిఫిన్స్ తపాల రొట్టె, మొక్క జొన్న రొట్టె, జొన్న రొట్టె , ఉప్పుడు పిండి సంగటి చేసే వాళ్ళు.

ఉదయం అల్పాహారం చేయడం మా ఇంట్లో తక్కువే!ఎక్కువగా అటుకులు తినే వాళ్ళు. ఇంట్లో అటుకుల వాడకం ఎక్కువగా ఉండేది. అయితే అది మామూలు విషయం కాదు. అటుకులు దుకాణంలో కొనే వారు కాదు.మడికి పనికి రాదని నాయనమ్మ చెప్పేది.

ఇంకా అటుకుల ప్రహసనం చెప్తాను.

మడితో వడ్లు ఒక రోజంతా నాన బెట్టాలి.తర్వాత పెరట్లో కట్టెల పొయ్యి పెట్టుకొని ఆ వడ్లను ఉడికించేవాళ్లు. ఇక అసలైన ముచ్చట ఇప్పుడే ఉంటుంది.

ఆ తర్వాత రోలుపై కుందేన పెట్టి మా పెద్దక్క మా అమ్మ రెండు రోకళ్ళతో దంచే వారు..నాయనమ్మ చేత నయినన్ని రోజులు దంచేదట.కానీ చాలా కష్టమైన పని. ఆ ఉడుకుతున్న వడ్లను రోట్లో వేస్తే అలా వేడి మీదే పోటు వేయాలి. అప్పుడు ఆ పొట్టంతా పోయి లోపల ఉడికిన బియ్యం అలా పలచగా తయారై అటుకులు అవుతాయి. వాటిని కొంచెం ఆరిన తర్వాత చాటతో బాగా తిరిగి ఎండబెట్టి మట్టి గోలాలలో నిలువగా ఉంచుకునే వాళ్ళు. కష్టం సంగతి ఏమో కానీ రుచి మాత్రం బాగుండేది.

నాయనమ్మ రాత్రికి అప్పుడప్పుడు ఆ అటుకులని పెరుగులో నానబెట్టుకుని తినేది. భోజనం ఒక్క పూట మాత్రమే చేసేది.

వచ్చిన అతిథులకు అవే చుడవాలాగా చేసి పెట్టే వారు.అందులో పల్లీలు, పుట్నాలు, కొబ్బరి ముక్కలు, అన్ని పోపులో వేయించి కరివేపాకు ఇంగువ వేసి చేస్తే అద్భుతంగా ఉండేది. చాలా ఇష్టంగా తినే వాళ్ళము.

ఎప్పుడైనా నాయనమ్మ అమ్మని గట్టిగా కొప్పడేదట!అమ్మ భయంగానే ఉండేది.కొప్పడ్డది కదా అని మాట్లాడకుండా ఉంటే, ఎన్నో సార్లు పిలిచి మాట్లాడించేదట.తినే వరకు ఊరుకునేది కాదట.ముసల్ది ఎంత మంచిది!ఎంత గొప్ప హృదయం!ఇలాంటి వారు ఉంటారా! మా ముసలమ్మ బంగారం.

 

*****

( సశేషం)

Leave a Reply

Your email address will not be published.