
వ్యాధితో పోరాటం-44
–కనకదుర్గ
సర్జరీ తర్వాత సర్జరీ రికవరీ రూంలో వుంటాననుకున్నాను. కానీ ఒక ఐదునిమిషాలు నాకు మెలుకువ వచ్చినప్పుడు చూస్తే అది పెద్దరూం నేనొక్కదాన్నే ఉన్నాను. ఐ.సి.యూలా ఉంది. మొదటి సర్జరీ అపుడు ఎలా పెట్టారో అలాగే చాలా ట్యూబ్స్ వున్నాయి.
ఇంతలో డా.రొసాటో వచ్చారు. ” హల్లో డియర్! హౌ ఆర్ యూ? అంటూనే నా చెయ్యి పట్టుకుని పల్స్ చూస్తూ, ” ముక్కులోనుండి ట్యూబ్స్ ఎందుకు పెట్టారు?”
“ఇది పోస్ట్ సర్జరీలో చేస్తాం….”
“అది నాకూ తెలుసు. అవన్నీ ఆమె తట్టుకోలేదు, చూసారా ఎంత చిన్నగా వుందో పేషంట్? తీసేయండి.”
“యస్ సర్.”
“అబ్జర్వ్ హర్ వెరీ కేర్ ఫుల్లీ. షీ ఈజ్ వెరీ సెన్సిటివ్ యాజ్ ఏ పర్సన్ అండ్ ఫిజికల్లీ టూ. షీ ఈజ్ ఏ మామ్……… షీ నీడ్స్ టు గో హోం…….”
నాకు అన్నీ అర్ధమవ్వటం లేదు, సగం సగం మాటలు వినిపించాయి.
నా వైపు తిరిగి నా మొహం వైపు వంగి, నా కళ్ళలోకి చూస్తూ, ” మిస్ డింగరీ, యూ డిడ్ వెల్. సర్జరీ బాగా జరిగింది. యూ ఆర్ గోయింగ్ టు బి ఆల్రైట్. యూ కెన్ సీ యువర్ ఫ్యామిలీ సూన్.” అని గట్టిగా చెప్పారు.
నేను కష్టపడి, ” థ్యాం…క్యూ…” అని చెప్పాను.
ఆయన గట్టిగా నవ్వారు. “యువార్ వెల్ కం డియర్.” నా కళ్ళు మూతలు పడి పోయాయి. ఇంక ఏమీ వినిపించలేదు.
కొంత సమయం గడిచాక, “చిన్ని, చిన్ని.. నేను శ్రీనిని ఒక్కసారి కళ్ళు తెరువు.” అని నా ఎడమ చెవి దగ్గర అనడం వినిపించింది. నేను బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ తెరవడానికి రావడం లేదు. కాసేపు నిశ్శబ్దం …. మళ్ళీ అదే పిలుపు. నేనెక్కడో పాతాళంలో వున్నట్టు పై నుండి ఎవరో మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నట్టు అనిపించసాగింది.
ఎంత సేపు అలా పిలిచాడో, నేను బలవంతంగా కళ్ళు తెరిచాను, అపుడే నా పక్కన కుర్చీలో నుండి లేచి వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టున్నాడు శ్రీని. నర్స్ ముందుగా నేను కళ్ళు తెరిచింది చూసింది.
“మిస్టర్ డింగారి, …” అని నన్ను చూపించింది. నా వైపు చూసి, “చిన్నీ,” అని కుర్చీలో కూర్చున్నాడు.
“ఎట్లా వుంది…” గొంతులో జీర
నాకు గొంతు పెగల్లేదు. తల వూపాను బాగానే వుందన్నట్టు. తలమీద ఎన్నో కిలోల బరువున్నట్టనిపించింది. కళ్ళు మూసుకు పోయాయి.
రాత్రి, పగలు ఎలా గడుస్తున్నాయో నాకు తెలియటం లేదు. బాగా చలిగా వుంటే చుట్టూ చూసాను. నర్స్ నాకు మరో వైపు కూర్చొని ఏదో బుక్ చదువుకుంటున్నట్టుగా వుంది.
కొంచెం దగ్గు వచ్చింది. నా దగ్గు చప్పుడుకి కళ్ళు ఇటు తిప్పి చూసింది. నేను వణుకుతున్నది చూసి కొన్ని వెచ్చగా వున్న బ్లాంకెట్ల్స్ తీసుకొచ్చి కప్పింది. నా టెంపరేచర్ చూసి టైలనాల్ సిరప్ ఇచ్చింది.
“నర్స్… మై హజ్బెండ్….”
“హీ ఈజ్ కమింగ్ ఎవ్విరిడే, , కాల్స్ యువర్ నేమ్ అండ్ సిట్స్ హోల్డింగ్ యువర్ హ్యాండ్… హోపింగ్ యు విల్ టాక్ టు హిమ్…”
“ఎన్ని రోజులయ్యింది?”వణుకుతూనే అడిగాను.
“ఫైవ్ డేస్ ” అంది
మళ్ళీ మత్తుగా అనిపించి కళ్ళు మూసుకుపోయాయి.
నేను మళ్ళీ కళ్ళు తెరిచినపుడు కొంచెం నేను పాతళంలో నుండి ఈ లోకంలోకి వస్తున్నట్టుగా అనిపించింది.
నర్స్ డాక్టర్ కి నా జ్వరం గురించి చెబుతుంది. రెండు రోజులనుండి జ్వరం తగ్గిందని నాకు ఎపుడు తెలివి వస్తే అపుడు ఒకరోజు అబ్జర్వ్ చేసి నార్మల్ రూంకి షిప్ట్ చేస్తామని చెపుతుంది. నాకు వెంటనే శ్రీనిని, పిల్లల్ని చూడాలన్పిస్తుంది.
’ఓ మిసెస్ డింగారి, హౌ డూ యూ ఫీల్?” అని నర్స్ దగ్గరికి వచ్చి అడిగింది.
“ఐ ఫీల్ ఓకే!” టైం ఎంతయ్యిందో కూడా తెలియటం లేదు.
” ఇది పొద్దున్నా? సాయంత్రమా?”
” ఇపుడు టైం రాత్రి పది గంటలయ్యింది.”
” ఓహ్, సో శ్రీని ఇపుడు రాడు కదా?” అన్నాను నీరసంగా.
“తను ఎనిమిది గంటల వరకు ఇక్కడే ఉన్నాడు. నీ గురించి చాలా వర్రీ అవుతున్నాడు. రోజూ వచ్చి నీ దగ్గరే కూర్చున్నాడు. మేము నీకేమీ కాదని చెప్పేవాళ్ళం. తను విని తల వూపేవాడు.
వి హి విల్ బి వెరీ హ్యాపీ టుమారో.” అంది నర్స్.
డాక్టర్ నన్ను స్టెతస్కోప్ తో టెస్ట్ చేస్తూ, ” హౌ డూ యూ ఫీల్ మిసెస్ డింగరీ?”
“ఐ ఫీల్ ఓకే..”,
పది రోజుల తర్వాత కళ్ళు తెరిచిన నాకు పిల్లల్ని చూడాలని ఉంది. ఎపుడెపుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసాను. అన్నిరోజులు నిద్రపోయిన నాకు ఆ రాత్రి నిద్ర పట్టటం కష్టమయ్యింది. తెల్లవారుఝామున నిద్రపోయాను.
మధ్యాహ్నం శ్రీని వచ్చాడు. నేను పిల్లల కోసం చూసాను, కానీ తను ఒక్కడే వచ్చాడు. నేను లేచి వుండడం చూసి చాలా సంతోషించాడు. శ్రీని ఎంత బాధ పడినా, మనసులో ఏం వున్నా అవి భయట పెట్టేవాడు కాదు. అందుకే తను ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలిసేది కాదు. నర్స్ శ్రీని ఎంత బాధ పడ్డాడో చెప్పింది.
నేను ఈ పదిరోజులు పిల్లలెలా ఉన్నారని అడిగాను.
“చైతన్య చందూ, కార్తీక్ తో ఆడుకుంటున్నాడు స్కూల్ నుండి వచ్చి. ఇంకొన్ని రోజులయితే వాడికి సమ్మర్ హాలీడేస్ మొదలవుతాయి. మాధవి పిల్లల్ని చూసుకుంటుంది.”
“నువ్వు ఆఫీస్ కి వెళ్ళావా, లేదా?”
“ఊహూ, వెళ్ళలేదు. మాధవికి పిల్లల్ని చూసుకోవడం కష్టమవుతుందని వెళ్ళలేదు. నువ్వు చెప్పు నీకెట్లా వుంది. జ్వరం పూర్తిగా తగ్గింది కానీ నీకు సర్జరీ నొప్పి తెలుస్తుందా ఇపుడు?”
మర్నాడు నార్మల్ రూంకి షిఫ్ట్ చేసారు. జూలియా, ఫోన్ చేసి ఎట్లా వున్నావని అడిగి, “నీ సర్జరీ రోజు చైతన్యని తీసుకొచ్చాను. వాళ్ళు ఆడుకుంటున్నారు. నేను తినడానికి రమ్మనాను. డేవిడ్ వెనక పరిగెత్తుతూ వస్తున్న చైతన్య ఎదురుగా ఉన్నగోడ దగ్గర తల వంచుకుని రావాలి, పరిగెత్తి రావడం వల్ల గోడను చూసుకోలేదు పాపం తలకు దెబ్బ తగిలింది. నేననుకున్నాను, దుర్గ ఇంకెపుడూ చైతన్యను నా దగ్గర వదిలిపెట్టదు. మీరేమో ఎంత టెన్షన్ లో ఉన్నారు ఆ రోజు. అందుకే నేను వెంటనే మా ఇంటి దగ్గర ఒక డాక్టర్ ఉంటారు. ఆయన అపుడే ఇంటికి వచ్చారు. ఆయన దగ్గరకు తీసుకెళ్ళి చూపించాను. ఆయన ఫస్ట్ ఏయిడ్ చేసారు. ఏం పర్వాలేదన్నారు. చైతన్య బాగానే వున్నాడు. అస్సలు ఏడవలేదు, చిన్న దెబ్బ కదా తగ్గిపోతుందిలే, అన్నాడు. సారీ దుర్గా!”
“ఇట్స్ ఓకే జూలియా! ఒకోసారి పిల్లలకు చిన్న చిన్నవి జరుగుతూనే వుంటాయి. కంగారు పడాల్సిందేమి లేదు. నువ్వు వాడిని తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్. డేవిడ్ తో ఆడుతూ వాడికి నా సర్జరీ పై నుండి దృష్టి మరలిండొచ్చు. దెబ్బ తగలగానే నువ్వు వాడి గురించి చాలా కేర్ తీసుకున్నావు. యూ ఆర్ ఏ వండర్ఫుల్ మదర్ అండ్ యూ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్. వియ్ ఆర్ నాట్ అప్ సెట్. థ్యాంక్యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సన్.” అని చెప్పాను.
ఐ.సి.యూ లో ఎలా ఒక్కదాన్ని వున్నానో కానీ, రాత్రి నాతో పాటు ఎవరన్నా ఉండాలని చెప్పాను.
మాధవి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటే శ్రీని నా దగ్గర ఉన్నాడు. శ్రీని ఇంట్లో ఉంటే మాధవి నా దగ్గర ఉండడానికి వచ్చింది. ఒక సోఫా బెడ్ లాంటిది ఉండేది. రాత్రి ఉండడానికి వచ్చిన వాళ్ళు అక్కడ పడుకోవచ్చు.
నా దగ్గర ఉండడానికి వచ్చినపుడు మాధవి నన్ను అస్సలు ముట్టుకోలేదు. తను దూరంగా ఉందని చెప్పింది. తను ఇంటికెళితే దూరం ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఉంటే నాకు తోడుగా ఉంటానని మూడ్రోజులు హాస్పిటల్ లోనే ఉంది. తను ఇంటికి వెళ్ళాక పిల్లలొచ్చినపుడు ఇంట్లోని బట్టలన్ని తీసి, సోఫా కవర్స్ తో సహా అన్నీ పిండేసిందని చెప్పారు. మేము ముట్టు, మైలలు పాటించము. తనకున్న నమ్మకాల గురించి అపుడు వాదించే సమయం కాదు. తను మాకు సాయంగా ఉండడానికి వచ్చింది.
పిల్లల్ని చూసినపుడు మాత్రం ఎలా వుంటున్నారోనని అనిపించింది. స్పూర్తి చిన్నది, తండ్రి లేకుండా పడుకోదు. పోయినేడాది కంటే కొంచెం పెద్దదే, ఏడాదిన్నరే దానికి. చైతన్యకి పిల్లలతో ఆడుకుంటుంటే కొంచెం దృష్టి మళ్ళుతుందేమో, కానీ రాత్రి పడుకునే ముందర అమ్మా, నాన్న గుర్తొస్తారు వాడికి. చిన్నదానికి అస్సలు అలవాటు లేదు. మాధవి దగ్గర పడుకుంటుందో, చైతన్య దగ్గర పడుకుంటుందో పాపం.
చైతన్య ఎలిమెంటరీ స్కూల్ అయిపోయి మిడిల్ స్కూల్ కి వెళుతున్నాడు. ఎలిమెంటరీ స్కూల్లో నాల్గవ క్లాస్ టీచర్ చాలా మంచి అతనుండేవాడు. మా పరిస్థితి తెలిసి చైతన్యకు చాలా బాగా సాయం చేసాడు. అలాగే మిడిల్ స్కూల్లో కూడా అయిదవ క్లాసు టీచర్ కూడా చాలా మంచి అతను. మొదటిసారి నేను, శ్రీని పేరంట్ టీచర్ మీటింగ్ కి వెళ్ళినపుడు మా పరిస్థితి చెబితే తను చైతన్యతో మాట్లాడుతూ ఉంటానని చెప్పాడు. చైతన్య కూడా ఇంటికి రాగానే ఆ టీచర్ గురించే సంతోషంగా చెప్పేవాడు. ఇంట్లో ఏదైన సమస్య ఉండి పిల్లలు బాధ పడ్తుంటే వాళ్ళకి తెలియజేస్తే బాగా చూసుకుంటారు. దానివల్ల వారి చదువు దెబ్బ తినకుండా, పిల్లలు డల్ అయిపోకుండా చూసుకుంటారు.
ఇప్పటికయినా ఈ జబ్బు నన్ను వదిలిపెడితే నా కుటుంబంతో సంతోషంగా ఉండాలని, నా రాతలను మళ్ళా మొదలు పెట్టాలని ఎదురు చూస్తున్నాను.
నార్మల్ రూంకి వచ్చాక పిల్లలు మధ్యాహ్నం వస్తే రాత్రి దాకా వుండేవారు. రూం పెద్దదే కాబట్టి పిల్లలు బాగానే ఉండేవారు.
నా రూం కిటికీలోంచి చూస్తే పక్కనే చాలా పెద్ద, పేరున్న పిల్లల ఆసుపత్రి కనిపించేది. ఎవరన్నా వచ్చి, ’అబ్బా ఇంతంత పెద్ద సర్జరీలు ఎలా చేయించుకుంటున్నావు? ఎలా భరిస్తున్నావు?’ అంటే నేను పక్కన ఉన్న చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫ్ ఫిలడెల్ఫియా (CHOP)ని చూపించి, ’చిన్న చిన్న పిల్లలు, రోజుల, వారాల, నెలల పిల్లలు ఈ జబ్బుకంటే పెద్ద జబ్బులతో బాధ పడ్తున్న వారెంత మందో ఉన్నారు. వాళ్ళకంటే నేను చాలా పెద్దదాన్ని నాకేం రోగమొచ్చిందని భరించను’, అనేదాన్ని.
రాత్రిపూట ఎవరో ఒకరు వస్తున్నారు. ఇంకో రెండురోజుల్లో ఇంటికి వెళ్తామనగా రాత్రి ఎవ్వరూ రావడానికి లేరు. అపుడు నాకు మైమా నా ఫ్రెండ్ గుర్తొచ్చింది. తన ముగ్గురు పిల్లలను ఒక ఏడాది ఎండాకాలం సెలవుల్లో చూసుకున్నాను. నేను తనకి ఫోన్ చేసినపుడు వాళ్ళెక్కడ వుంటున్నారని అడిగితే మా ఇంటి నుండి 45నిమిషాల దూరంలో ఉంటున్నారని చెప్పింది. రాత్రికి వస్తావా అని అడిగాను. పది నిమిషాల్లో ఫోన్ చేస్తానని అలాగే చేసింది. ’నేను నా భర్త మీ కష్టసమయంలో మీకు సాయంగా ఉండాలననుకుంటున్నా,’మని చెప్పింది.
కానీ తనని తన భర్త వాళ్ళ యింటికి మా ఇంటికి మధ్యలో తనని కార్లో తీసుకు వచ్చి వదిలిపెడ్తాడని అక్కడికి శ్రీని వచ్చి తనను తీసుకుని హాస్పిటల్ కు తీసుకురావొచ్చని చెప్పింది.
నేను శ్రీనికి ఫోన్ చేసి చెప్పాను. శ్రీని సరేనని వెళ్ళి తీసుకుని వచ్చాడు. మా ఇంటి నుండి మరోవైపు వెళ్ళి ఆమెను తీసుకుని సిటీకి రావడానికి చాలా సమయం పట్టొచ్చు. తనకి కష్టమవుతుందని నాకు తెల్సు, కానీ రాత్రి నేనొక్కదాన్ని ఉండలేక పోతున్నాను. ఎందుకని ఆలోచిస్తే సర్జరీ తర్వాత వచ్ఛే బలహీనత వల్ల కావొచ్చునని అనుకోవడమే. ఐ.సి.యూలో పదిరోజులు, నార్మల్ రూంలో మరో పది రోజులు ఉండి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చాను ఇంటికి.
సర్జరీకి, ఐ.సి.యూలో అన్ని రోజులు ఇచ్చిన స్పెషల్ కేర్ కి, నార్మల్ రూంలో ఉన్న దానికి ఎంత బిల్ వస్తుందోనని నాకు భయంగా అనిపించింది. కానీ దీని గురించి శ్రీనితో మాట్లాడితే ఇవన్నీ నీకెందుకు నువ్వు నీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టు అంటాడు.
శ్రీని ఫ్రెండ్ శ్రీనివాస్ వచ్చి మాధవిని, పిల్లలను తీసుకెళ్ళాడు. రికవరీ, కోలుకోవడానికి చాలా రోజులు పడ్తుందని ముందే చెప్పారు కాబట్టి మేము దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు . శ్రీని నా సర్జరీ తర్వాత కొన్నాళ్ళు సగం రోజే వెళ్ళేవాడు ఆఫీస్ కు. జోన్ మధ్యాహ్నం స్ఫూర్తిని చూసుకోవడానికి వచ్చిన తర్వాత శ్రీని వెళ్ళేవాడు.
రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు నాకు. ఎందుకంటే హాస్పిటల్ లో వున్నన్ని రోజులు నొప్పికి ఇంజెక్షన్లు ఇచ్చేవారు. ఇంటికి వచ్చాక అవి లేక, సర్జరీ నొప్పి వల్ల కూడా నిద్ర పట్టేది కాదు.
నేను పొద్దున్న కానీ మధ్యాహ్నం కానీ పడుకునేదాన్ని. ఒకోసారి సాయంత్రం మాట్లాడుతూ నిద్రలోకి జారుకునేది. అపుడు పిల్లలు, శ్రీని ఏ చప్పుడు చేయకుండా ఉండేవారు. నాకు అది బాధన్పించేది.
మా యిల్లు అందరి ఇళ్ళలా కాకుండా వేరేగా ఉందని పిల్లలకు అన్పించవచ్చు. అందరి ఇళ్ళల్లో రాత్రి పడుకుంటారు, పొద్దున్న లేస్తారు పన్లు చేసుకుంటారు, నాన్నలు ఆఫిసులకు వెళ్తారు, అమ్మలు ఇంట్లో వుంటారు, షాపింగ్ చేసుకుంటారు, పిల్లలకు ఏం కావాలో చూసుకుంటారు, అమ్మలే పిల్లల పేరెంట్ – టీచర్ మీటింగ్స్ కి వస్తారు, పిల్లలకు ఏదైనా అయితే అమ్మలే హాస్పిటల్ కు తీసుకెళ్తారు, నాన్నలు ఒకోసారి శనివారాలు ఫుట్ బాల్ కి, హాకీకి, బాస్కెట్ బాల్, బేస్ బాల్ ఇంకా వేరే గేమ్స్ కి తీసుకెళ్తారు, ఒకోసారి ఇద్దరూ తీసుకెళ్తారు (అమెరికన్ ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటుంది). స్ఫూర్తి ఇంకా ప్రీ స్కూల్ కి వెళ్ళటం లేదు కాబట్టి తనకు ఇంకా తెలియదు. తను పెద్దగా ఎవరి ఇళ్ళకి వెళ్ళలేదు కాబట్టి అందరి ఇళ్ళల్లో అమ్మలు ఇలాగే ఉంటారేమో అనుకుంటుందో ఇంకా అంత ఆలోచన రాలేదేమో!
నేను అందరిలా నార్మల్ గా అవుతానని నమ్మకం ఉంది. ఎక్కడో మెదడులో మూలకి ఒకవేళ నార్మల్ కాకపోతే అన్న చిన్న అపనమ్మకం ఉన్నది. అట్లా కాదులే అని ఎంత చెప్పుకున్నా ఆ చిన్న డౌట్ మెదడులో అలాగే పట్టుకుని ఉంది.
మా స్నేహితుల్లో, బందువుల్లో, తెలిసిన వారు అందరూ ఏదో ఒక పూజ చేయమని, కొందరు విష్ణు సహస్రనామాలు, కొందరు లలితాసహస్రనామాలు చదవమని, కొందరు ఏవో దీపాలు పెట్టమని, ఇలా సలహాలు ఇచ్చేవారు. నాకు అవన్నీ చేయాలని లేదు. నేను రెండు పెద్ద సర్జరీలు జరిగినా, ఒకోసారి నెలలు, నెలలు ఆసుపత్రుల్లో ఉన్నా ఒక్కరోజు కూడా భగవంతుడా నన్ను కాపాడు, నన్ను రక్షించమని అడగలేదు. ఎందుకంటే ఆసుపత్రులలో ఎవరూ ఉండేవారు కాదు, నేనొక్కదాన్నే కాబట్టి నేను డాక్టర్లను, సర్జన్లను నమ్ముకున్నాను. పిల్లల్ని చూసుకోవడానికి శ్రీని, జోన్ ఉన్నారు. నాకు ఇండియా నుండి నా అన్న, అక్క, అత్తలు, మామలు, వాళ్ళపిల్లలు, పెద్దమ్మ, చిన్నమ్మలు, చిన్నానలు ఎంత మంది ఉన్నా ఎవ్వరి జీవితాలు వారివి, ఎవ్వరి దారులు వారివి. నేను ఇంత దూరంలో ఉన్నాను కాబట్టి వాళ్ళు నా గురించి పట్టించుకోలేదు అనుకోవడానికి లేదు. అక్కడ అందరూ అంటే చాలా మంది హైద్రాబాద్ లోనే ఉన్నా ఎంతమంది ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. సాయం చేసే తరం అయిపో యిందేమో, లేదా వాళ్ళంతా పెద్దవాళ్ళయిపోయారో. మా చిన్నపుడు ఎవరికి ఏదైనా కష్టమొచ్చిందంటే అక్కలు, చెల్లెళ్ళు, వాళ్ళే వచ్చేవారు, అన్నలు, తమ్ములు, వారి భార్యలను పంపించడం చూసాము.
మా ఇంట్లోనే కాదు చుట్టు పక్కల ఇళ్ళల్లో కూడా అదే చూసేవాళ్ళం. లేకపోతే ప్రతి తరం వారు అలాగే అనుకుంటారేమో! మా కాలంలో అంతా మంచే ఉండేది. రాను రాను కాలమంతా మారిపోతుందని!
మా మామయ్యలు కూడా వారి భార్యలను పంపించేవారు అమ్మకి వొంట్లో బాగాలేనపుడు. వాళ్ళ పిల్లలను వదిలిపెట్టి మమ్మల్ని చూసుకోవడానికి వచ్చేవారు. ఒకోసారి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో అని తలుచుకునే వారు. పిల్లల గురించి కథలు చెప్పేవారు, ఒకరు బాగా చదువుకుంటారని, ఒకరు బాగా అల్లరి చేస్తారని, మేం చూసినప్పటికంటే ఒకబ్బాయి చాలా పొడుగయిపోయాడని, ఇలా పిల్లల గురించి తల్చుకునేవారు. మాకు ఆరుగురు అత్తలు కదా! అందులో అందరికంటే చిన్నత్త తెనాలికి మమ్మల్ని చూసుకోవడానికి వచ్చినపుడు బాగా విసిగించేవాళ్ళం. లేచినప్పట్నుండి, ’అత్తా కథ’, అని వెంట పడేవారం. తను విసుక్కోకుండా మాకు కథలు చెప్పేది. మేము స్కూల్ కి వెళ్ళినప్పుడు కొంచెం తెరిపిగా ఉండేదేమో తనకి. ఇంకో అత్త, మద్రాసు నుండి వచ్చింది, ఆమె మా కోసం అన్ని రకాల పిండి వంటలు చేసి పెట్టేది. తను చేసిన అరిసెలు తిన్నప్పట్నుండి నాకు చాలా ఇష్టమైన స్వీట్ అయ్యింది. వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకునేవారో మమ్మల్ని కూడా అలాగే ….. అసలు ఇంకా బాగా చూసుకునేవారేమో.
(నాకు ఇప్పటికీ ఆశ్చర్యమేమిటంటే పిండి వంటలు చేసి ఆమెని పెట్టమని ఎవ్వరూ అడగలేదు, తను కేవలం మామూలు వంట చేసినా ఎవ్వరూ ఏమీ అనే వాళ్ళు కాదు. అరిసెలు నాకు బాగా గుర్తున్నవి. కానీ ఆమె ఎపుడు ఏదో ఒకటి చేస్తూ ఉండేది. జంతికలు, చేగోడిలు, కారప్పూస్ లాంటివి కూడా చేసేది. అంతే కాదు ఎన్నో రకాల వడియాలు పెట్టేది. అందరికంటే పెద్దత్తని అమ్మ మా అక్క పెళ్ళికి ఒక నెల రోజుల ముందే రమ్మని అడిగింది, ఎందుకంటే ఇంట్లో పెద్ద దిక్కు సలహాలిచ్చేవారుండాలని. ఆమె పెళ్ళికోసం గులాబీ పూల ఆకారంలో ఎరుపు రంగులో పువ్వు దాని కింద రెండు ఆకులు ఆకుపచ్చ రంగుతో వడియాలు పెట్టింది. పెళ్ళిలో అవి అందరికీ ఎంత నచ్చాయో. అమ్మ గర్వంగా మా పెద్దాడపడుచు చేసిన వడియాలని చెప్పింది.)
ఈ సాయాలు చేసే దాంట్లో స్త్రీల పైనే భారం ఎక్కువగా ఉండేది. మాకు సాయం చేయడానికి వచ్చిన మాధవికి మాకు సంబంధం లేదు. ఆమె భర్త శ్రీని ప్రెండ్. మాకు సాయం కావాలి కదా అని తన భార్యను తీసుకొచ్చి వదిలిపెట్టాడు. వాళ్ళు వచ్చి మా పక్కన నిలబడటం నిజంగా మాకు చాలా సంతోషాన్నిచ్చింది. వీళ్ళు మేము అడగకుండానే వచ్చి సాయం చేసారు. అందుకే నేను మాధవి మనసు బాధ పెట్టదలుచుకోలేదు.
నేను పూజలు చేయడం ఏమో కానీ, నాకు ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మి గారి గొంతంటే చాలా ఇష్టం. అందుకని ఆమె పాడిన కాసెట్స్ పడుకునేపుడు పెట్టుకుని వింటూ నిద్రపోయేదాన్ని. కొద్దిగా నిద్ర పడుతుండగా విపరీతమైన పీడకలలు వచ్చేవి. ఎలాంటివంటే శ్రీని నన్ను వదిలి వెళ్ళిపోతున్నట్టుగా నేను పిల్లల్ని పట్టుకుని ఒంటరిగా చీకట్లో ఎక్కడో కూర్చున్నట్టుగా, అకస్మాత్తుగా సునామీ వచ్చి మమ్మల్ని ముంచేసినట్టుగా, ఒకోసారి అది ఏదోలోకం అక్కడంతా వేరే రకం భయంకరమైన జీవాలున్నాయి, ఏవో ఎత్తైన కొండల పై నుండి భయంకరమైన జీవులు నన్ను క్రిందకు తోసేస్తే ఎంతసేపైనా పడుతు న్నట్టుగా , ఒకోసారి మంటల్లో వున్నట్టు, నేనరుస్తున్నాను కానీ అందరూ చూస్తూ నిల్చున్నారు అందులో శ్రీని కూడా ఉన్నాడని ఇలా అర్ధం పర్ధం లేని కలలొచ్చేవి.
నేను పూజలు చేయలేదని చెప్పటం లేదు. మా అమ్మ మాకు చిన్నప్పట్నుండి అంటే నాకు, మా అక్కకు ’అయిగిరినందిని నందితమేదిని…’ సెలవు రోజుల్లో దుర్గాదేవికి చదవడం నేర్పింది. చదవడం ఒకటే కాదు, మంగళ హారతులు పాడటం నేర్చుకునేవాళ్ళం, సంగీతం మాస్టారిని కూడా భక్తి గీతాలు నేర్పించమనేది. ఎండాకాలం సెలవుల్లో పొద్దున్నే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేదాన్ని. పదోక్లాసు పరీక్షలు రాసి నేను కనీసం సెకెండ్ క్లాస్లోనన్నా పాసవ్వాలని గట్టిగా కోరుకునేదాన్ని.
ఆ ఏడాది ఎండాకాలం సెలవుల్లోనే పుస్తకాలు ఎక్కువగా, వైవిధ్యమైనవి చదవడం మొదలు పెట్టింది. ఉదయభాను, మా అన్నయ్య రక రకాల పుస్తకాలు తెచ్చేవాడు. వేరే దేశాల్లో, వేరే భాషల్లో ప్రచురితమై అనువదించబడ్డ ప్రగతిశీల పుస్తకాలు తెచ్చేవాడు. అవి ఎంత చదివినా ఇంకా ఇంకా చదవాలనిపించేవి. మా అయిదో అత్త భర్త ఆడిటర్ గా పని చేసేవాడు. ఆయన అదే సంవత్సరం హైద్రాబాద్, సికింద్రాబాద్ లైబ్రరీలకు ఆడిటర్ గా వెళ్తున్నాను, నీకే పుస్తకాలు కావాలంటే ఆ పుస్తకాలు రాసివ్వు, అన్నీ తెచ్చిస్తాను అని చెప్పారు. నేను మా ట్యూషన్ టీచర్ దగ్గరకు వెళ్ళి ఇంగ్లీషు పుస్తకాల పేర్లు రాయించుకుని వచ్చాను. అందులో చార్ల్స్ డికెన్స్ పుస్తకాలు,’డేవిడ్ కాపర్ఫీల్డ్’, ’పిక్విక్ పేపర్స్’, ’ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్’, మార్క్ ట్వేన్ రాసిన ’హకల్ బెర్రి ఫిన్’, ఇంకా కొన్ని పుస్తకాల పేర్లు ఇచ్చాను. తెలుగులో మా అన్నయ్య లిస్ట్ తయారు చేసి ఇచ్చాడు, చలం పుస్తకాలు అందులో ముఖ్యంగా ’స్త్రీ’, రంగనాయకమ్మ గారి ’జానకి విముక్తి’, ’స్వీట్ హోమ్’, ’చదువుకున్న కమల’, ’బలిపీఠం’, లాంటి పుస్తకాల పేర్లు ఇచ్చాము. ఇంగ్లీషు పుస్తకాలు తీసుకోవడానికి ఇబ్బందయ్యిందని కొన్ని తెలుగు పుస్తకాలు మేము అడిగినవి తెచ్చి ఇచ్చారు.
’జానకి విముక్తి’, ఆంద్రజ్యోతిలో సీరియల్ గా వస్తున్నపుడు మా వదిన, అక్క, నేను అందరం చదివేవాళ్ళం. వెంకట్రావు, జానకి భర్త పాత్ర గురించి రాసిన విధానం మాకు చాలా నవ్వు తెప్పించేది. మా అక్కకు ఇంకా పెళ్ళి కాలేదు. ఇద్దరం అన్ని నవలలు వార పత్రికల్లో సీరియల్స్ గా వస్తున్నపుడు చదివేవాళ్ళం. మా ఇంటికి కొంచెం దూరంలో వుండే లైబ్రరీ నుండి యద్దనపూడి సులోచన గారు, మాదిరెడ్డి సులోచన, సి. ఆనందరామం, వాసిరెడ్డి సీతాదేవి గారి నవలలు చదివేవాళ్ళం. ఈ పుస్తకాలు చదవొచ్చు, ఈ పుస్తకాలు చదవకూడదు అనే ఆంక్షలుండేవి కావు. పెద్దమామయ్య, దాశరధి గారి కవితా సంపుటలు కాపీలు ఆయన పంపినపుడు నాన్న మాకు అవి చదివి వినిపించేవారు. మా అమ్మ, అన్నయ్య కలసి చాలా పుస్తకాలు చదివేవారట. ’బలిపీఠం,’ నవల చదివి, సినిమా వచ్చినపుడు చూసామని అమ్మ చెప్పేది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, నాన్న పుస్తకాలు చదవడం తప్పు అని ఎప్పుడు అనుకోలేదు. కానీ అక్క పెళ్ళయ్యింతర్వాతే క్లాసు పుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు చదివితే పాడయిపోతారని మాట వినిపించడం ఎక్కువయ్యింది.
స్కూల్ వున్నపుడు సబ్జెక్ట్ పుస్తకాలే చదివేదాన్ని. కానీ ఎండాకాలం సెలవుల్లో ఏ పుస్తకం, ఏ వారపత్రిక, మాస పత్రిక, చతుర, విపుల లాంటివన్నీ చదివేవాళ్ళం. ఎవరి ఇంట్లో ఏ పత్రికలు తెప్పిస్తారో వాళ్ళు చదివాక వెళ్ళి అడిగి తెచ్చుకుని చదివేవాళ్ళం. ఎనిమిదో, తొమ్మిదో తరగతిలో ఉన్నపుడు పిల్లలమందరం సీరియల్స్ చదివి ఒకవేళ సినిమా తీస్తే ఏ పాత్రకు ఏ నటీ నటులు సరిపోతారా అని మాట్లాడుకునేవారం. యండమూరి వీరేంద్రనాద్ గారి ’తులసిదళం’, ’కాష్మోరా’, ప్రతి వారం చదివి అవి ఎంత భయపెట్టినా అలాగే చదివేవారం.
నా ఆలోచనల్లో మార్పు మొదలయ్యింది చలం గారి పుస్తకాలు, రంగనాయకమ్మగారి నవలలు చదివినప్పట్నుండే. అప్పట్నుండే ప్రశ్నించడం మొదలు పెట్టాను. అదే నాలో నచ్చని గుణం అయ్యింది మా ఇంట్లో. అందరికీ కాదు, నాన్నకు భయం మొదలయ్యింది, నేను ఆడపిల్లను ఇట్లా అందరినీ ప్రశ్నించడం మొదలు పెడితే అసలు దీనికి పెళ్ళవుతుందా అని. ఒకవేళ పెళ్ళయినా ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుందా అని, అందుకే ఈ ప్రశ్నలు రావడానికి కారణం అయిన ఆ పుస్తకాలు చదవడం ఆపేస్తే సమస్య పరిష్కారమవుతుందని నాన్న ఆశ. పుస్తకాలు చదవడం మంచిది కాదు, నేను ఎపుడు, ఎక్కడ, ఎవ్వరితో లేచిపోతానో అనే భయం నాన్నకు వచ్చిన ఆలోచనలు కావు. ఒకరు మళ్ళీ, మళ్ళీ చెబితే అవి ఆయన భయాలు అయ్యాయి.
*****
(సశేషం)

నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.
